Posted on ఏప్రిల్ 24, 2012
5
శర్మ కాలక్షేపంకబుర్లు-అక్షయ తృతీయ-బంగారం కొనాలా-నీరు దానం చెయ్యాలా?
వైశాఖ శుద్ధ తృతీయను అక్షయ తృతీయ అంటాము. ఈ రోజు బంగారం కొనుక్కుంటే అక్షయం అవుతుందని నమ్ముతున్నాము. ఇదెలాగో తెలియదు.
మన పూర్వులు పెట్టిన, నియమాలు, పండగలకి ఒక అర్ధం, పరమార్ధం ఉన్నాయి. వాటిని మరిచిపోతున్నాము. సూర్యుడు డిసెంబరు ఇరువది ఒకటి నాటికి మకర రేఖ ( 23 1/2 డి.ద ) మీదకు వస్తాడు. అక్కడనుంచి ఉత్తరంగా కదులుతాడు, కనక ఉత్తరాయణం అన్నారు. జనవరి పదునాల్గున మనం మకర సంక్రమణం అని పండగ చేసుకుటున్నాము. మార్చి ఇరువది ఒకటవ తేదీకి సూర్యుడు భూమధ్య రేఖ (౦ డి. ) మీదకు వస్తాడు. అక్కడినుంచి ఉత్తరంగా కదులుతూ జూన్ ఇరువది ఒకటి నాటికి కర్కాటక రేఖ ( 23 1/2 డి. ఉ ) మీదకి వస్తాడు. అక్కడినుంచి మరల సెప్టెంబర్ ఇరువది ఒకటికి భూమధ్య రేఖ మీదకి వస్తాడు. అప్పుడు జూన్ ఇరువది ఒకటినుంచి దక్షణానికి కదులుతాడు కనక దక్షణాయనం అన్నారు. సూర్యుడు కదులుతాడన్నారు. నిజంగా సూర్యుడు కదలడని మన వారికీ తెలుసు. కాని సామన్యులకు అర్ధం కాదని సూర్యుడు కదులుతాడని చెప్పేరు. భూమి కదులుతుందని తెలిసినదే. అందుకే మనం సూర్యోదయం అంటాము, అనగా సూర్యుడు కనుపించడం. మన దేశం, భూమికి ఉత్తరార్ధ గోళంలో ఉన్నది. మన దేశం ( 8 డి.ఉ నుండి 36 డి ఉ ) రేఖాంశముల మధ్య ఉన్నది కనక ఇప్పటినుంచి మనకి ఎండలు ఎక్కువగా ఉంటాయి,సూర్యునికి దగ్గరగా ఉంటాము కనక, జీవుల తృష్ణ ( దాహము) తీర్చడం కోసం,నీరు లేకపోతే జీవులు నశిస్తాయి కనక, ఈ రోజు మంచినీటిని పాత్రలో ఉంచి “ఉదక కుంభ దానం” చేయాలని, చలివేంద్రాలు మొదలు పెట్టమని పెద్దలు చెబుతారు. అక్షయం అన్నదానికి అర్ధం న+క్షయం= అక్షయం అనగా నాశనము కానిది అనికదా అర్ధం. అంటే నీరు లేకపోడం మూలంగా జీవులు నశించకూడదని మన వారి ఉద్దేశం. కాని నేడు మనం బంగారం కొనుక్కుని దాచుకోవాలనే ( మృగ తృష్ణ అనగా ఎండమావి ) ప్రవృత్తిలో పడిపోతున్నాము తప్పించి జీవుల దాహార్తిని తీర్చాలనే పెద్దల సదుద్దేశం మరుస్తున్నాము. విచారణీయం.
నీటి వనరులను రక్షించుకుందాం. నీటి అమ్మకాలని నిరసిద్దాం. నీరు అమ్ముకోడం, మన సంస్కృతి కాదని చాటి చెబుదాం.మన పిల్లలకి ఈ మంచి అలవాటు చేదాం.సర్వజీవుల పట్ల కారుణ్యం చూపుదాం. జీవనదులను కాపాడుకుంటే, నీటిని కాపాడుకున్నటులే,నదుల కలుషితాన్ని నిరశిద్దాం. నీరు జీవనాన్ని కాపాడుతుంది.పర్యావరణం కాపాడబడుతుంది. నీరు దానం చేయండి. జీవితం ఎంత అవసరమో, జీవితం నడవటానికి డబ్బు కూడా అంతే అవసరం, దుబారా చేయకండి. పొదుపును మదుపు చేయండి. అవసరానికే సొమ్ము సుమా! పోగులుపెట్టడానికి కాదు, ఇది మరవద్దు. బతికినంతకాలం హాయిగా-నిర్భయంగా-శాంతితో గడుపుదాం.
బంగారం కొనండి, వద్దన లేదు. బంగారం స్త్రీ ఒంటిపై ఉన్నపుడు ఆమెకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. తరవాత మీకుటుంబానికి ఆర్ధిక పరమైన రక్షణ ఏర్పాటు చేస్తుంది. భారత స్త్రీ తన బంగారం ఇవ్వడానికి ఒప్పుకోదు, చిల్లర పనులు చేయడానికి, కాని కుటుంబం అభివృద్ధికి, అత్యవసర పరిస్థితులలో బంగారం ఇచ్చి కుటుంబాన్ని కాపాడుకుంటుంది. ప్రాణాలని పణంగా పెట్టి కుటుంబాలను కాపాడుకున్న మహిళలున్న దేశం మనది.కష్టం వచ్చినపుడు సంసారం వదిలిపెట్టి పారిపోయే మనస్తత్వం ఉన్నవారు కాదు, మన భారత స్త్రీలు. ఎన్నో సంఘటనలున్నాయి, స్త్రీలు బంగారం కొనమన్నారని బాధపడకండి, నిజమైన పొదుపు అదే. మరే పొదుపు చేసినా మీదగ్గర నిలవ ఉండదు, ఉంచలేరు, ఉంచుకోలేరు. కాని స్త్రీల దగ్గరున్న బంగారం మాత్రం మిమ్మల్ని, మీ కుటుంబాన్ని తప్పక రక్షిస్తుంది,నమ్మండి. ఇది మదుపే, ఇది మీమీద వారికున్న ప్రేమకు ఒక తార్కాణం. యు ఆర్ నాట్ డూయింగ్ ఎనీ ఫేవర్ టు దెం, దే ఆర్ డూఇంగ్ ఫేవర్ టు యు. వీలున్నంత మదుపు చేయండి.
శుభం భూయాత్.