శర్మ కాలక్షేపంకబుర్లు-ఒంటిపూట బడి.

Posted on మార్చి 23, 2013
14

   మార్చ్ నెలవస్తే ఒంటిపూట బడిపెట్టేవారు, అప్పటికి ఎండలు ముదురుతూ ఉంటాయి, ఉదయమే తరవాణీలో చద్దెన్నం ఆవకాయ, ఉప్పు, నూని,వాము కలుపు తినేసి ఎనిమిదికి బడికి పరిగెడితే పన్నెండు దాటిన తరవాత వదిలేస్తే, ఇంటికి చేరేవారం. అప్పుడు పిల్లలు ఎండబారి పడకుంటారని చేసిన నిర్ణయమనుకుంటా, ఈ ఒంటిపూట బడులు. ( నిజానికి ఇంగ్లీషులో వీటిని మార్నింగ్ స్కూల్స్ అంటారు) ఇప్పుడు ఒంటిపూట బడి అని మధ్యాహ్నం పెడుతున్నారు, ఉదయం మరొకరికి పరీక్షలని,అసలు ఉద్దేశం వెనకపట్టేసింది.

చిన్నపుడు ఒంటిపూట బడులంటే బలే ఆనందంగా ఉండేది, పొద్దుటే బళ్ళోకెళ్ళివచ్చేసి, మధ్యాహ్నం పెద్దాళ్ళు పడుకోండిరా అంటే, వాళ్ళు పడుకునేదాకా కాస్త మసలి, ఆ తరవాత నెమ్మదిగా తలుపుతీసుకుని బయటికిపోయి మామిడి చెట్లకిందో, సీమచింత చెట్ల కిందో కాలక్షేపం చేయడం,కోయిల కూతలికి తాడితోపుల్లో సమాధానంగా కూ అని కూయడం, ఎవరేనా దొరికి ముంజికాయలు కొట్టిస్తే హాయిగా భోంచేసి, సాయంత్రం పడి ఇంటికి చేరడం, పేకావారమ్మాయితో పెళ్ళి చేయించుకోవడం, ఆ తరవాత గోదావరిలో పడి ములుగీతలు ఈదుకుంటూ సాయంత్రం గడపడం బహు ఆనందమైన సమయం. ఇప్పటివాళ్ళకి ఈ ఆనంద క్షణాలున్నాయో లేదో చెప్పలేను.సంవత్సరం మొత్తం మీద నాకు నచ్చినది వేసవి కాలమే 🙂 అన్ని పళ్ళూ వస్తాయి తినడానికి,మామిడి, పనస, వగైరా మల్లెలుంటాయి, మత్తెక్కిస్తూ, మొల్లలు వెనకపడతాయి, ప్రతి చెట్టూ పూస్తుంది, పూత మీద అన్ని పువ్వులూ ఆనందాన్నిస్తాయి, సువాసన వెదజల్లుతాయి. నిమ్మమొక్క పూస్తే బలే సువాసన, టేకి పువ్వు బలే సువాసన,పనసపువ్వు వాసనబలేగా ఉంటుంది, ఆఖరికి నీలగిరి చెట్లనే యూకలిప్టస్ పువ్వు కూడా బలే సువాసన, అందుకే నాకు వేసవి కాలం ఇష్టం.

మరి అటువంటి వేసవిలో మార్చ్ 21 కి ఒక ప్రత్యేకత ఉంది. అది తెలుసుకోవాలంటే కొంచం వెనక్కి వెళదాం.

ఉత్తరాయణం, దక్షణాయణం తెలుసుకదా! ఉత్తరాయణం లో మార్చ్ 21 వ తారీకు నాడు సూర్యుడు భూమధ్య రేఖ మీద ఉంటాడు. ఇలాగే మరొక రోజు సెప్టెంబర్23 వ తారీకునా ఉంటాడు, అంటే సరిగా ఆరు నెలలతరవాత. అయితే ఏమిటిట? అంటే ఈ రోజులలో భూమి మీద సూర్య కాంతి మూలంగా పగలు రాత్రి సమానంగా ఉంటాయి. వీటినే మనవారు విషువత్తులు అన్నారు. ఇహ పోతే నాకూ అలవాటయిపోతున్నాయి ఊతపదాలు 🙂 ఒక చోట ఉన్న సమయం మరొక చోట ఉండదు భూమి పై. కారణం చూస్తే,సూర్యునికి అన్నిచోటులు, అన్ని సందర్భాలలో అభిముఖంగా ఉండవు కనుక. భూమికి ఉన్న రెండు ధృవాలనుంచి ఒకదాన్ని ఒకటి కలుపుతూ ఊహా రేఖలు గీసేరు వాటిని లాంగిట్యూడ్స్ అక్షాంశాలంటారు. వీటిని గ్రీనిచ్ నుంచి మొదయినట్లుగా అక్కడ మొదలుపెట్టేరు (౦ డి)దీని ప్రత్యకత ఏమీ లేదు, నాడు బ్రిటన్ ప్రపంచం లో చాలా దేశాలను ఏలింది కనక. అక్కడినుంచి తూర్పుగా 180 పడమరగా 180 ఊహారేఖలు గీస్తే ప్రతి ఊహారేఖ మధ్య సూర్యుడు చలించే కాలం నాలుగు నిమిషాలయింది 24×60=1440ని. ఈ నిమిషాలు 1440/360=4ని.ఇప్పుడు ఒక అక్షాంశం మధ్య సూర్యుడు పయనించే సమయం తెలిసింది కదా. దీనితో ఒక చోట కావలసిన సమయంలో, కావలసిన చోట, ఎంతసమయం అవుతుంది అన్నది లెక్కించుకోవచ్చు. భూమి పడమటి నుంచి తూర్పుకు తిరుగుతోంది కనక, తూర్పుదేశాలలో సమయం కంటే పశ్చిమదేశాలలో సమయం వెనక ఉంటుంది. అట్లాస్ లో చూసి మన సమయానికి మరొక సమయానికి తేడా గమనించవచ్చు. కాని ఇక్కడొక చిక్కుంది. తెలివయిన దేశాలు వాటి సమయాన్ని అదే ప్రామాణిక సమయాన్ని అసలు సమయంకంటే ముందుకొ వెనక్కో జరుపుకుంటాయి, ఎందుకంటే, వారి పనులు వెలుగుండగా చక్కపెట్టుకోడానికి, కరంటు ఆదా చేసుకోడానికీ. ఉదా: సింగపూర్ సమయం మనకంటే ఒక గంటన్నర ముందుంటుంది, మనకి తూర్పున ఉంది కనక, కాని వారు వారి సమయాన్ని మరొక గంట ముందుకి జరుపుకున్నారు. నిజానికి మనదగ్గర ఉదయం ఐదు ఐతే వారి దగ్గర ఆరున్నర కావాలి, కాని దానిని ఏడున్నరగా మార్చుకుని ఉపయోగించుకుంటున్నారు. ఇలాగే మరిన్ని దేశాలూ. అ.సం.రాష్ట్రాలలో నాలుగు ప్రామాణిక సమయాలున్నాయని మా అమ్మాయి చెప్పింది. అప్పటికి నాకు రెండే ఉన్నట్లు తెలుసు. మన దేశ ప్రామాణిక సమయం 82 1/2 డి. తూర్పు. అంటే గ్రీన్విచ్ లో రాత్రి పన్నెండయితే మన సమయం ఉదయం ఐదున్నర గంటలు. 82 1/2 ఎందుకు తీసుకున్నారంటే సరిగా 5.30ని. తేడా ఉంటుందని. మన బడ్జెట్ సాయంత్రం మూడు దాటిన తరవాత రాత్రి సమర్పించేవారు ఆరు ఏడు గంటల సమయంలో అంటే లండన్ లోమనను పాలించిన వారి స్టాక్ ఎక్స్ఛేంజ్ పని సమయం అయిన తరవాత మన బడ్జెట్ సమర్పణ జరిగేది, ఇక్కడ. స్వతంత్రం వచ్చాకా కూడా అదే కొన సాగించారు. పాపం ఒక ఆర్ధిక మంత్రిగారు ఇదేమి దౌర్భాగ్యం అని సమయం మార్చేసేరు. ఈ సమయాల గురించి కాల్ సెంటర్ వారికి బాగా తెలుస్తుంది ( ఏంటో కాల్ సెంటర్ పేరే నాకు బాగోదు, వినడానికే)

ఇలాగే మరో రెండు రోజులు ప్రత్యేకత చూపేవి వున్నాయి. జూన్ 21 ఈ రోజు పగలు సుదీర్ఘంగా ఉంటుంది. లాంగెస్ట్ డే, సినిమా చూసుంటారు. ఇక December 21 పగలు చాలా తక్కువ, రాత్రి ఎక్కువ. ఇది దక్షణాయణం లో వస్తుంది. ఇటువంటి ప్రత్యేకతలున్న రోజులుకి మద్య కాలం సరిగా ఆరు నెలలుంటుంది చూడండి.మనవారు రోజు కాలాన్ని సూర్యోదయం నుండి మరుసటి సూర్యోదయం దాకా లెక్కిస్తారు. పడమటివారు రాత్రి పన్నెండునుండి లెక్కిస్తారు.

ఇదేంటీ ఈ టపా మార్చ్ 21 న వెయ్యాలికదా, నిజమే, ఆరోజు వేద్దామనే మొదలెట్టా. కరంటు వారి పుణ్యంతో పూర్తికాలా. నిన్నటినుంచి కరంటు స్థిరం గా ఉంది, ఎంచేతో!. మరో సంగతి నేను ఉదయం ౦5.30ని తరవాత రోజూ టపా వేసేవాడిని, ఎంచేత? ప్రపంచంలో అది అందరికి అనగా ఎక్కువ మందికి అనుకూలమయిన సమయం.దేశం లోవారికి ఇబ్బంది ఉండదు, తూర్పు దేశాలకి రోజులో కొద్దిగా గడుస్తుంది. గల్ఫ్ వారికి గంట పై సమయం లో తెల్లవారుతుంది. ఇక అ.స.రాష్ట్రాలు, కెనడా వారికి సాయంత్రం అవుతుంది. కొద్ది ఇబ్బంది మాత్రం బ్రిటన్, జెర్మనీ, వీటి దగ్గర దేశాల వారికి ఉంటుంది. కాని కరంటు వారి దయ మూలంగా రోజులో ఎప్పుడో ఒకప్పుడు టపా వేస్తే చాలనుకునే స్థితికి వచ్చేశాను. చూశారా కాలమహిమ.