శర్మ కాలక్షేపం కబుర్లు-మరుస్తున్న కొన్ని కూరలు, పళ్ళు,చిరుతిళ్ళు

Posted on మార్చి 16, 2013
33
మరుస్తున్న కొన్ని కూరలు, పళ్ళు,చిరుతిళ్ళు

నేతి బీర

  పై ఫోటో లోది నేతి బీరకాయ. ఇది వాడకం తక్కువే. దీనిని తెలగపిండితో కలుపుకుని వండుకుంటే బాగుంటుంది. పాలిచ్చేతల్లులకు మంచి ఆహారం. పిల్లలకు పాలు సమృద్ధిగా వుంటాయి.

చెమ్మ చిక్కుళ్ళు

వీటిని చెమ్మ చిక్కుళ్ళు అంటాం. వీటిని బాగాలేతగా ఉండగా బెల్లం తో కూర వండుకుంటే చాలా బాగుంటుంది. దీనిలో పీచు పదార్ధం ఎక్కువ, చిన్న ప్రేవులను శుభ్రం చేస్తుంది.ముదిరిన కాయలో గింజ ఒక్కొకటి ఒక అంగుళం పైన పొడవుంటుంది. మంచి మాంసకృత్తులనిస్తుంది. తీగ జాతికి చెందినది.

రాబాళం పండు అనే రామాఫలం

పై చిత్రంలో రాచ ఉసిరి కాయలు, రామాఫలం, మరొక పక్క వేరు శనగ కాయలు కనపడుతున్నాయి కదా. మధ్యలో రామాఫలం లో గింజలు తక్కువగా ఉంటాయి, పండు నిండా తీయని గుజ్జే. కొద్ది వాసన ఉంటుంది. మంచి పండు. సీతాఫలం లాటిదే, లక్ష్మణ ఫలం కూడా ఉంది, ఈ సారి దొరికితే పొటో తప్పక పెడతా. దీనిని గ్రామీణులు రాంబాళం పండు అంటారు. ఇది రామాఫలం.అల్లి పళ్ళు అని చిన్నవి నల్లగా ఉన్న పళ్ళు దొరుకుతాయి. అవి కూడా కనపడితే తప్పక చెబుతా.

చేమ ఆకులు

మీరు చేమ చూసి ఉండచ్చు, తినీ ఉండచ్చు, వేయించుకుని ఉప్పూ కారం జల్లుకుని తింటే బాగా ఉంటుంది. చేమ నాకు బాగా ఇష్టం, నాఇల్లాలికి రామాఫలం ఇష్టం, ఇద్దరం కలిసి ఈ రెండిటినీ గయలో వదిలేశాం. చేమ ఆకులు చూసి ఉండరు. చేమ ఆకులు ఇలా పెద్దవిగా ఉంటాయి. వీటిని సన్నగా తరిగి పులుసుపెట్టుకుంటే చాలా బాగుంటుంది. మంచి ఆకు కూర.

మామిడి కాయలు, పిందెలు

ఇక్కడ లేత మామిడి కాయల్ని పిందెలను చూస్తున్నారు కదా! ఇందులో కాయలయితే పప్పులో వేసుకోడానికి బాగుంటాయి, బాగా ముదిరిన కాయ పప్పులోకి బాగోదు. ఇక పిందెలున్నాయి చూడండి, వీటిని సన్నగా తరిగి మెంతి కారం లో కలిపి వేసుకుంటే, పప్పుతో పాటు నంజుడికి బలేగా ఉంటాయి. ఈ లేత పిందెలు పులుపు ఉండవు కాని కొద్దిగా వగరు ఉంటుంది. ఆ వగరు ఒంటికి మంచిది, మరెలాగా వగరు తగలదు. ఈ పిందెలు మీకు దొరకడమే కష్టం లెండి. ఉసిరికాయ, చిన్నవి, రాచ ఉసిరి కాయలతో కూడా మెంతి బద్దలేసుకోవచ్చు.

గుమ్మడి వడియాలు

వీటిని గుమ్మడి వడియాలంటారు. కలగలుపు పప్పు లోకి, పచ్చిపులుసు వడియాలు కలుపుకుని పచ్చిపులుసు చేసుకుంటే బాగుంటాయి. బూడిద గుమ్మడితో చేస్తారు, బూడిద గుమ్మడిని కూష్మాండం అంటారు, ఈ కూష్మాండ లేహ్యం జ్ఞాపక శక్తిని పెంచుతుంది.మరి వడియాలు కూడా అంతేగా. పళ్ళు లేని నా లాటివారికి ఇబ్బందే, నమలడం.
వీటిని చల్ల మెరపకాయలు లేదా ఊరు మెరపకాయలంటాం.వీటిని కూడా భోజనం లో చేర్చేరు మనవాళ్ళు. పప్పుతో బాగుంటాయి. కారం తినడం మంచిదన్నారు.వీటిని పుల్లటి చల్లలో నానబెట్టి ఎండబెట్టి మళ్ళీ నానబెట్టి తయారు చేస్తారు. వీటిని కొద్దిగా మజ్జిగలో చింతకాయలు తొక్కి వేసిన దానిలో కూడా వేసి తయారు చేస్తారు. అవి మాత్రం కొద్దిగా పులుపు కారంగా ఉంటయి. పూర్తిగా చల్లలో వేసినవి కమ్మగా ఉంటాయి.

వీటిని సగ్గుబియ్యం వడియాలంటారు. పెట్టుకోడం తేలికే. వేయిచుకుని తింటే చిరుతిండిగా బాగుంటాయి

పెట్టుకోలేమంటారా? కొన్ని ప్రయత్నం చేసి పెట్టుకోవచ్చు. మిగిలినవాటిని మీరు కోరితే పల్లెలనుంచి తెచ్చి అమ్మడానికి సిద్ధంగానే ఉంటారు, ప్రయత్నించండి. బాగుంటేనే కొంటామని చెప్పండి, చక్కగా తయారు చేసి తెస్తారు, మీకు ఉపయోగం, మరొకరికి పని కల్పించి, జీవనాధారం ఏర్పాటు చేసినవారవుతారు కదా!

జంక్ కంటే మంచిది,ఆలోచించండి 🙂

రచయిత: kastephale

A retired telecom engineer.

8 thoughts on “శర్మ కాలక్షేపం కబుర్లు-మరుస్తున్న కొన్ని కూరలు, పళ్ళు,చిరుతిళ్ళు”

 1. రామాఫలం ఎప్పుడూ తినలేదండి – అలాగే చేమ ఆకుల గురించీ వినలేదు. ఈసారి ఇండియా వచ్చినప్పుడు దొరుకుతాయేమో చూడాలి. నొరూరించింది మీ ఈ పోస్ట్.

  మెచ్చుకోండి

  1. రామాఫలం ఇండియాలో ఉన్నత కాలం నేను చూడలేదు. కానీ ఈమధ్యనే మాఆవిడ చూపెట్టి కొనిపించింది. కొంచెం సీతాఫలానికి దగ్గరగా రుచి ఉండి బావుంది. లలిత గారు, మీకు దగ్గరలో whole foods market ఉంటె వాళ్ళు అప్పుడప్పుడు అవి తెప్పిస్తారు. వీలుంటే చూడండి.

   మెచ్చుకోండి

   1. అన్యగామిగారు,
    రామా ఫలం తమిళనాడు నుంచి తెప్పిస్తున్నారు, గో జిలలో పండుతుంది. లక్ష్మణ ఫలం మాత్రం దొరకలేదు. కేన్సర్ మందుగా ఎక్కువగా వాడుకలోకొచ్చాయి రెండు పళ్ళూ.
    ధన్యవాదాలు.

    మెచ్చుకోండి

  2. అమ్మాయ్ లలితా

   రామా ఫలం, లక్ష్మణ ఫలం ఉన్నాయి. పండు హృదయం ఆకారంలో ఉంటుంది, పండు నిండా గుజ్జే, గింజలు తక్కువ. తియ్యగా ఉంటుంది, కొద్ది వాసనుంటుంది, కొంతమంది తినలేరు,వాసనవెగటుకి. లక్ష్మణ ఫలం మన ప్రాంతంలో దొరకదు. ఈ రెండు పళ్ళూ కేన్సర్ నిరోధకాలు, కేన్సర్ కి మందు అంటారు.

   పల్లెలో పుట్టి పెరిగిన వారికే చామా ఆకులు తెలియదంటే, కారణం ఉంది. ఇది లేనివారి ఆహారం, వీటిని తరిగి పులుసు పెట్టుకుంటాం, అలాగే చింతచిగురు,ములగాకు,బచ్చలి,చికిలింత చిగురు,గల్జేరు, చాలా వాటిని వాడుతుంటాం, కూరలకి పచ్చళ్ళకి.
   ధన్యవాదాలు.

   మెచ్చుకోండి

 2. ఈ మధ్య మాకు మునగాకు దొరికింది.గూగులమ్మని కూర ఎలా చేయాలో అడిగితే మీ సైటు చూపించింది. మళ్ళీ ఆ లంకె దొరకలేదు. ఆకూ వలిచి ఫ్రీజర్ ల పడేయటం అయింది 🙂 ఒకసారి మళ్ళీ పబ్లిష్ చేయగలరా.

  మెచ్చుకోండి

వ్యాఖ్యలను మూసివేసారు.

%d bloggers like this: