శర్మ కాలక్షేపంకబుర్లు-పదికోట్లొస్తే

Posted on మార్చి 13, 2013

పదికోట్లొస్తే!

“పదికోట్లంటే ఎంతండి?” అన్నాడు. “పదికోట్లంటే పదీ కోట్లే” అన్నా! “అది కాదండి ఎన్ని సున్నాలండి ఒకటి పక్కన” అన్నాడు. “ఉండుండు, ఒక్క సారి అలా అడిగితే చెప్పేలా లేన”ని కాయితం మీద వేసి చెప్పి, “అసలు పదికోట్ల ఆలోచనెందుకొచ్చిందోయ్!” అన్నా. ఇక్కడ సమయం సందర్భం చెప్పాలి కదండి, ఒక రోజు నా మిత్రుడు “గురువుగారు అర్జంటుగా రండి, ఒక సారి” అన్నాడు ఫోన్ లో, దగ్గరగా ఎనిమిది సంవత్సరాల కితం. “రాగలరా” అనేవాడెప్పుడూ! అటువంటిది “అర్జంటుగా రండ”నే సరికి నాకు ఆతృత పెరిగి పరిగెట్టేను. వెళ్ళేటప్పటికి నాలుగు కార్లు, వాటి డ్రైవర్లు ఒక పక్క, గుమాస్తాలు,మేనేజర్లు వగైరా ఒక పక్క, వారి వారి స్థాయిలను బట్టి గుంపులుగా చేరి ఉన్నారు. నేను ఎందుకూ చెందను కనకా నన్నెవరూ చేర్చుకోలేదు, అంతేవాసి నన్ను చూసి సోఫాలో కూచోబెట్టి “లోపల నలుగురితో ఉన్నాడు బాస్, మీరొస్తే కూచోబెట్టమన్నాడు, లోపలికి కబురు చెప్పివస్తా” అని లోపలికి పోయాడు. “ఎందుకు పిలిచాడబ్బా?” అని ఆతృత, విషయమేమై ఉంటుంది అని. గుప్పెట పడితేనే ఆతృత, విప్పేస్తే లేదు కదా! ఇదుగో ఈ సందర్భంలో ఒక డ్రైవర్ కుర్రాడు ఈ ప్రశ్న వేసేడు.ఈ ఆతృత నుంచి తప్పించుకోడానికి ఒక సాధనం బాగానే దొరికిందనుకుని సంభాషణ పొడిగించా. అసలు పదికోట్ల సంగతేమని. మిగిలిన ముగ్గురూ దగ్గర కొచ్చి నిలబడ్డారు. “మా బుచ్చిగాడు సిక్కిం లాటరీ టిక్కట్టు కొంటానంటున్నాడండి, అది తగిలితే వచ్చే సొమ్ము పదికోట్లటండి” అన్నాడు. నాకు చిన్నప్పటి సంగతి “ఇఫ్ ఐ వర్ ది కింగ్” గుర్తొచ్చి,కధలో పిట్ట కధ, ఒక రోజు మా ఇంగ్లీష్ మాస్టారు క్లాసులో “ఇఫై వర్ ది కింగ్” గురించి రాసుకు రండిరా అన్నారు. అదేమని అడిగితే చెప్పేరు, నువ్వు రాజువయితే ఏంచేస్తావని. సందేహం వదలక మాస్టార్ని తెనుగు మాస్టారుండగా అడిగా, “ఓరి పిడతమొహం వెధవా! నువ్వు రాజువయితే ఎంచేసి ఏడుస్తావో నూతులు తవ్విస్తా, గోతులు పూడ్పిస్తా ఇలా, రాసి ఏడు” అని అదీవించేరు. అదిగో అది పట్టుకుని తెగ రాసేసేను, అప్పుడు నాకే ఫస్టు వచ్చింది, గాలి పోగుచేసి రాయడం కదా!. 🙂 నిజమే కాని “పదికోట్లొస్తే ఏం చేస్తావురా అబ్బాయీ” అన్నా, అందులో ఒకణ్ణి.

దానికి వాడు “మనకి వచ్చేదా చచ్చేదా! ఎందుకు సార్ ఆగోల, నాకీ డ్రైవర్ ఉద్యోగం తప్పుతుందా? ఊరికే ఆశండి మా తిప్పయ్యకి” అన్నాడు. “అదేంటి అంత నిరాశ, వస్తే ఏం చేస్తావని, ఊరికే అనుకోడానికేం” అన్నా. “ఎందుకండి ఊరికే అనుకోడం” అన్నాడు.

మరొకడిని అడిగితే, “మొత్తంసొమ్ముతో పొలాలు ఇళ్ళు కొనేస్తానండి, ఆ తరవాత ఒక కారు కొనుక్కుంటానండి, ఈ సుబ్బిగాణ్ణి డ్రయివర్ గా పెట్టుకుంటానండి, జీతం ఇప్పటిదే ఇస్తానండి. కాలు మీద కాలేసుకుని కూచుంటానండి, హాయిగా జీవితం ఎల్లిపోద్దండి” అన్నాడు. “మొత్తం సొమ్ము పెట్టి ఇళ్ళు పొలాలు కొనలేవు, వచ్చేదానిలో మూడో వంతు ఇన్ కం టాక్స్ వాళ్ళు ముందే పట్టుకు పోతే నీ చేతికొచ్చేదే ఏడు కోట్లు” అన్నా. “ఓర్ని! ఇంతన్యాయమండి, మూడుకోట్లు పన్నా! అమ్మో! జాగర్తగా ఉండాలండి. ఏడు కోట్లెట్టి కొనేస్తానండి” అన్నాడు. “అదీ కుదరదయ్యా! ఒక లెక్క దాటి భూమీ కొనలేవన్నా! పెళ్ళాం పిల్లలపేర కొంటానంటే, అదీ కుదరదు నాయనా!, అంటే “ఇన్ని చిక్కులాండి. ఎంతకొనచ్చో అంతా కొనేసండి మిగిలిన సొమ్ముతో ఇళ్ళు కొని ఇంకా మిగిలిన సొమ్ము బేంక్ లో పడేస్తానండి” అన్నాడు. “ఆ తర్వాత హాయిగా కాలు మీద కాలేసుకుని కూచుంటానండి” అన్నాడు. “ఆ( ఇప్పుడు క్లచ్చి మీదొక కాలు, బ్రేక్ మీద ఒక కాలు వేసుకు హాయిగా బతుకుతున్నాంగా, అది చాల్లెద్దూ” అన్నాడు, మొదటివాడు.

మూడవ వాడినడిగితే, “గురువుగారు సగం సొమ్ము కుటుంబానికిచ్చేసి ఇళ్ళు పొలాలు కొంటానండి, మిగిలిన సొమ్ముతో రాజకీయం లో దిగుతానండి. సొమ్ములు బాగా సంపాదించుకోడానికి వీలున్న పార్టీలో చేరతానండి, కాంట్రాక్టులు చేస్తానండి. నా దగ్గర ఇన్ని తిరుగుళ్ళు లేవండి అంతా తిన్ననైన యవ్వారమేనండి, డబ్బులెక్కడుంటే అక్కడే, అదే మన పార్టీ అండి” అన్నాడు.

నాలుగోవాణ్ణడిగితే, “గురువుగారు, మీలాటివాడిని, మరెవరో ఎందుకండి మిమ్మలినే నా సలహాదారుగా పెట్టేసుకుంటానండి. సగం సొమ్ముతో ఇళ్ళు పొలాలు కొంటానండి, అది కూడా లిమిట్ లోనే, మిగిలిన సొమ్ముతో ఒక కంపెనీ పెడతానండి. కార్లు కొంటానండి, టాక్సీ లు గా తిప్పుతానండి, మన ఊళ్ళో కుర్రాళ్ళని తీసుకుపోతానండి, వాళ్ళకి టాక్సీలిస్తానండి.ఎవరి టాక్సీ వాళ్ళదేనండి, రోజుకింతని సొమ్ము కట్టాలండి, ఆ సమయంలో సొమ్ము కట్టేస్తే టాక్సీ వాడిదేనండి. అలా వాడూ బాగుపడాలండి, నేనూ బాగుపడాలండి” అన్నాడు, ఇంకా ఏదో చెబుతుండగా మా మిత్రుని అంతేవాసి “మిమ్మల్ని రమ్మంటున్నార”ంటే లోపలికెళ్ళా.

ఇక్కడ మిత్రుడి గురించి కొద్దిగా చెప్పాలి. మిత్రుడు ఏదో చెయ్యాలనే తపన ఉన్న రాజకీయవేత్త, జిల్లాలో పేరున్నవాడు, రాజధానిలో పలుకుబడి ఉన్నవాడూ, నాకంటే పాతికేళ్ళు చిన్నవాడూ. లోపలికెళ్ళగానే మొత్తం నలుగురు సాదరం గా ఆహ్వానించి కూచోమన్నారు. మిత్రుడు ఒక ఫైల్ నా చేతిలో పెట్టి “ఇది ఒక ప్రాజెక్టు,దీన్ని మొదలెట్టాలని మా నలుగురి అభిప్రాయం. పదికోట్లతో మొదలెట్టాలని ఉద్దేశం, మీరు దీనిని తీరుబడిగా చదివి చెప్పండి,” అన్నాడు. ఇదేంటి ఈ రోజు పది కోట్లు నన్ను వదిలేలా లేవనుకున్నా, సరదాగా. మరొకరు మాటాడుతూ “ఈ ఫేక్టరీ మొదలయ్యేదాకా మీరు నిర్వహించాలి, దానికి తగు ఏర్పాట్లు చేయాలని తీర్మానించుకున్నాం, పారితోషికం కూడా బాగానే ముట్టచెబుతాం. మీరయితే దీనిని బాగా నిర్వహించగలరని మా ఉద్దేశం” అన్నారు. కొద్దిగా అక్కడక్కడ చూస్తే మాటాడుతూ ఉండగా, ఆ ఫేక్టరీ సాధ్యం కాదేమో అనిపించింది, ఆ మాట చెప్పడం ఇష్టం లేక ఊరుకున్నా, బయటికొస్తే డ్రైవర్ కుర్రాళ్ళు “గురువుగారేదో బరువుగా వచ్చారు” అన్నారు. “ఇదేదో చూడాలిరా నాయనా!” అని వెళ్ళిపోయా. వివరంగా చదివితే అది సాధ్యం కాదనిపించి, వివరంగా నోట్ రాసి దాన్ని టైపు చేయించి మిత్రుని కిచ్చా. మళ్ళీ చెబుతానన్నాడు, దాని గురించి వార్తేరాలేదు, తరవాత 🙂

ఈ మధ్య ఒక రోజు నడచిపోతున్నా,కర్రపుచ్చుకుని. పక్కగా వచ్చి ఒక కార్ ఆగింది, అందులోంచి ఒక డ్రైవర్ దిగి “గురువుగారు బాగున్నారా? కులాసాకదా? కనపడటం లేద”ని పలకరించి వెళ్ళిపోతే, నాటి సంఘటన గుర్తొచ్చింది. పరిశీలించి చూస్తే మొదటి వాడు పూర్తి నిరాశావాదిలాగా, రెండవవాడు పూర్తి సోమరిపోతులాగా, మూడవవాడు పూర్తి స్వార్ధ పరుడయిన రాజకీయనాయకునిలాగా, నాల్గవవాడు పూర్తి స్వాప్నికునిలాగా వ్యాపారవేత్తగా కనపడ్డారు, మీరేమంటారు?

రచయిత: kastephale

A retired telecom engineer.

2 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-పదికోట్లొస్తే”

 1. మీ విశ్లేషణ బాగుంది శర్మ గారు. నా దృష్టిలో ఓ చిన్న తేడా. రెండోవాడిని మీరు సోమరిపోతన్నారు, నేను జాగ్రత్తపరుడంటాను – డబ్బుతో మరీ దూకుడుగా వ్యవహరించకుండా తన కుటుంబ ఆర్థిక భద్రతకు కూడా ప్రాధాన్యం ఇచ్చాడు. తర్వాత ఆకులు పట్టుకోవడం కన్నా మంచిదేగా.

  మెచ్చుకోండి

  1. విన్నకోట నరసింహారావుగారు,
   ఇలా ఖాళీగా వేచి ఉండే చోట్ల కాలం గడపడానికి ఇటువంటి చిన్నచిన్న ప్రక్రియలు చేస్తుంటా! అక్కడ చేరిన మనుషులను బట్టి, వయసు, చుట్టూ ఉన్నవారిని బట్టి. అలా చేసిందే ఆరోజు అక్కడ. మీరన్నమాట నిజం, సాధారణంగా మనుషులు ఒకే విషయానికి వివిధ రకాలుగా ఎలా స్పందిస్తారు అన్నది చూడాలనిపిస్తుంది, నాకు.
   ధన్యవాదాలు.

   మెచ్చుకోండి

వ్యాఖ్యలను మూసివేసారు.

%d bloggers like this: