శర్మ కాలక్షేపంకబుర్లు-కార్తీకం.

Posted on నవంబర్ 18, 2013
కార్తీకం.

కృత్తికా నక్షత్రం తో కలసివచ్చే పున్నమి కల నెల కార్తీక మాసం. ఇదివరలో ఒక టపాకి కార్తీక మాసం అని పేరు పెట్టేను కనక దీనికి కార్తీకం అన్నా. అసలు మీకు కార్తీక మాసం అంటే ఎందుకంత ఇష్టం అన్నారొక మిత్రులు. ఏం చెప్పను. శివ కేశవులు లకు భేదం లేదని నమ్మినవాడిని, ఈ నెల సంవత్సరం లో ఎనిమిదవది. ఇప్పటికి గడచిన ఋతువులు వసంతం,గ్రీష్మం, వర్ష ఋతువులు చెల్లిపోగా శరదృతువు ఋతువు నడుస్తూ ఉంటుంది. అందులోనూ ఈ నెల ఋతువులో రెండవది. మరుసటి నెల మార్గశీర్షం మరో విశిష్టమయిన నెల. ఈ కార్తీకం వచ్చేటప్పటికి వర్షం వెనకపడుతుంది, కొద్దిగా చిరు చలి ప్రారంభమవుతుంది. నదులన్నీ ఉరవడి తగ్గి ప్రశాంతంగా ఉంటాయి. ప్రకృతి బాగుఉంటుంది. గోదావరమ్మ మెల్లమెల్లగా నడుస్తూ ఉంటుంది. అమ్మ కట్టుకున్న తెల్ల చీరలా కనపడుతుంది, ఇసుక తిప్ప.  గోదావరి మధ్యలో వీరభద్ర స్వామి నేనున్ననని అభయమిస్తూ ఉంటాడు. చివర దక్షారామం లో భీమేశ్వరుడు కాపు కాస్తుంటాడు. ప్రతి శివాలయం పెళ్ళివారిల్లులా ఉంటుంది. స్వామి అమ్మతో కలసి దర్శనమిస్తూ ఆశీర్వదిస్తారు.

దీపావళి గడచిన మరునాడు కార్తీకం ప్రారంభం. మొదటి రోజు ఆకాశదీప ప్రారంభం, అఖండ దీపం కూడా ప్రారంభం. ఇళ్ళ దగ్గర ఇల్లాళ్ళు సంద్యదీపం పెడతారు గడపలో, లక్ష్మిని ఆహ్వానిస్తూ, అప మృత్యుదోషం తొలగడానికి. మరుసటి రోజు యమ విదియ, భగినీ హస్త భోజనం. నాల్గవరోజు నాగుల చవితి. ఈ రోజు పుట్టలో పాలు పోసి శివాలయం లో టెంకతో కూడిన తేగలు, బూడిద గుమ్మడి, పెద్ద గుమ్మడి, పిలకలతో ఉన్న కంద, పిలకలతో పసుపు ఇవ్వడం అలవాటు. మరునాడు నాగ పంచమి. అష్టమి కార్తవీర్య జయంతి. నవమి, దశమి, ఏకాదశి మూడురోజులు విష్ణుత్రిరాత్ర వ్రతం. ఏకాదశి విష్ణువు యోగనిద్రనుంచి లేచేరోజని చాతుర్మాస చివరిరోజు. మరునాడు చిలుకు ద్వాదశి అనే క్షీరాబ్ధి ద్వాదశి, చతుర్దశి వైకుంఠ చతుర్దశి. పున్నమి చెప్పేదేమి? జ్వాలాతోరణం సాయంత్రం కార్తీక దామోదర, చంద్ర పూజ. బహుళ నవమి నా ఆశ శ్వాస దగ్గరున్న బుల్లి మనవరాలి పుట్టిన రోజు, త్రయోదశి మాస శివరాత్రి, ఇలా అన్నీ పండుగలే. అందుకే నాకు కార్తీకమంటే ఇష్టం. ఇక ఈ నెలలో నాలుగు గాని ఐదుకాని సోమవారాలు నక్తం ఉపవాసం. కార్తీక చంద్రుని చూస్తే ఆనందం.

ఈ నెలలో వచ్చేవి. శీతా ఫలాలు, చెరకు, దీనినుంచి పానకం, చెరకు రసం, గోకుడు బెల్లం వగైరా అంతా అదొక గొప్ప అనుభూతి. బెల్లం ఆడే పొయ్యి దగ్గర చలి కాగుతూ చెరకు రసం పుచ్చుకోవడం ఒక గొప్ప ఆనందం. చెరకు రసాని తీసిన వెంటనే అలా తాగితే తిక్క ఎక్కుతుంది, అందుకు అందులో అల్లం కాని లేదా పచ్చి మిరపకాయలు కాని వేసి పుచ్చుకుంటారు. ఇక జొన్న చేలు పంటకి వస్తే ఊచబియ్యం. తెనుగు భాషలో లోపలికి తీసుకునే ద్రవ పదార్ధాన్ని పుచ్చుకోవటం అనాలనీ, తాగటం అనడం నీ చార్ధం లో వాడే మాటనీ నా అభిమాన రచయిత శ్రీ పాదవారన్న మాట. తెనుగు భాషా సంప్రదాయం అంత గొప్పది. తాగడం అనే మాట కల్లు సారా లాటివాటిని తీసుకునేటపుడు వాడే మాటన్నారు వారు. పుచ్చుకోవడం అన్న మాట బాగుంది కదా. ఇప్పుడన్నీ తాగేస్తున్నవే మనం.

ఈ నెలలో స్నానం, దీపం, ఉపవాసం, దానం ముఖ్యమైనవని పెద్దలు చెబుతారు. ఉపవాసం పిల్లలకి ముసలివారికి చెప్పబడ లేదు. పిల్లలు అంటే ఏ వయసువారు అని ప్రశ్న రావచ్చు. పద్నాలుగు సంవత్సరాల వరకు పిల్లలు వారు చేసిన తప్పులకు వారు బాధ్యులు కారు, వారు చేసిన పాపం తల్లి తండ్రులదే. ఇక ఆ తరవాత వారు చేసిన తప్పులకు వారిదే బాధ్యత. ఈ నియమం మృకండు మహాముని యముని చేత చేయించినది. ఆ కధ మరొక సారి చెప్పుకుందాం.

dscn4127

కార్తీకపున్నమి చంద్రుడు 17.11.13

సహస్ర చంద్రదర్శనం అని ఒకటి ఉంది, అంటే ఒకరి జీవితంలో వెయ్యి నిండు పున్నమిలు చూడటం, సాధ్యమా? ఆహా సాధ్యమే ఎనుబది మూడు సంవత్సరముల నాలుగు గాని ఐదు నెలలు జీవించినవారు సహస్ర చంద్ర దర్శనం చేసినవారే. అప్పుడు ఉగ్రరధ శాంతి అని ఒక ఆయుష్ హోమం చేస్తారు, డెభ్భయి రెండు సంవత్సరాలకితం ఇదేరోజున,కార్తీక పున్నమి మరునాడు ఈ భూమి మీద పడటం కూడా ఒక కారణం.అందుకే ఈ నెలంటే ఇష్టం

శర్మ కాలక్షేపంకబుర్లు-దీపావళి యుద్ధం

Posted on నవంబర్ 13, 2012
దీపావళి శుభకామనలు.

దీపావళి యుద్ధం

కావలసిన వారు మెయిలిస్తూ దీపావళి హడావుడిలో ఉన్నా అన్నారు, నేటి రోజుల్లో దీపావళికి హడవుడి ఏమా? అని ఆలోచిస్తూ జ్ఞాపకాల్లోకి జారిపోతే ఏబదిఏళ్ళనాటి పల్లెలో దీపావళి యుద్ధం గుర్తుకొచ్చింది. అదేమిటంటే…

ఆ రోజులలో దీపావళి అంటే మాకు రెండు నెలల ముందు మొదలయ్యే పండగ. ఇప్పటిలాగా అ వేళ ఉదయం కొనితెచ్చుకుని, రాత్రి కాల్చేసి పడుకోడం కాదు. ఊళ్ళో పెద్దవాళ్ళయిన యువకులు రెండు నెలల ముందు బొగ్గు కోసం జిల్లేడు మొక్కలు కొట్టించటం తో ప్రారంభమయ్యేది, దీపావళి . ఆ తరవాత మందు గుండు సామగ్రి తయారు చేయటానికి కావలసిన సూరేకారం, గంధకం, బీడు, ఆముదం, పటాసు కొని తెచ్చుకోడం. ఈ చివర చెప్పిన పటాసు ఇప్పుడు దొరకడం కష్టమే. పటాసు జాగ్రత్తగ నూరించేవారు, లేకపోతే పేలి అంటుకునేది. సూరేకారం వంట చేసేవారు, అంటే నీళ్ళు ఎసరుపెట్టి అందులో పోసి ఉడికించి, నీరు ఇగిరిపోయిన తర్వాత ఆరబోసి ఎండబెట్టేవారు. గంధకం కడ్డీలలా దొరికేది, తరవాత బూందీ పూసలలా వచ్చేది. కడ్డీలలా ఉన్నపుడు కష్టం ఎక్కువుండేది. చివరిగా బొగ్గు కోసం కొట్టించిన జిల్లేడు కంప ఎండిన తరవాత కాల్చి బొగ్గు చేసి నూరుకోవాల్సివచ్చేది. వీటన్నిటిని, చాలా మెత్తగా ఉండటం కోసం వస్త్రకాళితం చేయాల్సి వచ్చేది. ఆ తరవాత తయారు చేయవలసిన వాటిని నిర్ణయించుకోవడం. జువ్వ, చిచ్చుబుడ్లు, తాటాకు టపాకాయలు,మతాబులు,సిసింద్రీలు, ఇలా, ఇవి కాక కొన్ని కొనేవి ఉండేవి, అవి విమానాల లాటివి. మతాబా గుల్లలు, తాటాకులు తయారు చేయడం,టపాకాయలకోసం, పేకతో జువ్వ గుల్లలు, వెదురుబద్దలు తయారు చేయడం, జువ్వ తూకం చూడటం, ఒక ఎత్తు, ఇవన్నీ వీటిని కూరడం ఒకెత్తు. నమూనా చూడటం, బాగోకపోతే పాళ్ళు కొద్దిగా మార్చటం, ఇదంతా రహస్యంగా జరగాలి. రెండు వర్గాలుండేవి. ఇద్దరు నాయకులు, వీరికి సహాయకులు, సామాను, ఆహారపదార్ధాలు పట్టుకుని యుద్ధ రంగంలోకి వెళ్ళేవాళ్ళు, ఆయుధాలు ప్రయోగించే సైనికులు, ఇదో పెద్ద పటాలం. ఈ పటాలానికి గూఢచార వ్యవస్థ. ఎదుటివారు ఎంత మందుగుండు కొన్నారు, ఏమేమి తయారు చేస్తున్నారు, ఎవరెవరు అటువైపు ఉన్నారు వగైరా వివరాలు సేకరణ, అవతలి వారు అనుసరించబోయే వ్యూహాలు, ఇవన్నీసేకరించుకొచ్చేవారు, కొందరు. ఇలా ఈ సంవిధానం రెండు నెలలు నడిచి దీపావళి రోజు వచ్చేది.

చిన్న వాళ్ళు ఉప్పుపొట్లాలని కట్టుకునేవాళ్ళు. ఇదీ పెద్దపనే, గుడ్డని పేడనీళ్ళలో ముంచి, బాగా పట్టిన తరవాత ఆరబెట్టేవాళ్ళం. అందులో సూరేకారం, గంధకం, బొగ్గుపొడి,కొద్దిగా బాగా ఎండిన ఉప్పు, పాళ్ళలో కలిపి దానిని గుడ్డమీద పోసి, రెండంచులూ మడిచి సమానంగా పొట్లంలాగా కొద్ది లావు పొడుగులతో తయారు చేసుకుని, దానిని పురికొసతో గట్టిగ కట్టి ఎండలో బాగా ఆరపెట్టి, ఈపొట్లాన్ని, చిన్న లేత తాటిఆకులను కోసి, మట్టలను వేరుచేసి, మట్టల చివర గుంతలు చేసుకుని, మూడు కాని నాలుగు కాని మట్టలు దగ్గరగా చేర్చి గట్టిగా కట్టుకుని వాటి మధ్యలో ఈ పొట్లం పెట్టి అపైన మట్టల పై భాగాల్ని కూడా దగ్గరకు చేర్చి గట్టిగా కట్టుకుని, ఈ సరంజామాకి ఒక పొడుగాటి నారతాడు కట్టి సిద్ధం చేసుకుని, దీపావళిరోజు సాయంత్రం భోజనం ముందు దానిపై కొద్దిగా నిప్పు వేసి భోజనమైన తరవాత మిగిలివారితో మందు కాల్చి, అప్పుడు, ఈ ఉప్పుపొట్లం పుచ్చుకుని గోదావరి లంకలో కాని ఇసుక తిప్పలో కాని తిప్పడం మొదలెడితే చుట్టూ విష్ణు చక్రంలా ఉండేది, రవ్వలతో, చిటపటలతో, తిప్పడం చేతకాకపోతే, ఆపుకోవడం చేతకాకపోతే, ఒంటికి తగిలి ఒళ్ళు కాలిన సందర్భాలుండేవి.

ఊళ్ళోవాళ్ళంతా మందుకాల్చుకోడం అయి లోపలికి వెళ్ళిన తరవాత సమరం మొదలయ్యేది, రెండు జట్లనాయకులు వారి శిబిరాలనుంచి మధ్యకువచ్చి చేతులుకలిపి, ఒక జువ్వను ఒకరు అంటిస్తే ఒకరు ఆకాశంలోకి వేసి విడిపోయేవారు. అంతతో యుద్ధం మొదలు. శిబిరాల దగ్గర కాపలా, వెనకనుంచి దాడికి సావకాశం లేకుండా మందుగుండు సామాగ్రితో కాపలా, ముందునుంచి జువ్వలు, విమానాలు, చిచ్చు బుడ్లు, టపాకాయలు, సిసింద్రీలు వేసుకుంటూ, ప్రత్యర్ధి శిబిరం మీద వేస్తూ, ముందుకు వెళ్ళి ప్రత్యర్ధి శిబిరాన్ని స్వాధీనం చేసుకోవాలి. అందులో మొండి జువ్వలని వేసేవారు, తోక విరిచిన జువ్వ తిన్నగా కాక దానిష్టమయిన దారిలో వెళ్ళి ఎదుటివారిని కల్లోల పరిచేది. చిచ్చుబుడ్లు వెలిగించి రెండు చేతులతో రెండూ పట్టుకుని ముందుకు చొచ్చుకుపోయేవారు. వారిని ఆపడానికి ఎదుటివారు, జువ్వలు, విమానాలు,టపాకాయలు వేసేవారు. విమానం శబ్దం చేస్తూ వచ్చి తగిలితే కాలేది,దెబ్బకూడా తగిలేది. ఇదీ యుద్ధం. చాలా హోరాహోరీగా యుద్ధం జరిగేది, నేలబారున జువ్వలు, విమానాలు దూసుకొచ్చేవి. నిలబడటమే కష్టంగా ఉండేది. రక్షణ ఎర్పాట్లు చూసుకుంటూ దాడి చెయ్యాలి. ఇలా సమరం జరుగుతున్నపుడు, ఎవరికేనా, ఏపక్కవారికేనా తీవ్రంగా కాలడం, దెబ్బలు తగలడం జరిగితే, ఏ ఇంటికేనా అగ్ని ప్రమాదం జరిగితే, సమరం ఆపేవారు. సాధారణంగా ఇటువంటి పరిస్థితి ఉండేది కాదు. అప్పుడందరూ కలసి ఆపదను ఎదుర్కొనేవారు. నిప్పు ఆర్పేవారు. ఒక్కొక్కపుడు జయాపజయాలు తేలేవి కావు. మరునాడు కూడా యుద్ధం కొన సాగేది. యుద్ధానికి, సంధికి, లొంగిపోవడానికి, వెనక్కు తగ్గడానికి నియమాలుండేవి. ఒక్కొకపుడు, ఒకరి మందుగుండు సరిగా కాలక సంధికి వచ్చేవారు. అటువంటి సమయంలో సంధి కోరుకునే నాయకుని సిపాయి, మూడు జువ్వలు తీసుకుని రంగం మధ్యకు వచ్చి మూడిటినీ సమయంలో ఎడం లేకుండా ఆకాశం లోకి కాలిస్తే, అదిసంధి సూచన. ఇవతలివారు, కాల్పులు ఆపేవారు. ఒక సైనికుడు వెళ్ళి జువ్వలేసిన వ్యక్తిని నాయకుని దగ్గర ప్రవేశపెడితే, వచ్చిన రాయబారి విషయం చెబితే, సంధి షరతులు చెప్పి పంపేవారు. వాటిని ఒప్పుకుంటే మరల రాయబారి వచ్చి చెప్పేవాడు. సంధి షరతులు అమలు పరచబడేవి.లేకపోతే యుద్ధం కొన సాగి లొంగదీసుకునేవారు. ఒక్కొకపుడు మందుగుండు అయిపోతే, తెచ్చుకోడానికి సమయం కోసం కూడా ఇటువంటి ఎత్తులు పన్నేవారు. నిజానికి నేటి యుద్ధంలో జరిగే ప్రతి చర్య అక్కడ అమలు పరచబడేది. ఇల్లా యుద్ధ విద్య, దౌత్య కార్యం నేర్చుకునేవారనుకుంటా. అది నెమ్మది నెమ్మదిగా అడుగంటిపోయింది. ఇప్పుడు నిప్పు అంటే భయం అంటున్నారు, మరి మా చిన్నప్పుడు దానితోనే ఆడుకున్నాం🙂

శర్మ కాలక్షేపంకబుర్లు-వాళ్ళిద్దరూ ఒకటే

Posted on డిసెంబర్ 24, 2011
వాళ్ళిద్దరూ ఒకటే

‘పంతులుగారూ! మీ స్నేహితుడు మావోడిని పీకేడంట. ఏటి సంగతి’ అన్నాడు, మా సత్తి బాబు వస్తూనే. ‘మా వోడో తింగరోడు. ఏటి చేస్తాడో తెలీదు. నిజంగా మీవోడు గనక బరిస్తన్నాడు. మరొకడయితే యీపాటికి మెడ పట్టి గెంటేసేవోడే,’ అన్నాడు. ‘అసలేమిటి? వీళ్ళిద్దరి మధ్య ఏమిటి సంబంధం’ అన్నా. ‘ఇదీ అని చెప్పలేనండి. యజమాని, పనోడా, మిత్రులా, బంధువులా?. బంధువులు కారు, యజమాని పనోడూ కాదు, మీవోడొదిలెయ్యడు, యీడు అక్కడనుంచి పోడు. ఈళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి కలిసి పెరిగేరు, ఒకణ్ణొదిలి మరొకడుండలేడు, అంతే,’ అంటూ, ‘ఏటయింద’న్నాడు.

నిన్న హాస్పటల్ దగ్గరనుంచి మిత్రుడు దగ్గరికి వెళ్ళేసరికి చాలా మంది కనబడ్డారు. వాతావరణం కొద్దిగా వేడిగా వున్నట్లు కనపడింది. బయట కుర్రాడు కనపడి ‘మీరొస్తే వెంటనే లోపలికి పంపించెయ్యమన్నారు, లోపలికి వెళ్ళండి’ అన్నాడు. ‘ఎవరున్నారు లోపల’న్నా, ‘బాబుగారు, సుబ్బయ్యా’ ఉన్నారన్నాడు. తలుపుతోసుకుని లోపలకెళ్ళేసరికి, నా మిత్రుడు సుబ్బయ్యతో, “ఒరేయ్! నీకు లక్ష సార్లు చెప్పేను, ఆ కాగితాలు ఆడిటర్ కి పంపు, నీకుతెలియకపోతే తెలియదని చెప్పు, నేను ఏర్పాటు చేసుకుంటానని. ఇంతకీ కాగితాలు ఆడిటర్ కి పంపేవా” అన్నాడు. సుబ్బయ్య పంపేనని ఒక సారి, పంపలేదని ఒక సారి, నంగి నంగిగా సమాధానం చెప్పేడు. “నువ్వీ కాగితాలు ఆడిటర్ కి పంపిఉంటే ఈ లక్ష రూపాయల నష్టం వచ్చేది కాదు. ఎలారా! నీతో చచ్చిపోవడం” అంటూ, ఉద్రేకంతో ఊగిపోతూ, సుబ్బయ్య చెంపమీద ఒక లెంపకాయ కొట్టేడు. ఆ విసురుకి సుబ్బయ్య కళ్ళ జోడు కింద పడి ముక్కలయింది. వాతావరణం ఇలా మారడంతో, అందునా సుబ్బయ్యపై చెయ్యి చేసుకోడం సహించలేని నేను నెమ్మదిగా బయటి కొచ్చేసాను. కొద్దిసేపు పోయాకా లోపలికి రమ్మన్నారని కబురొస్తే మళ్ళీ వెళ్ళేను. నా మిత్రుడు తమాయించుకుని, మామూలు స్వరంతో ‘మీరు బయటకు వెళ్ళిపోవడం గమనించాను.నేను చేసిన పనికి మీ నిరసన అలా తెలియచేసేరని గమనించాను. నేను విసిగిపోయి ఈ పని చేసాను’ అన్నాడు. నేను ఇక ఆగలేక, ‘ఒక్క మాటచెబుతా! పొరపాటో, తప్పో జరిగి ఉండచ్చు, కాదనను, కాని, మీరు ఇలా చెయ్యి చేసుకోడం మాత్రం నాకు నచ్చలేదని’ చెప్పేను. సుబ్బయ్య నిర్వికారంగా కూచుని వున్నాడు. ఈ మాటకి నా మిత్రుడు, ‘నిజంసార్! ఏవిషయం లోనూ నాకు నిజంచెప్పకపోతే ఎలా సార్, నేనెలా చావను,’ అన్నాడు. ఈలోగా ఫోన్ మోగింది. ఫోన్ ఎత్తి మాట్లాడుతూ నా స్నేహితుడు, ‘ఏరా సినిమా హాల్ దగ్గర మొదటి ఆటకి ఏర్పాట్లు చూసి వచ్చేనని కదా చెప్పేవు, హాల్ నుంచి మేనేజరు బుకింగ్ తాళాలో అని అరుస్తున్నాడు, కొత్త బొమ్మేసాము, జనం బుకింగ్ తీయలేదని గోల చేస్తునారట, ఏంటిది?’ అన్నాడు. ‘నేనెళ్ళాలి అన్నాడు’ సుబ్బయ్య. ‘మేనేజరు బుకింగ్ తాళాలు కావాలి, నీదగ్గరున్నాయని చెబుతునాడు, నువ్వేమో నాతో ఇందాకా తాళాలన్ని అక్కడ ఇచ్చేసి వచ్చాను, అన్నావు,’ అంటూ, ‘చూడండి, ఇంతకు ముందు తాళాలు హాల్ లో ఇచ్చేసి వచ్చేనని చెప్పి, ఇప్పుడు నేను వెళ్ళాలంటున్నాడు, ఎలాగండి, వీడితో ఎలా చావనండి’ అన్నాడు. నాకేం చెప్పాలో తెలియలేదు. తాళాలు పంపే ఏర్పాటు చూసి, ‘ఈ ఫైల్లో కాగితాలు చూసి వీడు చేసిన నిరవాకం ఏంటో చూసి, ఏం చెయ్యాలో కొద్దిగా చూడండి, తరవాత మొన్న మనం కమిటీ వేసాము కదా, వాళ్ళు గొడవ పడుతున్నారట, వచ్చారు, బయట వున్నారు, చూసారు కదా, విషయం కనుక్కుని సద్దగలిగితే సద్దెయ్యండి, లేకపోతే రేపటికి వాయిదా వెయ్యండి, నేను అత్యవసర పని మీద వెళ్ళిపోతున్నా’ అని వెళ్ళిపోతూ, ఒక్క నిమిషం ఆగి,సుబ్బయ్య దగ్గరకొచ్చి, “ఒరేయ్, నిన్ను కొట్టేనురా, ఉద్రేకంలో, అబద్దం చెప్పేవని కొట్టేను, నీకంటే నాకు డబ్బు ముఖ్యం కాదు. నన్ను క్షమించు” అని సుబ్బయ్యని కావలించుకుని, మేనేజర్ని పిలిచి సుబ్బయ్యని డాక్టర్ దగ్గరకి తీసుకెళ్ళి, కళ్ళు పరీక్ష చేయించి, కొత్త కళ్ళ జోడు వేయించమని చెప్పి వెళ్ళిపోయాడు.

నా స్నేహితుడెళ్ళిపోయాకా, ‘ఏమయ్యా! సుబ్బయ్యా ఎందుకిలా చెసేవు, ఎందుకు దెబ్బ తిన్నావు, కొడితే మాటడక వూరుకున్నావు, ఇదేంటన్నా’. ‘పంతులుగారూ, వాడులేని నేనులేను, నేనులేని వాడులేడు, అలా జరిగిపోయింది,’ అని చాలా నిర్వికారంగా చెప్పేడు. ‘మేమిద్దరం వొకటే, మా మధ్య ఇది పెద్ద విషయం కాదు, మీరే చూసారుకదా,’ అన్నాడు. నేను నోరెళ్ళబెట్టాను, అర్ధంకాక

శర్మ కాలక్షేపంకబుర్లు-స్వానుభవం అయితే కాని తత్వం ఒంట పట్టదు

Posted on డిసెంబర్ 23, 2011
స్వానుభవమైతే కాని తత్వం ఒంట పట్టదు.

బండి పాడవడం మూలంగా, రెండు రోజులనుంచి నటరాజా సర్విస్ లో వున్నాను కదండి, స్నేహితుడు పిలిస్తే కర్రపుచ్చుకుని నడుచుకుంటూ బయలుదేరా. గర్నమెంటు ఆసుపత్రి ప్రాంతం దగ్గరకెళ్ళే సరికి ఒక యువకుడు సైకిల్ మీద స్పీడుగా నన్ను తప్పించుకుని ముందుకెళ్ళి సైకిల్ చక్రం గోతిలో పడడం మూలంగా కింద పడ్డాడు. మొకాలూ, మోచెయ్యీ దోక్కుపోయాయి. గబగబ పరిగెట్టి కుర్రాణ్ణి పైకి లేవడానికి సాయం చేస్తూ, ఏమిరా నాయనా! ఇంత కంగారన్నా. బాబయ్యా! నా అడది పొద్దుటేల ఇరుసుకు పడిపోతే, గర్నమెంటు ఆసుపత్రికి తీసుకొచ్చేనండి. డాట్రుగారు వైద్యమైతే ఏదో చేసేరుకాని, మందులు కొన్ని కొనుక్కోమన్నారు. అయి చాలా అవసరమంట. డబ్బులు కోసం ఎల్లేను. దొరకలేదు. గంట పైన అయిపోయింది, ఇక్కడ ఆడదాని దగ్గరెవరూ లేరు. మందులు కొనాలి. ఆడది ఇక్కడెలా వుందో అనే కంగారులో పడిపోయానన్నాడు. కాలు చెయ్యి దోక్కుపోయాయి, అన్నా. అదే తగ్గిపోద్ది అని రోడ్డు దుమ్ము వాటిమీద అద్దేసాడు.

మందుల చీటి ఏదన్నా. దగ్గరేవున్న మందుల షాపు కేసి అడుగేస్తూ. చీటీ నా చేతులో పెట్టేడు. నువ్వు ముందు వెళ్ళి నీ ఆడదాన్ని చూసి, మళ్ళీ ఇక్కడ షాపు దగ్గరకి రమ్మని చెప్పి, షాపతనిని మందులిమ్మన్నా. ఏమిటి సంగతన్నాడు, షాపతను, చెప్పేను. అవసరమైన మందులేనండి, కొద్ది ప్రమాదంగా వున్న కేసే అన్నాడు,షాపతను. మందులు తీసిపెట్టేడు. ఈలోగా ఆ యువకుడొచ్చాడు. ఎలా వుందన్నా. మందులు కావాలంటండి, అన్నాడు. స రే అని అమందులు బేగ్ అతని చేతిలో పెట్టి పట్టుకెళ్ళి వైద్యం చేయించమన్నా. బాబయ్యా! డబ్బులన్నాడు. డబ్బుల సంగతి తరవాత చూదాం. ముందు వైద్యంచూడమని పంపుతూ, ఒక వేళ మళ్ళీ మందులు అవసరం వస్తే షాపులో పటుకెళ్ళమని చెప్పి, యువకుణ్ణి పంపేసి, మందులు కావలసి వస్తే ఇవ్వమని, డబ్బులతనిస్తే తీసుకో,లేకపోతే నేనిస్తానని షాపతనికి చెప్పి ముందుకెళ్ళా. అక్కడో వింత సంఘటన జరిగింది. అది రేపు చెప్పుకుందాం.

రాత్రి తొమ్మిది గంటల వేళ ఎవరో బయట కేకేస్తున్నారని, నా ఇల్లాలు చెప్పింది. బయటకెళ్ళి చూస్తే, క్రీనీడలో ఎవరో నిలబడి వున్నారు. ఎవరన్నా. బాబయ్యా! పొద్దుట మందులిప్పించేరు కదా, నేనే నండి అన్నాడు. ఏమయిందన్నా. మరి మందుల అవసరం లేకపోయిందిటా. ఇప్పుడు నా ఆడది బాగుంది బాబయ్యా. మీకు కనపడి చెప్పి పోదామని వచ్చేను. షాపతనినడిగితే, ఇల్లు గుర్తు చెప్పేడు, అన్నాడు. దేవుడులా వచ్చి కాపాడేరు. డబ్బులు రెండు రోజుల్లో ఇచ్చేస్తా, అది చెప్పడానికొచ్చానన్నాడు.

నాయనా! నేను కాపాడలేదురా. కాపాడినది పరదేవత. నువ్వు పడిపోయావని బాధ పడ్డాము, పొద్దుట. నువ్వు పడిపోయివుండక పోతే నేను నిన్ను పట్టించుకోనుకదా. పరదేవత నిన్ను పడేలా చేసి, నా దృష్టికి నువ్వు వచ్చేలా చేసి, తద్వారా నీ ఆడది బతికే యోగం కలగచేసింది. ఇందులో నేను చేసిందేమీలేదు. డబ్బులు ఉన్నపుడియ్యి. వాటిగురించి కంగారుపడకని చెప్పి పంపించాను.

స్వానుభవం అయితేకని తత్వం వంట పట్టదు మరి.

శర్మ కాలక్షేపంకబుర్లు-మూడోకాలు ముచ్చట.

Posted on డిసెంబర్ 22, 2011
మూడోకాలు ముచ్చట.

రెండు రోజులుగా మోటార్ సైకిల్ పాడవటం మూలంగా ఇంట్లోనే వుంటున్నా,ఎక్కడకీ కదలకుండా,..కరంటులేదు, బయటికివెళ్ళేందుకు వాహనంలేదు. బజారు మాకు దగ్గరగా, రెండు కి.మీ ల దూరం. ఈ లోగా అత్తా, కోడలు ఏదో వస్తువు లేకపోయిందని కాబోలు అనుకుంటూ వుండగా, ఏమన్నా. ఫలాన వస్తువు కావలసి వుంది, లేకపోయిందన్నారు. నేను వెళ్ళి, బజారు నుంచి తెస్తానన్నా. బండిలేదు కదా, వద్దన్నారు. నడిచి వెళ్ళొస్తానని బయలుదేరా.

బయటకి వస్తూ వుంటే, నా ఇల్లాలు కూడా వచ్చి గేటు దగ్గర నిలబడింది. నేను వెళ్ళొస్తానని బయలుదేరా. నాలుగడుగులేసివుంటా, తూలానో, పడ్డానో, పడబోయానో, పడిపోయానో తెలీదు. నా సహచరి, గబుక్కున వచ్చి చెయ్యిపట్టుకు లేవదీసి, పట్టుకుని నిలిపింది. వద్దంటూ వుంటే బయలుదేరారు. ఎందుకంత కంగారని గునిసింది. నేను కవిని కదా. కొన్ని వినపడ్డాయి. కొన్ని వినపడలేదు. లోపలికి తీసుకొచ్చేసింది. వచ్చి కాసేపు కూచున్నా. మళ్ళీ బయలుదేరుతున్నానన్నా. వద్దంది. వినలేదు. సరే, అలా అయితే కర్రపుచ్చుకు వెళ్ళమంది. ఉదయం నడకకి వెళ్ళేటపుడు కర్ర పుచ్చుకు వెళ్ళడం అలవాటే. ఇలా బజారుకి కర్ర పుచ్చుకు వెళ్ళడం మాత్రం కొత్తే. కర్ర అంటే, మా పల్లెలలో, రైతుల దగ్గర పెద్ద కర్ర ,అంటే ఆరడుగుల కర్ర వుంటుంది. నడకకి ఉపయోగపడదు. నాకు ఉదయం నడకకి కాను, రెండు కర్రలు వెదురుతో తయారు చేసుకున్నా, ఖాళీగావున్న స్థలంలో పెంచిన వెదురు పొద నుంచి….. అందులో ఒకటి నా చేతికిచ్చింది. పుచ్చుకు బయలుదేరా.

మలుపుతిరిగానో లేదో ఎవరో ఎదురుపడ్డారు. నడిచెళుతున్నారేం, ప్రశ్న. బండి పాడయింది, బజారు పని వుంది అందుకన్నా. కర్రపుచ్చుకు బయలుదేరారేంటీ? మరో ప్రశ్న. తూలుతానేమోనని అనుమానమన్నా. సరే వెళ్ళిరండని శలవిచ్చాడు. కొంత దూరమెళ్ళేటప్పటికి మరొకరు నిలేశారు. సరే, కధ మామూలే. ప్రశ్న, జవాబులూనూ. మరికొంత దూరమెళ్ళేసరికి మరొకరు నిలబెట్టి, మళ్ళీ అంతా అయిన తరవాత అప్పుడే కర్ర పట్టుకోవలసి వచ్చిందా అని అశ్చర్యం ప్రకటించి, మీ వయసెంత అన్నారు. అయ్యో! ఈవేళకి నేను బజారుకి చేరేలా లేదే అనుకుంటూ జవాబిచ్చి, బయటపడ్డా. ఈలోగా నేనేమయ్యానోనని మా చిన్న కోడలు కంగారు పడి ఫోన్ చేసింది. మామయ్యగారూ! ఎక్కడున్నారు, ఎలా వున్నారు. అమ్మా! బాగానే వున్నాను. కర్రపుచ్చుకు బయలుదేరినందుకు సంజాయిషీలు యిచ్చుకుంటూ బజారుకొచ్చా, అన్నా. సరే పని చూసుకుని వచ్చేయమన్నారు అత్తయ్య గారంది. సరేననన్నా. ఈలోగా మా పక్కింటబ్బాయి కనపడి తాతా నడిచొచ్చావా! మూడో కాలొచ్చిందే! నాకు చెబితే నేను నీ పని చేయకపోదునా, అన్నాడు. ఇక ముందురోజుల్లో ఆ ముచ్చటా తీరుతుందిరా నాయనా అని, వస్తువేదో తీసుకున్నా. నా కర్రతో ప్రయాణం చూసి, కొట్టతను, ఫోన్ చేస్తే నేనే పంపేవాణ్ణి కదా, వస్తువన్నాడు. మేడంగారు ఎప్పుడేనా ఇలా అవసరం పడితే ఫోన్ చేస్తారు, సరుకు నేను కుర్రాడిచేత పంపిస్తాను కదా, అన్నాడు. అయ్యో! నాకు తోచలేదయ్యా! అని బయలుదేరుతుంటే మా కాలనీ అతను కనపడి, నడిచి వచ్చారా అని విచారించి, నేను ఇంటికెళుతున్నా రండని, బండి మీద తీసుకొచ్చి ఇంటి దగ్గరొదిలేసాడు. కర్రతో నా బజారు ప్రయాణానుభవానికి నా ఇల్లాలు ముసి ముసి నవ్వులు నవ్వింది.

శర్మ కాలక్షేపం కబుర్లు-తెనుగునేర్పిన తల్లులు

Posted on డిసెంబర్ 21, 2011
తెనుగు నేర్పిన తల్లులు.

ఈరచన నాదికాదు. చదవండి

“దాపరికం ఎందుకూ?
గ్రంధాలు చదివే నేను తెలుగు భాష తెలుసుకున్నాను.
స్త్రీలనాశ్రయించిన్ని నేర్చుకున్నా న్నేను తెనుగు భాష.
ప్రయోగ విఙ్ఞానం కూడ స్త్రీలవల్లనే అలవడింది నాకు.
జరిగిందేమంటే?
మొత్తం మీద,అప్పటిదాకా,నేను చదువుకున్నది పద్య వాఙ్ఞయమూ, రచిస్తున్నది వచన వాఙ్ఞయమున్ను.
రెండింటికీ లంగరందలేదు.
అందుకోసం,తప్పని సరిగా,నేను జనుల సంభాషణలు వినవలసి వచ్చింది.
అందులోనూ స్త్రీల సంభాషణ వినవలసి వచ్చింది.
పురుషుల భాష అయినా, ఇప్పటిలాగా ఇంగ్లీషు మొదలైన పరభాషలతో సంకరం అయి,పలుకుబళ్ళు లేనిది కాదప్పుడు.
అయినా,పురుషుల భాషలో కంటే,స్త్రీల భాషలో మాధుర్యమూ, హృదయాలను పట్టివేసే జాతీయతా కనపడింది నాకు.
వారి మాటల పొందికా,వారి హావ భావ ప్రదర్శనాచాతుర్యమూ తెనుగు భాషలో నాకు మాతృభిక్ష ప్రసాదించాయి.
ఈ విశేషం కనబడగానే స్త్రీల గోష్ఠి జరిగేచోట నేను పొంచి వుండడం ప్రారంభించాను. అది నెల కిరవై రోజులు మా ఇంటోనే సమకూరేది.
ఏమంటే?
మా నాయనగారు, మధ్యాహ్నం భోజనం కాగానే మహేంద్రవాడో, రామవరమో వెళ్ళేవారు, నియతంగా.
భోజనాలయి, యిళ్ళు సద్దుకోడం కూడా అయాక, తటవర్తి సుబ్బమ్మ( భీమరాజుగారి భార్య)గారూ, మైలవరపు జోగమ్మగారూ,బుద్ధవరపు సీతమ్మగారూ మా ఇంటికి వచ్చి మా అమ్మగారితో గోష్ఠి జరిపేవారు.
వారి దృష్టిలో, అదీ కాలక్షేపం కోసం లోకాభిరామాయణం విడెయ్యడం; కాని నా దృష్టిలోరసమహితమైన సాహిత్య గోష్టి.
ఆ నలుగురిలోనూ మళ్ళీ ధోరణి భేదించేది, స్పష్టంగా.
బుద్ధవరపు సీతమ్మగారు ఛలోక్తులు విసిరేవారు.
మైలవరపు జోగమ్మగారు శ్లేషలు కురిపించేవారు.
మా అమ్మగారు సామెతలూ పలుకుబళ్ళూ విరజిమ్మేవారు.
తటవర్తి సుబ్బమ్మగారు నిండుకుండలాగా నిశ్చలంగా మాట్టాడేవారు.
నవరసాలూ చిప్పిల్లేవి ఆ గోష్ఠిలో.
సరస్వతి లాస్యం చేస్తున్నట్లుండేది, అప్పుడక్కడ.
కాళిదాసు నాలుకమీద బీజాక్షరాలు రాసిందట కాళికాదేవి.
నా చెవిలో మాతృదేవతలు బీజాక్షరాలు కుమ్మరించారు.
ఇవాళ నేను రాస్తున్న భాష వారనుగ్రహించినదాన్లో సహస్రాశమైనా కాదు, ఇంతా చేస్తే.
ఇలాగ,నేను,వారేకాదు నలుగురు స్త్రీలెక్కడ మాట్టడుకుంటున్నా వింటూ వుండేవాణ్ణి.
అయితే రచన ప్రారంభించినప్పణ్ణుంచీ మాత్రమే కాదు నాకు,యీ అలవాటు.
నా చిన్నతనంలో, మా అమ్మగారెవరింటి కయినా పెత్తనాలకు వెడితే,ఆమె చంకన మా చెల్లెలూ, చెయ్యి పట్టుకుని నేనూ సిద్ధం.
ఆ పసితనంలో కూడా, నాగస్వరం విన్న కోడెతాచులాగ వారి సంభాషణ వింటూ తెలియకుండానే పరవశుణ్ణయేవాణ్ణి,నేను.
అప్రయత్నంగా ప్రారంభమైన అయిన ఆ అలవాటూ, తెలియకుండానే అలవడిన ఆ పారవశ్యమూ రచన ప్రారంభించాటప్పటికి వరప్రసాదాలయినాయి, నాకు.
ఇక్కడ మరొకసంగతి కూడా చెప్పాలి, అవశ్యమున్ను.
బుద్ధవరపు సీతమ్మగారి ఇంటో కలుసుకునేవారు ఆ స్త్రీలు, అప్పుడప్పుడు.
దొడ్డిదారిని వచ్చి శ్రీ దాట్ల దివాకరరాజుగారి భార్య బుచ్చివెంకయ్యమ్మ (?) గారున్నూ కలిసేవారాగోష్ఠిలో.
పొడుగుకు తగిన నిండైన విగ్రహమూ, పాదాల మీద జీరాడుతూ చారల తాబొందూ,చేతులకు కంకణాలూ,పోచీలు,మురుగులూ,చెవులకు జూకాలూ, కరిణిపువ్వులూ- వీటితో, క్షత్రియ సామాన్య స్త్రీగా కాదు- మహారాణీ లాగ కనబడేవారామె, నాకు.
పెద్దాపురం రాజవంశానికి చెందిన కొంకుదురు శ్రీ వత్సవాయవారి ఆడబడుచు ఆమె.
ఆమె మాట కూడా రాణుల ధోరణిలోనే వుండేది.
వారి ఏకపుత్రులు సూర్యనారాయణరాజుగారి కోసం వారి ఇంటికి వెళ్ళినప్పుడల్లా, వాత్సల్యం గుమ్మరిస్తూ
నన్ను దగ్గరకూచోబెట్టుకుని ” ఆరగించడి బాబూ” అనేవారామె, పూచుట్టరేకులు పళ్ళెంలో వుంచి.
ఇంతకీ,-
జాతీయమైన తెనుగు భాష కావాలంటే స్త్రీల దగ్గరే నేర్చుకోవాలి, మరో దారి లేదు.
నాకు రాచ మర్యాద లేమయినా తెలుసునంటే, అవి, ఆ చిన్నతనాన ఆ దివాకరరాజుగారిఇంటో గ్రహించినవే.
రాజరాజు నాటకంలో, రత్నాంగి పాత్ర చిత్రించేటప్పుడు ఆ బుచ్చివెంకయ్యమ్మగారి మూర్తిమంతమే ప్రత్యక్షాదర్శం, నాకు.”

పై, తెనుగు భాషకు సంబంధించి రాసినది నా అభిమాన రచయిత శ్రీ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి “అనుభవాలు -ఙ్ఞాపకాలూను”నుంచి ఎత్తి రాయబడినది. రాతలో దోషములన్నీ, నావే, రచయితవి కావని విన్నపం. దోషాలుంటే తెలియచేయగలరు. మూలం చూసి సరి చేస్తాను. శ్రీ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు మా వూరికి మూడు కిలో మీటర్ల దూరంలో వున్న ” పొలమూరు” అనే గ్రామములో జన్మించారు. వారి గురించి నేను చెప్పబోవడం హాస్యాస్పదము.

శర్మ కాలక్షేపం కబుర్లు- మరపు, మరణం

Posted on డిసెంబర్ 20, 2011
మరపు, మరణం.

భవంతుడు మానవులకిచ్చిన రెండువరాలు, మరపు, మరణం. ఇదేంటి ముసలాయనికి మతిపోయి మాట్లాడుతున్నాడనుకుంటున్నారా! కాదు ఎందుకో చూడండి.

మరపు అనేది అన్నివేళలా మంచిదికాకపోయినా, కొన్ని కొన్ని సంఘటనలు గుర్తుకు రాక పోవడమే మంచిది. ఇటువంటి ఒక దుస్సంఘటన మరపుకు రావడం మానటంలేదు. నేను జగ్గంపేటలో ఉద్యోగం చేస్తున్న రోజులు. రాజమండ్రి హెడ్ ఆఫీసు కు వెళ్ళాలంటే నేషనల్ హైవే మీద ప్రయాణం చేయాలి. వయసు నలభైదగ్గరలో వున్న సమయం. ఇంకా పైలా పచ్చీసుగానే వుంది వ్యవహారం. మోటార్ సైకిల్ మీద బయలుదేరాను. కొంతదూరం వెళ్ళేటప్పటికి ఒక ఆర్.టి.సి బస్సు వెనకపడ్డాను. వాడు ముందుకు పోడు, నాకు దారి ఇవ్వడు. సింగిల్ మార్జిన్ రోడ్డు. కొంతదూరం పోయిన తరవాత బస్ ని తప్పించుకుపోవాలని ప్రయత్నంలో బండి లాగించాను. బస్ వాడు అప్పటిదాకా నెమ్మదిగా వెళుతున్నవాడు స్పీడు పెంచాడు. ఈలోగా ఎదురుగా లారీ వచ్చేస్తోంది. నాకు తప్పించుకునేదారి లేదు. పడితే బస్ కింద లేదా లారీ కింద పడితీరాలి. ఈలోగా నేను బండి స్పీడు తగ్గించాను, అయినా బస్ వెనకకి రాలేకపోయాను. బస్ మధ్యలో వున్నాను. భగవంతుడే వున్నడనుకున్నా, ఆయన మీద భారం వేసా….. ఈలోగ లారీ వాడు తన ఎడమ వైపు మార్జిన్ లేక పోయినా కిందికి బాగా దిగిపోయి తను పల్టీకొట్టే దాకా వెళ్ళిపోయాడు. నా కుడిచేతి చిటికిన వేలు లారీబాడీకి నా బైక్ హేండిల్ కి మధ్య నలిగి నేను చావుతప్పి రోడ్ మీద వున్నాను. బస్ వెళ్ళిపోయింది. లారీ వెళ్ళిపోయింది. ప్రమాదంతప్పి బతికినా ఉద్వేగం పోలేదు. నేను బండి రోడ్ పక్క ఆపి వేలు నోట్లో పెట్టుకుని చప్పరించా చాలా సేపు. అంతకుమించి అక్కడ వైద్యం దొరకదు కనక. ఒక అరగంట పైన అక్కడ కూర్చుండిపోయి, వణికిపోయా. చచ్చి ఉండేవాడినని. తరవాత బయలుదేరి వెళ్ళాను. లేచిన వేళ మంచిది, నా పెళ్ళాం పుస్తెల తాడు గట్టిదనుకుని భగవంతునికి నమస్కారం చేసుకున్నా, అపమృత్యువునుంచి రక్షించినందుకు. ఇది వద్దన్నా గుర్తుకొస్తూనేవుంది. మరపు మంచిదేగా

పెళ్ళాం పుస్తెలతాడంటే గుర్తొకొచ్చినదొక మంచి సంఘటన. నా/మా పెళ్ళి జరుగుతూ వుంది. మేనమామ కూతురే నా భార్య. పెళ్ళయిపోయింది. ఆమె చీరకి నా కండువాకి బ్రహ్మముడి వేసారు, బ్రహ్మగారు. అది విప్పడానికి లేదు, కార్యక్రమం పూర్తి అయేదాకా. తరువాతి హోమ కార్యక్రమానికి సిద్ధంచేస్తూ మమ్మల్ని ఒక అరగంట వదిలేసారు. వీధిలో పెద్ద తాటాకు పందిరిలో పెళ్ళి అయింది. దొడ్డిలో పెద్ద పందిరిలోకి వెళ్ళేము, ఇద్దరం చెయ్యే చెయ్యే పుచ్చుకుని పందిరి చివరికి చేరేము. అంతా పెళ్ళి తరవాత నిద్రకి పడ్డారు. ఏకాంతం,రాత్రి రెండు గంటల సమయం, వెన్నెల, చల్లని పిల్లగాలి, పక్కన కొత్తభార్య, కొత్తపల్లి కొబ్బరి మామిడిపండులా వుంది కొత్త భార్య,( కొత్తపల్లి కొబ్బరి మామిడి పండు సువాసన, తీపి రుచికి గోదావరి జిల్లాలలో ప్రసిద్ధి) భావోద్వేగం, వయసు ఆకర్షణ,వురకలేస్తున్న వయసు,దూరంగా వుండలేని పరిస్థితి, ఆమెమీదుగా వచ్చే, మనసుకు మత్తు కలిగించే మల్లెల సువాసన. మదనుడు సందడి చేయడానికి తగు సమయం. ఆమె వెన్నెలలో నిలబడింది. నేను ఒక్క సారిగా ఆమెను నా కౌగిలిలో బంధించి గాఢంగా ముద్దుపెట్టుకున్నా. ఆశ్చర్యపోలేదుకాని, తనూ ఆ భావోద్వేగం లోనే వున్నది కనుక, ఇంకేమికావాలి. అబ్బా! ఇదేంటి! అంది. ముద్దోయ్! మొద్దూ! అన్నా. నన్ను మొద్దంటావా అని మీద పడింది. మరొకసారి కౌగిలిలో బంధించా, మరో సారి ఇద్దరం ముద్దు పెట్టుకున్నాము. విడిపించుకోడానికిచేసే ప్రయత్నంలా నటించింది. ఆనందమే ఆనందం. ఈలోగా అలికిడయింది.. రసభంగమైపోయింది. ఇది మరపురాని, మరువలేని సంఘటన. ఇప్పటికీ గుర్తు చేసుకుంటాము అప్పుడపుడు. ఇప్పుడంటుంది. మీవన్నీ ఆత్రం పనులేఅని. ఇదేమిటి మీకు సిగ్గులేదా ముద్దు పెట్టుకున్నానని చెబుతున్నారు, అంటున్నారు కదూ. నిజమే! నేను కొత్తగా, నా జీవితంలో ప్రవేశించిన ఆమెకు ఇచ్చిన స్వాగతం అది. మొదటిసారి నేను ముద్దుపెట్టుకున్నా, రెండవసారి ఇద్దరం ముద్దు పెట్టుకున్నాం, అదీ తేడా. ఈ సంఘటన వయసు ఇప్పటికి ఏబది సంవత్సరములు. ఇప్పటి యువకులు, యువతులు, నడి వయసు వారు,పెద్దవారు కూడా ఇటువంటి ఒక సంఘటన గుర్తుచేసుకోండి. మీ ఇద్దరిలో డోపమైన్ అనే రసాయనం మెదడులో విడుదలై మీ ఆరోగ్యాన్ని, ఆయుస్సును పెంచుతుంది. ప్రయత్న పూర్వకంగా చేసి చూడండి. ఉత్తేజం పొందండి. నేను నా భార్యను ముద్దు పెట్టుకున్నానని చెప్పుకోడానికి సిగ్గెందుకూ. ఇది ఆమరణాంతం ఇద్దరికి గుర్తుండే సంఘటన. మరణమంటే గుర్తుకొచ్చింది.

మరణం భగవంతుడిచ్చిన మరొక వరం. ఈ శరీరం, అసలుగా చెప్పాలంటే నూట ఇరువది సంవత్సరములకొరకు భవవంతుడిచ్చినది. కాని మనం దుర్వినియోగం చేసుకోవడం మూలంగా అరువది సంవత్సరములు ఆయువు మించటంలేదు. అనాయాసేన మరణం వినా దుఃఖేన జీవితం అన్నారు. బాధ లేకుండా మరణించడం. దుఃఖం లేకుండా జీవించడం కావాలని పెద్దలు చెబుతారు. దుఃఖం లేకుండా జీవితం వెళ్ళదుకాని, అనాయాస మరణం భగవంతుని దయే. ఈ మధ్య నాకు తెలిసిన వొకాయన పోయారన్నారు. అదేమిటి నేను ఒక గంట కితం ఆయనతో మాట్లాడి వచ్చేను, ఆన్నా కొడుకుతో పరామర్శకి వెళ్ళినపుడు. నిజమే ఆ తరవాత ఆయన కొత్తగా కడుతున్న ఇంటి దగ్గరకెళ్ళి పని వాళ్ళకి సూచనలిచ్చి, వచ్చి కుర్చీలో కూచుని మంచినీళ్ళు తాగి, రెండు నిమిషాలలో ప్రాణం వదిలేసాడట. నలుగురు కొడుకులూ మా నాన్న అనాయాసంగా మరణించినందుకు ఆనందమేకాని, నలుగురు కొడుకులునీ జాగ్రత్తగా పెంచాడు. ఎవరికి ఇబ్బంది లేని విధంగా అన్నీ రాతకోతలు పూర్తిచేసి,ఆస్థులిచ్చి, మాకు, మా జీవితాలకి మార్గ దర్శనం చేసిన మా నాన్న గొప్పవాడని కీర్తించిన కొడుకులను చూసి నేను ఆనందపడ్డాను. మరణమూ వరమేగా

శర్మ కాలక్షేపం కబుర్లు-జల్లెడ అడ్డంపెట్టి ఊకతో కొట్టేడు.

https://kastephale.wordpress.com/2016/10/23/  Post on other blog

Posted on డిసెంబర్ 19, 2011
జల్లెడ అడ్డంపెట్టి ఊక పుచ్చుకు కొట్టేడు.

మా సత్తిబాబొచ్చాడు. వస్తూనే పంతులుగారు ఎగతీస్తే బ్రహ్మహత్య, దిగతీస్తే గోహత్య అని, తిట్టబోతే అక్క కూతురు కొట్టబోతే చూలాలు, …గారికి కోపం వచ్చి పెళ్ళాన్ని జల్లెడ అడ్డంపెట్టి ఊకపుచ్చుకు కొట్టేడంటారు. వీటి సంగతి చెప్పమన్నాడు.పెద్దపనే పెట్టేవు విను అన్నా!

తిట్టబోతే అక్క కూతురు, కొట్టాబోతే చూలాలు. ఇందులో అక్కకూతురే పెళ్ళాము మరి. అక్క కూతురిని తిట్టడానికి లేదు. పోనీ కొడదామనుకుంటే చూలాలు ఎలా కొడతాడు. పని జరగదు. ఆలోచన మాత్రం ఉంది. కొట్టకపోడానికి ఆలోచన చేస్తాడు, కారణాలు వెతుక్కుని మానేస్తాడు. తరవాత ఎగతీస్తె బ్రహ్మహత్య, దిగతీస్తే గోహత్య. ఒక రాజుగారు తనకోటలో వుండగా ఆయన మీద పరాయి రాజు దండయాత్ర చేసాడు. రాజు గారికి కోటలో పటాలంలేదు. బుర్ర ఉపయోగించి దేశం లో వేదపండితులను, నిరాయుధులను, ఆవుల మీద ఎక్కించి యుద్ధ రంగానికి పంపేడు. అవతలి సైనికులు విల్లు ఎక్కుపెట్టి కొట్టబోతే పైకి బాణం వేస్తే వేదపండితుడు చస్తాడు. కిందకి వదిలితే గోవు చస్తుంది. పాత కాలం రోజుల్లో కనక, ధర్మ సంకటంలో పడి వాళ్ళు పారిపోయారు. కోటలో రాజు బతికి పోయాడు. ఇక్కడ ఆలోచన ఆచరణ ఉన్నాయి కాని అనుకున్న పని జరగలేదు…… గారి తల్లికి కోడలు మీద కోపం వచ్చి కొడుక్కి చెప్పింది. తల్లిని సంతోషపెట్టాలి, అలాగే పెళ్ళానికి బాధ కలగ కూడదు.అప్పుడు…..గారు కోపం తెచ్చుకుని జల్లెడ అడ్డం పెట్టుకుని ఊకపుచ్చుకుని కొట్టేడు. అసలు ఊకతో కొడితే దెబ్బ తగలదు. దానికితోడు జల్లెడ అడ్డం పెట్టేడు. అంటె ఊక పాయ కూడా పెళ్ళాం మీద పడదు. ఇక్కడ అలోచన, ఆచరణ, ఉన్నాయి కాని ఫలితమేలేదు. కాదు అక్కరలేదు. తల్లికి పెళ్ళాన్ని దండిస్తున్నట్లుగా చూపేనాటకం. ఇదయ్యా సంగతి అన్నా!.బాగా చెప్పేరు నేనో కత చెప్పనా అన్నాడు. దానికేం చెప్పు అన్నా. మా సత్తిబాబిలా చెప్పేడు.

అనగనగా ఒక రాజు, ఆరాజుకి దగ్గరగా ౩౦౦ మంది అధికార, అనధికార సభ్యులు. మంత్రులు, అధికారులు, వగైరా వగైరా వున్నారు. ఇందులో ఒక మంత్రి పితూరి లేవతీస్తునాడని రాజుకి అనుమానం వచ్చింది. మంత్రిని లొంగతీయాలి ఎలా? దండనాయకుణ్ణి పిలిచి, మన దేశంలో అవినీతి పెరిగిపోయినట్లుగా అనుమానమొచ్చింది. తగు చర్య తీసుకుని చెప్పమన్నాడు. దండనాయకుడు వ్యాపారులమీద పడి దస్త్రాలు తెచ్చి చూస్తే అందులో ఎవరెవరికి ఎంతంత లంచంగా, సొమ్మిచ్చినది వైన వైనాలుగా వున్నట్లు పొక్కింది. గోలగొలైపోయింది. పితూరి లెగతీద్దామనుకున్న మంత్రి ఇందులో చిక్కుకుపోయాడు. తనవాళ్ళని అందరిని పిలిచి ఇది గోరం, ఆపు చేయించమని రాజు గారికి చెప్పించేడు. కుదరలేదు. అప్పుడు మీరు చెప్పినట్లు మేము వింటాము ఇయ్యన్ని తీయించేయండి. లేదా పితూరి లెగతీస్తామన్నాడు. ఇంకో సంగతి కూడా చెప్పేడు. వాడెవడో, వాడి పుస్తకాల్లో మా పేర్లు రాసుకుని డబ్బులిచ్చేనంటే కుదురుద్దా. సాచ్చికాలక్కరలేదా. కోర్ట్ కెల్తే కేసు నిలబడద్దా, మీ వోదనతో. అంచేత ఎనక్కి తీసుకోమన్నాడు. రాజు గారికి కావలసిన పనయిపోయింది. దండనాయకుడు తెచ్చిన దస్త్రాలలో ఈళ్ళ పేర్లున్నాయా, ఎందుకున్నాయి, ఎలా వున్నాయి చూసి చెప్పమని సెగెట్రీ కి చెప్పేరు రాజుగారు. సరి అక్కడితో ముందు గొడవాగింది. సెగెట్రీ చూడాలి, ఈలోపట ఎన్ని కాగితాలుంటాయో, ఎన్ని ఎగిరి పోతాయో ఎవురికెరుక. సెగెట్రీ చూసి చెప్పేటప్పటికి ఎంతకాలం పడద్దో. ఎవురి కెరిక, అన్నాడు.

కత బాగానే వుందిగాని, ఇందులో నాయకుడివి నువ్వేలా వున్నావన్నా! వామ్మో పంతులుగారు నేను కాదండీ అన్నాడు. ఇది మూడో సామెతకి సరిపోలేదా అన్నాడు

శర్మ కాలక్షేపం కబుర్లు- పెళ్ళిళ్ళ సంత

    శర్మ కాలక్షేపంకబుర్లు-చెత్త బంగారం    post in other blog

Posted on డిసెంబర్ 18, 2011
10
పెళ్ళిళ్ళ సంత.

మొన్న నొక అమ్మాయిని పెళ్ళిచేసుకోడానికి ఒప్పించిన దగ్గరనుంచి, నాకు కొత్త తలనొప్పి పట్టుకుంది. ఒక రోజు పెళ్ళి కి వొప్పించిన అమ్మాయి తల్లి తండ్రులొచ్చేరు. బాబయ్యా! మొన్న నువ్వు చెప్పేకా పిల్ల వొప్పుకుంది. ఒక సంబంధం చూసాము. కాని మాకే నచ్చలేదు, వాళ్ళ గొంతెమ్మ కోరికలు చూసి. వాళ్ళకి పిల్ల కంటే ముందు, సొమ్ము మీద ఎక్కువ అపేక్ష కనపడింది, అందుకే కాదనుకున్నాము. .ప్రతి ఆదివారం పక్కనున్న పట్నంలో పెళ్ళిళ్ళ సంత జరుగుతుంది, అక్కడకెళదాము అంది. మామయ్యగారూ ఆదివారం కారేసుకొస్తాను మీరు, అత్తయ్యగారు, నేను, మీ అమ్మాయి కలిసి వెళదాము. మీకు ఏరకమైన ఇబ్బంది లేకుండా చూసే బాద్యత నాది. మీరు తప్పకుండా రావాలన్నాడు. అయ్యో ఇదేంటయ్యా! కూరల సంత, సరుకుల సంత, పశువుల సంత ఎరుగుదును, కాని పెళ్ళిళ్ళ సంత తెలియదే అన్నా. బాబయ్యా, పెళ్ళిళ్ళ సంత అంటే మేరేజి బ్యూరో, నీకు ఇంగ్లీషులో చెబితే తెలియదని ఇలా చెప్పేరు. ,ఇప్పుడు వీధికి మూడు మేరేజి బ్యూరోలున్నాయి. ఆఖరికి పత్రికలవాళ్ళు కూడా గెట్ టుగెదర్లు కులాలవారీగా ఏర్పాటుచేస్తున్నారు, అంది. పాత కాలంలో బతకలేని వాళ్ళు పెళ్ళిళ్ళ పేరయ్యలుగా తిరిగి పెళ్ళిళ్ళు చేయించి బతికేవారు. ఇప్పుడు బతకుతెరువుగా పెళ్ళిళ్ళు చేయిస్తున్నారు. సరే మీ పిన్నిని అడుగు ఏంఅంటుందో అన్నా. అందుకు నా ఇల్లాలు, దానికేం వెళదాం. మీరు ఉదయాని కొచ్చెయ్యండి. నేను వంట చేసి కేరేజిలో సద్దుతాను, నువ్వేం ప్రయత్నం చెయ్యకే అమ్మాయ్ అంది. ఆదివారమొచ్చారు. అందరం శకునం చూసుకుని మరే బయలుదేరాము. అక్కడికెళ్ళేటప్పటికి నిజంగానే సంతలా వుంది. ఒకటే జనం. ఒక పెద్ద హాలులో టేబుళ్ళేసి అక్కడెవరో కూచుని ఏదో చేస్తున్నారు, ఆహూతులు కూచోడానికి కుర్చీలేసారు.. మామయ్యా, మీరు అత్తయ్య ఇక్కడే కుర్చిలలో కూచోండి. మేంవెళ్ళి అక్కడ, రిజిస్ట్రేషన్ ఫీజు వగైరాకట్టి, మనకు కావలసినవి చేసుకొస్తా మని వెళ్ళేరు.

ఈలోగా మాకు, మాలాగే వచ్చిన మరొకాయన కనబడ్డాడు. మీరెవరంటే మీరెవరనుకుని, ఎవరం ఎ0దుకొచ్చామో చెప్పుకున్నాము. ఆయన మొగపిల్ల వాడికి పెళ్ళి సంబంధం కోసం తిరుగుతున్నాడట. రెండేళ్ళనుంచి తిరుగుతున్నా, సంబంధం కుదరలెదన్నాడు. అదేమన్నా. అబ్బాయి స్వంతంగా ఫేక్టరీ నడుపుతున్నాడు. వంద మందికి వుపాధి చూపిస్తున్నాడు. నాకు కట్న కానుకలొద్దు. ఇంటిని నిర్వహించుకునేపిల్ల, ఉన్నవాటిని చూసుకోగల పిల్ల, సంసారం లో కలిసిపోయేపిల్ల, చదువుకున్నది చాలు అంటున్నా, పిల్లకి, పిల్లవాడికి నచ్చుబాటయితే చాలు. బాగానే వుందిగా మరి ఇంతకాలం ఎందుకు పట్టిందన్నా. అమ్మాయిల తల్లి తండ్రులు వుద్యోగస్తుడయి వుండాలంటున్నారు. వ్యాపారం కుదరదట. గవర్నమెంటు వుద్యోగి ఐతే చాలట. ఏడవాలో నవ్వాలో తెలియటం లేదు. ఒక సంబంధం వచ్చింది. అన్నీ నచ్చేయి, కాని పిల్ల తల్లికి పెళ్ళికొడుకు నచ్చలేదట. మరో సంబంధంవాళ్ళు జాతకం నచ్చలేదన్నారు. మనకి జాతకాలు చూసే పెళ్ళి చేసేరా! కుల గోత్రాలు చూసి పిల్ల కనుముక్కు తీరు చూసి ఈ పిల్ల మనబ్బాయికి బాగుంటుందని పెద్దవాళ్ళు చెబితే, మనం లాంఛనంగా వెళ్ళి, చూసొచ్చి బుర్రూపితే పెళ్ళి చేసేవారు. మనం బాగోలేమూ, అని ఆయన బాధ వెలికక్కేడు. మనకాలంలో ఈ పిచ్చిలు లేకపొయాయి. ఏమో కాలం మారిపోయిందన్నాడు. ఈలోగా అమ్మాయి వచ్చి రిజిష్ట్రేషన్ చేయించాము. ఇప్పుడు సంత మొదలవుతుందంది. నెమ్మదిగా పదకొండయింది. ఒకాయన పెద్ద పుస్తకం పుచ్చుకుని స్టేజి మిదకొచ్చి అందరికి అభివాదం చేసి ఎంతకాలం నుంచి ఈ పని చేస్తున్నది, ఎన్ని పెళ్ళిళ్ళు కుదిర్చినది చెప్పి కార్యక్రమం లోకి దిగేడు.

అబ్బాయి వయసు ముఫై, అమెరికాలో వున్నాడు. సాఫ్టు వేర్ ఇంజనీరు. ఇక్కడ తల్లి తండ్రులున్నారు. కట్నం అక్కరలేదు. లాంఛనాలతో పెళ్ళిచేస్తే చాలు. ఘనంగా చెయ్యాలి పెళ్ళి. చెన్నైలో కాని హైదరాబాదులో కాని హోటల్ బుక్ చేసి అక్కడచెయ్యాలి. ఎక్కడన్నది తరవాత చెబుతారు. అమ్మాయి కూడా సాఫ్టువేర్ వుద్యోగం చేస్తూవుండాలి, పెళ్ళయిన తరవాత అమెరికా రావాలి. అమ్మాయికి తల్లి, తండ్రి అన్నా, తమ్ములుండాలి. ఇందుకు తూగేవారు కౌన్టర్నెంబర్ మూడులో రిజిస్టర్ చేయించుకోండి. మధ్యాహ్నం ఇంటర్యూలుంటాయన్నాడు. ఒక ఆరుగురు లేచారు. మావాడులేవలెదు. ఏమన్నా! అన్నీ బాగున్నాయి కాని పిల్లకి అన్నదములను ఎక్కడనుంచితేను, నాకొకతేకదా పిల్ల, అన్నాడు. సరే ఇలా చెప్పుకుంటూ వెళ్ళేడు, స్టేజిమీద పెద్దమనిషి.. వీళ్ళది కూడా చెప్పేడు. ఎవరో నలుగురు రిజిస్ట్రేషన్ చేయించారు.

మద్యాహ్నం ఇంటర్యూకి నలుగురం నాలుగు దిక్కులకి వెళ్ళేము, తెచ్చుకున్న కేరేజి కారులోకూచుని తినేసి. ఎక్కడికెళ్ళినా, ఈవేళ విషయం చెప్పమన్నవారొకరు, అదేమిటి మీరు చెప్పిన విషయాలు చూసుకోవాలి, అలాగే మేము చెప్పినవి మీరు కూడా చూసుకోవాలి కదా అన్నా! కాదు విషయం ఇప్పుడే తేలిపోవాలన్నారు. . పిల్ల వుద్యోగం మానెయాలన్నవారొకరు, తల్లి తండ్రులకి ఒకతే కూతురు కనక వాళ్ళ బాధ్యత లేదన్నవారొకరు, మరొకరు పిల్ల, పిల్లాడికంటే ఎక్కువ చదువుకుంది కుదరదన్నారు.. కొంతమంది వీరికి కొంతమంది వారికి నచ్చలేదు. ఒకటి మాత్రం కొంచం దగ్గరగా వచ్చిందికాని పెళ్ళికొడుకు కావాలంటున్న ఎత్తుకన్నా మూడంగుళాలు ఎత్తు ఈ పిల్ల తక్కువుంది. వాళ్ళు ఠాట్! కుదరదన్నారు. సరే సాయంత్రమైనది. ఏడుపుమొఖాలేసుకుని ఊసురోమంటూ తిరిగొచ్చాము.

పదిహేను రోజుల తరవాత మళ్ళీ వచ్చారు భార్య భర్త. నేను చెప్పేసేను. నాయనా! పరిస్థితులు మా చేయి దాటిపోయి వున్నాయి. సంబంధం మీరే నిర్ణయం చేసుకోండి అన్నా! అందుకు అమ్మాయి, బాబయ్యా మా వూరిపక్కనున్న ఊరిలో ఒక సంబంధం తెలిసింది, చూసివద్దామని వెళ్ళేము. మాకు అన్ని విధాలా నచ్చింది. అబ్బాయి ఇక్కడె వుంటాడు. వ్యవసాయం చేసుకుంటున్నాడు. చదువుకున్నాడు. ఆస్థిపాస్థులు, ఇల్లువాకిలి వున్నాయి. అన్నతమ్ములు, అక్క చెల్లెళ్ళు వున్నారు. ఇతనికి కూడా మంచి వాటాయే వస్తుంది. కట్న కానుకలొద్దన్నారు. మాకున్నది పిల్లలకే అని చెప్పేము. వాళ్ళు, పెళ్ళి తరవాత మమ్మలిని కూడా పిల్లతో వచ్చెయ్యమన్నారు. మేము ప్రస్తుతానికి రాము, తరవాత రోజుల్లో వస్తామని చెప్పేము. అమ్మాయి వుద్యోగం చేసుకోడానికి అభ్యంతరంలేదు. కొద్ది దూరంలో వుద్యోగం చేసుకుంటుంది. ఇతను ఇక్కడ, అక్కడ సరి చూసుకుంటానని చెప్పేడు. సంబంధం కుదిరింది. పిల్ల మా కళ్ళముందు వుంటుంది. వాళ్ళిద్దరికి భాగ్యానికి లోటులెదు. పిల్ల, పిల్లాడు ఒకరిని ఒకరు ఇష్టపడ్డారు. నువ్వు మా పిల్ల పెళ్ళిగురించి చాలా శ్రద్ధ తీసుకున్నావు. నీకీమాట మేమిద్దరం స్వయంగా వచ్చి చెప్పాలని వచ్చామన్నారు. బాగుందమ్మా! పిల్లలికి కొన్ని నచ్చక , మనకి కొన్ని నచ్చక, గొంతెమ్మ కోరికలతో వుంటే పెళ్ళిళ్ళుకావు. మూడంగుళాల ఎత్తు తక్కువని పెళ్ళి మానుకున్న వాడు తెలివయినవాడా. మీ పిన్ని నాకంటే పొట్టి, మాకేంతక్కువయింది. ఒకరికి చూడటానికి నచ్చడం కాదు, మనకు నచ్చాలి. మన మనసుకు నచ్చాలి. బాహ్య సౌందర్యం రేపే పోవచ్చు, కాని అంతర్ సౌందర్యం అలా కాదే. మనసులు కలిసి సుఖంగా వున్న దాంట్లో బతికి, పది మందికి వుపకారం చెయ్యడం కంటే అందం, ఆనందం ఏముందమ్మా అన్నా! పెళ్ళికెళ్ళాలి మరి.

శర్మ కాలక్షేపం కబుర్లు-గొప్ప

https://kastephale.wordpress.com/2016/10/21/
శర్మ కాలక్షేపంకబుర్లు-ధప్పళం

శర్మ కాలక్షేపం కబుర్లు-గొప్ప
Posted on డిసెంబర్ 17, 2011
2
గొప్ప

ఒకప్పుడు ప్రయాణ సాధనాలు లేని రోజుల్లో సైకిలు గొప్ప. తరవాత మోటార్ సైకిలు, తరవాత కారు.బాగా కలిగినవారు, హెలికాపటర్లూ కొనుక్కుంటున్నారు. అలాగే వంటింటి సాధనాలు కూడా. ఒకప్పుడు రోళ్ళురోకళ్ళు. తరవాత మిక్సర్లు,గ్రైండర్లు వగైరా. ఒకప్పుడు గుడ్డి దీపాలేగతి. తరవాత కరంటు లైట్లు. ఇప్పుడు ఇంటికి ఎ.సి లేకపోతే నామోషీ. ఏంటీ ఎ.సి. పెట్టించలేదా అని, ఎత్తిపొడుపు. ఇలా మార్పువచ్చిన కొద్ది మానవులు సుఖాలకి అలవాటు పడిపోయారు. ఇది కూడా చెప్పాలంటె 1980 మొదలుకొని రోజురోజుకీ అన్నీ పెరిగినమాట వాస్తవం. అదే రీతిలో ఒకపుడు ఫోన్ వుంటే గొప్ప. ఆ తరవాత సెలోన్ గొప్ప. రోజులు మారాయి ఇప్పుడు ౩జి ఫోన్ గొప్ప. ఒకప్పుడు ఇంటిమీద టి.వీ ఏంటెన్నా గొప్ప ఇప్పుడు, కేబుల్ కనక్షను, ఎం.పి౩ ప్లేయరు గొప్ప. చేతిలో ఫోన్ లో టి.వి. గొప్ప. మానవుడు సాధనాలకి చాలా అలవాటు పడిపోయాడు. ఇప్పుడు నాలుగడుగులేయాలంటే బండి తీయాలి. వీధి చివరకి బండి మీద వెళ్ళి వచ్చేవారు ఉదయపు నడక, సాయంత్రం నడక చేస్తున్నారు. ఇదేమో అర్ధం కావడం లేదు.కొంతమంది తెలివైనవాళ్ళమని గొప్పకిపోతారు. కొంతమంది కలిగినవారమని, కొంతమంది అందమైనవారమని, చదువుకున్న వారమని గొప్పలు చెప్పుకోవడం అలవాటయిపోయింది.

ఆలి వంకవారు ఆత్మ బంధువులని మన తెలుగునాట నుడికారం. పండగ ముందే అమ్మాయొచ్చింది. అమ్మా మనవాళ్ళనెవరినేనా చూసొద్దామంటే నా శ్రీ మతి తనకు వరసకు అన్న అయ్యేవాళ ఇంటికెళదామంది, వాళ్ళ రెండ అబ్బాయికి మొగపిల్లాడు కలిగి ఈ మధ్యనే తీసుకొచ్చారు. వాళ్ళు పదే పదే రమ్మని చెబుతున్నారని బయలుదేరారు. సరే అనుకున్నారు. మీరూ రండి అన్నారు. దగ్గరేగా ఇరవై కిలో మీటర్లు ఆటోలో వెళ్ళి వచ్చేద్దామన్నారు. నిజమే కాని నావల్ల కాదు, మీరు వెళ్ళండి అన్నా. ఆదివారం ఇంటి దగ్గర పనులు పూర్తి చేసుకుని, చిన్నబ్బాయి, కోడలు, మనవరాలు, నా ఇల్లాలు, కూతురు, అల్లుడు పదిన్నరకి భోజనం చేసి బయలుదేరారు. ఆ రోజు వుదయమే, వాళ్ళకి చెప్పండి, వస్తున్నా మని, లేకపోతే వాళ్ళు మరొక సంగతి పెట్టుకుంటే మీరు వెళ్ళి ఇబ్బంది పడతారన్నా! . వాళ్ళకి చెప్పేరు. మేము మీకోసం ఎదురు చూస్తామని వాళ్ళు చెప్పేరు. పదకొండు గంటలకి వెళ్ళేరు. చేరిన తరవాత ఫోన్ చేసారు. పదకొండున్నరకి చేరినట్లు.నేను నా బ్లాగులు చూసుకుంటూ కూచున్నా. ఒంటిగంటకి భోజనం చేసి కూచున్నా. రెండు గంటలయ్యే సరికి వీళ్ళు గోడకి కొట్టిన బంతిలా తిరిగొచ్చారు. ఏమి ఇంత తొందరగా వచ్చేశారు, మరి కాసేపుండి సాయంత్రం ఐదు గంటలికి రాలేకపోయారా అన్నా. లేదు మీరు భోజనం సరిగా చేసెరో లేదో అని కాకపోయినా అక్కడ కూచుని చెప్పుకునే కబుర్లు లేవుకదా! పిల్లాడిని చూసాము, వాడికేవో పట్టుకేళ్ళేము. అస్తమానం ఫోన్ లో మాట్లాడు కుంటూ వుంటే కబుర్లేమివుంటాయంది. నాకేదో కొద్దిగా అనుమానం వచ్చిందికాని చెప్పినపుడు విందామని ఊరుకున్నా.

సాయంత్రం నా ఇల్లాలు మరేదో సందర్భంలో మీరూ మీ చెల్లిలే చెప్పుకోవాలి గొప్పలు అంది.నాదేముంది, నేను గొప్ప చెప్పుకోడానికి ఏమీలేదు. అందమైన వాణ్ణని గొప్ప చెప్పుకోలేదు. తెలివైన వాణ్ణి కాదు, ధనవంతుణ్ణి కాదు,చదువు కున్న వాణ్ణికాదు.బుర్రలు తీసి బుర్రలు పెట్టగల సామర్ధం లేదు. నా వెనక పదిమందిని తిప్పుకోలేను. ఇంక నాకు గొప్పేముంది. అది మీ అన్నా, వదినలకే సాధ్యం కదా అన్నా! నేనూ అదే అంటున్నా! ఉదయం వాళ్ళపిల్లవాడిని చూద్దామని కదా వెళ్ళేము.గుమ్మంలో మీచెల్లిలు ఎదురొచ్చి రండి, రండి అంటు, మీరెప్పుడొస్తారో చెబితే కారు పంపుదునుకదా అంది. ఒక కొత్త కారు గుమ్మంలో ఉందిలెండి. కారుకొన్నారా అన్నా! మరే అబ్బాయికి కావాలని కొనుక్కునాడు. పుట్టింటికెళ్ళడానికి చిన్న కోడలు ఇబ్బందిపడుతోందని చిన్నబ్బాయి కొన్నాడు, అంది. తరవాత మాటల్లో చిన్న కోడలు తన పుట్టింటివారు మనవడు పుట్టిన సందర్భం లో కారుపెట్టేరని చెప్పింది. మీచెల్లెలు ఎంతసేపూ ఆవిడ గొప్ప చెప్పుకోడం, చిన్న వియ్యాల వారి సిరి, సంపదలు, వారి గౌరవ మర్యాదలు వగైరా చెప్పడంలో, వచ్చిన వాళ్ళకి మంచినీళ్ళు కూడా ఇవ్వాలనే విషయం కూడా మరిచిపోయింది. కూచున్న కాసేపు వీళ్ళెందుకొచ్చారా అన్నట్లుగా వుంది ఆవిడ ప్రవర్తన.పిల్ల వాడు ఏడుస్తూ వుంటే మీ చిన్న కోడలు ఎత్తుకుంది. వాడు వూరుకున్నాడు. సరదాగా వాణ్ణి ఏరా! ముద్దపప్పూ అంది. మీ చెల్లిలికి, ఆవిడ కోడలికి పెద్దెత్తున కోపాలొచ్చేసాయి. మా పిల్లలేమీ ముద్దపప్పులు కారులెండి అంటూ. ఇదేమిరా అనవసరంగా వచ్చి ఇరుక్కుపోయామనుకుని,కాసేపాగి వెళ్ళిపోతామన్నాము. ఆవిడ మాట మాట్లాడలేదు. అన్నయ్య కనపడ్డాడు, వెళ్ళిపోతున్నామన్నా! వాడూ మాట్లాడలేదు. మరెందుకని వచ్చేసాము. బొట్టు పెట్టాలనే సంగతికూడా మరిచిపోయింది మీ చెల్లెలు, నేను అడిగేదాకా అని సాగతీసింది.. సరే ఏంచేస్తాం వాళ్ళు కలిగినవారు. వాళ్ళింటికి మనం వెళ్ళడమే పొరపాటు అని సరిపెట్టుకున్నాం. ఈ రోజుల్లో నడమంత్రపు సిరి కలిగిన చాలామంది ఇలాగే వున్నారు.