శర్మ కాలక్షేపంకబుర్లు-మరోసౌందర్య సాధనం.

Posted on మార్చి 12, 2013
8

మరో సౌందర్య సాధనం.

మొన్న నెలవారీ పచారీ సామాన్లు తెచ్చాడు, కొట్టు కుర్రాడు. మా ఊళ్ళో ఒక సౌకర్యం, షాపుకి ఫోన్ చేసి జాబితా చెప్పేస్తే సరుకులు ఇంటికి పంపేస్తాడు. డబ్బులు వెంటనే ఇచ్చెయ్యచ్చు, లేదా తరవాత పట్టుకెళ్తాడు, బాగోని సరుకు తిప్పి ఇచ్చేస్తే తీసుకుంటాడు. మా ఇంటిలో మా చిన్న కోడలు కేషియరు,ఇల్లాలు ఫైనాన్సు, హోం మినిస్టర్, చివరికి బిల్లు ఒక సారి నా దగ్గరికొస్తుంది, ఊరికే చూడటానికే. అలా జాబితా చూస్తుండగా సబ్బులు ఆరింటికి రెండు వందలకి రెండు రూపాయలు తగ్గి ఉంది. ఇల్లాలొస్తే ” సబ్బు ఒక్కొకటి ముఫై మూడు రూపాయలా?” అన్నా. “అవును మీరు చూడక తెలియటం లేదు, డబ్బులు సంచీలోనూ,సరుకులు జేబులోనూ తెచ్చుకునే రోజులొచ్చాయి,” అంది. “సబ్బులు మళ్ళీ నెల నుంచి ఆరు సరిపోవు. మన బాత్ రూంలో ఒకటి పిల్లల బాత్ రూంలో ఒకటి సబ్బులుంటాయి కదా మరి, వేసవి కాలం ఒకటికి పది సార్లు స్నానాలుంటాయి,” అంది. “అది సరే కాని మనం ఇది వరలో అంటే చిన్నప్పుడు సున్నిపిండి వాడేవాళ్ళం కదూ” అంటే, “నిజమే ఇప్పుడెవరు వాడుతున్నారు, అసలు సున్నిపిండి చేసుకునే సమయం, ఆలోచనా లేదు” అంది. సున్ని పిండి ఎలా తయారు చేస్తారంటే, ఇలా చెప్పింది.

సున్ని పిండి ఒక ఆరోగ్య సౌందర్య సాధనం. దీనిలో ముఖ్యంగా శనగపిండి, పెసరపిండి వాడుతాం. వీటికి తోడు, కచ్చూరాలని, బజారులో దొరుకుతాయి, వాటిని, వట్టి వేళ్ళు దొరుకుతాయి, వాటిని కలిపి దంచుకుని, దీనికి కొద్దిగా షీకాయిపొడుం కాని, కుంకుడు కాయ పొడుం కాని కలిపివాడుకుంటాం. దీనిని నిత్యమూ వాడుకోవచ్చు. ఒళ్ళు రుద్దుకుని నీళ్ళు పోసుకుంటే చర్మం నిగనిగ లాడుతుంది. తలంటు పోసుకున్నపుడు దీనిని జుట్టుకు పట్టించి రుద్దుకుంటే బాగుంటుంది.సున్నిపిండి కలిపేటపుడు కొద్దిగా మందార ఆకులు కూడా కలిపిన కుంకుడు కాయ రసంతో రుద్దు కుంటే తొందరగా వదులుతుంది జిడ్డు. తలంటు పోసుకునే ముందు ఒంటికి నూని రాసుకుని ఆ తరవాత తడిసిన సున్నిపిండి రాసుకుని కొద్దిగా ఆరిన తరవాత నల్చేస్తే ఒంటినున్న మట్టి పోతుంది. నూనెకి మెత్త పడి పిండితో వచ్చేస్తుంది. ఒళ్ళు మాగిళ్ళు కట్టడం అంటారు, అనగా, చాలా మెత్తటి మట్టి శరీరం మీద చెమటతో కలిసి పేతుకుపోతుంది, నల్లగా, ఇది పోవాలంటే, సబ్బు వల్ల కాదు. ఈ మట్టి మూలంగా ఫంగస్ ఏర్పడి చర్మ వ్యాధులు కూడా రావచ్చు. అందుకు నూని రాసుకుని ఆపై సున్నిపిండితో నలిస్తే మట్టిపోతుంది. మగవారికి, అందునా ఒంటినిండా రోమాలున్నవారికి నల్చుకోవడం యాతనే. అందుకు వారు నూని రాసుకుని కొద్దిసేపు తర్వాత ఈ సున్నిపిండితో రుద్దుకుంటే చాలా బాగుంటుంది. నెలకి అయ్యే ఖర్చు బహుశః వంద రూపాయలు కావచ్చునేమో ఇలా చేసుకుంటే. ఇది ఆరోగ్యానికి ఆరోగ్యం, మరి సౌందర్య సాధనం కూడా. సమయం లేదంటారా! ఒళ్ళు మీదే మీ ఇష్టం.