శర్మ కాలక్షేపం కబుర్లు-నేను బ్లాగెందుకు రాస్తున్నాను.

https://kastephale.wordpress.com/  Send profile to my mail sarmabc@gmail.com and enroll in Private blog కష్టేఫలే

Posted on అక్టోబర్ 30, 2011
18
నేను బ్లాగెందుకు రాస్తున్నాను?

దీపావళి అమావాస్య రోజు వుదయం నడకలో సత్తిబాబు కలిసేడు. నడకయాక అక్కడ కాసేపు కూచుని కబుర్లుచెప్పుకోటం ఇద్దరికి అలవాటు. నేను గ్రౌండుకి అవతలిపక్కకెళ్ళి తెచ్చుకున్న బ్లేడుతో దర్భలు కోస్తుండగా సత్తిబాబు వచ్చాడు.” ఏంటి ఇవి కోస్తున్నారెందుకు?” అన్నాడు. “ఈ రోజు అమావాస్య కదా! పెద్దలికి తర్పణాని”కన్నాను. “అదేంటి సంవత్సరానికి ఒకసారి కాదా?” అన్నాడు. “కాదు. ప్రతినెలా అమావాస్య రోజున, సంక్రమణం రోజు కూడా తర్పణం చేస్తా”నన్నాను. “సంక్రమణం సంవత్సరానికి ఒకసారి కాదా?” అన్నాడు. “ప్రతి నెలా సంక్రమణం జరుగుతుంది. సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశిలో ప్రవేశించడమే సంక్రమణం. అది ప్రతి నెలా జరుగుతుందంటే”. “ఈ నెలేంట”న్నాడు. “వృశ్చిక సంక్రమణం అనగా సూర్యుడు ఈ నెలంతా వృశ్చిక రాశిలో ఉదయిస్తాడు”. “మాటాడితే పెద్దలంటారు కదా మీకెన్ని తరాలు తెలుసు?” అన్నాడు. “ప్రతి నెలా తండ్రి, తాత, ముత్తాత, అమ్మ, మామ్మ, తాతమ్మ లను తలుస్తా”నన్నాను. “ఇంతేనా ఇంకా పూర్వపువాళ్ళు తెలుసా?” అంటే “ఆ పైన మరొక ఐదు తరాల”న్నాను. “నా పైన ఎనిమిది మంది పెద్దల పేర్లూ తెలుస”న్నాను. “అయ్య బాబోయ్! ఏంటీ మొత్తం మీ పిల్లల్తో కలిపి పదితరాలా. అంటే తక్కువలో తక్కువ ఐదువందలేళ్ళ నాటివాళ్ళ పేర్లు తెలుసా? పది తరాల వాళ్ళ పేర్లు తెలుసా! మీరు నాతో హాస్యం అడుతు”న్నారంటే, “నీకు వాళ్ళ పేర్లు రాసివున్న కాగితం చూపిస్తా రమ్మ”న్నాను. “సాయంత్రం వస్తా”నని వెళ్ళిపోయాడు.

అన్నట్లుగానే సాయంత్రం వచ్చాడు. నేను బీరువాలో లోపల దాచిన కాగితాల కట్ట తెచ్చి జాగ్రత్తగా విప్పి ఒక్కొక్క కాగితం తీసి పక్కన పెడుతూ వంశవృక్షం రాసిన కాగితం తీసాను, నెమ్మదిగా. “ఎంటండి! అది ఎప్పటిద”న్నాడు. “బహుశః 1800-1825 మధ్య రాసినదై వుండ”చ్చనన్నా. మరొక కాగితం “చూసి ఇదేమిట”న్నాడు. “ఇదా నా ముత్తాతగారు సంపాదించిన, ప్రస్తుతం నా తరవాత తరానికి నేను అందచేసిన పొలం తాలూకు కాగితం” అన్నాను. “ఏంటీ 200 సంవత్సరాల కాగితమా పొట్ల పండులా వుందని అంటూ వుంటే వంశవృక్షం వున్న కాగితం నెమ్మదిగా మడత విప్పేను. చూసి నిర్ఘాంత పోయాడు. కాగితం ముట్టుకోకుండా ఇటు అటు తను కదిలి పేర్లు చదివేడు. కరక్కాయి సిరా తో రాసి ఉన్నాయి. “ఏమండి మీరు పది తరాల పేర్లు చెబుతున్నారు, నేను తాత పేరు తప్పించి చెప్పలేక పోతున్నాను, అదేనా! నాపేరు మా తాత పేరుకనక చెప్పగలుగుతున్నాను.. నా పూర్వీకులను తెలుసుకోలేనా?” అన్నాడు. “సత్తిబాబూ మనసుంటే మార్గంఉంది. అమెరికాలో వుండే ఎలెక్స్ హేలీ అనే అతను తన పూర్వీకుల గురించి తెలుసుకోడానికి ఆఫ్రికా ఖండం, అమెరికా రెండు ఖండాలలో పన్నెండు సంవత్సరాలు తిరిగి, అనేక మందిని కలిసి, అనేక పాత కాగితాలు చూసి, తన పూర్వీకులను తెలుసుకోవడం కోసం చాలా కష్టపడి తన తాత తాత తండ్రి ఎక్కడనుంచి అమెరికా ఏ పరిస్థితులలో తీసుకు రాబడ్డాడో తెలుసుకున్నాడు. తన స్వంత వూరెళ్ళాడు. నా ప్రశ్నలకి సమాధానంచెపితే సాధ్యమంటె, అడగమన్నాడు”. “మీ ఇంటికి గురువుగారు వస్తారా ?” “పంతులుగారొస్తూ వుంటారంటే” “ఆయనకాదు. గురువులని వున్నార”న్నాను. కాసేపు బుర్ర గోక్కుని “గుర్తుకొచ్చింది మా బాబుండగా గురువుగారొచ్చేవారు ప్రతి సంవత్సరం. మా బాబు అయనతో మాట్లాడీ వారు. మా బాబు పోయాకా వస్తున్నామని కబురు చేసారు ఒక సంవత్సరం, నేను ఖాళీగా లేను తరవాత చెపుతాను అప్పుడొద్దురుగాని అన్నాను. తరవాత నేను మరిచిపోయాను. పిలవలేదు. వారు రాలేదు. దగ్గరగా ఏబైఏళ్ళు అయిందేమో” అన్నాడు.

మనకి గురువుల వ్యవస్థ వుంది. గురువుగారు ప్రతీ సంవత్సరం వూళ్ళో కొచ్చి ప్రతి ఇంటినీ దర్శించేవారు. గృహస్థు గురువుగారికి పూజచేసి తనకున్నదానిలో కొంత గురువుగారికి సమర్పించేవాడు. ఇంటికి వచ్చిన గురువుగారు ఇంటిలో మార్పులు అనగా జననం మరణం వగైరాలన్ని తన దగ్గరున్న పుస్తకంలో రాసివుంచేవారు. అది మన ఎదురుగా రాయక పోయినా వారి దగ్గరుండేది అన్నా. “అయ్యా! తప్పు చేసాను. ఊరికే సంవత్సరాని కొకసారి వచ్చి డబ్బుపట్టుకుపోతున్నాడనే బాధ నన్ను పట్టుకుని ఈ పని చేసాను, నా మూలాలు నేనే తెంపుకున్నా”నన్నాడు. “బాధ పడకు, తప్పు చేయడం మానవ సహజం. దిద్దుకోవడం దైవ లక్షణం. నీ బంధువులుంటారు, వాళ్ళనడిగితే మీగురువుని పట్టుకోవచ్చు. ఆయనని పట్టుకుంటే నీకు విషయంతెలవచ్చు” అంటే “ఆ పని చేస్తానని” వెళ్ళిపోయాడు….. ప్రస్తుతం మా సత్తిబాబు గురువుగారి వేటలో వున్నాడు…..

నా మిత్రులు నన్ను బ్లాగు రాయమన్నపుడు నేను వెనకాడిన మాట వాస్తవం. మొదలు పెట్టిన తరవాత నాకనిపించిందేమంటే ప్రస్తుతం డెబ్బదిఏళ్ళు దాటిన వయసులో వున్నాను. ఏరోజు ఏక్షణం పిలుపొస్తే ఆక్షణం వెళ్ళిపోవాలి. ఆ తరవాత నా ఆలోచన, అనుభవం, అభిరుచి,అభిమానం, కోరిక, వేదన ఎవరికి గుర్తుంటాయి. ఎవరు ఎంతకాలం గుర్తుపెట్టుకోగలరు. నేను పైతరాల వాళ్ళ పేర్లు మాత్రమే గుర్తుపెట్టుకున్నాను కాని వారి విషయాలేమీ తెలియవుకదా! అప్పటికి ఇన్ని సౌకర్యాలు పెరగలేదు కనక విషయాన్ని అక్షరబద్దం చేయలేదేమో. నేను అక్షరబద్దం చేసి ముందు తరానికి అందిస్తే మా తాత ఇలా, మా ముత్తాత ఇలా అని నా తరవాత వారు నాగురించి, కుటుంబం గురించి, దేశం గురించి, సంస్కృతి గురించి, నిజాలు కొంతయినా తెలుసుకో గలరుకదా ఇది నా అభిమతం. అందుకే బ్లాగు రాస్తున్నాను.

ఇదేళ్ళ తరవాత ఇప్పుడు ”నేను బ్లాగెందుకు మూస్తున్నాను” కూడా రాసుకోవలసొచ్చేలా ఉంది.

ప్రకటనలు

రచయిత: kastephale

A retired telecom engineer.

2 thoughts on “శర్మ కాలక్షేపం కబుర్లు-నేను బ్లాగెందుకు రాస్తున్నాను.”

  1. విన్నకోట నరసింహారావుగారు,

   పునః ప్రచురిస్తున్న టపాలలో సాధారణంగా మార్పు చెయ్యను, ఈ టపాలో చెయ్యాలనిపించి ఒక పేరా చేర్చాను. 🙂
   వర్డ్ ప్రెస్ బ్లాగులో కామెంట్ బాక్స్ ప్రతి టపాకి తీసెయ్యడం లేదా ఉంచడం చెయచ్చు. మొత్తంగా తీసేసే సావకాశం లేదు,బ్లాగర్ లాగా. కామెంట్ బాక్స్ లు పొరపాటుగా ఉండిపోయాయి,అంతే 🙂 ఐనా అయిపోయిన పెళ్ళికి బాజాలా? 🙂
   ధన్యవాదాలు.

   మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s