శర్మ కాలక్షేపం కబుర్లు-క్రెడిట్ కార్డుల కష్టాలు.

Posted on నవంబర్ 9, 2011
10
క్రెడిట్ కార్డుల కష్టాలు

క్రెడిట్ కార్డులు మనదేశానికి కొత్తే. నా అనుభవంలో ఇవి 2000 సంవత్సరం దరి దాపుల్లో మనకి అనుభవంలోకి వచ్చాయనుకుంటున్నాను. ఇవి వచ్చిన కొత్తలో చాల మంది ఇవితీసుకున్న మాట వాస్తవం. కాలం గడచిన కొద్దీ అనుభవం అయినకొద్దీ వీటి మీద సదభిప్రాయం మాత్రం కలగలేదు. వచ్చిన కొత్తలో మన వెనక పడి ఈ కార్డులు అంటకట్టేరు. వీటీమీద వివిధవ్యక్తుల అనుభవాలు వేరు వేరుగా వున్నాయి.

నా స్నేహితులొకరికి, గతపది సంవత్సరాల కాలములొ పెట్టిన బేంకులలొ ప్రసిద్దిపొందిన బేంకువారు వెంటపడి మరీ క్రెడిట్ కార్డ్ ఇచ్చారు. అది తీసుకున్న తరవాత నా స్నేహితునికి ఖర్చు పెరిగింది. అదెలాగంటే రయిలు టిక్కట్టు బుక్ చేయాలి నెట్లో క్రెడిట్ కార్డ్ నెంబరిచ్చి బుక్ చేయడం, మామూలుగా బుక్ చేసుకునేదానికి కంటే ఎక్కువ ఖర్చు. అదేకాకుండా అనవసరపు ఖర్చులు పెరిగాయి. వీటిలో క్రెడిట్ లిమిటు కాష్ లిమిటు అని ఇస్తారు. క్రెడిట్ లిమిట్ లో అన్ని వస్తువులు,సేవలు పొందవచ్చు. బిల్లు మొదలైన తేదీ నుంచి ఏబది రోజులలో చెల్లిస్తే వడ్డి వుండదు.మీరు కంగారుపడకండి మొత్తం కట్టక్కరలేదంటారు. అప్పుడుకూడా మినిమమ్ కట్టమంటారు. ఇదికడితే మిగిలిన బేలన్స్ కి ౩౬% వడ్డీ అవుతుంది. నల్లమందుకి అలవాటు పడినవాడు వేళకి నల్లమందులాగ మినిమమ్ కట్టడం అలవాటయిన తరువాత అసలు ఎప్పుడూకట్టలేరు. ఒక్కొకపుడు మినిమమ్ కూడా కట్టలేకపోతే ఆ బాధ వర్ణనాతీతం. మన సెల్ ఫోన్ నెంబర్లుంటాయి వాళ్ళదగ్గర,నిమిషానికొకళ్ళు ఫోన్చేసి విసిగించేస్తారు. వాళ్ళు మాట్లాడేది చాలా నిర్వికారంగా వుంటుంది. మనం ఏమన్నా వాళ్ళదగ్గరనుంచి రిఏక్షను వుండదు. కేషువాడకానికైతే సొమ్ము తీసుకున్న రోజునుంచి వడ్డీ వేస్తారు. ఏదీ వూరికేరాదనే సత్యం మనకి గుర్తుంటే బాధలు తప్పుతాయి. వూరకనే అనేది ఒక ఎర. డబ్బులు కట్టడం ఆలస్యమైతే, ఇదివరకైతే అప్పు వసూలుకి గూండాలని ఇంటిమీదకి పంపేవి బేంకులు, వాళ్ళు నానా భీభత్సం చేసేవారు.వాళ్ళకి రికవరీ ఏజెంట్లని ముద్దు పేరు. చాలా కంప్లైంయింట్లొచ్చాయి మొదట్లో, దీనిపై రిజర్వు బేంకు,కోర్టులు అడ్డుపడి, అటువంటి పనులు కూడదనీ, బాకీ వసూలుకు, రాజ్యాంగ పరమైన మార్గాలు అవలంబించాలని చెప్పడం తో కొంత దారిలోకొచ్చేయి. నా మిత్రుడు దగ్గర ప్రస్తుతం 12 బేంకుల క్రెడిట్ కార్డులున్నాయి. కొన్ని బేంకులు నెలవారి ఇన్ స్టాలుమెంటు తీసుకుంటూ ఒక సారి ఎక్కువ మొత్తం అప్పిస్తాయి, అదేనా వినిమయ వస్తువు కొనడానికేసుమా!. దానికి వడ్డి ఎక్కువే. ఒక సారి ఈ విషచక్రం లో ఇరుక్కున్న వ్యక్తి బయట పడటం తేలిక కాదు. పెట్రోల్ బంకులలో కూడా ఈ కార్డులు తీసుకుని పెట్రోల్ పోస్తారు. ఇప్పుడు వెంటనే సొమ్ము చెల్లించనక్కరలేదు కనక ఖర్చు విపరీతంగా పెరిగిపోతుంది. ఖర్చు అదుపులో వుండదు. ఆఖరికి సెలూన్ కూడా క్రెడిట్ కార్డ్ తీసుకుంటూ వుంది. విచిత్రం ఏమంటే మామూలుగ హైదరాబాదులో ఒక సారి క్షురకర్మకి ఎక్కువైన ఖర్చు రెండు వందలు కావచ్చు. కాని క్రెడిట్ కార్డ్ మీదయితే ఆ ఖర్చు ఆరు వందలుంటుంది. దీనిని బట్టి మిగతా ఖర్చులు అంచనా వేయచ్చు. మాడెం ఎడిక్షన్లగా ఇది కార్డ్ అడిక్షన్ అనచ్చు. మా మిత్రుడు దగ్గర ఇన్ని కార్డ్ లున్నా కొత్తవాడొస్తే తీసుకుంటాడు. వద్దనడు. పశ్చిమ దేశాలలో ఆర్ధిక మాంద్యం మూలంగా, కొత్త వాళ్లకి ఇచ్చే జోరు తగ్గింది. పాత వాళ్ళకి కూడా కొన్ని కొన్ని ఆంక్షలు పెడుతున్నారు. కేష్ లిమిటు తగ్గిస్తున్నారు. మనకి వున్న అలవాటు, ఉన్న దానిలో తృప్తిగా బతకడం. రేపటికి కొంత నిలవ చేయడం. వీటి మూలంగా తృప్తిగా బతకడం పోయింది. రేపేమవుతుందో మనకు తెలియదుకదా! రేపటి రాబడికి ఈ రీజు ఖర్చుపెడితే ఎలా? ఇన్ని దేశాలు ఆర్ధిక మాంద్యంలో కొట్టుకుంటున్నా మనం అందులో కూరుకుపోకపోవడానికి కారణం నేను ముందు చెప్పిందే.క్రెడిట్ కార్డ్ మోసాలు మరొకసారి.

నా అన్నగారబ్బాయి ఈ కార్డులు వచ్చిన కొత్తలో ఒకటి తగిలించుకుని అవసరం, అనవసరం అన్నది చూసుకోలేక ఖర్చుపెట్టి విషవలయంలో చిక్కుకుపోయాడు. నాతో ఈ విషయం మాటల సందర్భంగా అనగా కార్డు తీసేయమన్నాను. తీసేద్దామని ఉందిగాని అంత సొమ్మొకసారి కట్టాలి కదా అన్నాడు. డబ్బు నేనిస్తాను నువ్వు ఆ కార్డ్ వదిలించుకోమనిచెప్పి డబ్బులిచ్చి కార్డ్ గోల వదిలించాను, నా డబ్బులు నాకు తిరిగిఇచ్చేసాడనుకోండి. బాబయ్యా! నన్నొడ్డున పడేసావు, నువ్వు బలవంతంగా అయినా కార్డు వదిలించేవు లేకపోతే నేను ఇంకా అందులో పడి కొట్టుకుంటూ వుండే వాడినంటూ వుంటాడు. మధ్య తరగతివారు అసాధరణ పరిస్థితులలో తప్ప ఈ కార్డుల జోలికి పోవడం కుటుంబ ఆర్ధిక ఆరోగ్యానికి మంచిదికాదని నా అభిప్రాయం.

మరొక సంగతి ఏమంటే ఏ బేంకులో అప్పు తీసుకున్నా మనం కట్టవలసిన సొమ్ము నిర్ణీతకాలంలో చెల్లించడం లో కనక కొద్దితేడా వున్నా ఆ విషయాన్ని బేంకులు సిబిల్ కి చేరవేస్తాయి. బేంకులన్ని కలిపి పెట్టుకున్న సంస్థ అది. మనకు తెలియకుండానే మనలని బ్లాకు లిస్టులో పెట్టేస్తారు. ఏదేని బేంకుకి కనక మనం ఏ లోన్ కోసం వెళ్ళిన ఆ బేంకు చేసే మొదటి పని సిబిల్ లో మనపేరు వెతకడం. ఒక్కొకప్పుడు పొరపాటుగా ఈ సంస్థలో మనపేరు చేరినా ఏబేంకు అప్పు ఇవ్వదు. ఈ సంస్థలో మనపేరు కనక పొరపటుగా చేరితే, ఏ విషయం గురించి చేర్చేరో అది నిజంకాకపోతే దానిని సరిచేయించుకోవచ్చు.

ఒక చిన్న సంగతి చెబుతాను. ఒక సారి ఒక సంస్థ ఒక బేంకుకి ఒక కోటి రూపాయలు అప్పు ఎగకొట్టెసింది. అదే సంస్థకి కొద్దిపాటి మార్పులు మేనేజిమెంటులో వచ్చాయని మరొక బేంకు అప్పు ఇచ్చింది. అదీ సంగతి. చిదంబర రహస్యం తెలిసిందా?