శర్మ కాలక్షేపంకబుర్లు-వెతుకులాట.

Posted on మార్చి 11, 2013
19

వెతుకులాట

“అదేంటీ! అలమారలో పుస్తకాలన్నీ దింపేసి చుట్టూ పెట్టుకు కూచున్నారు, సామానులన్నీ దింపేసి, పరిచేసి, వాటి మధ్య కూచుని పుస్తకం చదువుకుంటున్నారేంటీ?” అంది ఇల్లాలు. “ఇదేదో పుస్తకం కనపడితే, చదువుతున్నా”నన్నా. “మీకు పుస్తకం కనపడితే ఇంకేదీ గుర్తురాదు. ఇంతకీ ఏంటి వెతుకుతున్నారు,” అంది. “వెతుకుతున్నానా! నిజమే! ఏదో వెతుకుతూ ఈ పుస్తకం కనపడి….” అన్నా. “బాగానే ఉంది తిక్కమేళం, దేనిగురించి వెతుకుతున్నారో మరిచిపోయారా! ఎవరేనా వింటే నవ్వుతారు. నాకు చెబితే అదెక్కడుందో వెతికిచ్చేదాన్ని కదా! ఇంతకీ ఏంటది?” అంది. “అది గుర్తురాకేకదా గోల” అన్నా. “ఆ దవడ వాచిపోయింది, పళ్ళు బాధ పెడుతున్నాయి, డాక్టర్ దగ్గరకెళతానన్నారు, ఇక్కడ కూచుండిపోయారు” అంది. “అన్నట్టు ఇప్పుడు గుర్తొచ్చిందోయ్! పంటి డాక్టర్ గారిచ్చిన కార్డ్ కోసం వెతుకుతున్నా” అన్నా. “దొరికిందా?” అంది. “లేదు! కనపడలేదు” అన్నా. “ఏంటో! ఈ కార్డులతో పెద్దగోలయిపోయింది. ప్రభుత్వం వారేమో ఆధార్ కార్డ్ అన్నారు, ఇన్ కంటాక్స్ వారేమో పాన్ కార్డ్ అన్నారు, ఎలక్షన్ కమిషన్ వారేమో గుర్తింపు కార్డ్ అన్నారు, రాష్ట్రా ప్రభుత్వం వారు రేషన్ కార్డ్ అన్నారు. బేంక్ వారి ఎ.టి.ఎమ్ కార్డ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఎవరికి తోచినకార్డ్ వారు ఇచ్చేస్తున్నారు. వీటికి తోడు పంటి డాక్టర్, మామూలు డాక్టర్, కళ్ళ డాక్టర్, సుగర్ డాక్టర్, కేబుల్ టి.వి వాళ్ళు, గేస్ వాళ్ళు ఇలా ఒక్కొకరు ఒకో కార్డ్ ఇచ్చేస్తున్నారు. నా దిబ్బ కార్డ్, దిరుగుండం కార్డ్, అవసరానికి కావలసిన అదొకటీ కనపడి ఛావదు. వీటన్నిటినీ జాగ్రత్త పెట్టుకోలేక ఛస్తూ ఉంటే, ఇవి సరిపోలేదట మన కర్మ కి, ప్రభుత్వం వారు తీర ప్రాంతం వారికి మరొక కార్డ్ ఇస్తున్నారట, ఎలెక్షన్ కమిషనువారు మరొక కార్డ్ ఇస్తున్నారట. ప్రభుత్వం వారు ఇన్ని కార్డ్ ల గోల లేదు ఆధార్ చాలు అన్నారు, మళ్ళీ ఈ కార్డ్ లంటున్నారు, ఏంటో గోల ఆఖరికి ఛస్తే తగలెయ్యడానికి కూడా కార్డ్ చూపించమనేలా ఉంది. అసలదెక్కదపెట్టేరు?. అది లేకపోతే మీ పళ్ళు పీకలేరా డాక్టర్ గారు” అంది, సామాన్లు, పుస్తకాలు సద్దుతూ, ఈ ప్రశ్నల జడివానలో తడిసి, తేరుకుని, “కార్డ్ పట్టుకెళితే దర్శనం మూడు గంటల్లో అవుతుంది, కార్డ్ కొత్తగా రాయించుకుంటే సాయంత్రమే, అక్కడ కూచోలేక కార్డ్ కోసం వెతుకులాట” అన్నా.

