శర్మ కాలక్షేపంకబుర్లు-గర్వం

Posted on ఏప్రిల్ 16, 2012
10
గర్వం DEVAYAANI-3

కోపము నుబ్బును గర్వము,నాపోవక యునికియును, దురభిమానము ని
ర్వ్యాపారత్వము ననునివి,కాపురుష గుణంబులండ్రు కౌరవనాధా. భారతం. ఉద్యోగపర్వం. ద్వితీయాశ్వాసం…౩౨.

గర్వం చెడ్డది, ఇవేకాక మరొక ఐదు కూడా చెప్పేడు, ఇవ్వన్నీ చెడ్డవారి లక్షణాలని చెప్పేడు. అవి, కోపం, పొగడ్తలకి పొంగిపోవడం, గర్వం, సహించలేని తనం, ఏపనీ చేయకుండా ఉండటం, అని విదురుడు, ధృతరాష్ట్రునితో,చెప్పేడు. మిగిలినవి తరవాతెప్పుడేనా చెప్పుకుందాం. ఇప్పుడు గర్వం గురించి చూదాం.

మన కధానాయిక దేవయాని, రాక్షస గురువు శుక్రుని కూతురు. శుక్రాచార్యుల వారు వృష పర్వుడనే రాక్షస రాజు దగ్గర ఉంటున్నారు. ఆ రాజుకు శర్మిష్ఠ అనే కూతురు, దేవయాని వయసుది. శర్మిష్ఠ తన వెయ్యిమంది చెలికత్తెలతో, దేవయానితో కలిసి వన విహారానికి వెళుతుంది. అక్కడ ఒంటి మీద బట్టలన్నీ తీసేసి కొలను గట్టున పెట్టి, జల విహారానికి దిగుతారు,అందరూ, కొలనిలోకి. వివస్త్రగా స్నానం చేయకూడదని శాస్రం చెబుతోందని, పెద్దలంటున్నారు, వద్దన్న పని చేయడం అలవాటుకదా, అందరికీ. వేరు, వేరుగానే బట్టలు పెట్టుకున్నా, గాలికి అన్నీ కలిసిపోయాయి. నీటి నుంచి బయటకు వచ్చిన తరవాత, శర్మిష్ఠ గబగబా బట్టలు కట్టుకోవాలనే తొందరలో, దేవయాని బట్టలు కట్టేసుకుంది. ఇంకేముంది దేవయానికి కోపం వచ్చేసి, నేను నువ్వు కట్టి విడిచిన మైల బట్టలు కట్టుకోవాలా? నేనెవరనుకుంటున్నావు. మా నాన్న వద్దని చెబితే, మీనాన్న అడుగు కూడా ముందుకు వేయడు. అటువంటి గురు పుత్రిని, గొప్ప దానిని, నన్ను అవమాన పరుస్తావా అని గర్వంతో మాటాడేటప్పటికి,రాజ పుత్రికి కోపం వచ్చి మీ నాన్న, మా నాన్నను దీవించి, మేమిచ్చే వానితో బతుకుతాడు, అటువంటి వాని కూతురువి, నువ్వు నా బట్టలు కట్టుకోవడం తప్పేం అంటుంది, తిరస్కరించిన దేవయానిని అక్కడ దగ్గరలో ఉన్న నూతిలో తోసేసి, చెలులతో ఇంటికెళ్ళిపోయింది, శర్మిష్ఠ.

నూతిలో పడి సహాయం కోసం కేకలు వేస్తున్న స్త్రీని, ఆ ప్రదేశం లో వేట సాగిస్తున్న యయాతి అనే మహారాజు, విని నూతి దగ్గర కొచ్చి, నీ వెవరు, ఎందుకీ నూతిలో ఉన్నావని అడిగితే. నేను రాక్షసుల గురువు శుక్రుని కూతుర్ని, నా పేరు దేవయాని. పొరపాటుగా ఇందులో పడిపోయానని, అంతకు ముందే చూసివున్న యయాతిని గుర్తుపట్టి చెబుతుంది. యయాతి ఆమెను కుడిచేయి పట్టి పైకి లాగి రక్షించి, వెళ్ళిపోతాడు. ఇక్కడ యయాతికి తనను రాజకుమార్తె నూతిలో పడేసిన విషయం, యయాతి దగ్గర దాచింది, అబద్ధం చెప్పింది..

దేవయాని రాకపోవడంతో, వెతుకుతూ దాసి వచ్చింది. దానికి విషయం చెప్పి తండ్రికి తెలియచేసి, నేనీ పురంలో అడుగుపెట్టనని చెప్పి, తండ్రికి కబురు పంపుతుంది. సంగతి తెలుసుకున్న శుక్రుడు పరుగు పరుగున వచ్చి, కూతురిని అనునయించబోతాడు, శర్మిష్ఠ రాజు కూతురుకదా, పొరపాటు జరిందని. కాని దేవయాని ఒప్పుకోదు,నేను రాను పట్టణంలోకి, ఎక్కడికైనా పోదామంటే, నీతో పాటే నేనూ, అని శుక్రుడు అంటున్న సంగతి తెలిసిన వృషపర్వుడు, కొంపమీదకి ముసలం వచ్చి పడిందనుకుని, పరుగున వచ్చి శుక్రుని కాళ్ళ పైబడి తప్పు మన్నించమని వేడుకుంటాడు. దేవయానికి కావలసినది ఏదయినా ఇస్తానని చెబుతాడు. అప్పుడు దేవయాని, శర్మిష్ఠ, తన వేయిమందిచెలులతో నాకు దాసిగా ఉంటే, తండ్రీ, తనూ పురంలోకి వస్తామని చెబితే, రాజు కుమార్తెకు కబురు పంపి, దేవయానికి శర్మిష్ఠ ను దాసిగా అర్పించి శుక్రుని, దేవయానిని పురంలోకి తీసుకు వెళతాడు. ఇక్కడికాపుదాం, ఇది చాలా పెద్ద కధ కనక ముక్క ముక్కలుగా,విషయాన్ని బట్టి చెప్పుకుంటున్నాం.

పొరపాటుగా దేవయాని బట్టలు శర్మిష్ఠ కట్టుకుంటే, దేవయాని సంయమనం చూపలేకపోయింది. గర్వంతో నోటికొచ్చినట్లు మాట్లాడింది.పోనీ శర్మిష్ఠ తక్కువతిందా తను అంతకుమించి గర్వంతో నోరుపారేసుకుంది, ఆ తరవాత ముందు వెనుకలాలోచించక, రాజు కూతురుననే గర్వంతో దేవయానిని నూతిలో పారేసిపోయింది. ఇలా ఏ ఒక్కరు సంయమనం చూపక గొడవ పెంచుకున్నారు తప్పించి తుంచుకోలేదు.ఆ తరవాత శుక్రుడు కుమార్తెను సద్ది చెప్పడానికి ప్రయత్నించినా, కుమార్తె మాటకు కాదనలేని వాత్సల్యంతో రాజును వదిలేయడానికి సిద్ధపడతాడు. అనాలోచితంగా చేసిన పనికి, దేవయాని మొండి పట్టుదలకు, శర్మిష్ఠ, దేవయానికి దాసిగా మారిపోవలసి వచ్చింది. దేవయాని తండ్రి మాట వినలేదు, కాని శర్మిష్ఠ, తనను తండ్రి దేవయానికి దాసిగా సమర్పించినా జనహితం కోరి, రాజ్యహితం కోరి, తండ్రి మాట జవదాటలేదు, ఒప్పుకుంది. ఇప్పటికి శర్మిష్ఠ కి, చేతులు కాలాకా ఆకులు పట్టుకున్న చందంగా మంచి ఆలోచన వచ్చింది. గర్వం ఎంత పని చేసింది చూసారా…ఇంతకీ వారిద్దరికీ ఏ గొప్పతనం లేదు, తండ్రులకు తప్ప.

నేడు ఇటువంటి సంఘటనలు అనగా గర్వంతో, అనాలోచితంగా చేసే పనులు , మన నిజ జీవితంలో కూడా కనపడుతుంటాయి. కాని ఈ కధని మనం కధగానే తీసుకుని మరిచిపోతున్నాం.అక్కడ జరిగిన సంభాషణ తీరు చూస్తే సంయమనం ఏ పక్కన ఉన్నా పరిస్థితి మరొకలా ఉండెదనిపిస్తుంది కదా! నేడు, గొప్ప కులం వాళ్ళమని గర్వం, ఇది సాధారణంగా చదువుకున్న వారిలోనే ఎక్కువగా కనపడుతోంది, చదువులేని వారికంటే, కారణం చెప్పలేను. డబ్బున్న వారమని గర్వం. అబ్బ! డబ్బు చంపేస్తోందండీ! జీవనానికి సరిపడ డబ్బు అవసరమేకాని,ఎక్కువ డబ్బు జబ్బే!! అందమైన వారమని గర్వం,దీని గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిదేమో!!!అధికార గర్వం, అబ్బ! ఇది మహా దుర్భరం, అధికారంతమునందు చూడవలెకదా ఆ అయ్య సౌభాగ్యముల్ అన్నారు, పెద్దలు. చదువుకున్న వారమన్న గర్వం, ఇదో పెద్ద రోగం, ఏనాడో చేసుకున్న పుణ్యం కొద్దిగా ఉంటేనే ఇప్పుడు, చదువు, హోదా, అందం వగైరాలు ఉంటాయి. ఇవి ఏవీ శాశ్వతం కాదు. ఇలా రకరకాల గర్వాలతో జనం బాధలు పడుతున్నారు కదూ…..

నేను రాసేవి ఎవరినీ ఉద్దేశించి రాసినవి కాదు,ఎవరికైనా బాధ కలిగితే క్షమించమని వేడుకోలు.

ఇంతకీ గర్వానికి ముఖ్యకారకులెవరండీ……. మనసు….

ప్రకటనలు

రచయిత: kastephale

A retired telecom engineer.

8 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-గర్వం”

  1. పేరొచ్చే సరికిన్ హ! గర్వ మటు తప్పేటట్లు లేదౌ జిలే
   బీ! రోగం బిది నేటి కాలమున దుర్భేద్యంబు గానయ్యె భా
   మా రిమ్మల్ తెగులొప్పె కీడు గనుచున్, మాన్యంబు గాదమ్మ యీ
   సారంబొప్పనిజీవితమ్ము తుదకున్ సాధించు దేనిన్ గదా

   జిలేబి

   మెచ్చుకోండి

  2. విన్నకోట నరసింహారావు గారు,
   చదువుకి సంస్కారానికి సంబంధం లేదు గాని, ఈ సంస్కారం చదువుకున్నవారిలో ఎక్కువగా కనపడుతోందండి.
   మరికొంచం ముందుకెళితే…..వద్దులెండి, వాళ్లు మారరు,స్వానుభవాలే అవుతున్నాయి గదా! మనది ప్రయాస.ఇటువంటివారి దగ్గర సులభా పురుషారాజన్ ఇది గుర్తుకు తెచ్చుకోడం మంచిది, ఏమంటారు 🙂
   ధన్యవాదాలు.

   మెచ్చుకోండి

 1. . . . . . ఇంతకీ గర్వానికి ముఖ్యకారకులెవరండీ……. మనసు…. . . . .
  అవునండి. మన ఏవ మనుష్యాణాం కారణం బంధమోక్షయోః బంధాయ విషయాసంగీ ముక్త్యై నిర్వషయం స్మృతమ్ అన్నారు కదా ఉపనిషత్తులో.

  మెచ్చుకోండి

 2. గర్వం మంచి గుణం కాదు గానీ – దాని గురించి చెప్పిన మీ ఈ పోస్టు మాత్రం చాలా మంచి చేసింది – ఇది చదవగానే చాలా రోజులకు దేవులపల్లివారి శర్మిష్ఠ గుర్తుకొచ్చి – గబగబా ఆ పుస్తకం వెతికి తీసిపెట్టుకున్నాను – చదవడానికి 🙂

  మెచ్చుకోండి

  1. లలితమ్మాయి,
   ’ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది,అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుంద”ంటారు కదా పల్లెలలో! ”ఎదిగినకొద్దీ ఒదగమని అర్ధమందులో ఉంది” 🙂 ఇది మరిచిపోతున్నారమ్మా!
   శర్మిష్ఠ చదువమ్మా!
   ధన్యవాదాలు.

   మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s