శర్మ కాలక్షేపంకబుర్లు-తనకుమాలిన ధర్మం….

Posted on మార్చి 27, 2013
25

తనకు మాలిన ధర్మం…….

తనకు మాలిన ధర్మం, మొదలు చెడ్డ బేరం లేదన్నాడు చిన్నయ సూరి, తన మిత్ర లాభం లోనో మిత్ర భేదం లోనో గుర్తులేదు. అంటే ఏంటిటా?

ధర్మం చెయ్యాలి కాని అది తనను ముంచేసేలా ఉండరాదన్నారు, పెద్దలు. కొంతమంది ఇచ్చేటప్పుడు వెనక ముందులు ఆలోచించక ఇచ్చేస్తారు. నిజంగా వీరు గొప్పవారే! అందుకే చరిత్రలో కూడా మిగిలిపోతారు. రంతి దేవుడు, బలి చక్రవర్తి, శిబి చక్రవర్తి, వీరిలో అందునా ముఖ్యంగా చెప్పుకోవలసినవాడు ధధీచి. రంతిదేవుడు తనకున్నదంతా అతిధికి పెట్టేసి తను ఆకలితో పరమేశ్వరుని చేరుకుంటాడు, బలి చక్రవర్తి తనకున్నది అంతా, సర్వస్వం, గురువు వచ్చిన వాడు విష్ణువని చెప్పినా వినక, భవంతుని చెయ్యి కింద, దానం ఇచ్చేటపుడు నా చెయ్యి పైనుండటం గొప్పకదా! అని అంతా దానం చేసి మూడవ అడుగుకు చోటు లేకపోతే, తన తలను చూపిన మహాత్ముడు. తెలిసిచేసిన దానం. శిబి చక్రవర్తి పావురానికి ప్రాణదానం చేయడం కోసం తన తొడ మాంసం కోసి ఇచ్చిన మహానుభావుడు. ఇంతకు మించిన వాడు ధధీచి అనుకున్నాం కదా! ఎందుకు? దేవేంద్రునికి ఆయుధం కావలసివచ్చింది, ఏది మంచి ఆయుధం అంటే ధధీచి వెన్నెముకతో చేసిన ఆయుధం గొప్పది అన్నారు, వృత్రాసుర సంహారానికి. దేవతలు బయలుదేరి ధధీచి దగ్గరకు వెళ్ళి ఏమని అడిఆగేరు? అయ్యా! మా దేవేంద్రుని కి ఆయుధానికి గాను మీ వెన్నెముక కావాలీ అని. ఆయనేమన్నాడు, సరే తీసుకోండన్నాడు, అదేదో దొడ్డిలో ఉన్న చెట్టుకాయలాగ. ఆ దానం మూలంగా ఆయన తన ప్రాణాలే పోగొట్టుకున్నాడు. అందుచేత ఏం చెప్పేరంటే, దానం చెయ్యి కాని నీతాహతుకు మించిన దానం చేయవద్దన్నారు. “శరీరమాద్యం ఖలు ధర్మసాధనం,” అంటే ధర్మం చేయాలంటే ముందు శరీరం కావాలోయ్! అని

రెందవది మొదలు చెడ్డబేరం. దీన్ని చూస్తే, వ్యాపారం ఎప్పుడూ లాభం కోసమే చేయాలి. లాభం లేని వ్యాపారం జీతం లేని ఉద్యోగం చేయకూడదు. అయితే లాభం అనేది ధర్మబద్ధంగా ఉండాలి. మొదలు చెడ్డ బేరం అంటే, అసలు లాభం మాట దేవుడెరుగు, అసలు ఖరీదు కూడా రాకుండా అమ్మకం చేయకూడదట. అదే మొదలు చెడ్డ బేరం, మరి ఇదిప్పుడెందుకు చెప్పాల్సి వచ్చిందంటే…

ఏవో కొన్ని ఈ పుస్తకాల్ని జమ చేసేను. కొన్ని చదివేను, చదువుతున్నాను. వీటిని నలుగురితో పంచుకోవాలని ఆశ పడి బ్లాగులోకి ఎక్కించా కష్టపడి, కరంట్ ససిగా లేకపోయినా, ఓపికగా. ఒక లింక్ పెట్టి ఒక పాతిక పుస్తకాలు ఉంచా. అది మొదలు నాకు బాధలు మొదలయ్యాయి. 🙂 అదేంటి గ్రంధాలయం లింకిస్తే మీకు బాధేంటి అనచ్చు. అది మొదలు నా బ్లాగు నాకు కాకుండా పోయింది. ఎంత సేపూ లోడ్ అవుతుంది కాని పేజి తెరుచుకోదు. టపా వేయడానికీ కష్టపడాల్సి వచ్చింది, మూడు రోజులు బాధ పడ్డా, ఎందుకిలా జరుగుతోందని ఆలోచించా. ఊహు! కారణం తెలియలేదు. చించగా చించగా అప్పుడు బోధ పడింది.లింక్ లు పీకెయ్యడానికే కష్టపడాల్సివచ్చింది, అంత సమయం పట్టింది, బ్లాగు స్వాధీనం లోకి తెచ్చుకోడానికి. . అబ్బో! అప్పుడు అనుభవం లొకి వచ్చింది,’ కన్నుపోయేటంత కాటుక పెట్టుకోకూడదని’ నానుడి, ఇది తనకు మాలిన….ఎవరో అన్నారు…’మరో బ్లాగు’….చాల్లెద్దురూ! ‘ఈ పులుసుతో ఇ ముద్ద దిగనిద్దురూ’ మరో నానుడి. ‘ మింగ మెతుకులేదు కాని మీసాలకి సంపెంగ నూనె’ అని మరో నానుడి. ….

ప్రకటనలు

శర్మ కాలక్షేపంకబుర్లు-ఆది శంకరుల పూర్వీకులు తెనుగువారు.

Posted on మార్చి 28, 2013
8

ఆది శంకరుల పూర్వీకులు తెనుగువారు.

గోదావరి జిల్లావారు, అన్నవరం దగ్గరి హంసవరం వారి స్వగ్రామం. ఈ మాట నేను చెబుతున్నది కాదు కామాక్షీ పీఠాధిపతి శ్రీ కామేశ మహర్షి చెబుతున్నారు, ఒక పరిశోధన వ్యాసం లో. దానికి కావలసిన ఆధారాలిచ్చారు అవధరించండి.నేను తొందరలోనే హంసవరం వెళ్ళాలనుకుంటున్నా.

శర్మ కాలక్షేపంకబుర్లు-రాజుగారి కుక్క.

Posted on మార్చి 24, 2013
6

రాజుగారి కుక్క

“కుక్క దొరికితే కర్ర దొరకదు, కర్ర దొరికితే కుక్క దొరకదు, రెండూ సమకూడితే అది రాజుగారి కుక్క” అని ఒక నానుడి ఉంది తెనుగునాట. ఏంటిది పంతులుగారూ అన్నాడు మా సత్తి బాబు, వస్తూనే. ఈలోగా అన్నగారి మాట విన్నట్లుంది ఇంటావిడ “కాఫీ తెస్తున్నా కూచో అన్నయ్యా” అని ఒక కేకేసింది లోపలినుంచి.కాఫీ పట్టుకొచ్చి అన్నగారికి నాకూ ఇచ్చింది, చూస్తూ నిలబడింది..

“ఏముందయ్యా! కుక్క ఇంట్లోకి చొరబడుతోందని కొడదామంటే కర్ర దొరకలేదు, సమయానికి, కర్ర దొరికినపుడేమో కుక్కలేకపోయింది, కర్ర అవసరం లేకపోయింది. కర్ర గుర్తుగా జాగ్రత్త పెట్టుకుని ఉంచుకుని, కుక్క వచ్చినపుడు కొడదామని చూస్తే, అదేమో మహారాజు గారి కుక్కయి ఊరుకుంది. దానికి తోలుపటకా, మువ్వలు, గంటలు, గజ్జెలు హంగు, ఆర్భాటం ఇన్ని ఉన్నాయి. అమ్మో రాజుగారి కుక్క ఇంట్లో దూరడం కాదు, ఏమైనా పాడుచేసినా నోరుమూసుకుని ఊరుకోవలసిందే కాని, కొడితే ఛచ్చేమే! మనం కుక్కని కొడితే రాజుగారు మన చమడాలు ఎక్కతీయించేస్తాడు. అంతకుమించి ఈ నష్టం భరించడమే మంచిది కదా!” అదయ్యా సంగతి అన్నా.

అప్పుడు ఇల్లాలు, “చచ్చిపోతున్నానన్నయ్యా! ఈ ఊరగాయి కారాలు ఆడించుకోడానికి” అంది ఇల్లాలు. “అదేం” అన్నాడు. “ఏం చెప్పమన్నావు నా బాధ. ఊరగాయ కారాలు ఇదివరలో ఇంటిదగ్గర కొట్టించుకునే వాళ్ళం,కారాలు కొట్టేవాళ్ళకి అరటి పళ్ళు, పానకం తయారు చేసివ్వడం, జల్లించడం, ముక్కులు చీదడం,తుమ్ములు,దగ్గులు ఇన్ని అవస్థలూ పడేవాళ్ళం. ఇప్పుడు మిల్లుకి పంపడమే, అవస్థలు తప్పేయనుకుంటే, ఇప్పుడు కొట్టేవారూ లేరనుకో,” అంటే, “పోనీ బెడద తప్పింది కదమ్మా” అన్నాడు. “బెడద తప్పడం కాదన్నయ్యా! కొత్త బెడద పట్టుకుంది, ఛస్తున్నాననుకో, మిల్లు వాడేమో ఎండలో పోసిన కాయలు ఎండనుంచి ఎత్తుకు రండి అంటాడు. అలా ఎత్తుకెళితే కరంటు ఎప్పుడుంటుందో తెలియదు, అంత కంటే ఎప్పుడొస్తుందో తెలియదంటే బాగుంటుందేమో. ఇదిగో ఇప్పటికి మూడు సార్లు తిరిగొచ్చారు మీ బావ. సాయంత్రం బడి కరంట్ ఉండగా పట్టుకెళితే అబ్బే ఇంకా ఎండాలని తిప్పి ఇప్పటికి మూడు సార్లు పంపేసేడు,” “నిన్న ఎండలో పోసిన కాయలు గలగలా ఎండేయి, పట్టుకెళ్ళేరు, తీరా మిల్లులో పోసే సమయానికి లటుక్కున కరంట్ పీకేశాడుట. మళ్ళీ మామూలే.కరంట్ ఎప్పుడొస్తుందో తెలీదు పట్టుకుపొమ్మన్నాడుట. వాడు ఎత్తి ఇచ్చేస్తే తెచ్చేసేరు. మళ్ళీ పట్టుకెళ్ళాలి,ఈ వేళ, ఈ సారయినా ఆడతాడో లేదొ తెలియదు, అంతా కరంటు వారి దయ,” అంది.

“పంతులుగారు నాకో సంగతి గుర్తొచ్చింది, మీలాటి ఛాదస్తుడే ఒక ఆఫీసరు. ఎవరిని వేస్తే ఆఫీసులో, వాళ్ళతోనే పని చేయించుకునే వాడు. మిగతా ఆఫీసర్లయితే ఫలానా వాడయితే నా ఆఫీస్ కి వద్దు అని చెప్పడం అలవాటు. ఈయన ఆఫీసుకు ఒకరిని బదిలీ ఇచ్చారు. ఆ నిక్షేపరాయుడు వచ్చి జాయినైన రోజునుంచి తిరగడం, పని ఎగ కొట్టడం తప్పించి పైలు ముఖం చూసిన దాఖలాలు లేవు. పక్కవారే ఇతని సీట్ పని సాయంపడుతున్నారు, లేకపోతే ఆఫీసరే చేసుకుంటున్నాడు. ఇలా నడుస్తుండగా ఒక రోజు పై ఆఫీసర్ పిలిచి ఈ ఆఫీసర్ ని ముక్క చివాట్లు పెట్టేడు, సమయానికి అవసరమైన సమాచారం ఇవ్వలేదని. ఎందుకిలా జరిగిందని విచారిస్తే, మన నిక్షేపరాయుడి సీట్ తాలూకు అని తేలింది.అదే కాకుండా ఈ అత్యవసర కాగితాన్ని కూడా డ్రాయర్ లో పెట్టుకుని తాళమేసుకుపోయాడు. ఆఫీసర్ కి కోపం వచ్చి ఒక మెమో ఇచ్చేసేడు, మూడు రోజులలో సమాధానం చెప్పమని. కారణాలు, పని ఎగకొట్టడం, చెప్పకుండా గైర్ హాజరు కావడం. మూడు రోజులు అయ్యాయి, వారం, పదిరోజులయినా సమాధానం లేదు, మన నిక్షేప రాయుడు నించి. దానితో ఈయనకి చిరాకొచ్చి, మరొక మెమో ఇచ్చేడు. మూడవరోజు పై ఆఫీసర్ ఫోన్ చేసి ’ఏంటండీ! కిందవాళ్ళ చేత పని చేయించుకునే నేర్పు కావాలండీ! మీకు ఎన్ని సార్లు చెప్పినా ఉపయోగం కనపడటం లేదు. మా నిక్షేపరాయుడుకి మెమో ఎందుకిచ్చారు? మెమో లిచ్చి పని చేయించుకోగలరా? నేర్పు కావాలండీ, నేర్పు,మీలాటి వాళ్ళకి బతకడం చేత కాదండీ’ అని కడిగేశాడు. పాపం ఆఫీసర్ ఏం చేస్తాడు, బిక్కముఖం వేసుకుని, ఫోన్ పెట్టేసి, మెమో వెనక్కి తీసుకున్నాడు. చెల్లెమ్మ చెప్పిన దానిలో కరంట్ వారూ, ఇక్కడ నిక్షేప రాయుడూ రాజు గారి కుక్కలే కదా?

శర్మ కాలక్షేపంకబుర్లు-ఒంటిపూట బడి.

Posted on మార్చి 23, 2013
14

   మార్చ్ నెలవస్తే ఒంటిపూట బడిపెట్టేవారు, అప్పటికి ఎండలు ముదురుతూ ఉంటాయి, ఉదయమే తరవాణీలో చద్దెన్నం ఆవకాయ, ఉప్పు, నూని,వాము కలుపు తినేసి ఎనిమిదికి బడికి పరిగెడితే పన్నెండు దాటిన తరవాత వదిలేస్తే, ఇంటికి చేరేవారం. అప్పుడు పిల్లలు ఎండబారి పడకుంటారని చేసిన నిర్ణయమనుకుంటా, ఈ ఒంటిపూట బడులు. ( నిజానికి ఇంగ్లీషులో వీటిని మార్నింగ్ స్కూల్స్ అంటారు) ఇప్పుడు ఒంటిపూట బడి అని మధ్యాహ్నం పెడుతున్నారు, ఉదయం మరొకరికి పరీక్షలని,అసలు ఉద్దేశం వెనకపట్టేసింది.

చిన్నపుడు ఒంటిపూట బడులంటే బలే ఆనందంగా ఉండేది, పొద్దుటే బళ్ళోకెళ్ళివచ్చేసి, మధ్యాహ్నం పెద్దాళ్ళు పడుకోండిరా అంటే, వాళ్ళు పడుకునేదాకా కాస్త మసలి, ఆ తరవాత నెమ్మదిగా తలుపుతీసుకుని బయటికిపోయి మామిడి చెట్లకిందో, సీమచింత చెట్ల కిందో కాలక్షేపం చేయడం,కోయిల కూతలికి తాడితోపుల్లో సమాధానంగా కూ అని కూయడం, ఎవరేనా దొరికి ముంజికాయలు కొట్టిస్తే హాయిగా భోంచేసి, సాయంత్రం పడి ఇంటికి చేరడం, పేకావారమ్మాయితో పెళ్ళి చేయించుకోవడం, ఆ తరవాత గోదావరిలో పడి ములుగీతలు ఈదుకుంటూ సాయంత్రం గడపడం బహు ఆనందమైన సమయం. ఇప్పటివాళ్ళకి ఈ ఆనంద క్షణాలున్నాయో లేదో చెప్పలేను.సంవత్సరం మొత్తం మీద నాకు నచ్చినది వేసవి కాలమే 🙂 అన్ని పళ్ళూ వస్తాయి తినడానికి,మామిడి, పనస, వగైరా మల్లెలుంటాయి, మత్తెక్కిస్తూ, మొల్లలు వెనకపడతాయి, ప్రతి చెట్టూ పూస్తుంది, పూత మీద అన్ని పువ్వులూ ఆనందాన్నిస్తాయి, సువాసన వెదజల్లుతాయి. నిమ్మమొక్క పూస్తే బలే సువాసన, టేకి పువ్వు బలే సువాసన,పనసపువ్వు వాసనబలేగా ఉంటుంది, ఆఖరికి నీలగిరి చెట్లనే యూకలిప్టస్ పువ్వు కూడా బలే సువాసన, అందుకే నాకు వేసవి కాలం ఇష్టం.

మరి అటువంటి వేసవిలో మార్చ్ 21 కి ఒక ప్రత్యేకత ఉంది. అది తెలుసుకోవాలంటే కొంచం వెనక్కి వెళదాం.

ఉత్తరాయణం, దక్షణాయణం తెలుసుకదా! ఉత్తరాయణం లో మార్చ్ 21 వ తారీకు నాడు సూర్యుడు భూమధ్య రేఖ మీద ఉంటాడు. ఇలాగే మరొక రోజు సెప్టెంబర్23 వ తారీకునా ఉంటాడు, అంటే సరిగా ఆరు నెలలతరవాత. అయితే ఏమిటిట? అంటే ఈ రోజులలో భూమి మీద సూర్య కాంతి మూలంగా పగలు రాత్రి సమానంగా ఉంటాయి. వీటినే మనవారు విషువత్తులు అన్నారు. ఇహ పోతే నాకూ అలవాటయిపోతున్నాయి ఊతపదాలు 🙂 ఒక చోట ఉన్న సమయం మరొక చోట ఉండదు భూమి పై. కారణం చూస్తే,సూర్యునికి అన్నిచోటులు, అన్ని సందర్భాలలో అభిముఖంగా ఉండవు కనుక. భూమికి ఉన్న రెండు ధృవాలనుంచి ఒకదాన్ని ఒకటి కలుపుతూ ఊహా రేఖలు గీసేరు వాటిని లాంగిట్యూడ్స్ అక్షాంశాలంటారు. వీటిని గ్రీనిచ్ నుంచి మొదయినట్లుగా అక్కడ మొదలుపెట్టేరు (౦ డి)దీని ప్రత్యకత ఏమీ లేదు, నాడు బ్రిటన్ ప్రపంచం లో చాలా దేశాలను ఏలింది కనక. అక్కడినుంచి తూర్పుగా 180 పడమరగా 180 ఊహారేఖలు గీస్తే ప్రతి ఊహారేఖ మధ్య సూర్యుడు చలించే కాలం నాలుగు నిమిషాలయింది 24×60=1440ని. ఈ నిమిషాలు 1440/360=4ని.ఇప్పుడు ఒక అక్షాంశం మధ్య సూర్యుడు పయనించే సమయం తెలిసింది కదా. దీనితో ఒక చోట కావలసిన సమయంలో, కావలసిన చోట, ఎంతసమయం అవుతుంది అన్నది లెక్కించుకోవచ్చు. భూమి పడమటి నుంచి తూర్పుకు తిరుగుతోంది కనక, తూర్పుదేశాలలో సమయం కంటే పశ్చిమదేశాలలో సమయం వెనక ఉంటుంది. అట్లాస్ లో చూసి మన సమయానికి మరొక సమయానికి తేడా గమనించవచ్చు. కాని ఇక్కడొక చిక్కుంది. తెలివయిన దేశాలు వాటి సమయాన్ని అదే ప్రామాణిక సమయాన్ని అసలు సమయంకంటే ముందుకొ వెనక్కో జరుపుకుంటాయి, ఎందుకంటే, వారి పనులు వెలుగుండగా చక్కపెట్టుకోడానికి, కరంటు ఆదా చేసుకోడానికీ. ఉదా: సింగపూర్ సమయం మనకంటే ఒక గంటన్నర ముందుంటుంది, మనకి తూర్పున ఉంది కనక, కాని వారు వారి సమయాన్ని మరొక గంట ముందుకి జరుపుకున్నారు. నిజానికి మనదగ్గర ఉదయం ఐదు ఐతే వారి దగ్గర ఆరున్నర కావాలి, కాని దానిని ఏడున్నరగా మార్చుకుని ఉపయోగించుకుంటున్నారు. ఇలాగే మరిన్ని దేశాలూ. అ.సం.రాష్ట్రాలలో నాలుగు ప్రామాణిక సమయాలున్నాయని మా అమ్మాయి చెప్పింది. అప్పటికి నాకు రెండే ఉన్నట్లు తెలుసు. మన దేశ ప్రామాణిక సమయం 82 1/2 డి. తూర్పు. అంటే గ్రీన్విచ్ లో రాత్రి పన్నెండయితే మన సమయం ఉదయం ఐదున్నర గంటలు. 82 1/2 ఎందుకు తీసుకున్నారంటే సరిగా 5.30ని. తేడా ఉంటుందని. మన బడ్జెట్ సాయంత్రం మూడు దాటిన తరవాత రాత్రి సమర్పించేవారు ఆరు ఏడు గంటల సమయంలో అంటే లండన్ లోమనను పాలించిన వారి స్టాక్ ఎక్స్ఛేంజ్ పని సమయం అయిన తరవాత మన బడ్జెట్ సమర్పణ జరిగేది, ఇక్కడ. స్వతంత్రం వచ్చాకా కూడా అదే కొన సాగించారు. పాపం ఒక ఆర్ధిక మంత్రిగారు ఇదేమి దౌర్భాగ్యం అని సమయం మార్చేసేరు. ఈ సమయాల గురించి కాల్ సెంటర్ వారికి బాగా తెలుస్తుంది ( ఏంటో కాల్ సెంటర్ పేరే నాకు బాగోదు, వినడానికే)

ఇలాగే మరో రెండు రోజులు ప్రత్యేకత చూపేవి వున్నాయి. జూన్ 21 ఈ రోజు పగలు సుదీర్ఘంగా ఉంటుంది. లాంగెస్ట్ డే, సినిమా చూసుంటారు. ఇక December 21 పగలు చాలా తక్కువ, రాత్రి ఎక్కువ. ఇది దక్షణాయణం లో వస్తుంది. ఇటువంటి ప్రత్యేకతలున్న రోజులుకి మద్య కాలం సరిగా ఆరు నెలలుంటుంది చూడండి.మనవారు రోజు కాలాన్ని సూర్యోదయం నుండి మరుసటి సూర్యోదయం దాకా లెక్కిస్తారు. పడమటివారు రాత్రి పన్నెండునుండి లెక్కిస్తారు.

ఇదేంటీ ఈ టపా మార్చ్ 21 న వెయ్యాలికదా, నిజమే, ఆరోజు వేద్దామనే మొదలెట్టా. కరంటు వారి పుణ్యంతో పూర్తికాలా. నిన్నటినుంచి కరంటు స్థిరం గా ఉంది, ఎంచేతో!. మరో సంగతి నేను ఉదయం ౦5.30ని తరవాత రోజూ టపా వేసేవాడిని, ఎంచేత? ప్రపంచంలో అది అందరికి అనగా ఎక్కువ మందికి అనుకూలమయిన సమయం.దేశం లోవారికి ఇబ్బంది ఉండదు, తూర్పు దేశాలకి రోజులో కొద్దిగా గడుస్తుంది. గల్ఫ్ వారికి గంట పై సమయం లో తెల్లవారుతుంది. ఇక అ.స.రాష్ట్రాలు, కెనడా వారికి సాయంత్రం అవుతుంది. కొద్ది ఇబ్బంది మాత్రం బ్రిటన్, జెర్మనీ, వీటి దగ్గర దేశాల వారికి ఉంటుంది. కాని కరంటు వారి దయ మూలంగా రోజులో ఎప్పుడో ఒకప్పుడు టపా వేస్తే చాలనుకునే స్థితికి వచ్చేశాను. చూశారా కాలమహిమ.

శర్మ కాలక్షేపంకబుర్లు-ఓరి! నాయనో!!

Posted on మార్చి 21, 2013
17
మొల్లలు

ఓరి!నాయనో!

ఒక పాతికేళ్ళమ్మాయి ఓ కుర్రాణ్ణి చెయ్యిపట్టుకుని, బరబరా, బిరబిరా పోలీస్ స్టేషన్ కి లాక్కొచ్చింది. రాత్రి నుంచి ఉద్యోగం చేస్తున్న

ఎస్.ఐ: ఏంటమ్మా ఏంటి సంగతి అన్నాడు. ( ఈయన సత్తెకాలపు పోలీసులెండి. లేకపోతే ఏటే నం(లం)… కానా ఎవణ్ణే, పొద్దుగాల లేపుకొచ్చినావు అని ఉండేవాడు.)

అమ్మాయి: ఈయన నా కేసి నోరొదిలేసి చూస్తున్నాడు. చొంగ కార్చుకుంటున్నాడు. అందం వర్ణించేస్తున్నాడు, కేసెట్టి లోపలేసెయ్యండి.

పోలీస్; ( కుర్రాడితో) ఓరి పిచ్చినాయాల! అలా తినేసేలా చూస్తారా? తప్పుకదూ! దొంగ చూపుల్చూడాలి కాని, పారిపోక, ఈ అమ్మాయి చెయ్యట్టుకుని లాక్కొస్తే వచ్చేసేవా?

కుర్రాడు: ఏం చెయ్యనండి! లాక్కొచ్చేసింది వచ్చేసేనండి.

పోలీస్: ఎప్పుడు చూసేడు? ఎక్కడ చూసేడు?. సాక్షాలేవమ్మాయి?

అమ్మాయి: సాక్షాలెక్కడుంటాయి? నాకేసి మిర్రి మిర్రి చూశాడు, నీ ముక్కు అందంగా సంపెంగ పువ్వులా, పెదవులు తమలపాకుల్లా, పలువరుస ముత్యాలలా, ముఖం పద్మంలా, మెడ శంఖంలా అని ఇంకా కింద,కింద వర్ణించేస్తున్నాడండీ!పద్దూ! నీ అందమే అందం! హాయ్ రాణీ, నా హృదయరాణీ అంటున్నాడండీ.

పోలీస్: సాక్ష్యాలు లేకుండా కేస్ కట్టవమ్మాయ్.

అమ్మాయ్: సాక్ష్యాలెక్కడుంటాయ్, మా పడకగదిలో అంటే!

పోలీస్: నీ పడక గదిలోకెలా వచ్చాడమ్మా?

అమ్మాయి: ఏడిచినట్లుంది, నా పడకగదిలో, నా మొగుడు కాక మరొకరు ఎలా ఉంటారు?

పోలీస్: ఓరినాయనో! రేపటినుంచి ఈ కేస్ లు కూడా చూడాలా?

(Starring at a lady/girl is punishable under new act)

శర్మ కాలక్షేపంకబుర్లు-మిథునం అద్భుతః (బాపు గారి స్వదస్తూరితో)

Posted on మార్చి 19, 2013
26

mithunam   పై క్లిక్ చేసి కధ చదవండి.(బాపు గారి స్వదస్తూరితో)

Courtesy C.V.L.N.Ravi kumar

మిథునం అద్భుతః

“మిథునం సినిమా చూడు బాబాయ్” అన్నాడు, అబ్బాయి,ముంబాయి నుంచి. “ఏదిరా! చూదామని కూచుంటే కరంటు వాడికి కన్ను కుట్టిం”దంటే మర్నాడు బ్లాగ్ లో పెట్టేసేరు జిలేబి గారు. ఇల్లాలితో కలిసి చూశా, “సంబడమే, బానే ఉంది, మీ నిరవాకమే” అంది ఇల్లాలు. నిన్న అబ్బాయి పిలిచి “బాబాయ్! సినిమా చూశావా?” అన్నాడు. “చూశానయ్యా!” అంటే “ఎలా ఉంద”న్నాడు “అద్భుతః” అన్నా, గలగలా నవ్వేడు. అప్పుడన్నాడు “బాబాయ్! బాపూ గారు స్వహస్తాలతో రాసిన కధని స్కేన్ చేసి దాచుకున్నా,” అన్నాడు.నాకు ఆనందంతో నోట మాట రాలా. మన సంస్కృతిని తరవాత తరాలు జాగ్రత్తగానే చూస్తున్నాయని ఆనందమయ్యింది. “ఒరే అబ్బాయ్! నాకు పంపవురా” అన్నా. “చూసి పంపుతానేం” అన్నాడు. భోజనం చేస్తోంటే కోడలు సెల్ ఫోన్ తెచ్చి ఇచ్చింది, “బావగారి దగ్గరనుంచి” అని. “బాబాయ్! పంపేను చూడు” అన్నాడు. అక్కడినుంచి ప్రారంభమయ్యింది నా ఆరాటం. రెండు మెతుకులు కొరికి వెళ్ళబోతూంటే “ఎందుకంత కంగారూ! అదెక్కడికీ పారిపోదు కాని, ముందో రెండు ముద్దలు తినండి” అంది. అబ్బే లోపలికి పోనిదే. ఆత్రంగా కంప్యూటర్ దగ్గరకొచ్చి ఆన్ చేయగానే తాతా! అని ఒంటిపూట బడికి వెళ్ళొచ్చిన మనవరాలు కంప్యూటర్ ఆక్రమించింది. మనవరాలుని కాదనగలనా? అది నా బలహీనత. ఎప్పుడు ఖాళీ చేస్తుందా అని చూస్తూ కూచున్నా. ఎప్పుడో తెలియకుండానే కునుకు పట్టేసింది. మెలుకువొచ్చి చూస్తే, కరంటు ఉంది, కంప్యూటర్ కట్టేసింది, మనవరాలు. బాగుందనుకుని ముఖం కడుక్కొచ్చి కంప్యూటర్ ముందు కూచుంటే, చిటుక్కున కరంట్ పోయింది. ఏం చేయడానికీ తోచక మామిడి చెట్టు పనస చెట్టు మధ్య తిరుగుతుంటే “పందిరేద్దాం రమ్మ”ంది,ఇల్లాలు. ఎండ కోసం, నిన్న మొదలెట్టిన తాటాకుల పందిరెయ్యడం అయ్యింది కాని కరంటు రాలేదు, ఒక కన్నటే పడేసి ఉంచినా. అమ్మయ్య ఆరు గంటలకి కరంటు వచ్చింది. కంప్యూటర్ ఆన్ చేస్తే ఏమీ లేదు, ఏదో అయిపోయింది, ఏం చేయాలి, “తగలేసే”వని తిడతాడేమో అబ్బాయని, బెరుకుతో కూచున్నా. అబ్బాయొచ్చాడు, రాగానే చేరేసింది వార్త ఇల్లాలు, అబ్బాయొచ్చి చూసి “ఏం పాడవదు నాన్నా! కంగారు పడకండి” అని విప్పి, తుడిచి ఏదో చేసి మొత్తానికి పని చేయించాడు. ఈ లోగా కరంటు పీకేశాడు మళ్ళీ. అరగంట తరవాతిచ్చాడు, ఆన్ చేస్తే మళ్ళీ మొదలికొచ్చింది. “చూడు నాయనా” అని తప్పుకున్నా. అబ్బాయి కట్టేసి “ఇందులో చిన్న బేటరీ ఉంటుంది అది పోయింది, తెచ్చివేస్తా, ఈలోగా స్నానం చేసి రండి” అని బయటికెళ్ళేడు బేటరీ తేవడానికి. స్నానం చేసివచ్చేటప్పటికి తెచ్చి వేశాడు. అమ్మయ్య! సమస్య తీరిందని చదవబోతే కరంటు మళ్ళీ పీకేశాడు. హతవిధీ! ఎందుకిలా జరుగుతోందనుకుంటే, “కొంత మందికే పోయింది కరంటు, ఎల్.ఐ గారికి ఫోన్ చేశాము, పంపుతామన్నారు” అంది, కోడలు నా బాధ చూడలేక. “సరిలేమ్మా” అని, రెండు మెతుకులు కొరికి కధ చదివేటప్పటికి ఇదిగో ఈ సమయమైంది,రాత్రి తొమ్మిది. మరి నిద్దరొచ్చేస్తుందికదా! మంచమెక్కేసేను. “ఎందుకంత తాపత్రయం?” అంది ఇల్లాలు. దానికేం తెలుసు పిచ్చిది… బాపూ గారు చేతితో రాసిన కధ, భరణిగారు తీసిన సినిమా ఒక చోట పెట్టాలని నా తాపత్రయం.