శర్మ కాలక్షేపంకబుర్లు-ఎరువు

Posted on మార్చి 26, 2013
21

ఎరువు

ఎరువు అంటే నిలువబెట్టిన పేడ, భూసారనికి వినియోగించేది,ఎరువు ఇచ్చు, ఎరువు తీసుకొను టు లెండ్, టు బారో అని అర్థాలిచ్చాడు నిఘంటు కారుడు. మనం రెండవదాన్ని తీసుకుందాం.

ఎరువు సొమ్ము బరువుచేటు,ఇది పాతకాలపు నానుడి. ఇప్పటి రోజుల్లో “ప్రజలసొమ్ముతో పెద్దతిరపతి వెళ్ళమన్న”ట్లుగా ఇతరుల వస్తువులు వాడుకోడమే నేటి ఆధునిక నాగరిక అయిపోయిందేమో. “పెళ్ళికి పట్టు చీర ఎరువిచ్చి పీటట్టుకు తిరిగిందని” నానుడి.

వస్తువు ఎరువు కోసం వచ్చేవారు ప్రతివారు మొదట అనే మాటిదే” ఒక్కసారివ్వండి తిరిగి తీసుకొచ్చి ఇచ్చేస్తాను”. ఎరువు తెచ్చుకోడం చేబదులు తెచ్చుకోడం వంటివి చిన్నప్పటి నుంచి వచ్చే అలవాట్లేనని నా నమ్మకం. కావలసిన వస్తువులను ముందు అంచనా ప్రకారంగా సిద్ధం చేసుకుని ఉంచుకుని వాడుకోవడం అలవాటు లేని వారు చేసే పని, బదులుకి బయలు దేరడం, వస్తువు ఒకసారివ్వండి అని అడగడం. ఎరువు పట్టుకెళ్ళడం తప్పనను కాని అన్ని వస్తువులకూ, చిన్న వస్తువులకూ, రోజూ అవసరమయ్యే వస్తువులకూ అప్పుకు, ఎరువుకు బయలు దేరడమే బాగోదు.

నిత్యం కాఫీ తాగేవారు పంచదార, పాలలాటి వాటికోసం చేబదులుకు బయలుదేరడం బాగోదు కదా, అదీ తరచుగా. గేట్ లో పేపరు పడటం పాపం పక్కింటాయన గేట్ తోసుకొచ్చి పేపర్ చేత్తో పుచ్చుకుని “చూసిస్తా” అని పట్టుకెళిపోతాడు, ఏమంటాం కాదనలేం కదా. ఇది మరీ దారుణం, మన పేపరు మనం చూడకుండా పక్కవారు పట్టుకుపోవడం. పోనీ చూసి పంపుతారేమో అనుకుంటే గంటకీ లేదు పూటకీ పంపరు, మళ్ళీ మనవారెవరో వెళ్ళి తెచ్చుకోవాలి. చూసినది సవ్యంగా ఉంటుందా? గడ్డిమేటిలా చేసి అక్కడ పారేస్తే, మనం వెళ్ళి వాటిని సరిచేసుకుని,వెతుక్కుని తెచ్చుకోవాలి. మన కర్మ కాలితే, వాళ్ళ మనవడుకి కోపం వస్తే ఈ పేపరు చింపి పోగులెడతాడు, మనం మళ్ళీ కొత్త పేపరు కోసం పోవాలి,ఎండపడి. “పేపర్ చిరిగిపోయిందండీ” అంటే “పేపర్ కుర్రాడు పడేసినపుడే చిరిగిపోయి ఉంటుంది, మేము పని గట్టుకుని మీపేపర్ చింపేస్తామా? ఇంతోటి పేపర్ తెప్పించుకోలేమా? ఏంటో! మా ఇంటాయనకి మరీ బద్ధకం, ఆ కుర్రాడితో చెప్పండీ పేపరెయ్యమని అని లక్షసార్లు చెప్పేను, గుర్తుండి ఛావదు, ఈయనకి.” ఇది పక్కింటాయన శ్రీమతిగారి సన్నాయి నొక్కులు.ఈ మాట ఆవిడ నోట ఎన్నిసార్లు విన్నామో! ఓ రోజు టపా రాసుకుంటున్నా, ఓ పదిహేనేళ్ళపిల్ల వచ్చేసి, “అంకుల్ మానిక గిన్ని ఉందిట, ఇమ్మంది, అమ్మ” అంది నాకయితే అర్థంకాక ఇల్లాలిని పిలిచి “ఇదేమిటి వీళ్ళ మానిక గిన్నె నువ్వెందుకు తెచ్చా”వన్నా. “అదేం కాదు, మన మానిక గిన్నె కావాలని అడుగుతోంది, అదీ దీని భావం” అని చెప్పింది. మరో రోజు అదే పిల్ల మళ్ళీ సుడిగాలిలా వచ్చేసి “అంకుల్ “నుచ్చన” తెమ్మంది, అమ్మ” అంది. ఇదేమిట్రా నాకీ పిల్ల మాటాడీ మాటలు అర్థం కావడంలేదని ఇల్లాలిని పిలిచి అడిగితే మళ్ళీ అదే మాట “నుచ్చెన తెమ్మంది అమ్మ” అంది, “ఎందుకు” అని ఇల్లాలడిగితే “పైకి ఎక్కేందుకు అదే లేడర్” అంది మెలికలు తిరిగిపోతూ. “చిట్టి తల్లీ! అది ‘నుచ్చెన’ కాదమ్మా! దాన్ని ‘నిచ్చెన’ అంటారు, ఏదీ అను అని నాలుగు సార్లు అనిపించే ప్రయత్నం చేస్తే ప్రతిసారి ‘నుచ్చెన’ అందే తప్పించి ‘నిచ్చెన’ అనిపించలేకపోయా. నాకు మా శ్యామలీయం వారే గుర్తొచ్చారు, ఆరోజు. ఒక రోజు రెండు రోజులు వారం, ఈ నిచ్చెన తిరిగి రాలా, మానిక గిన్నెతో పాటు. ఇల్లాలు “మీరొక సారి వెళ్ళి ఆవిడకి చెప్పండి” అంది, వెళ్ళి చెప్పేను, “పంపుదామనుకుంటున్నా బాబయ్యగారూ!, పిల్లలెవరికీ ఖాళీ లేదు, పంపుతా” అంది. “వద్దు తల్లీ నేను పట్టుకెళతాలే” “అయ్యో మీరే తీసుకెళుతున్నార”ని ఒగచడమొకటీ!, తీసుకుని తీసుకొచ్చి ఇల్లాలికి అప్పచెప్పా.

చిన్న చిన్న వస్తువులు రోజూ వాడుకునేవి,పెన్,పేపర్,పౌడర్ పఫ్,దువ్వెన, అద్దం,ఇటువంటి వాటికోసం కూడా రావడం అసభ్యంగా ఎందుకనిపించదో తెలియదు.మరో చిత్రం సబ్బు కూడా పట్టుకెళ్ళేవాళ్ళున్నారు. నాకైతే మరీ చికాకే. ఇటువంటి వస్తువులు ఇంటిలో వారు కూడా ఒకరిది మరొకరు వాడటం ఇబ్బందిగానే ఉంటుంది, తువ్వాలుతో సహా..

ఓ రోజు మిత్రుని ఇంటికెళ్ళా, మిత్రుని కొడుకు కోసం ఎవరో వచ్చి, “మీతమ్ముడు నీదగ్గర బండి తీసుకెళ్ళమన్నాడు, ఒక సారిస్తే ఒక గంటలో తెచ్చేస్తా” అన్నాడు. ఇతను బండి ఇచ్చేడు, మరి అంతలో ఏం గుర్తొచ్చిందో భార్యను కేకేసి వాడు బండిపట్టుకుపోయాడని కేకలేసి సెల్ లో బండి పట్టుకెళ్ళిన వాడిని పిలిస్తే వాడు జవాబు లేదు, ఇంతే సంగతులు, ఈ కుర్రాడు మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. తమ్ముడిని పిలిచి “ఫలానా వాడిని, బండి నాదగ్గర పట్టుకెళ్ళమన్నావా?” అని అడిగితే “నాకేం తెలియద”ని అతను చెప్పడంతో ఇతను భార్యమీద కేకలేసేడు. మధ్యలో ఆమె చేసిన తప్పేమో నాకు అర్థం కాలేదు. ప్రయత్నించగా, ప్రయత్నించగా, గంట తరవాత బండి పట్టుకెళ్ళినతను మాటాడి మరో గంటలో తెస్తానని చావు కబురు చల్లగా చెప్పేడు.

పుస్తకం ఎరువు ఛచ్చినా ఇవ్వను, ఎందుకంటే శ్రీపాదవారి ‘వడ్లగింజలు’ ఎవరో ఇలాగే చదివి ఇస్తామని తీసుకెళ్ళేరు, మరి ఆ పుస్తకం తిరిగి రాలా, మళ్ళీ ప్రయత్నం మీద కాని దానిని కొనుక్కోలేకపోయా.

ప్రకటనలు

రచయిత: kastephale

A retired telecom engineer.

15 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-ఎరువు”

 1. సబ్బంటే వాడకంలో ఉన్న సబ్బా!? పరాకాష్ఠ ☹️
  పేపర్ సంగతి మీరో పని చేసి చూడరాదూ – పక్కింటి వాళ్ళు కూడా పేపర్ వేయించుకుంటారట, వెళ్లి మాట్లాడుకో అని పేపర్ వేసే కుర్రాడికి చెప్పండి 😉.

  మెచ్చుకోండి

  1. విన్నకోట నరసింహారావుగారు,
   సబ్బు పట్టుకెళుతున్నా వదినా అన్న కేక వినపడితే చూశా! బాత్ రూంలో సబ్బు పట్టుకెళుతోందావిడ. ఇల్లాలు ఊ అని ఊరుకుంది. కొత్త సబ్బివ్వచ్చుగా అంటే అదే అలవాటైపోతుందంది ఇల్లాలు. అదండి సబ్బు సంగతి. 🙂
   సంవత్సరాది రోజునుంచీ కొంచం అత్యవసర పనిలో పడ్డాను. బ్లాగు కేసి రాలేకపోయా! నిన్న సాయంత్రానికి కొద్ది కాళీ చిక్కింది. మరో రెండు రోజులైనా బడలిక తప్పదేమో! తలుచుకున్నందుకు
   ధన్యవాదాలు.

   మెచ్చుకోండి

   1. ఎలాగైనా మీ శ్రీమతి గారికి ముందుచూపు ఎక్కువే సుమండీ 👏. మీ టపాల్లో చాలా చోట్ల ఈ సంగతి ఋజువవుతుంటుంది 🙂.

    మెచ్చుకోండి

   2. విన్నకోట నరసింహారావు గారు,
    ఆవిడకి ”ఐ లవ్ యు” చెప్పడమే నా జీవితంలో గొప్ప ముందు చూపండి 🙂 ఆ తరవాత నుంచి మీరన్నమాటే 🙂
    ధన్యవాదాలు

    మెచ్చుకోండి

  1. అనామకంగారు,
   నిజం శ్యామలీయం వారు కూడా ఇలా చెప్పి చెప్పి నోరు నొప్పి పుట్టి విసిగిపోయారు. నేనూ నుచ్చెన అనకూడదని చెప్పి నిచ్చెన అనిపించడానికి చేసిన ప్రయత్నం అలాగే అనిపించిందండి. నుచ్చెన అని ఎందుకనకూడదంతే ఏ చెబుతామండి?
   ధన్యవాదాలు.

   మెచ్చుకోండి

 2. //గడ్డిమేటిలా చేసి అక్కడ పారేస్తే..//
  అంతే కాదండి కొందరు ఆ పేపర్ పట్టుకుని ఓ గంట ప్రకృతి పిలుపులకి వెళ్ళొస్తారు. ఆ పేపరు ఉతికి ఆరేసి ఇస్త్రీ చెయ్యాల్సిందే.

  మెచ్చుకోండి

 3. సరికాదు సుమా యరువుల
  పరపతి బెంచన్ జిలేబి, పారుడు పలికె
  న్నరువివ్వడు పొత్తంబుల
  మరియెవరేమని తలచిన మాచన వర్యుల్ !

  జిలేబి

  మెచ్చుకోండి

  1. Zilebiగారు,
   ఎవరేమనుకున్నా పుస్తకాలు ఎరువు ఇవ్వననే చెబుతానండి 🙂 ఇస్తే అదెలాగా తిరిగిరాదనుకోండి… పుస్తకం వనితా విత్తం…..
   ధన్యవాదాలు.

   మెచ్చుకోండి

   1. ఎవరేమనుకున్నా యి
    వ్వ వలదు పొత్తము జిలేబి, వనితా విత్తం
    బు విడువగ మరి తిరిగి రా
    దు విదురుని పలుకుల వినవె ధుమధుమ వలదే 🙂

    జిలేబి

    మెచ్చుకోండి

   2. జిలేబిగారు,
    పుస్తకం, వనితా, విత్తం పరహస్తగతం గతః
    అధవాపునరాయాతు జీర్ణాభ్రష్టాచస్వల్పశః
    ఈ నానుడి పూర్వం నుంచి ఉన్నదే!
    ధన్యవాదాలు.

    మెచ్చుకోండి

 4. సరిజోదు లిరువు రరయగ
  నెరువని యరువని వచించ నేది కరెక్టో
  యెరుగను సంశయము విరువ
  పరి పరి ప్రార్థింతు మిమ్ము పండితులారా !

  మెచ్చుకోండి

  1. వెంకట రాజారావు . లక్కాకుల గారు,
   ఎరువు అనేది అపభ్రంశ శబ్దం అనిపిస్తుందండి. దీని ప్రయోగం ఇలా ఉంది ”ఎరువు సొమ్ము బరువు చేటు” అన్నది నానుడి, ఇక్కడ ఎరువు అన్నదానికి ఇతరుల సొమ్మని అర్ధం కదా! నిఘంటువులో అర్ధాలలో కొట్రా శ్యామలశాస్త్రి గారు ఎరవు అనే పదాన్నిచ్చి దానిని ఈ అర్ధం చెప్పేరు. ఈ ఎరవు పదం ఎరువుగా అపభ్రంశం చెందిందనుకుంటా
   ధన్యవాదాలు

   మెచ్చుకోండి

 5. రాజన్నకు తెలియనిదుం
  దా! జాగ్రత్త సుమ ! యరువు దానెరుగున్ మే
  లౌ జనవాళి పలుకు యెరు
  వూ చక్క తెలియు గురునికి వూకొని వినవే 🙂

  జిలేబి

  మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s