శర్మ కాలక్షేపంకబుర్లు-విరామం.

Posted on జూలై 24, 2012
23
విరామం.

“ఏంటీ! ఒంటి గంటయింది, దేవతార్చనకి లేవరా? టైం చూసుకోలేదా?” ఇల్లాలు మాట.

“లేస్తున్నా” అన్నాను కాని లేవలేకపోతున్నా, చూసింది.

“ఏం! కాళ్ళు పట్టేసేయా!! అదేపనిగా కూచుంటే కాళ్ళు పట్టేయవా ఈ వయసులో”

“ఎందుకోనోయ్! మొన్న ప్రపంచ యాత్రకి బయలుదేరుదామన్న రోజునుంచి కాళ్ళు పట్టేస్తున్నాయి”.

“నిజం చెప్పమంటారా అబద్ధం చెప్పమంటారా”

“అదేంటి పాత కాలపు సినిమా డయిలాగులా ఉందే”

“ప్రశ్నకి ప్రశ్న సమాధానం కాదని మీరే చెప్పేరుగా”

“ఓర్నాయనో! నీతో మాటల్లో నెగ్గలేనోయ్”

“మీరు నేర్పినవేగా”

“ఉరుమురిమి మంగలం మీద పడిందిట, అలా నన్ను పట్టించేవేంటోయ్”

“మిమ్మల్ని పట్టించుకోపోతే ఎవరిని పట్టించుకుంటా”. ఇక లాభం లేదని తెల్ల జండా ఎగరేసి సంధి ప్రకటించే ఉద్దేశంతో,

“ఇది భోజనం తరవాత పూర్తి చేద్దాం, కాని” చెయ్యి పట్టుకోమని, లేచి దేవతార్చనకి బయలుదేరా, నెమ్మదిగా.

భోజనాలయిన తరవాత కబుర్లు చెప్పుకుంటూ,

“ఇప్పుడు నిజం చెప్పు”

“ఏం నిజం”

“నువ్వు నన్నీవేళ ఆటపట్టించేస్తున్నావ్ సుమా”

“ఒక సంగతి చెబుతా, వినండి, మీరే అందరికి చెబుతారు, చేసే పని లో విసుగుండకుండా ఉండాలంటే, విరామం కావాలని, అలాగే అతి సర్వత్ర వర్జయేత్ అనీ చెబుతారు, కాని ఆచరించరు”

“సరేలే చెప్పెయ్యి”

“ఏముంది మీరు నడిచి ఎన్నాళ్ళయింది, వేసవి కాలం ఎండని మానేశారు, ఇప్పుడు వర్షాలు, కదలటం లేదు, దానికితోడు దాని( అదేనండి కంప్యూటర్ ) దగ్గర గంటలు, గంటలు కూచుంటే కాళ్ళు పట్టేయవా, మీరు ఉదయం మూడున్నరకి లేచి కూచుంటున్నారు, నాలుగు మొదలు ప్రతి అరగంటకి ఒక కాఫీ గ్లాసు పట్టుకొస్తున్నాం, నేను కాని, కోడలు కాని. ఉదయం ఆరు తరవాత అక్కడినుంచి లేచి స్నానం చేసి పూజ చేసుకుని మళ్ళీ అక్కడి చేరిపోతున్నారు. టిఫిన్ కూడా అక్కడే చేస్తున్నారు. ఇక నడచినదెప్పుడు? సాయంత్రమొకసారి బండి మీద కాలేజికెళ్ళి మనవరాలిని తీసుకొస్తున్నారు.సాయంత్రం కూడా దాని దగ్గరనుంచి కదలటం లేదు, మీరు నడచిన సమయమెపుడూ?”

ఛార్జి షీట్ బలంగానే ఉంది, సమాధానం చెప్పుకోవాలి కదా, అందుకు,

“ఇది సుఖ భోగమోయ్! నీకో కధ చెప్పనా” .

“అబ్బో! మీ పిట్టకధలు, పెళ్ళిరోజు మొదలు, రోజూ వింటూనే ఉన్నా, ఏభై ఏళ్ళుగా, చెప్పండి, చెప్పండి,” .

“అనగా అనగా ఒక సన్యాసి,”

“ఏంటి మీలాగా?”

“అదిగో మళ్ళీ!”

“సరే నేను మాటాడను చెప్పండి”

“ఊ కొట్టవా!”

“మాటాడితే వద్దంటున్నారు, సరే ఊ కొడతా చెప్పండి”

సన్యాసిని ఒక రోజు పల్లకీ లో కూచోబెట్టుకుని శిష్యులు తీసుకుపోతున్నారు. నీలాటి మేధావి చూసి “ఏమయ్యా! సన్యాసివి కదా పల్లకీలో ఊరేగింపేమిటీ”అంటే . దానికా సన్యాసి ఇది “సుఖయోగం నాయనా, ఏంచేయను అనుభవించక తప్పదు,” . మేధావికి కోపం వచ్చి “సుఖయోగమా గాడిదగుడ్డా ఎక్కడుందో సుఖయోగం చూద్దాం, ముందు పల్లకీ దిగు” . పాపం సన్యాసి పల్లకీ దిగేడు. “నా వెనక రా” అని అడవిలోకి తీసుకుపోయేడు. “ఇక్కడే ఉండు, నీకు సుఖయోగం ఎలా వస్తుందో చూస్తా” . సన్యాసి కూచుని ఉండగా మేధావి తన ఆకలి తీర్చుకోడానికి అడవిలోకి పోయాడు. ఈ లోగా మహారాజు అటువస్తూ సన్యాసిని చూసి, ఆగి, అక్కడ డేరాలేయించి, సన్యాసిని పట్టుపరుపు మీదకి చేర్చేడు.” కొంత సమయం తరవాత తిరిగొచ్చిన మేధావికి అక్కడ సన్యాసి కనపడలేదు, కాని రాజ గుడారాలు కనపడ్డాయి. అక్కడే సన్యాసి కోసం వెదుకుతూ ఉంటే రాజభటులు పట్టుకుని, వీడెవడో గూఢచారిలా ఉన్నాడని ఆ పూట ఖైదులో పారేసి సాయంత్రం రాజు గారి దగ్గర హాజరు పరిచేరు. రాజుగారు విచారించి “నువ్వే దేశపు గూఢచారివో చెప్పమని” అడిగేరు. దానికి మేధావి “బాబోయ్ నేను గూఢచారిని కాదు, మీ పక్కన కూచున్న సన్యాసి మహానుభావుడిని అడగండి నిజం చెబుతారంటే.” “స్వామీ వీడు మీకు తెలుసా” అంటే! “ఇతను గూఢచారి కాదు” అని చెప్పేరు. సన్యాసి మేధావితో “నాయనా చూశావా సుఖయోగం ఎలా ఉంటుందో, దేన్నీ తప్పించుకోలేము సుమా” అని చెప్పేడు.

“బాగానే సనర్ధించుకుంటునారు కాని, ఇంతకీ ఏమంటారు?”

“ఇది సుఖభోగమే కదా” . “ఏం చేయమంటావు”

“మీరే చెప్పండి ఏమి చెయ్యాలో” . “కాదోయ్! కరణేషు మంత్రి అన్నారు కదా. సలహా చెప్పచ్చుగా.”

“ఐతే వినండి. కొంత సేపు రాసుకోండి వద్దన లేదు. ఇప్పటిదాకా మీకు ఇంటి పనులు చెప్పటం లేదు. ఇక ముందు ఇంటి పనులు పట్టించుకోండి, అలాగని మా పనులకు అడ్డం పడిపోకండి. బజారు పనులు చూడండి. అక్కడే కూచునిపోతే కాలూ, చెయ్యీ సాగవు. రోజూ ఒక గంట నడవండి,”

అందు చేత,కొఱకు,” వలన, ఏంటీ ఇన్ని ప్రత్యయాలు ఒకసారా! “శలవు.”

“అహహహ! మీరా శలవా నేన్నమ్మను, నేన్నమ్మను, మీరు మనపెళ్ళికే ఒక రోజు శలవుపెట్టేరు, అదేమి అదృష్టమో మీకు దొరికిన దొరలంతా, మీకు శలవేంటండీ ఊళ్ళో ఉంటారుగా అన్న వాళ్ళే కదా. మీరు రిటయిరయ్యేటప్పటికి వదిలేసిన శలవులెన్ని.”

శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం అంటావు, రోజు బాగోలేదండి! వార ఫలాల్లో మీ మాట చెల్లదని ఉంది, ఛార్జి షీటు, నిమిష నిమిషానికి పెరిగే గోదావరి వరదలా, కొత్త కొత్త అభియోగాలొచ్చేస్తున్నాయి, వీలు చూసుకు కలుద్దాం.”

శర్మ కాలక్షేపంకబుర్లు-చేదు అనుభవం.

Posted on జూలై 23, 2012
14
చేదు అనుభవం

ముఫై ఐదు సంవత్సరాలకితం, జె.యి గా కొత్తగా జాయిన అయిన రోజులు, ఇదే ఊరిలో. అప్పటివరకు నా పని నేను చేసుకుంటే సరిపోయేది. ఇప్పుడు మరొకరితో పని చేయించాలి. పని చేయడం తేలిక, చేయించడం కష్టం.అధికారానికి కొత్త, అధికారం వినియోగించడం కూడా ఒక కళ.

నా దగ్గర, దగ్గరగా వంద మంది సిబ్బంది ఉండేవారు, మొత్తం మీద. ఒక రోజు ఒక లైన్ మన్ భార్య ఏడుస్తూ ఇంటికొచ్చేసింది. ఎవరు నువ్వు, ఎందుకేడుస్తున్నావు, వగైరా ప్రశ్నల తరవాత తేలిందేమంటే ఆమె, నా దగ్గర పని చేసే ఒక లైన్ మన్ భార్య అని. సంగతి ఏమంటే! మామూలే, తాగేస్తున్నాడు, ఇంటిలో డబ్బులివ్వడు, ఇల్లు పట్టించుకోడు,పైగా అడిగితే కొడుతున్నాడు, “బాబ్బాబు మీరు కాస్త చర్య తీసుకుని నన్ను రక్షించరా!” మొర!! అబ్బో ఇంకేమి మనం మొరలలాలకించే స్థాయికి ఎదిగిపోయామన్నమాట అనికుని, “సరే పిలిచి కనుక్కుని కూకలేస్తా,” అని అభయమిచ్చేశా, విష్ణుమూర్తి లాగ. మర్నాడు అతనిని పిలిచి “ఏమయ్యా! నువ్వు చేస్తున్న పని బాగోలేదు, తప్పు కదా. భార్యను బిడ్డలను చూసుకోకపోతే ఎలాగ, ఉద్యోగం లేక చాలా మంది ఏడుస్తున్నారు, నీ అదృష్టం కొద్దీ ఉద్యోగం దొరికింది, అందుచేత బుద్ధిగా ఉండు, తాగుతున్నావట మానెయ్యి” అన్నా. “మీకెవరు చెప్పేరు సార్” అన్నాడు. “నీ భార్య నిన్న నా దగ్గరకొచ్చి గోల పెట్టింద”ని చెప్పేశా. మాటాడకుండా వెళ్ళిపోయాడు. నేను కూడా అప్పటి వరకు ట్రేడ్ యూనియన్ లో పని చేసిన వాడిని. రొజూ ఇటువంటి తగువులు తీర్చిన వాడినే, ఆ రోజులలో, నాకు కొత్తనిపించలా. నా స్థానం మారిందన్న సంగతి విస్మరించా.

నాలుగు రోజులు పోయిన తరవాత ఒక రోజు మా ఆఫీసర్ గారు చెప్పాపెట్టకుండా వచ్చేశారు, వచ్చి ఆఫీస్ లో కూచుని “మీ మీద కంప్లైంట్ వచ్చింది ఎంక్వయిరి కొచ్చా”నని, లైన్ మన్ ని అతని భార్యని పిలిపించారు. నాకు సంగతి అర్ధమయిపోయింది. ఆఫీసర్ గారు లైన్ మన్ ని “నీవు కంప్లైంట్ ఇచ్చావా” అని అడిగారు, “ఇచ్చా”నన్నాడు. “ఏమమ్మా! నువు ఈ జె.యి గారి దగ్గరకొచ్చి, ఆయనతో, నిన్ను మీ ఆయన కొడుతున్నాడని, తిండి పెట్టటం లేదని, సరిగా చూడటం లేదని చెప్పుకున్నావా” అని అడిగారు. అక్కడ సూది పడితే వినిపించే నిశ్శబ్దం ఆవరించింది. ఆమె మాట మీద నా భవితవ్యం అధారపడి ఉంది. నాకేసి చూస్తూ,ఆమె నోరు విప్పింది, “నేను చెప్పుకోలేద”ని చెప్పి మొహం దించేసుకుని ఏడిచింది. “ఎందుకమ్మా ఎడుస్తున్నా”వన్నారు. “ఏంలేదు బాబయ్యా” అంటూ వెళ్ళిపోయింది. నేను ఖిన్నుడనయిపోయా, చెయ్యని తప్పుకు దోషిలా నిలబడ్డా. నాకు ఆమె పై కోపం రాలేదు కాని ఆమె నిస్సహాయతకి బాధ కలిగింది. ఆమె చెప్పినది తప్పని ఆఫీసర్ గారికి కూడా అర్దమయింది, కాని ఆయన నిస్సహాయుడు. నేను శిక్షకి సిద్ధ పడ్డాను. సంగతి చూసిన ఆఫీసర్ గారు “ఏమి చేయమంటావ”ని అన్నారు లైన్ మన్ తో. “ఆయన నా కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పి, క్షమాపణ పత్రం రాసి ఇవ్వా”లని అడిగేడు. దానికి ఆఫీసర్ గారు “జె.యి గారు మీరేమంటా”రన్నారు. నా సిబ్బంది యావత్తు చుట్టూ నిలబడి ఉన్నారు. “నేను క్షమాపణ చెబుతున్నానండి, అతని వ్యక్తిగత విషయం లో కలగ చేసుకోవడం తప్పేనండి”, అని వెళ్ళి లైన్ మన్ కాళ్ళకి నమస్కారం చేసి క్షమాపణ వేడి, పత్రం రాసి ఇచ్చాను. ఎవరి మటుకు వారు వెళ్ళిపోయారు. మా ఆఫీసర్ గారు నేనూ మిగిలేము. నేను చాలా ప్రశాంతంగా ఉండటం చూసి ఆయన “ఎందుకిలా జరిగింద”ని అడిగేరు. అప్పుడు నేను ఆయనకు జరిగిన సంగతి చెప్పేను. నాకు సంగతి తెలుసు, మీరు సాక్ష్యాలు చెబుతారేమో అనుకున్నా అన్నారు. దానికి నేను, “సార్! నేను అతని మంచికోరి చెప్పేను, అందునా ఆమె వచ్చిగోలపెడితే మాత్రమే, కాని ఇది ఇలా జరిగింది. ఆమె అబద్ధం చెప్పవలసి వచ్చినందుకు ఏడిచింది. సగటు భారతీయ మహిళలా ఆమె ప్రవర్తించింది. ఆమెను నేను అర్ధం చేసుకోగలను. నేను అతనిని మందలించిన తరవాత ఆమె బాధలు పెరిగి ఉంటాయి” అన్నా. “ఏమయినా ఇటువంటి సంగతులలో అధికారం లో ఉన్న వారు జాగ్రత్త వహించాలి సుమా” అని హెచ్చరించి వెళ్ళిపోయారు.

నేను నా పనిలో పడిపోయాను.ఆ సంగతి ఆలోచించలేదు.ఆఫీస్ లో మాత్రం గుస గుసలు పోతున్నారు. కొద్దిగా నా చెవికీ సోకాయి. నేను ప్రతీకారం తిర్చుకుంటానని ఒకరు, మా బాగా అయ్యిందని మరొకరు, ఇలా రక రకాల మాటలు వినపడుతూ వచ్చాయి. నేను వేటినీ లెక్క చేయలేదు, నా పద్ధతీ మార్చుకోలేదు. ఇలా ఉండగా ఒక రోజు ఆ లైన్ మన్ భార్య, ఈ సారి ఏడుస్తూ ఆఫీస్ కొచ్చేసి, బయట కూచుని, “చంపేస్తున్నాడు బాబోయ్” అని ఏడుస్తూ ఉంది. నేను పట్టించుకోలేదు, ఎవరూ పట్టించుకోలేదు. ఈ లైన్ మన్ ఫాల్ట్ మీద బయటికి పోయిన వాడు తిరిగొచ్చి సంగతి చూసి పెళ్ళాన్ని బూతులు తిట్టాడు. ఆఫీస్ బయట గొడవ పడుతున్నారు. మా ఆఫీస్ లోని నాయకుడు వెళ్ళి “ఇక్కడ ఆఫీసర్ ముందు చులకనైపోతాం, నడవండి, నడవండి” అంటూ ఆమెను వారిని తీసుకెళ్ళిపోయే ప్రయత్నం చేసేడు, అప్పుడిక ఆమె ఆటంబాంబు లా బద్దలయి పచ్చి బూతులు తిడుతూ “ఓరి వెధవా! నీ మాట పట్టుకుని నా మొగుడు సన్నాసి నన్ను కొడుతున్నాడు, నీ మందు ఖర్చు కోసం ఎంతమంది ఉసురు పోసుకుంటావ”ని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టింది, నాయకుణ్ణి. చివరగా, “పాపం ఆయన దగ్గరకెళ్ళి నేను మొరపెట్టుకుంటే ఈ సన్నాసిని బాగు చేయడం కోసం ఆయన మంచి మాట చెబితే, నన్ను పట్టుకుని కొట్టి నా చేత అబద్ధం చెప్పించి, ఆయన చేత ఈ సన్నాసి కాళ్ళు పట్టించేవు, ఇదంతా నువ్వు చేసినదే! పురుగులు పడిపోతావ్! నీ కళ్ళుపోతాయి, నీకాళ్ళు పడిపోతాయ”ని, నాయకుణ్ణి తిట్టి, అప్పుడు నా దగ్గరకొచ్చి “నేను అబద్ధం చెప్పి, మీచేత ఈ వెధవ కాళ్ళు పట్టించేను, నన్ను క్షమించండ”ని కాళ్ళు పట్టుకుంది. నేను నిర్ఘాంతపోయా జరిగిన సంఘటనకి. “అమ్మా! నువ్వు తప్పు చేసేవని, నేను అనుకోలేదు. ఇతను నిన్ను బాధ పెట్టడం మూలం గా అలా జరిగి ఉంటుందని ఊహించా,” అన్నా. “వీడిని క్షమించం”డని మొగుణ్ణి జుట్టు పట్టుకుని నా కాళ్ళ మీద పారేసింది. నేను మరింత బిత్తరపోయా. దీని కంతకీ కారకుడు, “ఇడుగోనండి” అంటూ నాయకుణ్ణి చూపించింది. నాయకుడు సిగ్గుతో తల దించుకున్నాడు. సినిమా అయిపోయింది మా ఆఫీస్ జనం, బయట జనం ఎక్కడి వాళ్ళక్కడికి సద్దుకున్నారు.నేనొక గుణపాఠం నేర్చుకున్నా, చేదు అనుభవం మిగుల్చుకున్నా.

శర్మ కాలక్షేపంకబుర్లు-పైకి రావాలి.

Posted on జూలై 16, 2012
10
పైకి రావాలి.

శనివారం ఉదయం మా మిత్రుడు ఫోన్ చేసి మన రిటైర్డ్ ఎక్జిక్యూటివ్ ల అసోసియేషన్ మీటింగ్ కాకినాడ లో, ఆదివారం పెట్టేము. మీరు రావాలీ అన్నారు. నేను ప్రయాణం చేయలేకపోతున్నాను రాలేనన్నా, ఆ అసోసియేషన్ స్థాపనలో నేను మొదటివాడినయినా. ఈ మీటింగు మనం అందరం ఒకసారి కలవడానికీ, మనకు మళ్ళీ కొత్తగా రాబోయే డబ్బులగురించి మాట్లాడుకోడానికీ పెట్టేము. మీరొస్తే వివరాలు బాగా చెబుతారనీ, మిమ్మల్ని అందరూ చూసినట్లుంటుంది, మీరూ అందరినీ చూడచ్చుకదా అని ప్రలోభపెట్టేరు. అందరినీ చూడచ్చంటే చెవులు మెదిలేయి. దాదాపు వంద మంది స్నేహితుల్ని కలిసే సావకాశం దొరుకుతుందా. సరే ఎలాగో కిందా మీదా పడి వస్తానని చెప్పేశా. ప్రయాణం చేయాలి తప్పదు, నా ఇల్లాలు వెళ్ళగలరా అంది, ప్రయత్నం చేస్తానన్నా. ఏమో జాగ్రత్త సుమా అంది. ఉదయం టపా వేసేసి పూజ చేసుకుని, కంప్యూటర్ దగ్గర కూచుంటే మరి కదలలేనని, బయలుదేరిపోయా. అబ్బాయి తీసుకెళ్ళి బస్ స్టాండులో వదిలేశాడు. వెళ్ళేటప్పుడు బస్సెక్కేను, ప్రైవేటు బస్సు, పాతిక రూపాయల టిక్కట్టుకు ఏభై వసూలు చేశాడు. ప్రయాణం బాగానే అయింది. మీటింగ్ చోటికెళితే మేడ మీంచి ఒక మిత్రుడు పైకి రండి మూడవ అంతస్తులో మీటింగ్ అన్నాడు. మీటింగయింది,దగ్గరగా ఎనభై మంది మిత్రులను కలిసేసావకాశం కలిగింది. తిరిగి వచ్చేయడానికి బస్సెక్కాను,సాయంత్రం కాంప్లెక్స్ లో, నాకు సీటు దొరికింది. కొంత దూరం వచ్చేటప్పటికి జనం పొలోమని ఎక్కేశారు. నుంచోడానికి కూడా చోటులేదు. కండక్టర్ ముందు నుంచి అరుస్తోంది, పైకి రండి, పైకిరండి అని. పైకి రండన్న మాట ఈ మధ్యకాలం లో వినలేదనుకుంటూ కూచున్నా, ఉక్కపోత గాలి ఆడటం లేదు.మగ ఆడ తేడా లేకుండా తోసేసుకుంటున్నారు, కాని ఒకపద్ధతిలో నుంచోటం లేదు, ముందుకు జరగటం లేదు. లేడీ కండక్టర్ అరవటం మానలేదు. నేను ఆ పరిసరాలు మానసికంగా వదిలేసి, అలోచనలో పడిపోయా. పైకి రావాలి అంటే ఎత్తు మీదకి రావలని సామాన్యార్ధం. కాని ఇది విశేషార్దంలో కూడా వాడబడుతోంది, ముందుకు రావాలని, అభివృద్ధిలోకి రావాలని.

పాత రోజుల్లో, అంటే సుమారు ఏబది సంవత్సరాల కితం ప్రయాణ సాధనం, గుర్రపు బండి, ఒంటెద్దు బండి.పల్లెలలో ఇవే ఎక్కువ. అరవై సంవత్సరాల కితం పల్లెలలో సైకిలే ఉండేది కాదు. అప్పుడు రేలీ, హంబరు సైకిళ్ళు గొప్ప. కాని వాటి ఖరీదే ఆ రోజులనాటికి ఎక్కువుండేదనుకుంటా. తోవ మారిపోతున్నాం కదా. ఈ ఒంటెద్దు బళ్ళు, గుర్రపు బళ్ళకి రెండే చక్రాలుంటాయి. ఈ చక్రాలమీద ఇరుసు, దానిపై బండి ఉండేవి. బండికి గుర్రం కాని, ఎద్దును కాని కడితే లోపలికి ఎవరేనా ఎక్కేటపుడు దండిని నొక్కి పెడితే తప్పించి లేకపోతే బండి తేలిపోయి, గుర్రం లేక ఎద్దు మెడకి కట్టిన తాడు బిగిసిపోయేది. అలాగే బండి నడిచేటపుడు కూర్చున్న వారు వెనక్కు జారిపోతే కాడి తేలిపోయేది, అందుకు తోలేవారు ప్రతిసారి పైకి రండి, పైకి రండి అంటూ ఉండేవారు. ఈ మాట సాధారణంగా జట్కా బండి వారు ఎక్కువగా వాడేవారు, బండి తోలుతూ. మాకు అమలాపురం దగ్గర కొంకాపల్లి అని ఊరు ఉంది. అక్కడ జట్కా బళ్ళు ఎక్కువుండేవి. ఎవరేనా ఒకటికి రెండు సార్లు పైకి రండి అంటే ఏంటిరా కొంకాపల్లి జట్కా వాడిలా అనేవారు.

మొట్టమొదట ఈ మాట నేను మా అయ్యగారి దగ్గరవిన్నా, ఆయన మా స్కూల్ కి స్థలదాత, విద్యా దాత.మా ఊళ్ళో ఉన్న మూడు మేడలలో వారిదే పెద్దది. ప్రతి సంవత్సరం స్కూల్ లో జేరేటపుడు మొదటినెల జీతం, కొన్ని నోట్ పుస్తకాలకి డబ్బులిచ్చేవారు. ఆయన మేడ మీద ఉండగా వెళ్ళేను. డబ్బులిస్తూ బాగా చదువుకోవాలి, పైకి రావాలన్నారు. ఒహో! బాగా చదువుకుని మేడ మీదకి డబ్బులికి రావాలన్నమాటా అనుకున్నా. ఆ తరవాత మా తెనుగు మాస్టారు ఒరే పిడతమొహం వెధవల్లారా! ఇలా అల్లరి చేస్తే పైకిరారురా, పనికీరారు అని దీవించారు. అప్పుడర్ధమయ్యింది ఇదేదో తిరకాసు అని. ఒక సారి మాస్టారు హుషారుగా ఉన్నపుడు ఈ పైకి రండి అంటే ఏంటి అని అడిగేశాను. దానికాయన విరగబడినవ్వి ఓరి వెర్రి వెధవా పైకి రండి అంటే బాగా చదువుకుని మంచి ఉద్యోగం వెలగబెట్టుకుని పెళ్ళాం పిల్లలతో కులాసాగా జీవించమని అర్ధంరా! అలాగే పేరు తెమ్మని అంటూ ఉంటారు. అది కూడా ఇటువంటిదే. పేరు తెమ్మనడమంటే పెద్దవాడవయిన తరవాత పది మందికి ఉపయోగపడే పని చేసినపుడు, ప్రజలు ఆయన మాకు తెలుసండి, మా ఊరేనండి, మా బంధువేనండి అని చెప్పుకుంటారు చూడు అదన్నమాట, అన్నారు.

ఏటోనండీ ఇప్పటికీ ఈ పైకి రావడం, పేరుతేవడం మాత్రం నాకర్ధమయి చావలా 🙂
రాత్రి వచ్చేటప్పటికి ఆలస్యమై స్నానం చేసి భోజనం చేసి పడుకున్నా. తెల్లవారుగట్ల లేచి మెయిళ్ళు చూసి టపావేయాలనునుకుంటే, వేయగల టపా కనపడలేదు, అందుకు అప్పటికప్పుడు గిలికినది.

శర్మ కాలక్షేపంకబుర్లు-ఏమిటో! జీవితాలు.

Posted on జూలై 22, 2012
18
ఏమిటో! జీవితాలు.

1980 కాలం, ప్రస్తుతం ఉంటున్న ఊళ్ళో జె.యి గా ఉద్యోగం చేస్తున్న రోజులు. చాలా రోజులుగా కేంపులు తిరుగుతున్నందున ఆఫీస్ ఉత్తరాలు రాయడం ఆలస్యమైపోతోందని, ఆఫీస్ లో కూచుని ఉత్తరాలికి జవాబులు రాయడం మొదలుపెట్టేను. ఎక్స్ఛేంజిలో కలకలం వినబడింది, ఏమయిందా అని లోపలికి వెళ్ళేలోగా, ఒకరొచ్చి టెక్నికల్ అసిస్టెంట్ పడిపోయాడని చెప్పేరు, గబగబా పరుగెట్టేను, అతను కింద పడిపోయి ఉన్నాడు,నోటి వెంట నురుగొస్తూ ఉంది. అందరూ చుట్టూ నిలబడి చూస్తున్నారు తప్పించి ఏమి చెయ్యడానికీ ప్రయత్నించడం లేదు. రిక్షా పిలవమని గబగబా రిక్షాలో ఎక్కించి డాక్టర్ దగ్గరికి తీసుకుపోతే డాక్టర్ గారు చేర్చుకుని వైద్యం చేయడం మొదలుపెట్టేరు. ఈలోగా అతని ఇంటికి కబురు పెడితే ఆమె వచ్చింది. విషయం చెప్పేను. ఆమె “చావడు లెండి! చచ్చినా బాగుండు”నంది.నా పక్క నున్న సహచరుని కేసి చూశా, తరవాత చెబుతానన్నట్లు సైగ చేశాడు. నాకయితే ఏమీ అర్ధం కాలేదు. అతనిని ఆమెకు వప్పచెప్పి వస్తూ డాక్టర్ గారిని అడిగితే అతని ఆరోగ్యపరిస్థితి గురించి భయపడక్కరలేదని, అతను తన పేషంటేనని చెప్పేడు. అందరం వచ్చేశాం. ఆ తరవాత రెండు రోజులు నేను కేంపులు పోవలసివచ్చి ఆఫీసులో కూచోలేదు. మూడవ రోజు ఆఫీసులో కూచుని ఉండగా ఆఫీసులో మజ్దూర్ నాలుగు రూపాయలు తెచ్చి నా టేబుల్ మీద పెట్టి, టెక్నికల్ అసిస్టెంటు గారు మీకిమ్మన్నారని చెప్పేడు. ఎందుకిమ్మన్నారంటే, మొన్న ఆయన పడిపోయిన రోజు డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళిన రిక్షా ఖర్చులని చెప్పేడు. నా తల తిరిగిపోయింది. ఈ లోగా మరొక టెక్నీషియన్ కనపడి “ఆయనంతేనండి,! మీదగ్గరకొచ్చి తనని హాస్పిటల్ కి తీసుకువెళ్ళినందుకు కృతజ్ఞత చెబితే అందంగా ఉండేది, అదికాక మా దగ్గర, “ఈయన నన్ను హాస్పిటల్ కి తీసుకెళ్ళి హీరో అయిపోదామనుకుంటున్నాడేమొ” అని ఇంకా ఏమేమో అన్నాడు, అతని గురించి పట్టించుకోకండి, మేమెప్పుడో వదిలేశామతనిని” అన్నాడు. అతని అకారణ వైరమెందుకో తెలియలేదు. అక్కడితో ఆ ప్రహసనం ముగిసింది.

ఆ రోజు సాయంత్రం ఇంటిలో ఉండగా, ఇద్దరు ఆడవాళ్ళు మిమ్మల్ని కలిసి మాట్లాడాలంటున్నారని వచ్చి చెప్పింది , నా ఇల్లాలు. ఇద్దరం బయటికెళ్ళేము, అప్పటికే చూసి ఉన్నాను కనక ఒకామెను మొన్న ఆఫీసులో పడిపోయిన వారి భార్యగా గుర్తించాను, కూడా వచ్చినావిడ తనను తను పరిచయం చేసుకుంటూ, టెక్నికల్ అసిస్టెంట్, భార్యను హింస పెడుతున్నాడని, ఇంటిలో తిండికి కూడా డబ్బులివ్వడని, తాగి ఉంటాడని, ఒక్కతే అయిన కూతురి బాగోగులు చూడ్డని చెప్పుకొచ్చింది. అతని భార్య అన్నిటికీ నిజమని తల ఊపింది, మధ్య మధ్య కలగ చేసుకుని వివరించింది. ఇప్పుడు నా నుంచి మీరు కోరేదేమని అడిగితే, జీతం ఇంటిలో ఇచ్చేటట్లు, అతను తాగకుండా ఉండేలా, నేను అతనికి చెప్పవలసినదిగా కోరేరు. సరే మీ బాధ, మీకోరిక ఒక కాగితంమీద రాసి సతకం పెట్టి ఇమ్మన్నాను. దానికి అతని భార్య అబ్బే అది కుదరదండి, నేను కంప్లయింటు ఇవ్వను కాని మీరు చర్య తీసుకోవాలని కోరింది. మరొక సంగతిలో జరిగిన చేదు అనుభవం లో, చెయ్యి కాల్చుకున్నది గుర్తు తెచ్చుకుని కుదరదని నిర్మొహమాటంగా చెప్పేశాను. మీరేదో ఉపకారం చేస్తారని అనుకుని వచ్చామని గొణుగుకుంటూ వెళ్ళిపోయారు.

కొంతకాలం గడిచింది, మరొక పల్లెలో రాత్రి లారీ వాడెవడో స్థంభాన్ని గుద్దేసి పోవడంతో బ్రేక్ డౌన్ వస్తే అక్కడికి పరుగెట్టేను, ఉదయమే. పది గంటల వేళ అక్కడి ఆఫీస్ నుంచి మనిషి ఫీల్డులోకి వచ్చి, మిమ్మల్ని అర్జంటుగా టెక్నికల్ అసిస్టెంట్ మాటాడమన్నారని చెప్పేడు. పల్లెలో ఆఫీస్ కివచ్చి మాట్లాడితే బయటి ప్రపంచంతో అనుబంధమయిన సిస్టమ్ పోయిందన్నాడు. ఏమయిందన్నా, ఏమో నాకు తెలీదు, మీరు వచ్చి చూసుకోండి అన్నాడు. ఉదయమే పోతే చెప్పలేదేమంటే మీరు ఆఫీసుకొచ్చాక చెబుదామనుకున్నా అన్నాడు, ఇంటికి ఫోన్ ఉన్నా చెప్పక. ఒక అరగంటలో చేరుకుని, చూస్తే అందులో గుండెలాటిది చెడిపోయింది. ఎందుకిలా జరిగిందబ్బా అనుకుంటూ దానిని బయటకు తీసి చేయవలసిన టెస్ట్ లు చేస్తూ ఉంటే ఒక చోట ఒక వైర్ తెగిపోయినట్లు కనపడింది. దానిని అతికి చూదామనుకుని అతకడానికి ఉపయోగించే పరికరం సోల్డరింగ్ బోల్ట్ వేడిగా ఉన్నదా అని అడిగితే ఉన్నదని చెప్పేడు. ఈ బోల్ట్ కి కర్ర కాని ఎబోనైట్ పిడికాని ఉంటుంది, టెక్నికల్ పని చేసేవాళ్ళందరికి ఒక అలవాటు పిడి పట్టుకున్నా చూపుడు వేలొకసారి బోల్ట్ బాడీ మీద వేసి వేడి చూస్తారు. అలవాటుగా వేలేసేను. కిద బాసింపట్టు వేసి కూచున్నానేమో ఒక సారి గట్టి షాక్ కొట్టి ఒక కేక వేసి విరుచుకుని గోడమీద పడిపోయా. నా చేతిలో బోల్ట్ ఒక పక్క పడింది, మరో చేతిలో పాడయిన పార్ట్ పక్కన పడిపోయింది. పక్కనే ఉన్న టెక్నికల్ అసిస్టెంట్ గారు డ్యూటి టైం అయిపోయిందని చల్లగా వెళ్ళిపోయాడు. పక్క సెక్షన్లో అతను నా కేక విని వచ్చి చూసి నన్ను లేపి, చూసి, కూచోపెట్టి పలకరించి ఏమయిందంటే, విషయం చెప్పేను. అతను బోల్ట్ తీసి టెస్ట్ చేసి బాడీకి పవర్ వస్తోందని చెప్పి తీసేసేడు. కాసేపటికి తెప్పరిల్లి మరొక సెక్షన్ నుంచి బోల్ట్ తెప్పించి ఇక్కడి యూనిట్ బాగుచేసి ఇంటికి చేరేటప్పటికి రెండు దాటింది. ఇంటికెళ్ళి బట్టలు తీసి లుంగీ కట్టుకుంటూ ఉంటే ఇల్లాలు చూసి అదేమి పైనుంచి కిందకి చారలా ఉందంది. అద్దంలో చూస్తే నెత్తి నుంచి కిందికి చారలా నల్లగా మాడిపోయిన మచ్చ కనపడింది. సంగతి చెప్పేను. భగవంతుడు రక్షించేడనుకున్నాం. మర్నాడు రాజమంద్రి ఆఫీస్ కి వెళితే ఆఫీసర్ గారు చూసి, అదేమనడిగితే సంగతి చెప్పేను. దానికాయన మీరు కంప్లయింటు రాసివ్వండి అతని మీద చర్య తీసుకుంటానన్నారు. నేను కూడా మా ఆఫీసర్ గారిని చర్య తీసుకోమని కోరలేదుకాని కంప్లయింటు ఇవ్వనన్నా. ఏమన్నారు. శివుని ఆజ్ఞ లేక చీమయినా కుట్టదు. అతను నిజంగా నన్ను హింసించాలని అనుకుని ఉంటే అతని కర్మకి అతను ఏదో ఒక రోజు పెద్ద దెబ్బ తింటాడు అని ఊరుకున్నా.అప్పుడు గుర్తొచ్చిందీ పద్యం, చిన్నప్పుడు చదువుకున్నది.

విద్యచే భూషితుండయి వెలయుచున్న
దొడరి వర్జింపనగు జుమీ దుర్జనుండు
చారు మాణిక్యభూషిత శస్తమస్త
కంబయిన పన్నగము భయంకరముగాదె……..భర్తృహరి నీతి శతకం.

మణి నెత్తిపైనున్నా పాము ఎంత భయంకరమనదో,విద్యావంతుడయినా దుర్జనుడు, పాములా భయంకరమైన వాడని, అతనిని వదలిపెట్టేయాలని, కవి భావం

నేనక్కడినుంచి ట్రాన్ఫర్ మీద వెళ్ళిపోయా. ఇతను మారలేదు. నా తరవాత వచ్చినతను ఇతని మీద రిపోర్ట్ ఇస్తే శిక్షగా ట్రాన్స్ఫర్ ఇచ్చేరు. కొత్త ఊరిలో జాయినయి తాగుడు విపరీతంగా చేయడంతో ముందు పక్షవాతం వచ్చి మంచాన పడ్డాడు. ఎవరినైతే జీవితకాలం హింసించేడో, తిండి పెట్టకుండా, ఆ భార్య సేవ చేస్తే, రెండు సంవత్సరాల పైగా, కాలం చేసేడు. ఏమిటో జీవితాలు.

శర్మ కాలక్షేపంకబుర్లు-పంచదారచిలక.

Posted on జూలై 21, 2012
20
పంచదార చిలక.

  మరువంపు మొలకవో, పంచదార చిలకవో, ఎవరివో నీవెవరివో అని పాడుకునేవాళ్ళం, పెళ్ళయిన కొత్తలో, పెళ్ళాం పుట్టింటికెళితే. చిలుకలవలె గోర్వంకలవలెను కులుకగ…..మదనా బాలనురా మదనా! విరితూపులు వేయకురా మదనా! బాలనురా మదనా!! సుశీల గొంతులోనే వినాలి, పంచదార చిలకంత తియ్యగా, ఆ పాట. మా మిత్రుడొకడు “పేదవాడికి పెళ్ళామే భార్య” అని అనేవాడు. ఇదేంటిరా పెళ్ళాం భార్యకాకపోడం అన్నా. ఓరి పిచ్చాడా! సామాన్యుడికి పెళ్ళామే ప్రియురాలు, మరి మాన్యులకి పెళ్ళాం వేరు, ప్రియురాలు వేరు అన్నాడు. అదేంటిరా అంటే చిన్నిల్లు అన్నాడు. ఏమిటంటే అదో తిక్క, దానికో లెక్క అన్నాడు. ప్రియురాలు పంచదార చిలకలాటిదిరా అన్నాడు. అవునా? నా కర్ధంకాలా 🙂

కలిగినవారొకరు ఆడపెళ్ళివారు ఆషాఢపట్టీ పట్టుకెళుతూ పంచదార చిలకలు పోయించారు. ఇదేమిటీ ఆషాఢ పట్టీ అంటారా. పెళ్ళయిన మొదటి సంవత్సరంలో ఆడపెళ్ళివారు మొగపెళ్ళివారింటికి ఆషాఢమాసం లో పట్టుకెళ్ళేదే ఆషాఢ పట్టీ, శ్రావణమాసంలో మొగపెళ్ళి వారు ఆడపెళ్ళివారింటికి పట్టుకెళ్ళేది శ్రావణ తగువు. దీన్ని శ్రావణ పట్టీ అని కూడా అంటారు. ఇదేమిటీ పంచదార చిలకలు పోయించారూ! చిలకలు సూడిదలకి కదా పోయిస్తారన్నా. ఏదో ఒకటి తీపి పెట్టాలి కదండీ, అందుకు చిలకలు కూడా బాగుంటాయని పోయించా మన్నారు. బాగుంది. ఆషాఢ, శ్రావణ పట్టీలలో సాధారణంగా ఇంటి వారందరికి బట్టలు, తీపి, అరటి పళ్ళు, పట్టుకుని వెళ్ళడం రివాజు. శ్రావణ తగువును మాత్రం, సాధారణంగా వరలక్ష్మీ వ్రతం చేసుకునే రోజుకు కోడలికి, పూజలోకి బంగారం వస్తువు పెట్టి మిగిలినవి కూడా అంద చేస్తారు, మగపెళ్ళి వారు, కోడలికి ఆమె పుట్టినింటిలో. దీన్ని శ్రావణ “తగువు” అని ఎందుకన్నారో తెలియదు. ఇవి ఇంకా పల్లెలలో ఆచరణలో ఉన్నాయి. ఇప్పుడు అమ్మాయి అడిలెయిడ్ లోనూ అబ్బాయి న్యూయార్క్ లోనూ ఉండగా పెళ్ళి ముంబై హోటల్ లోనో హైదరాబాద్ హైటెక్ లోనో జరుగుతూ ఉంటే, వారం రోజుల శలవులో రెండురోజుల పైగా సమయం ప్రయాణంలో పోతే జెట్ లాగ్ తో పెళ్ళిపీటలమీద కూచుని సోలిపోతూ పెళ్ళి చేసుకుని మళ్ళీ విమానలెక్కేసి ఎవరిచోటికి వారు చేరుకుంటూ ఉంటే ఈ ఆషాడపట్టీలు, శ్రావణ తగువులూ ఎక్కడ? కుదురుతాయా?.ఇదంతా చాదస్తం అనుకోరూ? ఆ తరవాత ఛాట్ లో నువ్విక్కడి కొచ్చెయ్యాలంటే, కుదరదు, నువ్వే ఇక్కడికొచ్చెయ్యాలనే తగువులు తప్పించి, శ్రావణ తగువులు కనపడటంలేదు. ఆ తరవాతెప్పుడో కలిస్తే, అమ్మయ్య ఒక కాయకాస్తుందనుకుంటే అమ్మో! పుట్టేవారు అమెరికా గడ్డమీద పుట్టాలి అందుకు పురుడు అక్కడే పోస్తాం, ముసలాళ్ళని రవాణా చెయ్యండి, లేకపోయినా ఫరవాలేదంటే, ఇక సూడిదలెక్కడ? సూడిదలు లేకపోతే పంచదార చిలకలు లేవుగా,నేటి కాలంలో నిజంగా చేద్దామన్నా కుదురుతుందా?.

పంచదార చిలకలేంటొ చెప్పవయ్యా! నీగోలాపి, అంటే. అయ్యా! పంచదారతో పాకం పట్టి దానితో చిన్నవిగా పెద్దవిగా చిలకలు, నెమళ్ళు, హంసలు, పన్నీరు బుడ్లు మరి ఇతర ఆకారాలలో పోసి తయారు చేసినవే పంచదార చిలకలంటారు. ఇవన్నీ సాధరణంగా తెల్లగా ఉంటాయి. ఒక్కొకప్పుడు కొద్దిగా రంగుకూడా వాడతారు. వీటిని చిన్నవిగాపోయించి ఊరివారికి పంచిపెట్టే అలవాటు ఉండేది. వీటిని అందరూ తయారు చేయలేరు కూడా, దానికీ ప్రత్యేకమైన వారున్నారు. సారె, సూడిద, నిజానికిది సూడిద కాదు, చూడిద, చూలు శబ్దం అపభ్రంశమై చూడు అయింది, చూడు తరవాతికాలంలో, వాడుకలో సూడు అయిందనుకుంటా. ముందుచెప్పిన సారె వగైరాలలో ఇచ్చిన వాటిని, వారే ఉంచుకోక ఆ ఊరిలోని వారికందరికీ పంచిపెట్టేవారు. దీనికోసం కొంతమంది డోలు సన్నాయి కూడా పెట్టేవారు, పంచిపెట్టడానికి, వీటిని ఒకటీ లేదా రెండు కావిళ్ళలో పళ్ళేలలో పెట్టుకుని ఒకరు, ఇద్దరు స్త్రీలు ప్రతి ఇంటికీ వెళ్ళి ఇంటివారిని పళ్ళెం అడిగి తీసుకుని వీటన్నిటిని ఒక్కొక వస్తువూ అందులో ఉంచి పట్టుకెళ్ళి ఇంటిలోని పెద్ద ముత్తయిదువుకు బొట్టు పెట్టి అందచేసేవారు. ఆ సందర్భంగా సంభాషణలు స్త్రీల మధ్య బహు రమ్యంగా ఉండేవి, చతురోక్తులతో. ఈ పంచదార చిలకలని జాగ్రత్తగా భద్రపరచేవారు కొందరు, పెద్దవాటిని, అద్దాల బీరువాలలో పళ్ళాలలో పెట్టి ఆ పళ్ళాలు మరొక నీరు పోసిన పళ్ళెంలో పెట్టి భద్రపరచేవారు, చీమలు పట్టకుండా. వీటిని మొదటి రాత్రికిగాను శోభనం గదిలో ఉంచే ఆచారం కూడా ఉంది, కొత్త దంపతుల ఫలహారం కోసం. ఫలహారాలన్నీ లెక్కపెట్టి పెట్టేవారు. మళ్ళీ ఉదయం లెక్కచూసేవారు, దంపతులు ఏమితిన్నారు? ఎన్ని తిన్నారు, వారి అభిరుచి ఏమిటి అని తెలుసుకోడానికే,అభిరుచులు ఎలా కలిసేయి అన్నది తెలుసుకోడానికి. మానవ మనస్తత్వాలని ఇంత దగ్గరగా పరిశీలించేవారు, మరిప్పుడో!, పరిశీలించే తీరికా లేదు, అంత అవసరమూ కనపడటం లేదు, ఎందుకంటే అందరూ మేధావులు, బాగా చదువుకున్నవారు. అప్పుడు పెళ్ళి అంటే ఇద్దరు వ్యక్తులతో పాటు రెండు కుటుంబాల కలయిక, ఇప్పుడు ఇద్దరు వ్యక్తులకు మాత్రమే సంబంధం. పాత చింతకాయ పచ్చడి కబుర్లు చెబుతున్నావు, నీ మెదడు ఏభై ఏళ్ళ నుంచి ఎదగడం మానేసిందంటారా, నిజమేనేమో!!

శర్మ కాలక్షేపంకబుర్లు-తిండిగోల

Posted on జూలై 20, 2012
43
తిండి గోల.

పుట్టిన ప్రతి ప్రాణికి ఆహారం, నిద్ర, భయం, మైధునాలు సమానమన్నారు, మన పెద్దలు. ఇప్పుడు మనం వివిధ జీవుల ఆహారపు అలవాట్లు చూద్దాం.

మాంసాహార జంతువులలో సింహం గుంపుగా వేటాడుతుంది. ఆడ సింహం తరుముతుంది, మగ సింహం, ఇతర కుటుంబ సింహాలు వేటని పడతాయి. వాటి వేట వ్యూహం చూస్తే చాలా అశ్చర్యంగా ఉంటుంది. మొత్తం కుటుంబం వేటని సమిష్టిగా భోజనం చేస్తాయి. ఒక సింహం కనపడితే, గుంపు దగ్గరలో ఉందని గమనించాలి, అది కూడా కుటుంబం. పులి ఒకటిగానే వేటాడుతుంది. నిలవ పెడుతుంది. సింహం తాజాగా తింటుంది. మాంసాహారజీవులు శాకాహారజీవులను మాత్రమే, ఎక్కువగా వేటాడితింటాయి, కాని తోటి మాంసాహార జీవిని, ఎక్కువగా వేటాడవు, అదేమి చిత్రమో!. ఏనుగులు గుంపుగా తింటాయి, గుంపులో మగ ఏనుగు నాయకుడు, దాని వెనక అన్నీ వెళతాయి. చిలుకలు, పావురాలు, పిచుకలు, గుంపుగా వాలి ఆహారం తీసుకుంటాయి. చిత్రం తెలుసా! ఎలక చాలా తెలివయినది. ఎలకలు ఆహారం తీసుకునేటపుడు ముసలి ఎలుక ముందు తింటుంది. తిన్న ఎలక బాగుంటే, అంటే విష ప్రయోగం లేకపోతే, ఆ ఆహారాన్ని మిగిలినవి తింటాయి. కాకి చూడండి, ఆహారం దొరికితే కలబడి తినెయ్యదు, మిగిలిన వాటిని పిలిచి, వాటితో తనూ తింటుంది. కాకి ఆహారం కోసం ఇతరకాకులతో కలహించదు. కుక్క చూడండి ఆహారం కనబడితే కలబడిపోతుంది. మరొక కుక్క కనక వస్తే దానిని తిననివ్వకుండా మీద పడి అరుస్తుంది. సృష్టిలో తిన్న ఆహారాన్ని నెమరు వేసేది ఒక్క ఆవు మాత్రమే. అందుకే ఆవు చదువు చదువరా అన్నారు. ఎందులోకో పొతున్నా కదూ. మానవుడి ఆహారపు అలవాట్లు చూద్దాం. మానవుడు శాకాహారజీవి మాత్రమే కాని మాంసాహారానికి అలవాటి పడ్డాడంటారు, మా సత్యనారాయణ రాజుగారు.

నూట ఏబది సంవత్సరాల ముందు గో.జిలలో జొన్న, రాగివంటి చిరు ధాన్యాలే ఆహారం, ముఖ్యంగా. కలిగిన మహరాజులే వరి అన్నం తినేవారు. పాడి సమృద్ధిగా ఉండేది. ఇప్పటిలా పాలు పెరుగు అమ్ముకోడం, నాడు తెలియదు, కావలసిన వారికి ఊరకనే పోయడం తప్పించి. ఆవులనే ఎక్కువగా పోషించేవారు. వెన్న, నెయ్యి వాడేవారు. ఆవునెయ్యి తినడం మూలంగా కుశాగ్రబుద్ధి, జ్ఞాపక శక్తి కలిగేవి,పెరుగు చిలికి వెన్న తీసిన మజ్జిగ వాడేవారు. ఇప్పుడున్న కూరలే అప్పుడూ వండుకునేవారు, ఐతే కూర సంవత్సరం లో కొన్ని నెలలే దొరికేవి. సమృద్ధిగా దొరికినపుడు వాటిని కోసి ఎండపెట్టి ఒరుగు చేసేవారు. ఇందులో ముఖ్యమైనవి, వంకాయ,దొండకాయ,అరటికాయ, కాకరకాయలాటి వాటిని ఒరుగులు గా చేసేవారు. వంకాయ కూరకి, వరికూటికి విసుగు లేదనే వారు. ముఖ్యంగా మామిడికాయ, ఉసిరికాయ, చింతకాయలతో నిలవ పచ్చళ్ళు పెట్టేవారు. ఇప్పుడు మేము వెలగపళ్ళు, నిలవ పచ్చడి పెడతాం, సంవత్సరం వాడుకోడానికి,బాగుంటుంది, నిలవుంటుంది. దోసకాయతో కూడా ఊరగాయపెడతాం. దోసతిన్న కడుపని సామెత, సంచీ దులిపేసినట్లు జీర్ణవ్యవస్తని ఖాళీ చేసేస్తుంది. నేటి కూరలూ బాగానే ఉంటాయి. దుంప కూరలు తిని తీరాలి. ఆకు కూరలయితే చెప్పేదే లేదు. ఎన్ని ఆకులో, చింతచిగురు,షీకాయాకు చిగురు, తోటకూర, గోంగూర, బచ్చలి, పొన్నగంటి కూర, తెలగపిండి కూర,కరివేపాకు,బలుసు కూర, బలుసు లేని తద్దినం బులుసు లేని యజ్ఞం లేదని సామెత. నెల్లి కూర, నల్లేరు, ఇది పచ్చడి చేసుకు తింటే కీళ్ళ నెప్పులు తగ్గుతాయి. గల్జేరు చేదుగా ఉంటుంది, వదలని కడుపులో క్రిమిరోగాలకి మందు, పచ్చడి చేసుకుతింటారు. తోటకూర పచ్చడి చేసుకుంటారు తెలుసా. ములగ కూర ఆషాఢ మాసం లో తిని తీరుతాము. దీనితో ఐరన్ చేరుతుంది, కరివేపాకు, కొత్తిమీర తో లాగా. బచ్చలి కూర తింటే థయిరాయిడ్ బాగా పని చేస్తుంది.

మరి పప్పుల దగ్గరకొస్తే కందిపప్పు రాజు, పెసరపప్పు మంత్రి. మిగిలిన పప్పులు మినప, బొబ్బర్లు,చిక్కుడు,శనగపప్పు ముఖ్యమైనవి. వీటిని రక రకాలుగా తయారు చేస్తారు. మాకూ రోజూ కందిపప్పు లేకపోతే గడవదు, ముద్ద దిగదు. కందిపొడి మరొక గొప్ప రుచికల ఆహారం. శనగ, కంది, పెసరపప్పులతో పాఠోళీ అని చేస్తారు బలే ఉంటుంది. ఇప్పుడు ఫైవ్ స్టార్ హోటళ్ళలో ఇది గొప్ప రెసిపి. మాకయితే వారంకి ఒక సారి తప్పదు. అలాగే మెంతి మజ్జిగ కూడా ఫైవ్ స్టార్ రెసిపి. దీన్ని చేసే విధానం బాగుంటుంది. మజ్జిగలో ఉప్పు, పసుపు వేస్తారు. పోపుకి మిర్చి, ఆవాలు, మెంతులు, జీలకర్ర వేస్తారు. దీనిని ఇనపగరిటలో కొద్దిగా నేతి తో వేయించి ఇనపగరిటను పోపుతో కలిపి మజ్జిగలో ముంచుతారు. అలా కాలిన ఇనప గరిట ముంచడం మూలంగా అందులో ఐరన్ చేరుతుంది. మా ఇళ్ళలో ఇనపగరిటలు ఉండేవి, ఇప్పుడు వాడటం మానేశారు,ఇనపగరిట తోమినది తెల్లగా మెరిసేది. అది వదిలేసి ఐరన్ టేబ్లెట్స్ మింగుతున్నాం. మరో ముచ్చట రాతి చిప్పలని ఉండేవి. ఇది రాతితో తయారయినది. ఇందులో పులుసు కాచేవారు. దీనిని పొయ్యి మీద పెట్టేందుకు వీలుగా బయట తడి మట్టి రాసేవారు. దానికి మంట సన్నగా తగిలితే పులుసు బలే రుచిగా ఉండేది. ఇంగువ వాడేవారు. ఇది జీర్ణప్రక్రియకు దోహదకారి, మంచి సువాసన వస్తుంది ఆహారానికి. రాతిచిప్పతో ఖనిజలవణాలు శరీరం లో చేరేవి ఆహారంతో. రాతి చిప్పలో వండిన పులుసు సత్తు తప్పేలా అని జింక్ పాత్రలో పోసేవారు, దానితో శరీరానికి కావలసిన జింక్ అందేది.. ఇప్పుడు ప్రతి దానితో జింక్ తీసుకోమని డాక్టర్ల శలవు. సోడియం విత్ జింక్, కాల్షియం విత్ జింక్ ఇలా, ఈ జింక్ పాత్రల వాడకం పోయింది. రాతిచిప్పలు ఉప్పు పోయడానికి వాడే వారు. ఆ అలవాటూ పోయింది. అయోడిన్ రాతి చిప్ప ద్వారా చేరేదేమో తెలియదు. మజ్జిగపులుసు కూడా ఫైవ్ స్టార్ రెసిపి. మా పల్లెలలో బాగా దొరికే,మేము ఎక్కసంగా చూసే బొప్పాయి పండు ముక్కలుకోసి ఫైవ్ స్టార్ వారు పెడుతున్నారు, స్పెషల్ పేరుతో.

ఇక మాంసాహారులలో చాలా ముఖ్యంగా గోదావరి జిల్లాలలో మాత్రమే ఉండే ఒక గొప్ప వంటకం, పులస చేప. ఇది ఆస్ట్రేలియా తీరంనుంచి బయలుదేరివస్తుంది, దీనిని విలస అంటారు. కొత్త గోదావరి నీటిలో తొందరగా పెరిగి ధ్వళేశ్వరం బేరేజ్ దగ్గర దొరికే చేప, దీనిని పులస అంటారు. దీన్ని తినాలి కాని, రుచి వర్ణించి చెప్పటం కష్టమంటారు, తెలిసినవారు. చేపను శుభ్రం చేసి ముక్కలుకోసి మసాళా వగైరాలు వేసి వండిన తరవాత ఇందులో వంటాముదం పోస్తారు. ఇది రెండు రోజులు మగ్గిన తరవాత మూడవ రోజు తింటే అద్భుతమైన రుచి ఉంటుందట.ఈ చేపల కూర చేయడం అందరివల్లా కాదు, కొంతమంది నిపుణులు చేస్తేనే దానికి రుచి వస్తుందట. దీన్ని నజరానా గా పై ఊళ్ళలో వారికి, వండించి పంపడం గో.జి ల మర్యాదలలో ఒకటి. మరొకటి రామలు, చింత చిగురు కలిపి వండుతారు. రామలు అంటే చిన్న చిన్న గా ఉన్న చేపపిల్లలు. వీటిని మెత్తళ్ళు అని కూడా అంటారనుకుంటా. ఇది కూడా గో.జిల కి ప్రసిద్ధి వంటకం. మాంసాహారులు ఎక్కువగా వాడే ఉల్లి, వెల్లుల్లి,ధనియాలు, మిరియాలు, జాజికాయ, జాపత్రి,గసగసాలు,లవంగం అన్నీ ఔషధాలే.

ఇంత రుచికరమైన, బలవర్ధక సమీకృత ఆహారాన్ని అరటి ఆకులో వేడిగా తినేవారం. ఇప్పుడు కుక్కర్లో వండుకుని హాట్ పేక్ లో కుక్కుకుంటున్నాం, రాగి పాత్రలో అన్నం వంట పోయింది. అరటాకు,తామరాకు, మోదుగాకుల విస్తరి, అడ్డాకుల విస్తరి,బాదం ఆకుల విస్తరి,ఇలా ఆకుల విస్తరిలో తింటే దానినుంచి కూడా శరీరానికి కావలసిన పదార్ధాలు చేరేవి, క్లోరోఫిల్ లాటివి. లేకపోతే వెండి కంచం,కంచుకంచం,వాడేవారు. ఇప్పుడో స్టీల్ వాడుతున్నాం దానితో శరీరానికి అవసరమైనవి చేరకపోయినా ఆర్సెనిక్ లాటి విషాలు చేరుతున్నాయి, స్టీల్ సరిగా తయారు చేయనందుకుగాను. భోజనం తర్వాత సున్నం, వక్కతో,పచ్చ కర్పూరంతో తామలపాకు తాంబూలం గొప్ప అనుభూతి, ఆరోగ్యానికి మంచిది, కేల్షియం చేరేది. మంచి నీరు రాగి బిందెలు,ఇత్తడి బిందెలలో నిలవ చేసేవారు. రాగి చెంబులో నీరు తాగేవారు. ఇదో పిచ్చి, మేము ఇప్పటికీ ఇవి వాడుతున్నాం. ఇత్తడి బిందెలో నిలవ ఉంచిన నీటిలో ఏదో ప్రత్యేకతని కనిపెట్టేరు యీ మధ్య. ప్లాస్టిక్ బాటిళ్ళలో నీళ్ళు తాగుతున్నాం. ప్రకృతికి దూరంగా జీవిస్తున్నాం. మనం పెద్దలు ఏమయితే చేయద్దన్నారో అదే చేస్తున్నాం. నిలబడి ఆహారం తీసుకోవద్దన్నారు, చేతిలో పెట్టుకుని తినవద్దన్నారు, పాద రక్షలతో భోజనం వద్దన్నారు, నెత్తిమీద శిరోవేష్టం తో భోజనం వద్దన్నారు, కాని తప్పటం లేదు

శర్మ కాలక్షేపంకబుర్లు-టపా ఎలా రాస్తానంటే……

Posted on జూలై 11, 2012
24
టపా ఎలా రాస్తానంటే….

మనసు సంకల్ప వికల్పాలలో నా దృష్టికి వచ్చిన మాట, పలుకు, చేష్ట, సంఘటనలను కూడతీసుకుని ఒక టపా రాయడానికి ఒక తలకట్టు ( హెడింగ్ ) పెడతాను. అస్తమానం తలకట్టు ముందు పెట్టను. సంఘటన అయితే రాసేసిన తరవాత తలకట్టు పెడతా. “అవునోయ్! జుట్టున్నమ్మ కొప్పెట్టుకున్నా అందమే సిగెట్టుకున్నా అందమేనని ఏదో ఒకటి పెట్టుకోవచ్చు” అంది మనసు.ఇలా సామెతలు వాడతా.ఈ తలకట్టు ఆకర్షణీయంగా ఉంటే బ్లాగు చూసేందుకు ఉత్సాహ పడతారు. మనం చెప్పేవి సొల్లు కబుర్లు కనక ఎవరు చదువుతారు?, చెప్పేది ఆకర్షణీయంగా లేకపోతే. అందుకు తలకట్టు బాగోవాలన్నమాట,అదీ ముందు సంగతి. ఆ తర్వాత చెప్ప దలుచు కున్నది సుత్తి లేకుండా, చెప్పేది రసవత్తరంగా,చదివే వారి మనసుకు హత్తుకునేలా, ఆహ్లాదపరచేదిలా, అవసరమైతే ఒక పంచదార పూసిన గుళికలా ఉండాలన్న మాట. చదివేవారి కళ్ళు అక్షరాల వెంట పరుగెట్టాలి, మనసు ఉరకలెయ్యాలి, అలా చెప్పాలి. ఎవరి శైలి వారిదే, ఒకరిని అనుకరిస్తే అది ఒకనాటిదే! స్వధర్మం ఎంత చెడ్డదయినా అనుసరణీయమని భగవానుని ఉవాచ నమ్ముతాను. భావగీతాలైతే విషయం సూచనగానైనా తెలియాలి, కవితలైతే సమస్యలేదు. పొరపాట్లుంటే పెద్దలు సరిదిద్దాలి. మా మిత్రులు శ్యామలరావు గారు బ్లాగు మొదలుపెట్టిన కొత్తలో భాషా ప్రయోగంలో, సంధి చేయడంలో సూచనలిచ్చారు. అవి పాటిస్తున్నాను.

ఎత్తుగడ నీరసంగా ఉంటే ముగింపులో మెరుపులుండాలి. ఎత్తుగడ సరదాగా మొదలయితే చివరిదాక దాన్ని కొనసాగించాలి. శృంగారమయితే మోతాదులో ఉండాలి. హాస్యమయితే రసగుళికలా సాగాలి. చెప్పేది ద్రాక్షా పాకంలో ఉంటే మంచిది, లేకపోతే కదళీపాకంలా ఉండాలి, కాని నారికేళపాకంలో ఉండ కూడదు. ఏమిటో ఉండగా ఉండగా మీకు మతిపోతోంది, ఏంటీ పాకాలంటారా? ద్రాక్షా పాకం అంటే ద్రాక్షపండు నోటిలో వేసుకోగానే ఎలా తియ్యగా ఉంటుందో అలాగ, ఇక కదళీ పాకం అంటే అరటి పండులా, అంటే కొద్దిగా కష్టపడాలి, తొక్క తీసుకు తిన్నట్లుగా, ఇక నారికేళ పాకమంటే, కొబ్బరి కాయ ఒలవాలి పీచు తీయాలి, బద్దలు కొట్టాలి, అప్పుడు తియ్యటి నీళ్ళు తాగాలి, తియ్యటి ముక్క తినాలి. మరి అందరికి అన్ని వేళలా సాధ్యమా? కుదురుతుందా? కనక నారికేళపాకంలో ఉండేదాన్ని, మనం ద్రాక్షాపాకంలో చెప్పగలిగితే గొప్పగా ఉండదూ? అదన్నమాట, కిటుకు. నారికేళపాకం పనికిరాదా అనకండి. ఒక్కొకపుడు అదే కావాలి. సమయం, సందర్భం చూసుకోవాలి. పిడుగుకూ, బియ్యానికీ ఒకటే మంత్రంమా అన్నటు ఉండ కూడదు.

నీ సంగతి చెప్పవయ్యా! అవన్నీ మాకూ తెలుసంటారా, అవధరించండి. ఒక సంఘటన, మాట, పలుకుబడి, విన్నది, చూచినది, గుర్తుకొచ్చినది, వెంటనే కంప్యూటర్ ఫైల్ లో పెట్టేస్తా. వీలు కుదిరితే టపాయే రాసేస్తా. ఒక్కొక్కపుడు టపా బలేగా సాగిపోతుంది, నల్లేరు మీద బండిలా. ఒక్కొకప్పుడు మంచి రసపట్టు మీద రాయడానికి కూచుంటే పుటుక్కున కరంటు తీసేస్తే రసభంగమయిపోయి, ఆలోచనంతా ఆవిరైపోతుంది. అటువంటపుడు పిచ్చి కోపం వచ్చేస్తుంది, కాని పేదవాని కోపము పెదవికి చేటని సామెత కదా. నోరు మూసుకుని కూచోడమే. సగం టపా రాసిన తరవాత, తరవాత రాద్దాంలే అని అనిపిస్తుంది, అటువంటి టపాలు చాలానే ఉంటాయి, అసంపూర్తిగా, ఇవి పూర్తి అవుతాయా, చెప్పలేను. మళ్ళీ ఆ స్థాయీభావం ( మూడ్ )ఏర్పడాలి, ఆ విషయంలో. కొన్ని కొన్ని టపాలు మొదలు పెట్టిన వేళా విశేషం చెప్పలేను కాని ఎన్నాళ్ళకీ పూర్తికావు. రాసిన టపా లుంటాయి రెండో, మూడో ఒక్కోసారి, అవి వేయ బుద్ధి కాదు. కారణం చెప్పలేను. అటువంటి నచ్చుబాటు కాక వదిలేసినవి, చాలా కాలం తరవాత ఎప్పుడో ఏమీ రాయలేనపుడు, అది వేస్తే, దానికి గొప్ప స్పందన వచ్చేసి ఆనందమయిపోతుంది. సగం రాసి వదిలేసిన టపాలు తరవాత పూర్తి చేసి వేస్తే, ఒక్కోసారి అది అతుకుల బొంతలా ఉంటుంది, మరి మీకెలా అనిపిస్తుందో తెలీదు కాని. ఇప్పుడీ ఈ టపా తో కలిపి పూర్తిగా రాసిన టపాలు నాలుగు, సగం రాసినవి తొమ్మిది, తలకట్టు పెట్టినవి మూడు ఉన్నాయి. తలకట్లు చెప్పమంటారా? అది చీక్రెట్ రహస్యం కదా మరి. తల కట్లెలా ఉంటాయంటే ఇల్లు ఇరకాటం లాగ. విచిత్రమేమంటే భారతం లో ఉన్నది అంతా ప్రపంచంలో ఉంది, భారతం లో లేనిది ప్రపంచంలో లేదు. ఐతే ఆ సందర్భానికి తగినది భారతం లో వెతుక్కోగలిగితే, దీనికి దానికి లింక్ పెట్టుకోగలిగితే టపా ఆటం బాంబులా పేలుతుంది. ఓపికగ కూచుని రాసిన టపాల కంటే అప్పటికప్పుడు రాసి వేసిన టపాలు బాగుంటాయి, వేడి వేడి అల్లం జీలకర్ర పెసరట్లలాగా. రాసిన టపా ఓపికగా ఎన్ని సార్లు చదువుతానో చెప్పలేను. ఒక సారి అక్షరదోషాలకోసం, ఒక సారి భాషా ప్రయోగాల కోసం, ఒక సారి చెప్పినదానిని వెనకముందులు చేయడం విభజన చేయడం కోసం. ఇలా చదివితే ఆ టపా వేసేలోగా అది కంఠస్థం అయిపోతుందన్న మాట. మరొకటేమంటే తెనుగు బ్లాగు కదండీ అందుకు అన్యభాషాపదాలు వాడను, వాడకం తక్కువ. మా మిత్రుడేదో అంటున్నాడు “ఏంటయ్యా?” “ఏంలేదండీ ఈయనకి మరో భాష రాదులెండి అందుకే ఈ పోజు.” సాధారణంగా ఎప్పుడూ వ్యక్తులను, సమాజాలను కించ పరచేవి జాతీయాల్లో ఉన్నా చెప్పను. మనల్ని ఒకరు చిన్నపుచ్చినపుడు ఎంత బాధ పడతామో అలాగే అవతలివారు కూడా అనుకోవాలి కదా. చివరగా టపా వేసేటపుడు కూడా ఒక సారి చదివి మునుచూసి అప్పుడు వేస్తా. తెల్లవారు ఝామున మూడున్నరకు లేస్తా. ఐదున్నర దాటిన తరవాత టపా వేస్తా.ఈ లోగా కామెంట్లు చూస్తా. సమాధానాలిస్తా. కొన్ని బ్లాగులు చదువుతా. అత్యవసరమయితే వేసే టపా ఆపు చేసి అప్పటి కప్పుడు టపా రాసేస్తా, అదే వేస్తా, తరవాత దీని పరిస్థితి చెప్పలేను, అలా మూల ఉంటుంది. నాకు నచ్చని టపా, ఈ మొత్తం వ్యవహారం పూర్తికాని టపా బయటకు రాదు. మనసు బాగోనపుడు ఈ రాసిన టపాలో లోటు పాట్లు సరిదిద్దుకోవడం జరగదు, అందుకు టపా వేయనన్నమాట. మరో ముఖ్యమైన సంగతి టపా మరీ పెద్దది, మరీ చిన్నది కాకుండా ఉండాలి, ఒక్కొక్కప్పుడు ఇది కుదరదు, అప్పుడు సాధ్యమైనవరకు విషయం చెప్పి కుదిస్తాను. మరొక సంగతి, నేను ఎవరినీ అనుకరించను. ఎంత చెడ్డదయినా స్వధర్మం మంచిదికదా! గీతలో చెప్పినదిదే. ఎదుటివారు చెప్పేది అందంగా ఉండచ్చు. ఒక వేళ అనుకరిస్తే అది అప్పటికే కాని కొనసాగింపు కూడదు.ఒక టపా రాయడానికే ఇంత కష్టముంటే, కాలక్షేపం కబుర్లు రోజూ రాయాలంటే ఎంత కష్టం ఆలోచించండి. ఎన్ని గంటలు కూచోవాలి కంప్యూటర్ ముందు?

చివరగానే కాని ముఖ్యమైనదే! వంట లొట్టలేసుకుని తినడమే కాదు బాగుంటే బాగుందని చెప్పాలి, బాగోకపోతే ఆ విషయం సున్నితంగా చెప్పాలి. సావకాశం దొరికింది కదా అని తిట్లకి దిగితే అది ఇరువురికీ అందంగా ఉండదు కదా.!అలాగే టపా చదివినవారు ఒక మాట చెప్పిపోతే ఆనందం. ఒక్కో రోజు చదివిన వారు వందల సంఖ్యలో ఉంటారు, మాట కలిపినవారుండరు, అటువంటపుడు నీరసం, నిరాశ పొందడం మానవ సహజం, గుర్తించండి. యువత ఎక్కువగానే చదువుతున్నారు, కాని వ్యాఖ్య పెట్టటం లేదు, ఏదో పెద్దాయన రాసేడు, మనం ఏమనకూడదు అనుకోడం, ప్రేమ, విరహం, పెళ్ళి, సంపాదన ఇవేనా జీవితం లో ఉన్నవి. ఇంకా చాలా ఉన్నాయి అది కూడా గుర్తించమని మనవి. గరికపాటి వారీ విషయంలో “ఆటా” మీటింగులో చెప్పేరు, రచయితని కొత్తగా ఏమిరాసేరని అడగద్దు, మీరు రాసినది ఫలానా నచ్చిందని చెప్పండి అన్నారు, మరి పెద్ద వాళ్ళలా చెప్పినపుడు మరి నేనూ అంతే కదండీ…….Snkr.గారు. ఆయ్! ఉంటానండి.