శర్మ కాలక్షేపం కబుర్లు-ఏకాదశ రుద్రం

Posted on మార్చి 10, 2013
14

https://youtu.be/1_UjqNOJxxU
Courtesy google

నమక, చమక సహిత మహన్యాసం, వినండి. నేను మహన్యాసం విన్నంతలో, ఇంత గొప్ప శృతిలో కమనీయంగా పారాయణ చేసినవారు కనబడలేదు. చాలా కాలం నుంచి ఈ పారాయణ వింటున్నాను, కాని ఎవరు పారాయణ చేసేరో తెలియలేదు.

marepalli
మహన్యాసం పారాయణ చేసిన శ్రీ మారేపల్లి నాగ వేంకట శాస్త్రి గారు Photo courtesy google

పని కట్టుకుని వెతికి పట్టుకున్నా. .మన కోసం ఒక గంటన్నర సేపు పారాయణ చేసినవారు కొత్తగూడెం వాస్తవ్యులు శ్రీ మారేపల్లి నాగ వేంకట శాస్త్రి గారని తెలిసింది. దీనిని యూ ట్యూబ్ లో పెట్టినవారు శ్రీ కొత్త చంద్ర గారికి అభినందనలు. శ్రీ శాస్త్రి గారికి సాష్టాంగ నమస్కారం, వీరిపుడు అమెరికాలో ఉన్నారు..శివరాత్రి పూటా ఏమీ చేయలేకపోయినా శ్రద్ధగా వినండి, మీ పని చేసుకుంటూనయినా సరే!. శివుడు భక్త సులభుడు, బోళా శంకరుడు కాసిని నీళ్ళు నోటితో పట్టుకొచ్చి, పుక్కిలించి ఉమ్మేసిన వాడికీ , మేకపెంటికలో, స్త్రీ కుచంలో శివుణ్ణి దర్శించినవారికీ కైవల్యం ప్రసాదించినవాడు.

అభిషేకానంతరం అలంకారంతో సోమేశ్వర స్వామి ఇలా దర్శనమిచ్చారు.

పద్మావతీ సహిత వేంకన్నను దర్శించుకుని నారాయణీ సహిత శ్రీకాళహిస్తీశ్వరుణ్ణి దర్శించుకుని వచ్చిన తరవాత కూడా మా వాళ్ళకి సరిపడలేదు. ఊళ్ళో గుడిలో ప్రతి సంవత్సరం చేసే లక్షపత్రి పూజ ఏదాశ రుద్రాభిషేకం మార్చ్ మూడున పెట్టేం రమ్మన్నారు. (03.03.2013) చేసేపని లేదుగా, ఇల్లాలితో బయలుదేరివెళ్ళేను. ఉదయం నుంచి గుళ్ళో అన్నీ కార్యక్రమాలే.

ఏకాదశవార లలితా సహస్రనామ పారాయణతో కుంకుమ పూజ చేస్తున్న సువాసినిలు, అమ్మకి “సువాసినర్చన్య ప్రీతా” అని పేరు కదా!

నమక చమక సహిత మహన్యాస పూర్వక రుద్రాభిషేకం, చమక ఫాఠం ఒక సారి చెప్పి నమకం పదకొండు సార్లు చెప్పి అభిషేకం చేయడం. ఆ తరవాత బిల్వార్చన, లక్ష రుద్రాక్షలతో అర్చన, అమ్మ సహస్ర నామాలు ఏకాదశవార పారాయణ, మరొక పక్క సూర్య నమస్కారాలు. ఇలా అభిషేకం చేసిన రుద్రాక్షలు కావలసినవారందరికీ పంచిపెడతారు. ఇలా కార్యక్రమం పూర్తి అయ్యేటప్పటికి రాత్రి ఏడయింది. ఆ తరవాత సహపంక్తి భోజనాలతో కార్యక్రమం పూర్తయింది. మరునాడు ఉదయమే తిరిగొచ్చాం.

దీక్షగా సూర్య యంత్రాన్ని వేస్తున్న పండితులు.

సూర్య నమస్కారం కోసం సూర్య యంత్రం వేస్తున్న పండితులు. బలే అందంగా ఉంది ఈ సూర్య యంత్రం చూడండి.

పూర్తిగా వేయబడిన సూర్య యంత్రం. దీనిపై ఎర్రని రాగి పళ్ళెం పెట్టి ఎర్రటి మందారాలతో పూజచేసి సూర్య నమస్కారాలు చేసిన పండితులు.

సూర్య యంత్రం పూర్తి అయిన తరవాత తీసిన ఫోటో! ఎంత అందంగా వేసేరో! దీనిపై రాగిపళ్ళెం పెట్టి అందులో కుంకుమ నీరు పోసి దానిపై ఎర్రటి మందారాలతో పూజ చేసి సూర్య నమస్కారాలు చేశారు. ఇవన్నీ సర్వ జనుల ఆయుః ఆరోగ్య, ఐశ్వర్యాయ,విద్య, అభివృద్దిని ఆశించి చేసినవే.

సంవత్సరంలో ఎప్పుడు చేసినా, చేయకపోయినా, నాలుగు ఉపవాసాలు చేస్తారు. అవి, శివరాత్రి, శ్రీరామనవమి, శ్రీకృష్ణాష్టమి, విజయదశమి. ఎందుకంటే పరిశీలించండి, శిశిరం మరొక నెల ఉండగా శివరాత్రి వస్తుంది, చలి తగ్గుతూ ఉంటుంది,పగటి వేడి పెరుగుతూ ఉంటుంది, ఆరోగ్యంలో మార్పురావచ్చు, అందుకు ఉపవాసం, మరొక నెల దాటిన తరవాత వసంతం వస్తుంది, పగలు రాత్రులందు వేడి క్రమంగా పెరుగుతూ ఉంటుంది, ఇప్పుడొక ఉపవాసంతో జీర్ణాశయానికి మరొక విశ్రాంతి ద్వారా ఆరోగ్యం కాపాడబడుతుంది. అల్లాగే శ్రావణ మాసం లో కృష్ణాష్టమికి వర్షాలు పడుతూ ఉంటాయి, ఆరోగ్యం కాపాడు కోడానికి ఒక ఉపవాసం, ఆ తరవాత విజయదశమికి వర్షాలు తగ్గి చలి ప్రారంభమవుతుంది, అప్పుడు కూడా ఆరోగ్యానికోసం ఉపవాసం చెప్పేరు. అసలు ప్రతి ఏకాదశికి ఉపవాసం చేస్తే తెగుళ్ళే చేరవు. అది గమనించం. ఇదంతా చెబితే చెత్తని తీసిపారవేస్తారని, దేవుడురా బాబూ! ఉపవాసం చెయ్యి అంటేనయినా అరోగ్యం రక్షించుకుంటారని ఉపవాసాలు చెప్పేరు. తెలిసి చేస్తే భగవంతుని దర్శనం, తెలియక చేసినా ఆరోగ్యం ఫలితంగా ఇస్తుంది ఉపవాసం. ఉపవాసం అంటే ఏమీ తినకుండా ఉండటం అనుకుంటారు, అది తప్పు, జీవ ప్రక్రియకి కావలసిన ఆహారం ఇవ్వాలి. ఆ పేరు చెప్పి పూర్తిగా తింటే ఫలితం లేదన్నారు. కటిక ఉపవాసం లంఘనం తో సమానం సుమా. పిల్లలు, వృద్ధులు,గర్భిణులకు, అనారోగ్యవంతులకి ఉపవాసం చెప్పబడలేదు, పనికి రాదన్నారు.

అంతా మిధ్య తలంచిచూచిన నరుండట్లౌటెరింగినన్ సదా
కాంతల్పుత్రులు నర్థముల్ తనువున్ నిక్కంబంచు మోహార్ణవ
భ్రాంతిచెంది చరించుగాని పరమార్థంబైన నీయందు దా
చింతాకంతయు చింత నిల్పడుకదా శ్రీకాళహస్తీశ్వరా!

శ్రీ కాళాహస్తీశ్వరా! మానవుడు పుట్టుట,చచ్చుట మొదలగు చేష్టలచే ప్రపంచమంతయునూ మిధ్య, మాయ అని తెలిసికూడా, ఆశాశ్వతమైన భార్య, పిల్లలు అనే మోహం విడవలేక చరించుచున్నాడు, కాని నీయందు చింతాకంతయినా మనసు లగ్నం చేయటంలేదు కదా! అన్నారు ధూర్జటి

సర్వేజనాః సుఖినో భవంతు.