శర్మ కాలక్షేపంకబుర్లు-శాంతి

Posted on జనవరి 29, 2013
6

dscn1675

శాంతి.

( మహాత్ముని వర్ధంతి సందర్భంగా)
శాంతి,సహనం అనేవి నేడు బ్రహ్మ పదార్ధాలయిపోయాయి. వ్యక్తులలో శాంతిలేదు, కుటుంబంలో,సమాజంలో, దేశంలో, ప్రపంచ దేశాల మధ్య శాంతిలేదు. ఎందుచేత? వ్యక్తి నిర్మాణం, సహనం లేక. పునాదిలేని భవనం నిలబడదు. ఇప్పుడు జరుతున్నదదే. వ్యక్తికి కావలసిన ప్రాధమికమైన, సత్యం,ధర్మం, శౌచం, శీలం, తృప్తి, మొదలయినవి లోపిస్తున్నాయి.వివాహ, కుటుంబ వ్యవస్థలు పాడవుతున్నాయి. విద్యా వ్యవస్థకే చెద పట్టింది. రామాయణ,భారతాలు మత గ్రంధాలయిపోయాయి.వాటిని చిన్నప్పటి నుంచి బోధించవద్దంటున్నారు. విద్యాలయాలు ఇప్పుడు పూర్తిగా కొంతమంది వ్యక్తుల, మాదక ద్రవ్యాల అడ్డాగా మారిపోతున్నాయి. కొంతమంది చేరి చదువుకునేవారిని వ్యక్తి నిర్మాణం ఉన్న వారిని చెడగొట్టే రోజులైపోయాయి. వ్యక్తి నిర్మాణం లేకపోతే సరి అయిన కుటుంబ నిర్మాణం లేదు. అటువంటి కుటుంబాల నిర్మాణం లేని దేశంలో ఆశాంతే ఉంటుంది. ఇప్పుడు అన్ని దేశాల వారూ ఐహిక సుఖాలలో మునిగి తేలాలనే అనుకుంటున్నారు తప్పించి, మరొకటి కనపడటం లేదు. ఐహిక సుఖాలకి అంతులేదని తెలిసిన భారత దేశంలో కూడా ఇప్పుడు పశ్చిమ దేశాల సంస్కృతి పట్ల ఆకర్షణ పెరిగిపోయింది. విచిత్రమేమంటే ఆ దేశాల వారు శాంతి గురించి భారతదేశం వైపు చూస్తుంటే మనవారు వారి సంస్కృతికై వెంపర్లాడుతున్నట్లే ఉంది. వ్యక్తుల నిర్మాణం సరిగాలేని కుటుంబంలో అశాంతి తాండవిస్తుంది. అటువంటి వ్యక్తులు తమకు తాముగా అభ్యున్నతి పొందలేరు, కుటుంబాన్ని కూడా ఉన్నతికి తీసుకు పోలేరు. శీల నిర్మాణం ఉన్నతంగా ఉన్న ఆడ, మగ వ్యక్తులు ఎక్కడున్నా చెడిపోరు, వారిని మరొకరు చెడకొట్టలేరు కూడా. చిన్నప్పటి నుంచి క్రమశిక్షణలో పెరిగినవారు, జీవితం లో ఓడిపోరు, ఒకవేళ తాత్కాలికంగా కొన్ని అడ్డంకులు, ఎదురు దెబ్బలు తగిలినా, చివరకు జీవితంలో ఉన్నతినే సాధిస్తారు.త్యాగరాజు ఏమన్నారు “శాంతము లేక సౌఖ్యము లేదు సారస దళనయనా”మనవారు శాంతికే శాంతి కావాలన్నారు. వేదం లో శాంతి పాఠం ఉంది.

dscn1677

టెలికంలో జె.ఇ గా పని చేస్తున్న రోజులు, ఇలా క్రమశిక్షణ లేని, సత్య ధర్మాలు పట్టించుకోని ఒకతను నా దగ్గర ఆపరేటర్ గా పని చేశాడు. అతను రోజూ తాగి ఉండేవాడు, ఉద్యోగసమయంలో కూడా, నేను ఆవూరు బదిలీ మీద వెళ్ళేటప్పటికి. ఇతనిని ఎవరూ సరి దిద్దటానికి కూడా ప్రయత్నం చేసినట్లుగా కూడా లేదు, కారణం ఇతని నోటికి భయపడి, బూతులు మాట్లాడేవాడు తాగి ఉండి. నేను చేరిన తరవాత చూశాను ఉద్యోగ సమయం లో కూడా తాగి ఉండేవాడు. ఒక రోజు పిలిచి కూచో పెట్టి నెమ్మదిగా చెప్పాను, తాగటం మంచి అలవాటు కాదు, ఉద్యోగ సమయంలో తాగి ఉండద్దూ అని. విన్నాడు, తల ఊపేడు, బయటకి వెళ్ళి కార్మిక నాయకులతో చెప్పేడు, వారు నా మీదకి యుద్దానికి వచ్చేరు. అతని వ్యక్తిగత విషయాలలో కల్పించుకుంటూన్నానని, అతనికి క్షమాపణ చెప్పాలని పట్టు బట్టేరు. సరే క్షమాపణ చెప్పేను. అంతతో ఆ కధ ముగిసింది, కాని ఒక రోజు అతను తాగి ఉద్యోగం నిర్వహిస్తున్నపుడు ఈ కార్మిక నాయకులని, అతని తోటి ఉద్యోగులను పిలిచి చెప్పేను, “అతను తాగి ఉన్నాడు,పని కుంటు పడుతూంది, ఫిర్యాదులొస్తున్నాయి, ఇప్పుడు నేను పోలీస్ సాయం తీసుకుని అతనిని గవర్ణమెంట్ హాస్పిటల్ కి పంపి తాగి ఉన్నట్లు సర్టిఫికెట్ తీసుకుని ముందు సస్పెండ్ చేయిస్తున్నాను, మీరేం చేస్తారో చేసుకో వచ్చని” చెప్పి, పోలీస్ మిత్రుడైన ఎస్.ఐ కి చెప్పేను, కార్మిక నాయకుల ఎదురుగానే, పది నిమిషాలలో ఎస్.ఐ నాదగ్గరున్నాడు, మిగిలిన కార్యక్రమం చేసేందుకు సిద్ధమవుతుండగా నాయకులొచ్చి కాళ్ళు పట్టుకుని, అతనిని తీసుకువచ్చి, ఇలా చేస్తే అతని ఉద్యోగం పోతుందని, ఇక ఎప్పుడూ ఉద్యోగంలో ఉండగా తాగనని చెప్పించి, నాకు క్షమాపణ చెప్పించి, తామిదివరలో చేసింది తప్పేనని చెప్పి, అతనిని పంపించేసేరు. నేను ఎస్. ఐ మిత్రునికి సద్ది చెప్పుకుని పంపేసేను. అది మొదలు అతను ఉద్యోగ సమయంలో తాగేవాడు కాదు, కాని ఈ తాగటం కోసం ఉద్యోగం ఎగకొట్టేవాడు, అప్పులూ చేసేవాడు. దానితో జీతం వచ్చేది కాదు, అతని భార్య ఆఫీసుకు వచ్చి చెప్పుకుని ఏడ్చేది, ఫిర్యాదిమ్మంటే మాత్రం ఇచ్చేది కాదు.. నాకు ఇతనితో విసుగొచ్చి, పని కుంటుపడుతూండటంతో,ఎప్పుడు ఉద్యోగానికి వస్తాడో, ఎప్పుడు రాడో, తెలియని అనిశ్చిత పరిస్థితులకి విసిగిపోయాను. పగలూ రాత్రీ ఎదో సమయంలో ఉద్యోగం చేయాల్సిన ఉద్యోగం, అతనిది. అప్పటిదాక ఉద్యోగ ధర్మం నిర్వర్తించినతన్ని పంపేందుకు ఇతను రావలిసి ఉంటే చెడ్డ ఇబ్బందిగా ఉండేది. పాపం ఇబ్బంది పడుతూ అతని ఉద్యోగ సమయం కూడా, అప్పటిదాకా పని చేసిన వారు, చేసేవారు, ఎందుకంటే ప్రజలకి ఇవ్వవలసిన సేవలు ఆగిపోతాయి. కుదరదు, ఎవరో ఒకరు పని చేయవలసిందే. అయినా ఎప్పుడు ఫిర్యాదు చేసేవారు కాదు, మిగిలిన వారు, అతని మూలంగా ఇబ్బంది పడినా. కాని నాకు ఫోన్ చేసి ఫలానా వ్యక్తి డ్యూటికి రావాలి రాలేదని చెప్పినపుడు,తానతని ఉద్యోగం చేస్తున్నట్లూ చెప్పినపుడు, నీవు చేతకాని వాడివని నిందించినట్లుగా ఉండేది, నాకు మటుకు. ఇలా ఎగకొడుతున్నందుకు అతని దగ్గరనుంచి సంజాయిషీ కోరుతూ మెమో ఇచ్చాను. అతనేదేదో చెప్పుకొచ్చాడు, నా మీద కూడా అభియోగాలు మోపాడు. నేను విసిగి నీ కర్మకి నేను కర్తని కాను, “నిన్ను బాగుచేయాలనే, నా ప్రయత్నం వ్యర్ధమనుకుని,” అతనికి ఒక సలహా లాటి ఉత్తరం ఇచ్చేశా, అందులో “నీవు ఇలా తాగుడు అలవాటుకు బానిస కావడం మూలంగా నీకెలా ఉందో తెలియదు కాని, ఆఫీసులో నాకు అశాంతిగా ఉంది,నీ తోటి ఉద్యోగులకి అశాంతిగా ఉంది, నీకుటుంబానికి అశాంతి గా ఉందని, నిన్ను వెనకేసుకొచ్చిన నాయకులు కూడా చెప్పేరు నాతో, నీవు నీ కుటుంబానికీ, దేశానికీ కూడా ఉపయోగపడలేకపోతున్నావని గుర్తించు” అని. ఈ లేఖ కాపీ ఆఫీసర్ గారికి పంపేను. ఆయన చూసి ఉంటారు, ఒక సందర్భం లో “మీరు అతని వ్యక్తిగత విషయాలలో కలగచేసుకున్నట్లవుతుందేమో ఆలోచించండి” అన్నారు. దానికి నేను “రూల్ ప్రకారంగా నేను అతని వ్యక్తి గత విషయం లో కలగ చేసుకో కూడదు, కాని అతను ఎవరికీ ఉపయోగపడక, ఆఖరికి తనకు తాను ఉపయోగపడకపోతున్నాడని ఒక ఆఫీసర్ గా అతని ప్రవర్తన మార్చుకోమని సలహా ఇచ్చాను తప్పించి మరేమీ కాద”న్నా. ఆ ప్రసంగం అలా ముగిసింది, ఆ తరవాత చాలా తక్కువ సమయంలో, అక్కడినుండి నేను అక్కడి నుంచి మరొక చోటికి బదిలీ మీద వెళ్ళేను. సంవత్సర కాలం తరవాత ఒక రోజు ఎవరో తెలిసిన వారితో మాటాడుతోంటే ఇతని మరణ వార్త తెలిసింది, నేను వెళ్ళిపోయిన తరవాత అతను మామూలయిపోయాడుట, రాత్రి పగలు తేడా లేక తాగి ఉండేవాడట, దానితో తెలియని తెగులు పట్టుకుని, వైద్యం చేయించుకోవడం అశ్రద్ధ చేసి, చనిపోయాడట, భార్య, ముగ్గురు పిల్లలున్న కుటుంబాన్ని ముఫై ఏళ్ళ వయసులో రోడ్డున పడేసి. అయ్యో! ఒక వ్యక్తి ఇలా అయ్యాడే అని విచారించాను, అతనిని మార్చలేకపోయిన నా అశక్తతని నిందించుకున్నా.

శర్మ కాలక్షేపంకబుర్లు-……చల్లగా చెప్పాలి.

dscn1723

…….చల్లగా చెప్పాలి.

చావు కబురు చల్లగా చెప్పాలని నానుడి. ఇదేంటబ్బా అని అలోచిస్తే విషయం తోచలేదు కాని అనుభవంలోకి మాత్రం వచ్చింది.

కొన్నాళ్ళకితం రిటయిర్ అయినవాళ్ళని మళ్ళీ తీసుకుంటున్నాము, ఉద్యోగం రెండు సంవత్సరాలు సమయానికన్నారని, దరఖాస్తు పెట్టేనని చెప్పేను కదా. మళ్ళీ ఉద్యోగం వచ్చేసినంత, హోదా, హడావిడి చేసేను కదా. వాళ్ళ దగ్గరనుంచి సమాధానం రాకపోయేసరికి ఏమయిందో తెలుసుకోడం కోసం ఢిల్లీలో ఉండే మా అసోసియేషన్ సెక్రెటరీకి మెయిలిచ్చాను,ఇలా దరఖాస్తు చేశాను, సంగతి కనుక్కోమని. దానికతను సమాధానమిస్తూ వయసు అరవై ఐదు దాటిన వారిని తీసుకోడం లేదట అని చెప్పేరు. ఎందుకైనా మంచిది మీరు మాట్లాడండి అని మెయిల్ అడ్రస్ ఇచ్చారు. ఆ అడ్రస్ కి మెయిలిస్తే అది తీరుబడిగా తిరిగొచ్చింది, చేరక. మళ్ళీ మా మిత్రుడుని అడిగితే ఫోన్ నెంబరిచ్చారు, మెయిల్ అడ్రసు ఇచ్చారు. నేను కవిని కదా, మళ్ళీ ఫోన్ చేసి వినపడక బాధపడే కంటే ఊరుకుంటే మంచిదని ఈ నానుడి తలుచుకున్నా, “ఊరుకున్నంత ఉత్తమం బోడిగుండంత సుఖం లేదని” సరేలే మెయిలిద్దామని మళ్ళీ ఇచ్చా. …..చల్లగా చెప్పేరు, అరవై ఐదేళ్ళు దాటిన వాళ్ళని తీసుకోటం లేదని, ఇల్లాలికి చెప్పేను, అయితే చావు కబురు చల్లగా చెప్పేరనమాట అంది.

ఇలా జరుగుతుండగా అబ్బాయి వచ్చి “నాన్నా! స్థలాల బ్రోకరొకడు నన్ను చంపుతున్నాడు స్థలం కొనండి, చవకగా ఇప్పిస్తానని, మీరు ఒక సారి ఆ విషయం చూసి బాగుందని చెబితే కొందాం, లేదంటే మానేదా”మన్నాడు. బ్రోకర్ ని మీదగ్గరకి తీసుకొస్తా అని చెప్పి వెళ్ళిపోయాడు.

మర్నాడు బ్రోకర్ ని తీసుకొచ్చి “నాన్న గారితో విషయం మాట్లాడు, ఆయనెలా చెబితే అలా చేస్తానని” అప్పగించి వెళిపోయాడు. “ఎక్కడయ్యా స్థలాలు, రేటెంత?” అంటే “మిమ్మల్ని తీసుకువెళతానని” బండి మీద తీసుకెళ్ళి స్థలలాలు చూపించేడు. రేట్లు కూడా చదరపు గజం 1500 నుంచి 2000 దాకా చెప్పేడు. “తీసేసుకోండి, మళ్ళీ దొరకకపోవచ్చు” అంటూ ఊదరకొట్టేశాడు. “ఏ సంగతి చెప్పండి” అంటూ. దానికి “నేను చూసి సరే అంటే కాదయ్యా! అబ్బాయి చూడాలి, కోడలు చూడాలి వాళ్ళకి ఏరియా నచ్చాలి అప్పుడు మిగిలిన విషయాలు మాట్లాడుతా, ఇంతకీ దీనికి కావలసిన అన్ని అనుమతులూ ఉన్నాయా?” అంటే అవి “పట్టుకొస్తా”నని అన్నాడు. మర్నాడు ఏ విషయం చెప్పమని, రాత్రికి మా బావ మరిదికి పోన్ చేసి అడిగా. అతను నాకు “ఫలానా, పలానా అనుమతులు కావాలి, అవి ఉన్నాయో లేవో చూచుకుని అప్పుడు ముందుకెళ్ళు” అని సూచన చేశాడు. అబ్బాయిని కోడల్ని తీసుకుని స్థలం చూపించి మాటాడితే” బాగానే ” ఉందన్నారు.” మిగిలిన విషయాలు మీరు మాట్లాడండని” నాకు వదిలేశారు. మర్నాడు ఉదయమే బ్రోకర్ వచ్చి “యజమాని దగ్గరకెళ్ళి మాటాడి నిర్ణయం చేసేద్దామండి” అన్నాడు. “నువ్వు కంగారు పడకు, అసలు పంచాయతి అనుమతి ఉందో లేదో కనుక్కో, ఉంటే ఆ తరవాత కలక్టర్ అనుమతి కావాలి అది ఉందా? ఆ అనుమతికి డబ్బు కట్టాలి కట్టేరా? తెలుసుకు చెప్పు” అన్నా. “ఆగండి ఫోన్ చేసి కనుక్కుంటా” అని యజమానికి ఫోన్ చేసి కనుక్కుంటే ప్లాను ఉందంటాడే తప్పించి దానికి అనుమతి గురించి మాటాడడు. “ఆనుమతులు లేకపోతే రిజిస్ట్రేషన్ కాదయ్యా అంటే,” మళ్ళీ కనుక్కుంటాని వెళిపోయాడు. మర్నాడు ఉదయం వచ్చాడు “ప్లాన్ ఉందండి అనుమతిలేదండి” అన్నాడు. “అనుమతి తెస్తారా అంటే, అయ్యా! అసలు ప్లాన్ వేసిన వాడు మరొకరికి అమ్మేశాడు, అతను మరికొంతమందికి అమ్మేశాడు. ఇప్పుడు అలా కొనుక్కున్న వారిలో ఒకరు అమ్ముతున్నారు, మీరుకొంటానంటే”, అన్నాడు. “రిజిస్టర్ కాని స్థలం ఎలాగయ్యా కొనడ”మంటే, “అతను పవర్ ఆఫ్ అటార్నీ రాసిస్తాడండి, మీరు బజాణా గా సొమ్ము కొంత ఇస్తే చాలండి” అన్నాడు, చల్లగా. ఇప్పుడు సంగతి అర్దమయిపోయింది. ఆ స్థలానికి ఇల్లు కట్టుకోడానికి తగిన అనుమతులు లేవు, అవి తెచ్చుకోడం ఒక్కడివల్ల కాదు. ఆ స్థలం కొనుక్కుంటే రిజిస్టర్ కాదు, ఊరకే కొంత సొమ్మిచ్చి దానిని వ్యాపారంగా మార్చేసి డబ్బులు మనం ఇచ్చినదానికంటే ఎక్కువ మరొక తెలివి తక్కువ వాడినుంచి వసూలు చేసుకోవాలనమాట. ఈ దగా వ్యాపారం నచ్చలేదు. వాడు చావు కబురు చల్లగా చెబితే నేనేం తక్కువ తిన్నానా? సరే రేపు చెబుతా రమ్మని, రాత్రికి అబ్బాయికి కోడలికి సంగతి వివరంగా చెబితే “సరే వాడి కబురు, వాడికి చల్లగా చెప్పెయ్య”మన్నారు. మర్నాడు ఉదయమే వచ్చిన వాడికి “అనుమతులు లేని స్థలం కొనడం దండగ, అనుమతులున్న స్థలాలుంటే చెప్పు” అని చావు కబురు చల్లగా చెప్పేసేను.

నెలంటే ముఫై రోజులుకి పదిరోజులు తక్కువో ఇరవైరోజులు ఎక్కువో ఉండచ్చని కొత్త భాష్యపు చావు కబురు చల్లగా వినిపించలేదూ?

శర్మ కాలక్షేపంకబుర్లు-జగడం.

Posted on జనవరి 28, 2013
16

dscn1750

జగడం.

“జగడమెందుకొస్తుంది జంగమయ్యా! అంటే బిచ్చం తేవే బొచ్చుముండా” అన్నాడట. ఇది రాయలసీమ నానుడి, ఎక్కువగా తిరుపతి ప్రాంతం వారు మాటాడే మాటల్లో దొర్లుతుంది.ఇక్కడ తెనుగునాట పాతకాలపు ప్రజల ఆచార వ్యవహారాలు చెప్పాలి. భర్తలేని స్త్రీని విధవ అని ముండ అని కూడా అంటారు, తెనుగులో. పూర్వకాలం భర్త లేని స్త్రీ జుట్టు ఉంచుకునేది కాదు,బొట్టూ పెట్టుకునేది కాదు, పువ్వులు ముడిచేవారు కాదు.. కొంత మంది కాలంతో మారి జుట్టు ఉంచుకోవడం ప్రారంభించారు. అదిగో అలాగ ఆక్షేపించాడనమాట, జుట్టు ఉంచుకున్న విధవరాలిని , సంప్రదాయం తప్పి జుట్టు ఉంచుకున్నందుకు. దాంతో జగడమొచ్చింది. తగువు రావడానికి కారణాలే ఉండక్కరలేకపోతున్నాయి, నేటి రోజులలో. “నారాయణా” అంటే బూతుమాటయిపోతూ ఉంది.  ఎలాగా మొదలెట్టేం కనక కొన్ని సంగతులు కూడా ముచ్చటించేసుకుందాం.పూర్వం తెనుగునాట మగవారు పంచె కట్టు, కంటి మెడ లాల్చీ పైన కండువా. ఈ కండువా వేసుకున్న స్థానాన్ని బట్టి అతని విషయం చెప్పకనే తెలిసేది. కండువా ఎడమ భుజం మీద వేసుకుంటే భార్య ఉన్నవాడనీ, కుడి భుజం మీద ఉంటే భార్య లేనివాడనీ తెలిసేది. తలపై సిగ ఉండేవి. ఆడ పిల్లలికి పెళ్ళి అయిన తరవాత మెడలో మంగళ సూత్రాలూ, కాళ్ళకి మట్టెలు, పాపిట కుంకుమ బొట్టు ఉండేవి,జడ లేక కొప్పు పెట్టేవారు, పువ్వులు ముడిచేవారు. భర్త లేని వారిని విధవ అంటే భార్య లేనివారిని విధురుడు అనేవారు. ముండ అంటే తెనుగులో మరొక అర్ధం కూడా ఉంది, అనధికార భార్య, అని. అందుకు జంగమయ్య చెప్పిన నానుడి కి తగువొచ్చిందనమాట, తగువెలా వస్తుందీ, అన్న ప్రశ్నకి సమాధానం చెప్పినా.. తగువు రావడానికి కారణాలే అక్కరలేదనుకున్నాం కదా అదెలాగో చూదాం.

dscn1541

మా ఇంటికి ఎదురుగా ఒక పెద్ద భవనం కట్టేసేరు. అందులో కొత్తగా 24 కుటుంబాలు చేరిపోయాయి, గత సంవత్సర కాలంగా. మానవుడికి చెత్త పోగుచేసుకోవడం కూడా ఒక దురలవాటు. దానిని ఎక్కడ పడితే అక్కడ పోసెయ్యడమూ అలవాటే. ఈ భవనం రాక ముందు మా పరిసరాల్లో చెత్త కనపడేది కాదు. ఈ భవనం లో కి జనం చేరిన తరవాత మా పక్క ఖాళీ స్థలం లో ప్లాస్టిక్ కవర్లు, అట్ట పెట్టెలు, నానా రకాల చెత్త పోసెయ్యడం ప్రారంభించారు. అందరికి ఓపికగా చెప్పేము, ఆ స్థలం మాది అందులో చెత్త పోయద్దని. ఒకావిడ చాల తెలివిగా “ఖాళీ గా ఉందికదండీ” అంది, “మీ గుమ్మ ముందూ ఖాళీ గానే ఉంది అక్కడ పోసుకోవచ్చుగా, చెత్త,” అని ఇల్లాలంటే, మళ్ళీ మాటాడలేదు. కొంత కాల మానేశారు, మళ్ళీ మొదలు పెట్టేరు, దీనికి కధానాయకురాలు మా ఇంటి కి ఎదురుగా ఉన్న ఇంటిలో ఉన్నావిడే. ఆవిడకి మొక్కలంటే చికాకు,గుమ్మం ముందు రాలిన మామిడాకులు తుడుచుకోవడానికి ఆవిడకి బద్ధకం, సాధారణం గా మేమే తీసేస్తూ ఉంటాం రోజూ. మీ ఇంటినిండా మొక్కలే, పాములొస్తాయి,చెట్ల ఆకులు తుడుచుకోడం కష్టంగా ఉంది, అందుకు చెట్లు కొట్టించెయ్యమని ఉచిత సలహా ఇచ్చి చూచిందట, ఇల్లాలికి. సరే దానికావిడ సమాధానం కూడా ఇచ్చింది. ఈ ఎదురింటావిడ చెత్త మళ్ళీ పోయ్యడం మొదలెట్టింది, మమ్మల్ని ఎలాగయినా ఇబ్బంది పెట్టాలని. ఆవిణ్ణి చూసి అందరూ పోసేస్తున్నారు. ఒక రోజు నేనూ ఇల్లాలూ కలిసి చెత్తంతా ఒక చోటికి పోగుపెట్టి దానికి నిప్పు పెట్టేము. పొగ భవనం వైపుకి వెళ్ళింది, గాలి అటు ఉండటం మూలంగా. అపార్ట్మెంట్ల లో వారంతా వచ్చేసేరు, “మీరిలా మంట పెడితే పొగతో బాధ పడుతున్నా”మని దెబ్బలాటకొచ్చారు.” మీరంతా, మా స్థలం లో పోసిన చెత్త మంట పెట్టేము, మీ వైపు పొగ రావాలని మేమనుకోలేదు, గాలి అటువేస్తోంది, పొగ అటువచ్చింది, దానికి మా బాధ్యత లేద”న్నాం. “మీరు మంట పెట్టకూడద”న్నారు. “మా స్థలంలో మీరు చెత్తపోయక పోతే, మంట పెట్టే సమస్య లేదు. ఆర్పేస్తాం, చెత్త ఎత్తిస్తారా” అన్నాం. ఒకరూ సమాధానం చెప్పలేదు, మంట అలాగే కొనసాగించాం, “ఇక ముందూ ఇలాగే మంట పెద్డతాం, విసిగిపోయా చెప్పి, చెప్పి. మీరింకా అలాగే చెత్తపోస్తే మీ గుమ్మందగ్గరే మంట పెడతా”మని చెప్పేసేం కూడా, దగ్గు కుంటూ పోయారు, తప్పించి చెత్త పోయమన్న మాట ఒక్కరూ చెప్పలేదు. ఆహా, ఏమి వింత?పక్కవారికి ఇబ్బంది కలగచేస్తున్నామేమో అనే స్పృహ కూడా చచ్చిపోతూంది.

dscn1539

ఇదేమి అలవాటోగాని ప్రతి ఒకరూ చేతులూచుకుంటూ వెళతారు మార్కెటుకి. కూరల దగ్గరనుంచి నూనెతో సహా అన్ని సరుకులూ పేకింగ్ లో తెచ్చుకుంటారు. వాడేసిన వాటిని ఒక చోట భద్రపరచి చెత్త బండికి ఇవ్వరు, ఇలా వీధులలొ పోస్తారు, నీరు నిలవున్న చెత్తలో దోమలు కూడా పెరుగుతాయి, మమ్మలినేకాదు, మిమ్మలినీ కుడతాయని చెప్పినా వినిపించుకోరెందుకో తెలియదు. ఇలా చెప్పిన మమ్మల్ని పిచ్చి వాళ్ళలా చూస్తున్నారు, అపార్ట్మెంట్ లో ఉన్నవారంతా. అభిప్రాయభేదాలు, జగడాలుగా, ఆపై సిగపట్లుగా మారిపోతున్నాయి.

శర్మ కాలక్షేపంకబుర్లు-ఎందుకలా?

Posted on జనవరి 31, 2013
15

dscn1743

ఎందుకలా?

ఒక రోజూ ఉదయం లేవగానే దంత ధావనం దగ్గరనుంచి ఏపని చెయ్యాలన్నా బద్ధకంగా ఉంది. కాలకృత్యాలు తీర్చుకుని కూచుంటే “స్నానం చెయ్యండి” అని ఇల్లాలంటే “వస్తున్నా” అనడమే కాని కదలకపోవడం చూసి “లేవండి” అని మరో సారి అంటే లేచి స్నానం అయిందనిపిస్తే, పూజ దగ్గర కూచుంటే గానుగెద్దులాగా మంత్రం ఉన్నచోటునుంచి కదలదు, రోజూ చేసేదయినా, నోటికే వచ్చి ఉన్నదయినా. ఏదో అయిందనిపించి,నైవేద్యం పెట్టేసి, నమస్కారం పెట్టేసి లేచి రావడం జరిగింది. పోనీ నామ పారయణ చేదామనుకుంటే అదీ నడవలేదు, కొద్ది సేపు తరవాత ఆగిపోయింది, ఏదో తెలియని నిర్లిప్తత. ఆ తరవాత ఎవరు పలకరించినా మాటాడాలనిపించలేదు, పుస్తకం తీసి చదువుదామంటే పంక్తి ముందుకు నడవలేదు. కళ్ళు ఉన్న చోట ఆగిపోయాయి. పోనీ శరీరం విశ్రాంతి కోరుతోందేమో అనుకుంటే నిద్రా పట్టదు. అలాగని ఏదయినా సమస్యను మనసు ఆలోచిస్తోందా అనుకుంటే కొత్తగా వచ్చిన సమస్యా లేదు. పాత సమస్య కెలకవేయచ్చు, అదేనా ఉందేమో ననుకుంటే అదీ లేదు. “ఎవరిగురించయినా బెంగ పెట్టుకున్నానా?” అంటే “ఈ మధ్య ఒక నిర్ణయం తీసుకున్నా అమలు చేస్తున్నా కూడా ఎవరి గురించీ ఆలోచించటం లేదు, బెంగా లేదు, ఒకప్పుడు ఆదుర్దా పడేవాడిని, అదీ మానేశాను కదా, పోనీ టపా రాద్దామని మొదలెడితే అసలదీ నడవలేదు. కూచో బుద్ధి కాదు, నడవబుద్ధి, పడుకోబుద్ధి కాదు. ఏదో అశాంతి, కారణం మాత్రం కనపడదు.

dscn1863

ఈ సందర్భంలో నన్ను గమనిస్తున్నట్లుంది, ఇల్లాలు ఒక కాఫీ గ్లాసు తను తెచ్చుకుని, దగ్గర కూచుని తాగుతూ మరొక గ్లాసుతో కాఫీ ఇచ్చి నెమ్మదిగా మొదలెట్టింది. “ఏమయింది? అలా ఉన్నారేం” తో ప్రారంభించింది. “ఏంలేదు” అంటే “మరి అలా కూచున్నారేం? హుషారుగాలేరు, ఏమయింది? ఏదయినా సమస్యా? అనారోగ్యమా?” అని ఒంటి మీద చెయ్యేసి చూసి “బానే ఉంది, ఏంటి ఇబ్బంది” అని ప్రశ్నించింది తరచి తరచి. “నాకయితే ఏ సమస్యా కనపడటంలేదు, కొత్తది కాని పాతది కాని. నా మనస్సూ ఏదీ ఆలోచించటం లేదు. సంకల్పమూ లేదు, వికల్పమూ లేదు” అన్నా. “మీకు తెలియకనే ఏదో విషయం మీద మీ మనస్సు లగ్నమైపోయి ఉంటుంది. కాని మీరు గుర్తించలేకపోతున్నారంతే”. “అదేం కాదనుకుంటానోయ్” అన్నా. “అందరం చెప్పేదే అది. ఎవరేమైనా అన్నారా? మీ మనసు బాధ పెట్టేరా? ఎవరితోనయినా దెబ్బలాడేరా? సాధారణంగా దెబ్బలాటకి వెళ్ళరే నాకు తెలిసి, ఎందుకు ఆలోచిస్తున్నారు. జరిగిపోయినదేదీ తిరిగిరాదు, జరగనున్నది మన చేతిలోనూ లేదు పూర్తిగా. మన మనసు మంచిదయితే మనకు మంచే జరుగుతుంది. ఒక వేళ మనకు వ్యతిరేకంగా ఏమయినా జరిగితే అది భగవంతుని కల్పన అలా ఉన్నదనుకుందాం. మనం కావాలని మనసా వాచా కర్మణా తప్పు చేయం కదా? ఒక వేళ మనకు తెలియక తప్పు జరిగిపోతే మనవల్ల, దానిని మనం వెనక్కు తీసుకోగలిగితే మంచిదే. తీసుకోలేకపోతే మనం చేయగలదీ ఉండదు. అలా జరగాల్సి ఉంది జరిగింది అంతే. కాసేపు పడుకోండి. లేదూ ఏదయినా మీకు ఉత్సాహం కలిగే పని చేయండి. మీకు నచ్చిన పుస్తకం చదువుకోండి” అని ఎన్నో చెప్పింది. “అవన్నీ ప్రయత్నం చేశా కాని ఎందుకో నిస్పృహ గా ఉందంటే”. “ఏమీ బాధ పడకండి దేని గురించీ ఆలోచించకండి” అని దగ్గర కూచుని చేతిలో చెయ్యి వేసి రాస్తూ “ఏదో బాధ, ఒక్కొకప్పుడు ఇలాగే బాధపెడుతుంది. మీరయితే ఏదో పద్యమో, ఏదో చెబుతారు, మరినేను చదువుకోలేదుగా మరి పద్యాలు రావు” అని ఓదార్పు మాటలు పలుకుతూ, “భర్తకు భార్య, భార్యకు భర్త సుఖ స్థానాలు. ఒకరిని ఒకరు అర్ధమూ చేసుకోవాలి, లాలించాలి, బుజ్జగించాలి, కోపగించాలి, అలగాలి, జీవితంలో ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నాం? ఎప్పుడూ కష్టాలకు బాధ పడలేదే, మనకు కష్టాలే చుట్టాలు కదా! ఎప్పుడూ ధైర్యం వదల లేదే! ఇప్పుడు మాత్రం ఎందుకు వదిలెయ్యాలి? ధైర్యంగా బతకడమే మనకు అలవాటు, మీరు పిరికివారు కాదు, మనకు పిరికితనం లేదు, ఎప్పుడు రాదు, రండి ఒక సారి అలా మొక్కల్లో తిరిగొద్దా”మని చెయ్యిపట్టుకు తీసుకుపోయింది.

కరణేషు మంత్రి అంటే ఇదేనా?

అసలు ఇలా ఎందుకు జరుగుతుందీ!

dscn1865

శర్మ కాలక్షేపంకబుర్లు-స్వర్గానికి ప్రేమ యానం.

Posted on జనవరి 25, 2013
26
స్వర్గానికి ప్రేమ యానం.

కనులకివిందు,                                                     మనసుకి పసందు

dscn1582

స్వర్గానికి ప్రయాణం.

“మొన్న మా అన్నయ్య వచ్చి వెళ్ళాడు గుర్తుందా” అంది ఇల్లాలు.
“అవును వచ్చాడు కదూ!”
“అయ్యోరామా! మనల్ని 23 న రమ్మని చెప్పి వెళ్ళేడు కదా?”
“అవును!”
“ఏంటిదీ! మనం వెళుతున్నామా?” ప్రశ్న, ఇల్లాలిది.
“మరిచిపోయానోయ్!”
“మీకు నేను తప్పించి అన్నీ గుర్తుంటాయి,” అలుకతో మాటాడింది ఇల్లాలు.”ఏం చెప్పలేదు” అంది.
“నువ్వు తప్పించి నాకేదీ గుర్తుండదోయ్ ! వెళుతున్నామా అన్నా!”
“బాగానే ఉంది సంబడం! అదేంటి? నేనడిగింది మళ్ళీ నన్నే అడుగుతున్నారూ” అంది.
“ఏభయి ఏళ్ళకితం ఒక రోజు తలవంచుకుని తాళి కట్టేను, అప్పటి నుంచి నీ మాట ఏది కాదన్నాను కనక,” అన్నా.
“అక్కడికి నా మాట మీద నడిచేస్తున్నట్లు అందరూ అనుకోవాలని బడాయి.”
“నిజమో కాదో, నీ మనసు నడుగు” అన్నా,
“అది నా దగ్గరెక్కడుందీ! మీకే తెలియాలి. దానికేం గాని అసలు సంగతి చెప్పండి” అంది.
“సూదితో దారం బొంతకి అలంకారం అని, నీతో రాకుండా ఎక్కడికిపోతాను” అన్నా.
“ఐతే పడుకోండి” అంటూ ఉండగా ఫోన్ మోగింది.
“చిన్నకోడలిని వాళ్ళ నాన్నగారు రేపు ఉదయమే రమ్మన్నారు, ఏదో పని ఉందిట” అంది. “సరే ఐతే, మనమిటు అమ్మాయటూనా” అన్నా!.
“అత్తయ్యగారు, నేను మా పుట్టింటికీ, మీరు మీ పుట్టింటికీ ప్రయాణం” అంది, చిన్న కోడలు.
“ఇదేదో గూడు పుఠాణీ కాదు కదా!,” అంటే
అబ్బే అదేమీ లేదని అత్తా కోడలూ జమిలిగా హామీ ఇచ్చేరు, నమ్మక ఛస్తానా? అదుగో అలా బయలుదేరేం. ఉదయమే ఇల్లాలిని బస్సుస్టాండులో దింపి, కోడల్ని బండెక్కించడానికి తీసుకెళ్ళేడు, అబ్బాయి, “నేను వెనక బండి వేసుకువస్తా,పూజ పూర్తి చేసుకుని,” అన్నా!
“జాగర్తగా రండి” అని చెప్పివెళ్ళింది.అదిగో అలా నా స్వర్గానికి ప్రయాణానికి నాందీ వాచకం పలికేను. తొమ్మిది కెళ్ళేటప్పటికి, బయట అన్నగారితో కబుర్లు చెబుతూ కనపడింది, ఇల్లాలు. “ఏం? మడి కట్టుకోలేదా?” అన్నా.. “అబ్బే! అత్తా కోడలూ చేసుకుంటున్నారు,మధ్యలో నేను వేలెందుకని,” వద్దన్నారంది. కాఫీ తాగిన తరవాత, “మరేం చేద్దా”మంది, “సరే! ఐతే స్వర్గం చూసొద్దా”మన్నా. ఈలోగా మేనల్లుడు తయారయి “రండి” వెళదామన్నాడు. రెండు బళ్ళ మీద బయలుదేరేం.

dscn1590dscn1562dscn1561dscn1532dscn1605

స్వంత ఊరు కదండీ! వారలా లాన్ మీద ఠీవిగా నడచి వెళుతూంటే, వెనక వెళ్ళాలిసిందే 🙂

dscn1637

స్వర్గీయ ఆకుల సుబ్బారావు గారు.
శ్రీ తాడాలగంగరాజు గారి చిత్రంకోసం ప్రయత్నించాను కాని దొరకలేదు.

కడియం నర్సరీలు అన్నవి దగ్గరగా 200 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నాయి. మూడు ఊళ్ళు ప్రసిద్ధి. కడియం, కడియపులంక, అల్లుళ్ళ ఊరు కడియం సావరం. దగ్గరగా 5౦౦ చిలుకు నర్సరీలున్నాయి. ఇక్కడే ఎందుకున్నాయి అన్నదానికి చరిత్రలోకెళితే శ్రీ రావు చిన్నారాయణిం దొరగారు, ఈ నర్సరీలకి ఆద్యుడు. ఆ తరవాత శ్రీ ఆకుల సుబ్బారావు, శ్రీ తాడాల గంగరాజు మొదలైన వారు ఈ వ్యవసాయ ప్రక్రియను కొనసాగించారు.వీరిద్దరూ ఆరవై డెభ్భై సంవత్సరాలకితం ఊరూరా మామిడి అంట్లు కావడిలో వేసి తిరిగి అమ్మేవారట. ఇద్దరూ నిరాడంబరులే, ఒక కొల్లాయి కట్టేవారు, మరొకటి పైన కప్పుకునేవారు, ఇద్దరూ గాంధీ ప్రభావితులే.వీరికి మంచి మిత్రుడు మా మామ గారు. అందరూ నిర్భాగ్యులే. రెక్కల కష్టాన్ని నమ్ముకున్నవారే. అంటు కట్టడం లేదా గ్రాఫ్టింగ్ లో ఇక్కడి వారు నిష్ణాతులయి మంచి మంచి మామిడంట్లు, అందానికి క్రోటన్ మొక్కలతో నర్సరీలు ప్రారంభమయి, నేడు బోన్ సాయి మొక్కల తాయరీనుంచి ఇతర శాస్త్రీయ ప్రక్రియలన్నీ అలవరచుకుని, విద్యని వ్యాపారానికి ఉపయోగించుకుంటున్న మేధావులు, వీరు.

dscn1645

మా మామగారు

dscn1626

ఈ మొక్కల కోసం ఆరు నర్సరీలయినా తిరిగాను. ఇవి బతకడం కష్టం. ఏంటో చెప్పుకోండి చూద్దాం.

dscn1611

మిధునం

పాతిక నర్సరీలు తిరిగాం, మొత్తం మీద ఉదయం మధ్యాహ్నం, దగ్గరగా ౩౦౦ ఫోటో లు తీశాను, అన్నీ పెట్టేసి మీకు చూపాలనే ఉంది, సాధ్యమా! అందుకు రోజుకొక ఫోటో, టపాతో. అందమె అనందం, ఆనందమే జీవిత మకరందం.చూస్తూనే ఉండండి 🙂

dscn1547

శర్మ కాలక్షేపంకబుర్లు- సుఖమా! ఎక్కడ నీ చిరునామా?

సుఖమా! ఎక్కడ నీ చిరునామా?

ఆయుర్వర్ష శతం నృణాం పరిమితం,రాత్రౌ తదర్ధం గతం,
తస్యార్ధస్య పరస్య చార్ధమపరం బాలత్వవృద్దత్వయోః
శేషం వ్యాధివియోగదుఃఖసహితం సేవాదిభిర్నీయతే,
జివే వారితరఙ్గచఞ్చలతరే సౌఖ్యం కుతం ప్రాణినామ్…..భర్తృహరి

ఆయువు నూరువత్సరము,లందు సగంబుగతించె నిద్రచే,
నాయఱలో సగంబు గతమయ్యెన్ బాల్యజరాప్రసక్తిచే
బాయక తక్కినట్టిసగ బాలు గతించు బ్రయాసవృత్తిచే,
నాయువు చంచలం,బుడుగు బ్రాణులకెట్లు సుఖంబు చేకురున్…..ఏనుగు లక్ష్మణ కవి.

మనిషి జీవితకాలం వంద సంవత్సరాలు, అందులో సగం నిద్రలో జరిగిపోతుంది, మిగిలిన సగంలో సగం బాల్యం,ములితనంలో జరిగిపోతుంది. ఇంకా మిగిలిన పాతికేళ్ళలో వ్యాధి, వియోగాలు,దుఃఖం, పొట్టకూటికి సంపాదనతోనే సరిపోతుంది, ప్రాణమా నీటి అల వంటిది, మరి ఇక సుఖమెక్కడ? అని కవి హృదయం.

పరిశీలిస్తే కవి మరీ నిరాశాపరుడా? కాదు నిజం చెప్పేడు, అది ఒప్పుకోడానికి మన మనసు ఒప్పుకోదు 🙂 అసలు మినహా,అనగా నిద్రలో ఏబదేళ్ళు+బాల్య వృద్ధావస్థలలో పాతికేళ్ళు మొత్తం డెభై ఏళ్ళు పోగా మిగిలిన పాతికేళ్ళలో, పాతికేళ్ళ పగళ్ళేసుమా!, అంటే మూడు వందల నెలలు, సుమారుగా తొమ్మిదివేల రోజులలో, అనగా 1,08,000 గంటలలో, 72,000 కడుపు నింపుకోడానికి, చదువు, వృత్తిలకు పోతే, మిగిలిన 36,000 గంటలలో పునరుజ్జీవనానికి 9,000 గంటలు పోతే, మిగిలిన 27,000 గంటలలో దుఃఖం, విరహం, వ్యాధులకు 18,000 గంటలు పోతే పోతే,మిగిలిన దానిలో 9,000 గంటలు ప్రయాణాలలో పోతే, సుఖం అనుభవించడానికి సమయమేదీ? ఒక వేళ సుఖం అనుభవిద్దామన్నా, దొరికినదానితో సంతృప్తి లేదు, యోగమున్నది దొరుకుతుందన్న గుర్తులేదు, ఏదో కావాలని కోరిక,తపన,తృష్ణ, అది దొరకదు, ఒకవేళ దొరికితే, దానితో కొద్దికాలం గడిపిన తరవాత వెక్కసమై, మరొకదానికోసం మనసు ఆరాటం, మళ్ళీ కొత్తదానికోసం పోరాటం, మళ్ళీ అవే పరుగులు, ఎండమావిలో నీటి వేట. మనల్ని కావాలనుకున్న వారితో, మనతో మాటాడటానికి ఉత్సాహం చూపేవారితో మాటాడం, ఎవరో మన ముఖం చూడని వారికోసం ఆరాటం. మనల్ని కావాలనుకున్న వారి దగ్గర సుఖపడతామన్న విచక్షణ వదిలేస్తాం, లేని దాని గురించి ఏడుస్తాం. ఇదంతా మనసు చేసే చిత్రంకదా! అసలు సుఖమంటే ఏమిటి? ఏది సుఖం? త్యాగరాజు అన్నారు నిధి చాల సుఖమా? రాముని సన్నిధి చాలా సుఖమా? తెల్పవే ఓ మనసా అన్నారు. కాని అది మనం ఒప్పుకోటంలేదు. పంచ భూతాత్మకమైన ఈ శరీరం తో అనుభవించే,శ్రవణ, స్పర్శ,నేత్ర,జిహ్వ,ఘ్రాణ ఇంద్రియాలతో అనుభవించేవి సుఖాలనుకుంటున్నాం, అసలు అవన్నీ సుఖాలేనా? అసలు అనుభూతి ఎవరిది? మనసుది కదా? మరీమనసెక్కడ కనపడింది? ఏదీ కనపడదే అలా కనపడకుండా మనల్ని ఆడిస్తున్న మనసు ఎవరు? మన మీద అధికారం చెలాయించమని ఎవరిచ్చారీ అధికారం ఆ మనసుకి. అసలు మనసే మనమా? కాదే, మనమెవరూ? సమాధానం లేని ప్రశ్నా? కాదు. నేతి, నేతి (న+ఇతి= నేతి) నేను, ఇదికాదు ఇదికాదు అని ఎలిమినషన్ ప్రోసెస్ లో అనుకుంటూ నేను ఇదికాదు, చివరికి మనసు కూడా నేను కాదు కదా? మరి అసలైన నేనెవరూ? అదే ఆత్మ. అదే నీవైన పరమాత్మ. పరమాత్మ ఎక్కడో లేడు,

అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్స్థితః,
అనన్తమవ్యయం కవిగ్ం సముద్ద్రేన్ఽ తం విశ్వశమ్భువమ్,

పద్మకోశ ప్రతీకాశగ్ం, హృదయంఛాప్యధో ముఖమ్,
అధోనిష్ట్యా వితస్యాన్తే నాభ్యాముపరితిష్ఠతి………..

సన్తాపయతిస్వం దేహమాపదతలమస్తగః
తస్య మధ్యే వహ్నిశిఖా అణీయోర్ధ్వావ్యవస్థితః.

నీలతోయదమధ్యస్థా ద్విద్యుల్లేఖేవ భాస్వరా
నీవార సూకవత్తన్వీ పీతాభా స్వస్త్యణూపమా,

తస్యా శిఖాయ మధ్యే పరమాత్మా వ్యవస్థితః.

ఇంత స్పష్టంగా పరమాత్మ మనలో ఎక్కడున్నాడో చెబితే ఇంకా అనుమానమా?
వస్తున్నా….అదేంటో చెప్పి వెళ్ళమంటారా? ఏంచేయను మనవరాలు అరగంట నుంచి ఆడుకోడానికి పిలుస్తూంది, 24 నుంచి 27 దాకా శలవులండి బాబూ! వెళ్ళకపోతే అలుగుతుంది, ఏడుస్తుంది, అది భరించలేను మరి……..అదే వాసనంటే! దాని గురించి మరోసారి. 🙂

dscn1534

  నేటినుంచి కనులవిందు మొదలు, చూస్తూనే ఉండండి.

శర్మ కాలక్షేపంకబుర్లు-రెండవ బాల్యం

Posted on జనవరి 21, 2013
9
రెండవ బాల్యం

మనవరాలికి 12 వ తేదీ నుంచి శలవులిచ్చారు. 13,14 పండగ హడావుడి సరిపోయింది, 15 నేను ఊళ్ళో లేను, 16 బడలిక అందుకు నా దగ్గరికి రానివ్వలేదు, బుల్లితల్లిని. మరి 17 నుంచి రోజూ ఆడుకోడమే. ఇంటిలో ఎవరి పని వారికి ఉంటుంది కదా! దానితో ఆడుకునేవారు లేరు. నెమ్మదిగా నా దగ్గర చేరి “తాతగారూ” అంటుంది ముందు లైలుగా. “ఏంటిరా, చిట్టితల్లీ” అంటే, “మనం ఆడుకోవచ్చా?” అంటుంది, పొద్దుటే. “చదువుకున్నావురా! ఇప్పుడు ఆటలంటున్నావ”ంటే, “అన్నీ చదివేసుకున్నాను తాతా! నువ్వడుగు నేను చెబుతాగా,” అంది. “అమ్మని కాని, నాన్నని కాని రమ్మను ఆడుకోడానిక”ంటే, “అమ్మేమో మామ్మ తో పనిలో ఉంది. ఆడుకుందామంటే కేకలేస్తుంది, నాన్నేమో బయట పని ఉందని బట్టలేసుకుని వెళ్ళిపోతున్నాడు.” “పోనీ మామ్మని పిలు” అన్నా. “మామ్మ పనిలో ఉంది “ఆమ్ము” వండుతోంది, ఇప్పుడు పిలిస్తే అట్లకాడ పుచ్చుకుని తరుముకొస్తుంది” అంది, ముసి ముసి నవ్వులు నవ్వుతూ. “ఇంట్లో ఖాళీ గా ఉన్నవాడివి నువ్వే తాతా! రా ఆడుకుందాం. లే ఇక్కడినుంచి, పొద్దుటనగా కూచున్నావు కంప్యూటర్ దగ్గర, హన్నా! నీకసలు భయం లేకుండా పోయింది” అంది. “నేను పెద్దవాణ్ణి కదే అలా అనచ్చా” అంటే, “నేను తాతమ్మని కదా! అందుకనచ్చనమాట,నేను నీకు అమ్మని కదా” అంది. ఇంక ఏం చెప్పాలీ, తోచలేదు, “నీకడుపుడక, అమ్మాయ్! చూడు” అనబోతుండగా నా నోరు మూసేసి, “నువ్వు గట్టిగా మాటాడకు, ఆడుకోడానికి వస్తే రా! లేకపోతే నీకూ నాకూ కచ్చి కచ్చి,” అంది. రాసుకోవాలమ్మా అన్నా! “ఊ..నువ్వెప్పుడూ ఇంతే” అని దీర్ఘం తీసి దూరంగా కుర్చీలో కూచుంది, మూతి ముడుచుకుని. ఎలా? మనవరాలు అలా కోపంగా కూచుంటే చూడలేనని దానికి తెలుసు, అదే నా బలహీనతా అని తెలుసు. “సరే కట్టేస్తున్నా”అన్నా, కదల లేదు, ఈలోగా కరంటు పోయింది. “మా బలే అయ్యింది, అచ్చికిచ్చి, అచ్చికిచ్చి” అని చంకలు కొట్టుకుంది.

మరో రోజు “ఆడుకుందాం కంప్యూటర్ కట్టేయ్యీ” అంది. “కట్టేస్తున్నానమ్మా” అంటే “నువ్వెప్పుడూ ఇంతే” అని అలిగి కూచుంది. నేను వెళ్ళి బతిమాలి అలకతీర్చాలి మరి. “చిన్నతల్లి బంగారు తల్లి కదూ,కోపగించుకోదుట, ఆడుకోడానికి వచ్చేశానుకదురా! మరికెందుకూ కోపం, మాటాడవా? మూతి ముడుచుకు కూచుంటే ఎలా అమ్మా? కన్నతల్లి ఇలా మాటాడకపోతే తాతకి పిచ్చెక్కినట్లు ఉంటుందని నీకు తెలుసుకదరా? మాటాడమ్మా! అమ్మకదు, తల్లి కదు, ఇంకెప్పుడు నువ్వు చెప్పిన వెంఠనే వచ్చేస్తాకదా,” అని బతి మాలితే “నీతో మాటాడను ఫో” అంది. “బుల్లితల్లి మాటాడెసిందోచ్” అన్నా. “నేనేం నీతో మాటాడలేదు” అంది. “ఎవరితో మాటాడేవు మరి” అంటే, “ఏమో. ఎవరయితే నీకెందుకు?” అంది. “మాటాడమ్మా! రా మరి ఆడుకుందామంటే ఎత్తుకో”మంది, “అమ్మో ఎత్తుకోగలనా? ఎత్తుకుంటే ఇద్దరం పడిపొతే,” అన్నా. “అమ్మో! మామ్మ చూసిందంటే పెళ్ళి చేసేస్తుంది,” అంది. “సరే ఒక్క సారి ఎత్తుకుని దింపేస్తానేం” అని ఎత్తుకుని దింపితే ముద్దిచ్చింది, పిచ్చి తల్లి.

కంప్యూటర్ కట్టేసి మనవరాలు వెనక బయలుదేరాను. “అలా బుద్ధిమంతుడిలా రావాలి, చెప్పిన మాట వినాలి” అంటూ రెండు బేట్లు ఒక కాక్ పట్టుకొచ్చింది.ఆట మొదలెట్టింది, “నీకు ఆడటం రాద”ంది పాయింట్లు లెక్కెడుతూ “ఓడిపోయా”వంది. ఇప్పుడు మరో ఆట అని, వర్డ్ గేం మొదలెట్టింది. నేను మాట చెబితే అక్షరాలు పేర్చేది, అందులోనూ తనే గెలిచింది. తరవాత రింగు తెచ్చింది, ఆ ఆటలోనూ తనే గెలిచింది. “ప్రతి ఆటలోనూ నువ్వేగెలుస్తున్నావమ్మా! పిక్కినీలు ఆడుతున్నా”వన్నా. “అదుగో నేను తాతమ్మని కదా! అలా అనచ్చా! మా తాత మంచాడు అల్లరి చెయ్యట్టా, ఇప్పుడు పాట పాడతాను నువ్వూ పాడా”లంది.”నాకు రాదే అంటే నేను నేర్పుతానుగా పాడు” అంది. ఇలా పాట నేర్పింది.

చెమ్మ చెక్క చారడేసి మొగ్గ
అట్లుపోయంగ, ఆరగించంగ,
ముత్యాల పందిట్లో ముగ్గులేయంగ,
రత్నాల పందిట్లో రంగులేయంగ,
ఆ పందిట్లో మా బావ పెళ్ళి చేయంగ
సుబ్బారాయుడు పెళ్ళి, చూచి వత్తాం రండి,
మనవారింట్లో పెళ్ళి మళ్ళీ వద్దాం రండి. అహహహహ…

పాట పాడుకుంటూంటే ఇల్లాలొచ్చింది, “ఏంటీ! తాతా మనవరాలు దోస్తీయా, కుస్తీయా” అంది. “మామ్మా నీజట్టు కచ్చిఫో” అంది. “మన మామ్మేకదమ్మా” అంటే నోటికి చెయ్యి అడ్డంపెట్టి “ఉత్తుత్తినే తాతా మామ్మని ఉడికించడానికి” అంది. ఇల్లాలంది, “మనమేమో తాతల్నీ ఎరగం మామ్మల్నీ, అమ్మమ్మలనీ ఎరగం, వీళ్ళ అదృష్టం మనం బాగున్నాం, వాళ్ళ సంతోషమే మన సంతోషం కదా” అంది.

“తాతా ఒక పొడుపు కధ విప్పు” అంది, చెప్పమ్మా అన్నా. “తండ్రి గరగర, తల్లి పీచుపీచు, బిడ్డలు రత్నమాణిక్యాలు, మనుమలు బొమ్మరాళ్ళు ఏంటి చెప్పు మన ఇంట్లోనే ఉన్నాయోచ్!” అంది. ఆలోచించా,”తెలీద”న్నా. “నాకు తెలుసోచ్ నీకు చెప్పనోచ్!” అంటూ పరిగెట్టింది. నాకు తెలియలా! మీకేమయినా తెలిస్తే చెప్పరూ నా బుల్లి తల్లి దగ్గర నా పరువుపోతుందీ!!!

ఈ వేళనుంచి మళ్ళీ బడి.

dscn1490

శర్మ కాలక్షేపంకబుర్లు-రాజమంద్రి వేద సభ.

Posted on జనవరి 18, 2013
6
రాజమంద్రి వేదసభ

“రేపు ఉదయమే రాజమంద్రి వెళుతున్నానోయ్” అన్నా, ఇల్లాలితో. “రేపు కనుమ కదా?” అంది. “నిజమే! కాని వేద సభ జరుగుతోందిట, అన్నయ్యతో మాటాడేను, అటునుంచి వస్తున్నారు, నేనిటునుంచి వెళుతున్నా” అన్నా. “మీ ఇష్టం” అంది ఇల్లాలు. మరునాడు ఉదయమే బయలు దేరేను, అన్నయ్య దూరం నుంచయినా రాగలిగేరు, స్టేషన్ కి, నా బండి ఇరవైఏడు కిలోమీటర్ల దూరం ప్రయాణానికి రెండు గంటలు తీసుకుంది, అది మరీ ఎక్కువలా కనపడింది, కారణం, మనసేమో సభమీద ఉంది, గుబగుబలాడిపోతోంది, స్వామి దర్శనం చేయాలని, కనక, బండి దిగిన వెంటనే బయలుదేరి పి ఆండ్ టి కాలనీ ఎదురుగా ఉన్న లాల్ బహదూర్ రోడ్ లో ఉన్న ఒక భవంతి దగ్గర దిగేం, ఉరుకులూ పరుగులతో. భారతీతీర్ధ స్వామి అక్కడ దర్శనం ఇస్తున్నారని అబ్బాయి చెప్పగా, అందుకు ముందు ఇక్కడికి చేరేం. స్వామివారిని దర్శించాలంటే ఉన్న వేషం కుదరదు, చొక్కా విప్పేసి కొల్లేటి చాంతాడంత ఉన్న వరుసలో నిలబడ్డాం, ఇంతలో ఎవరో అన్నయ్యగారిని చూసి చెయ్యి పట్టుకు లాక్కుపోయి, మరొకరికి అప్పచెప్పేరు. వారు “ఇంతాలస్యం చేసేరేం?” అంటూ మరొకరిని పిలిచి “వీరికి స్వామి దర్శనం ఏర్పాటు చేయండని”, చెప్పేరు. వారు మమ్ములను తీసుకుని స్వామికి ఒక గజం దూరం లో వదిలేసేరు. ఏమిటిది చిత్రం, స్వామి దయ, కరుణ ఇలా ప్రసరించిందా? ఏడిచే బిడ్డని తల్లి అక్కున చేర్చుకున్నట్లు, స్వామి, వీడు నా దర్శనం కోసం తపిస్తున్నాడు, తొందరగా దర్శనమివ్వాలనుకున్నారు కాబోలు. మరి ఐదు నిమిషాలలో స్వామి ముందున్నా, ఏమో ఏం జరిగిందో తెలియదు, ఇహలోకపు భావనలన్నీ ఒక క్షణం వీడిపోయి తదేక దృష్టిలో ఉండిపోయా, పాదుకలకు నమస్కారం పెట్టుకుని, స్వామి అనుగ్రహించిన ప్రసాదం తీసుకుని బయట కొచ్చేం. దర్శనమవుతుందా? అనుకున్న దానినుంచి కనుమూసి తెరిచేలోగా దర్శనం చేసుకోవడం, బయటకు రావడం క్షణాలలో జరిగిపోతే, ఎంత ఆనందం. అప్పుడిక ఇహలోకంలోకొచ్చి, స్వామిని కెమేరాలో, ప్రయత్నం చేసి ఇలా.

dscn1387

శ్రీశ్రీశ్రీ భారతీ తీర్ధస్వామి శృంగేరి పీఠాధిపతులు.

 

dscn1450

వేద పండితులలో ఒక భాగం.

dscn1402

శ్రీ విరించి వానప్రస్థాశ్రమం శ్రీ భారతీతీర్ధస్వామివారిచే చే ఆవిష్కరణ ఫలకం

dscn1407

శ్రీ విరించి వానప్రస్థాశ్రమం భవనం.

ఇప్పటిదాకా చుట్టూ ఏమున్నదీ చూడలేదు. అప్పుడు చూస్తే అది కొత్త భవనమని తెలిసింది. తీరాచూస్తే అది శ్రీ విరించి ఛారిటబుల్ ట్రస్టు వారు నిర్మించిన వానప్రస్థాశ్రమం. కొన్ని ఫోటో లు తీసుకోగా తెలిసింది స్వామికి శ్రీ దువ్వూరి రామకృష్ణారావు గారిచ్చిన దగ్గరగా నలభై సెంట్ల స్థలంలో ముప్పాతిక స్థలంలో శ్రీవిరించి ఛారిటబుల్ ట్రుస్ట్ వారు వానప్రస్థాశ్రమం కోసం భవనం నిర్మించారు. అద్భుతం, ఇంతకు మించి మాట దొరకలేదునాకు.

ఆ తరవాత స్వామి అన్న ప్రసాదం తీసుకు వెళ్ళమని మరొకరు చెప్పేరు. ఓహ్! పరమానందం, స్వామి ప్రసాదమేమో అద్భుతమైన రుచితో ఉంది. మరొక సారి స్వామికి మనసులోనే నమస్కారం చేసుకుని తదుపరి కార్యక్రమం గురించి తెలుసుకుంటే మూడు గంటలకి బ్రహ్మశ్రీ చాగంటి వారి ప్రవచనం, ఆ తరవాత పండితుల శాస్త్ర పరిచయం, తదుపరి స్వామి అనుగ్రహభాషణం అన్నారు. మూడుకి ఆర్ట్స్ కాలేజిలో వేసిన బ్రహ్మాండమైన పందిరిలో సమయానికి శ్రీ చాగంటి వారి ప్రవచనం ప్రారంభమయింది. వారేం చెప్పేరు అనేలోగా రెండు గంటలు నిమిషాల్లా గడిచి, “స్వామి విచ్చేస్తున్నారు నేను ముగిస్తున్నా”నన్నారు. స్వామి దర్శనమిచ్చారు. చతుర్వేది శ్రీ తాతాచార్యుల వారి అద్యక్షతన జరిగిన సభలో తర్కం,వ్యాకరణం, మీమాంస మొదలైన శాస్త్రాల పరిచయం ఒక్కొకరూ చేశారు. మీమాంస శ్రీ చిర్రావూరి శ్రీరామ శర్మ గారు చేశారు, బహురమ్యంగా.

dscn1394

శ్రీ విశ్వనాధ గోపాలకృష్ణ శాస్త్రి ఘనాపాఠీ గారు

dscn1425

శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు

dscn1465

శ్రీ చిర్రావూరి శ్రీరామ శర్మ గారు.

ఆ తర్వాత స్వామి అనుగ్రహభాషణం చేశారు.వారు చెప్పినది సంక్షిప్తంగా నాకు అర్ధమయినది, అందరూ వేదం చదవలేరు, అర్ధమూ కాదు, ఉదాహరణకి,రెండు వాక్యాలు తీసుకోండి సత్యం వద, ధర్మం చర ఇది వేదం చెప్పింది. ఇవి అర్ధం కావాలంటే హరిశ్చంద్రోపాఖ్యానం చదవండి, రామాయణం చదవండి అన్నారు. అయ్యో! ఒక్క శాస్త్రమయినా చదువుకోలేదే జీవితమంతా భుక్తికోసమే సరిపోయింది, ముక్తికి మార్గం లేదా అనుకుంటూ మధనపడుతున్న నాకు స్వామి వారి మాటలు అమృతపు చినుకులైనవి కదా! ఆ తర్వాత తిరుపతి దేవస్థానం వారు వేదపండితులను శ్రీ సూక్తం చెప్పమన్నారు, స్వామి యజుర్వేదులను మాత్రం పరాయతం చెప్పమన్నారు. స్వామి అజ్ఞతో వారు పరాయతం చెప్పడంతో సభ ముగిసింది.

వేద సభఅన్నారు కదా, అని అనుమానం. నిజమే వేద సభ 14 వ తేదీ మకర సంక్రమణం రోజు ఉదయమే జరిగిపోయిందిట. ఆ తరవాత శ్రీ చిర్రావూరి శ్రీరామ శర్మగారి అష్టావధానమూ జరిగిందిట. సమాచారలోపం మూలంగా ఆ రోజు వెళ్ళలేదు, వాటిలో పాల్గొనలేకపోయాను. అయినా బాధ లేదు. స్వామిని దర్శించాను, అనుగ్రహభాషణం విన్నానుకదా! ధన్యుడను.

చివరిమాట , తిరుమల తిరుపతి దేవస్థానం వారు వేద సభ జరపాలనుకున్నారట, ఎక్కడ జరపాలంటే, సాంస్కృతిక రాజధాని రాజమంద్రిలో జరపమన్నారట శ్రీ శ్రీ శ్రీ భారతీతీర్ధస్వామి. ఇంకేం శ్రీ విశ్వనాధ గోపాలకృష్ణ ఘనాపాఠీ గారి మీద భారం పెట్టేసేరట. దక్షణ భారతదేశంలోని రెండు వేలమంది వేదపండితులు సభకు ఆహ్వానించబడ్డారు. దివ్యంగా అలా మొదలయింది, ప్రతి ఆరునెలలకి ఒక చోట వేద సభ జరుపుతారట, ఇకపై.

శర్మ కాలక్షేపంకబుర్లు-ఎవరిగోలవారిదే

dscn1510

dscn1484

“పరోపకారాయ ఫలన్తి వృక్షాఃపరోపకారాయ వహన్తి నద్యః
పరోపకారాయ చరన్తి గానః పరోపకారార్ధమిదం శరీరం.

పరోపకారము కొరకు చెట్లు ఫలాలనిస్తున్నాయి, పరోపకారం కొరకు నదులు ప్రవహిస్తున్నాయి, పరోపకారంకొరకు గాలి ప్రసరిస్తూ ఉంది, మన శరీరాన్ని భగవంతుడిచ్చినది పరోపకారం కొరకే సుమా! అని కవి హృదయం.

కాని మనమే చేస్తున్నాం, అన్నీ మనమే అనుభవిస్తున్నాం, చిలకని కూడా తిననీయకుండా, మానవుడు ఎంత స్వార్ధ పరుడు.ఇక్కడ చెట్టు తను పరోపకారం కొరకే ఫలించింది, తేటి పరోపకారమూ, స్వార్ధమూ కలగలిపి, ఫలదీకరణానికి ఉపయోగపడింది, కొంత స్వార్ధంతోనయినా ఉపయోగ పడే ఈగను తినెయ్యాలని చూస్తూంది, తొండ. మానవుడు వీరందరి శ్రమ ఫలాన్ని తాను దోచుకుంటున్నాడు.

ఇక్కడొక పద్యం గుర్తురాలేదూ.

తమ కార్యంబు బరిత్యజించియు బరార్థ ప్రాపకుల్ సజ్జనుల్,
తమ కార్యంబు ఘటించుచున్ బర హితార్థ వ్యాప్తుల్ మధ్యముల్,
తమకై యన్య హితార్థ ఘాతుక జనుల్ దైత్యుల్, వృధాన్యార్థ భం
గము గావించెడివార లెవ్వరొ యెరుంగన్ శక్యమే యేరికిన్?

సంఘటనకి పద్యం ప్రతిరూపం కదూ! అలోచించండి. ఎవరి ప్రకృతి గుణాన్ని వారు ప్రదర్శిస్తున్నారు. ఎవరిగోలవారిదే కదా! “

dscn1495

dscn1491

పరపరాగ సంపర్కంతో పువ్వు పిందయితే.   పిందె పెరిగి పెద్దదై కాయై, పండయితే , పాపం చెట్టుకి అనుభవం లేదు.  మానవుడు అనుభవిస్తున్నాడు.

ఎవరిగోలవారిదే

శర్మ కాలక్షేపంకబుర్లు-అంతా భయమే-అన్నీ భయాలే

Posted on జనవరి 20, 2013
9
భోగే రోగభయం,కులే చ్యుతి భయం,విత్తే నృపాలాద్భయమ్
మానేదైన్యభయం,బలే రిపు భయం,రూపే జరాభయమ్,
శాస్త్రే వాదభయం, గుణే ఖలభయం,కాయే కృతాన్తాద్భయం,
సర్వం వస్తు భయాన్వితం భువి వృణాం,వైరాగ్యమే నాభయమ్…….భర్తృహరి

భోగం అనుభవించేవారికి రోగం వస్తుందేమోనని భయమన్నారు. రోగం వస్తే భోగానికి సంకెల పడుతుందికదా! రోగం తగ్గదేమోనని భయం, తగ్గిన రోగం తిరగబెడుతుందేమోనని భయం. ఈ భోగం పోతుందేమో అని భయపడుతూ ఉంటారు, అలాగని మితంగా భోగం అనుభవిస్తే రోగభయం ఉండదు, కాని అలా పరిమితులలో ఉండనివ్వదే, మనసు. ఇక కులే చ్యుతిభయం అన్నారు, ఇది చాలా పెద్ద భయమండి, పెద్దవారమనుకున్నవారికి, అనుక్షణం పరువుపోతుందేమోనన్న భయమే వెంటాడుతుంది. పెద్దకులాలు అనుకున్నవారికి అందరికీ ఈ భయం ఉందంటాడు శతకకారుడు. తనవారెవరేనా తప్పుచేస్తే కులంలో వెలివేయబడతానని భయపడేవారు, ఇప్పటికి తమ కుటుంబంలో తప్పు జరిగితే నలుగురుకీ తెలిసిపోతుందేమోనని భయపడతారు. శిఖరాగ్రానికి చేరుకోడం కష్టంకాదు, అక్కడ నిలబడలేమేమోనని, అసలు భయం. విత్తే నృపాల భయం, ఇది అప్పటినుంచి ఇప్పటివరకూ మార్పురానిదే. బెల్లం ఉన్న చోటికే చీమలు చేరతాయి, అలాగే పళ్ళున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలుంటాయి, గొడ్డుమోతు చెట్టు మీదకి రాయి ఎవడూ విసరడు, శ్రమ దండగనుకుంటాడు. అదే పళ్ళున్న చెట్టయితే ఒక పండేనా రాలదా అని ఆశతో, మరల, మరలా రాళ్ళు విసురుతూనే వుంటాడు. అలాగే ప్రభుత్వం ఉన్నవారి దగ్గరే ఎక్కువ వసూలు చేస్తుందంటాడు, సత్యకాలపు శతక కారుడు. ఇప్పుడు ప్రభుత్వాలు సామాన్యుల నడ్డి విరిచి అసమాన్యులకు దోచిపెడుతుందనుకోలేదు. మానే దైన్య భయం,దీనికి ప్రత్యేకంగా ఉపమానాలు చెప్పక్కరలేదనుకుంటా. నిన్నటిదాకా మహారాణీలా పదవి, అధికారం చెలాయించిన శ్రీ లక్ష్మిని చూడండి, ఇదీ అసలు చ్యుతిభయంకి, దైన్యభయానికి స్పష్టమైన ఉపమానం. బలే రిపు భయం, బలమైనవాడికే శతృవులు ఉంటారు, బలం లేనివానికి శతృ భయమేలేదు. రూపే జరాభయం, ఛంపేసేడండి శతకకారుడు, ఎంత నిజం చెప్పేడు, పాతిక వయసులో అంతా అందంగానే కనపడింది నాకూ, నేనూ అందంగానే ఉండేవాడిని, నా ఇల్లాలు రోజూ దిష్టి తీసేది కూడా, వయసు మళ్ళిన దగ్గర నుంచే అసలు భయం మొదలయింది. రూపం తగ్గిపోతోందేమోనని, కాల మహిమ కదా! పాతికేళ్ళ వయసులో ఉన్నట్లు, ఇప్పుడున్నానా, డెభ్భైఐదేళ్ళ వయసులో. అప్పుడు చూడ ముచ్చటగా ఉంటే, కాలం ఆ రూపు మార్చేసి,జుట్టూడి, పళ్ళూడి, కళ్ళు కనపడక,వినపడక, చర్మం ముడతలుపడి, నిలబడలేక కూచోలేక, ఇంక చెప్పలేనండి, అందరికీ ఇది తప్పదు, కాని వయసులో గుర్తురాదంతే :). శాస్త్రే వాదభయం, చదువుకున్నవారికి మరొక చదువుకున్నవారెదురయి వీరు చెప్పేదానిలో తప్పులు పడతారేమోనని భయపడతారట, కొంతమందికి వాదించడం, తాము చెప్పినదానిని సమర్ధించుకోడం కోసం నానా పుర్రాకులూ పడటం చూస్తూనే ఉన్నాం. నాలాటి చదువు రానివాడికి ఈ భయం నాస్తి. గుణే ఖలభయం, గుణవంతుడికి తనను ఎవరేనా చెడ్డవాడు చెడకొడ్తాడేమోనని భయం 🙂 నిజంగా చెడిపోడానికి ఇష్టపడని వారిని చెడగొట్టగలరా? ఇది భయమన్నారందుకే. కాయే కృతాంతా భయం, పుట్టిన వాడు చావక తప్పదు కాని చచ్చిపోతానేమోనని భయపడుతుంటాడు. ఈ ప్రపంచంలో అన్నీ భయాలే, అన్ని వస్తువులూ భయకారకాలే.మరింక భయంలేనిదేదయ్యా అంటే వైరాగ్యమే భయం లేనిదన్నాడు. భజగోవిందం అనుకోవయ్యా! భయం లేదన్నాడు. అయ్యో ఇప్పటినుంచి ఇలా అనుకుంటే కట్టుకున్నవాళ్ళేమవుతారూ, అందుకే మనసుతో ఎప్పుడూ భజగోవిందం, ఏ పని చేస్తున్నా……..భయం నుంచి దూరమవుతాం…ఎలా

పానీయంబులు ద్రావుచున్, గుడుచుచున్,హాసలీ
లా నిద్రాదులు సేయుచున్, దిరుగుచున్,లక్షింపుచున్, సంతత
శ్రీనారాయణ పాదపద్మయుగళీ చింతామృతస్వాద సం
ధానుండై మఱచెన్ సురారిసుతు డేతద్విశ్వమున్ భూవరా!…భాగవతం…స్కం..7..123

ఇప్పుడు మళ్ళీ భయం ఎందుకొచ్చిందంటే, ప్రభుత్వాలకీ భయం ఉంటూంది, అది ఎన్నికల భయం, 2014 ఎన్నికలు పరుగెట్టుకుని వచ్చేస్తున్నాయి. ఐదేళ్ళలో ఊడపొడిచిందేమీ లేదని, పొమ్మంటారేమోనని, భయపడి, ఇప్పుడు కేజి బియ్యం ఒకరూపాయికి మన బియ్యం అని ఇస్తామంటున్నారు, ఇది భయంతో జరుగుతున్నదే, ఈ పేరు చెప్పి ఎన్నికల సొమ్ము చేసుకోవచ్చేమో, భయంలేకుండా. ఒకప్పుడు భయం గురించి చెప్పుకున్నాం, అది కూడా చూడండి.

https://kastephale.wordpress.com/2012/01/24/