శర్మ కాలక్షేపంకబుర్లు-గోల గోవిందరాజులుది…..

Posted on మార్చి 15, 2013
6

గోల గొవిందరాజులుది…..

“గోల గోవిందరాజులుది సొమ్ము శ్రీనివాసుడిది” అని ఒక నానుడి, మన తెనుగునాట అనుశృతంగా వినపడుతున్నదే. దీనికి పూర్వ కధ కూడా ఉంది. శ్రీనివాసుడికి పెళ్ళి పద్మావతీ దేవితో నిశ్చయం చేసింది, వకుళమాత, ఆకాశరాజుతో మాటాడి.. పెళ్ళి నిశ్చయం చేసేరే కాని, ఖర్చులికి కాణీ కూడా లేదు శ్రీనివాసుడి దగ్గర, తల్లి వకుళమాత దగ్గర. ‘డబ్బు లేకుండా పెళ్ళవుతుందా?’ “ఇరుసున కందెనబెట్టక పరమేశుని బండి యైన బారదు సుమతీ” అన్నారు కదా! ‘మరి పెళ్ళి ఖర్చులెలా?’ ‘పెళ్ళి ఎవరిది?’ ‘ శ్రీనివాసునిది,’ ‘ఎవరాయన?’ ‘అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు.’ ‘పెళ్ళి ఎవరితో?’ ‘సాక్షాత్తు శ్రీ లక్ష్మీదేవితో, పద్మావతీ రూపంలో,’ పెళ్ళి ఎంత ఘనంగా చేసుకోవాలి, మరి కాణీ కూడా లేదే ఏంచేయాలంటే, అప్పు చేస్తేనో అనే ఆలోచనొచ్చింది. ఆలోచనయితే భేషుగ్గానే ఉంది కాని శ్రీనివాసుడంతవాడికి అప్పివ్వగలవాడెవరు? లోకానికి పెట్టుబడిదారు, యక్షుడు, ఉత్తర దిక్కుకి అధిపతి, మహారాజు అయిన కుబేరుడిని అడిగితేనో, అనుకున్నాడు స్వామి. అప్పు కావాలంటే ఇచ్చేవాడిదగ్గరకి వెళ్ళక తప్పదని, శ్రీనివాసుడే అప్పుఅడిగితే, కుబేరుడు, ‘అయ్యో! అదెంత భాగ్యం ప్రభూ!, మీరు అప్పుకు రావడమే మాకు గొప్ప, తమరిదయ ఉంటే చాలదా?’ అని నేటి అప్పుపెట్టేవారు మాటాడినట్లే మాటాడి వడ్డీ చూచాయగా చెప్పి, వడ్డితో అసలు, తీర్చేందుకు గడువు కలియుగాంతం షరతు మీద, కుబేరుడు అప్పు ప్రమాణ పత్రం (ప్రామిసరీ నోటు)రాయించుకుని సొమ్మిచ్చాడు. మరి సాక్షులెవరో చెప్పలేను. చూశారా! ‘పేకాట పేకాటే పెద్దన్నయ్య పెద్దన్నయ్యేనని’ ఒక నానుడి ఉంది తెనుగునాట. అలా కుబేరుడు వడ్డి మాటాడుకుని, కాలం మాటాడుకుని, పత్రం రాయించుకుని మరీ ఇచ్చాడు అప్పు,అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడికి కూడా, అదీ వేంకటేశ్వరుని పెళ్ళికి. అప్పు పుట్టేసింది, ఇంకేం లోటూ, బ్రహ్మాది దేవతలు దిగిపోయారు, పెళ్ళి చేయించేశారు, దివ్యంగా,పప్పన్నాలు తినేశారు. చేతులు దులుపుకుని వెళిపోయారు. ఇప్పుడు ఎవరు మిగిలారు ‘వేంకటపతి+ అప్పు+సాక్షాత్తు శ్రీలక్ష్మీదేవి, పద్మావతి రూపం లో భార్యగా’. ‘మా అమ్మ, చిన్నతల్లిని’ అప్పు తీర్చెయ్యమని అడగలేడు,వేంకటాధీశుడు, భార్యని ‘మా అమ్మ చిన్నతల్లిని,’ అప్పు తీర్చమని అడగడానికి నామోషీ కదా! అమ్మ మాటాడదు, అయ్యవారు చేసిన అప్పు, వారు చెప్పకుండా తీర్చేస్తే వారి పరువుకు భంగం కదా! వారిని అవమాన పరచినట్లు కదా!. పెద్ద చిక్కొచ్చి పడింది, వడ్డి అయినా కట్టాలికదా! మార్గం ఏంటీ? అంటే కలియుగం లో పాపులు కనపడ్డారు. అందుకే ఆయన తన పేరు “వేంకటపతి” అని ప్రకటించుకున్నారు, అంటే అర్థం వేం=పాపములు, కట= నశింప చేసేవాడు. ‘పాపం ఎక్కడ ఆశ్రయించుకుని ఉంటుంది కలియుగంలో,’ ‘జుట్టు దగ్గర, డబ్బు దగ్గర’. అందుకు వేంకట నాయకుడేం చేసేరు? ఒక చెయ్యి రొంటి మీద మరొకచెయ్యి వరద ముద్రలో తన పాదాలు చూపిస్తూ నిలబడ్డారు. నా పాదాలను ఆశ్రయించండి, మీపాపాలని దహింపచేస్తానని ప్రతిన పూని నిలబడ్డారు స్వామి. మీ పాపాలను నశింపచేసి కష్టాలను మొలలోతులో గడిచేలా చేస్తానని ముద్ర పట్టేరు. అదిగో అప్పటినుంచి మాటమీద నిలబడే ఉన్నారు, స్వామి. ఇంకేం పాపులకు, పాపాలకు లోటా కలియుగం లో, భక్తులు వస్తూనే ఉన్నారు, సొమ్ము ముడుపుకడుతూనే ఉన్నారు, తలలు బోడులూ చేయించుకుంటున్నారు, కాని తలపులు బోడులు కావటం లేదు. మళ్ళీ వెనక్కి వెళుతున్నారు, ఎందుకు? పాపం చేయడానికే. ఇలా సొమ్ము పోగు పడుతోంది. స్వామివారేం చేసేరు? పోగుపడిన సొమ్ము నుంచి కుబేరునికి వడ్డీ తీర్చమని, అన్న గోవిందరాజస్వామిని కోరేరు. తమ్ముడు శ్రీనివాసుని మాట కాదనలేక అన్న గోవిందరాజస్వామి, కుబేరుడికి వడ్డీగా కాసులు కొలవడం మొదలు పెట్టేరు. ఎంత కొలిచినా వడ్డీ తీరడం లేదు, అలసిపోయిన గోవిందారాజ స్వామి, కొలిచే కుంచమే తలకింద పెట్టుకుని సేదతీరేరు. అదిగో అలాగే దర్శనమిస్తారు స్వామి, తిరుపతిలో. మరి గోల సంగతేమంటారా? శ్రీనివాసుని అంతేవాసులు, క్షేత్రపాపులు గోల పెట్టడం మొదలెట్టేరు, గోవిందరాజులు కొలిచేస్తున్నారు, కాసులు, బాబోయ్! అని, ఇంతకీ గోలెందుకు? సొమ్ము వడ్డిగా కొలిచేస్తే తమకు దారేదీ అని, అందుకు కాసులు కొలిచేస్తున్నారు, బాబోయ్ అని అనటం తో సొమ్ము శ్రీనివాసుడిది, గోల గోవిందరాజులుది, సొమ్ము కొలిచేస్తున్నాడన్నవాదు గోవిందరాజులికి మిగిలిపోయాయంటారు.

నేడేం జరుగుతోందీ! జనతా జనార్దనుడి సొమ్ము, లోక కల్యాణానికి ఖర్చుపెట్టవలసినది, గోవిందరాజులు రూపం లో అధికారులు, రాజకీయ నాయకులనే కుబేరులకి కొలిచి పెట్టేస్తున్నారు,తప్పుడు లెక్కలతో, ఎందుకూ అంటే వారి స్వార్ధం కొంత, ఎదుటి రాజకీయనాయకుడి దగ్గర తమ అధికారం కించ పడిపోతుందేమో, రేపు మంచి పోస్టింగ్ ఇవ్వరేమో, ఎవడు చూడొచ్చాడు, ఇప్పటివరకు ఎన్ని జరగలేదు, స్వతంత్రభారతంలో, అందరూ చేస్తున్నారు, మనం చేస్తే తప్పొచ్చిందా? అని కొలిచి పెడితే కొంపలంటుకుంటున్నాయి…జైలూ, బైలూ మధ్య నలిగిపోతున్నారు, మహారాజులా/మహారాణీ లా సలాం కొట్టించుకోవలసినవారు, బుర్రదించుకుని కెమేరాలను తప్పించుకోవలసి వస్తోంది. దీనికి ఆడ, మగ తేడా కనపడటం లేదు…అందుకే చుట్టయినా మెట్టదారి మేలని,సత్యమేవ జయతే అని, మంచి మంచిని పెంచుతుందని మనవారు చెప్పినమాటలు అబద్ధం కాదండోయ్! సాక్షాత్తు జనతా జనర్దనుడే గోల పెడుతున్నాడు, ‘గోవిందరాజా! తప్పుగా కొలిచెయ్యకు’ అని. కుబేరుడేం చేస్తున్నాడు పీకలమీద కొస్తే ‘మీ గోవిందరాజులే వడ్డీ లెక్కలుకట్టి కొలుస్తున్నాడు, నాదేం తప్పులేదం’టున్నాడు, మీదు మిక్కిలొస్తే నాలుగేళ్ళు జైలూ, బెయిలూ మధ్య తిరిగి మళ్ళీ వడ్డి వ్యాపారం చేసుకుంటున్నాడు,ఎన్నికవుతున్నాడు. నిజంగా గోవిందరాజులే గోలపడి జైలూ, బైలూ మధ్య తిరుగుతూ ఉద్యోగమూ పోయి, సొమ్మూ పోయి, పరువూ పోయి, సర్వం పోయి గోల పడిపోతున్నాడు కదా! నిజంగా గొవిందరాజులే గోలపడుతున్నాడు. గోవిందరాజా! గోల మిగుల్చుకోకు.

రచయిత: kastephale

A retired telecom engineer.

6 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-గోల గోవిందరాజులుది…..”

  1. ఇవి కాగితం పూలు కదండీ, మీరు పెంచుతున్నారా లేక నర్సరీల్లో ఉన్నాయా? మావైపు కనపడటమే లేదు ఈ చెట్లు ఇప్పుడు

   మెచ్చుకోండి

   1. Arunగారు,
    ఈ కాగితం పూల మొక్కలకి ముళ్ళుంటాయి, మొండి జాతి. ఒక కొమ్మ పాతినా బతికేస్తుంది. మాకు బహు దగ్గరగా ఉన్న కాలేజిలో వీటిని అందంగా పెంచుతారు, వాటి ఫోటోలివన్నీ
    ధన్యవాదాలు.

    మెచ్చుకోండి

  2. ఉషగారు,
   మీరన్నట్టు గోవిందా అంటుంటారు, గోలగోలగా 🙂 (వేంకన్నకు గోవిందిడనే పేరు, గోవిందరాజులదీ అదే పేరు, అన్ని పేర్లూ ఆయనవే.) గోవిందా అంటూ గోవిందరాజుల్ని తలుచుకుని ముడుపు వేంకన్నకి వేస్తారు 🙂

   తిరుపతిలో గోవిందరాజులు గుడిలో విగ్రహం తలకింద చెయ్యి పెట్టుకుని పడుకున్నట్టు, తలకింద ఒక కుంచం కనపడతాయి. ఆ కుంచం గురించి ఈ కథ చెబుతారు అక్కడ.
   ధన్యవాదాలు.

   మెచ్చుకోండి

 1. గురువు గారు, మొన్నామధ్యన మీరు తిరుపతి వెళ్లి స్వామిని దర్శనం చేసుకొని వచ్చినట్టు వ్రాసారు. అప్పటినుంచి మీరు ఏడుకొండలవాడి గురించి, యాత్రావిశేషాలు ఇంకా ఏమి వ్రాయలేదేమిటని ఎదురుచూస్తున్నా. నా మనస్సు చదివినట్టే, పోస్ట్ వచ్చేసింది. ఇంకేమి చెప్పను, స్వామి దయ, ఆపైన మీ దయ పుష్కలంగా ఉండాలని……….

  మెచ్చుకోండి

  1. అన్యగామిగారు,
   ఈ బ్లాగులో వన్నీ పాత టపాలేనండి, నాలుగేళ్ళకితం స్వామిని దర్శించినప్పటిది.
   అంతా అమ్మ దయ, మీ అభిమానానికి,
   ధన్యవాదాలు.

   మెచ్చుకోండి

వ్యాఖ్యలను మూసివేసారు.

%d bloggers like this: