శర్మ కాలక్షేపంకబుర్లు-బ్లాగు కష్టసుఖాలు.మన(సు)లో మాట.

Posted on జనవరి 9, 2012
23
బ్లాగు కష్టసుఖాలు-మన(సు)లో మాట.

ఇదివరకు బ్లాగు కష్టాలు చెప్పుకున్నాం కదా! ఇప్పుడు కష్ట సుఖాలు చెప్పుకుందాం అదే, మన (సు)లో మాట..

చాలా కాలం కితం విడ్జెట్స్ పెట్టిన తరవాత టెక్నికలుగా బాధలు లేవుకాని, వొక సారి టపా వెళ్ళ లేదు. అంతే. తరవాత నుంచి వున్న బాధ వొకటే. కరంటు రోజుకి పది నుంచి పన్నెండు గంటలు తీసేవాడు. టపా రాసుకోడం బాధయిపోయింది. ఎలారా! భగవంతుడా అనుకుంటే దారి దొరికింది. మా స్నేహితుని దగ్గర ఇంజను వేసేవారు, కరంటు పోతే అక్కడ కూచుని టపా రాసుకుని మెయిల్లొ పెట్టుకుని, ఇంటి కొచ్చాకా, కరంటొచ్చాకా, మైల్ నుంచి డౌన్ లోడ్ చేసుకుని సరి చేసి టపా వేసేవాడిని. ఎందుకింత కష్టం? ఏమో తెలియదు. రాయాలి అంతే. అలాగే రాశాను. వొక్కొకప్పుడు వారం పదిరోజులకి టపాలు సిద్ధంగా వుండేవి. వొక్కొకపుడు అప్పటికప్పుడు రాసి వేసినవి వున్నాయి. ఏమయినా 108 రోజులికి యీ రోజుతో 111 టపాలు, వెంకన్న బాబన్న మాట. మొదట యీ బాధలు పడి రాయడమెందుకని, మానేదామని అనుకుని అది రాశాను. మిత్రులు శ్రీ బులుసు సుబ్రహ్మణ్యం గారు, జిలేబి గారు, మానవద్దని సలహా చెప్పేరు. సరే బాధలున్నా రాదామని కొన సాగించాను. మొదట 50 పోస్ట్లు రాసి మానేద్దామను కున్నా. కుదరలేదు. తరవాత అది 100 కి మారింది. వంద తరవాత మానేద్దామనుకున్నా, చాప చుట్టేస్తున్నా అన్నా, మళ్ళీ జిలేబి గారు మానవద్దు, కామెంట్లతో కాలం గడపండి కొద్ది కాలం, రిలాక్స్ అవమన్నారు. ఇక్కడ బాధ ఎందుకొచ్చిందంటే రోజూ పొస్ట్ వేయడం మూలంగా. రాయడానికి ఇబ్బంది లేదుకాని, తతిమా ఇబ్బందులు ఎక్కువైపోయాయి, మానేద్దామనుకున్నా. సరే, కుదరలేదు. అసలు యీ టపా వందవ టపాగా వేద్దామనుకున్నా. కుదరలేదు. మరికొన్ని టపాలు వెయ్యాల్సి వచ్చింది. అల్లా టపాలు రోజూ వచ్చాయి.

యీ మధ్య కరంటు బాధ తగ్గింది. వొక వేళ పోయినా వొక గంటలో వస్తూ వుంది. ఇబ్బందులు లేవు. కధ నడుస్తూ వుంది. వందవ టపా భారంగా మనసుని పట్టేసిందని, మనవరాలు తాతని ఇబ్బంది పెట్టింది. నిజంగానే నేనూ చాలా బాధ పడ్డాను, ఆ కధ ఆ సమయం లో పెట్టవలసి వచ్చినందుకు..నా మనవరాలి మనసుకు భారం కలగచేసినందుకు, మరి కొంచం బాధ పెరిగింది. అది నేను ఇష్టంగా రాసిన కధ, మానేద్దామనుకున్న సందర్భంలో వేసానన్న మాట. దానికి ప్రేరణ శ్రీ.వెంకట్.బి.రావుగారు, ఆయన నా శైలైని శ్రీ.శ్రీపాద వారితో పోలిస్తే, వొక కధనైనా అలాగ రాయాలని అనిపించి రాసినది. శ్రీ. రావుగారికి నా కృతఙ్ఞతలు.వారు అన్న కొన్ని మాటలను టపాలుగ కూడా రాసుకున్నా. దానికి వారికి ధన్యవాదాలు మరొకసారి తెలుపుకుంటున్నా. నేను వ్రాసినవన్నీ దయతో చదివి నన్ను ఉత్సాహ పరచిన మీ అందరికి, నా బ్లాగు కుటుంబ సభ్యులకి మరొక సారి పేరు, పేరునా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా.వొక వేళ ఎవరినైనా గుర్తు చేసుకోలేక పోయి వుంటే, నా సంగతి తెలుసు కనక నన్ను క్షమించమని వేడుకోలు.

నాది ఆర్ధికంగా కలిగిన కుటుంబం కాకపోయినా,హార్ధికంగా చాలా ముందున్నది. మా కుటుంబం వారంతా వొకరి కోసం వొకరు, వొకరు అందరికోసం, అందరూ వొకరికోసం అన్న సూత్రం నమ్మిన వాళ్ళము. అందుకు మాకు కలిమి లేక పోయినా, పెద్ద వుద్యోగాలు లేకపోయినా, పెద్ద చదువులు లేకపోయినా, కలిగినంతలో సుఖంగా బతకాలనే సిద్ధాంతం వున్న వాళ్ళము. మా ఇంట్లొ హెచ్చు తగ్గులు, పొరపొచ్చాలు లేవు, రావు, ఎవరి మధ్యా కుడా. అది మా అదృష్టం గా తలుస్తాము. ఇప్పుడు నా కుటుంబ పరిధి పెరిగింది. కొంత మంది తాతా అనచ్చా అని అడిగారు, కొంతమంది, బాబాయ్ అంటా మన్నారు. ఎవరెలా అనాలనుకుంటే, అలాగే పలుకుతాను. నాకు భేషజం లేదు. మీ అందరితో 70+ వయసులో కబుర్లు చెప్పుకుని ఆనందించే సావకాశం, భగవంతుడు దయ చేసినందుకు, సదా, అమ్మకి కృతఙ్ఞుడను. ఇక్కడ మరొక మాట చెప్పాలి. బ్లాగులో కాని, చదువరులలో కాని, ఎవరేనా 70++ వారుంటే వారందరికి నా నమస్కారం. 70+ వారికి నా అభినందనలు. 70+ లోపు వారందరికి నా మనఃపూర్వక ఆశీస్సులు. ఈ బ్లాగు కుటుంబం ఇలాగే కొన సాగలని అమ్మ, ఆది పరాశక్తి, ఇఛ్ఛా శక్తి, ఙ్ఞాన శక్తి, క్రియా శక్తి స్వరూపిణి అమ్మకి నమస్కారం…అమ్మ రూపంలో వున్న అమ్మలు, అమ్మాయిలు అందరికి నా నమస్కారం.అమ్మనే చెప్పేవు, మరి అయ్యలక్కరలేదా అని అడగచ్చు,అమ్మ, అయ్య వొకటే, రెండు కాదు. నా టేగ్ లైన్ సర్వే జనాః సుఖినోభవంతు.

ఇప్పుడు మరొక కొత్త సరదా, ముసలి వయసుకి ముచ్చట్లు లావని, లేటు వయసులో ఘాటు ప్రేమ , ఇవి నా మనవరాలికి బాగా నచ్చిన నా మాటలు. అలాగ యీ మధ్య నా శ్రీమతి, బ్లాగు టపా రాసుకుంటూ వుంటే కాఫీ, టీలు టిఫిన్లు కంప్యూటర్ దగ్గరకేతెస్తోంది, ఆవిడ కూడా నా టపాలు చదివేస్తోంది.కామెంట్లు చెప్పేస్తోంది. మీతొ కలిసి అల్లరి చేసేసావకాశం నాకూ వచ్చి, నేను కూడా చిన్నవాడినయి, మీతో కలిసి పోయినందుకు నాకు ఆనందం. మీరంతా ఎంత అల్లరి చేసినా లిమిటులో, సభ్యత మరచిపోకుండా చేస్తున్నందుకు ఆనందం. నాకు కొత్తగా మా బంధు వర్గంలోనే అభిమాన సంఘం ఏర్పడిందిట. నాతో ఎవరూ మాట్లాడరు కారణం, నేను కవిని కనక.( కనపడదు, వినపడదు ) అందుకు వాళ్ళు నా ఇల్లాలితో మాట్లాడి మామయ్య, తాతయ్య, బాబయ్య, పెదనాన్న, రాసినవి బాగున్నాయి, చదువుతున్నాము, రాయడం మానేస్తానంటున్నాడు, మానేయద్దని చెప్పమని ఆవిడ దగ్గర చెప్పేరట. ఆమెను కాకా పట్టినట్లున్నారు. ఆమె నా దగ్గర నెమ్మదిగా విషయం చెప్పి, రాయడం మానవద్దని, అందరూ బాగున్నయని అంటూ వుంటే మానేసానంటారేమి అని నిలతీసింది. హోం మినిస్ట్రీ ఆర్డర్ని అధిగమించగలమా?వారే ఫైనాన్స్ కూడా యీ మధ్య. మరి మనకి డబ్బులు కావాలంటె అక్కడికే వెళ్ళాలి కదా. ఇంట్లో వాళ్ళంతా వొకే మాటగా చెబుతోంటే ఏమి చేయాలి. యీ సొదంతా ఇప్పుడెందుకూ అంటే చాలా కలంగా మన(సు)లో మాట చెప్పుకోవాని వుంది. కుదరలేదు కనక నేడు…….తప్పదు కదా.మరి మీరేమంటారు