2016 వత్సరానికి వీడుకోలు
Posted on మార్చి 27, 2012
28
వీడుకోలు.
వీడుకోలు, ఇది నేడు నాగరీకులు చెబుతున్న సెండాఫ్. బహుశః, ఈ వీడుకోలు గురించి మనవాళ్ళకి తెలిసినట్లుగా మరొకరికి తెలియదేమో. దీనికి కొన్ని పద్ధతులు కూడా చెప్పేరు. భార్య, భర్తకి వీడుకోలిచ్చేటప్పుడు గడపదాటి రాకూడదు, గడపలోపలినుంచే వీడుకోలివ్వాలి. ఒక్క సారికి మాత్రం మినహాయింపిచ్చారు. ఆ తరవాత మరి వీడ్కోలిచ్చే అవసరం రాదు కనక. ఆ తరవాత వీడుకోలు గురించి చెప్పనని జిలేబీగారికి మాటిచ్చాను కనక తప్పను. మన ఊళ్ళకి పొలిమేరలని ఉన్నాయి. ఎవరేనా బంధువు మన ఇంటికి వచ్చి వెళుతున్నపుడు పొలిమేర దాటకుండా, వీడుకోలివ్వడానికి వెనక వెళ్ళిన వారు వెనుతిరగాలి. ఈ పద్ధతులు ఎందుకు పెట్టేరో చెప్పలేను. ఏదో పరమార్ధం మాత్రం ఉండి ఉంటుంది.
వీడుకోళ్ళు చాలా ఉండచ్చు, కాని నాకు నచ్చిన వీడుకోళ్ళు చెబుతా. రామాయణంలో సుందరకాండలో మహర్షి వాల్మీకి ఇలా అంటారు, హనుమ లంకకి ఎగురుతూ వున్న సందర్భం
సముత్పతతి తస్మిం స్తు వేగా త్తే నగరోహిణః
సంహృత్య విటపాన్ సర్వాన్ సముత్పేతు స్సమంతతః
స మత్తకోయష్టిభకాన్ పాదపాన్ పుష్పశాలినః
ఉద్వహ న్నూరువేగేన జగామ విమలే ౨ ంబరే.
ఊరువేగోద్ధతా వృక్షా ముహూర్తం కపి మన్వయః
ప్రస్థితం దీర్ఘ మధ్వానం స్వబంధు మివ బాంధవాః
“హనుమంతుడట్లెగురుచుండగా ఆ కొండపై పుట్టిన చెట్లు అతని వేగము వలన తమకొమ్మలతో గూడ పై కెగసినవి. ఆ హనుమంతుడు మదించిన కొంగల కలకలముతో, విరబూసిన పూలసొంపుతోనొప్పారుచెట్లను తన తొడల వేగముచే పెకలించి తనతో పైకెగురవేయుచు నిర్మలాకాశమున పయనించెను. అట్లతని శరీర వేగముచే పైకెగురగొట్టబడిన చెట్లు, దూరప్రయాణము చేయుటకు బయలుదేరిన బంధువును సాగనంపవచ్చిన చుట్టములవలె క్షణకాలము హనుమంతుననుసరించినవి.”
రెండవది భారతంలోది, ఇదివరలో చెప్పుకున్నదే కాని సందర్భం వేరు కనక మళ్ళీ చెప్పుకుందాం. పరమాత్మ రాయబారానికి వెళ్ళేరు. తిరిగివచ్చేటపుడు వీడ్కోలిచ్చి వద్దువు, రమ్మని కర్ణుని చేయిపట్టి తన రధమెక్కించుకుని తీసుకు వెళతారు. కర్ణునికి, ఆతని జన్మ వృత్తాంతం చెప్పి, పాండవులవైపు వస్తే రాజ్యాభిషేకం చేయిస్తా, ద్రౌపది నిన్ను ఆరవ భర్తగా స్వీకరిస్తుందని చెప్పేడని తిక్కన గారన్నారు. స్నేహితులు శ్రీ తాడిగడప శ్యామల రావుగారు అది పొరపాటు ఆమె కూడా కర్ణుని రాజుగా సేవిస్తుందని అర్ధం అన్నారు. నాకు కూడా ఈ మాట నచ్చింది. స్వామి ఈ వీడుకోలు ద్వారా మిత్ర భేదం కూడా సాధించాలనుకున్నరేమో అనుకుంటాను. అది తప్పూ కాదు, కారణం యుద్ధంలో, రాజనీతిలో ఇదికూడా భాగమే కనుక. యుద్ధం పరిసమాప్తమైనది. స్వామి రధం నుండి అర్జుని తన ఆయుధములు అన్నీ తీసుకుని దిగమని సెలవిస్తారు. అర్జునుడు అన్ని శస్త్ర, అస్త్రాలు తీసుకుని దిగిన తరవాత స్వామి దిగుతారు. ఒక్క సారిగా రధం భగ్గున మండిపోతుంది. స్వామి రధానికి గొప్ప వీడ్కోలిచ్చారు కదా. ఎందుకలా రధం మండిపోయిందంటే, ఆయన ఈ రధం భీష్ముడు, ద్రోణుడు మొదలయిన కౌరవ వీరుల అస్త్రాలకి ఎప్పుడో మండిపోయిందని చెప్పేరు. దీనినే అప్రస్తుత ప్రసంగం అంటారు కదా.!
నేటి కాలానికి సినీకవి టాటా వీడుకోలు, గుడ్ బై ఇంక శలవు…. అని చెప్పిన పాటలో మంచి సాహిత్య విలువలున్నాయి కదా. ప్రస్తుతానికొస్తే మొన్న ఇరువదవ తారీకు నుంచి మనసు ఆందోళనగా ఉంది, బాధ పడుతోంది. జిలేబిగారు నందన సంవత్సర పంచాంగ శ్రవణం చేయమంటే చేయలేను, మనసు బాగోలేదని చెప్పేను. కుదుటపడలేదు. కారణం మాత్రం తెలియదు. ఈ బాధని ( శ్రీ మాత్రేనమః ) అమ్మ వైపు తిప్పాలని, నా ప్రయత్నం. ఇరువది రెండవ తారీకు మధ్యాహ్నం నుంచి, మా నెట్ పని చేయడం మానేసింది. ఎక్కడో ఒక తంతువు (ఫైబర్) తెగిపోయిందట, ఆఫీస్ కెళితే తెలిసింది. మా వాళ్ళని, నేను రానా, రెస్టొరేషన్ కి అని అడిగా, వద్దులెండి అన్నారు. బుర్ర తింటానని భయపడి ఉంటారు. నందన సంవత్సరం ఎలా ఉండబోయేదీ మొదటి రోజునుంచే అనుభవం లోకి వచ్చేసింది. పండగ నాడు ఉదయం నెట్ లేదు,ఫోన్ లేదు, సెల్ లేదు. బ్లాగు రాయడం ప్రారంభించి ఆరు నెలలయింది ఇరువది రెండవ తారీకు నాటికి. ఒక తంతువు తెగిపోతే ఈ మాయా జాలంతో సంబంధం తెగింది కదా. కనపడుతున్న రెండు కొసలు కలపడానికి ఇంత కాలం పడుతూ ఉంటే, పుట్టిన రోజునుంచి భగవంతునితో తంతువు తెగిపోయింది, మాటా, పలుకూ లేదు.. ఒక కొస నా దగ్గరుంది. ముడి వేయడానికి, రెండవ కొస కొరకు వెతికే ప్రయత్నం చేశానా అన్నది అనుమానం. రెండవ కొస వెతుక్కుని భగవంతునితో బాంధవ్యం పెంచుకోవాలనే కోరికతో, బ్లాగుకు వీడుకోలు పలుకుతున్నాను. నందన శుభాకంక్షలు తెలపడానికి పిచ్చి మాటలు రాశా, అందులో కొంత భాగం.
బ్లాగొక పెద్ద వ్యసనం,
తీసుకున్నా నొక నిర్ణయం.
లేదిక దీనిపై సహనం,
వదిలేస్తున్నా తక్షణం,
నిన్నటినుంచి లేదు, నెట్టు,
ఎక్కడో అయిపోయింది, కట్టు,
ఇదేదో బాగున్నట్టుంది, ఒట్టు,
రోజూ ఇలాగేవుంటే లేదు, రొష్టు.
లేరెక్కడా మీలాటి నేస్తాలు,
విన్నందుకు నా పిచ్చి కబుర్లు,
హృదయ పూర్వక ధన్యవాదాలు,
నందన ఉగాది శుభకామనలు.
బ్లాగు మొదలు పెట్టినప్పటినుంచి నన్ను ప్రోత్సహించిన వారు మిత్రులు,చాలా మంది, నన్ను తమ కుటుంబ సభ్యునిగా చేసుకున్నవారు కొందరు,టపా ఒక రోజు లేకపోయినా అడిగిన వారు కొందరు, ఆరోగ్యం గురించి ఆ దుర్దాపడినవారు అందరూ. మొన్న మధుర గారు తమ బ్లాగులో నా బ్లాగు గురించి చాలా గొప్పదైన పరిచయం చేస్తూ, నా బ్లాగు గురించి చెప్పేరు. వారి అభిమానానికి కృతజ్ఞత తెలుపుకుంటున్నా. ఆ తల్లికి మాతృ రూపంలో శ్రీ మాత్రేనమః. కుటుంబ సభ్యులయ్యారు కొంతమంది. ఎవ్వరిని నేను మరిచిపోలేను, మరచిపోబోను, మరచిపోవటం, నాకు సాధ్యంకాని పని, అది నా బలహీనత అని సవినయంగా మనవి చేస్తున్నాను, పెద్దలకి నమస్కారం, పిన్నలకి దీవెనలు. పల్లెలో పుట్టి, పెరిగి, పల్లెలలో ఉద్యోగంచేసి పొట్టపోసుకున్న పల్లెటూరి మట్టి మనిషిని, నాగరికుల సభ్యత సంస్కారాలు తెలియక ఎవరినైనా ఇబ్బంది పెట్టి ఉంటే క్షమించమని సవినయంగా వేడుకుంటున్నా. తెనుగు తప్పించి మరొక భాషరాని అజ్ఞానిని. ఇంతోటి మాట చెప్పడానికి ఇంత టపా రాయాలా అనకండి….. అలవాటయిన ప్రాణం కదా….. భగవంతుడికి టపా రాసుకుంటా ఇలాగే…అత్మ నివేదనం నవవిధ భక్తి మార్గాలలో ఒకటి కదా……. వస్తా……….. శలవు…. స్వస్తి ప్రజాభ్య………..
ఇది 22 వతేదీన రాసి పండగరోజు వేసి బ్లాగునుంచి శలవు తీసుకోవాలనుకున్నది, నా ఉద్దేశం, విధి చిత్రమైనది.