బతుకంతా వెతుకులాటే అయిపోయింది! పుట్టగానే తేనెకోసం వెతుకులాట, బిడ్డకి పెట్టడానికి. అక్కడినుంచి మొదలు అంతా వెతుకులాటే, బడిలో సీటుకి వెతుకులాట, ఏ కోర్స్ చదవాలన్నదానికి వెతుకులాట, ఏడ్రెస్ వేసుకోవాలన్నదానికి, ఉన్న అన్నిటిలోనూ వెతుకులాట, చదువు తరవాత ఉద్యోగానికి వెతుకులాట, ఆ తరవాత మొగుడు/పెళ్ళాం కోసం వెతుకులాట, స్వంత గూటికోసం వెతుకులాట, జీవితం లో కావలసిన సామాన్లు అన్నీ సమకూర్చుకోడానికి వెతుకులాట కాని సృష్టించిన వాణ్ణి తెలుసుకోడానికి మాత్రం ఆలోచించడానికి సమయం కనపడటం లేదు, వెతుకులాట లేదు. “ఇంకీ కార్డ్ కనపడదు కాని వెళ్ళి ఆ పళ్ళు పీకించుకొచ్చేయ”మని ఉచిత సలహా పడేసీంది. “సరేలే” అని వెళ్ళడానికి బయలుదేరుతోంటే “నేనూ వస్తానుండండి,” అని కూడా వచ్చి, ఏంచేసిందో కాని ఒక గంటలో డాక్టర్ గారు చూసి, “సుగర్ బాగుందా” అని అడిగి, “మూడు రోజులకి మందులు రాస్తున్నాను, వాడి తగ్గిన తరవాత సుగర్ చూపించుకురండి, కదులుతున్న పళ్ళు తీసేద్దా”మన్నారు. ఉన్నవే ఆరు కింద పైన, అన్నీ పీకేసి పళ్ళు కట్టించుకుంటారా? ఏదయినా మూడురోజుల తరవాత చూద్దామని వాయిదా వేసి మందుల చీటి చేతిలో పెట్టేరు. పళ్ళు పరీక్షకని కళ్ళ జోడు తీసి పక్కనెట్టా, అది మరిచిపోయి బయటికెళ్ళి వెతుక్కుంటూంటే ఆయనే పిలిచి ఇచ్చేరు. మందులు తెచ్చుకొచ్చా, వేసుకున్నా, మూడురోజులకి వాపు తగ్గింది, వెళితే కదులుతున్నవి పీకేసేస్తే మిగిలినవి కింద రెండు పైన నాలుగు. ఏంచేయమంటారంటే బాగున్నవి ఉంచేయండి, ఎప్పుడు బాగోకపోతే అప్పుడే పీకుదురుగాని అంటే ఇప్పుడు కట్టించుకున్న పళ్ళు సెట్ పనికిరాదప్పుడు అన్నారు. ఫరవాలేదు లెండి మళ్ళీ కట్టించుకోవచ్చని చెబితే పదిరోజుల్లో మళ్ళీ రండి అన్నారు. అలా నాలుగురోజులు పళ్ళ డాక్టర్ గారొతో సరిపోయింది, దవడ వాపుతో.

వెతుకులాట నిత్య జీవితం లో ఒక భాగమై కూచుంది. ఏదో ఒక విషయం మీద ప్రభుత్వంవారు చాలా సీరియస్ గా పరిశీలిస్తున్నామంటే, దాని తాలూకు ఫైల్ కనపడటం లేదని, దానికోసం వెతుకుతున్నారని అర్థమని ఒక పెద్దాయన చెప్పిన గుర్తు. ఈ వెతుక్కోడం గురించీ ప్రభుత్వం గురించీ చెప్పడం మొదలెడితే అదే భారతమైపోతుంది. ఈ వెతుక్కోడం రైల్ళో బెర్త్, బస్సులో సీట్ దగ్గరనుంచి, ఇంట్లో పెట్టిన పుస్తకం, కళ్ళజోడు, తాళాలగుత్తి, మెడలో వేసుకున్న చంద్రహారాల దాకా ఉండచ్చు. “ఇప్పుడే ఇక్కడే పెట్టేనండీ! చంద్రహారాలు కనపడటం లేదు, అంటుంది శ్రీమతి. అప్పుడే ఇంటికొచ్చిన శ్రీవారికి పై ప్రాణాలు పైనే పోతాయి, ఇప్పుడు బంగారం ధర గుర్తొచ్చి. ఇక్కడే పెడితే దానికి కాళ్ళొచ్చాయా! నడచి పోడానికి. ఎక్కడో పెట్టి మరిచిపోయి ఉంటావు, వెతుకు. అన్నట్లు నేను ఆఫీసు కెళ్ళే టయింకి బాత్ రూంలో దూరేవు కదా ఆక్కడ మరచేవేమో వెతుకు అని ఉచిత సలహా పడేసి ఆగ లేక వెళ్ళి వెతికితే చుట్టలు చుట్టుకుని పడుక్కున్న పాములా చంద్రహారాలు,సబ్బు పెట్టి అడుగున కనపడతాయి. అమ్మయ్య! ప్రాణాలు గూట్లో పడ్డాయి, ఇద్దరికీ. ఆ తరవాత “ఎప్పుడూ ఇంతే నువ్వని” ఈయన, “మీరేం తక్కువ కాదని” ఆవిడ ఒక చిన్న యుద్ధానికి కారణం. కొన్ని ఇళ్ళలో ప్రతీదీ వెతుక్కోడమే. ఎక్కడ ఉండవలసిన వస్తువు అక్కడ ఉండదు. న్యూస్ పేపర్లు మంచాల మీద తరగడాలకిందా ఉండి వెతుక్కోడం అలవాటే. ఇంక బట్టల గురించి కొన్ని ఇళ్ళలో ఆడ మగ వారు వెతుక్కోడం బలే చిత్రం గానే ఉంటుంది. అద్దె ఇళ్ళకోసం వెతుక్కోడం ఒక భారతం, రామయాణం కలిసినంత గ్రంధమే, చెప్పడం మొదలెడితే. ప్రేమికులు ఒకరి గురించి మరొకరు వెతుక్కోడం లోనే అసలు మజా ఉందంటారు. రామాయణంలో సీతని వెతకడం ఘట్టం సుందరకాండ అయింది. ఈ సందర్భం లో భాగవతం నుంచి ఒక పద్యం చూడండి, గోపికలు కృష్ణుని వెతుకుతున్న సందర్భం లో పోతనగారు చెప్పినది.

నల్లనివాడు పద్మనయనంబులవాడు కృపారసంబు పై
జల్లెడువాడు మౌళి పరిసర్పిత పింఛమువాడు నవ్వు రా
జిల్లెడు మోమువాడొకడు చెలవల మానధనంబు దెచ్చె నో
మల్లియలార! మీ పొదలమాటున లేడు గదమ్మ చెప్పరే.


దేవ కాంచన పుష్పం.

ఇన్ని చెబుతున్న నేను ఉద్యోగం లో ఉండగా కళ్ళ జోడు గురించి వెతుక్కునవి ఎన్ని రోజులో, చెప్పడం మొదలెడితె అదొక చాట భారతమే. నేటి కాలం లో ప్రతి విషయానికి గూగుల్ లో వెతుక్కోడం తోనే సరిపోతూ ఉంది. కంప్యూటర్ లో వెతుకు( search ) ఒక అవసరం కదా!నేటి రోజుల్లో ముఖ పుస్తకంలో బ్లాగుల్లో, టివిట్టర్, వగైరాలలో స్నేహితులవెతుకులాట సర్వ సహజమైపోయింది కదా!. ఈ వెతుకులాట లేకపోతే, మానవ సమాజ అభివృద్దే ఆగిపోతుందేమో!. కొన్ని ఇళ్ళలో వెతుక్కోడం ఉండదు, ప్రతి వస్తువు నిర్దిష్టంగా పెట్టబడి ఉంటుంది, నిజానికి వీరు కొన్ని కొన్ని మంచి సమయాలు కోల్పోతున్నట్లే అనిపిస్తుంది, ఇలా పెట్టుకోడం మూలంగా. ఇలా వెతుక్కోడం మంచి అలవాటు, వెతుక్కోడం అలవాటయితే ఏదో ఒక రోజునాటికి కనపడని వాడి (దేవుడు లెండి) గురించి కూడా వెతుక్కోడం మొదలెడతారు, మంచిదేగా. 🙂