శర్మ కాలక్షేపంకబుర్లు-ఊరగాయలు/వేసవికాలం

Posted on ఫిబ్రవరి 20, 2012
14
ఊరగాయలు/వేసవికాలం

మహా శివరాత్రి పూటా తిండి గోలేంటి అనద్దు, ఉపవాసం ఈ వేళే కాని రేపు కాదుగా! చిత్తమూ, ధ్యానమూ శివుని మీద ఉంచి చేసుకునే పని చేయాలి.

వేసవికాలం వచ్చేస్తోంది. ఊరగాయలకి తయారవాలి. పాత జాడీలు, గూనలు, ఖాళీ అయినవి బయట పడేసి నీళ్ళు పోసి అట్టిపెట్టింది నా ఇల్లాలు. “అప్పుడే తీసేసేవేమిటి అన్నీ” అన్నా. “వీటి అన్నిటిని శుభ్రం చేసి ఎండలో బోర్లించి సిద్ధం చేసుకోవాలి. తడి లేకుండా ఎండపెట్టాలి. మామిడికాయ వచ్చేసమయానికి ఇవి తయారుగా వుండాలి” అంది. ఈలోగా ఉప్పు వాడి కేక వినపడింది. వాణ్ణి పిలవమంది. “ఎందుకన్నా”. “ముందు పిలవండి, లేకపోతే వాడు వెళ్ళిపోతాడని తరిమింది”. నిజమే వాడొక కేక వేసి వెళ్ళిపోతున్నాడు. వాడి వెనకపడి పిలిస్తే వచ్చాడు, బండి తోలుకుని. నా ఇల్లాలు వచ్చింది. బస్తా ఉప్పు ఎంత అని అడిగింది. నాకు మతిపోయింది. “బస్తా ఉప్పెందుకు”అన్నా. “ఉండండి చెబుతా” అంది. ఊరుకున్నా. వాడు 450 చెప్పేడు. “అరబస్తా తీసుకుంటా ఇచ్చే బేరం చెప్పమంటే”, వాడు “అరబస్తా 215 రూపాయలకి ఇస్తా” అనన్నాడు. “సరె ఉప్పు చూపించు” అంది. తెల్లగానే ఉంది. పెద్ద పెద్ద కళ్ళు. ఉప్పు పలుకులని కళ్ళు అంటాము. వాడు కొత్త బస్తా విప్పి 12 కుంచాలు కొలిచాడు. గోని సంచిలో పోయించి. వెంటనే ఇద్దరం సాయం పట్టి మేడమీద అరపోశాము, ఎండలో. ఉప్పు వాడికి డబ్బులిచ్చిపంపేను. మళ్ళీ నా సందేహం వెలిబుచ్చా. అప్పుడు చెప్పింది. “వందకాయ ఊరగాయ పెట్టాలి, నూట ఏభయి కాయ మాగాయిపెట్టాలి. మిగిలినవి ఇంకా వున్నాయి కదా అవి పెట్టాలి. వాటికి ఇప్పుడు పోయించుకున్న ఉప్పులో ఎక్కువ అయిపోతుంది. మిగిలినది పగిలిన జాడీలలో పోసి ఉంచుకుంటే సంవత్సరం వాడుకోవచ్చు. ఒక కేజి పేకట్ ఉప్పు తెస్తే పది రూపాయలవుతోంది”, అంది. నిజమే మరి “ఈ ఉప్పు వాడకూడదు తెలుసా” అన్నా. “తెలుసు. పేకట్ల ఉప్పులో అయొడిన్ కలుపుతామనిఅంటున్నారు. ఈ ఉప్పు మన చిన్నప్పటినుంచి వాడుతున్నాం, మరి రోగాలు రాలేదు కదా. అయొడిన్ ఇందులో లేదా. లేక పోతే మీ ప్రభుత్వం వారు ఎవరికేనా ఉపకారం చెయ్యడానికి ఇది వాడద్దని అంటున్నారా చెప్పండి”.అని ఉప్పున్యాసం అదే ఉపన్యాసం ఇచ్చింది. ఊరుకున్నా.

ఈ సంవత్సరం మామిడిచెట్టు పూత సరిగా రాలేదు, వస్తుందో రాదో అనుకుంటున్నాము. ఏమయినా ఊరగాయలు పెట్టాలి కదా! ఆవకాయ, మాగాయ, తొక్కుడుపచ్చడి,ఇలా రకరకాలవి పెట్టుకోలేకపోయినా కొన్నయినా కావాలి కదా!. ఆవకాయలోనే ఆవకాయ, కారపు ఆవకాయ లేదా డొక్కావకాయ, దీన్నే కాయ పళంగా పెడతారు,పెసరావకాయ, శనగల ఆవకాయ, పులిహార ఆవకాయ,ఇలా ప్రాంతాన్ని బట్టి రకాలు. ఇక మాగాయలో మాగాయ, నూనిమాగాయ వగైరా వగైరా, వీటిలో కొన్నిటిలో వెల్లుల్లి వేస్తారు. నిజంగా మనవారి ఆరోగ్య రహస్యం తినే వస్తువులలోనే ఉంది. ఈ వెల్లుల్లిని తింటే చాలా వ్యాధులు రావని ఇప్పటివారు చెబుతున్నారు. వ్యాధినిరోధక శక్తి వెల్లుల్లికి ఎక్కువంటున్నారు. ఇకమిగిలినవి మెంతికాయ, ఇందులో వేడి చేసే ఆవ లేకపోవడం మూలంగా, చక్కెర వ్యాధిగ్రస్తులుకి అవసరమైన మెంతి ఉన్నమూలంగా వారు కూడా తినవచ్చు. తొక్కుడు పచ్చడి బాగుంటుందికదా. మరి ఊరగాయలకి సిద్ధం కావాలి కదా! అలాగే వేసవి వచ్చేటప్పటికి నిలవకి ఉంచుకునే ఉసిరి దీన్ని రాచ ఉసిరి అంటాం. అమలక అని హిందీ మాట. దీని పచ్చడి,ఇది ఆరోగ్యానికి గొప్ప ఔషధమని పేరు. చింతకాయ పచ్చడి, నిలవకి. వెలగపళ్ళు పచ్చడి పెట్టేముకదా!! ఇవన్నీ పెట్టుకోవాలికదా!!! సంవత్సరానికి అవసరమైన కందిపప్పు కొనుక్కునే సమయం. మిగిలిన పప్పులు కూడా కొనుక్కుని ఎండ బెట్టుకుని దాచుకునే సమయం కదా. ఇదివరలో వేసవిలోకూరలు దొరకడం తక్కువగా ఉన్నపుడు వరుగులు చేసేవారు. వంకాయ, కాకరకాయ, దొండకాయ, ఇలా, ఇప్పుడు చేయటం లేదు కాని, కేజి వంద రూపాయల ఖరీదును తప్పించుకోవాలంటే కొన్ని ఊరగాయలు పెట్టుకోక తప్పదు. మరిచిపోయా కొరివి కారం ముఖ్యం కదా!!! దానికీ ఇదే సమయం. చల్లలో మిరపకాయలు, గుమ్మడి వడియాలు పెట్టుకునే సమయం. అన్నట్లు సగ్గుబియ్యం వడియాలు,పిండి వడియాలు,ఇంకా ముఖ్యం అటుకులు. అయ్యో! అటుకులంటె గుర్తొచ్చింది, టూ మినిట్స్, రెండు నిమిషాలు, దో మినిట్ లో తయారయ్యే చిరుతిండి అటుకులూ బెల్లం, లేదా అటుకులూ పంచదార ఇంకా అర్జంటు. పిజ్జాలు, బర్గర్ల కంటే ఎంతో మేలు. కొద్ది సమయం ఉంటే పిండి వడియాలు వేయించి పిల్లలికి పెడితే ఇష్టంగా తింటారు. పిల్లలతో పెద్దలు కూడా.

ఇక ఈ సమయం లో వచ్చే పళ్ళు మామిడి, పనస, ముఖ్యమైనవి. పనసపొట్టు కూర ఆవపెట్టి వండుకుంటే, పోటీ పడి తింటే ఓహ్! ఆనందం. జాగ్రత్త వేడి బాగా చేస్తుంది. ఏకాలంలో వచ్చేపళ్ళు ఆ కాలంలో తింటే వైద్యుని అవసరం తక్కువంటున్నారు అనుభవజ్ఞులు. అలాగే ఈ సమయం లో వచ్చే వ్యాధులలో ముఖ్యమైనవి నీళ్ళ విరేచనాలు. వీటిని అరికట్టుకోడానికి చలి జ్వరం పెట్టిని, అదేనండి ఫ్రిజ్ ని తరచుగా శుభ్రం చేసుకోవాలి. లేక పోతే అది అనారోగ్యానికి పుట్టినిల్లయిపోతుంది. ఎన్ని మందులువాడినా రోగాలు తిరగబెడుతూనే ఉంటాయి.

ఇక ఇప్పటి వరకూ ఉపయోగించిన దుప్పట్లు, రగ్గులు ఒక సారి వేడి నీటిలో శుభ్రం చేసుకుని, గట్టి ఏండలో ఆరవేసి, నాఫ్తలీన్ బాల్స్ వేసి బీరువాలో జాగ్రత్త పెట్టుకుంటే, మరుసటి శీతాకాలానికి వాడుకోవచ్చు. వేసవికి తయారవుదాం.

ప్రకటనలు

రచయిత: kastephale

A retired telecom engineer.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s