శర్మ కాలక్షేపంకబుర్లు-కనిపించేవాడు దైవం కాదా?

“పృధివ్యాపస్తేజోవాయురాకాశాత్” ఇవి పంచభూతాలు. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు తన్మాత్రలు. ఆకాశం నుంచి వాయువు, వాయువునుంచి అగ్ని, అగ్ని నుంచి జలం, జలంనుంచి భూమి పుట్టేయని శాస్త్రాలు చెబుతున్నాయి, నేటి సయిన్సూ చెబుతోంది. అకాశానికి ఒకటే గుణం శబ్దం, మానవ శరీరంలో ఇంద్రియం చెవి, వాయువుకు రెండు గుణాలు శబ్దం స్పర్శ, మానవ శరీరంలో ఇంద్రియం చర్మం. తేజస్సు, దీనికి ఖగోళం లో సూర్యుడూ, భూమి పై నిప్పు ప్రతీకలు,ఈ భూతానికి మూడు గుణాలు శబ్ద, స్పర్శ, రూపాలు. ఇంద్రియం కన్ను. నాల్గవది జలం దీనికి నాలుగు గుణాలు. శబ్ద,స్పర్శ,రూప, రసాలు, ఇంద్రియం నోరు. చివరిది భూమి దీనికి ఐదు గుణాలు శబ్ద,స్పర్శ, రూప,రస,గంధాలు. ఇంద్రియం ముక్కు. పంచ భూతాలకి మానవ శరీరం లొ ఉన్న ఇంద్రియాలు, వీటిని జ్ఞానేంద్రియాలంటాం.


తేజస్సు అంతరిక్షంలో సూర్యునిగాను, భూమి మీద అగ్నిగాను కనపడతాయి. సూర్యుడు మిగిలిన నాలుగు భూతాలతో సంపుటీ కరణం చెంది, ఈ సర్వ జగత్తుకూ కారణమవుతున్నాడు. అలా భూమిపై పుట్టిన జీవులలో మానవుడు సర్వ శ్రేష్ఠుడు అన్నారు, జంతూనాం నరజన్మ దుర్లభం, శంకరులన్నారు. ఇలా పుట్టిన జీవులు మరలా భూమినుంచి సూర్యుని ద్వారా తయారైన ఆహారం తీసుకుని పెరుగుతున్నాయి. పెరుగుతున్న జీవులు పెద్దవవుతున్నాయి. పెద్దవైన ప్రాణులు భూమినుంచి సూర్యుని ద్వారా ఇవ్వబడిన ఆహారం, పురుషులలో శుక్రంగాను, స్త్రీలలో శోణితంగానూ పరిణామం చెంది, వారి కలయిక ద్వారా మరలా జీవులు పుడుతున్నాయి. వయసు మళ్ళితే మరణిస్తున్నాయి. మరణిస్తే మరలా సూర్యుని దయవల్లే బూడిదవుతున్నాయి, మట్టిలో కలసిపోతున్నాయి. మట్టిలో పుట్టి, మట్టిలో పెరిగి, మట్టిలో కలియడానికి అన్నిటికి సూర్యుడే కారణం. ఇది కాలంలో జరుగుతోంది, ఈ కాలం కూడా సూర్యుని వలననే ఏర్పడుతోంది, పగలు, రాత్రుల రూపంలో. జీవుల ఆరోగ్యానికి కారకుడు,ఆలోచనలకు కారకుడు, అనారోగ్యానికి కారకుడు, మనుషులకు కావలసిన సర్వ వస్తువులూ భూమి ద్వారా సమకూర్చేవాడు సూర్యుడు. ఇంత చేస్తున్న సూర్యుడు దేవుడు కాదా? సూర్యుడు కనపడని రోజును దుర్దినం అంటారు, ఆ రోజు భోజనం చెయ్యనివారూ ఉంటారు, ఇదేమి మూఢనమ్మకమని కదా అధునికులవాదన, కాని ప్రకృతికి దగ్గరగా జీవించడమని ఆచరించేవారి వాదన.


ఆరోగ్యం కోసం ఈ కింది శ్లోకం పారాయణ చెయ్యండి. ఉదయించే, అస్తమించే సూర్యుని చూడకండి. ఉదయించిన అస్తమయానికి ముందు సూర్యుని చూడండి. సూర్యుడికి మతాలు, కులాలూ లేవు, అందరిపట్లా ఒకలాగే ప్రవర్తిస్తాడు.


వికర్తనో వివశ్చాంచ్య మార్తాండో భాస్కరో రవిః

లోకప్రకాశకః శ్రీమాన్ లోకచక్షుర్గహేశ్వరః

లోక సాక్షీ త్రిలోకేశ కర్తా హర్తా తమిస్రహా

తపన స్తాపనశ్చైవ శుచి స్సప్తాశ్వవాహనః

గభస్తిహస్తో బ్రహ్మాచ సర్వ దేవ నమస్కృతః

ఏకవింశతి రిత్యేషస్తవ ఇష్టస్సదా మమః

శరీరారోగ్యద శ్చైవ ధన వృద్ధి యశస్కరః

స్తవరాజః ఇతి ఖ్యాతస్త్రిషులోకేషు విశ్రుతః


 సూర్యుని జీవితకాలం తో పోలిస్తే మన జీవిత కాలం చాలా స్వల్పం, సముద్రంలో నీటి బిందువు. ఈ సూర్యుడు కూడా మహాలయ కాలంలో అంతరిస్తాడు. వేదం ఇలా చెబుతోంది ” సూర్యచంద్ర మసౌధాతా యథాపూర్వమకల్పయాత్, పృధివీంచాంతరిక్ష మధోస్వసః” సూర్యచంద్రులతో, భూమి మిగిలిన భూతాలను బ్రహ్మగారు మరల యధాప్రకారంగా పూర్వంవలె సృష్టి చేశారు. కారకులెవరు? శివ శక్తులన్నారు.


శివశ్శక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుమ్

న చే దేవం దేవో న ఖలు కుశలః స్పన్దితుమపి I

అతస్త్వామారాధ్యాం హరి హర విరిఞ్చాదిభిరపి

ప్రణన్తుం స్తోతుం వా కథమకృతపుణ్యః ప్రభవతి

Cortesy:-http://shaktiputram.blogspot.in/2014/12/ii-ii.html


శివుడు లేని శక్తిలేదు, శక్తిలేని శివుడు లేడు. ఈ ఇద్దరూ కలసిన ఏక స్వరూపమే దేవుడు, నేటి ప్రోటాన్, న్యూట్రాన్ లనుకోవచ్చు, ఈ రెండూ కలసిన ఆటం అనుకోనూవచ్చు. ఈ అణువులతో ఉన్న ఈ సర్వ ప్రపంచమే విశ్వం,విష్ణుః…అదే పరమాత్మ…కనపడుతున్నవాడు దేవుడు కాదా? 

నేడు సూర్య జయంతి.

శర్మ కాలక్షేపంకబుర్లు-ఏడిచేవాళ్ళ ఎడం పక్క………

Monday, 19 January 2015

ఏడిచేవాళ్ళ  ఎడం పక్క కుట్టేవాళ్ళ కుడిపక్క కూచోకూడదు,ఇదొక నానుడి. ఏం ఎందుకు కూచో కూడదూ? కూచుంటే ఏమవుతుంది? ఇది జిజ్ఞాసువుల ప్రశ్న. ఏమవుతుందా?


నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళేవస్తాయన్నారు సినీకవి, ఇది నిజమేకాని ఏడిస్తే మాత్రం కన్నీళ్ళతో పాటు ముక్కులో కూడా నీళ్ళొస్తాయి, ఇది నిజమే… ప్రయత్నించకండి…. :). ఈ ఏడుపుంది చూశారూ, దీని దుంప తెగ దీనికీ ఆడ మగ తేడా ఉందిటండి. ఆడవారి నెత్తిన నీటికుండ సిద్ధంగా ఉంటుందనీ అంటారు. పాపం అలాగయినా వారు తమ గుండె బరువు దించుకుంటారు, మరొకరికి ఆ బరువు ఎక్కించేస్తారు లెండి. ఇక ఏడ్చేవారి ఎడంపక్క కదా అసలు సంగతి,ఏడిస్తే కన్నీళ్ళతో పాటు ముక్కులో కూడా నీళ్ళొస్తాయి కదండీ, వాటిని, కొండొకచో, అవి గట్టిపడి పచ్చని ముద్దగా కూడా తయారవుతాయి. వాటిని సుతారంగా ఎడమ చేతి వేళ్ళ మీదకి చీది, అలా చీదిన పదార్ధాన్ని, అదేలెండి దాని పేరే చీమిడి, దీన్ని నేల మీద విసిరి కొట్టి పక్కన ఏం ఉంటే దానికి చెయ్యి రాసేస్తారు. అమ్మయ్య ఇప్పుడు తెలిసిందా ఎడమ పక్క ఎందుకుకూచో కూడదో!  మనం కూచుంటే మనమీదే చీదెయ్యచ్చు లేదా ఆ చెయ్యి రాసెయ్యచ్చు. మరి కుట్టేవాళ్ళకి కుడి పక ఏమని కదా! ఇప్పుడంటే సూదితోనూ, దబ్బనం తోనూ అసలు కుట్టటమేలేదు. చేతికుట్టు లేనే లేదు, అందుచేత తెలియదు కదా. కుట్టేవారు ఎడమ చేత్తో బట్టని పట్టుకుని కుడి చేత్తో సూది పట్టుకుని బట్టని కుడతారు. అలా కుట్టిన సూదిని దారం ఉన్నంత పొడుగునా పైకి లాగుతారు. అలా పైకిలాగబడిన  సూది కుడి పక్క కూచుంటే మనకి గుచ్చుకోడం ఖాయం కదా! అందుచేత  కుట్టేవారి కుడిపక్క కూచోవద్దన్నారు.


ఏం ఏడం చేతిలోకే చీదుతారా? కుడి చేతితోనే కుడతారా అని అనుమానం రావచ్చు, తప్పు కాదు లెండి. మానవ మెదడు రెండు అర్ధభాగాలుగా ఉంటుంది. అవి ఎడమవైపు అర్థభాగం , కుడివైపు అర్థభాగం. మన శరీరం లో కుడివైపు అవయవాలను మెదడులోని ఎడమవైపు అర్థభాగమూ, ఎడమవైపు అవయవాలను మెదడులోని కుడి వైపు అర్థభాగమూ నియంత్రిస్తుంటాయి. ఎడమవైపు పక్షవాతమొస్తే కుడివైపు మెదడు దెబ్బతిన్నట్టుట.  సామాన్య మానవుల మెదడులో ఎడమ వైపు అర్థభాగం, కంటే కుడివైపు దానికంటే చురుగ్గా ఉంటుంది. అందుకే అందరూ సాధారణంగా కుడి చేయి వాటమై ఉంటారు. మరి ఎడం చేతివాటం వాళ్ళు దీనికి వ్యతిరేకంగా కుడివైపు అర్థభాగం చురుగ్గా ఉంటుందట. ఇలా ఎడం చేతివాటంగాళ్ళు, (చేతివాటం గాళ్ళు కాదులెండి,)  గొప్పవారై ఉంటారట. కొంతమంది కుడి ఎడమ చేతులతో ఒకేలా పని చేయగలరు, వీరు సవ్యసాచులు, అంటే వీరి మెదడులో రెండు అర్థభాగాలూ సమానంగా పని చేసాయన్నమాట. ఇంత తిరకాసున్న మెదడు స్త్రీ పురుషులలో సమానంగా ఉంటుందా? తెలియదు కాని ఆడవారు మగవారికంటే అన్నిటిలోనూ ఎక్కువేనట, శాస్త్రకారుని మాటే ఇది. ఇదిగో చూడండి.


స్త్రీణా ద్విగుణమాహారం బుద్ధిశ్చాపి చతుర్గుణమ్

సాహసం షడ్గుణంచైవ కామోష్ట్య గుణిముచ్యతే

పురుషునితో పోలిస్తే స్త్రీ ఆహారం రెండు రెట్లు తీసుకుంటుంది, తెలివిలో నాలుగు రెట్లు హెచ్చు. సాహసంలో ఆరు రెట్లు, కామం, కోరికలో ఎనిమిది రెట్లూ ఉంటుందిష. అదేంటో కాని ఇన్ని చెప్పినాయన ఏడుపులో చెప్పేరు కాదు కాని, అమ్మో వీరి ఏడుపు మరొకరినిఏడిపిస్తుందండీ. 

శర్మ కాలక్షేపం కబుర్లు- అలకతీరికలిసేదే అందమైన బంధం-2

Posted on అక్టోబర్ 19, 2011
4
అలక తీరికలిసేదే అందమైన బంధం-2
నిన్నటి తరువాయి..…..

నిన్న శ్రీ కృష్ణుడు సృష్టించిన అలక గురించి తెలుసుకున్నాం. దాని పర్యవసానంగా రుక్మిణీ దేవి నేలమీద పడిపోయింది. ఇప్పుడామెను అలక తీర్చడంకోసం అయన చేసినదేమంటే.

అప్పుడు శ్రీకృష్ణుడు రుక్మిణి ఒళ్ళంతా గంధంపూసి, కర్పూరం పలుకులు ఆమె చెవులలో వూది,మెడలో వున్న ముత్యాల హారాలు చిక్కులుతీసి, నుదిటి మీద బొట్టు సరిచేసి, పడిపోయిన నగలు మళ్ళీ పెట్టి, తాటాకువిసినకర్రతో విసిరి, వక్షస్తలం మీద పైటను సరిచేసి, ప్రేమగా కౌగలించుకుని, విడిపోయిన జుట్టుతో జడవేసి, కొప్పుపెట్టి,నెమ్మదిగా పక్క మీదకి చేర్చేడు. ఎంత అవస్తపడ్డాడో చూడండి. పక్కమీద చేర్చిన తరువాత మృదువైన మాటలు చెప్పేడన్నారు పోతనగారు. ఎవరికి ప్రియమైన మాటలు వారు చెప్పుకోవాలి కదా. ఆమాటలు నేను చెప్పనక్కరలేదుకదా. చెబితే బాగోదుకదా! ఇప్పటికాలానికి కొన్ని కొత్తవి చేర్చుకోవచ్చు. పాతవాటిని వదిలేయక్కరలేదు. ప్రయత్నించి చూడండి.( ఉదా:- వారికిష్టమైన పాట పాడండి,వారికి ఇష్టమైన డ్రెస్ వేసుకోండి. ఇష్టమైన వస్తువు తెచ్చి ఇవ్వండి. కోరుకున్న చోటుకు వెళ్ళండి. ఇష్టమైన మాట చెప్పండి.ఇది అనంతం……….ఎదుటివరికి ఇష్టమైనది మీరు చేయండి. ఒక మెట్టు దిగండి……….సంతోషం మీ ఇద్దరి స్వంతం….. వయసుతో సంబంధం లేదు సుమా. ఏ వయసువారికైనా ఇది నిజమే..).. ………అప్పుడు అలక తీరిన రుక్మిణి
నిజంగానే నీవుగుణరహితుడవు,ఎవరికీ ఎరుక లేనివాడివి,నీవెంత గొప్పవాడివో ఎవరికితెలుసు,నిన్ను తెలుసుకోలేకపోతున్నారు అని శ్రీ కృష్ణుణ్ణి పొగిడింది.( చాలా సంక్షిప్తం చేసాను, క్షమించాలి) దానికాయన

అలికులవేణి!నవ్వులకు నాడిన మాటల కింత నీమదిం
గలగగనేల వేటలను గయ్యములన్ రతులందు నొవ్వగా
బలికిన మాటలెగ్గులని పట్టుదురే భవదీయ చిత్తముం
దెలియగగోరి యే బలికితిన్ నిజ పట్టనేటికిన్….శ్రీమహాభాగవతం…దశమస్కంధం…263

కింకలు ముద్దు బల్కులును గెంపు గనుంగవ తియ్యమోవియున్
జంకెలు తేఱిచూపులెకసక్కెములున్ నెలవంక బొమ్మలున్
గొంకక వీడనాడుటలు గూరిమియుం గల కాంత గూడుటల్
అంకిలిలేక జన్మఫల మబ్బుత గాదె కురంగలోచనా!..శ్రీమహాభాగవతం…దసమస్కంధం.265

నవ్వులాటకి అన్నమాటలకి ఇంతబాధపడాలా! దెబ్బలాటలో, వేటలో, రతిలో,పలికేమాటలని నిజమనుకోకు,నీమనసు తెలుసుకోడం కోసం అన్నాను కాని నిజం కాదూ అన్నాడు. మారాంచేయడం, ముద్దుగామట్లాడటం,కోపంనటించడం,మూతివిరవడం,ఎకసక్కేలాడటం వగైరాలన్ని అత్యంత ప్రేమతో వున్న భార్యతో చేసే పనులేకదా అన్నాడు. ఇష్టమైన,దగ్గరైన సతిని చేరుకోవడం జన్మ సాఫల్యంకదా అన్నాడు.ఎన్ని చెప్పేడో చూడండి, మరి నేటి కాలానికి ఇవి ఆన్వయం అవుతాయి, కాకపోతాయా? లేకపోతే కొత్తవి కల్పించుకోవాలి. ఈ రోజు ఈచీరలో చాలా అందంగా వున్నావోయ్/ ఈ రొజు పెళ్ళి కొడుకులా వున్నారు/ నా దిష్టి తగులు తుందేమో/ ఇలాంటి కామెంట్లు అని చూడండి. ఆతరవాత

ఎలమి ఘటింపగా గలసి యీడెల నీడెల మల్లికా లతా
వలి కరవీర జాతి విరవాది వీధుల గమ్మతెమ్మెరల్
పొలయ నవీనవాసముల బొన్నల దిన్నెల బచ్చరచ్చలన్
గొలకులలేగెలంకులను గోరిక లీరికలొత్త గ్రొత్తలై శ్రీభాగవతం..దశమస్కందం…273

ఆరామ భూములందు విహారామల సౌఖ్యలీల నతిమోదముతో
నారామానుజుడుండెను, నారామామణియు దానునభిరామముగన్..శ్రీభాగవతం..దశమస్కందం ….275

మల్లి కరవీర మొదలైన పువ్వుల వీధులలో చల్లగాలిలో,పొన్నలు మొదలైన చెట్ల నీడల్లో పచ్చలు పొదిగిన తిన్నెలమీద,పొదరిళ్ళలో,
కొత్త కొత్త కోరికలతో తోటల్లో విహరించారట. బాగుందా.మనకంత సమయం దొరకకపోవచ్చు, దొరికిన కొద్దిపాటి ఏకాంతంలో ఒక కొంటెచూపు,కనుగీటు, చిరు ముద్దు, చిరు కౌగిలింత,అనుకోని సమయంలో చేసిచూడండి. ఏమిటండీ మరీను/ మరీ చిన్నపిల్లలయిపోతున్నారు/ ఏంటోయ్ విశేషం/ఎవరేనా చూస్తారు/ పిల్లలున్నారు/సాయంత్రం ఎర్లీగా వచ్చేస్తానోయ్/ అనేటటువంటి కామెంట్లు వినపడ్డాయా మీరిద్దరూ జయించినట్లే. ఆ రోజంతా ఇద్దరూ హుషారుగా వుంటారు చూడండి. తీరుబడిగా నిజ కాంతతొ ఒక ప్రణయకలహం తరవాత కలిసిచూడండి…మనసుకి, తనువుకి,ఎంత హాయిగా వుంటుందో… ………. తరవాత చెప్పండి…………

శర్మ కాలక్షేపం కబుర్లు-అలకతీరి కలిసేదే అందమైన బంధం-1

Posted on అక్టోబర్ 18, 2011
అలకతీరి కలిసేదే అందమైన బంధం-౧

అలకతీరి కలిసేదే అందమైన బంధం అని ఒక సినీ కవి చెప్పింది నిజమే.
ఇరవైనాలుగు గంటలూ పని, డబ్బు సంపాదనతో ఖాళీ లేకుండా ఉండి, మొనాటనీతొ విసిగివేసారి పోతున్న వారికోసమే ఇది. తీరిక లేని శ్రీ కృష్ణుడు తీరిక చేసుకుని, తను ఒక చిలిపి కయ్యం రుక్మిణీ దేవితో కల్పించుకుని, ఆమెను సేద తీర్చి అలకతీరిన సతితో చేసిన శృంగార క్రీడ చూద్దామా. అలకతీరి కలిసేదే అందమైన బంధం అని ఎంత చక్కగా మనకిచెప్పేడో చూద్దాము. ఇది మనలాంటి మనుషులకి తెలియాలనే భాగవతంలో చేర్చారు. భాగవతంలో వున్నది కనుక మనకు ఇది ఇహానికి పనికిరాదనుకోరాదు. ఇందులో ఇహ పరాలకి సంబంధిచిన రెండు విషయాలూ వుంటాయి. మనం ప్రస్తుతం ఇహంగురించి అలోచిద్దాము. కావాలనుకుంటే ఈసన్నివేశంలో పరం గురించి విపులంగా చర్చ చేద్దాము తరవాత……కామిగాని మోక్షకామిగాడు…. చిలిపికయ్యం ఎలాప్రారంభించాలో, ఎక్కడ ఆపుచేయాలో,అలక ఎలా తీర్చాలో మనంకూడా నేర్చుకోవాలి. శ్రీకృష్ణుడు చేసినట్లే మనంచెయ్యాలని లేదు. సమయం సందర్భం పట్టి నేటి కాలానికి అనుగుణమైన అలకలు, ఉపచారాలు చేయాలి. భర్తే అలక కల్పించాలని తనే అలక తీర్చలని కూడా కాదు, భార్యా భర్తలలో ఒకరు అలిగితే మరొకరు అలక తీర్చాలి. అదే అందం మరి. ఆ అలక తీరిన తరవాత కలిసే బంధం ఎంత తీయగా, మధురంగా ఉంటుందో అనుభవంలోకిరావాలి మరి. అప్పుడే అందం, ఆనందం, లేక పోతే మనుషులు మరలైపోతారు. సాధారణంగా శ్రీకృష్ణుడు సత్యభామను అలకతీర్చినదే చెప్పుకుంటాం. కాని ఆయన రుక్మిణితో చేసిన శృంగారక్రీడ ఇది. భార్యా భర్తల బంధం మరి కాస్త బిగియాలంటే అలకతీరేకా కలియాలి………

చక్కటి, రమణీయమైన రుక్మిణీదేవి మందిరానికి శ్రీ కృష్ణుడు చేరుకుంటాడు. ఆమె ఆయనకు స్వాగతంచెప్పి ఆసనంమీద కూర్చోపెట్టి వింజామర స్వయంగా వేసి సపర్యలు చేస్తున్న సమయంలో ఆమెకు కోపంతెప్పించడం కోసం, ఏడిపించడంకోసం, చిలిపి కయ్యంకోసం శ్రీ కృష్ణుడు నవ్వుతో ఏమన్నాడంటే ……..

నీ తల్లి తండ్రులు, అన్న శిశుపాలుడికిచ్చి పెళ్ళిచేస్తానన్నా కాదని నన్నువరించేవూ అన్నాడు. అంకిలిసెప్పలేదు చతురంగ బలంబులతోడ……… ఓ పంకజనాభ……..శిశుపాల జరాసుతులన్ జయించి నా వంకకు వచ్చి రాక్షస వివాహమునన్ భవదీయ శౌర్యమే యంకువ చేసి…… చేనిపొమ్ము వచ్చెదన్…. అని కదండి ఉత్తరం రాసింది మరి. మామూలుగా రావడం కుదరదు శిశుపాలుడు జరాసంధులను యుద్ధంలో వోడించి రావాలి. కండిషన్ చాలా పెద్దది. తరవాత నువ్వు రాక్షస వివాహార్ధం తీసుకేళితే వస్తానంది. అంతేకాని నువ్వొచ్చెయ్యి నేనులేచివచ్చేస్తానని అనలేదు. అంతేగాక నువ్వు రాకపోతే వ్రతంగా నూరు జన్మలు నిన్నేతలుచు కుంటూ మరణిస్తానని కూడా బెదిరించిది కదా. ఎన్ని కండిషన్లు పెట్టినా అన్నిటినీ అమలుపరచి రాగలవాడని ఆమెకూ తెలుసు. తగువు సమయంలో దెప్పకుండా యీ సావకాశాన్ని వదులుకుంటాడా…. మామూలుగా అందరిలాంటివాణ్ణికాదు. ఎంచేస్తానో ఎవరికి తెలియదు. బలమైన వాళ్ళు నా శత్రువులు, డబ్బుచూద్దామా లేదు,ఏపనీ చేయని వాడిని, రహస్యంగా ఉండెవాడిని, గుణం లేనివాడిని, బిచ్చగాళ్ళని తప్పించి ఆశ్రయించేవాణ్ణికాదు, అటువంటి నన్నుకోరుకున్నావు. డబ్బు,వంశం, అందం, వున్న సరిసమానమైన వాళ్ళతో వివాహం బాగుంటుంది అన్నాడు. ఇంకా

తగదని యెరుగవు మమ్మున్,దగిలితివిమృగాక్షి!దీన తప్పదు నీకుం
దగిన మనుజేంద్రునొక్కని,దగులుము గుణహీనజనుల దగునేతగులన్.
శ్రీమహాభాగవతం…..దశమస్కందం234

సాళ్వ జరాసంధ చైత్యాది రాజులు చెలగి నిన్ వీక్షింప మలయుచుందు
రది గాక నీ యన్నయు గర్వించి వీర్యమధాంధుడై వెలయుచున్న
వారి గర్వంబులు వారింపగా గోరి చెలువ! నిన్నొడిసి తెచ్చితిగాని
కాంతా తనూజార్ధ కాముకులముగాము కామ మోహాదుల గ్రందుకొనము

వినుముదాశీనులము క్రియా విరహితులము
పూర్ణులము మేము నిత్యాత్మ బుద్ధితోడ
వెలుగుచుందుము గృహదీప విధము మెఱసి
నవలతాతన్వి! మాతోడ నవయవలదు……శ్రీమహాభాగవతం…దశమస్కందం 235

తగనివాణ్ణి ఎన్నుకున్నావు. నీకు తగిన వాణ్ణి కాదని నీకుతెలియదు. గుణంలేనివాడను. నీకుతగినవాణ్ణి ఎవరినేనా చేసుకో నాలాంటివాడెందుకు అన్నాడు.( పెళ్ళయి కాపురం చేస్తున్న భార్యతో, నువ్వు నన్నొదిలేసి మరొకడిని పెళ్ళిచేసుకో అని భర్త అంటె వూరుకుంటుందా? కోపంరాదూ? కోపంరావాలనేకదా శ్రీవారి ప్రయత్నం). సాళ్వ, జరాసంధ, శిశుపాలురు నిన్నుచూడాలని కోరుకుంటూ వుంటారు. వాళ్ళ గర్వం అణచడానికీ, నీఅన్న గర్వంతో విర్రవీగుతున్నందుకూ నిన్ను తీసుకొచ్చాను కాని, నీ మీద మోజుపడి నిన్ను తీసుకురాలేదు సుమా, నీమీద కోరికలేదు, కాముకుణ్ణికాదు, ఏపని చేయనివాణ్ణి అందుచేత నువ్వు తగినవాడిని చూసుకో అన్నాడు. భార్య, అనుకూలవతి, పట్టపురాణిని ఇలా అంటే, ఆవిడబుగ్గమీద చెయ్యేసుకుని ఆశ్చర్యంతో,ముఖం వంచుకుని,కాలిబొటనవేలిచివరతో నేల రాస్తూ,వాడిపోయినపువ్వులా అయిపోయిందిట. ఈమాటలువిన్న రుక్మిణి చెవుల్లో సూదులుతో పొడిచినట్లు,పులి గాండ్రింపువిన్న లేడిలాగా, మరలు వూడిన బంగారపుబొమ్మలాగా, కదలికలులేక నేలమీద పడిపోయిందిట. ఇంక ఇప్పుడు అలక తీర్చిన ఉపాయం రేపు చూద్దాము……..

మిగిలింది రేపు……………………….

శర్మ కాలక్షేపం కబుర్లు- కుక్కకాటుకి చెప్పుదెబ్బ.

శర్మ కాలక్షేపం కబుర్లు- కుక్కకాటుకి చెప్పుదెబ్బ.
Posted on అక్టోబర్ 16, 2011

గమనిక:- ఉత్తరాంధ్ర గ్రామీణ భాష నాకు చాలా ఇష్టం. నిన్నటి పోస్టు అలా రాసాను. అది ఎక్కువ మంది ఇష్టపడినట్లు లేదు. అందుకని కొంత తగ్గించాను.

కుక్కకాటుకి చెప్పుదెబ్బ
సుబ్బరాజు వదిలేసిన పెద్ద పెళ్ళాన్ని తెల్లమొకమేయించేసేడు గందా!, పోషణకి సొమ్ములివ్వనందుకు ఊసలు లెక్కెడ్తన్నాడుగందా. ఆడుజేసిన పని దెలుసా యీమద్దినేతెలిసింది.

సుబ్బరాజు రెండవపెళ్ళానికి ఒక కొడుకు ఇద్దరు కూతుళ్ళుకదా. పెద్ద కూతురికి పెళ్ళి చేసేడు. అల్లుడు అప్పకోడుకే. అప్పకిద్దరు మొగపిల్లలు. అప్ప ఇద్దరు మొగపిల్లలకీ తన ఇద్దరాడపిల్లలనీ ఇచ్చేసి ఊళ్ళో సెంటరులో జాగా పాతికలక్షలదిచ్చి పెళ్ళిల్లు చేయడానికి అప్పతో వొప్పందం పడినాడట. పెద్ద పిల్లకి పెళ్ళి చేసినాడు. పెళ్ళప్పుడు అప్ప వూళ్ళో జాగా పిల్లలపేర్న రాసేయ మందంట. సరే బావని కాయితాలు తయారు సేయించీమను, తనతల్లిముసలమ్మ సేత ఏలిముద్దరేయించేస్తానన్నడట. ఆస్తి ముసల్దాని పేరుమీదుందిగదా. మరి అప్ప సెప్పిందో బావగాడి ఆలోచనోగాని జాగా బావపేర్న కాగితాలు తయారుచేయించినాడు, బావ…… పెల్లికిముంగట ముచ్చట గదా, ఇదేటి బావా ఇలగాచేసినావంటే, జాగా మాఇద్దరు పిల్లలు మీఇద్దరి అమ్మాయిలకే కదా, ఏటయితది ఎవరిపేర్న వుంటేయేటి నా తరవాతాళ్ళది గాదా అన్నాడంట. ఈడు ఎదుర్తిరిగినాడంట, అప్ప కేకేసి ఎవరైనా ఒకిటే ఏలిముద్దరేయించి రిజిస్త్రీషను సేయించు కాదంటే పెళ్ళి కాన్సిల్ అందంట. యీడు తెల్లమొకమేసి ఏలిముద్దరేయించేసినాడు. పెద్ద పిల్లలికి పెల్లిఅయినాది. పెళ్ళైయిన కాడినుంచి, మూడు నిద్దర్ల కాడినుంచి మొగుడికి తెగులుందని సరిగాలేడని పెద్ద పిల్ల చెబుతానేవుంది. యీడు లెక్క పెట్ట లేదు. అల్లుడుకోరోజు పేణం మీదకొచ్చినాది. లగెత్తుకుని ఆస్పటాలికి దీసుకుపోనారు. వాళ్ళు నాలుగురోజులుంచీసుకుని పిల్లడికి టెస్టులుజేఇంచి గుండికాయిలో బొక్కడిపోనదనిచెప్పీసినారంట. హైదరాబాదు ఆస్పటాల్లో ఎట్టీసి వైద్యంచేయించినారు. తెల్లకార్డున్నాదిగాదా దానిమీద పెద్ద అస్పటాల్లో జేర్చీసినారు. ఆపరేసను రాజశేఖర్రెడ్డి పధకంలో చేయించినారు. కుర్రోడు తిరిగొచ్చీడు. సుకంగాలేడు. రోజూ గొడవలే. వీడి అల్లుడు ఆర్నెల్లుతిరిగేసరికి చనిపోయాడు. సరే గుంట ఆడికి ముండ మోసింది. ఇది జూసిన సిన్న పిల్ల సిన్న కుర్రోణ్ణి చేసుకోనంది. తగువొచ్చీసినాది. చిన్న గుంటకి ఏరుపాటుగా సంబందం జూసినారు. సిన్న గుంటకి లగ్గం జేసినారు. యీడెల్లి అప్ప కాడ కూకుండి కల్ల నీల్లెట్టుకోని జాగా పిల్లలికి తిరిగి రాసిచ్చీమన్నడు. అప్ప అనువూ మినువూ చెప్పలేదు. బావ మాట్లాడినాడుగాదంట. యీడికేటి సెయ్యాల్నో బోదపడలేదంట. అప్పకాడికి తిరిగితిరిగి విసుగువచ్చినాదంట. సరిదిపని గాదని పెద్దమడుసులుకి సెప్పినాడంట. ఆళ్ళు ముందుగాలా ఒకలా సెప్పినారు. ఆణ్ణి కాకేసి అడుగుతామన్నారు. తర్వాతేటైనదో తెల్దు. పెద్దమడుసులాణ్ణి పిలలేదు. అడగలేదు. ఈలోగా బావగాడీ జాగా ఆడి కూతురికి రాసినాడు. అదీడికి తెల్దు. తర్వాత తెలిసింది. ఇక జాగా మల్లీ తిరిగొచ్చీ ఆస పోనాది. అప్ప బావ అనువూ మినువూ సెప్పటంలేదు. పెద్దమడుసులు పలకకున్నరు. వీడి మతిపోనాది. దిక్కులాపడలేదు. ఏటిచేసిదిరా బగమంతుడా అనుకుంటన్నాడు. ఒక రోజు చిన్నల్లుడొచ్చీసి, యీర్నాయుడు టేసనులో యస్.ఐ గా వచ్చినాడని చెప్పెల్లిపోనాడు. యీర్నాయుడు సిన్నల్లుడికి సుట్టం.

ఒకరోజు మద్దినేళ పెద్దగుంట అత్తగారింటికెల్లినాది. తమ్ముడు గుంటణ్ణి కూడా తీసుకెల్లినాది. అత్తోరోళ్ళు కంగారుపడినారు. వచ్చిన గుంటకి మంచినీల్లిచ్చినారు. అయి తాగి పిల్ల ఇరుసుకు పడిపోనాది. తమ్ముడు గుంటడు 108 కి ఫోన్ జేసినాడు. ఆళ్ళోచ్చి తాలూకా ఆస్పటాలుకి దీసుకుపోనారు. అక్కడ జేర్సినారు. డాక్టరుకి సొమ్ములిచ్చీసినారు, డాక్టరు కేసు మోపైపోనాదని సెప్పినాడు. పిల్లప్రాణంకి నమ్మకంలేదని చెప్పినాడు.. పోలీసులు కేసు కట్టేత్తమన్నరు. ఏటయినాదంటే, పిల్ల అత్తోరింటికెల్లినాది అత్తవారేదో తాగటానికిచ్చినారు. పిల్ల ఇరుసుకు పడిపోనాది, ఇసమని అనుమానమన్నారు. ఏమిచ్చినారో మరి, ఇచ్చినారు పిల్లని చంపీడానికేసిన పతకం అని, అప్ప బావ మీద సుబ్బరాజు కంప్లైంటు ఇచ్చినాడు. సంగతిజెప్పినారు. యీర్నాయుడు బావని అప్పని టేసన్లోఏసినాడు. కేసు కట్టడానికి సిద్దపడిపోనాడు. బావకి అప్పకి విరోసనాలయి పోనాయి. కాళ్ళ బేరాని కొచ్చీసినారు. వెంటనే జాగా పిల్లలపేర్న రిజిస్ట్రిసను సేయించడానికి, నష్ట పరిహారంగా రెండు లచ్చలివాడానికి ,
వీడు పోలీసు కేసు కామాప్ సేసుకోడానికి ఒప్పన్నాలయిపోనాయి. యీర్నాయుడు మద్దెరికం జేసినాడు. మర్నాడు కాగితాలు తెప్పిచ్చి అప్ప కూతురు చేత మల్లి ఈడి పిల్లలిఇద్దరికీ రాయించినారు. ఒప్పణ్ణం ప్రకారం పిల్లని ఆస్పటాలు కాడనుంచి దెచ్చీసినారు. కేసు కామాప్ చేసినారు. యీర్నాయుడుకి కట్నాలిచ్చుకున్నారు…. మల్లీ పెద్దపిల్లకి మారుమనువు జేసినాడు. తన సొమ్ము కోసం ఇంతజేసినోడు కాని, తన కిష్టంలేదని ఎంగిలిసేసి ఒగ్గీసిన పెద్దపెల్లానికి గెంజినీళ్ళ సుక్కలొయ్యడానికి బదులు ఏటీలేదని కటకటాల్లో లోపలకూకుండినాడు. సూడుమీ! పంతులుగోరూ ఇసిత్రం.

శర్మ కాలక్షేపం కబుర్లు-కురుపుసుబ్బరాజు ఇద్దరుపెల్లాలు

Posted on అక్టోబర్ 15, 2011
కురుపు సుబ్బ రాజు ఇద్దరు పెల్లాలు.

ఈవేళ ఉదయం నడకలో సత్తిబాబు కలిసేడు. సుబ్బరాజు కనపడటంలేదేమన్నాను. ఎవుళు! మన కురుపు సుబ్బరాజా ఆణ్ణి మొన్నటిఓరం లోపలేసేరు అన్నాడు. అదే మని ………..అడగపోతూవుంటే.. ఆగమని చెయ్యి వూపి.గుక్క తిప్పుకుని నన్ను కూచోపెట్టి మొదలెట్టేడు. సత్తిబాబుకి కురుపు తగ్గించినప్పటినుంచి సుబ్బరాజు, కురుపు సుబ్బరాజుగా మారిపోయాడు, మా సత్తిబాబుకి.

సుబ్బరాజుకిద్దరు పెళ్ళాలు,ఆసెర్యపోకండి. ఈడు సిన్నపుడు సదూకునేతప్పుడు ఎర్రగుర్రంలాంటి మేస్టరమ్మని గోకీవోడు. అదీడి బాబుకి తెలిసీసరికి యీడు మంచి వూపుమీదున్నడు మేస్టరమ్మతో. ఈడి బాబుకి కంగారొస్సింది. జాయిగా మేస్ట్రమ్మని దూరం పంపిచెస్సి యీడికో నల్లగుర్రంలాటి గుంటన్దెచ్చి పెల్లిచేశ్శేడు. యీడు పెల్లయిన కొత్తలో నల్లగుర్రాన్ని కూడా కొతకాలం తోలీడు. ఎర్రగుర్రం నల్లగుర్రాల బేరీజులో నల్లగుర్రం ఓడిపోయింది. మల్లీ ఈడు ఎర్రగుర్రం కాడికి సేరుకునేతలికి ఈడి బాబు యీణ్ణి బతిమాలి బామాలి దీసుకొస్సి ఇంటికాడెట్టేడు. యీడి సదుం సంకనాకి పోయింది. యీడిబాబుకి బయం బట్టుకుంది. లేకర్ని బిల్చి ఉన్న ఆస్తులన్నీ తన పెల్లంపేర అమిడ తదనంతరం యీడి పిల్లలకని యీలునామా రాస్సేడు. కొద్ది రోజుల్లోనే సెల్లిపోయాడు. మనోడు రాజైపోయీడు. ఎర్రగుర్రం లాటి కొత్త గుర్రాని ఎర్రి గొర్రి దొరికితే తెచ్చీసుకున్నడు.. నల్లగుర్రాని తన్ని తగిలీసేడు. ఆ ఎర్రిగొర్రి ఏడుస్తాపోయింది. అంతె దాన్సంగతి ఈడు మరిసిపోనాడు. అదీ మరిసిపోయింది. మల్లీ ఏటినేకుండా బతికేస్తంది. ముప్పయేల్లు గడిసినయి. యీడు ఎర్రగుర్రం లాటి ఎర్రిగొర్రిని దెచ్చుకుని దాన్తో కులుకతా కుటమానం జేస్తన్నడు. దీనికి ఇద్దరు బొట్టిలు ఒక బొట్టిడూ.

ఏటయిందో మరి నల్లగుర్రం మూడేల్లకితం డావా చేసిందంట. యీడు కోరట్లంట తిరుగుతున్నడు. ఆర్నెల్లకితం తీరుపొస్సీనాదంట. తీర్పుకి ముందు నల్లగుర్రాని కుటమానానికొచ్చీమన్నాడంట. ఇద్దెలిసి ఎర్రగుర్రం సయితిన్దెస్తే సస్తానందంట. నల్లగుర్రం చెస్! పొమ్మన్నాదంట. యీణ్ణి నెలకి 2500 డావా జేస్సినకాడినుంచి ఇమ్మని తీర్పిస్సేరంట. ఇకముందు నెలనెలా 2500 ఇచ్చీమన్నారంట. ఈడు నాకాడేటి ఉన్నాది అని కాల్లు సాపీసేడు. నిజమే! నువ్వూ నేనూ సూత్తన్న మేడాడిదిగాదు!. పాతికి లచ్చలెట్టి కట్టిన కొత్త బిల్డింగాడిదిగాదు! ఉళ్ళో వున్న రెండున్నర కోట్ల కరీదైన జాగా అడిదిగాదు!. బీట్లో వున్న నాలుగెకరాల పొలమాడిదిగాదు!. నిజమే ఆడికాడేటీ లేదు. అదే కోర్టికీ సెప్పేడు. ఎనకమాల ఎర్రగుర్రం అన్నగారు నల్లగుర్రంతో మాట్లడీస్సినాడు. తెగ్గోటీసుకో అని సలా ఇచ్చినాడు. నల్లగుర్రం తలూపీస్సి మొత్తం డావా నిమిత్తం మూడు లచ్చలిమ్మంది. ఇదీడికిసెబితే మొత్తం లచ్చిస్తాను పల్లకోమన్నాడు. పల్లకోనంది. సరె నీ ఇష్టం జేస్సుకో మన్నాడు. నేనేటి ఇవ్వలేనంటె నల్ల గుర్రం పిటీసనేసినాదంట. ఈడి కాడ సాల వున్నయ్ లేవంతన్నాడని. కాని దానికితెల్దు ఇయ్యన్నీ ఈడి పేరలేవని. ఈడిపేరనేమీ లేదని కోర్టు ఒప్పీసుకుంది. డబ్బుగట్టలేననీస్తే ఆణ్ణి లోపలేసెయ్యమన్నారు రెణ్ణెల్లు. రెణ్ణెల్ల తరవాత ఇంకాలోపలేస్సీయ్యాలంతే నల్లగుర్రం సొమ్ములుగట్టుకుంతే ఆణ్ణిలొపలంచుతారంట. ఎర్రగుర్రంఅంటంది ఈడు పొగులూ రేత్రీ కూడా తాగేస్తన్నాడు, యీడు నాకు పొగులూరేత్రీ కూడా ఉపయోగం లేదు. కొత్తలో ఎదో సేరీ వోడు, వుప్పుడు రేత్రిళ్ళు కుమ్మిందీలేదు అందంట. యీణ్ణిలోపలేస్సేమందంట. అలాగేనా ఈడు తాగటం మానీస్తడని దానూసు. ఈణ్ణిలోపలీస్సేరు. రెణ్ణెల్లకి బయటికోస్తే మల్లీ నల్లగుర్రం పిటిసను యెట్టుకుంటే మల్లీ అది యిసారణాకొచ్చి ఈణ్ణి సొమ్ములుకట్టమంటె మల్లీ కత మామూలే. నల్లగుర్రం ఎర్రిగొర్రికి నెత్తిని దీపమే. దానికిద్దెలీక పాపం యాష్ట పడతంది. ఈడి పేర్సెప్పి దానికి కరుసే. పాపంకదా అన్నాను. పాపం! ముప్పయేళ్ళేటిసేసిందీ, అదేచేస్సుకోమన్నాడయ్యా!సుబ్బరాజు. పెళ్ళిచేసుకుని కాపరం చేసేడుకదా నల్లగా వుండటం ఆవిడపాపమా అన్నాను. అదాడిష్టం మనమేటి సేత్తం అన్నాడు మా సత్తిబాబు. పాపం నల్లగుర్రం తెల్లమొకమేసింది. సుబ్బరాజుకొడుకు గుంటడు మొన్న రేతిరికాడో గుంటని దెచ్చి మేడమీద నాలుగో అంతస్తులో బాబు గదిలో ఎట్టుకు కులికీడంట,ఇద్దెలుసా అన్నాడు. నేను తెల్లమొకమేసేను.

శర్మ కాలక్షేపం కబుర్లు-రాజులసొమ్ము రాళ్ళ పాలు-మనసొమ్ము కాంట్రాక్టర్ల పాలు.

Posted on అక్టోబర్ 13, 2011
రాజులసొమ్ము రాళ్ళపాలు-మనసొమ్ము కాంట్రాక్టర్లపాలు

రాజులసొమ్ము రాళ్ళపాలని పాతసామెత. కాని నేటి కాలానికి దాన్ని సరిచేసుకుని రాజుల సొమ్ము రాళ్ళపాలు మన సొమ్ము కాంట్రాక్టర్లపాలు అను కోవాల్సి వస్తూవుంది.

ఆధార్ కార్డు మీద మాకు ముచ్చటగొలిపే అనుభవం కలిగింది. చిన్నబ్బాయి ఫారాలు తెచ్చేడు. నింపేము. వాటిని పట్టుకెళ్ళి ఎక్కడో ఇచ్చి వచ్చాడు. సరే మనలని పిలుస్తామని పేపరులో రాస్తున్నారు. మీకు సమయంచెప్పి అప్పుడు రమ్మంటాము మీరు వచ్చి వరుసలలో నిలబడి బాధ పడక్కరలేదని పేపర్లో ఊదరకొడితే సరేననుకుని పిలుపుకోసం ఎదురు చూస్తూవుండగా ఒక రోజు మూడు గంటల సమయంలో చిన్నబ్బాయి వచ్చి మనం అధార్ కార్దు కోసం వెళ్ళాలని చెబితే ఇంటికి తాళం వేసుకుని పరిగెట్టేము. తీరా అక్కడ కొల్లేటి చాంతాడంత వరస వుంది. ఇదేమిరా, పెద్దబ్బాయి మా వూళ్ళో ఐతే వెంటనే చేఇంచుతానని చెప్పి కాగితాలు పట్టుకెళ్ళి, అక్కడ నేనే ఈవిషయం చూస్తున్నాను రమ్మంటే ఇక్కడయి పోతుంది వద్దని చెప్పేము ఇదేమిరా అనుకుంటూ కూర్చున్నాము. ఆరయైంది. వరస తరగటం లేదు. ఏమిటి విషయం అని కనుక్కుంటే రెండు మిషనులు మీద ఇద్దరు ఆపరేటర్లు రికార్డు చేసుకోవాలి. మాదగ్గర యీ పనంతా ఒక కాంట్రాకటరికిచ్చారు. అతను మరొకరికిచ్చాడు.ఆపరేటరు ఒకరే వున్నారు అందుకు ఆలస్యం అవుతూవుందని తేలింది. సరే నెమ్మదిగా లోపలికి దూరేను. లోపల నానా భీభస్థముగ ఉన్నట్లు అనిపించిది. ఒక ఫాను పనిచేస్తూ ఉంది. ఆపరేటరికి తప్పించి మిగతా వారంతా చెమటలు కారుకుంటూ ఉన్నారు.ఉక్కపోత బ్రహ్మాడంగా వుంది. ఆపరేటరు దగ్గరికి వెళ్ళి నేను కంప్యూటరు మీద పని చేయగలను నీవు చేస్తున్నది చూసాను నేను చేయగలను సాయంచేయనా అన్నాను. అయ్యా మీ సాయం తీసుకోలేను కారణం ఈవివరాలు రికార్డు చేసిన వారి వేలి ముద్ర కూడా వేయాలన్నాడు. సరే దగ్గర కూర్చుని అతని కి కావలసిన సహయం చేస్తూ వుంటే మా వంతు వచ్చేటప్పటికి రాత్రి ఎనిమిదిన్నర అయినది.చిన్న పిల్ల ఈమధ్యలో నిద్రకి పడి చెమటతో గోల పెడితే బయటకు తీసుకు పోయి చిన్న కోడలు చలా అవస్త పడింది. బతుకుజీవుడా అని బయటపడి ఇంటికి చేరుకున్నాము. అక్కడ మాటల సందర్భముగా ఈరోజునుంచి నెల తరవాత మీ కార్దు తాలూకు వివరాలు నెట్ లో చూడచ్చని అతను చెబితే నెల తర్వాత కాదు ఈరొజు నాటికీ ముచ్చటగా రికార్ద్ నాట్ ఫౌండ్ అని చక్కటి వార్త కనపడుతో వుంది. మరి మా బతుకు ఆధరమో నిరాధారమో తెలియలేదు. ఇంతకష్టపడితే ఈ కార్డ్ ఉపయోగం శూన్యం. పాపం మా మంత్రిగారొకరు ఆధార్ కార్డ్ ద్వారగా మాత్రమే గేసు పంపిణీ చేస్తామనేటప్పటికి మాకు చెమటలు పట్టేయి. ప్రజలు గోలచేస్తేదయ తలచి శ్రీవారు మరి రెండు రోజులలో కార్డులందరికి ఇచ్చిన తరవాతనుంచి అమలుచేస్తామని చేప్పేరు. బతుకు జీవుడా అనుకున్నాము. ఇదండి మాగోడు.

భారత ప్రభుత్వంలో రెండు శాఖల మధ్య ఆధార్ కార్డుమీద చర్చ జరుగుతున్నట్లు వార్త. ఇదేమిటీ విషయాలన్నీ అలోచించిన తరవాత కదా నీలేకనీ గార్ని నియమించి దీన్ని నడిపిస్తున్నది. మరిప్పుడేమైందో తెలీదు. ఆధార్ కార్డులు ఇవ్వడం ఆపేస్తారని వార్తలున్నయి. ఏది నిజమో తెలీదు. అసలు ఎందుకివ్వాలనుకున్నారు. మరి ఎందుకు ఆపేస్తున్నారు. దీనికైన ఖర్చు బూడిదలో పోసిన పన్నీరా? దొంగ కార్డులిస్తునారని వార్త. పనిచేసిన కాంట్రాక్టరుకి డబ్బులివ్వలేదంట. అతను పని ఆపేశాడు,మా దగ్గర. మళ్ళీ తంటాలుపడి పని మొదలు పెట్టించారు.ఇప్పటికీ,ఐదు నెలల తరవాత కూడా వెబ్ సైటులో వివరాలుతో సంప్రదిస్తే అపాచీ సరిపోటంలేదని కబురు కనపడుతోంది. ఇదండీ సంగతి.మా కురుపు సుబ్బరాజు వస్తై కంగారెందుకూ అన్నాడు.మా సత్తిబాబునడిగితే ఏమయ్యా పంతులుగోరు సావడాని సిద్దంగున్నవు నీకెందుకయ్యా యీ గోల యములోడు నిన్నక్కడ అధార్ కార్ద్ అడగడులే అన్నాడు.

ఐదేళ్ళ తరవాత ఇప్పటికి ఆధార్ రాలేదన్నవాళ్ళు కనపడుతూనే ఉన్నారు. అసలు ఇది ఎప్పటికీ ఆగిపోని కథ అన్న సంగతి ప్రభుత్వం ఇప్పటికేనా గుర్తించిందా అన్నదే అనుమానం.

శర్మ కాలక్షేపంకబుర్లు-నెత్తురుగెడ్డ.

Posted on అక్టోబర్ 12, 2011
నెత్తురు గెడ్డ

ఉదయంనడకలో రోజూకలిసే సత్తిబాబు చాలారోజులుగా కనపడటంలేదు, ఈ రొజు కలిసేరు. ఈ మధ్య కనపడటంలేదు ఆరోగ్యం ఎలావుందన్నాను. నడకయ్యాకా స్కూలు అరుగుమీద కూలబడ్డాం. ఆయనిలా చెప్పడంమొదలెట్టేడు.

ఈ మద్యనోరోజు నేను స్నానంచేసి వస్తూవుంటే మా ఆవిడ నిలబెట్టి ఏంటీ వెనకాల కురుపేసినట్లుంది చెప్పలేదేమంది. ఏదో బొడిపిలా వుంది నొప్పిలేదు సలుపులేదు అందుకు చెప్పలేదన్నాను. డాక్టరు దగ్గరికి వెళ్దామంది. సరే అన్నా! అదుగో ఇదుగో అంటూ పదిహేను రోజులు తోసుకుపోయింది. కురుపు చూసినప్పటినుంచి ఆముదంపిండికట్టు, వెలిబూడిద ఆముదం, కలబంద వగైరా, ఆవిడకి తెలిసిన వైద్యాలు చేస్తూనేవుంది. గెడ్డ పెరగలేదు అణగలేదు. ఒకరోజావిడ బలవంతం చేసి డాక్టరు దగ్గరికి తీసుకెళ్ళింది. డాక్టరుగారు చూసి ఇది నెత్తురుగడ్డలా వుంది. శంఖచక్రాలున్నాయి కదా టెస్టులు చేయించమన్నారు. రిపోర్టులొచ్చాయి. సుగరు,బి.పి అదుపులోనేవున్నాయి. తగ్గిపోతుంది మందులురాస్తాను వాడమన్నారు. వారం పది, పదిహేనురోజులు,నెల మందులు వాడినా గెడ్డ పెరగలేదు, తరగలేదు. ఓరి!నాయనోయ్ ఇదేదో పెద్ద సమస్య అయ్యేలా వుందని మా ఇంటావిడ మా చిన్నాడికి చెబితే పట్నంలో తనకి తెలిసిన డాక్టరు దగ్గరికి తీసుకెళ్ళేడు. మళ్ళీ అన్ని టెస్టులూ చేయించమన్నారు. మొన్ననేకదా అన్ని టెస్టులూ చేయించామన్నాను. లేదు మళ్ళీ చేయించమన్నారు. మాచిన్నోడు నాన్నా మళ్ళీ చేయించాలి, నువ్వూరుకో, నీకేంతెలీదన్నాడు. సరే మళ్ళీ టెస్టులన్నీ చేయించారు. రిపోర్టులు చూసి డాక్టరుగారు అన్నీ అదుపులోనే వున్నాయి, మీరేవో మందులుకూడా వాడామన్నారు అంటూ మీరు కాసేపు బయట కూచోమన్నారు. కుర్రోడితో మాటాడేరట. ఎందుకేనా మంచిది మరో టెస్టు చేయిద్దామన్నారు డాక్టరుగారు, అన్జెప్పి ఒక ఇంజెక్షను చేసారు. ముక్క దీసారట,తెలీలేదు. చిన్న పుండు పడింది. ముక్క పైకి పంపుతాము, టెస్ట్ రిపోర్ట్ వస్తుంది ప్రస్తుతానికి మందులు వాడండనిరాసారు. ఎంతయిందిరా అన్నా, ఎంతయితే నీకెందుకు అన్నాడు. మందులు చీటీ పుచ్చేసుకున్నా. మందులు కొంటాను చీటీ ఇమ్మన్నాడు చిన్నోడు. మనూళ్ళో దొరుకుతాయి అక్కడదీసుకుందామని వచ్చేసేము. నాకు చిరాకొచ్చింది. మొత్తం మందులు మానేసాను. డెబ్బయి ఏళ్ళు దాటాయి ఈరోజో రేపో పోతాము, కాని ఇతరులను బాధ పెట్టకుండా, మనం బాధపడకుండా పోవాలని నా కోరిక. మా ఆవిడ ఒకటే గోల. మందులేసుకోటం లేదు అదేమవుతుందో నని బెంగ. కంగారు పడిపోకు మరేమి భయంలేదు, నేనిప్పుడప్పుడేపోను అన్నాను. దానికావిడ అన్నీ ఎరకతరక పనులే అని ముక్కు చీదింది. ఒకరోజు సుబ్బరాజు కనపడ్డాడు. మాటల్లో ఇలాగుందయ్యా అన్నాను. ఓ పన్జెయ్యి! పెంకుముక్క అరగదీసి పట్టెయ్యమన్నాడు. ఇటువంటివి చాలా చేసేము., పోనీ ఇదీ చేద్దామని చూస్తే పెంకుముక్క దొరకలేదు. ఎక్కడ చూసినా డాబాలేకదా మరి. ఊరంతా వెతికితే ఒకచోట బంగాళా పెంకుముక్క దొరికింది. అదితెచ్చి అరగదీసి పట్టు వదలకూండా వేసేము. నాలుగురోజులికి కురుపు కొద్దిగా పెరిగింది. సరే ఇది సుబ్బరాజుతో చెబితే గంధపుచెక్కుందా అన్నాడు. ఉందన్నాను. అదిరగదీసి రోజూ మూడుపూటలా తాగమన్నాడు. సరే అదీమొదలెట్టేను. వారంతిరిగేటప్పటికి కురుపు మెత్తపడింది, ఎలా వుందో చూస్తుంటే ఓరోజు టపక్కన చితికి ఆవిడ చేతినిండా రక్తం పడింది. కొద్దిగా నొక్కితే పలుకొచ్చేసింది. పుండు పడింది. మందులేస్తే పుండు నెమ్మదిగాతగ్గింది. ఇదీ సంగతి. మావోడు మళ్ళీ పెద్ద డాక్టరు దగ్గరకెళితే ఏదో అన్నాడట. మరీడు పూర్తిగా చెప్పలేదు. చిన్నోడితో రిపోర్టు వచ్చిందా, డాక్టరేమన్నాడంటే తగ్గిపోయిందిగా అన్నాడు. ప్రతీది సిటకావైద్యాలతో తగ్గుద్దని అనను కాని గోటితో పోయేది గొడ్డాలి దాకా పోతందే అని. మన బతుకులు బాగోలేవయ్యా అన్నాడు. పళ్ళు తింటే మనకి ఈ బాధలుండవన్నాను, మంచి పళ్ళు ఆపిలువగైరా నవనవలాడుతూ కనపడుతున్నాయి మార్కెటులో అన్నా, నాకేదో పెద్ద తెలిసినట్లు.

ఆయనన్నాడు, మా సత్తిబాబుకి ఆవేశం వస్తే భాష మారిపోతుంది లెండి. ఓరి పిచ్చి పంతులుగోరూ! పళ్ళా. అంతకన్న ఇసం మేలు. నవనవలడుతూ మెరుస్తున్నయి ఇసం రాసినియ్యి. మనంతినే ప్రతీది కల్తీయే. బియ్యంలో పురుగుమందు అవశేషాలు, అదేదో మొనోక్రోటొఫాస్ అంట, అదొద్దుబాబోయ్ అని కేరళా వాళ్ళు నెత్తీనోరూ మొత్తుకుంటున్నా, మనప్రజలు వద్దంటున్నా, మన పెద్దోళ్ళు యింటం లేదంట. దాని మూలంగా రైతులకి సంతానం కలగటం లేదంట. పుట్టిన పిల్లలుకూడా అవకరాలతో పుడుతన్నారంట. పడమటోళ్ళు ఎప్పుడో మానేసిన ఇసాన్ని ఇంకా పురుగుమందుగా వాడుతన్నారు మనదేశంలో, అరటి పండు మీద బాట్రీ, దాని పేరు నాకురాదు. ఆపిలు,దానిమ్మ మీద ఫార్మాలిన్ అంట అది, మామిడి పండుమీద బాట్రీ, పుచ్చకాయ ఎర్రగా కనపడటానికి ఇంజెక్షను,పళ్ళుకూడ కల్తీయేనయ్యా!. ద్రాక్ష మీద పైన తెల్లగా ఆపడతది ఏటనుకుంటన్నావ్. పురుగుమందు, నిలవకి కొట్టిన మందు. మామిడిపండు, ఆపిలు, దానిమ్మలమీద రాసే ఫార్మాలిన్ని శవాలు కుళ్ళిపోకుండా నిలవుంచడానికి వాడతారంట. ఇటువంటివి తింటే కేన్సర్లు రావూ. మీకిద్దెలుసా! పాలల్లో కూడా కల్తీ, నీళ్ళలో కల్తీ, పప్పు, టీ పొడి, కాఫీ, ఏటి ఇంటన్నారా అయ్యా! అన్నీ కల్తీ.అన్నీ కల్తీ. చివరాఖరికి తల్లి పాలుకూడా కల్తీ. మరయితే ప్రభుత్వం………… ఆగండి ఆగండి ఏటన్నారూ…………. ప్రభుత్వమా అదొక బెమ్మ పదార్ధం…………………………..ఉందోలేదోతెలియదు, కనపడదు…….ఉన్నవాళ్ళు…………. ఆగండి ఆళ్ళకి మీగోలా నాగోలా పట్టేలా లేదు. ఏ టెండరులో కమిసను ఎంతొస్తది, ఎక్కడేటి చేస్తే ఎన్నోట్లు పడతయి! ఏ కురిసీ మంచిది డబ్బులు దండుకోడానికి, ఎవుడి కురిసీ లాగెయ్యాల, ఎవుడు మనకురిసీ లాగెయాటానికి రెడిగున్నోడు, ఇదాలోసనకే టైము సరిపోటంలేదు.. నీగోల, నాగోల,ఎవడింటాడయ్యా…….ముసిలోళ్ళం…………….ముచ్చటలాడతంటే టైముదెలీలేదు. వస్తా…….లెగు….. అనిలేచాడు.,ఇద్దరం చెరొకదారి పట్టేం.

శర్మ కాలక్షేపం కబుర్లు-అద్దె గర్భాలు.

Posted on అక్టోబర్ 11, 2011
నిన్నటిదాని తరువాయి
అద్దె గర్భాలు.

3………కాలం గడచింది……..పాండురాజుకి సంతానంలేదు.భార్యని కలిస్తే చనిపోతావని శాపం ఉంది…………..ఇప్పుడు పాండురాజుకి సంతానం కుంతిద్వారా కలగాలి……………… ………………………….

“…………..కావున నీవుమాయందుననుగ్రహంబుననపత్యంబు వడయుమనినం కుంతిం జూచి పాండురాజు ధర్మ్యంబయిన యొక్క పురాణ కధ జెప్పెద దొల్లిస్త్రీలు పురుషులచేతననావృతలయి స్వతంత్రవృత్తి నఖిలప్రాణిసాధారణం బైనధర్మంబుననందమతమవర్ణంబులయందు ఋతుకాలంబు దప్పక నియతానియతపురుషలయి ప్రవర్తిల్లుచున్న నుద్దాలకుండనునొక్కమహాముని భార్యనతిసాధ్వినధికతపోనిధియైన శ్వేతకేతుతల్లి ఋతుమతియైనదానినొక్కవ్రుద్ధవిప్రుం దతిధియైవచ్చిపుత్రార్ధంబు గామించిన శ్వేతకేతుండలిగి ఇదిధర్మవిరుద్ధంబని దాని సహింపక
ఇదియాదిగా సతులెన్నండు బరపురుషార్ధినుల్ గ జనదన్యపురుష
సంగమంబునజేసి సకలపాతకములు,నగు బరిరహభూతలయిన సతుల
కిట్టిది మర్యాద మానవులకు,దద్దయౌ హితముగా ధర్మమూర్తి
యజ్జభవసమానుడగు శ్వేతకేతుండు,నిలిపె నదియు ధారుణీజనంబు
నందు లోక పూజయమైప్రవర్తిల్లుచు,నుండె శిష్టసంప్రయుక్తిజేసి.
మరియు దిర్యగ్యోనులయందును నుత్తరకురుదేశంబునందును మొదలింటిధర్మంబ యిప్పుడుం బ్రవర్తిల్లుచుండునట్లు మనుషులయందు శ్వేతకేతుండుసేసిన ధర్మ స్థితికారణంబున నాటంగోలె”…(.ఆది పర్వం..పంచమాశ్వాసం…భారతం….86)

మొదటికాలంలో స్త్రీలు నియమిత అనియమిత పురుషులందు బిడ్డలను కనేవారు. ఈ సందర్భంలో శ్వేతకేతు అనేరాజు తల్లిని ఒక వృద్ధుడు పుత్రుని కొరకు సంగమంకోరగా శ్వేతకేతువు కోపించి ఇక ముందు స్త్రీలకి పరపురుష సంగమం లేకుండా శాసనం చేసాడు. అంటే పెద్దవారి దగ్గరికి సమస్య వచ్చినపుడుమాత్రమే దాని మంచిచెడ్డల ఆలోచనవస్తుంది. అప్పటికి ఇప్పటికి ఇది ఇంతే. అయితే దీనికి కొంత సడలింపుకూడా కొన్ని ప్రాంతాలకి ఇచ్చేడు. అంటె స్త్రీ ఇష్టంతో నిమిత్తం లేకుండా సంతానార్ధం పరపురుష సంగమం కూడదు. అయితే భార్య భర్తలకి సంతానం లేనపుడు భర్త అనుమతితో భార్య సంతానం కొరకు పరపురుష సంగమం చేయవచ్చు,అని అప్పటికే ఉన్న ఆచారాన్ని మాత్రం మార్చలేదు. అప్పటినుంచి అది అలాగే వుంది.

అని పాండురాజు కుంతిని అన్యపురుషుల ద్వారా తనకు సంతానం కనమనీ ఒప్పించడానికి ప్రయత్నం చేస్తూ కొనసాగింపుగా భర్త చెప్పినవిధంగా చేయడం భార్య కర్తవ్యమని ఆవిధంగా చేసిన పూర్వ చరిత్రలో మదయంతి అనే ఆమె భర్తయిన కల్మషాపాదుని చేత నియోగింపబడి వశిష్టునివలన అశ్మకుడనే పుత్రుని కన్నది చెబుతూ మేముపుట్టిందికూడా ఇలాగేకదా అని చెప్పి ఆమెను పరపురుషుని ద్వార తనకు సంతానం కలగచేయమని కోరివొప్పించుతాడు….కాల క్రమేణా ఈ ఆచారం చచ్చిపోయింది.

ఇప్పుడు విషయాన్ని పరీలన చేద్దాము.
కాలంగడిచిన తరువాత శ్వేతకేతుమహారాజు మొదటిఆచారం రద్దు చేసాడు. రద్దు చేయబడిన ఆచారానికి కొన్ని ప్రాంతీయ సడలింపులు ఉన్నాయి.రెండవ ఆచారంఅమలులోవుంది.
కాలం గడచింది
3.భర్త మరణించిన అంబిక అంబాలికల ఇష్టా అయిష్టా లతో పనిలేకుండా భర్తలేనివారియందు వంశాభివృద్ధి చేసారు. ఇక్కడకూడా సరొగేటెడ్ ఫాదర్ కి పిల్లలపై హక్కులేదు.

4. భర్త అనుమతితో కుంతి పాండవులను కంటుంది.
ఈమధ్య భారతప్రభుత్వంవారు సరొగేటెడ్ మదర్స్ గురించి చట్టం చేయాలని ఆలోచిస్తున్నట్లు వార్తలున్నాయి. పడమటిదేశాల స్త్రీలు పురిటినొప్పులు భరించి బిడ్డలనుకనడం ఇష్టపడకపోటంమూలంగా,మరి ఇతర కారణాల మూలంగా,బిడ్డలకోసం వారిప్పుడు తూర్పుదేశాలపై పడ్డారు. through Artificial insemination భారత స్త్రీలను వారి గర్భాలను అద్దెకుతీసుకోవాలనే తలంపుతో ఈ పని జరుగుతోవుంది. చాలా కాలంగా చనిపోయిన ఆచారాన్ని డబ్బుతో ముడిపెట్టి అమలు చేయపూనడం దారుణం.

శర్మ కాలక్షేపంకబుర్లు-గుడ్డివాడైన భర్తను పుత్రులచే గంగలో తోయించిన ఇల్లాలు-Surrogated mothers

Posted on అక్టోబర్ 10, 2011
గుడ్డివాడైన భర్తను పుత్రులచే గంగలో తోయించిన ఇల్లాలు

దీర్ఘతముడు=గుడ్డివాడు.దీర్ఘమైన తమము అనగా చీకటికలవాడు అనగా గుడ్డివాడు.

గర్భిణిఅయిన యుతద్యుడనే ముని భార్య మమతను దేవరన్యాయంగా బృహస్పతి సంతతికోసం సంగమం కోరుతాడు. గర్భస్థుడైన బాలకుడిది అన్యాయమని ఎదిరిస్తాడు. దానికి కోపించిన బృహస్పతి సర్వజీవులకు ఇష్టమైన సంగమాన్ని వ్యతిరేకించినందులకు గర్భస్తుడైన బాలుడిని గుడ్డివాడివి కమ్మని శపిస్తాడు. దీర్ఘతముడు అనగా గుడ్డివాడుగా పుట్టి మామతేయుడు అనే పేరుతో వేదం చదువుకుని బహుకాలం తరువాత ప్రద్వేషిణి అను ఆమెను వివాహం చేసుకుని ఆమెయందు గౌతముడు మొదలుగా చాలా మంది పుత్రులను కంటాడు. ఒకనాడు గుడ్డివాడు నన్ను ఎందుకు మెచ్చుకోవని భార్యను అడుగుతాడు.దానికామె

” పతియు భరించు గావున భర్తయయ్యె
భామ భరియింపబడు గాన భార్య యయ్యె
బరగ నవి మనయందు విడ్వడియె నిన్ను
నేన యెల్లకాలము భరియింతుగాన” ……………….శ్రీమహా భారతం…ఆది పర్వం.226.

భరించేవాడు భర్త భరింపపడెది భార్య మనవిషయంలో ఇవితేడాగా వున్నాయి, నిన్ను నేను యెల్లకాలమూ భరిస్తున్నాను గనక అని. ఎల్లకాలమూ నిన్ను భరించలేనుకనక ఎక్కడికైన పొమ్మని చెప్పింది. అందుకా గుడ్డివాడు కోపించి ఇక ముందు స్త్రీలు పతిని కోల్పోతే ఎంత ధనవంతురాలయినా మాంగల్యము, అలంకారములు లేకుండా శాపం ఇచ్చాడు. దానికామె కోపించి ఈ ముసలాణ్ణి ఎక్కడేనా విడిచి రమ్మని పుత్రులకు చెప్పింది. ………. “అని శాపంబిచ్చిన దీర్ఘతమునకు నలిగి ప్రద్వేషిణి ఇమ్ముదుకని నెటయేనియుం గొనిపొండని తన కొడుకులంబంచిన వారును నయ్యౌతధ్యు నతివృద్ధు జాత్యంధు నింధనములతోబంధించి మోహాంధులయి గంగలో విడచిన నమ్మునియును బ్రవాహవేగంబులున పెక్కుదేశబులుగడచి చనియె నంతనొక్కనాడు బలియను రాజు గంగాభిషేకార్ధంబు వచ్చినవాడయ్యింధనబంధంబునుండియు నుదాత్తానుదాత్తస్వరితప్రచయభేదంబులేర్పడ సలక్షణంబుగా వేదంబులం జదువుచు దరంగఘట్టనంబునందనయున్నదరిజేరవచ్చిన వాని దీరంబుచేర్చిఇందనబంధమ్ములువిడిచి……….” శ్రీ మహాభారతం……ఆదిపర్వం 229.

పుత్రులు తండ్రిని కట్టెలతోకట్టి గంగలో తోసేశారు. గుడ్డివాడు గంగాప్రవాహ వేగంలో కొట్టుకుపోతున్నాడు., ఒకరోజు గంగలో కొట్టుకుపోతూ సుస్వరంతో వేదం చదువుతున్న గుడ్డివాణ్ణి దరికి చేర్చి ఒకరు తనను బలి అనే రాజుగా పరిచయం చేసుకుని ఎక్కడనుంచి వస్తున్నారని అడిగి తెలుసుకుని, తన సౌధనికి తీసుకెళ్ళి, నాకు పుత్రులులేరు, పుత్రదానం చేయమని భార్య సుదేష్ణను పంపించితే ఆమె ముసలివాడని ఏవగించుకుని తనదాసి కూతుర్ని పంపించింది. ఆమెకు గుడ్డివాడు పదకొండు మంది పుత్రులను కలగచేస్తాడు. రాజు వీళ్ళంతా తనభార్య పుత్రులేననుకుంటూవుంటే కాదని నిజం చెబుతాడు. అప్పుడు మళ్ళీ సుదేష్ణను పంపితే ఆమె అంగములన్నీ తడవి నీకు గొప్పవాడైన కొడుకు పుడతాడని అనుగ్రహించగా అంగరాజను రాజర్షి పుడతాడు……………………………………

. ఇది ఒక పూర్వ చరిత్రగా భీష్ముడు తల్లియైన సత్యవతికి, అంబిక, అంబాలికలకు ఈప్రకారంగా బిడ్డలు కలగవచ్చునని చెప్పే సందర్భములోనిది. బృహస్పతి మమతను సరొగెటెడ్ మదర్ గా అడిగిన కాలంలో ,అప్పటి ఆచారం ప్రకారం మమత ఆమె భర్త ఇష్టాఅయిష్టాలతో పని లేక మమత సరొగెటెడ్ మదర్ కావలసిన పరిస్థితి. దీనిని గుడ్డివాడు ఎదుర్కొని శాపం పాలయ్యడు. ఐతే తన జీవిత కాలంలోనే తాను వ్యతిరేకించిన దానిని మరియొక రూపంలో తానే అమలు చేసి దాసియందు మరియు మహరాణి సుదేష్ణ యందు బిడ్డలని కంటాడు. రెండవ సందర్భంలో కూడా స్త్రీలయొక్క ఇష్టాఅయిష్టాలతో పనిలేదు. పరపురుషునితో రమించి తనభార్య బిడ్డలను కనడానికి భర్తైన రాజు బలి ఒప్పుకుకున్నాడు. మొదటిదానిలొ భార్యా భర్తల ఇద్దరి ఇష్టాఅయిష్టాలతో పని లేదు. అంటే ఒక తరం మారేటప్పటికి కొంత మార్పు వచ్చింది. అదే ప్రకారంగా అంబిక, అంబాలికలయందు వ్యాసుడు పుత్రులను కంటాడు. వారే ధృతరాష్ట్రుడు, పాండురాజు. మొదటి సందర్భంలో సరోగేటెడ్ మదర్ కి బిడ్డపై హక్కు లేదు. అల్లాగే రెండవ సందర్భంలో సరొగేటెడ్ ఫాదర్కి బిడ్డ పై హక్కులేదు. ఇంకావుంది…..రేపుమిగతా…కరంటులేదుమరి…………………………….