శర్మ కాలక్షేపం కబుర్లు- సర్వేద్రియాణాం……..

Posted on నవంబర్ 18, 2011
2
సర్వేంద్రియాణాం……….

సర్వేంద్రియాణాం నయనం ప్రధానం అన్నారు….పృదివ్యాపస్తేజోవాయురాకాశాత్ పంచ భూతాలు,……… శబ్ద,స్పర్శ,రూప,రస,గంధాలు గుణాలు,……..చెవి,చర్మం,కన్ను,నాలుక,ముక్కు ఇవి పంచేంద్రియాలు. అంటే మనం ఈ పంచభూతాలకి సంబంధిచినవాళ్ళమే. వీటినుంచి వేరు కాదు. ఇందులో ఎటునుంచి చూచినా మూడవది కన్ను. కన్నులేకపోతే కలియుగంలేదని అంటారు. అంటే ఒక రకంగా చూసే దృష్టికోణం నుంచి విషయం అర్ధమవుతుందన్న మాట. అంటె అన్నిటికీ ముఖ్యమైనది మనసు. ఇది నిర్మలంగా, నిశ్చలంగా వుంటే అన్నీ బాగానే వూంటాయి….. ఏమిటో….ఎందులోంచి ఎందులోకో వెళ్ళిపోతున్నాను…..మనం చూపుగురించికదా మాట్లాడుకుంటున్నాము….

చూపులు కలిసిన శుభవేళా……. ఇది ప్రేమికుల చూపు. ముందుచూపు, వెనక చూపు, పక్క చూపు, పైచూపు, నేల చూపు ఇవి దిక్కులకి సంబంధిచినవి కాని అర్ధాలు వేరు. బెదురుచూపు, దొంగచూపు, కొంటె చూపు, కొరకొర చూపు, అరచూపు,ఎదురుచూపు,కడకంటి చూపు,వాలుచూపు,కోరచూపు,…………………………..ఇవికాక దిక్కులు చూడటం చూపుకి సంబంధించినదే , కాని వీటన్నిటికి అర్ధాలుమాత్రం వేరు… అదీ తెలుగు భాష గొప్పతనం…. మరే పశ్చిమదేశాల భాషలలో ఇన్ని వున్నాయని అనుకోను…. ఆఖరికి వాళ్ళకి బంధువులను చెప్పుకోడానికి కూడా పేర్లు లేవు. కోడలని చెపితే కొడుకు భార్య అని మనకి అర్ధం వెంటనే తెలుస్తుంది….. కాని దానికి ఇంగ్లీషువాళ్ళు డాటర్ ఇన్ లా అన్నారు. ఇప్పుడు మనవాళ్ళూ అలాగే చెబుతున్నారు, కొడుకు భార్య అని. అంటే తిన్నగా ఒక మాటలో భావం వ్యక్తం చేయలేని భాష గొప్పదా? ఇంతకంటే దారుణం వియ్యపురాలు, వియ్యంకుడు అన్న మాటలకి మనకి వేరుగా చెప్పకరలేదు. కాని వాళ్ళ భాషలో వీటికి సమానార్ధకాలు లేవే. పరిశీలించండి…….దారి తప్పేము….. ఎక్కడున్నాము… చూపులు దగ్గరకదా……..జీవితాన్ని మలుపుతిప్పేవి పెళ్ళిచూపులు. ఒక క్షణం చూసి మన జీవిత గమనాన్ని నిర్ణయం చేసుకుంటాము…. ఎంత విచిత్రం……..ఒక మనిషి మరొకరికి జీవితకాలంలో అర్ధంకారే! మరి జీవిత సహచరుడు/ సహచరిని కొన్ని క్షణాలలోచూసి ఇష్టపడటం దైవ లిఖితం……

అరచూపు,కడగంటిచూపు, వాలుచూపు,కొంటె చూపు,కోరచూపు,ఎదురుచూపు…………..ఇవ్వన్నీ ప్రేమికుల సొత్తు, మరీ చివరిదైతే వారికి ఎంతో ఇష్టం. వీటిని అనుభవించాలి తప్పించి చెప్పడంతప్పు. అందరికి ఎప్పుడో ఒకప్పుడు అనుభవంలోకి వస్తాయి. ముందుచూపు లేక పోతే జీవితంలో కష్టాలే! రేపు కావలసిన వాటిగురించి ఈ రోజు చూసుకోవడం ముందుచూపు. మనని మనం మరిచిపోయి ప్రవర్తించడం వెనకచూపులేకపోవడం. ఇక పక్కచూపులు, పైచూపులు చూడటం మనకు కాని దానిని అనుభవవించడం కోసం చేసే ప్రయత్నం. దీనివల్ల కష్టాలే తప్పించి సుఖాలుండవు. తప్పు చేసి దొరికిపోతే నేలచూపులే గతి. సాధారణంగా షేరు మార్కెట్ సెన్సెక్స్ నేలచూపులు చూసినపుడు చాలా మందికి గుండె వేగం పెరిగిపోతుంది. ఎదురుచూపులు అందరికి అనుభవమే. లంకకి వెళ్ళిన ఆంజనేయుడు తిరిగివస్తూ దిగబోయే ముందు సింహనాదం చేస్తాడు. దానితో పని పూర్తిచేసుకుని వస్తున్నాడన్నది పెద్దలికి అర్ధమైనది. కింద కాలు పెడుతూనే అతృతగా ఎదురు చూస్తున్నవాళ్ళకి దృష్ట్వా సీతా అన్నాడు..క్రియాపదంతో వాక్యం మొదలుపెట్టేడు. అది ఆయన గొప్పతనం. మన తిరుపతి అంజిబాబుకి ఎన్నిసార్లు డిల్లీ వెళ్ళివచ్చినా పదవి కోసం ఎదురుచూపే……..ముహూర్తం కోసం ఎదురుచూపు……… నేటిరోజులలో అన్నిటికీ ఎదురుచూపే. ఇంటి గేస్ దగ్గరనుంచి కడుపు పండటం దాకా! రైలు రాకనుంచి ప్రాణం పోకదాకా! దొంగచూపులు చూడటం ప్రేమికులకి మంచిదికాని ఇతరులకి ప్రమాదమే. ఏమీ చేయలేనప్పుడు చేసేది దిక్కులు చూడటం……..

ప్రకటనలు

శర్మ కాలక్షేపం కబుర్లు- జరిగితే…………

Posted on నవంబర్ 17, 2011
4
జరిగితే…….
జరిగితే జ్వరమంత సుఖం లేదని పాత సామెత. నిజమేనా…. చూసే దృష్టి కోణం బట్టి వుంటుందేమో మరి….

ఈ మధ్య బుర్రగుంజు తిన్న దగ్గరనుంచి దగ్గు, జ్వరం పీడిస్తూనే వున్నాయి. ఓ పూట తినడం ఓ పూట పస్తు. వద్దు బాబోయ్! అంటే కుదరదని బలవంతపు భోజనం. అది సహించి చచ్చేనా! రెండు మెతుకులు తినడం ముసుగు పెట్టుకు పడుకోడం . మళ్ళి జ్వరం రావడం . ఇది మామూలైపోయింది. సరే ఇది పని కాదని నేను రెండు రోజులనుంచి అంగుళం పొడుగు మాత్రలు మిగడం మానేసి మిరియాల కషాయం పెట్టించుకుని రెండు పూటలా తాగి,మిరియాల పాలు తాగి, వద్దంటున్నా వినకుండా లంఘనం చేసి, నీటి ఆవిరి పడుతోంటే,అయ్యో మరిచిపోయానండీ అంటూ, ఇంటిలో వాము, ముద్దహారతికర్పూరం,కొబ్బరినూనితో కాచిన కర్పూరతైలం నా గుండెలు,వీపుమీద రాసింది. ఒక అరగంటలో,ఊపిరి తిత్తులు ఖాళీ అయి, ముక్కు ఎండిపోయి, హాయిగా వూపిరి పీల్చుకున్నాను. పగటి నిద్ర పోవడం కాకుండా కూచుని వుండటం చేయడం మూలంగా, రాత్రి నిద్ర పట్టి, మర్నాడు మధ్యాహ్నం కరివేపాకు కారప్పొడితో, మిరియాల చారుతో కరకరా ఆకలేస్తుండగా భోజనం బలే రుచిగా వుంది. . కరక్కాయ తేనితో అరగదీసి మూడుపూటలా నాకితే దగ్గు కంట్రోల్ కి వచ్చింది. నా జలుబు, జ్వరం వార్త ఖండ ఖండాంతరాలకి చేరిపోయింది.

ఈ సందర్భంగా జరుగుతున్న విషయాలు చూస్తే పాత సామెత నిజమే!. ఎక్కడికీ వెళ్ళి ఏ పనీ చేసుకురానక్కర లేదు. శ్రీమతి గారు అరగంటకొకసారి వచ్చి చూసి ఎలావున్నారని పలకరించి రెండు నిమిషాలు దగ్గరకూచుని పలకరించి ఆవిడపనిలోకి వెళ్ళిపోతూవుంది, బుర్రగుంజుతిని జ్వరం తెచ్చుకున్నావని సణగడం మానేసింది. చిన్న కోడలు అరగంటకి ఒకసారివచ్చి ఏమికావాలో అడిగి వెళ్తూవుంది, వచ్చే ఫోన్లు తెచ్చిస్తూవుంది. చిన్న మనవరాలు బళ్ళోకి వెళ్ళే ముందు తరవాత వచ్చి కూచుని కబుర్లు చెబుతోంది. ఒక మనవరాలు ఖండాంతరం నుంచి రెండు అంతర్జాల ఉత్తరాలు రాసింది, జాగ్రత్తలు చెబుతూ. ఒక మనవరాలు హైదరాబాదు నుంచి మాట్లాడుతూ ముని మనవరాలిని తీసుకొచ్చేస్తున్నానని చెప్పింది. రాకు తల్లీ!. నేను బాగానే వున్ననని చెప్పి ఒప్పించేటప్పటికి తల ప్రాణం తోకకి వచ్చింది. మరొక డాక్టర్ మనవరాలు రోగ లక్షణాలడిగి మందుల చీటి అంతర్జాలంలో పంపేసింది. మరొక మనవరాలు తాతా! ఎలావున్నావని పొద్దుట సాయంత్రం అడుగుతూనే వుంది. పెద్ద కోడలు, అబ్బాయి, మనవడు మొన్న వచ్చి చూసి వెళ్ళేరు. మనవడు ఆశీర్వదించమని దణ్ణంపెట్టేడు, మామ్మ తాతలిద్దరికీ, తరవాత చెప్పేడు లేప్ టాప్ కావాలని. కొనుక్కోమని బ్లాంకు చెక్కివపోతే వద్దు తరవాత తీసుకుంటానన్నాడు. ఏమిరా! అంటే తాతా నువ్వు బ్లాంకు చెక్కిచ్చావనుకో నేను ఎక్కువ రాసుకోలేను. అదే నువ్వు ఇచ్చేదయితే నేను అడిగినదానికంటే ఎక్కువిస్తావన్నాడు. ఆరి భడవా! ఎన్ని తెలివితేటలొచ్చాయని ఆశ్చర్యపోయాము. పాపం కూతుళ్ళు అల్లుళ్ళు పలకరించారు. చిన్నబ్బాయి సరేసరి పొద్దుట, మద్యాహ్నం, సాయంత్రం పలకరిస్తూనే వున్నాడు. అన్నయ్యగారబ్బాయి బాబయ్యా! ఈ కార్తీక మాసం నిస్సారంగా వెళ్ళిపోతూవుంది, అందుకు ఆదివారం ఏకాదశ రుద్రాభిషేకం పెట్టేను, నువ్వు పిన్ని తప్పకరావాలి. గెట్ వెల్ సూన్ అన్నాడు. అన్నయ్య ఫోన్ చేసి జలుబు చేసిందిట ఆదివారం రుద్రాభిషేకం నువ్వూ మరదలేనా తప్పక రావాలి అన్నాడు. జరిగితే జ్వరం కంటే సుఖం వుందా?

శర్మ కాలక్షేపం కబుర్లు-వైరాగ్యం

Posted on నవంబర్ 16, 2011
2
వైరాగ్యం.

స్థూలంగా వైరాగ్యం అంటే ఏవిషయం మీద ఎక్కువ ఆసక్తి చూపించకపోవడం. ఇది సంసారం కావచ్చు. డబ్బు కావచ్చు ఐహిక మైన ఏదేని కావచ్చు. సాధారణ మానవులకు ఇది కొద్దిగా అందుబాటులో లేనిదే. ఐతే మన జీవితంలో అప్పుడపుడు ఏదో ఒక వైరాగ్యం మనల్ని పలకరించి కొద్ది రోజులు సందడి చేయడం చూస్తూ వుంటాము. వీటినే పురాణ వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం అని మనవాళ్ళు సరదాగా చెప్పేరు.
ఇందులో మూడవదైన ప్రసూతి వైరాగ్యం మనలని జీవితంలో మొదట పలకరిస్తుంది, యవ్వనంలో. పెళ్ళి తరవాత బిడ్డలు కావాలనుకోవడం, కలగకపోతే దేవుళ్ళకి మొక్కడం మనకి కొత్త కాదు. స్త్రీ తన ప్రాణం పణంగా పెట్టి బిడ్డకు జన్మనిస్తుంది. ప్రసవ సమయంలో కలిగే బాధకి స్త్రీ ,పురుషులిద్దరు తప్పు చేసినవారిలా భావించి ఇక ముందు సంసారమే చేయకూడదని నిర్ణయం తీసుకుంటారు. తల్లీ బిడ్డా క్షేమంగా వుంటారు. మూడవనెల గడుస్తుంది. బిడ్డ ఉక్కా ఉంగా అంటూ వుంటుంది. ఆ తల్లి తండ్రులకు గాంధర్వ గానం విన్నంత ఆనందం కలుగుతుంది. బిడ్డకి ఐదవనెల వస్తుంది తాత, అత్త అంటూ వుంటుంది. బిడ్డ తల్లి తన భర్తకి ఫోన్ చేసి బిడ్డ నాన్న అంటున్నాడు మీరు రాలేదు, చూడలేదు అంటుంది. ఖాళీ లేక రాలేకపోయానోయ్!. డాక్టరేమన్నారు, అంటాడు. డాక్టరుగారు, నేను బాగానే వున్నాననిఅన్నారు అంటుంది భార్య. సరే వీలు చూసుకుని వస్తాను, లేక నువ్వొచ్చెయ్యకూడదా అంటాడు. మంచి చూసి పంపించమని మీరు అడగాలి కదా మా వాళ్ళని అంటుంది. ఆరోజు సాయంత్రానికే పెళ్ళాం ముందు వుంటాడు. బిడ్డని చూడటానికి వచ్చేనంటాడు. కధ మామూలే. నిర్ణయం అటకెక్కేసింది. అందుకే మనవాళ్ళు దీన్ని ప్రసూతి వైరాగ్యం అన్నారు.

తరవాతి కాలంలో మనని పలకరించేది శ్మశాన వైరాగ్యం. నలభై వయసు దాటిన తరవాత ఏదో ఒక కారణానికి శ్మశానానికి వెళ్ళవలసి వస్తుంది. అపుడు, కొద్దికాలం జీవితం మీద ఒక రకపు విరక్తి భావం ఏర్పడుతుంది. కాలం గడిచినకొద్దీ ఇది మరుగున పడిపోతుంది. అందుకే దీన్ని శ్మశాన వైరాగ్యం అన్నారు.
మూడవది పురాణ వైరాగ్యం. ఇది సాధారణంగా వయసు జారిన తరవాత వచ్చేదే. పురాణానికి వెళితే సాధారణంగా జీవితం నీటి బుడగలాటిదని, జీవించిఉన్నపుడె మంచి పనులు చేసి మన సంచి సద్దుకోవాలని, చేసిన తప్పులకి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని చెబుతారు. తప్పు దారిని పడద్దు, శేష జీవితం భగవంతుని ధ్యాన, అనుష్టానాలలో గడపమంటారు. ఇప్పటిదాకా దేవుడున్నాడా? అనే అలోచనలో గడిపేశాము, సమయం ఎంతవుందో తెలియదు. గుళ్ళూ గోపురాలూ తిరిగొద్దామంటే శరీరం సహకరించదు. ఎంతో కొంత కష్టపడి కొన్ని గుళ్ళు గోపురాలు తిరిగొచ్చిన తరవాత, ఏ కోడలో దుబారా ఖర్చు చేస్తోందని భార్య చెబుతుంది. ఇద్దరి వైరాగ్యం గాలికి ఎగిరిపోతుంది.

ఈ మధ్య మా వీధిలో ఒకతను ఇంట్లో వాళ్ళమీద కోపగించి, చెప్పకుండా ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. వెళ్ళేటపుడు తన బీరువా తాళాలు అన్నీ పట్టుకుని మరీ వెళ్ళేడు!. ఇంట్లో వాళ్ళు అతని కోసం వెతుక్కున్నారు, అందరి బంధువుల ఇళ్ళ దగ్గరా అడిగేరు. ఎక్కడికీ రాలేదంటే, పోలీసులకి చెబితే వివరాలన్నీ విన్న యస్.ఐ నా ప్రయత్నం చేస్తాను, మీరు మీప్రయత్నం చేయండని చెబుతూ, ఆశ్రమాలున్న వూళ్ళ పోలిస్ స్టేషన్లకి విషయం, వివరం చెప్పి సదరు వ్యక్తి ఆచూకి తెలుపమన్నాడు. ఒక గంటలో ఒక వూరినుంచి, అక్కడ, ఈ వ్యక్తి వున్నట్లు తెలిసింది. మరునాడు వుదయం వీళ్ళు, తగువుకు కారణమైనవారిని తీసుకుని పోయి అక్కడ స్వామి గారి, కోపగించిపోయిన వ్యక్తి కాళ్ళ మీద పడేసి తప్పువొప్పించారు. స్వామిగారు నాయనా! నీ తలపండింది కాని తలపు పండలేదు! తలపు పండేకా వద్దువుగాని అని చెప్పగా, ఇంటికి బలవంతం మీద తీసుకొచ్చారు. ఈయన ఇంటికి తిరిగొచ్చిన తరవాత కూడా ఆస్థిపాస్థులు పంపకాలేసేసి కాశీ పోతానని కొద్దిరోజులు, వీలునామా రాస్తానని కొద్ది రోజులు , నా దగ్గరకొచ్చి నా బుర్ర తిని తరవాత ఆ విషయమే మరిచి సంపాదనలో, సొమ్ము కూడపెట్టడం లో ములిగిపోయాడు. విచిత్రమేమంటే వైరాగ్యం కాషాయం కట్టుకున్నంతలో, ఆశ్రమాలలో చేరినంతలో రాదు. తలలు బోడులైన తలపులు బోడులా! …. రాగ స్వరూప పాశాఢ్యా క్రోధాకారాంకుశోజ్వలా… కుమారీ! నిన్న నీకిచ్చిన చెక్కు, ప్రామిసరీ నోటు మీ ఆయనకిచ్చి చెక్కు బాంకులో వేసి ఈ వేళ కేష్ ని క్రెడిట్ చేయించమని బేంకులో చెప్పమని చెప్పు. ఆ నోటు పట్టుకెళ్ళి సుబ్బారావు దగ్గర రెండు లక్షలు అసలు, వడ్డీ ఇస్తాడు తెమ్మను. వీడసలే బద్దకం మనిషి. జాగ్రత్తగా లెక్కెట్టి తెమ్మని చెప్పు…… మనోరూపేక్షు కోదండా పంచతన్మాత్ర సాయికా… ఇలా సాగుతోంది మన పూజ. సంసారంలో వుండి కూడా వైరాగ్యం అవలంబించవచ్చునని తెలుసుకోరు, ఆచరించరు. అందుకే వైరాగ్యం అంటే చులకనైపోయింది.

శర్మ కాలక్షేపం కబుర్లు-చిరుతిళ్ళు

Posted on నవంబర్ 13, 2011
8
చిరుతిళ్ళు

నిన్న మధ్యాహ్నం భోజనంచేసిన తరవాత ఉయ్యాలలొ కూచుని కునుకు తీస్తుండగా డబ్బాల చప్పుడయింది. ఏమిటా అని లేచి బయటికెళ్ళి చూస్తే శ్రీమతి ఒక సిమెంటు సంచినిండా ఏవో వేసి మూతి కడుతోంది. ఏమిటన్నాను. ఇవన్నీ మనం వాడేసిన బాపతు వాటి ఖాళీ డబ్బాలంది. ఏవి చూడనీ అని చూస్తే అవన్ని రోజూ,మనవరాలు,ఆవిడ, నేను, అబ్బాయి, కోడలు వాడిన బలవర్ధక ఆహారాల తాలూకు డబ్బాలు. బిస్కట్ల డబ్బాలు కనపడ్డాయి. నేనొ క్షణం ఆగి ఇవన్ని ఎంతకాలం నుంచి జాగర్త పెట్టేవన్నాను. ఇవా! బహుశః రెండు సంవత్సరాలవి అయివుంటాయంది. ఏంటి! ఇవన్ని మనం వాడినవా అని అశ్చర్యపోయాను. ఎండుకలా ఆశ్చర్య పోతారు. ఇందులో మీరు తాగేవి కొన్ని, నేను తాగేవి కొన్ని, మనమిద్దరం తాగేవి కొన్ని, మనవరాలు తాగేవి, తినే బిస్కట్ల డబ్బాలు కొన్ని, అబ్బాయి, కోడలు వాడేవి కొన్ని, వాళ్ళు విడి విడిగా వాడేవి కొన్ని. అన్నీ కలిపితే ఇన్ని అయ్యాయి అంది. అలాఅని మరొక మూట తీసింది. ఇదేమిటన్నాను. ఇవా సీసాలు. ఏమి సీసాలన్నాను. మనం వాడిన మందులు, తాగిన టానిక్కుల ఖాళీ సీసాలుఅంది. చూస్తే ఆమె చెప్పింది నిజమే.వీటిని ఏమిచేస్తావన్నాను. ఎవరికి అక్కరలేదు. పాతసామానుల వాడుకొనడు. చెత్త బండిలో పడేస్తోంటే వాడు గోల పెడుతున్నాడు. ఏమిచెయ్యాలో తోచక మూట కట్టి పెడుతున్నా అంది.

నాకో అనుమానమొచ్చింది. మనం ఇన్ని రోజూ తాగి తినికూడా ఇలా వున్నాము, మరి మనవాళ్ళు ఏమితిని అంత బలంగా ఉండేవారు! మన వాళ్ళు తిన్నవన్ని ఇంట్లొ తయారు చెసినవె తప్పించి ఇప్పటిలాగాను బజారులో తెచ్చినవి కావు. వాళ్ళేమీ తినేవారు చూదామని ఆలోచించగా పిల్లలు, పెద్దలూ,అటుకులు, పాలకాయలు, మురుకులు, బెల్లపు వుండలు,కజ్జి కాయలు, పూత రేకులు, వేరుశనగ పప్పుతో చెసిన బెల్లపు వుండలు,జంతికలు,వెన్న జున్ను వగైరా వగైరా తినేవారు. వీటితో పాటు ఆయా కాలాలలొ వచ్చిన పళ్ళు కూడ సమృద్ధిగా తినేవారు. కష్టపడిపనిచేసేవారు,పెద్దలు. తోటలు దొడ్లలో పరుగులెట్టి, చెట్లెక్కి పుట్టలెక్కి, హాయిగా ఆడుకునేవారు, చదువుకునేవారు,పిల్లలు… సాధారణంగా ఎవరికి వైద్యుని అవసరం వుండెది కాదు. ఎక్కడొ ప్రత్యేక పరిస్తితులలో తప్ప. పైచెప్పిన, తినేవాటికి అదనంగా కందికాయలు, మొక్కజొన్నపొత్తులు, తేగలు, బుర్రగుంజు, కొబ్బరిపువ్వు, చెరుకు కర్రలు, చెరుకుపానకం, వూచబియ్యం, ఆవిరి కుడుము, దిబ్బ రొట్టి,తినేవారు, తేని పానకం, గోకుడువుండలు, పాకుడు బెల్లం, వగైరాలు తప్పించి ఇన్ని డబ్బాల మందులు టానిక్కులు తాగలేదు. వాళ్ళు తక్కువలొ తక్కువ గా ఎనబై, తొంభై, వంద సంవత్సరాలు జీవించి, మరొకరి ప్రమేయం లేకుండా పనులు చేస్తూ అందరి కావలసిన సాయం చేస్తూ వుండెవారు. వంద కేజిల బస్తా అవలీలగా ఎత్తేవారు. నేను నామటుకు ఏభైకేజిల బరువుగల బియ్యపుమూట మూడు అంతస్థులు పైకి చేర్చుకునేవాడిని, ఎవరూ దొరకని పరిస్థితులలో. ఇప్పుడో! నాలు మెట్లెక్కితె ఆయాసం, నాలుగడుగులెస్తే నీరసం. పాత సామెత తింటే అయాసం,తినకపొతే నీరసం లా వుంది పరిస్థితి. ఆఖరికి తినేపద్ధతులు కూడా మరిచిపోతున్నారేమో అనిపిస్తుంది. కిందటి సంవత్సరం వేసవిలో ఒక స్నేహితుడు చిన్న వయసువాడు నన్ను చూడటానికి పని కట్టుకు వచ్చాడు. నాకు చాలా సంతోషమైనది. భోజనం చేస్తుండగా కొత్తపల్లి కొబ్బరి మామిడి పండ్లు వేసారు, మా దొడ్డిలో చెట్టువి, మేము కావు వేసుకున్నవి. అతను పండు తినకుండా వదిలేసాడు. ఏమన్నాను. మొహమాట పడ్డాడు చెప్పడానికి. బలవంతం మీద చెప్పేడు. కోసిన ముక్క తప్పించి పండు ఇలా తినడం చేతకాదన్నాడు. తినడానికి ప్రయత్నం చెయ్యి అదేవస్తుందంటే, రసం మీద పడిపోతుందని భయపడ్డాడు. కాదంటే బలవంతం మీద,ఎలా తినాలో చెప్పగా, కష్టపడి తిన్నాడు. ఇక ముందు ఇలా తినడానికి ప్రయత్నం చేస్తానన్నాడు. ఇప్పటి దాకా ఇటువంటివి తినాలంటే రసం పిండుకుని తాగుతారట వాళ్ళ ఇంటిలో. మన ఆచారవ్యవహారలలో మళ్ళీ మార్పువస్తుందా! ఒకవేళ మనం ఇవన్నీ వద్దు ఎదైనా ఇంట్లొ చేసుకున్నవి వాడదామంటే ముసలాయనికి డబ్బులు ఖర్చు అయిపొతున్నాయని అనుకుంటారేమొనని భయం. చేయడానికి మాత్రం ఎవరికి ఖాళీ వుంది! ఈ చక్రం నుంచి విడుదల లేదా! ఇదింతేనా. కాదు మళ్ళీ మార్పు వస్తుంది. కొంచం వోపిక పట్టాలి. ఒక్క సంగతి చెబుతా! మనం బయటనుంచి జంక్ ఫుడ్ తెచ్చుకుని తినేకంటే మన పాత కాలపు చిరుతిళ్ళు నిలవ వుండేవి తింటే బలానికి బలం, మనదైనది తిన్నామన్న తృప్తి వుంటాయి. మొన్న ఒక పోస్టుకి కామెంటు రాస్తూ ఒక మిత్రులు తేగలని విదేశాలకి ఎగుమతి గురించి అలోచిస్తానన్నారు. ఆలోచన చాల నిజమైనది. ఇప్పటి కాలం మనదే. తూరుపు దేశాలదే నేటి రోజు. ఇవిఅన్నీ పట్నవాసాలలో దొరకవని అనకండి. మీరు తింటామంటే తెచ్చేందుకు వ్యాపారం చేసుకునేందుకు యువత సిద్ధంగానేవుంది, పల్లెలలో. మీరు కావాలి అని అడగడం మొదలు పెడితే తెచ్చేవాళ్ళు దొరుకుతారు. శ్నాక్సుకి బదులు అటుకులు తిని చూడండి. కష్టంగా వుంటే కాసిని, పొడి అటుకులు,బెల్లం ముక్క పట్టుకు పోయి తినేముందు కాసిని నీళ్ళుపోసి బెల్లం ముక్క పడేసుకుని తిని చూడండి.ఐదునిమిషాలలో మీ టిఫిన్ రెడీ.. తేడా మీకే తెలుస్తుంది. మనసుంటే మార్గం వుంది. మీకు ఆరోగ్యం పల్లె యువతకి జీవనాధారం.

శర్మ కాలక్షేపం కబుర్లు-ఆశాజీవులు

Posted on నవంబర్ 12, 2011
2
ఆశాజీవులు

ఈ మధ్య చలి మూలంగా, ఒంట్లో బాగోని మూలంగా ఉదయం నడక అటకఎక్కేసింది. మా సత్తిబాబు నేనేమైపోయానో అని చూడటానికి వచ్చాడు. ఏమిటి విశేషాలన్నాను. కరంటు
వుదయం నుంచి నిరఘాటంగా కన్ను కూడా మలపకుండా ఉంది చూసారా అన్నాడు.. ఏమిటి వింతా అని ఆశ్చర్యపోయేలోగా తెలిసిందేమంటే పక్కఊరు మంత్రిగారొచ్చారట. అబ్బ! బావుందే మంత్రిగారు వూళ్ళొ రోజూ వుంటే ఎంతబాగుంటుందీ అనుకున్నాము.మా పక్క వూరికి మాకూ ఒక లైను మీద కరంటు అందుకు మాకూ వుంది. అసలు మంత్రిగారి రాకకి కారణం ఏమీ! అని ఆరా తీస్తే తేలిందేమంటే, పది సంవత్సరాల ఇళ్ళ పట్టాల చరిత్ర చెప్పుకొవాలి మరి. అన్ని వూళ్ళలోనూ ఇందిరమ్మ ఇళ్ళు కట్టించేరు కొద్దోగొప్పో. కాని ఈవూళ్ళో ఏమీ కట్టలేదు, కారణం 2004 ఎన్నికల ముందు అప్పటి ఎమ్.ఎల్.ఎ గారు ఒక ప్రదేశంలో ఇళ్ళు కట్టించేందుకుగాను ఒక కార్యక్రమం చేపట్టి కొంతమందికి పట్టాలిచ్చారు, ఇంటి స్థలాలికి. ఎలక్షనులయిపోయాయి. ఆయన వోడిపోయారు. తరవాత వచ్చిన వారు అదే కార్యక్రమాన్ని కొనసాగిస్తూ 2008 లో మళ్ళీ 2009 ఎలెక్షన్ల ముందు 2002 లో ఇచ్చిన వారి పట్టాలు రద్దుచేసి మళ్ళి 2008 లో పట్టాలిచ్చారు. భూమి అదే. సరే మళ్ళీ ఎలెక్షనులయిపోయాయి. ఈసారి రెండవసారి ఎన్నికైన పార్టివారి మరొక అభ్యర్ధి ఎన్నికయ్యారు. ఈయన కూడా అదే భూమిని ఇచ్చే కార్యక్రమం కొనసాగిస్తూ వచ్చారు. ఇళ్ళు మాత్రం ఎవరూ కట్టించలేదు. పధకం ఇందిరమ్మది కాదనుకుంటాను. అదీ సంగతి. విశేషం ఏమంటే ఈ ఎమ్.ఎల్.ఎ గారు అధికార పక్షంలో ప్రతిపక్షం తాలూకు ఎమ్.ఎల్.ఎ. వీరిమీద ఆ పార్టీ మరొకరిని ఇంచార్జిగా నియమించడంచేత ఇప్పుడు అధికార కేంద్రాలు అసలు ఎమ్.ఎల్.ఎ మరియు అధికార పక్షపార్టీ నియమించిన వ్యక్తి, ఎం.అర్.ఓ. ఇందులో అన్నీ గొడవలే. యస్.సి, యస్.టి లకి ఇవ్వలేదని వారు, బడుగు బలహీన వర్గాలవారికివ్వలేదని మరొకరు. అగ్రవర్ణ పేదలకివ్వలేదని మరొకరు ఇలా అందరూ నిరసనలు వ్యక్తం చేస్తూనే వున్నారు. చివరికి నిన్న మంత్రిగారు కొద్ది మంది యస్.సి, యస్.టి లకి మాత్రం పట్టాలిచ్చి సమస్యని ఇంకా మురగబెట్టె వుంచారు. నిన్న రాత్రి గొడవ పడ్డారట అందుచేత ఇచ్చిన పట్టాలన్నీ మళ్ళీ రద్దు చేసారు. పాపం ఈ పట్టాలు పుచ్చుకున్నవారికి ఆశ చావలేదు. 2014 ముందు ఈ పని పూర్తి అయ్యే సూచనలు లేవు. పని పూర్తి కాదు కూడా. కారణం. కొంత మందికిస్తే మరికొంతమంది గొడవ చేస్తారు మరి. అందుకు ఎవరికీ ఇళ్ళుకట్టకుండా పట్టాలిచ్చి అవసరాన్ని బట్టి పట్టాలు రద్దు, మళ్ళీ ఇవ్వడం చేసుకుంటూ పోతే, ఈ పని మరొక పదేళ్ళు పైన కాలక్షేపం కాదూ. చెప్పిన పనులన్నీ చేసుకుంటూ పోతే కాలక్షేపం చేసేందుకు మరొక పనీ వుండద్దూ. బహుశః ఈ విషయంలో మా మిత్రుల పోలసీని అధికార పక్షం వారు తీసుకున్నారో లేక అధికార పక్షపోలసీని మా మిత్రులు తీసుకున్నారో మాత్రం తెలియలేదు.

శర్మ కాలక్షేపం కబుర్లు- బ్లాగు కష్టాలు-3

Posted on నవంబర్ 11, 2011
18
బ్లాగు కష్టాలు-3

బ్లాగు ఓపెన్ చేసి లింకేసీ దాకా చెప్పేను కదా!! రాస్తున్నాను, ఎవరు చూస్తున్నారో, చదువుతున్నారో తెలీదు. సరే రాద్దాం అని కొనసాగించాను. మొదటి కామెంటు శ్రీ బులుసు సుబ్రహ్మణ్యం గారిది తరవాత శ్రీఫణిబాబుగారు కామెంటేరు. వారికి సమాధానం ఇవ్వాలికదా, కొత్త, దానికితోడు ఏదోచేస్తే ఏదో అయింది. కామెంట్లకి జవాబులివ్వలేక బ్లాగులో ఆ విషయం చెప్పుకుని క్షమాపణ చెప్పుకున్నాను. అందరి బ్లాగుల్లో చూస్తున్నాను ఏవో ఏవో కనపడుతున్నాయి. కనీసం అవసరమైనవి కూడా పెట్టుకోలేనా అనిపించింది. ఏమేనా చేద్దామంటె కరంటుగోలొకటి, పగలంతా ఉండదు. రాత్రిపూట ఓపికగా కూర్చోగలది లేదు. మర్నాటి పోస్టు రాసుకోవాలికదా! చాలా కాలం వదిలేసాను. ఒక రోజు చూస్తే సెప్టెంబరు నెల అని వచ్చింది. సరి ఈ వేళ పోస్టు మానేసి ఇది చూద్దామని కూచున్నాను. కష్టపడి ప్రతి చర్యకి ప్రతిచర్య చూసుకుంటూ మొత్తానికి సాధించి విడ్గెట్స్ పెట్టేను. ఇక మిగిలినవి చేయదలుచుకోలేదు. అందంకాదుకదా ముఖ్యం. నిన్న పోస్టేస్తూ వుంటే సగం టైటిలు వొక్కటే వచ్చింది. మొత్తం పోస్ట్ తీసేద్దామనుకుంటే తెలియలేదు. తరవాత కుస్తీ పట్టేననుకోండి.( చేతకాని తనం కప్పి పుచ్చుకోవడం కాదూ! అందమైన ముసుగు..)

ఒక రోజు రాత్రి నిద్ర పట్టక దొర్లుతూంటే శ్రీమతి అడిగింది, ఏమయిందీ అని. నిద్ర పట్టలేదన్నాను. ” బలవంతుడు పైనెత్తిన బలహీనుడు,ధనము గోలుపడినయతడు,మ్రుచ్చిల వేచువాడు, గామాకులచిత్తుడు నిద్రలేక కుందుదురధిపా!”, భారతంలో పద్యం చెప్పింది….. ఇందులో మీ పాత్రఏంటీ అని… అమ్మో ప్రమాదం లో చిక్కుకున్నామనుకుని..ఏమీ లేదు కొద్దిగా దురద అన్నాను. మాటాడితే నాకిద్దరమ్మలు అని డచ్చీలు కొడతారు. ఒకమ్మ పద్నాలుగేళ్ళు పెంచి మరో అమ్మకిచ్చింది. ఆ అమ్మమిమ్మలిని మరో ఆరేళ్ళు పెంచి నాకంటకట్టింది. ఏభయి ఏళ్ళనించి చూస్తున్నా మీ సంగతి నాకు తెలీదా? తల్లి పుట్టింటి గురించి మేనమాకి చెప్పినట్లు అంది. ఏమిరా ఈ వేళ ఇలా దొరికి పోయననుకుంటు వుంటె దురదన్నారు, ఎక్కడా అని పెద్ద లైటు వేసి వొళ్ళంతా చూసింది. ఎక్కడా ఏమీలేదే గోకిన సూచన లేదు. దద్దురులేదు. దానిదగ్గరకూచుని ( కంప్యూటర్) మీరేమిచేస్తున్నారో నాకు తెలీదు. అల్లపురసమిస్తాను తాగి పడుకోండి, రేపు డాక్టరు దగ్గరకెళదామంది, ఒక గ్లాసు అల్లపురసం బలవంతంగా నా గొంతులో పోసి. పడుకో మంది. సరే ఎప్పటికో నిద్ర పట్టింది.మర్నాడు ఉదయమే మనవరాలు కాలేజికి వెళ్ళిన తరవాత డాక్టర్ దగ్గరకెళ్ళేము. నా నెంబర్ నాలుగు, ఖాళీ గానే వుందారోజు నా అదృష్టం కొద్దీ. డాక్టరుగారు నా స్నేహితుడే! చూడగానే రండి ఏమిటి సంగతి అన్నారు. నేను చెప్పేలోగా నా శ్రీమతి ఈయన కంప్యూటర్ దగ్గరకూచుని ఈ మధ్య గంటలకొద్దీ ఏమిచేస్తున్నారో తెలియదు. నిన్న రాత్రి దురదన్నారు. అల్లపు రసమిచ్చేను. వొంటి మీద గోకిన సూచనలు లేవు, గోకడంలేదు, కాని దురదంటున్నారు, ఎక్కడో చెప్పలేరట, ఇది వ్యాధి లక్షణం అనిచెప్పింది. సరే ఇలా రండని పక్కన వున్న బెంచి మీద పడుకోమని చూసి. దానిదగ్గరేమిటి చేస్తున్నారని అడిగేరు. ఏమీలేదండి! బ్లాగు రాస్తున్నానన్నాను. అదా! సరే అంతేనా మరేమైన చూస్తున్నారా అన్నారు. అబ్బే! మీరు పొరపడుతున్నారన్నాను. నేనేమైన చిన్న కుర్రాడినా అటువంటివి చూడడానికి అన్నాను. దానికాయన దీనికి వయసుతో సంబంధం లేదు. నిజం చెప్పాలంటే వయసు జారి పోయిన వారే ఇటువంటివి చూస్తారన్నారు. కారణం మీకు నేను చెప్పక్కరలేదనుకుంటాను అన్నారు. కరంటు పగలు వుండని మూలంగా రాత్రులు కూచుంటున్నాను తప్పించి అదేమీ కాదని చెప్పుకునేటప్పటికి తల ప్రాణం తోకకి వచ్చింది. బయటకొచ్చిన తరవాత ఏమీ లేదండి అంతా బాగానే వుంది. అయితే ఒక చిన్న లోపం ఏమంటే ఈయనకి ఒక కొత్త వ్యాధి వచ్చింది. దానిని మాడెం అడిక్షన్ అంటారు.. దాని లక్షణాలే ఇవి. కంగారు పడద్దు. కల్ల వాపువస్తుంది తెలుసుకదా! అల్లాంటిదే ఇదీను. పట్నవాసం వాళ్ళకి కాని పల్లెటూరివాళ్ళకి ఇదిరాదు. వైద్యం చేస్తే తగ్గుతుంది, చేయకపోయిన తగ్గుతుంది. వచ్చిన వెంటనే ఉధృతం వుంటుందికదా. కొద్దిరోజులొదిలేయండి అన్నారు. బ్లాగు పేరేమిటి వివరాలు తీసుకున్నారు. రెండు రోజుల తరవాత రండి అని మందులు రాసిచ్చారు.

రెండు రోజుల తర్వాత మళ్ళీ డాక్టరుగారి దగ్గరకెళ్ళడానికి చీటి రాయించుకోడానికి వెళ్ళి పేరు చెప్పగానే, అతను మీరు రండి! మీరు రాగానే తీసుకొచ్చెయ్యమన్నారు డాక్టరు గారని తీసుకెళ్ళిపోయాడు. వెనకనే వెళ్ళేము. డాక్టరుగారు రండి రండి అంటూ, ఎలావున్నారన్నారు. మందులేసుకున్నాను, బాగోలేనుఅన్నాను. డాక్టరుగారు! మీదగ్గరనుంచి ఇంటికివెళుతుంటే తేగలవాడెదురొచ్చాడు, ఇంటి మలుపులో. బాబయ్యా! తేగలు తీసుకోరా అంటే బాబూ పళ్ళుళెవురా !తిందామంటె అన్నారు. వాడు పట్టువదలని విక్రమార్కుడిలా బుర్రగుంజు తీసుకోండన్నాడు. ఈయనని వద్దంటూవుంటె కొని తినేసారు. సాయంత్రం కి దగ్గు,రొంప జ్వరం వచ్చేసాయి అంది. సరే తగ్గిపోతుందని గబగబా రెండు ఇంజెక్షన్లు చేసి కూచోబెట్టి, శర్మగారు మీ బ్లాగు బాగుంది, నిన్న రాత్రి కూచుని చదివేను మొత్తం అన్నారు. మీరు కబుర్లు చెబుతారని తెలుసుగాని ఇంత బాగా చెప్పగలరని తెలీదు సుమండి, అన్నీ చదివేను బాగున్నాయన్నారు. రాయండి, అని,రాత్రులు మేలుకోకండి ఆరోగ్యం పాడవుతుంది అన్నారు. నా శ్రీమతి తో పరవాలేదమ్మా! ఈయన దురద తగ్గుతుంది అన్నారు. సరే ఇంటి కొచ్చి ఫలహారం చేసి నిద్ర పోయాను. మరునాడు ఉదయం లేచాను. రొంప జ్వరం దగ్గు, దురద అన్నీ పోయాయి. మా ఆవిడ డాక్టరు గారికి ఫొన్ చేసి చెప్పింది. డాక్టరుగారు ఈయన దురదకి కారణం తెలిసింది. ఈయన రాసినదెవరూ బాగుందనట్లులేదు. నిన్న మీరు బాగుందన్న తరవాత ఈ రోగం తగ్గిందన్నమాట అంది.

శర్మ కాలక్షేపం కబుర్లు-నేను వ్యవసాయం చెయ్యను

Posted on నవంబర్ 3, 2011
2
నేను వ్యవసాయం చెయ్యను.

నిన్న కోపంగా వెళ్ళిన మా పేట రైతు ఈ వేళ చాలా హుషారుగా ఈలేసుకుంటూ వచ్చేడు. ”ఏంటోయ్! చాల హుషారుగా వున్నావు ఏంటి సంగత”న్నాను. ”అమ్మయ్య! బరువు దిగిపోయిందండి” అన్నాడు. నాకేమీ అర్ధంకాక వెర్రిచూపు చూస్తుండగా, ”నేను పెట్టుబడి పెట్టి వ్యవసాయం చెయ్యను, ఆడు నీరిచ్చినా ఇవ్వకపోయినా బాధలేదు” అన్నాడు. ”నేను పండించే పంటకి ఆడెవడో ధర నిర్ణయిస్తాడా? అందరికి అలా చేస్తన్నారా! నాకు ఒక కేజి ధాన్యం పండించడానికి 15 రూపాయలయితే నా దగ్గర 8 రూపాయలకి కొట్టేస్తోంటే నష్టం ఎంత కాలం పెట్టుకోను?” ”వ్యవసాయం మానేసి ఏమిచేస్తావన్నాను. కూలి పని కెళ్తాము…100 రోజుల ఉపాధి పధకమంట, తుప్పలు కొట్టేకూలిపనికి రాయించుకున్నాము, మా నలుగురికి. ఆళ్ళు ఒక్కొళ్ళకి 125 ఇవ్వాలి రోజుకి. సరే 100 చేతిలో పెడతారు కదా. రోజుకి రెండు గంటల పని. నిన్నటిదాకా కష్టపడ్డాను, ఇప్పుడు సుక పడతాను. సచ్చినోడి పెల్లికి వచ్చిందే కట్నం. అల్లాగ మాకు రోజుకి 400 అంటే నెలకి 12000/-.” ”వందరోజులేకదా పని” అన్నాను. ”ఓస్ ! అదా తరవాత బెల్టు సాపెట్టుకుంటాను. అబ్బో! మందు అమ్ముకుంటే దాన్లో శానా డబ్బులు మిగుల్తాయి. ఏమీ లేక పోయినా మందు మాత్రం అసలురేటుమీద సగం ఎక్కువైనా కొంటన్నారు కదా! ఈమద్దెన పంచాయితీలు రద్దు గందా! ఇప్పుడు మా వోడు రాజకీయనాయకుడిదే పవరు, ఉపాధి పతకంలో . గొడవలేదు. అడిగీవోడు లేడు. నీళ్ళెప్పుడొస్తే అప్పుడు రెండెకరాలు దున్నించి విత్తనం ఏది దొరికితే అది ఎద జల్లేసి వూరుకుంటాను. ఎరువెయ్యను. పురుగుమందు కొట్టను. కూలీలెట్టను. మా నలుగురమే పని చేసుకుంటాము. పండిన గింజలు మాకు చాలు. ఇది మా రైతులంతా చేస్తున్నారు”. ”మరయితే మీ మటుకు పండించుకుని వూరుకుంటే మిగతా వాళ్ళసంగతేమిటీ ,బియ్యందొరకవా” అన్నాను. ”ఏమో నాకేటి తెలుసు. ఎక్కడతెప్పించు కుంటారో తెప్పించుకోండి. దిగుమతీ చేసుకుంటారో మరేమైన తింటారో మీ ఇష్టం” అన్నాడు. ”నువ్వల్లా చేస్తే ఎల్లాగయ్యా! పంట పండిచకపోతే ఎలా ఏంతింటా”మన్నాను. ”ఆ! ఇప్పుడొచ్చేరు దారిలోకి. నేను పదేళ్ళుగా గోలెడతంటె ఒక్క డంటే ఒక్కడు, మీరు మా గురించి మాట్లాడేరా! ప్రబుత్వాని అడిగేరా ఏటి ఇలా చేస్తన్నారని.? సదువుకున్నోళ్ళు మీకు ఇంగిత ఙ్ఞానం లేదా. పక్క వాడు చచ్చిపోతున్నాడు. వాడు కూడా ఎవరో కాదు మనకి రోజూ కూడెట్టీవాడు. ప్రబుత్వం ఇలా చేస్తోంది తప్పని చెప్పలేరా?” ”కాదయ్యా! ప్రతి పక్షం చెబుతోందిగా” అన్నా. ”అళ్ళూ యీళ్ళూ తోడు దొంగలే. ఈడు అడినంటాడు, ఆడు ఈడినంటాడు. ఇద్దరూ కలిసి మానెత్తిమీద చెయ్యెట్టేస్తన్నారు, నిన్నటి దాకా నేను ఏడిచాను అందరూ ఏమైపోతారో అని. ఇప్పుడు మీరు ఏడవండి. మీరేమైపోతే మాకేం. మేము మిమ్మలిని అయ్యా బాబూ అని అడిగినంతకాలం ఒక్కళ్ళు మాట్లాడలేదు. …..మీకు బాధ్యత లేదా?. అంచేత మా ఇష్టమైన పని మేము చేస్తున్నాము…”

”నాకో అనుమానం, చెప్పండి” అన్నాడు. అడగమన్నట్లు వూరుకున్నాను. ”రాజశేకర్రెడ్డి బాబుండగా కంపెనీలెట్టి వ్యవసాయం చేయిస్తానన్నాడు, గుర్తుందా” అన్నాడు. బుర్ర వూపేను. ”అప్పుడు మావోళ్ళంతా కుదరదన్నారు. మా బూములు కంపెనీలో పెట్టాలంట. మాకు వాటాలంట. మేము కూలీలంట, అందులో, మిసన్లతో వ్యవసాయమంట, అందులో మాకు కూలిజీతాలంట. లాబాలొస్తే పంచుకోవాలంట. నష్టాలొస్తే చెప్పలేదు. మా కిష్టం లేకపోతే కంపెనీలోంచి ఎల్లిపోవచ్చంట. అప్పుడు బూమి మాత్రం ఇవ్వరంట. ఆరోజు గర్నమెంటు దర ఇస్తారంట. దీన్ని మావోళ్ళంతా అప్పుడు తిరగ్గొట్టేసారు. నా అనుమానమేటంటే, మేము తిరగ్గొట్టేసేము కనక మా చేతే వ్యవసాయం చేయలేమనిపించి, నీల్లివ్వక, విత్తనమివ్వక, పురుగుమందు దొరకనివ్వక, ఎరువు దొరకనివ్వక, కూలీలని దొరకనివ్వకుండా చేసేస్తే మేమే వ్యసాయం చెయ్యం అని బూములు ఇచ్చేసి కంపినీలెట్టుకోమంటామనుకున్నారు కాబోలు. ఇలా పతకమేసి బూములు కొట్టేద్దామనుకున్నారు కాబోలు. ఏమైనా బూములు వదలం. మాకు కావల్సినవి పండించుకుంటాము, మేముతింటాం. మిగిలిన భూమి గయ్యాళీ పెట్టేస్తాం” అన్నాడు. ”ఆ మాట చెప్పినాయన పోయారు కదా” అన్నాను. ”ఆయన పోతే ఇసయం పోలేదుగా” అన్నాడు.

”ఏంజేసిన బూములొదలం. మేము సావం. ఇక ముందు మిమ్మల్ని మాత్రం బతకనివ్వం, మీకు కూడులేకుండ జేసేస్తాం” అన్జెప్పి వెళ్ళిపోయాడు. నాకేమి చెప్పాలో ఏమి చెయ్యాలో………….తోచలేదు……………..ప్రభుత్వాన్ని నిలదీయకపోవడం తప్పు నాదేనా? చెప్పండి.