శర్మ కాలక్షేపంకబుర్లు-తనకుమాలిన ధర్మం….

Posted on మార్చి 27, 2013
25

తనకు మాలిన ధర్మం…….

తనకు మాలిన ధర్మం, మొదలు చెడ్డ బేరం లేదన్నాడు చిన్నయ సూరి, తన మిత్ర లాభం లోనో మిత్ర భేదం లోనో గుర్తులేదు. అంటే ఏంటిటా?

ధర్మం చెయ్యాలి కాని అది తనను ముంచేసేలా ఉండరాదన్నారు, పెద్దలు. కొంతమంది ఇచ్చేటప్పుడు వెనక ముందులు ఆలోచించక ఇచ్చేస్తారు. నిజంగా వీరు గొప్పవారే! అందుకే చరిత్రలో కూడా మిగిలిపోతారు. రంతి దేవుడు, బలి చక్రవర్తి, శిబి చక్రవర్తి, వీరిలో అందునా ముఖ్యంగా చెప్పుకోవలసినవాడు ధధీచి. రంతిదేవుడు తనకున్నదంతా అతిధికి పెట్టేసి తను ఆకలితో పరమేశ్వరుని చేరుకుంటాడు, బలి చక్రవర్తి తనకున్నది అంతా, సర్వస్వం, గురువు వచ్చిన వాడు విష్ణువని చెప్పినా వినక, భవంతుని చెయ్యి కింద, దానం ఇచ్చేటపుడు నా చెయ్యి పైనుండటం గొప్పకదా! అని అంతా దానం చేసి మూడవ అడుగుకు చోటు లేకపోతే, తన తలను చూపిన మహాత్ముడు. తెలిసిచేసిన దానం. శిబి చక్రవర్తి పావురానికి ప్రాణదానం చేయడం కోసం తన తొడ మాంసం కోసి ఇచ్చిన మహానుభావుడు. ఇంతకు మించిన వాడు ధధీచి అనుకున్నాం కదా! ఎందుకు? దేవేంద్రునికి ఆయుధం కావలసివచ్చింది, ఏది మంచి ఆయుధం అంటే ధధీచి వెన్నెముకతో చేసిన ఆయుధం గొప్పది అన్నారు, వృత్రాసుర సంహారానికి. దేవతలు బయలుదేరి ధధీచి దగ్గరకు వెళ్ళి ఏమని అడిఆగేరు? అయ్యా! మా దేవేంద్రుని కి ఆయుధానికి గాను మీ వెన్నెముక కావాలీ అని. ఆయనేమన్నాడు, సరే తీసుకోండన్నాడు, అదేదో దొడ్డిలో ఉన్న చెట్టుకాయలాగ. ఆ దానం మూలంగా ఆయన తన ప్రాణాలే పోగొట్టుకున్నాడు. అందుచేత ఏం చెప్పేరంటే, దానం చెయ్యి కాని నీతాహతుకు మించిన దానం చేయవద్దన్నారు. “శరీరమాద్యం ఖలు ధర్మసాధనం,” అంటే ధర్మం చేయాలంటే ముందు శరీరం కావాలోయ్! అని

రెందవది మొదలు చెడ్డబేరం. దీన్ని చూస్తే, వ్యాపారం ఎప్పుడూ లాభం కోసమే చేయాలి. లాభం లేని వ్యాపారం జీతం లేని ఉద్యోగం చేయకూడదు. అయితే లాభం అనేది ధర్మబద్ధంగా ఉండాలి. మొదలు చెడ్డ బేరం అంటే, అసలు లాభం మాట దేవుడెరుగు, అసలు ఖరీదు కూడా రాకుండా అమ్మకం చేయకూడదట. అదే మొదలు చెడ్డ బేరం, మరి ఇదిప్పుడెందుకు చెప్పాల్సి వచ్చిందంటే…

ఏవో కొన్ని ఈ పుస్తకాల్ని జమ చేసేను. కొన్ని చదివేను, చదువుతున్నాను. వీటిని నలుగురితో పంచుకోవాలని ఆశ పడి బ్లాగులోకి ఎక్కించా కష్టపడి, కరంట్ ససిగా లేకపోయినా, ఓపికగా. ఒక లింక్ పెట్టి ఒక పాతిక పుస్తకాలు ఉంచా. అది మొదలు నాకు బాధలు మొదలయ్యాయి. 🙂 అదేంటి గ్రంధాలయం లింకిస్తే మీకు బాధేంటి అనచ్చు. అది మొదలు నా బ్లాగు నాకు కాకుండా పోయింది. ఎంత సేపూ లోడ్ అవుతుంది కాని పేజి తెరుచుకోదు. టపా వేయడానికీ కష్టపడాల్సి వచ్చింది, మూడు రోజులు బాధ పడ్డా, ఎందుకిలా జరుగుతోందని ఆలోచించా. ఊహు! కారణం తెలియలేదు. చించగా చించగా అప్పుడు బోధ పడింది.లింక్ లు పీకెయ్యడానికే కష్టపడాల్సివచ్చింది, అంత సమయం పట్టింది, బ్లాగు స్వాధీనం లోకి తెచ్చుకోడానికి. . అబ్బో! అప్పుడు అనుభవం లొకి వచ్చింది,’ కన్నుపోయేటంత కాటుక పెట్టుకోకూడదని’ నానుడి, ఇది తనకు మాలిన….ఎవరో అన్నారు…’మరో బ్లాగు’….చాల్లెద్దురూ! ‘ఈ పులుసుతో ఇ ముద్ద దిగనిద్దురూ’ మరో నానుడి. ‘ మింగ మెతుకులేదు కాని మీసాలకి సంపెంగ నూనె’ అని మరో నానుడి. ….

రచయిత: kastephale

A retired telecom engineer.

%d bloggers like this: