శర్మ కాలక్షేపంకబుర్లు-రాజుగారి కుక్క.

Posted on మార్చి 24, 2013
6

రాజుగారి కుక్క

“కుక్క దొరికితే కర్ర దొరకదు, కర్ర దొరికితే కుక్క దొరకదు, రెండూ సమకూడితే అది రాజుగారి కుక్క” అని ఒక నానుడి ఉంది తెనుగునాట. ఏంటిది పంతులుగారూ అన్నాడు మా సత్తి బాబు, వస్తూనే. ఈలోగా అన్నగారి మాట విన్నట్లుంది ఇంటావిడ “కాఫీ తెస్తున్నా కూచో అన్నయ్యా” అని ఒక కేకేసింది లోపలినుంచి.కాఫీ పట్టుకొచ్చి అన్నగారికి నాకూ ఇచ్చింది, చూస్తూ నిలబడింది..

“ఏముందయ్యా! కుక్క ఇంట్లోకి చొరబడుతోందని కొడదామంటే కర్ర దొరకలేదు, సమయానికి, కర్ర దొరికినపుడేమో కుక్కలేకపోయింది, కర్ర అవసరం లేకపోయింది. కర్ర గుర్తుగా జాగ్రత్త పెట్టుకుని ఉంచుకుని, కుక్క వచ్చినపుడు కొడదామని చూస్తే, అదేమో మహారాజు గారి కుక్కయి ఊరుకుంది. దానికి తోలుపటకా, మువ్వలు, గంటలు, గజ్జెలు హంగు, ఆర్భాటం ఇన్ని ఉన్నాయి. అమ్మో రాజుగారి కుక్క ఇంట్లో దూరడం కాదు, ఏమైనా పాడుచేసినా నోరుమూసుకుని ఊరుకోవలసిందే కాని, కొడితే ఛచ్చేమే! మనం కుక్కని కొడితే రాజుగారు మన చమడాలు ఎక్కతీయించేస్తాడు. అంతకుమించి ఈ నష్టం భరించడమే మంచిది కదా!” అదయ్యా సంగతి అన్నా.

అప్పుడు ఇల్లాలు, “చచ్చిపోతున్నానన్నయ్యా! ఈ ఊరగాయి కారాలు ఆడించుకోడానికి” అంది ఇల్లాలు. “అదేం” అన్నాడు. “ఏం చెప్పమన్నావు నా బాధ. ఊరగాయ కారాలు ఇదివరలో ఇంటిదగ్గర కొట్టించుకునే వాళ్ళం,కారాలు కొట్టేవాళ్ళకి అరటి పళ్ళు, పానకం తయారు చేసివ్వడం, జల్లించడం, ముక్కులు చీదడం,తుమ్ములు,దగ్గులు ఇన్ని అవస్థలూ పడేవాళ్ళం. ఇప్పుడు మిల్లుకి పంపడమే, అవస్థలు తప్పేయనుకుంటే, ఇప్పుడు కొట్టేవారూ లేరనుకో,” అంటే, “పోనీ బెడద తప్పింది కదమ్మా” అన్నాడు. “బెడద తప్పడం కాదన్నయ్యా! కొత్త బెడద పట్టుకుంది, ఛస్తున్నాననుకో, మిల్లు వాడేమో ఎండలో పోసిన కాయలు ఎండనుంచి ఎత్తుకు రండి అంటాడు. అలా ఎత్తుకెళితే కరంటు ఎప్పుడుంటుందో తెలియదు, అంత కంటే ఎప్పుడొస్తుందో తెలియదంటే బాగుంటుందేమో. ఇదిగో ఇప్పటికి మూడు సార్లు తిరిగొచ్చారు మీ బావ. సాయంత్రం బడి కరంట్ ఉండగా పట్టుకెళితే అబ్బే ఇంకా ఎండాలని తిప్పి ఇప్పటికి మూడు సార్లు పంపేసేడు,” “నిన్న ఎండలో పోసిన కాయలు గలగలా ఎండేయి, పట్టుకెళ్ళేరు, తీరా మిల్లులో పోసే సమయానికి లటుక్కున కరంట్ పీకేశాడుట. మళ్ళీ మామూలే.కరంట్ ఎప్పుడొస్తుందో తెలీదు పట్టుకుపొమ్మన్నాడుట. వాడు ఎత్తి ఇచ్చేస్తే తెచ్చేసేరు. మళ్ళీ పట్టుకెళ్ళాలి,ఈ వేళ, ఈ సారయినా ఆడతాడో లేదొ తెలియదు, అంతా కరంటు వారి దయ,” అంది.

“పంతులుగారు నాకో సంగతి గుర్తొచ్చింది, మీలాటి ఛాదస్తుడే ఒక ఆఫీసరు. ఎవరిని వేస్తే ఆఫీసులో, వాళ్ళతోనే పని చేయించుకునే వాడు. మిగతా ఆఫీసర్లయితే ఫలానా వాడయితే నా ఆఫీస్ కి వద్దు అని చెప్పడం అలవాటు. ఈయన ఆఫీసుకు ఒకరిని బదిలీ ఇచ్చారు. ఆ నిక్షేపరాయుడు వచ్చి జాయినైన రోజునుంచి తిరగడం, పని ఎగ కొట్టడం తప్పించి పైలు ముఖం చూసిన దాఖలాలు లేవు. పక్కవారే ఇతని సీట్ పని సాయంపడుతున్నారు, లేకపోతే ఆఫీసరే చేసుకుంటున్నాడు. ఇలా నడుస్తుండగా ఒక రోజు పై ఆఫీసర్ పిలిచి ఈ ఆఫీసర్ ని ముక్క చివాట్లు పెట్టేడు, సమయానికి అవసరమైన సమాచారం ఇవ్వలేదని. ఎందుకిలా జరిగిందని విచారిస్తే, మన నిక్షేపరాయుడి సీట్ తాలూకు అని తేలింది.అదే కాకుండా ఈ అత్యవసర కాగితాన్ని కూడా డ్రాయర్ లో పెట్టుకుని తాళమేసుకుపోయాడు. ఆఫీసర్ కి కోపం వచ్చి ఒక మెమో ఇచ్చేసేడు, మూడు రోజులలో సమాధానం చెప్పమని. కారణాలు, పని ఎగకొట్టడం, చెప్పకుండా గైర్ హాజరు కావడం. మూడు రోజులు అయ్యాయి, వారం, పదిరోజులయినా సమాధానం లేదు, మన నిక్షేప రాయుడు నించి. దానితో ఈయనకి చిరాకొచ్చి, మరొక మెమో ఇచ్చేడు. మూడవరోజు పై ఆఫీసర్ ఫోన్ చేసి ’ఏంటండీ! కిందవాళ్ళ చేత పని చేయించుకునే నేర్పు కావాలండీ! మీకు ఎన్ని సార్లు చెప్పినా ఉపయోగం కనపడటం లేదు. మా నిక్షేపరాయుడుకి మెమో ఎందుకిచ్చారు? మెమో లిచ్చి పని చేయించుకోగలరా? నేర్పు కావాలండీ, నేర్పు,మీలాటి వాళ్ళకి బతకడం చేత కాదండీ’ అని కడిగేశాడు. పాపం ఆఫీసర్ ఏం చేస్తాడు, బిక్కముఖం వేసుకుని, ఫోన్ పెట్టేసి, మెమో వెనక్కి తీసుకున్నాడు. చెల్లెమ్మ చెప్పిన దానిలో కరంట్ వారూ, ఇక్కడ నిక్షేప రాయుడూ రాజు గారి కుక్కలే కదా?

రచయిత: kastephale

A retired telecom engineer.

%d bloggers like this: