శర్మ కాలక్షేపంకబుర్లు-కొన్ని/ కొని తినేవి

కొన్ని/ కొని తినేవి
Posted on ఫిబ్రవరి 27, 2013
14

Coutesy you tube

కొన్ని/కొని తినేవి

ఈ మధ్య నీ బ్లాగు చూడాలంటే భయమేస్తోంది తాతా! అని ఒక మనవరాలు మెయిలిచ్చింది.మరో మనవరాలు ఒక టపా చదివి ఏడుపొచ్చింది తాతా! అంది. మరొక మనవరాలు మాటాడటమే మానేసింది 🙂 కోపమో, అలకో,లేకపోతే ఊపిరి పీల్చుకునే ఖాళీ కూడా లేదు తాతగారూ! అనో చెబుతుంది లెండి, తరవాతెప్పుడో! ఒకమ్మాయయితే బాబాయ్ సరదా సరదాగా కబుర్లు చెప్పేవాడివి, ఒక్క సారిగా ఇలా వైరాగ్యంలోకి వెళ్ళిపోయావని ఫిర్యాదు కూడా చేసింది. వయసు కదమ్మా! ఇప్పుడు ఆలోచనలు అలాగే ఉండాలి, అది సహజం. ఎప్పుడూ వెలుగే ఉండదు అలాగని ఎప్పుడూ చీకటీ ఉండదు, కాని చీకటిలో వెలుగు కోసం తాపత్రయ పడటమే జీవితంమరో రెండు టపాలు కొద్దిగా బరువుగా ఉండచ్చు మీకు 🙂 భయపడకండి. కాని మీ కోసం మళ్ళీ వెనక్కి వస్తున్నా.ఇదిగో వీటిని చూడండి మరి.

dscn2764

కర్ర పెండలం

ఇది చాలా మందికి తెలియకపోవచ్చు, మీరంతాపట్నవాసం వాళ్ళు కదా! కాని దీని తాలూకు మాత్రం వాడుతూ ఉంటారు, ఎప్పుడూ. 🙂 దీనినే కర్ర పెండలం అంటారు, పెండలం అని మరొకటి ఉంది. ఇది అది కాదు. ఈ కర్ర పెండలం దుంప రూపం లో పండుతుంది. దీనితో సగ్గుబియ్యం తయారు చేస్తారు. ఇప్పుడు తెలిసిందా, మీరు వాడే సగ్గు బియ్యం కాని నూడుల్స్, అప్పడాలు వగైరాలన్నీ దీనితోనే తయారు చేస్తారు. ఈ కర్ర పెండలం లో ఎక్కువగా పిండి పదార్ధమే ఎక్కువగా ఉంటుంది. మేము పల్లెటూరి వాళ్ళం కదా! ఇలా దుంప కాల్చుకుని పైనున్న తొక్క ఒలుచుకుని తినేస్తాం. కమ్మహా! ఉంటుంది. తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది. దీనిని ప్రధాన ఆహారంగా కూడా తీసుకుంటారు, కొంతమంది. గిరి జనుల ఆహారాల్లో ఇది కూడా ఒకటి.

bobbarlu

బొబ్బర్లు
courtesy google

వీటిని చూశారా! వీటిని బొబ్బర్లు అంటాం. ఉత్తరాది వారు వీటిని రాజ్ మా అని పిలుస్తారు. ఇది కూడా నాగరికులు ఎక్కువా వాడరు, దానికి ఒక కారణం ఉంది. వీటిని తిన్నప్పుడు అపానావాయువు ఎక్కువగా వెలువడుతుంది.అందుకు వాడకం తక్కువ. కాని ఇది ఇది మంచి పోషక పదార్ధం. దీనిలో మాంసకృత్తులు ఎక్కువ, బలమైన ఆహారం. పల్లెలలో వాడకం ఎక్కువగానే ఉంటుంది. ఉత్తరాది వారు రాజ్ మా ఎక్కువగానే వాడుతారు.పరోటా, రోటీ తో ఈ రాజ్ మాతో చేసిన పప్పు తీసుకుంటారు. బలేగా ఉంటుంది, కొంతకాలం నేనూ తిన్నా, ఒకప్పుడు ఉత్తరాదిని ఉన్నాలెండి, అప్పుడనమాట.దీని పిండితో అప్పడాలు కూడా తయారు చేస్తారు.

dscn2774

వాము ఆకు

ఇదిగో దీనిని చూశారా! ఇది వాము ఆకు అంటారు. ఇది అమ్మకానికి రావడం తక్కువే, దీనితో పచ్చడి చేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఈ ఆకుతో బజ్జీలు కూడా వేసుకోవచ్చు, బలే కమ్మహా ఉంటాయి,కొద్ది కారంగా కూడా, బజ్జీలు, వేడి వేడిగా తినాలి 🙂

dscn2775

ఉల్లి కోళ్ళు

ఉల్లికోళ్ళు; కొంతమంది పల్లెలో పుట్టి పెరిగిన వారు చూసివుంటారు కాని, పట్నవాసం వారికి తెలియకపోవచ్చును. ఇవి నీరుల్లి పాతినపుడు మొక్క పైకి వస్తుంది కదా; అదనమాట. వీటిని కూరగానూ, పులుసుగానూ అదేనండీ సూప్ గానూ కూడా వాడుతారు, బలేగా ఉంటుంది పులుసు.దీనికి గుమ్మడి వడియాలు తోడుంటే ఆ మజాయే వేరు. పట్నం వారికి దొరికితే వండుకు చూడండి.

గోగుపువ్వులు

గోంగూర గురించి తెలియని వారుండరు; కాని గోగు పూల గురించి తెలిసినవారు తక్కువమంది ఉంటారు. పల్లెటూరి వారికయితే; తప్పకతెలిసే ఉంటుంది కూడా. గోంగూరలో రెండు రకాలున్నాయి. పుల్లగోంగూర, ధనాస గోంగూర అని. ఇందులో కూడా పుల్లగోంగూరని కొంతమంది ఇష్టపడితే మరి కొందరు ధనాస కూరని ఇష్టపడతారు. ఈ మొక్కలు పెద్దవయిపోయి పూస్తాయి. పువ్వులు ఎర్రగా నెత్తురు ముద్దలలా ఉంటాయి. ఈ పూలను కోసుకుని పైన ఎర్రగా ఉన్న వాటిని, డిప్పల్ని ఒలుచుకుని పచ్చడి చేసుకుని తింటే బలేగా ఉంటుంది.ఇందులో నువు పప్పు కూడా వేసుకుంటే రుచి స్వర్గానికి బెత్తెడే దూరం. ఇవి కూడా పుల్లగానే ఉంటాయి. దీనిని ఆంధ్ర మాత అని అంటారు. అసలు గోంగూరని ఇష్టపడని తెనుగువాడు ఉండడని నా నమ్మకం.

dscn2773

మాఘ పున్నమి చంద్రుడు.

కొరివి కారం. అబ్బో ఇది కూడా చాలా గొప్పగా ఉండే పచ్చడే. నిలువకు కూడా పెట్టుకుంటారు. గుంటూరు మిరప పళ్ళు పచ్చడి చేసుకుని నిలవపెడతారు.దీనిలో చింతపండు కలిపి పచ్చడి చేస్తారు, పోపు వేస్తారు, జొన్నన్నంలో కొరివికారం కలుపుకుని నువ్వులనూనెతో తింటే బలే రుచి. దీనికి తోడు గడ్డ పెరుగుంటే ఆహా! ఏమి రుచి అనరా మైమరచి.

శర్మ కాలక్షేపంకబుర్లు-అతి రుద్రం

Posted on ఫిబ్రవరి 26, 2013
10

dscn1747

అతి రుద్రం

కిందటిసారి భద్రాచలం లో జరిగినది అతిరాత్రం, ఇప్పుడు గోదావరీ తీరం మురమళ్ళలో వేంచేసి ఉన్న భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి సన్నిధిలో జరుగుతున్నది అతిరుద్రం. అతిరాత్రం గురించి ఇదివరలో చెప్పేరు. ఈ అతిరుద్రం ఏమిటీ? అని చూస్తే శ్రీ మార్తి వేంకట రామ శర్మ గారు తమ గ్రంధం యాజుష్మార్తగ్రన్థః అనే పుస్తకం లో ఈ అతిరుద్రం గురించి చెప్పేరిలా!

dscn1342

రుద్ర విధానములు-ఫలములు.

1.ఆవర్తనం:- (ఏకరుద్రం) ప్రతి దినం నమక,చమకాలతో అభిషేకార్చనలు చేయడం ఆవర్తనం అంటారు.-ఫలం గంగా స్నానఫలం మరియు ఏ రోజు పాపములారోజు నశించుట.

2.రౌద్రీ:- నమకం ఒక సారి చెపుతూ ఒక్కొక్క చమకానువాకం చెప్పి అలా పదకొండు సార్లు నమకంతో ఒక చమకం పూర్తి చేయడాన్ని రౌద్రీ (ఏదాశ రుద్రం) అంటారు. ఫలం అనేక జన్మలలో చేసిన పాపం ఆరు నెలల్లో నశించును.

3.లఘురుద్రం:- పైన పేర్కొన్న రౌద్రీ అనగా ఏకాదశ రుద్రాలు పదకొండు సార్లు జరిపితే అనగా 11×11= 121 నమకములు 11 చమకములతో అభీషేకము కానీ జపము కానీ జరిపిన దానిని లఘు రుద్రం లేక రుద్రైకాశినీ అంటారు. ఫలం:- సూర్యలోక ప్రాప్తి, తేజస్సు, విజయము.

4.మహా రుద్రం:- లఘు రుద్రాలు 11 సార్లు జరిపించిన మహారుద్రం అంటారు. 121×11= 1331 సార్లు నమకం 121 సార్లు చమకం ఇందు ఆవృతమగును. ఫలం దరిద్రుడు ధనవంతుడగును, మహా పాపములు పరిహారమగును.

5.అతి రుద్రం:- 14641 సార్లు నమకం 1331 సార్లు చమకం ఆవృత్తం చేసిన అతి రుద్రం అంటారు. అనగా 11 మహా రుద్రాలు చేయడమనమాట. 1331×11= 14,641. ఫలం నిష్కృతి లేని మహా పాప,అతిపాతక, ఉపపాతకములకు ఇదే శరణ్యం.

మహన్యాస పూర్వక రుద్రాభిషేకం చేస్తే పాప పరిహారం,వ్యాధి నివృత్తి, జీవితేఛ్ఛ కలుగుట,సంతాన ప్రాప్తి,ధన ప్రాప్తి, శాంతి, ధైర్య, స్తైర్య,సంతోషములు,ప్రజ్ఞ, జ్ఞాపక శక్తి, ఆరోగ్యము,ఆయుర్దాయము, ప్రియ భోజనము కలుగును. ఇది వ్యక్తులు ఆచరించిన కలుగు ఫలం. అదే సామూహికంగా జరిపితే పై ఫలాలన్నీ సమాజానికి కలుగుతాయి.

హంస మంత్రం

రుద్రాభిషేకాన్ని మహన్యాస రుద్రాభిషేకం అంటాం. న్యాసం చేయకుండా నమక చమకాలు చెప్పి ఉపయోగం లేదన్నారు, పెద్దలు.
తృతీయ న్యాసంలో, హంస మంత్రం చెబుతారు, అదేమంటే

హ కారః పురుషః ప్రోక్తః స ఇతి ప్రాకృతిర్మతా/
పుంప్రకృత్యాత్మకోహంసః తదాత్మక మిదంజగత్//
హంసం సదాశివం ధ్యాయే ద్బింబే లింగాది విగ్రహే/
దేహో దేవాలయః ప్రోక్తో జీవో దేవస్సనాతనః/
త్యజేదజ్ఞాన నిర్మాల్యం సోహం ఆవేన పూజయేత్//

హంస మంత్రం లోని హ కారము పురుష రూపము. సకారము ప్రకృతి అని చెప్పబడినది.ప్రకృతి పురుషాత్మకమైన మంత్రము హంస మంత్రము. అహం అనగా నేను( జీవుడు)అని అర్థము. సః అనగా అతడు ( పరమేశ్వరుడు). నేనే పరమేశ్వర స్వరూపుడను అని భావించుట. కావుననే ( శరీరము) దేవాలయముగానూ శరీరములోని చైతన్యము (జీవుడు) పరమేశ్వరునిగానూ భావించి, మనోబుద్ధి,చిత్తాహంకారములగు అంతఃకరణము నందుగల దుర్భావములు,విపరీత కోర్కెలు,ఈర్ష్యా, అసూయాది మాలిన్యములను తొలగించి, నేనే పరమాత్మను అనెడి భావముతో పూజించవలెను. యోగ శాస్త్రమందు ” హకారేణ బహిర్యాతి, సకారేణ విశేత్పునః” అని ఉన్నది. మానవుడు రోజుకు 21,600 పర్యాయములు శ్వాస తీసుకొనునని చెప్పబడినది. ఈ శ్వాస క్రియ మన ప్రయత్నములేకనే క్రమబద్ధముగా జరుగును. నిద్రించుచూ,సుషుప్తి అవస్థలో ఉండిననూ శ్వాస ప్రక్రియ జరుగుచునే ఉండును. శ్వాస పీల్చినపుడు హ కారముగా శబ్దము కలుగును. వదలినపుడు స కారముగా శబ్దము కలుగును. హంస మంత్రము భావనతోనే జ్ఞానమును తద్వారా మోక్షమును ఇచ్చును. ఎవరైతే ఎల్లపుడు సోహం,సోహం అనెడి ఏకమైన భావనతో ఉందురో వారే పరమాత్మ యగుదురు.

ఈ అతిరుద్రం లో అమ్మని (నారాయణి) కూడా పూజిస్తారు, అమ్మ అన్నగారయిన నారాయణుని కూడా పూజిస్తారు.

ఇంతటి గొప్ప అతిరుద్రం దగ్గరలోనే జిల్లాలో మురమళ్ళలో జరుగుతోంటే వెళ్ళలేకపోయా. మొదలయ్యే సరికి వెంకన్న బాబు దగ్గర ఉన్నాను.వచ్చాకా రెండు రోజులు అలుకు తీర్చుకు బయలుదేరుదామనుకుంటే అనివార్య అవాంతరం తో కుదరలేదు. 25 న పూర్ణాహుతి అయిపోయింది. ప్రాప్తం, యోగం లేవు, అంతే!

dscn1749

శర్మ కాలక్షేపంకబుర్లు-శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి వర్ధంతి.

Posted on ఫిబ్రవరి 25, 2012
11
నేడు అనగా 25.02.2012 వతేది నా అభిమాన రచయిత కీర్తి శేషులు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి వర్ధంతి. ఈ సందర్భంగా వారి కధ, నాకు నచ్చినది, మీకోసం. దయచేసి చదవండి

sayya sayya-001 sayya-002 sayya-003

https://drive.google.com/file/d/0BzJ-4-3qIjXiMnBEd3ZkbG0zSm8/view

Courtesy:www.kathaaprapancham.in/sripada-subrahmanya-sastry/

శర్మ కాలక్షేపంకబుర్లు-శివుడు శ్మశానంలోనే ఎందుకుంటాడు?

Posted on ఫిబ్రవరి 27, 2014

పనిలో ఉన్నారా? ఫరవాలేదు, మీ పని చేసుకుంటూ, ఒక చెవి ఇటు పడేసి మహన్యాసం వినండి.

శివుడు శ్మశానంలో ఎందుకుంటాడు?

 ఈ ప్రశ్న నాది కాదు, ఈ అనుమానం సాక్షాత్తు అమ్మవారికే వచ్చి, అయ్యవారిని నిండుకొలువులో అడిగేసింది, (భారతం. అనుశా.ప. అశ్వాసం….4….418 నుండి443 వరకు స్వేఛ్ఛానువాదం.) ఆ కధాక్రమంబెట్టిదంటే………

శంకరుడు కైలాసంలో దేవతలు, సిద్ధులు, సాధ్యులు, విద్యాధరులు,మునులు,భూతగణాలు నిండిఉన్న కొలువులోఉన్న,ఆ సమయంలో గౌరీదేవి వెనుకనుంచి వచ్చి, శంకరుని రెండుకళ్ళూ తనచేతులతో మూసింది. లోకాలన్నీ చీకట్లుకమ్మేయి, జీవులన్నీ సంక్షోభం చెందాయి.. శంకరుడు మూడవనేత్రం తెరిచారు. హిమనగం మండిపోవడం మొదలయింది. అది చూసిన గౌరి ”స్వామీ మూడవకన్ను తెరిచారేమీ? దానివల్ల నా తండ్రి హిమవంతునికి బాధ కలిగిందని” వేడుకుంది, ”మూడవకన్ను తెరవడానికి కారణం రహస్యమైతే చెప్పద్ద”ని ముద్దుగా అలిగింది కూడా. అందుకు శంకరుడు కరుణగా చూడగా, హిమనగం మామూలయింది. ”గౌరీ, నీకు తెలుపకూడని రహస్యాలు నాకులేవని, నేను లోకాత్మకుడిని, సర్వలోకాలు నన్నుపట్టి ఉంటాయి. నువ్వు నా రెండుకళ్ళూ మూశావు, లోకాలు చీకటి, సంక్షోభం చెందాయి, అందుకు మూడవకన్ను తెరవాల్సివచ్చింద”న్నారు. ఆ! ఇది మంచి సమయం, ఉన్న అనుమానాలన్నీ తీర్చేసుకుంటాననుకుని ప్రశ్నల వర్షం కురిపించడం మొదలెట్టింది.

”మీకు నాలుగు ముఖాలెందుకున్నాయి?”

”ఒకప్పుడు సుందోపసుందులనేవారు ఉండేవారు.వాళ్ళులోకాలను బాధిస్తుండేవారు. మయుడు లోకంలోని అన్ని అందాలను పోతపోసి ఒక స్త్రీని సృస్టించి నా దగ్గరకు తెచ్చాడు. అది నాకు ప్రదక్షిణంగా నా చుట్టూ తిరిగింది. ఆమెను నాలుగు దిక్కులా నిశితంగా పరిశీలించడం కోసం నాలుగు ముఖాలు ధరించాను, అప్పటినుంచి చతుర్ముఖుడనయ్యాను.”

”మీకు కంఠం మీద నల్లమచ్చ ఏమి?”

”దేవతలు, దానవులు కలిసి పాలకడలి మధించినపుడు వచ్చిన హలాహలాన్ని మింగి అక్కడ ఉంచాను. అందుకు అక్కడ మచ్చ ఏర్పడింది. ఇంకా ఏమయినా ప్రశ్నలుంటే అడగ”మన్నారు, శంకరులు.

”పినాకమనే విల్లు ధరిస్తారు కారణం చెప్ప”మంది గౌరి.

”కణ్వుడనే మహాముని ఆదియుగం లో తపస్సు చేశాడు. ఆయనపై పుట్టలు మొలిచాయి. ఆ పుట్టమీద ఒక వెదురుపొద మొలిచింది, అది చాలా అద్భుత పరిమాణంలో పెరిగింది. బ్రహ్మగారు ఆమునికి వరాలిచ్చి, ఆ వెదురునుంచి మూడు విల్లులు తయారు చేశారు. ఒకటి పినాకము,నా దగ్గర ఉన్నది. రెండవది శార్ జ్గము, ఇది విష్ణువు దగ్గర ఉన్నది. మూడవది తాను తీసుకున్నారు . అప్పటినుంచి పినాకం చేతిలో ఉండటం మూలంగా పినాకపాణి అని నాపేరు”.

”లోకంలో మరేదీ వాహనం లేనట్టు ఎద్దును వాహనం చేసుకున్నారేమీ?” గౌరి ప్రశ్న.

”హిమనగం దగ్గర తపస్సు చేసుకుంటున్నా. చుట్టూ గోవులు చేరిపోయాయి, చాలా బాధపెట్టేయి. కోపంగా చూడగా సంతాపం చెందేయి. అప్పుడు విష్ణుమూర్తి వృషభాన్ని నాకు కానుకగా ఇచ్చారు. నాకు ‘గోపతి’ అని పేరుకూడా పెట్టేరు. అప్పటినుంచి ఎద్దు నా వాహనమైనది.”

”మీరేమో పరమ శుచిమంతులు, మంచి ఇంట్లో వాసం చేయక శ్మశానం లో ఉన్నారేమి స్వామీ?”

”భయంకరమైన భూతాలు, ప్రజలను చంపుతూ బాధలు పెట్టేవి. అప్పుడు బ్రహ్మగారు నా దగ్గరకొచ్చి ’శివా! జీవులను కాపాడే మార్గం చూడవయ్యా’ అని అడిగితే భూతాల నివాసమైన శ్మశానం లో నివాసం ఏర్పాటు చేసుకున్నా, అవి నా కనుసన్నలలో ఉండటంతో లోకాలు రక్షింపబడ్డాయి. మోక్షపరులు ఇది శుచిస్థానం అంటారు, జనం తిరగరు, అందుకు ఇక్కడనుంచి లోకాలను రక్షించాలనుకున్నా”.

”ఈ బూడిద రాసుకోడం, పాములు ధరించడం, శూలం,పరశువులు ఆయుధాలు, భీకరమైన రూపం ఏమి స్వామీ?.”

”లోక స్వరూపం రెండు రకాలు. ఒకటి శీతం, రెండవది ఉష్ణం. ప్రపంచం ఈ రెంటితోనే ఉంది. సౌమ్యం విష్ణువు, ఆగ్నేయం నేను, విశ్వాన్ని భరిస్తాను, అందుచేత వేడి, భయంకరమైన రూపం ధరిస్తాను”

”మరి చంద్రవంకను నెత్తిన ఎందుకు ధరిస్తారు?”

”దక్షయజ్ఞ సమయంలో నేను దేవతలని బాధించాను, ఆ సమయంలో చంద్రుడిని కాలితో తొక్కేను, చంద్రుడు నన్ను శరణు వేడాడు, ’అయ్యో! పొరపాటు చేసేననుకుని చంద్రుడిని నెత్తి మీద పెట్టుకున్నాను”

అమ్మకి వచ్చిన అనుమానాలని శంకరులు తీరిస్తే వివరాలు అందరికి తెలిశాయి. అమ్మకివన్నీ తెలియవా? తెలుసు పిల్లలకి తెలియచేయాలని అమ్మ చేసిన చిన్న మాయ.

నమః శOభవేచ/ మయోభవేచ/ నమః శంకరాయచ/ మయస్కరాయచ/ నమః శ్శివాయచ/ శివతరయాచ/

ఈశాన సర్వ విద్యానాం/ ఈశ్వర సర్వభూతానాం/ బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా/ శివోమే అస్తు సదా శివోం/.

శర్మ కాలక్షేపంకబుర్లు-జిలేబిగారి టపా

Posted on ఫిబ్రవరి 24, 2013

dscn1530

వరూధిని

Postings by Zilebi- When its Hot its Really Cool ™ Copyright © 2008-2020. All rights reserved

TUESDAY, FEBRUARY 12, 2013

మనలో పరమాత్మ ఎక్కడున్నాడు – భాగం రెండు
శ్రీ కాలక్షేపం కబుర్లు శర్మ గారు విస్తారంగా మనలో పరమాత్మ ఎక్కడున్నాడు – అన్న టపా ని రాసేరు.

చాలా విపులం గా చెప్పేరు.

నారాయణ సూక్తం లో కవి చమత్కృతి యా అన్నట్టు ఒక వాక్యం వస్తుంది – అథొ నిష్ట్యా వితస్త్యాన్తే ‘ అన్నది అది.

ఈ పదబంధాన్ని మొదటి మారు చదివినప్పుడు అస్సలు అర్థం కాలేదు.

అథో నిష్ట్యా – నిష్ట్యా అంటే ఏమిటి ?

వితస్త్యాన్తే – వితస్తి అంటే ఏమిటి ?

అన్నదాని గురించి అట్లా ఇట్లా లాగించి గూగిలించి, సంస్కృత భాషా ప్రవీణు లైన కొందరిని అడిగి తెలుసుకున్నదాన్ని ఇక్కడ పొందు పరుస్తున్నాను. మీలో మరింత ఉత్సుకత కలిగిస్తుందని ఆశిస్తాను !

ఈ టపా చదివే ముందు శర్మ గారి పై న పేర్కొనబడ్డ టపా మొదట చదివితే కొంత సందర్భం అవగతం !

సో, ఇది భాగం రెండు అన్న మాట-

నిష్ట్యా అంటే, మన కంఠాన్ని తడిమి చూస్తే ఒక ఎముక తగులుతుంది చూడండి అదన్న మాట ఆంగ్లం లో దీన్ని ‘Adam’s apple’ అంటా రను కుంటా.

వితస్తి అన్నది ఒక కొలబద్ద. అంటే మన హస్తాన్ని సాగ దీస్తే, బొటన వేలికిన్ను చిటికిన వేలికిన్ను మధ్య ఉన్న దూరం. సుమారు పన్నెండు అంగుళాలు.

ఇప్పుడు ఆ కంఠ ఎముక (ఇది దుష్ట సమాసమెమో మరి – శ్యామలీయం వారు చెప్పాలి!) నించి మీ చేతిని అట్లా విస్తరించి కొలత బెట్టండి ఏమి తగులు తుంది ?

హృదయం కదూ ? సో, అథొ నిష్ట్యా వితస్త్యాంతే – ఆ పన్నెండు అంగుళాల దూరం లో ఉండే హృదయం లో అన్న మాట. హృదయం నాభ్యం ఉపరి ఉన్నది కదూ.

ఇంత కష్ట పడి హృదయాన్ని కవి వివరించా లా ? చెప్పాలా? చమత్కృతి కాకుంటే ? ‘సులభం గా ‘హృదయేషు లక్ష్మీ’ అని చెబ్తే సరి పోదూ?

ఈ ఆలోచన రాక పోదు మనకి. ఈ సందేహాన్ని నివారించ డా నికి మరో నారాయణ సూక్త పంధా(వైష్ణవ సాంప్రదాయంలో ) (version?) లో సులభం గా హృదయోర్మధ్యే అని చెప్పేశారు.

సరే, సర్వాంతర్యామి. భగవంతుడు అన్ని చోట్లా ఉంటా రంటారు కదా.. మరి ఇట్లా, ఒక స్థలం లో ఆయన్ని ‘localization’ చేయ్యటం ఏమిటంటారా ? ‘If you cannot find Him in you, so far as you are concerned, He is nowhere for you’ అని మరో కవి ఉవాచ !

సో, అదన్న మాట విషయం. కొంత ఆలోచించి చూడండి కవి చమత్కృతి కాదూ ఇది మరి ?

ఇట్లాంటి చమత్కారాలు వేదంలో చాలా ఉన్నవి- ఆ మధ్య ఎపుడో ఒకసారి రాసాను కూడా… పురాణీ దేవీ యువతిహి ‘ అని ఉషస్సు గురించి చెబ్తాడు కవి. (Old Woman, but young girl – అంటే జిలేబీ లా అన్నమాట !)

చీర్స్
జిలేబి.

Posted by Zilebi at 12:27 PM
7 comments:

astrojoydFeb 12, 2013, 4:07:00 PM
సరే, సర్వాంతర్యామి. భగవంతుడు అన్ని చోట్లా ఉంటా రంటారు కదా.. మరి ఇట్లా, ఒక స్థలం లో ఆయన్ని ‘localization’ చేయ్యటం ఏమిటంటారా /……yes it has a reason to say like that or to describe like that..there is a part called sino-auricular node in our heart..to be precize in every living things hearts..the life or the heart beat[ప్రాణ స్పందనము] originates from this point in the form of an electrical impulse nd this impulsive force that drives us nd making us as chaithanya roopaas in this materialistic world..do u aware a scientific fact that pace maker[artificial]is kept exactly at sino-auricular nodal junction..?hope u r doubt was clear now..

Reply

Replies

ZilebiFeb 16, 2013, 11:08:00 AM
astrojoyd గారు,

నెనర్లు ఆ విపులమైన కామెంటు కి.

Sino-auricular node గురించి ఇంకొంత విశదీకరించ గలరా ?

జిలేబి.

kastephaleFeb 20, 2013, 6:25:00 PM
జిలేబిగారు
వెంకన్న బాబుని చూసి నన్ను నీలో ఎప్పుడు కలుపుకుంటావని అడిగేద్దామని వెళ్ళేను. టపా ఇప్పుడే చూశాను. మీ వివరణ బాగుంది. నాటపాకి పొడిగింపు ఇచ్చి సంగతి తెలియచేసినందుకు ధన్యవాదాలు. astrojoyd గారు మరి కొంత ముందుకెళ్ళి విషయాన్ని సయిన్స్ కి ముడిపెట్టేరు, ఇంకా బాగుంది, వారికి కూడా మీ ద్వారా ధన్యవాదాలు. మీ టపాని యధాతధంగా నా బ్లాగులో పెట్టుకోడానికి అనుమతించకోరుతాను. astrojoyd గారు మరి కొంచం వివరిస్తే మరీ ఆనందం. ఆ తరవాత చేస్తా మీ అనుమతితో.
శర్మ

ZilebiFeb 20, 2013, 8:18:00 PM
కష్టే ఫలే శర్మ గారు,

మహద్భాగ్యం! నెనెర్లు. అట్లాగే కాపీయించు కోవచ్చు !

జిలేబి.

Reply

NarsimhaFeb 13, 2013, 4:06:00 PM
ఇంత కష్ట పడి హృదయాన్ని కవి వివరించా లా ? చెప్పాలా? చమత్కృతి కాకుంటే ?
అంటే ఈ మధ్యనే నేను ఒక వీడియో ఫేసుబుక్ లొ చూసా అందులొ ఒక ప్రొఫెసర్ విధ్యార్తులకు “శ్రీ కృష్నుడి పై రాసిన ఒక శ్లొకాన్ని” వివరిస్తూ అందులో నిగూడంగా “పై (3.27…)” విలువను చెప్పిన విధానం వివరిస్తారు అలాగే ఇందులో కూడా ఏదైనా ఎంక్రిప్ట్ చెసారేమో?!! క-ట-ప-య సంఖ్య అని ఏదొ చెప్తారు ఆ విడియో లో మరి అల్లంటిదే ఇక్కడ కూడా ఉందేమొ మనకి చమత్కృతిలా తోచిందేమొ!!

Reply

NarsimhaFeb 13, 2013, 4:09:00 PM
పైన ఉదహరించిన విడియో “Hats off to the Knowledge of our Ancients Indians !!” పేరు తో, ఈ లింక్ తో వచ్చింది!http://www.facebook.com/HeyIndia

Reply

కాయFeb 15, 2013, 4:07:00 PM
అంటే దేవుడికి నా కాలు,నా గుండె ల విలువలు వేరు వేరా ?…. పోనీ దేవుడికి మనుషుల విలువ ఒకలాగా, పశుపక్ష్యాదుల విలువ మరో లాగా కనిపిస్తాయా ? దేవుడికి నీళ్ళో లాగా నిప్పులో లాగా కనిపిస్తాయా ? ఆయనగారికి రాత్రికొక విలువా, పగలు కొక విలువా ఉంటుందా ?..

చావొక భాధకరం, పుట్టుకొక సంతోషం లా కనిపిస్తుందా దేవుడికి ?..

Reply

Links to this post
Create a Link

Newer PostOlder PostHome
Subscribe to: Post Comments (Atom)

dscn1533

యధాతధంగా నా బ్లాగులో ప్రచురించుకోడానికి అనుమతించిన జిలేబిగారికి ధన్యవాదాలు

శర్మ కాలక్షేపంకబుర్లు-మహానుభావులు

Posted on ఫిబ్రవరి 23, 2013
6
మహానుభావులు

మొన్న తిరుపతి యాత్రలో ఆఖరిరోజు సోమవారం ఉదయమే తిరుమల నుంచి కిందికి దిగి శ్రీకాళహస్తి చేరేం. సమయం ఉదయం ఎనిమిదిన్నర కావచ్చింది. వేన్ దిగేటప్పటికి వర్షం లేదు. వేన్లో వచ్చి చెరువు ఒడ్డున దిగేమనుకున్నా, తీరా పరిశీలిస్తే అది సువర్ణముఖరీ నది. దాని మధ్యలోంచి రోడ్డు వేసేశారు గుడి ముందుకి, అదిగో దాని మీద దిగేనమనమాట..నిజం చెప్పాలంటే అదొక పెద్ద పాడుపడిన చెరువులా అనిపించింది. ఫోటో కూడా తీయబుద్ధికాలేదు. గుడిలో అడుగెట్టిన మరు క్షణం నుంచి కుండపోత వర్షం పడింది.ఒక్క తిరుమలలో తప్పించి ప్రతిచోట సెల్ ఫోన్లు కెమేరాలు జాగ్రత్త పెట్టడానికి సెక్యూరిటీని ఏర్పాటు చేశాయి గుడి యాజమాన్యాలు, ఉచితంగా, ఇది బాగానే ఉంది.

గుడిలోకి చేరి స్వామిని అమ్మనీ దర్శించి గుడి కలియతిరిగి కాళ్ళు లాగితే, దక్షణగోపురం వద్దకల శ్రీశుక ఆశ్రమం తాలూకు పుస్తకాల కొట్టు దగ్గరకు చేరి, స్వామి ప్రసాదం తింటూ కూలబడి, అన్నట్లు ఇక్కడే కదూ! గోపురం కూలింది, ఎక్కడా? అని పక్కనే ఉన్న సెక్యూరిటీ ని అడిగితే ఉత్తర ద్వార గోపురం అంటే, చూద్దామని వెళ్ళేం. అక్కడ పని నడుస్తూ ఉంది, ఇదిగో ఇలా.

dscn2685

కూలిన గోపురం దగ్గర పని జరుగుతున్న దృశ్యం

అప్పుడుగుర్తొచ్చింది, ఇక్కడ శ్రీకృష్ణ దేవరాయల విగ్రహం ఉండాలీ అని, అడిగితే దక్షణ ద్వారం దగ్గర కన్నప్ప గుడికి వెళ్ళే మెట్ల వద్ద ఉందంటే మళ్ళీ బయలు దేరిన చోటికే చేరి చూస్తే ఇదిగో శ్రీకృష్ణ దేవరాయలు ఇలా కనపడ్డారు, హుందాగా.

copy-of-dscn2691

శ్రీకృష్ణదేవరాయలు

ఆయనని అడిగి ఫోటో లు తీసుకుంటూ ఉంటే పక్కనే ఇనప గ్రిల్ల్ లో ఒక విగ్రహం కనపడింది, ఎవరబ్బా ఈ నాయనారు అనుకుని పరిశీలించా, కింద కనపడిన దాని ప్రకారం వారి పేరు శ్రీ. మె.అరు.నా.రామనాధం శెట్టియార్ గారు, దేవక్కోట్టై వాసి.. విష్ణు భక్తులను ఆళ్వారులని, శివ భక్తులను నాయనార్ లు అని అంటారు. తీరా చూస్తే ఈయన నాయనార్ కాదు కాని అంతకు మించిన వాడని అక్కడ ఉంచిన ఫలకం చూసి ముందు ఆశ్చర్యానికి, ఆ తరవాత ఆనందానికి లోనయి, నమస్కారం పెట్టేను, అసంకల్పితంగానే. సనాతన ధర్మాన్ని మన తరాలకు అందచేయడానికి పూనుకున్న మహానుభావుడు.

copy-of-dscn2693

శ్రీ.మె.అరు.నా.రామనాధం శెట్టియార్

వీరు, మరొక భాగస్వామి శ్రీ.మె.అరు.అరుణాచలం శెట్టియార్ గారితో కలిసి 1903-1912 మధ్య కాలంలో ఈ గుడి పునరుద్ధరణ కొరకు అక్షరాలా తొమ్మిది లక్షల రూపాయలు వెచ్చించారు, అంటే నూట పది సంవత్సరాల కితం తొమ్మిది లక్షలంటే నేడు బహుశః తొంభై కోట్లు అయివుండచ్చు. వీరు మొదటి కుంభాభిషేకం 21.04.1912 న నిర్వహించారట, చిత్రంగా శివరాత్రి మరునాడు ఉదయమే 14.02.1942 న శివైక్యం చెందటం చాలా గొప్ప విషయం. ఈయన ఖచ్చితంగా శివునిలో ఐక్యమై ఉంటారనే అనిపించింది. వీరి విగ్రహం ఇక్కడ 22.02.1946 లో ప్రతిష్టించారని ఉంది. వీరితో పాటు మరొకరు భాగస్వామి శ్రీ మె.అరు.అరు.అరుణాచలం శెట్టియార్ గారు కూడా ఉన్నారని శిలా ఫలకం చెబుతోంది, కాని వారి విగ్రహం మాత్రం లేదు. నా ఉద్దేశ ప్రకారం ఈ రెండవవారు మొదటి వారి శిలావిగ్రహం ప్రతిష్టించి ఉండాలి.

dscn2694

శ్రీ కృష్ణదేవరాయలు మహరాజు కనక గుడికి ఏమైనా చేయచ్చు, కాని ఈ వణిక్ ప్రముఖులు నిజంగా ఏమీ ఆశించకనే గుడిని పునర్నిర్మాణం చేయించారు, వీరిద్దరు దేవక్కోట్టై వాసులు, రెండవవారు బహుశః మొదటివారి సోదరులై ఉండచ్చని నా ఊహ. మొదటివారి కంటే రెండవారు మరింత గొప్పవారని నా అభిప్రాయం, ఎందుకంటే మొదటివారి శిలా విగ్రహం వేయించి తను మాత్రం అగస్త్య భ్రాతలా ఉండిపోయారు. అగస్త్య భ్రాత అంటే అగస్త్యుని సోదరుడని అర్ధం,ఆయనకి ఒక పేరున్నా అగస్త్యునికి సోదరునిగానే మిగిలిపోయాడు, ప్రముఖుల బంధువులకు, దగ్గరవారికి గుర్తింపు ఉండదని నాటి భావన. నిజంగా ఆయన మొదటివారికంటే చాలా గొప్పవారు,ఎందుకంటే వారి పేరు తప్పించి మరేమీ కోరుకోని నిస్వార్ధ జీవి.నాటి లక్ష్మణునికన్న గొప్ప సోదరుడు.

dscn1716

మరి నేడో ప్రతి గుడిలోనూ వి.ఐ.పి దర్శనాలు, అందుకోసం సామాన్యులకు ఇక్కట్లు, గంటల తరబడి అగచాట్లు, చిన్న రాజకీయ నాయకులు కూడా వి. ఐ.పి. గా చెలామణి అవుతున్న రోజులు,గుళ్ళు గోపురాలకి ఖర్చుపెట్టటం కంటే వాటి ఆస్తులను దోచుకోడమే అలవాటయిపోయింది., ఇప్పుడు చెప్పండి నిస్వార్ధంగా సొమ్ము ఖర్చుపెట్టిన వీరు మహానుభవులవునా కాదా? ఈ సారి శ్రీ కాళహస్తి వెళ్ళినపుడు వీరిని కూడా దర్శించడం మరవద్దని మనవి.

శర్మ కాలక్షేపంకబుర్లు-ఆడాళ్ళొస్తున్నారు, జాగ్రత!

Posted on ఫిబ్రవరి 22, 2013
13

dscn2662

తిరుమలలో స్వామి వారి సన్నిధిని 17.02.2013 తేదీని జరిగిన భరత నాట్యంలో, నర్తకి దాక్షాయిని రామచంద్రన్ దశవతార భరత నాట్యంలో ఒక భంగిమ

ఆడాళ్ళొస్తున్నారు! జాగ్రత!!

“ఇదేంటీ ఆడాళ్ళమీద పడ్డా”రంటారా? “కాదండీ బాబూ, వారే నోరెట్టుకు పడిపోతున్నారు”, అదెలాగో అవధరించండి.

పద్ధెనిమిదో తేదీని తిరుమలనుంచి కిందికి దిగి ఉదయమే శ్రీకాళహస్తి వెళ్ళి అయ్యవారి,అమ్మవారి దర్శనానికి వెళితే, అబ్బ! ఒకటే వర్షం పట్టేసింది, ఒక గంట కుండపోతపోసేసింది. దర్శనానికి లోపలికెళ్ళేం. దర్శనం చేసుకుని బయట కొచ్చి వింతలు విషేషాలు చూసుకుని, స్వామి అన్న ప్రసాదం తీసుకుని, బయలుదేరి తిరుపతి రయిల్వే స్టేషన్ కొచ్చాం. వర్షం తరవాత తిక్కెండ కాసేసింది. వెయిటింగ్ రూం చేపల బజారులా ఉంది.

dscn2711

వెయిటింగ్ రూం అటెండెంట్ అమ్మాయికి నేను టిక్కట్టు లేకుండా ప్రయాణం చేసేవాడిలా కనపడ్డానేమో గుండూ పిలకతో,” టిక్కట్టేదీ?” అంది, చూపించా “బయటికిపో, రాత్రి బండికి ఇప్పటినుంచి వెయిటింగేంటీ?” అంది. అసలే వర్షం తరవాత ఎండేమో, తిక్కగా ఉంది. ఇక్కడొక సామెత గుర్తొస్తోంది కాని, చెబితే అమ్మో! ఇంకేమైనా ఉందా? వీపు విమానం మోత కదా! నాకు తిక్కరేగి ఇంగ్లీషులో వాయించేశా,వచ్చిన బట్లరింగ్లీషులో,. ఏమనుకుందో,లేక నా బట్లరింగ్లీషు అర్థంకాకో, పాపం మరిమాటాడలేదు. ఒక పక్కగా పోయి, కింద, చల్లగా ఉంటే పడకేశా. కొద్ది సేపటికి, కేకలకి మెలుకువొచ్చింది. ఎక్కడ్నుంచి అని పరకాయిస్తే, పక్కనే ఉన్న బాత్,టాయిలెట్ల నుంచని అర్ధమయింది. ఆడగొంతులు హెచ్చు స్వరంలో వినపడుతోంటే, ఏదో ఘోరం జరిగిఉండచ్చని, కెమేరా పుచ్చుకుని లోపలికెళ్ళా. నారదాయనమః అంటే ఇష్టంకదా 🙂 ఒక ఇరవై, పాతికేళ్ళ యువతి, ఒక నలభయి దగ్గర పడతి, ఇద్దరూకలిసి నలుగురు మగాళ్ళని గోడ దరికి చేర్చేసి వాయించేస్తున్నారు, మాటలతో. నలుగురిలో ఒకరు డ్రాయరుతో స్నానం మధ్యలో అపినట్లు ఉన్నాడు, సిగ్గుతో చితికిపోతున్నాడు,ఇద్దరాడాళ్ళు జమిలిగా, మీది మీదికి వస్తుంటే, మిగిలినవారు చేష్టలుడిగి నిలబడ్డారు. నేను లోపలికెళ్ళేటప్పటికి దృశ్యమది. “అమ్మాయ్! ఏమయింద”న్నా, పాతికేళ్ళ యువతిని, రెచ్చిపోతున్నదానిని. “తాతగారూ! మీరయినా చెప్పండి, వీళ్ళకి బుద్ధి జ్ఞానం ఉన్నాయా? తల్లి, చెల్లి లేరా? వెధవపని చేస్తారా?” అంటూ వాయించేస్తోంది, ప్రశ్నలతో. “సంగతేమిటి తల్లీ, వీళ్ళలో, ఎవరా ధూర్తుడు, నీకు అవమానం కలిగించినవాడు” అన్నా. “అంతా నండి, సిగ్గులేదా వీళ్ళకి, లేడీస్ బాత్ రూంలో చొరబడిపోడమేనా, కేకెయ్యండిపోలీసులని” అంది. “పిలుద్దాం గాని అమ్మాయ్, ఒక్క సారి నాతోరా” అని చెయ్యిపట్టుకున్నా. ఒక సారి నాకేసి, కౌశికుడు కొంగను చూసినట్లు చూసి, నా పెద్ద మనిషి తరహా చూసి, “నడవండి! వీళ్ళని వదిలేది లేదు, మీరే సాక్ష్యం చెప్పాలి పోలీసులకి” అంది. బయటికి తీసుకొచ్చి “బోర్డ్ చూడమ్మా” అన్నా! తలెత్తి బోర్డ్ చూసింది. “వీడెవడండి బాబూ!బొమ్మేసిన సన్నాసి, ఆడబొమ్మకి మీసాలెట్టిన సన్నాసి,” అంది. “ఇది మగాళ్ళ బాత్ రూం తల్లీ! మీరేమో మొగాళ్ళ బాత్ రూముల్లో చొరబడి వాళ్ళని తిట్టిపోశారు, న్యాయమా?” అన్నా. “పక్కనే తాటికాయలంత అక్షరాలతో పురుషుల స్నానముల గదులు అని రాశాడు కదమ్మా” అన్నా.” బొమ్మ చూసి వెళ్ళేనండి, బొమ్మేసినవాడిదే తప్పు, ఆడబొమ్మకి మీసాలెడితే మగాడయిపోతాడా?” అంది. “అమ్మ తల్లో! నీతో వాదించలేను, తప్పు చేసినా, నాదే పైచేయి అంటున్నావు, ఇది బాగుందా?” అన్నా. అబ్బే వింటేనా. “అమ్మలూ! ఒక్క మాట, ఈ మగ పురుగులలో, ఒఖ్ఖ పురుగు, మీ బాత్ రూంలోకి తొంగిచూస్తే ఏంచేసేదానివి?” అన్నా. “తొంగి చూస్తేనా; జుట్టట్టుకుని లోపలికి లాగి వాయించేసేవాళ్ళం” అంది. “మరి నువ్వు మగాళ్ళ బాత్ రూంలోకి జొరబడి, స్నానం చేస్తున్నవాడిని గోడకి నిలబెట్టేవు కదా! ఇది ధర్మమా” అన్నా. “అదేం కాదు లెండి” అంటూ వెళిపోయింది. ఈ హడావుడిలో యువతితో కూడా ఉన్నామె నెమ్మదిగా జారుకుంది. తిట్లు తిన్న పురుష సింహాలు ముందేపారిపోయారు, ఈ అమ్మాయి నోటికి జడిసి 🙂

.బండెక్కి కూచుని టిఫిన్ చేస్తుంటే మరొక సారి ఆడగొంతు హెచ్చు స్వరంలో వినిపిస్తూ ఉంది,ప్లాట్ ఫారం మీద. ఒక పురుష పుంగవుణ్ణి పట్టుకుని ఉతికేస్తోందో పడతి,ఒక సమయం లో, నాలుగు ఉతుకుతుందేమోననిపించింది కూడా, మీది మీదికి వెళుతూంటే, నాకసలే వినపడదు, సంగతి అర్ధం కాలా. ఎందుకేనా మంచిదని ఒక ఫ్లాష్ లాగేను. ఒక్క సారి మెరుపు మెరిసినట్లవడంతో అమ్మాయి చుట్టుపక్కల చూసింది కాని, నేను ఫోటో తీసినట్లు గమనించలేదు. పక్కనే నిలబడినతనిని అడిగితే, “ఇది నిత్యం మామూలేనండీ” ఆన్నాడు, నవ్వుతూ, అర్థం కాలేదు. సంగతీ తెలియలేదు. ఉగ్రకాళి శాంతించి వెళిపోయింది.

dscn2110

రయిలు బయలుదేరింది, నాకు కొద్దిగా కునుకు పట్టింది, మళ్ళీ కేకలు వినపడితే లేచి చూస్తే, పై బెర్త్ మీద ఉన్నావిడ టి.టి మీద కేకలేస్తోంది.”నేను మళ్ళీ డబ్బులెందుకు కట్టాలి?” అని. పాపం టి.టి. వయసు మళ్ళినవాడు, ఓపికగా చెప్పేడు, ఆబ్బే! ఈవిడ వినదే. కాసేపటికి ఏమనుకుందో గాని, కరుణించి భర్తతో సెల్ లో మాట్డాడితే, ఆయన యక్షప్రశ్నలేస్తే, సెల్ టి.టి కిచ్చేసింది. టి.టి మళ్ళీ అంతా ఆయనకి చెబితే, శ్రీవారు కరుణిస్తే, మొత్తానికి డబ్బులు తీసిఇచ్చి, పెరిగిన టిక్కట్టు డబ్బులు కట్టింది, ఈ పతివ్రత. భర్త మాట జవదాటనిది. ఈవిడని రెయిలెక్కించడానికి భర్త, అన్నగారు ఇద్దరూ వచ్చారు. సైడు అప్పర్ బర్త్ ఆమెది. ఎన్ని జాగ్రత్తలు చెప్పేరో, ఇద్దరు పిల్లలతో ప్రయాణం చేస్తున్న ఆమెకి. “పై బెర్త్ లో భయమండి” అంది. కింది బెర్త్ ఎవరూ ఇవ్వలేదు.నాకేమో అప్పర్ బర్త్, ఇల్లాలికి మిడిల్ ఇచ్చేడు కంప్యూటర్ గాడు, సీనియర్ సిటిజన్లు అన్నా. ఆమెకు ముఫ్ఫయి వయసుండచ్చు. భర్త, అన్న వెళ్ళిన తరవాత “ఎక్కడిదాకానమ్మా!” అంటే “మాది అనకాపల్లి” అంది. “మేము నీకు చాలా దూరం తోడుంటా”మన్నాం, అంటే “విజయవాడలో దిగిపోతా”నంది. ఓరి నాయనో! తిరపతిలో ఎక్కినామె విజయవాడలో దిగడానికి ఇన్ని జాగ్రత్తలా, జాగ్రత్త తీసుకోవలసిందే! అతి చేస్తే బాగోదనిపించింది.

అతిచేస్తే గతి చెడుతుందని సామెత కదా!
ఇన్ని సంఘటనలు ఒకేరోజు చూసిన తరవాత, అప్పుడనిపించింది “ఆడాళ్ళొస్తున్నారు!! జాగ్రత!!!” అని

dscn1751

శర్మ కాలక్షేపంకబుర్లు-అందానికి, ఆరోగ్యానికి రక్షా కలబందా!

అందానికి, ఆరోగ్యానికి రక్షా!ఇస్తుంది కలబందా!
Posted on ఫిబ్రవరి 21, 2013
13

dscn2029

శంఖ పుష్పం

అందానికి, ఆరోగ్యానికి రక్షా కలబందా!

“ఇదేంటో?” “అలోవేరా కదండీ” అంటారా. “నా బొంద దీన్ని కలబంద అంటాం, మీరేమో ఆలొవెరా” అంటారు. ఇది ఇంట్లో ఉంటే అదృష్టం అంటారు. ఈ మధ్య షాపులలో కూడా దీన్ని వేలాడ తీస్తున్నారు. ఇది ఇంట్లో ఉండటం అదృష్టమేనా అంటే అవుననే చెప్పాలి. అదెలా…

alovera1

కలబంద Courtesy Google

మీరు ముద్దుగుమ్మలా? బొద్దు గుమ్మలా? ఎవరైనా ఫర్వాలేదు. మీకోసమే ఇది, పిల్లల దగ్గరనుంచి పెద్దలదాకా, ముసలి ముతక దాకా అందరికి ఉపయోగమే.. ముందు కలబంద గురించి తెలుసుకుందాం. ఇది చాలా మొండి జాతి మొక్క, నాలా 🙂 కొద్దిపాటి నీటితో లేదా నీరు లేకపోయినా బతికేస్తుంది. ఇంట్లో పెంచుకోడం ఎలా అంటే చిన్న మొక్కలు దొరుకుతాయి పట్నాలలో కూడా, కొంచం ప్రయత్నించండి. వీటిని తెచ్చి పాత చిల్లుపడిపోయిన, పనికిరాని ప్లాస్టిక్ బకెట్ అయితే మంచిది. అందులో మట్టి పోసి ఈ మొక్క నాటండి. రెండు మొక్కలు నాటండి రెండు పాత బకెట్లలో, అప్పుడపుడు కొద్దిగా నీళ్ళుపోయండి, బాల్కనీలో పాడెయ్యండి. అంతే చాలు, ఇది చాలా అల్పసంతోషి, మీరేం పెట్టకపోయినా, మీకు మాత్రం అందం, ఆరోగ్యం ఇస్తుంది. దీని పెరుగుదల సామాన్యం, కొద్దిగా తక్కువనే చెప్పాలి. ఈలోగా కలబంద మట్టలు బజారులో దొరికినా తెచ్చుకోండి. ఎవరేనా పెద్ద మొక్క ఇస్తానన్నా, లేదా అడిగి అయినా తెచ్చుకుని వేసుకోండి ఇంట్లో. ఇప్పుడు ఉపయోగం చూదాం.

images

కలబంద ముక్కలు Courtesy Google

ముందు ముద్దు గుమ్మలకి చూదాం. చక్కనమ్మ చిక్కినా అందమేనని, ఫోటో లో చూపినట్లు ముక్కలు చేయండి, ఒకమట్ట. పై చెక్కు తీసిన ముక్కలని మెత్తగా గుజ్జులా చేయండి, చేత్తో పిసకచ్చు,లేదా మిక్సీ లో పారేసి ఓ తిప్పు తిప్పెయ్యండి.ఈ గుజ్జుని తీసుకుని ఒంటికి శుభ్రంగా పట్టించండి కాలిగోళ్ళ దగ్గరనుంచి,మడమలు అరికాళ్ళు కి కూడా బాగా రాయండి, కాళ్ళ పగుళ్ళు కూడా తగ్గుతాయి. ముఖం జుట్టుకి కూడా రుద్దండి ఒంటిని, ఇంకిపోతుంది. నోటికి తగిలినా లోపలికి తిన్నా బాధ లేదు. ఇప్పుడు శుభ్రంగా కుంకుడుకాయ పులుసుపోసుకుని తలంటుకోండి. జుట్టు ఎక్కువున్నవారు సాంభ్రాణి పొగ వేయండి, జుట్టుకు. జుట్టు మంచి సువాసన వేస్తూ, పట్టుకుచ్చులా ఉంటుంది. ఒళ్ళు నేను చెప్పక్కరలేదు, మీకే తెలుస్తుంది, మెత్తగా ఉంటుంది. గరుకుగా అయిపోయిన మోచేతులలాటి చోట మరో సారి పట్టించండి. ఇలా వరసగా రెండు మూడు వారాలు చేయండి, మీరేవదిలిపెట్టరు, దీన్ని. ఇక బొద్దుగుమ్మలకైతే ఇది మంచి మందు, బొద్దు తగ్గడానికి, ఒక ముక్క ఫోటో లో చూపినటువంటిది, రోజూ ఒక ముక్క ఉదయమే తినెయ్యండి. నలభై రోజులకి మీలో తేడా రావడం ఖాయం, బొద్దుగుమ్మలు, ముద్దుగుమ్మలవుతారు.కొంచెం వేడి చేసినట్లుండచ్చు, మజ్జిగ వాడండి, సరిపోతుంది.పిల్లలకి కూడా చేయచ్చు ఇది. ప్రయత్నించండి. దీన్ని ఆహారంగా తీసుకుంటారు.

dscn1748

ఇక ముసలి ముతకకి ఇది మంచి మందు, అతి మూత్ర వ్యాధివారు రోజూ ఒక అంగుళం ముక్క తింటే సుగర్ కంట్రోల్ లో ఉంటుంది. కీళ్ళ నెప్పులతో బాధ పడేవారు ఈ గుజ్జు మోకాలి చిప్ప దగ్గరనుంచి నెప్పి ఉన్నంత చోట రాయండి,ఆరనివ్వండి, కొంచెం పట్టినట్లు ఉంటుంది, గోరువెచ్చని నీరు పోయండి. దీనితో పాటు నల్లేరు పచ్చడి చేసుకుని తినండి, నొప్పులు మాయం.కాలిన చోట కలబంద గుజ్జు రాయండి తొందరగా తగ్గిపోతుంది.

అలోవేరా జెల్ అని కూడా అమ్ముతున్నారు సౌందర్య సాధనంగా వాడకానికిలోపలికి తీసుకోడానికి కూడా.దానికంటే ఇది చాలా మంచిది,స్వంతంగా చేసుకునేది, ఖర్చు లేదు, డాక్టర్ల చుట్టూ తిరగక్కరలేదు. కలబంద పెంచండి ఇంట్లో, ఆరోగ్యం, అందం మీస్వంతమే. ఇంత ఖాళీ ఎక్కడా అంటారా? శరీరం మనదేగా ఖాళీ చేసుకోక తప్పదు 🙂 ఇదేదో ఆడవారికోసమే కాదు మగవారికీ సుమా, ఆచరించి చూడండి.

మనవరాలు ధాత్రి కోసం పట్టుకొచ్చా మూలనెకడో, ఎప్పుడో, రాసిపెట్టినది 🙂 రాసిన టపా వేయడానికి కుదరలేదు 🙂

శర్మ కాలక్షేపంకబుర్లు-ఆ ఒఖ్ఖటీ తెలుసుకుందామని…

Posted on ఫిబ్రవరి 20, 2013
18

dscn2492
శ్రీవారి పాదాలు
పట్టుకున్న శ్రీవారి పాదాలు

ఆ ఒఖ్ఖటీ తెలుసుకుందామని.

బాల్యే గతే కల్పిత కేలిలోలే
మనోమృగే దారదరీషు జీర్ణే
శరీరకే జర్జరతాం ప్రయాతే
విదూయతే కేవలమేవ లోకః ….యోగవాషిష్ఠరత్నాకరం..వైరాగ్యపరక్రణం….94

జరా తుషారాభిహతాం శరీర
సరోజినీం దూరతరే విముచ్య
క్షణాద్గతే జీవితాచంచరీకే
జనస్య సంసారసరోవశుష్కమ్….యోగవాషిష్ఠరత్నాకరం..వైరాగ్యపరక్రణం…95

కల్పనా మాత్రములగు క్రీడలతో బాల్యము గడువగా, యోవనమున మనస్సను లేడి స్త్రీయను గుహయందు ప్రవేశించి శిధిలము కాగా, వార్ధక్యముచే శరీరము క్షీణత్వమునొందగా, పరమ పురుషార్దహీనులై వ్యర్ధముగ ఆయువువును గడుపుటచే జనులు కేవలము సంతాపము పొందుచున్నారు.

ముసలితనమను మంచుపడగా, సడలిపోయిన శరీరమను పద్మమును దూరముగ విడిచి , ప్రాణమను తుమ్మెద క్షణకాలములో ఎగిరిపోవును. అప్పుడి సంసారమను సరోవరము శూన్యమగును.

dscn2221

శ్రీవారి పాదాలు
శ్రీవారి పాదాలు పట్టుకోడానికి అన్ని మెట్లూ ఎక్కేను, మైమరచాను.

కూచుంటే లేవలేను, లేస్తే కూచోలేను. తింటే ఆయాసం, తినకపోతే నీరసం, కనపడదు,వినపడదు, వయసా ఏడు పదులు దాటిపోయింది. రోజూ తెల్లవారుతోంది, పొద్దు గూకుతోంది. చేసినపనే చేస్తూ, తిన్న అన్నమే మరీ, మరీ తింటూ, జిహ్వ రుచులకోసం ఏడుస్తూ ఉంటే, తిన్నది అరక్కపోతుంటే, తిన్నది శత్రువులా శరీరం మీద దాడి చేస్తుంటే, బాధలు భరించాల్సి వస్తుంటే, చేయగలది లేక, చేత కాక, భగవన్నామం పారాయణ చేద్దామంటే శరీరం సహకరించక, శంకరులు చెప్పినట్లు వృద్ధావస్థ లో చింత బాధిస్తూ ఉంటే,అయ్యో వయసులో ఉండగా ఈ పని చెయ్యలేదు, ఆ పని చెయ్యలేదు, కాసు వంద రూపాయలుండాగా ఒక కేజీ బంగారం కొనుక్కోలేదు, సెంటు పది రూపాయల రేటులో ఒక ఎకరం ఇంటి స్థలం కొనుక్కోలేదు, అని ఏడుస్తూ, ఇవన్నీ కూడా వస్తాయని భ్రమిస్తూ, ఈ జీవితం మీద, రోజూ చేసే పనుల మీద విరక్తి పుట్టి ఆ ఒఖ్ఖటీ తెలియక, కొట్టు మిట్టాడుతూ, ఇదేదో తేల్చుకోవాలని, ఆయననే అడిగేద్దామని, నన్ను నీలో ఎప్పుడు కలుపుకుంటావని నిలదీసి అడిగేద్దామని చెప్పి, ఏడుకొండలవాడినే తిన్నగా అడిగేద్దామని బయలుదేరా, సతీ సమేతంగా.

dscn2517

స్వామి వాహనం పై ఊరేగింపు
వాహనం పై రధ సప్తమినాడు ఊరేగుతూ స్వామి దర్శనిమిచ్చారిలా

వీటన్నిటికంటే ఎక్కువగా బాధిస్తున్నవి రెండు విషయాలు. ఒకటి కనపడకపోవడం, కళ్ళు చూసి చూసి, చూడకూడనివీ చూసి అలసిపోయాయి, చూడవలసిన పరమాత్మను చూడలేకున్నాయి. ఆక్కడ పెట్టిన వస్తువునే వెతుక్కోవలసి వస్తూంది. అలాగే వినపడటం, ఏవో శబ్దాలు వినపడతాయి, కాని విషయం, మెదడులోకి చేరటం లేదు. మళ్ళీ అడిగితే, అందరూ చిరాకూ పడుతున్నారు. ఎవరో ఇద్దరు మాటాడు కుంటూ ఉంటే విషయం అర్ధం కాక ఏమిటని అడిగితే, చెవుడా అంటున్నారు. కాదు విషయం అర్ధం చేసుకోడానికి మెదడు నిరాకరిస్తోందని చెప్పలేను, చెప్పినా అదేమో అర్ధం అచేసుకునే స్థితిలో వారు లేరు. దీని మూలంగా చిరాకులు పరాకులు, విసవిసలు పెరుగుతాయి. ఇల్లాలు కూడా అన్నీ తెలిసి అప్పుడపుడు తప్పు పడుతూంటే, తప్పు వారిదీ కాదు, నాదే, వయసు మీద పడిన బాధలు అనుభవవించకతప్పదుకదా! మరో గుణం కూడా కనబడుతోంది, అది చెప్పినదే మళ్ళీ, మళ్ళీ చెప్పడం తో ఛాదస్తం పెరిగిందని యువత మాటాడటం కూడా మానేస్తున్నారు,ఇది మరొక బాధకు కారణం, వారు పలకరించలేదని. సంసారం, (ప్రపంచమని కూడా అర్థం) మీద విరక్తే కలుగుతోంది.. కాని దీనినుంచి పారిపోవడమెలాగో తెలియటం లేదు… ఇలా ఆలోచిస్తూ ఉండగా….

పెద్దబ్బాయి కోడలూ వచ్చి మీరేమో మా దగ్గరికి రావడంలేదు. ఎక్కడికీ కదలడం లేదు,అలా కాదు, అందరం వెంకన్న బాబుని దర్శించివద్దామని పట్టుపట్టేరు. ఇల్లాలు కూడా కొడుకు, కోడలికే ఓటేసింది, మరి నేను ప్రతి పక్షం అయ్యాను, ఒక్కడినే అయిపోయాను కూడా. చిన్నకోడలూ కొడుకూ కొద్ది సమయం ముందే వెళ్ళి వెంకన్న బాబును దర్శించుకుని వచ్చారు కనక, ఇంట్లో ఉంటామన్నారు, ఇన్ని సంకెళ్ళు వేసేస్తే, సరే! ఆయననే విషయం అడిగేద్దామని బయలుదేరేననమాట.

ఏడు కొండలూ ఎక్కించాడు దయతో, బస్సుమీదేలెండి, నడుద్దామనిపించింది, అలా అంటే తిడతారని భయపడి నోరు విప్పలేదు.అహహా! ఏమి వైభవం స్వామిది, మాయ కప్పేశాడు, పైకి ఎక్కేటప్పకి. కొంతకాలానికి తెప్పరిల్లి అడుగుదామనుకున్నది జ్ఞప్తికి తెచ్చుకున్నా. ఎక్కడచూచినా జనం, ఇసుకేస్తే రాలనంత జనం, అబ్బో ఎన్ని పెళ్ళిళ్ళో!

dscn2316

నిస్వార్ధ సేవకులు
స్వామివారి నిత్యాన్నదాన భవనంలో నిస్వార్ధంగా భక్తులకు వడ్డన చేయడానికి సిద్ధంగా ఉన్నవారు.

అందరినీ మాయలో బుట్టలో పడేస్తున్నాడు, స్వామి. అందరూ అందులో పడిపోతున్నవారే! క్షేత్రపాపులు చేసేదానికి అంతే ఉండటం లేదు, స్వామి సేవకొఱకు వచ్చి నిస్వార్ధంగా సేవ చేస్తున్న వారిని చూసి సిగ్గూ వేసింది, ఆనందమూ కలిగింది, గర్వమూ కలిగింది, ఇటువంటి సంస్కృతిలో పుట్టినందుకు. అలా స్వామి సేవలో కనపడినవారందరినీ అభినందించా! ఐదు గంటలపాటు నిలబడితే స్వామి లిప్తకాల దర్శనమయింది, అందుకే తృప్తి చెందా. స్వామిని చూసి ప్రశ్నిదామనుకున్నది మరచా! నేనా మరచింది, ఆయనే మరపులో, మాయలో పడేశాడు, నీ పెంకు ఇంకా పూర్తిగా కాల లేదురా అని.

జగత్త్వమహమివత్వాదిరిమిధ్యాత్మాదృశ్యముచ్యతే
యావదేతత్సంభవతి తావన్మోక్షో న విద్యతే…యోగవాశిష్ఠం…ఉత్పత్తి ప్రకరణం…5

“జగత్తు, నీవు, నేను”- ఈ మిధ్యారూపములే దృశ్యమని చెప్పబడుతున్నది. (అనగా కనపడుతున్నది) అవి ఉన్నంతవరకు ( సత్యములుగా భావింపబడునంతవరకును) మోక్షములేదు..

ఇది తెలుసుకోమని యోగవాశిష్ఠరత్నాకరం చూపెట్టేరు.

dscn2338

శర్మ కాలక్షేపంకబుర్లు-ఆ ఒఖ్ఖటీ తెలిస్తే ఎంత బావుణ్ణు!

Posted on ఫిబ్రవరి 12, 2013
32

marriage
marriage
Courtesy google

ఆ ఒఖ్ఖటీ తెలిస్తే ఎంత బావుణ్ణు!

  విష్ణు మూర్తిగారి ఆఫీసునుంచి ఫైల్ బయలుదేరింది. అది శివయ్యగారి ఆఫీసుకు చేరింది. ఆయన పైల్ లో అన్నీ ఒక సారి చూసి, కిందనున్న యమయ్య గారి ఆఫీసుకి పంపేడు. ఆయన తన సహాయకుడు గుప్తా గారికి పంపితే, ఆ ఒఖ్ఖటీ తన రహస్య పుస్తకంలో రాసేసుకుని, ఫైల్ బ్రహ్మాజీ గారి ఆఫీస్ కి పంపేసేడు. బ్రహ్మాజీ గారు ఆ ఫైల్ చూసి విష్ణుమూర్తిగారి కొడుకు కంతుడు గారికి నోట్ పంపి తన ఫేక్టరీలో ఉన్న మగ, ఆడ బొమ్మలు రెండిటికి ముడేసేసేడు, ముడేసిన తరవాత కంతుడు గారు పువ్వుల బాణాలు వేసేడు వీరిద్దరిమీదా. ఇద్దరూ గాయపడ్డారు.

dscn2083

ఈలోగా బ్రహ్మజీగారు ఓ చిన్న బొమ్మ తయారు చేసి, దాని ముక్కులో ఓ సారి ఊది, ఆడ సహాయకురాలికి పంపించేసేడు, మగ సహాయకుడి ద్వారా, కంతుడు గారి దెబ్బ తిన్న వారికి, ఆడుకోడానికి. అదుగోనండి అలా చిన్న బొమ్మకి డి.ఒ.బి తయారయ్యింది. సర్టిఫికటూ తయారు చేసేరు బ్రహ్మాజీ గారు. బ్రహ్మాజీ గారు నిర్ణయించిన డి.ఒ.బి ని బ్రహ్మగారి ఆడ, మగ సహాయకులు లెక్క చేయక ముందుకో వెనక్కో దాన్ని జరిపేస్తున్నారు. కాని డి.ఒ.డి మాత్రం రహస్యంగా యమయ్యగారి ఆఫీసులో గుప్తా గారి సేఫ్ కస్టడీ లో ఉండిపోతూ వచ్చింది.

mother

mother
Courtesy google

ఈ చిన్నబొమ్మ పెరిగి పెద్దదయితే, బ్రహ్మగారు మరో బొమ్మతో ముడేసేడు. ఈ బొమ్మలు రెండూ నాలుగు రాళ్ళు వెనకేసుకుని, అబ్బో! ప్రపంచంలో సర్వమూ ఈ రాళ్ళే అని, ఆ రాళ్ళ చుట్టూ తిరుగుతూ, ఇదే సర్వస్వం అనుకుని తిరుగుతున్నాయి. బ్రహ్మ గారి ఆజ్ఞ తో, కంతుడి గారి మాయతో, మరిన్ని బొమ్మలని తయారు చేసాయి. అలా పెరుగుతున్న బొమ్మలలో కొందరు కొడుకులని, కూతుళ్ళని,కొందరు కోడళ్ళని, కొందరు అల్లుళ్ళని, మనవలని, మనవరాళ్ళని, మునిమనవలని ఆబ్బో! మిత్రులని, స్నేహితులని, బంధువులని, ఆత్మ బంధువులని, ఎన్ని రకాలో, ఎంతో గొప్పగానో చెప్పుకుని తిరుగుతుంటాయి. ఇలా తయారయిన గుంపులో కొంత మంది మీద ఇష్టం పెంచుకుని, కొన్ని బొమ్మలతో వైరం పెంచుకుని, ఇష్టమయినవారు మాటాడలేదని ఏడ్చి,ఇష్టం లేనివారు మాటాడేరని ఎడ్చి, ఎదుటివారికి కలిగిందని తమకు లేదని ఏడ్చి,సుఖంకోసం వెంపర్లాడి, ఉన్న దానితో తృప్తి లేక, ఇలా కాలం జరుపుతున్న బొమ్మలకి వయసు పెరుగుతూ ఉంది, డి.ఒ.డి దగ్గరపడుతోంది, అది మాత్రం గుర్తించటం లేదు. వీటికి డి.ఓ.డి ఉందని తెలుసు కాని, ఎప్పుడో తెలియదు. ఇంకా చాలా కాలం ఉందిలే, అనుకుంటూ ఉంటాయి. ఈ బొమ్మలు తమలో ఉన్న నారాయణుని మరచి, ఎక్కడెక్కడో,బయట నారాయణుని కోసం, శాంతి కోసం వెదుకుతుంటాయి. అదెక్కడా కనపడదు. లోపలికి మాత్రం చూడవు, ఈ బొమ్మలు. అది చూసి నారాయణ మూర్తి నవ్వుకుంటూ ఉంటాడు. వీరు చేసే కృత్యాకృత్యాలను, నిత్యమూ మౌనంగా గమనిస్తూ ఉంటాడు. వారొక సారి చూస్తే చాలు తనతో తీసుకుపోదామనుకుంటాడు. ఆబ్బే ఈ బొమ్మలు చూస్తేనా! దీపం తనకింద చూడలేనట్లుంటుంది వీరి స్థితి.

old

old couple
Coutesy google

ఇలా డి.ఒ.డి తెలియనివ్వకపోవడం చాలా అన్యాయం, డి.ఒ.డి ని ప్రతివారికి ఆధార్ కార్డ్ లాగా,వెంఠనే, రైట్ టు ఇన్ఫర్ మేషన్ కింద ఇవ్వాలిసిందే అని గోల చేసినా,ఉద్యమం చేసినా, గుప్తా గారు లెక్క చేయటం లేదు,చలించటం లేదు. యమయ్య గారికి అపీల్ చేద్దామంటే భయం, వణుకు,దడ మరి. ఏం చేయాలో తోచటం లేదు. ఆ ఒఖ్ఖటీ తెలిస్తే ఎంతబావుణ్ణు.

తెలిస్తే ?………………

స్వస్తి