శర్మ కాలక్షేపంకబుర్లు-మిథునం అద్భుతః (బాపు గారి స్వదస్తూరితో)

Posted on మార్చి 19, 2013
26

mithunam   పై క్లిక్ చేసి కధ చదవండి.(బాపు గారి స్వదస్తూరితో)

Courtesy C.V.L.N.Ravi kumar

మిథునం అద్భుతః

“మిథునం సినిమా చూడు బాబాయ్” అన్నాడు, అబ్బాయి,ముంబాయి నుంచి. “ఏదిరా! చూదామని కూచుంటే కరంటు వాడికి కన్ను కుట్టిం”దంటే మర్నాడు బ్లాగ్ లో పెట్టేసేరు జిలేబి గారు. ఇల్లాలితో కలిసి చూశా, “సంబడమే, బానే ఉంది, మీ నిరవాకమే” అంది ఇల్లాలు. నిన్న అబ్బాయి పిలిచి “బాబాయ్! సినిమా చూశావా?” అన్నాడు. “చూశానయ్యా!” అంటే “ఎలా ఉంద”న్నాడు “అద్భుతః” అన్నా, గలగలా నవ్వేడు. అప్పుడన్నాడు “బాబాయ్! బాపూ గారు స్వహస్తాలతో రాసిన కధని స్కేన్ చేసి దాచుకున్నా,” అన్నాడు.నాకు ఆనందంతో నోట మాట రాలా. మన సంస్కృతిని తరవాత తరాలు జాగ్రత్తగానే చూస్తున్నాయని ఆనందమయ్యింది. “ఒరే అబ్బాయ్! నాకు పంపవురా” అన్నా. “చూసి పంపుతానేం” అన్నాడు. భోజనం చేస్తోంటే కోడలు సెల్ ఫోన్ తెచ్చి ఇచ్చింది, “బావగారి దగ్గరనుంచి” అని. “బాబాయ్! పంపేను చూడు” అన్నాడు. అక్కడినుంచి ప్రారంభమయ్యింది నా ఆరాటం. రెండు మెతుకులు కొరికి వెళ్ళబోతూంటే “ఎందుకంత కంగారూ! అదెక్కడికీ పారిపోదు కాని, ముందో రెండు ముద్దలు తినండి” అంది. అబ్బే లోపలికి పోనిదే. ఆత్రంగా కంప్యూటర్ దగ్గరకొచ్చి ఆన్ చేయగానే తాతా! అని ఒంటిపూట బడికి వెళ్ళొచ్చిన మనవరాలు కంప్యూటర్ ఆక్రమించింది. మనవరాలుని కాదనగలనా? అది నా బలహీనత. ఎప్పుడు ఖాళీ చేస్తుందా అని చూస్తూ కూచున్నా. ఎప్పుడో తెలియకుండానే కునుకు పట్టేసింది. మెలుకువొచ్చి చూస్తే, కరంటు ఉంది, కంప్యూటర్ కట్టేసింది, మనవరాలు. బాగుందనుకుని ముఖం కడుక్కొచ్చి కంప్యూటర్ ముందు కూచుంటే, చిటుక్కున కరంట్ పోయింది. ఏం చేయడానికీ తోచక మామిడి చెట్టు పనస చెట్టు మధ్య తిరుగుతుంటే “పందిరేద్దాం రమ్మ”ంది,ఇల్లాలు. ఎండ కోసం, నిన్న మొదలెట్టిన తాటాకుల పందిరెయ్యడం అయ్యింది కాని కరంటు రాలేదు, ఒక కన్నటే పడేసి ఉంచినా. అమ్మయ్య ఆరు గంటలకి కరంటు వచ్చింది. కంప్యూటర్ ఆన్ చేస్తే ఏమీ లేదు, ఏదో అయిపోయింది, ఏం చేయాలి, “తగలేసే”వని తిడతాడేమో అబ్బాయని, బెరుకుతో కూచున్నా. అబ్బాయొచ్చాడు, రాగానే చేరేసింది వార్త ఇల్లాలు, అబ్బాయొచ్చి చూసి “ఏం పాడవదు నాన్నా! కంగారు పడకండి” అని విప్పి, తుడిచి ఏదో చేసి మొత్తానికి పని చేయించాడు. ఈ లోగా కరంటు పీకేశాడు మళ్ళీ. అరగంట తరవాతిచ్చాడు, ఆన్ చేస్తే మళ్ళీ మొదలికొచ్చింది. “చూడు నాయనా” అని తప్పుకున్నా. అబ్బాయి కట్టేసి “ఇందులో చిన్న బేటరీ ఉంటుంది అది పోయింది, తెచ్చివేస్తా, ఈలోగా స్నానం చేసి రండి” అని బయటికెళ్ళేడు బేటరీ తేవడానికి. స్నానం చేసివచ్చేటప్పటికి తెచ్చి వేశాడు. అమ్మయ్య! సమస్య తీరిందని చదవబోతే కరంటు మళ్ళీ పీకేశాడు. హతవిధీ! ఎందుకిలా జరుగుతోందనుకుంటే, “కొంత మందికే పోయింది కరంటు, ఎల్.ఐ గారికి ఫోన్ చేశాము, పంపుతామన్నారు” అంది, కోడలు నా బాధ చూడలేక. “సరిలేమ్మా” అని, రెండు మెతుకులు కొరికి కధ చదివేటప్పటికి ఇదిగో ఈ సమయమైంది,రాత్రి తొమ్మిది. మరి నిద్దరొచ్చేస్తుందికదా! మంచమెక్కేసేను. “ఎందుకంత తాపత్రయం?” అంది ఇల్లాలు. దానికేం తెలుసు పిచ్చిది… బాపూ గారు చేతితో రాసిన కధ, భరణిగారు తీసిన సినిమా ఒక చోట పెట్టాలని నా తాపత్రయం.

రచయిత: kastephale

A retired telecom engineer.

%d bloggers like this: