శర్మ కాలక్షేపంకబుర్లు-కోపం

Posted on మే 30, 2012
4
కోపం

“సత్తిబాబూ కనపడటం లేదేమోయ్! కోపమొచ్చిందా?” అన్నా, అప్పుడే వచ్చిన సత్తిబాబుతో.”పంతులుగారు బలేవారే! నాకు కోపం ఏంటండీ!, మీమీద” అన్నాడు. ఈ మాటంటూంటే నా ఇల్లాలు కాఫీ తెస్తూ “అన్నయ్యా! మీ బావగారికి అసలు కోపంరాదనుకో వస్తే ఆరునెలలుంటుంది. సంవత్సరానికి రెండుసార్లే వస్తుందనుకో” అంది. నాకు నవ్వాగలేదు. “జగడమెందుకొస్తుంది జంగమయ్యా అంటే బిచ్చం తేవే బొచ్చుముండా” అన్నాడట,అలా నాతో జగడం వేసుకోవాలనుకుంటోందయ్యా మీ చెల్లెలు” అన్నా. “పంతులు గారు కోపం అన్నారు కనక కోపంగురించి చెప్పండి” అన్నాడు. “ఇదివరకోసారి చెప్పేనట్టున్నానయ్యా! మళ్ళీ చెబితే పాడిందే పాటరా పాచిపళ్ళ దాసరీ” అన్నట్లు ఉంటుందేమో” అన్నా. “కోపం గురించి ఇదివరకు చెప్పనివి ఇప్పుడు చెప్పండి” అన్నాడు. “నీతో బలే చిక్కొచ్చిందే, “తేగంటే తేగంటి బిడ్డకావాలందిట” నీలాటి ఆవిడ, ఇదివరకు చెప్పినవి చూసుకుని ఇప్పుడు కొత్తవి చెప్పాలిట. “మంత్రసాని తనం ఒప్పుకున్న తరవాత బిడ్డొచ్చినా పట్టాలి, గొద్దొచ్చినా పట్టాలని” సామెత, తప్పదు కదా.కోపం గురించి ఏం చెప్పేము ఇదివరలో అని చూస్తే, దీని గురించి ప్రత్యేకంగా చెప్పలేదని, సందర్భాను సారంగా చెప్పేమని తేలింది.భారతం లో ఒక పద్యం ఉంది అస్తమానం చెప్పుకుంటే బాగోదేమో మొదలు చెప్పి వదిలేస్తా కోపమునుబ్బును గర్వము……కాపురుష గుణంబులండ్రు కౌరవనాధా! కాదు,పూర్తిగా చెబుతానయ్యా, నువ్వేమనుకున్నాసరే!

కోపము నుబ్బును గర్వము,నాపోవక యునికియును, దురభిమానము ని
ర్వ్యాపారత్వము ననునివి,కాపురుష గుణంబులండ్రు కౌరవనాధా. భారతం. ఉద్యోగపర్వం. ద్వితీయాశ్వాసం…౩౨.

“ఈ పద్యం ఒకటే వచ్చనుకుంటా మీకు” అన్నాడు మా సత్తి బాబు.”అవునయ్యా! ఈ పద్యం ఒకటీ పూర్తిగా అర్ధమైతే జీవితంలో మరేమి తెలియకపోయినా ఫరవాలేద”న్నా. “ఆగండి అయితే ఒక మాట చెప్పేస్తా మనవాళ్ళకి, మా పంతులుగారికి ఈపద్యం ఒకటే వచ్చును, ఈ పద్యం పట్టుకుని ఇప్పటికి పదిహేను టపాలు రాశారు. చెప్పేశానండీ!” “నాకు కోపం రాదయ్యా! ఈ పద్యం చెప్పే అన్ని టపాలూ రాశా, నేనేమీ అబద్ధం చెప్పలేదు. నాకు కోపం తెప్పించాలని చూస్తున్నావా దూర్వాస మహామునికి వచ్చినట్లు”అన్నా. వీరి కోపం తననూ బాధించింది అలాగే ఇతరులనూ బాధించింది, కాని లోక కళ్యాణమే జరిగింది..

కోపం ఒక మానసిక స్థితి. మనం అనుకున్నది జరగనపుడు,అనుకున్నట్లు జరగనపుడు, మనమనుకున్నదానికి విరుద్ధంగా ఎవరేనా మాట్లాడినపుడు,చేసినపుడు, మనని కించ పరచాలని ఇతరులు ప్రయత్నించినపుడు, వివిధ పరిస్థితులలో కోపం వస్తుంది. కోపానికి మూలం కాంతా కనకాలు. వీరిని పోగొట్టుకుంటామేమో అన్నపుడు, వారి పట్ల అమర్యాదగా ఎవరేనా ప్రవర్తించినపుడు, ఈ కోపానికి అంతు ఉండదు. దీర్ఘ కోపం పనికిరాదన్నారు, శాస్త్రకారులు. ఐతే కోపానికి పర్యవసానం మాత్రం విపరీతంగా ఉండచ్చు. దీనికి రామాయణంలో హనుమంతుడు ఒక మాట చెబుతారు. కోపంలో గురువును కూడా హత్య చేస్తాడు. పాపానికి ఒడి కడతాడు. నేను లంకను కాల్చి అందుతో సీతను కూడా కోపంలో కాల్చిన వాణ్ణి అని బాధ పడతాడు, అందుచేత బుద్ధిమంతుడు పాము కుబుసాన్ని విడిచినట్లు కోపాన్ని విడవాలని చెబుతారు.. తరవాత తెలుస్తుంది తను చేసినపని తప్పుకాదని, అది వేరు సంగతనుకోండి.

కోపమనేది మానసిక స్థితి, అప్పుడు ఆలోచనలు దూసుకుపోవడం,అలోచనలు పేరుకుపోవడం, ఎదుటివారిని హింసించి అయినా కోపం తీర్చుకోవాలనుకోడం జరుగుతుంది. కాని దీని లక్షణాలు శరీరకంగా ఎక్కువ కనపడతాయి. కోపం వచ్చినపుడు, గుండె కొట్టుకోవడం వేగం పెరుగుతుంది. చెమటలు పోయచ్చు, మాటలు తడబడచ్చు, లేడా గోంతు మూగ పోవచ్చు, గొంతు స్వరం స్థాయి పెరుగుతుంది. పరుషపదాల వాడకం పెరుగుతుంది. ఇది వారి వారి సంస్కృతులపై, పెంపకం పై పెరిగిన వాతావరణం పై, ఆధారపడి ఉంటుంది.అందుకే శతక కారుడు “తనకోపమె తన శత్రువు తన శాంతమె తనకు రక్ష తధ్యము సుమతీ” అన్నాడు. కోపమున బుద్ధి కొంచమై ఉండునని అన్నారు శతక కారులు.

మహాత్ములు కోపం తెచ్చుకుంటారు. దాని వల్ల లోకోపకారమవుతుంది. కొంతమంది కోపం వస్తే ఒళ్ళు మరిచిపోతారు. ఏమి మాట్లాడుతున్నదీ కూడా తెలియదు. ఇంగిత జ్ఞానం కూడా చచ్చిపోతుంది.మాటకి మాటకి పొంతన ఉండదు. దీనికి స్త్రీ పురుష భేదం లేదు.ఈ కోపంలో చాలా రకాల హింస జరుగుతుంది. ఇది శారీరికం కావచ్చు, మానసికం కావచ్చు. వ్యగ్యంగా మాట్లాడటం కూడ కోపం తీర్చుకునే వాటిలో ఒక భాగం.

నా మనవరాలు కోపం వస్తే మాటాడదు. అమ్మా! మాటాడలేదేమని అడిగితే తాతా! నీకు మతిమరుపు నేను నిన్ననేగా నీతో మాటాడింది అంటుంది. అమ్మమ్మా, చూడవే తాత ఏమంటున్నాడో అని కంప్లైయింటుకూడా చేస్తుంది. అసలు నాకెందుకూ కోపం తాతా అంటుంది. నేను కోపం తెచ్చుకోను కదా మనవరాలిమీద.మరో మనవరాలు కోపం నటిస్తుంది, బతిమాలించుకోడానికి, అమ్మ కదూ, బుల్లి తల్లి కదూ, చిన్న తల్లి కదూ, మా బంగారు తల్లికి కోపం రాదుటా అని బతిమాలితే కోపం ఎగిరిపోతుంది. మరొకరు,మన కోసం మనం బతుకుతాం, మరెవరికోసమో బతకం, మన ఇష్టప్రకారం మనం చేస్తాం కాని, వేరెవరికోసం మారిపోతూ ఉంటే చివరికి మనం మిగలం అని చెప్పేవారు, మారిపోతున్నారనుకోండి, అప్పుడు కోపం వస్తుందా రాదా? కాని ఇప్పుడు కోపానికి బదులు బాధ తెచ్చుకుంటున్నాం. ఉదయం నుంచి కరంటు సరిగా లేకపోయినా, ఆరోగ్యం ఇబ్బంది పెట్టినా, ఈ టపా రాయాలనే పట్టుదలపై నాకు కోపం రాలేదు. ఇది మనసు చిత్రం. పొగడ్తకి పొంగిపోకూడదు, తెగడ్తకి కుంగిపోకూడదు. ఇది జీవితం. ఎప్పుడూ ఒకలా ఉండదుకదా. కరంటు రోజుకు ఎనిమిది గంటలు తీసేస్తున్నాడు. ఇచ్చిన సమయంలో కూడా పదినిమిషాలకొక సారి తీసేస్తున్నాడు. మరి ఈ ప్రభుత్వం మీద ప్రజలకి కోపం రావటంలేదా? బాధ పడుతున్నారు, ప్రతిక్రియ సరయిన సమయం లో చూపిస్తారు కాని ఇప్పుడు చెప్పరు కదా.!!కరంటు ఉన్న కాసేపతీలో ఏదో ఒకటి రాయడం, ఇది అతుకుల బొంతలా తయారయిందేమో!

ప్రేమికుల విషయంలో దీనిని ప్రణయ కలహం అన్నారు. ఇది కూడా అద్దం మీద ఆవగింజ నిలిచినంత సేపు ఉంటుందన్నారు. మన తెనుగు సినీకవి ముక్కుమీద కోపం నీ ముఖానికే అందం అన్నారు. ప్రేమికుల విషయంలో ఇది అలుక కాని కోపంకాదు. అలుక తెచ్చిపెట్టుకున్న కోపం. మరో చోట అలుకమానవే చిలుకల కొలికిరో తలుపు తీయవే ప్రాణ సఖీ అన్నారు, మరో సినీకవి. కోపాన్ని అదుపులో ఉంచుకున్న వారే గొప్పవారు, ఎప్పుడూ. కోపం మీద కోపం తెచ్చుకోగలిగినవారు ధన్యులు. పాసిటివ్ తింకింగ్ ఉండాలండీ!!! అక్కడికి అదేంటో నాకు తెలిసినట్లు :):):)

ఈ టపా వెయ్యాలని గంటనుంచి ప్రయత్నం చేస్తూంటే ఇప్పటికి మూడు సార్లు కరంటు పోయింది, టపా వేసేలోపు. అందుకు కరంటు ఎప్పుడొస్తే అప్పుడు ఈ టపా ఈ వేళ వెయ్యాలిసిందేనని పట్టుదలగా కూచున్నా, చిత్రం కోపం రాలా పట్టుదల పెరిగింది

శర్మ కాలక్షేపంకబుర్లు-సలహా

Posted on మే 27, 2012
13
సలహా.

సలహా అన్నది తెనుగు పదంకాదనుకుంటా. ఐనా తెనుగుపదంలా ఒదిగిపోయింది భాషలో, దీన్ని తెనుగులో హితవచనం అన్నట్లుంది. చిన్నయ సూరి పంచతంత్రం లో “పోగాలము దాపురించిన వారు దీపనిర్వాణ గంధమును,అరుంధతిని, మిత్ర వాక్యమును, మూర్కొనరు, కనరు, వినరని పెద్దలు చెప్పుదురు” అన్నాడు. చావు దగ్గరపడిన వాడు దీపం ఆరిపోయేటపుడు వచ్చే వాసన గ్రహించలేడు,అరుంధతీ నక్షత్రాన్ని చూడలేడు, మిత్రుని మాట వినడని, చెప్పేరు..( పై పనులు చేయలేని వారు ఆరు నెలలలో మరణిస్తారని నానుడి)

ఎవరు ఇంతమందిని చంపినదని అడిగితే, అకంపనుడు,రావణునితో, రాముడనేవాడు చంపేడు, వాణ్ణి జయించడం కష్టం కనక,రాముని భార్య సీతను ఎత్తుకురమ్మని మొదట సలహా ఇచ్చిన వాడు అకంపనుడు అనే సేనాని. ఆ పని మీద బయలు దేరి మారీచుని వద్దకొచ్చి సాయం కావాలని అడిగాడు, రావణుడు. మారీచుడు భయంతో,సీత జోలికి పోవద్దు, రాముడితో వైరం వద్దు, సుఖంగా బతుకు, నీకీ సలహా ఇచ్చిన వాడు నీ బాగు కోరినవాడు కాదని రావణునికి సలహా ఇచ్చాడు. అప్పటికి ఒప్పుకున్న రావణుడు తిరిగిపోయాడు. అప్పటికే పరాభవంతో లంక చేరుకున్న శూర్పనఖ,(చేటలవంటి గోళ్ళు గలది అన్నారు మా మిత్రులు శ్యామలీయంవారు) అన్న గారిని నిండు కొలువులో, రాముడు చెలరేగిపోతున్నాడు,అతనిని నిలువరించాలని, అతని అందకత్తె అయిన భార్యని నీకోసం తేవాలనుకుంటే యీ పరాభవం జరిగిందని చెప్పి, రెచ్చకొడుతుంది( పరోక్షంగా సీతను ఎత్తుకు రమ్మని సలహా ఇచ్చింది). అప్పుడు రెండవసారి బయలుదేరి మారీచుని దగ్గరకొచ్చి, నువ్వు మాయలేడిగా వెళ్ళు, తరవాత సంగతి నేను చూసుకుంటానంటే, మారీచుడు ఒక మంచి మాట చెప్పేడు,మంచి మాట కనక మారీచుడు చెప్పినా ఇదివరలో చాలా సార్లు చెప్పుకున్నా మళ్ళీ చెప్పుకుందాం.

సులభాః పురుషా రాజన్ సతతమ్ ప్రియవాదినః
అప్రియస్యచ పధ్యస్య వక్తా శ్రోతాచ దుర్లభః

అప్రియమైనా సత్యం చెప్పేవాడు లేడు, ఒకవేళ ఎవరైనా చెప్పినా వినేవాడు లేడు అన్నాడు
ఆ సలహా నెత్తికెక్కిందా, రావణుడికి, లేదే. మరొక ప్రబుద్ధుడు, రావణుని యుద్ధ పరిషత్తులో, మహా పార్శ్వడు అనే సేనాని, ఎందుకీ అవస్థ, సీతను బతిమాలడం,ప్రేమించమని అడగటం, కుక్కుట బంధంతో ( బలవంతంగా ) సీతను అనుభవించెయ్యి అని సలహా చెప్పేడు, రావణునికి. అలానే రంభను అనుభవిస్తే, నలకూబరుడు శాపం ఇచ్చాడోయ్, ఇష్టపడని వారిని బలవంతంగా అనుభవిస్తే తల పగిలి చస్తావని, లేకపోతే ఈపాటికి ఆపని చేసి ఉండకపోదునా, అన్నాడు రావణుడు..

భారతంలో దుర్యోధనుడికి మంచి సలహా చెప్పించడం కోసం మైత్రేయుడు అనే మునిని పిలిచి, వీడికి సలహా చెప్పమంటే, ఆయన పాండవులతో కలిసి బతకమని, అర్ధరాజ్యం ఇవ్వమని చెబుతారు. ఇది నచ్చని దుర్యోధనుడు తొడలు బాదుకుంటూ ఉంటే, మైత్రేయుడు, నీ తొడలు రణరంగంలో విరిగి చస్తావని శపించి పోయాడు. సలహా మాట దేవుడెరుగు, శాపం మాత్రం తగులుకుంది.

ఈ మధ్య ఒక రోజు మరునాటి టపా రాదామని కూచుంటే ఒక జంట వచ్చేరు. రమ్మని కుర్చీలు చూపించి చూస్తుండగా అతను “గుర్తు పట్టలేదండీ” అన్నాడు. అప్పుడు గొంతు గుర్తుపట్టి, “ఎలా వున్నా”రన్నా. ఉభయ కుశలో పరి, “నేను మళ్ళీ ఈ ఊరు ఉద్యోగానికొచ్చా. ఎదురుగా ఉన్న అపార్ట్మెంటులో అద్దెకుదిగా నిన్న, మిమ్మల్ని చూడాలని వచ్చా మ”న్నారు. “పిల్లలెలా వున్నా”రంటే, “మీదయవల్ల కులాసా,” అని నా మిత్రుని భార్య ఇలా అంది.

“ఉద్యోగంకి వచ్చిన కొత్తలో ఓవర్ టైం డబ్బులొచ్చినపుడు చెప్పేరట మీరు, ఆ డబ్బులు బోనస్ డబ్బు పెట్టి బంగారం కొనడం మొదలు పెట్టి ఏభయి తులాలు చేసి అమ్మాయికి పెట్టేం.” దానికతను “ఏం పెట్టి ఏం ఉపయోగమైందండి అల్లుడు కాలం చేశాడు, మీరు ఎక్కడో ఉన్నవారు కబురు తెలిసి వచ్చి చూసి ఓదారుస్తూ, అమ్మాయిని రెండేళ్ళు పలకరించకండి, ఈ విషయాలమీద, ఆపు చేసిన చదువు పూర్తి చేయనివ్వండి. ఆ తరవాత మళ్ళీ పెళ్ళి గురించి అలోచిద్దామన్నారు. సరిగా అలాగే జరిగింది. అమ్మాయి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది, ఈ లోగా మా బంధువులొకరు ఒక సంబంధం తెచ్చేరు. వాళ్ళకీ విషయం తెలియదేమోనని వెళ్ళి చెబితే, మాకు విషయం తెలుసును, అబ్బాయి అమ్మాయిని ఇష్ట పడుతున్నాడు, విషయం తెలిసి కూడా. అమ్మాయికి చెప్పండి. అమ్మాయి ఇష్టపడితే వివాహం చేద్దామన్నారు. అమ్మాయికి చెప్పేము. ముందు కాదంది, కాబోయే దంపతులను ఒక చోట చేర్చి మాటాడు కోమన్నాము. ఇద్దరూ మాటాడుకుని నిర్ణయానికొచ్చిన తరవాత పెళ్ళి చేసేసేము. మూడేళ్ళయింది. ఎవరికి చెప్పలేదు, పిలవలేదు.ఇప్పుడు అమ్మాయికి ఒక అబ్బాయి, వాళ్ళు ఇప్పుడు బెంగుళూర్ లో ఉంటున్నారన్నాడు. ఇది మీ సలహా చలవే” అన్నాడు. “మంచి కబురు చెప్పేరు, అలా జరగాలి, నేను కాకపోతే మరొకరు చెబుతారా సలహా. ఇది మీ అభిమానం” అన్నా. “మీ, మరొక సలహా చాలా ఆలస్యంగా చేస్తున్నది, మూఢం వెళ్ళిన వెంటనే ఇంటి శంకుస్థాపన చేస్తున్నా” అన్నారు.

సాధారణంగా ఎవరికైనా ఒంట్లో బాగోక పోతే హాస్పిటల్ లో చేర్చినపుడు, ఎక్కడ చేర్చేరు, అయ్యో! వాళ్ళు దోచేస్తారండి బాబూ, మరో చోట చేర్పించకపోయారా అనో, లేకపోతే అక్కడ వైద్యం బాగోదనో అనకుండా ఉండలేరు కొందరు సలహాల రావులు. అలాగే చదువుల విషయంలో కూడా, వాళ్ళ దగ్గర అసలు ఫేకల్టీ లేదండి, హంగు తప్పించి, పిల్లాడు పాడయిపోతాడు అంటారు. ఈయనేమో ఫీస్, డొనేషన్లు వగైరా అన్నీ కట్టేసేడు,ఇప్పుడు మార్చ లేడు, ఈ సలహా చెప్పినతను వారికి ఉపకారం చేసినట్లా? వారి మనసు బాధ పెట్టినట్లా? ఎవరైనా ఒక పని చేసేమని చెప్పినపుడు, విని ఊరుకుని బాగుందని చెప్పడం తప్పించి ఇలా మాట్లాడితే వారి మనసు బాధ పెట్టడం తప్పించి ప్రయోజనం ఉండదు. కొంత మందికి కావలసిన ది ఇదే, ఎదుటివారు మధన పడుతోంటే చూసి ఆనందించడం.సలహా కోసం మనంకూడా కనపడిన ప్రతివారినీ అడిగెయ్యడం తప్పే. అడగబోయేవారు ఆ విషయంలో తెలిసినవారా, కనీసం జీవితానుభవమేనా ఉందా, చూసుకోకుండా అడగడం మంచిది కాదు. అలాగే మనల్ని సలహా అడిగినపుడు విషయం గురించిన పరిజ్ఞానం లేకపోతే తెలిసిన వారిని అడగమని సలహా ఇవ్వడం మంచిది కాని తెలిసీ తెలియనిది చెప్పెయ్యడం మంచిది కాదని నా అభిప్రాయం. అడగనిదే జీవితానుభవంతో కూడా సలహా చెప్పకూడదు. ఏ విషయంలోనైనా భార్య/భర్త చెప్పే సలహా మరెవరి సలహా కన్నా విలువైనదే. కొంతమంది సలహాలరావులు అడగకపోయినా సలహాలిచ్చెస్తూ వుంటారు. ఒకరు ఏదో చేస్తూ ఉంటారు, చూసిన వారు అది తప్పని వద్దని సలహా ఇస్తారు, చేసేవారికి తెలియదా, చేసేది తప్పో ఒప్పో! చెప్పిన తరవాత కూడా వారదే చేస్తున్నపుడు మళ్ళీ మళ్ళీ వారికి సలహా చెప్పడం విజ్ఞత అనిపించుకోదుకదా! ఇది మానుకోలేరు కొందరు, ఇది చదువుకున్నవారిలోనే ఎక్కువనుకుంటా.

ప్రభుత్వాలు సలహాదారులను వేసుకుంటున్నాయి, వారిచ్చే విలువైన సలహాలేమో తెలియవు కాని, లక్షల కోట్ల రూపాయల ప్రభుత్వ ఆస్థులికి మాత్రం కాళ్ళొస్తున్నాయి..

మంచివారికి చెప్పిన సలహా రాణిస్తుందేమో.

శర్మ కాలక్షేపంకబుర్లు-పశ్చాత్తాపం

Posted on మే 20, 2012
18
పశ్చాత్తాపం

మిత్రులు, హితులు, సన్నిహితులందరికీ నమస్కారం, గత పది రోజులుగా వేసవి ఎండలు బాధ పెడుతున్నాయి,ప్రతి రోజూ నలభై డిగ్రీలపైనే వేడిమి ఉంటూఉంది. ఎండదెబ్బకి ఉడుకు జ్వరం బాధపెడుతోంది. రోహిణి రాకుండానే బాధ పడితే, రోహిణి ఇంకెంత బాధపెడుతుందో అని భయపడుతున్నాం, కంప్యూటర్ దగ్గర కూచోడం కష్టంగా ఉండి బ్లాగులవైపు రావడం మానేశాను, అస్వస్థతమూలంగా, ఈ రకంగా నైనా ఈ వ్యసనం వదులుతుందేమోనని, ఆశ కూడా పడ్డాను, కరంటు బాధ మాకు నిత్య కృత్యం కనక ప్రత్యేకంగా చెప్పుకోనక్కరలేదు.. ఉడుకునుంచి కాపాడుకోడానికి మంచి గంధం చెక్క అరగదీసుకుని లోపలికి తీసుకోవడం,సబ్జా గింజలు నానబెట్టుకుని మజ్జిగతో తీసుకోవడం లాటివి చెయ్యచ్చు, కాని సమయానికి గుర్తురావాలికదా :). ఈ మధ్య ఒక అనుభవం కలిగింది. “కుక్కవంటి బుద్ధి కూర్చుండనీయదని” సామెత, చెయ్యి దురద పెట్టేసింది, అనారోగ్యంగా ఉన్నా, ఇల్లాలు గోల పెడుతున్నా, అదే ఈ టపా, మరి ఈ బ్లాగు వ్యాధి ఎంత ముదిరిపోయిందంటారు?.

నవంబర్ నెలలోనే దొడ్దిలోని కొత్తపల్లి కొబ్బరి మామిడి చెట్టు పూతవస్తే చాలా సంతోషించాము.ఆ తరవాత పూత ఆగిపోయింది. చిగురూ రాలేదు, కనక పూత వస్తుందని వేచి చూశాం. మార్చి నెలలో కొద్దిగా పూసింది, దురదృష్టం ఫలదీకరణ సమయంలో వర్షం పడి పూత మొత్తం రాలిపోయింది. ఆయ్యో! ఈ సంవత్సరం, ప్రతి సంవత్సరం లాగా, మామిడిపళ్ళు పంచి పెట్టలేక పోతున్నామనుకున్నాము, ఊరగాయ పెట్టుకోడానికే కాయ లేనట్లుందని బాధపడ్డాము.. ప్రతి దానికి ఏదో పరమార్ధం ఉంటుందని అలోచిస్తే, ఒక విషయం తలపుకొచ్చింది. పిచ్చివాడా! “నేను” పంచిపెడుతున్నానని నువ్వు అనుకుంటున్నది నిజం కాదు, నేను పంచి పెట్టడానికి అనుమతితిస్తేనే నువ్వాపని చెయ్యగలవని అమ్మ చెప్పినట్లనిపించింది. దీని మినహాయింపుగా దొడ్డిలోని పనసమొక్క మాత్రం విరగ కాసింది. నిరుడు కూడా కాసింది కాని ఒక కాయలో తొనలుండి, ఒక దానిలో లేకపోవడంతో దానిపై, ఈ సంవత్సరం శ్రద్ధ చూపలేదు. ఒక రోజు రెండు పనసకాయలు పండి రాలాయి. అవి కోసి చూస్తే, అద్భుతం చక్కటి తొనలు ఉన్నాయి. వాటిని ముందుగా అమ్మకి నైవేద్యం పెట్టి రుచి చూస్తే ఇంకా అద్భుతమైన రుచితో, అమృతంలా ఉన్నాయి. అమ్మ ఈ సంవత్సరం పనస తొనలు పంచిపెట్టమంది, అనుకుని కోసిన తొనలు పట్టుకెళ్ళి, మూడు ఇళ్ళలో ఇచ్చి వచ్చింది, ఇల్లాలు. ఎవరికిచ్చేవన్నా, మన పక్క వారింటిలో అమ్మాయి చూలాలు,ముందు వాళ్ళకిచ్చి మిగిలినవి తతిమా వాళ్ళకిచ్చానంది. కాయలు కొద్దామా అన్నా, వద్దు కోయలేము, పడుతున్నాయికనక, పడిన వెంటనే కోసి పంచిపెట్టాలని నిర్ణయించుకుని ఊరుకున్నాము.

మొన్న ఉదయం మూడు పనస పళ్ళు రాలాయి, వాటిని తెచ్చి ఇస్తే ఇల్లాలు వాటిని కోసి తొనలు తీసి బేసిన్లలో వేసి “ఇది ఫలానా వారికి, ఇది ఫలానా వారికి” అని చెప్పింది. “పట్టుకెళ్ళి ఇచ్చి వస్తాన”న్నా. “నీరసంతో ఎందుకు వెళ్ళడం? అలాగే వెళతారా” అంది. “నాకేమి తక్కువ, లుంగీ వుంది, పైన తువ్వాలుంది, నన్ను ఈ కాలనీలో ఎరగనివాళ్ళు లేరుకదా, బయటికి ఎక్కడికీ వెళ్ళక బాగోలేదు, ఫరవాలేదు లేదు వెళతా” అన్నా. “అది కాదు మోకాళ్ళకిందకి అడ్డపంచ, పైన చిన్న తువ్వాలు, గుండు,పిలక, వీభూది పెండి కట్లు, బొట్టు, ఇలా వీధిలోకి వెళితే బాగోదేమో, చొక్కా వేసుకుని, పంచ సరిగా కిందికి కట్టుకుని వెళ్ళండి,” అంది. “ఫరవాలేద”ని బేసిన్లు పుచ్చుకున్నా, “కర్ర పట్టుకెళ్ళండి తూలతారు” అంది. “సరే” అని, “ఈ తేడాలేమిటి” అన్నా. “ఎవరింటిలో వున్న జనాభాని పట్టి వారికి కావలసినవి ఇస్తాము, కనక ఈ తేడా” అంది. పట్టుకుని బయలుదేరి ఒక ఇంటి ముందు నిలబడి “అమ్మాయ్!” అనిపిలిస్తే ఆ ఇంటి ఇల్లాలు వచ్చి తొనలు తీసుకుని వెళ్ళిపోయింది. బేసిన్ ఇచ్చేసింది.మరో ఇంటికెళ్ళి పిలిస్తే ఆ ఇల్లాలు వచ్చి తీసుకుని, నిలబడింది. నా చేతిలో పెద్ద బేసిన్ ఉండిపోయింది. పక్క ఇంటి దగ్గరకెళ్ళి “అమ్మాయ్!” అని పిలిచా, పలకలేదు, మళ్ళీ పిలిచా, పలకలేదు, మరొకసారి పిలిచా. లోపలనుంచి మాటలేవో వినబడ్డాయికాని ఏమిటో తెలియలేదు. పక్కన నుంచున్న అమ్మాయి మాత్రం పెద్ద గొంతుతో “సుమతిగారూ! ఒక సారి బయటికి రండి” అని కేకేసింది. ఆఇంటి ఇల్లాలు బయటికి వచ్చి, నన్ను చూస్తూనే , కొయ్యబారిపోయి, తెప్పరిల్లి, నా చేతిలో బేసిన్ తీసుకుని ఖాళీ బేసిన్ తిరిగిస్తూ, కూలబడిపోయింది. ఏమయిందో తెలియలేదు, కాని “నన్ను క్షమించండని” అంటూ ఉంది. ఇదేమో అర్ధం కాక “ఏమయిందన్నా”. “నేను తప్పు చేశాను, అనకూడని మాటలన్నా, కాలు జారితే తీసుకోవచ్చు కాని నోరుజారితే తీసుకోలేమని సామెత రుజువయ్యిందని” ఏడవటం మొదలు పెట్టింది. “నీవేమీ తప్పు చేయలేదు, నాకేమీ వినబడలేదు. ఒక వేళ తెలియక ఏమైనా అనివున్నా పశ్చాత్తాపపడ్డావు కనక పరిహారమైనట్లే” అని వచ్చేశాను. వెనకనుంచి మాత్రం “సుమతీ! వెనకా ముందూ చూసుకోకుండా నోరు పారేసుకోకూడదు. ఆయనకి వినపడలేదు కనక సరిపోయింది. వినపడి ఉంటే ఎంత బాధ కలుగును, నీ మాట,” అని అంది పక్కింటి ఆవిడ. వచ్చేసి, “ఇవ్వవలసిన వాళ్ళకి ఇచ్చాన”ని చెప్పేను, నా ఇల్లాలికి. జరిగిన విషయమే మరిచిపోయా.

రాత్రి భోజనాల తరవాత ఇల్లాలు తీరుబడిగా “పొద్దుటేమి జరిగింది” అంది, చెప్పేను. “ఏం అడిగావ”న్నా. “మిమ్మల్ని పంచకిందికి కట్టుకుని చొక్కా వేసుకుని వెళ్ళమన్నా, మీరు వినలేదు, సుమతి లోపలుందిట, మీరు వేసిన కేక సరిగా వినపడలేదో,ఏమో, మిమ్మల్ని చూసి బిచ్చగాడెవరో అరుస్తున్నట్లున్నాడనుకుని, పొమ్మని కేకలేసిందిట. సాయంత్రం వచ్చి ఒకటే ఏడుపు, బాబయ్యగారికి చెప్పు పిన్నీ అంటూ. అది సంగతి” అంది.

“ఇలా జరిగిందిటా” అని కాలనీ మొత్తానికి తెలిసిపోయింది. మరొకరన్నారు “ఎందుకొచ్చిన బాధ, ఇలా ఇళ్ళమ్మట తిరిగి ఇవ్వడం, కాయలమ్మేయచ్చుకదా” అని. అందుకు “ఇష్టం లేదు, మనకి కలిగినది పది మందితో పంచుకు తినడం లో ఆనందం, అమ్ముకుని తెచ్చుకున్న డబ్బుతో వస్తుందా?” ఇదోతుత్తి. అదే ఆహార్యంతో ఏ ఒక్క ఇల్లూ వదిలిపెట్టకుండా అందరికి కేకేసి మరీ పనసతొనలు పంచిపెడుతున్నా,ఉదయం సాయంత్రాలలో, పట్టుదలగా, అనారోగ్యంగా ఉన్నాసరే. మా కాలనీలో ఆడాళ్ళందరికి కొత్తలవాటొకటి వచ్చింది, “ఎవరేనా గుమ్మంలోకొచ్చి పిలిస్తే బయటికొచ్చి, సమాధానం చెప్పడం.”

నేనెందుకు మారాలి?

శర్మ కాలక్షేపంకబుర్లు-“ఎవరికి నష్టం అలోచించండి.” మాకే నష్టం, ఇసుమంటోళ్ళుంటే.

Posted on మే 22, 2012
4
“ఎవరికీ నష్టం..అలోచించండి”..మాకే నష్టం.. ఇసుమంటోళ్ళుంటే…

మిత్రులు శ్రీభండారు శ్రీనివాసరావు గారి బ్లాగులో ఈ వేళ “ఎవరికి నష్టం అలోచించండి” చదివిన తరవాత ఇది రాస్తున్నాను,రాయకుండా ఉండలేక, శ్రీ శ్రీనివాసరావు గారికి కృతజ్ఞతలతో…….
నారాయణ స్వామి అని ఒక యంగ్ కలక్టరు, మామ గారు వీధి ఆక్రమించి గోడ కడీతే కూల గొట్టించేసేడు, ఫలితం, పెళ్ళాంతో గొడవ, చివరికి విడిపోవడం, ఎక్కడా నిలవనివ్వకపోతే యూ.ఎన్ కి వెళ్ళిపోయాడు, నిజాయితీకి ప్రతిఫలం చెల్లిస్తూ.

మరొక సంఘటన, భూపతి బాబని ఒక ఐ.పి.ఎస్ లిక్కర్ బినామీల భరతం పడుతున్నాడు. ఆయనని వదిలించుకోడానికి ప్రభుత్వం వారు మరొకరిని ఆయన నెత్తి మీద కూచో బెట్టేరు. బాధ కలిగిన ఆయన శలవులో వెళ్ళీపోయారు. ఇదీ సందర్భం.

“చెమటలు కక్కుకుంటూ ఉక్కపోతలో, ఆరోగ్యం బాగోలేకుండా ఎందుకూ దాని ముందుకూచుంటారూ” అంది ఇల్లాలు, “ఏంలేదు అయిపోయింది వచ్చేస్తున్నా, చిట్టుడుకు నీళ్ళు తియ్యి” అంటూ అతుక్కుపోయా…..మా రాజుబాబొక చిన్న రాజకీయనాయకుడు..ఇరవై లిక్కర్ షాపుల యజమాని. అందులో పద్దెనిమిది బినామీ పేర్ల మీదున్నాయి…. వారి కొలువులో ఒక రోజు జరిగిన రాజకీయ సంభాషణ.

“రాజుబాబుగారు భూపతిబాబు శలవులో వెళ్ళిపోతున్నారట, నారాయణ స్వామి యూ.ఎన్ కి వెళ్ళిపోయారట… ప్రజలనుకుంటున్నారు,మంచోళ్ళందరినీ తరిమేస్తున్నారని…ఈళ్ళెళ్ళిపోతే ఎవరికండి నష్టం……అనుకుంటన్నారండి………”

ఎవరికండి నష్టం, మాకు కాదా! ఇసుమంటోడుంటే!! ఆడు ఎల్లిపోతానని మమ్మల్ని సుకపెట్టేసినాడు. నేకపోతే ఈణ్ణో సోటేసి ఆడిమీద మరొకణ్ణేసి ఎదవ నూసెన్స్ పడిపోనాంగదా!!! బూపతి పోతే మరో సీపతి ఒస్తాడోయ్! ఎవుళికేటి.మనపని అయినాది కదా! అమ్మయ్య కేసులు సంకనకి పోతయ్యి కదా!! పెద్ద పోటుగాడినాగ పెట్టినాడు కేసులు. ఉప్పుడు ఉండలేక పారిపోతన్నాడు.

సామా, ఆడెవడు, బతకలేనోడు, ఈడికేటి సేతవును? ఈడెబ్బ! మావ పన్జూసి, పెల్లాం కోరిక తీర్చలేనోడు, పెల్లాం వదిలేసినోడు, ఆడెటుపోతే మాకెందుకుగాని, దేశం వదలిపోనాడు సుకపడినాం. దరిద్రం వదిలిపోనాది. తిను, తినిపించు, బతుకు, బతికించు కావాలి కాని, ఈళ్ళేటండి రూల్సో అనేడిస్తే ఏటొస్తాది. ఏటయిపోయేడు, పెల్లాంలేదు, పిల్లలు లేరు,సుకం నేదు, ఎందుకండీ బతుకు….ఎవుళకోసం.. పెజలకోసమా… ఓ పూట కూడు కూడా పెట్టరు…..

ఏదో తెలివైన కుర్రోడుగందా అని ఉదోగమిచ్చినాం. చెప్పినం, ఒరి ఎర్రోడా! కాకితాల మీదున్నయన్ని నిజంగాదురా అని, అడేటి ఇనలేదు మరి. కలకటేరు ఉదోగమిచ్చినం కదా. మావేమో ముచ్చటపడి గోడగట్టుకుంటే, ఈడేటండి బాబు గోడ కూలదోయించినోడు, “ప్రజలికి దారి,” ఓరి పిచ్చోడా ఆ దారిలేకపోతే మరోదార్లో ఎలతారో! గోడఎలాగుంచాలో ఆలోసించలేనోడెందుకండీ. రూల్సా, ఓర్ని! రూల్స్ మనం రాసుకున్నాయేగదయ్యా, ఒకేళ సరిపోకపోతే సరిపెట్టాల అదీ నీ తెలివి,మరందుకేగదా ఐ.ఎ.యెస్ ఇచ్చినాం, అలాగా సేసినా వనుకో చేపొద్దుటేల, నిన్ను చీప్ సెగట్రీ సెయ్యమూ!! ఏటి. సీలచ్చిమీ , దొంగాచారీలా, ఓ రెండ్రోజులు లోపలగూకున్నంతలో ఏటయిపోద్ది. ఆరోగ్నం బాగుపడుద్ది. గాందీ మహాత్ముటంటోడు, సీ కుట్టమూర్తులంటోల్లు కి సంబందం ఉన్న సోటయ్యా, ఊరికే దొరుకుద్దేటి.ఈ ఏల లోపల గూకున్నాడొ, నోరిప్పకుండా, రేపు సీప్ సెగెట్రీ సేసేత్తాం. నేపోతే మరో పదవిచ్చేత్తాం. మమ్మల్నెవడో కాదనీ ఓడు. పెతి పచ్చాలా? బలేటోడివేనో! ఒకింటికి ఈది గుమ్మం, దొడ్డి గుమ్మం ఉంటాయ్! మావు ఈది గుమ్మామైతే ఆళ్ళు దొడ్డిగుమ్మం. ఆళ్ళు పబుత్వంలోకొస్తే!, ఏటవుతాది, ఆళ్ళు ఈ సీరలో ముక్కలే గందా!! సీరెప్పుడేనా ఇప్పినావా? నీకేటి దెలుసులే సీరిప్పడంగాని, దానికి కట్టుకొంగు, పయిటికొంగు అనుంటాయి! ఆళ్ళు కట్టు కొంగయితే మేం పయిటికొంగు అంతే తేడా. “పేపరోళ్ళండి బాబూ!” నీ బుర్ర బూజెక్కిపోనాదయ్యా. ఒకప్పుడు కంపూటర్ లాటోడివి ఇలాగయిపోతన్నావేటీ? ఒరే! ఈణ్ణి తప్పించేసి మరొకల్లని ఎట్టండ్రా! “వద్దు బాబూ వద్దు,” ఆ అలారా దారికి. పేపరోళ్ళని కదా అన్నావు. కట్టుకొంగు, పైటికొంగు అయిపోతే సీరలో మిలిందేటో, “మద్దె సీరండి.” అళ్ళూ ఇందులో మద్దె ముక్క లాంటోళ్ళు, మానం గాపాడేటోళ్ళు. మరింకేటి, మందోయిస్తే సాలదా? లేకపోతే మామూళ్ళిచ్చేస్తే సాలదా? ఇష్టం లేనోడో రోజు రాస్తాడు, ఏటైపోద్ది, ఆడి పత్రిక సర్కులేసన్ పెరుగుతాది. ఆడూ మావోడే గాదా. ఎవుడేనా మా…..( బూతుమాట)……….ముక్క పీకినాడా, పీగ్గలడా? “కోర్టులండి బాబూ…” ఓరి ఎర్రోడా! కోర్ట్లు న్యాయాధిలయాలు,నమస్కార మెట్టాల. ఆటికి కల్లుండవ్, సెవులుంటాయ్! మామేటి పాస్ జేస్తే దాని పెకారం తీర్పులు సెబుతాయ్. కింద కోర్టొకటంటే, పై ఓడు మరొకటి సెబుతాడు. మనం పాస్ జేసిన సట్టాలెన్నో మనకే ఎరుకనేదు. కావలసినన్ని బొక్కలు, ఎతుక్కొవాలి,తప్పించి. సరిలే! ఆటిగురించి పబ్లీకులో మాటాడుకోగూడదుగాని, పర్లేదు, ఆళ్ళూ మడుసులేగా? ఏదేనా తటసం తగిల్తే, పూర్తయీతలికి, నువ్వూ ఉండవ్, నేనూ ఉండను, తెలిసినాదా! మంచోడు, కాలి కేస్తే ఏలికేసీవోడు, మనోడు, పీడర్ని సూడవయ్యా, ఆడేసూసుకుంటాడు అన్నీ. “డబ్బులండీ!” వార్ని, నెలకో ఇరవయో, ముపయ్యో లచ్చలు పారీవయ్యా. లచ్చలకోట్లు దిన్నపుడు ఈమాత్రం కరుసుండదేటి.

“తెల్ల కార్డోళ్ళకి ..లిక్కర్ షాపులు… బినామీలు.,.అనుకుంటున్నారండి.”…తెల్లకార్డోళ్ళని ఇన్ కం టాక్స్ కట్టీలా అబివుద్ది సేసినోళ్ళెవరయ్యా! మేంగాదా!! ఆళ్ళు పెద్దోళ్ళయ్యేరని సంతోసించక ఈ గోలేటో!!! ఆళ్ళు లిక్కర్ కొస్తే సెప్పాల్నా? నువ్వే లేనప్పుడు ఎవురితో సెబుతారు. సూసుకు మాటాడాల, పన్జేసేటపుడు, ఎనకా ముందూ. ఈ ఏల ఆ సోట్నున్నావ్, రేపు చెలవులో పోతన్నావ్, తిరిగొచ్చేకా మరోసోట, కెరటాలు లెక్కెట్టడానికేస్తాం. ఏటి సేస్తావ్. “ప్రజలండీ బాబూ”

ఓరి ఎర్రి కుట్టీ! పెజలకి ఇదివరకేమిచ్చినాము, సెప్పలేకపోతె ఎలాగయ్యా! ఎయ్యికదా ఇచ్చినాము, పైన క్వాటరిచ్చినాము, ఓటుకి. ఉప్పుడు రెండిద్దారి. ఆళ్ళకది సాలు. తాగితొంగుంటే మనమేసుకుంటాము, నేకపోతే ఆల్లొచ్చి ఏస్తారు ఓట్లు. ఎటైనా మనకేనాభం. అంసేత నేసెప్పేదేటంటే! బుర్ర బూజెక్కించుకోక లెక్కలు సరిగూడండి. సొమ్ములు రావలసినయి వసూల్జేయించండి. తెలిసినాదా? ఎవురి మామ్మూళ్ళు అలాగా పమ్మించేయండి. మమ్మలెనెవడేటి సేయనేడండి.

“జగన్ ని అరస్టు…..అనుకుంటున్నారండి ప్రజలు……” ఓర్ని! ఆణ్ణిప్పుడేటి సెయ్యం. ఎలచ్చన్లయిపోవాల, అప్పుడు. “సీట్లు….” ఆడెలాగా పన్నెండు ఒట్టుకుపోతాడో… మనోళ్ళెంతేడిచినా మూడొస్తే గొప్ప…. మిగిలినియ్యి……

ఇది ఎవరిని వ్యక్తిగతంగా ఉద్దేసించి వ్రాయలేదు, పేర్లు సంభాషణలు పూర్తిగా కల్పితాలు 🙂

శర్మ కాలక్షేపంకబుర్లు-పెళ్ళయి ఏభై ఏళ్ళు పూర్తయింది( 51 వ పెళ్ళి రోజు )

Posted on మే 25, 2012
51
పెళ్ళయి ఏభయి ఏళ్ళు పూర్తయింది.

సరిగా ఏభయి ఏళ్ళకితం ఈ రోజు నా భార్య, నా ఇల్లాలు, నా గృహలక్ష్మి, నా రామూకి మా, కాదండీ నా బహిః ప్రాణం నా జీవితంలో ప్రవేశించింది, నేనామెలో ఇమిడిపోయా.

ఒక్క సారి ఏభయి ఏళ్ళ వెనక్కి వెళదాం. పెళ్ళయిపోయింది, అప్పగింతలయిపోయాయి, ముక్కు చీదుళ్ళయ్యాయి, ఒడికట్టు కట్టేశారు, పల్లకీ ఎక్కించేశారు ఇద్దరినీ. ఎదురుగా ఉన్న శతావధాని శ్రీచెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి గారింటిలో విడిది గృహ ప్రవేశం చేశాము. అప్పటితో ఆవిడ పూర్తిగా నాది, నేను అమె వాడిని అయిపోయాం. దీక్ష పూర్తి అయింది కనక మధుపర్కాలు విడిచేద్దామనుకుంటూ ఉండగా, అమ్మ “ఉండండి, ఒక్క సారి ఆ బట్టలతో” అని “మీరిద్దరూ కలిసి వెళ్ళి ఆది దంపతుల దర్శనం చేసుకురమ్మ”ని చెప్పి నా చేతిలో డబ్బులు పెట్టింది. జనాంతికంగా “ఎవరేనా వీళ్ళని శివాలయానికి తీసుకెళ్ళండే” అని అంది. ఎవరూ కదలలేదు. “మనకేమీ కొత్తా, నడవవోయ్” అన్నట్లు చూశా. “పదండి” అన్నట్లు అడుగు ముందుకేసింది. కళ్ళద్వారా మనసులు మాటాడుకున్నాయి. ఇంకేమి కావాలి చెయ్యీ చెయ్యీ పట్టుకుని, అదేనండీ చిటికినవేళ్ళు లంకె వేసి బయలుదేరాం, మొదటి అడుగుపడింది, అలా మరో మాటలేకుండా, ఎర్రటి ఎండలో, రాబోయే జీవితాన్ని సూచిస్తూ, ఆది దంపతుల దర్శనం కోసం. వెనక్కి చూశాం ఎవరేనా వస్తున్నారేమోనని ఎవరూ రాలా. ముందుకే అడుగేశాం. నడిచి గుడి దగ్గరకి చేరాం. “అరటి పళ్ళు తీసుకుందా”మని ఇద్దరం ఒకసారి అన్నాం, నవ్వుకున్నాం. రెండత్తాలు అరటి పళ్ళు ఇవ్వమంది, ఇచ్చాడు, కిళ్ళీ కొట్టతను. డబ్బులు నాన్న గారి దగ్గర తీసుకుంటానన్నాడు. “డబ్బులివ్వండి” అని చెప్పింది. కొట్టతనికి డబ్బులిచ్చి లోపలికి ఒక సారి అడుగు పెట్టాము, గుడిలో. ముందు అయ్యవారి దర్శనం చేసుకున్నాం. ఆ తర్వాత అమ్మ దర్శనం చేసుకున్నాం. అమ్మ, అయ్య, ఇద్దరి దగ్గరా చెరొక చేతితో పట్టుకుని ఒకటిగా పళ్ళిచ్చాం. అలా పళ్ళు ఇవ్వడం చూసి పూజారి అదోలా చూశాడు, మాకేసి. దర్శనం తరవాత గుడిలో కూచోవాలి కాసేపు, అది ఇద్దరికీ తెలుసు కనక కాలక్షేప మండపం మీద కూచున్నాం. “ఏమని దణ్ణం పెట్టుకున్నా”రంది. “నువ్వేమని దణ్ణం పెట్టేవ”న్నా. “మేము దంపతులుగా మిమ్మల్ని సేవించి, దర్శించడానికి వచ్చాము. మీరు ఆది దంపతులు, మీలాగే మేము ఉండాలని అశీర్వదించమన్నా. మీరేమని పెట్టేరు దణ్ణం” అంది. “నువ్వు చెప్పిందే నేనూ మళ్ళీ చెప్పాలి, అంతే” అన్నా. “కిళ్ళీ కొట్టు వాడికి నన్ను డబ్బులిమ్మనావేం” అన్నా ఏం చెబుతుందోనని, “దేవుడిని దర్శించడానికి మనం వస్తే, డబ్బులాయనిస్తే ఫలితం ఆయనది కాని, మనది కాదుకదా” అంది. ఫరవాలేదు “ఈ పిల్లతో సంసారం నడిచిపోతుందనుకున్నా, మనసులో. ఆ తరవాత ఎప్పుడో చెప్పింది కిళ్ళీ కొట్టు వాడికి డబ్బులిమ్మనగానే ఇచ్చేస్తే “బాధలేదు చెప్పిన మాట వినేమొగుడే దొరికాడనుకున్నా” అంది, 🙂 . అంతకు కొన్ని గంటల ముందే ప్రేమకి దరఖాస్తు పెట్టేసేను కదా ( ముద్దు పెట్టేను కదా. ఇది వరలో చెప్పేను దీని గురించి అందుకు చెప్పటంలేదు ) స్వీట్ నతింగ్స్ చెప్పుకున్నాం, ఆ కాలంవి, ఇప్పుడు మీకు చెప్పకూడదుకదా 🙂 , సెన్సార్ కట్. ఈ లొగా ఎవరో వచ్చారు, మమ్మల్ని వెతుక్కుంటూ, మా కోసం. విడిదికి చేరేము, ఇంటికి చేరేము.

ఇలా ప్రారంభమయిన సంసార జీవితపు వయసు ఏబది సంవత్సరాలు. “ఎప్పుడూ ఇలాగే ఉన్నారా?” ఆగండి మరి. పెళ్ళయిన కొత్తలో దెబ్బలాడుకున్నాం, చాలా సార్లు, కలిసిపోయాం, దెబ్బలాట కూడా మా గురించి కాదు, “మీ అక్కయ్య ఇలాగంటే, మీ అన్నయ్య ఇలాగ”. ఇదీ తగువు. ఒక సారి తీరుబడిగా తగువు తీరి కలసినపుడు ఆలోచించాం. తగవు తీరిన తరవాత కలయిక అనుభవించాలి,మనసు పొందే హాయి చెప్పనలవి కాదు. మనగురించి మనం దెబ్బలాడుకోటం లేదు, వేరెవరిగురించో అని గుర్తించాము, మర్నాటినుంచి దెబ్బలాటలు గాయబ్. పెళ్ళినాటికి, ఆమె వయసు పదహారు/ పదిహేడు, నాది ఇరవై ఒకటి/ ఇరవైరెండు. వయసు ఆకర్షణ తో కొంత కాలం నడిచింది. ఆ తరవాత ఆమె చేసే పనులు, నేను చేసే పనులు, ప్రతిస్పందనలు వీటిద్వారా, వయసు ఆకర్షణ స్థాయి నుంచి ఆరాధన స్థాయికి ఎదిగాము. కష్టాలు, సుఖాలు కలసి పంచుకున్నాం. కష్టాలు జీవితం లో భాగమనే అనుకున్నాం. కష్టాలలో ముఖ్యమైనవి, ఆర్ధికం, ముఖ్యమైన వారిని కోల్పోవడం, సుఖాలలో నలుగురు సంతానం కలగటం, వారందరినీ అమ్మ చూడకలగటం, పెద్ద ఊరట. అమ్మ ఆశయం నిలబెట్టినందుకు ఆనందం. :), ఆమె కోరినది వంశాభివృద్ధి కదా. ఎప్పుడు మొదలయిందో చెప్పలేము కాని, మధ్యనుంచి,కష్టాలలో, ఆరాధన నుంచి ప్రేమ మొదలయి, ఒకరిని ఒకరు విడిచి ఉండలేని స్థితికి చేరుకున్నాం, ఇది వయసు ఆకర్షణ, ఆరాధన కాదు, ప్రేమ.

ఎప్పుడూ తీపేనా? ఎప్పుడూ తీపే తింటూ ఉంటే జబ్బూ చేస్తుంది, చేదయి పోతుంది. మధ్య మధ్య కారం చుర్రు మంటే తీపి మరింత బాగుంటుంది కదా. అదే మేమూ చేసింది, చాలా సీరియస్ గా దెబ్బలాడుకునే వాళ్ళం,దెబ్బలాడుకుంటున్నాం, ఈ దెబ్బలాట పైవారికి తెలియదు, అదొక విచిత్రం, తెలియనిచ్చేవాళ్ళం కాదు, ఇప్పటికీ అంతే. కోపం వస్తే చేసే పని మాట్లాడకపోవటం. ఇది చాలా పెద్ద శిక్ష. ఈ శిక్ష భరించడం ఇద్దరికీ దుర్భరమే! ఇద్దరికీ ఇదే అలవాటు. నోటితో కంటే మనసుతో మాటాడుకోడం ఎక్కువ, కోపం వస్తే మనసు మూసుకుంటే, మనసుతో మాటాడకపోతే… చాలా కష్టం,కాదు బాధ. దీర్ఘకోపం పనికిరాదు కదా, అందుకే మళ్ళీ కారణం వెతుక్కుంటాం, మాట్లాడుకోడానికి, మళ్ళీ కలిసిపోతాం. ఈ మనసుతో కలయిక, విడిపోడం అనుభవించాలి తప్పించి మాటతో చెప్పడం కష్టం. ఇద్దరం చదువు రాని వాళ్ళమే. ఈ పాసిటివ్ తింకింగులు వగైరా మాకు తెలియవు. మాకు తెలిసినదొకటే, ఇద్దరం ఒకరికొరకు ఒకరు బతకాలి, కలిసిబతకాలి, కలిసి అనుభవించాలి ఏదయినా. కష్టమూ నిలవదు సుఖమూ నిలవదు,కష్టం జీవితం లో ఒక భాగం,దానినుంచి గట్టెక్కే మార్గం చూడటమే ఇద్దరి విధి. ఇది తెలుసుకున్నాం. డబ్బు గురించిన దెబ్బలాట ఎప్పుడూ లేదు.డబ్బు మీద ఇద్దరికీ వ్యామోహం లేదు, బంగారం మీదా లేదు, ఆడంబరాల మీదా లేదు. నా పేర కొన్ని ఆస్థులు, ఆమె పేరున ఉన్నాయి. ఇది నీది, ఇది నాది అనుకోలేదెప్పుడూ. ఒకరు మాకు పెట్టడం గురించిన అలోచన ఎప్పుడూ లేదు. ఎవరికైనా పెట్టలేక పోయామని బాధ పడతాం. కట్నానికి వ్యతిరేకులం, మేము ఇవ్వలేదు, తీసుకోలేదు. మూఢ నమ్మకాలకి చాలా దూరంగా ఉంటాం, ఇద్దరం పిచ్చివాళ్ళం కదా. పాతిక ఏళ్ళ కితం స్థిరాస్థులు పిల్లల కిచ్చేశాం. చరాస్థులు కొద్దిగా మా కోసం ఉంచుకున్నాం. లేదని కుంగిపోలేదు, ఉందని పొంగిపోలేదు. ఉన్నంతలో తృప్తిగా బతికాం,బతుకుతున్నాం.

ఎక్కడికెళ్ళినా పదేళ్ళనుంచి ఇద్దరం కలిసి వెళ్తాం, లేదూ మానేస్తాం, ఒకరు రాలేకపోతే, ఒకరూ వెళ్ళే ప్రశ్న, ప్రసక్తి లేదు. ఇన్ని మాటలెందుకు ఆమె లేని నేను లేను, నేను లేని అమె లేదు. శంకరుని అద్వైతం, ఒకటే ఐన రెండు. రెండుగా కనపడే ఒకటి. ఏవిషయం గురించి అడిగినా ఇద్దరి స్పందన ఒకటే, వేరు, వేరుగా అడిగినా, ఇద్దరి మనసు ఒకటే కదా. ఆ రోజు అమ్మ చెప్పినట్లు, ఈ రోజు ఈ టపా వేసిన తరవాత చిటికినవేళ్ళు పట్టుకుని మళ్ళీ ఆది దంపతుల దర్శనానికి వెళతాము. పెద్దలికి నమస్కారం, పిన్నలికి దీవెనలు.

శలవు

శర్మ కాలక్షేపంకబుర్లు-నాలుగు రకాల మనుషులు.

Posted on మే 29, 2012
16
నాలుగు రకాల మనుషులు.

నలుగురితో మంచిగా ఉండు, నలుగురికీ చెప్పాలి, నలుగురికీ తెలిస్తే పరువుపోతుంది, అంటూ ఉంటారు కదా ఆ నలుగురూ ఎవరూ అనే చింత చాలా కాలం నుంచి ఉంది, కాని సమాధానం మాత్రం దొరకలేదు. మొన్ననీ మధ్య ఒక సంఘటన చూసిన తరవాత, ఒక్క సారిగా భర్తృహరి రాసిన, లక్ష్మణ కవి తెనుగు చేసిన పద్యం, చిన్నపుడు చదువుకున్నది గుర్తుకొచ్చింది.

తమ కార్యబు పరిత్యజించి పరార్ధ ప్రాపకుల్ సజ్జనుల్,
తమ కార్యంబు ఘటించుచున్ పరార్ధ ప్రాపకుల్ మధ్యముల్,
తమకై అన్య హితార్ధ ఘాతుకజనుల్ దైత్యుల్, వృధాన్యార్ధ భం
గము గావించెడి వారలెవ్వరో ఎరుంగన్ శక్యమే ఏరికిన్. అన్నారు.

తమ పని చెడిపోయినా ఎదుటివారికి ఉపకారం చేసేవారు ఉత్తములు, తమ పని చేసుకుంటూ ఇతరులకు ఉపకారం చేసేవారు మధ్యములు, తమ పని కోసం ఇతరుల పని చెడకొట్టేవారు దితి కుమారులు, రాక్షసులని, ఊరకనే ఇతరుల పని చెడకొట్టేవారిని ఏమనాలో తెలియదు అన్నారు. ఎప్పుడో వందల సంవత్సరాల కితం మన సమాజాన్ని, మానవ మనస్తత్వాన్ని కూలంకషంగా కాచి వడపోసిన కవి ఎంత గొప్పవాడు. ఇప్పటికీ ఈ నలుగురిలో మార్పు రాలేదు కదా. నలుగురు తప్పించి, ఈ సంఖ్య పెరగలేదు, తరగలేదు.

మొదటివారు నూటికి ఒక ఐదుగురుంటే గొప్ప, లేరని అనను, వారు నిజంగా మహత్ములే. నిజమే మహత్ముడు తన కుటుంబం పాడయిపోతున్నా పట్టించుకోకుండా దేశమో అని బాధపడి చంపబడ్డాడు. అక్కడక్కడా అటువంటివారు ఉండబట్టె ఇప్పటికీ నమ్మకం మీద నమ్మకం సడలటం లేదు. మరి రెండవ రకపు వారు, నిజం చెప్పాలంటే వీరే సమాజంలో ఎక్కువ. నూటికి ఏభై మంది ఉంటారు. వీరు తమ పని చేసుకుంటూ పక్క వారికి ఉపకారం చేసిపెడతారు. “సుబ్బరావు గారూ! కొత్త కుళాయిలిస్తున్నారట నేను డబ్బు కట్టేను. మీపేరకూడా కట్టేసేను. ఇదిగో రసీదు, దరఖాస్తు తెచ్చేను, అది పూర్తిచేసి రశీదు జిరాక్స్ దానికి గుచ్చి ఇస్తే మనకి వారం లో కుళాయి వస్తుందన్నారు. నేను ఇచ్చేసి వచ్చా, దరఖాస్తు. ఇదిగో రసీదు జిరాక్స్ కాపీ ఇది పెట్టండి, అని చేతికిచ్చారు.” ఎంత పని తప్పించేరు చూడండి. ఆయనొక్కడు దరఖాస్తు పెట్టుకుని వచ్చేయచ్చుకదా. మరెందుకలా చేసేరు. ఇది మధ్యముల లక్షణం, స్వంత లాభం కొంతమానుకు పొరుగువాడికి సాయపడవొయ్ అన్నారు, గురజాడ. కానీ ఇక్కడ స్వంతలాభం పొరుగువారి లాభం కూడా చూడబడింది కదా.”సత్తిబాబు గారు! మా తమ్ముడు, ఇప్పుడు మనమున్న చోటికి ఒక కిలో మీటర్ దూరంలో మంచి ప్లాట్లు చెప్పేడు, మీరూ కావాలంటున్నారు కనక రేపు వెళ్ళి చూద్దాం” ఇలా ఉంటుంది వీరి సహాయం. ఇది పెద్దది కాక పోవచ్చు కాని పెద్ద పనికి నాందీ ప్రస్తావన అవుతుంది. ఇలా మంచి పనులు వారు చేసుకుంటూ మరొకరికి కూడా తోడు పడేవారు ఉన్నారు కనకే ఇంకా బతక గలుగుతున్నాం. ఇక మూడవవారు నూటికి ముఫైఐదుమంది ఉంటారు. వీరు బస్ ఎక్కడం దగ్గరనుంచి, సినిమా టికట్ క్యూ నుంచి, రిజర్వ్ అయిన రైలులో ఎక్కడం దగ్గరనుంచి అన్నిటిలోనూ వారి పని ముందయిపోతే చాలు. తతిమా వారి గురించిన చింత ఉండదు. వీరు కనక స్టీరింగు ముందు కూచుంటే రోడ్ అంతా వారికోసమేనన్నట్లు ఉంటుంది డ్రైవింగు. ఉత్తి స్వార్ధ పరులు, చిన్న విషయం నుంచి పెద్ద విషయందాకా. నాలుగో వారున్నారు, పాపం కవిగారే నేను పేరుపెట్టలేను మొర్రో అన్నాడు. వీరికి పనేమీ ఉండదు, వారిపని వారు పూర్తి చేసుకుని పని చేసేవారిని, చేసుకుంటున్న వారిని చెడకొట్టడమే పనిగ పెట్టుకుంటారు. వీరింకా చిత్రాలు చేస్తారు, “కాలేజి అప్లికేషనా! పూర్తి చేసేరా, నాకివ్వండి అలా వెళుతూ ఇచ్చేస్తా”నంటారు. సరే అని చెప్పి, “ఈవేళ ఆఖరు రోజు మరిచిపోకండేం” అని చెప్పి ఇచ్చినా “ఎందుకండీ ఆఫిసుకు వెళుతూ, దారికదా కాలేజిలో ఇచ్చేసి వెళ్తా మరేం భయపడకండి” అంటారు. సాయంత్రం కనపడినపుడు అడిగితే “అయ్యయో! మరిచిపోయానండీ జేబులో ఉండిపోయిందంటూ” మన చేతిలో పెడతారు, నిజంగా హత్య చెయ్యాలన్నంత కోపం వస్తుంది, కాని ఏమీ చేయలేము, సావకాశం పోయింది కదా, కాలేజీలో చేర్చేందుకు. వీరు ఇంకా రక రకాలు, మన బ్లాగులలో కూడా ఇటువంటి వారున్నారు. వారికేమీ బ్లాగు ఉండదు, వారు ఏమీ వ్రాయరు, కాదు వ్రాయలేరు. ఎవరైనా వ్రాసేవారిని ఇబ్బంది పెట్టడమే వారి ధ్యేయంగా కనపడుతుంది. ఇది అసూయ తప్పించి మరొకటి కాదు. ఎక్కువగా వీరు, సృజనాత్మకత ఉన్న చోట్ల ఎక్కువ కనపడతారు. మనుషులందరూ సమానమే, కాని సృజనాత్మకతలో హెచ్చు తగ్గులుంటాయి. ఇది తప్పదు. బాగారాసే వారిని పదిమంది మెచ్చుకుంటే, ఓర్చలేరు. వారిపై ఏదో రకంగా దుమ్ము పోయడమే పనిగా పెట్టుకుని ఇబ్బంది పెడుతుంటారు. సృజనలో కూడా సినిమా రంగం, రచన, పరిశోధనా రంగాలలో వీరు ఎక్కువగా కనపడుతున్నారు. ఇటువంటిది, ఇప్పుడు మన బ్లాగులలో ఒకరి బ్లాగులో నడుస్తూ ఉంది, పరిశీలించండి ,మీకే తెలుస్తుంది.

శతక కారుడు మరొక మాట కూడా చెప్పేరు,

తెలియని మనుజుని సుఖముగ
తెలుపందగు, సుఖముగ తెలుపగ వచ్చున్
దెలిసిన వానిన్, దెలిసియు
తెలియని నరుదెల్ప బ్రహ్మ దేవుని వశమే.

తెలిసిన వారి సులువుగా చెప్పచ్చు, తెలియని వారికీ సులువుగా తెలియ చేయవచ్చు, కాని తెలిసీ తెలియని వానికి తెలియ చేయడం దేవుని వశం కూడా కాదన్నారు. ఇది అక్షరాలా నిజం, తెలిసి తెలియనివారికి, ఏమి తెలుసో తెలియదు, ఏమితెలియదో తెలియదు. వారికి తెలిసినదే సర్వస్వం అనుకోడమే కాక, తాము పట్టిన కుందేలుకు మూడే కాళ్ళని కూడా బ్రహ్మాండంగా వాదించెయ్యగలరు. ఎదుటివారు ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో, ఏమి చెయ్యాలో, ఏమి చెయ్యకూడదో, ఏమి నమ్మాలో ఏమి నమ్మకూడదో, కూడా నిర్ణయించేస్తుంటారు. వీరికున్నది నోరు మాత్రమే. అది కూడా సరిగా ఉపయోగించుకోలేరు. పూర్తిగా అసూయతో రగిలిపోతుంటారు.

శతక కారుడు మరొక మాటకూడా చెప్పేరు.

తెలివియొకింత లేక కరిభంగి సర్వమున్
తెలిసినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, ఇప్పుడు
జ్వల మతులైన పండితుల సన్నిధినించుక బోధ శాలినై
తెలియని వాడనై మెలగితిన్ గతమయ్యె నితాంత గర్వమున్.

ఇది పైరకం వారు మారిన సందర్భంగా చెప్పినది. నేటి కాలంలో వీరు మారే సూచనలు మాత్రం కనిపించటంలెదు. అమ్మయ్య! ఇప్పుడు తెలిసిందండీ ఆ నలుగురూ ఎవరో!!!

సూచన:-కరంటు ఉదయం నుంచీ లేదు, వచ్చిన తరవాత కూడా పది నిమిషాలకొక సారి పోతూ ఉండటంతో, వేడి ఎక్కువగా ఉండటంతో, అనారోగ్య ఇబ్బందులతో, సరి చూడలేకపోయా. పొరపాట్లు మన్నించండి

శర్మ కాలక్షేపంకబుర్లు- మెత్తని వాణ్ణి చూస్తే…..

Posted on మే 21, 2012
8
మెత్తని వాణ్ణి చూస్తే మొత్తబుద్ధి…..

“మెత్తని వాణ్ణి చూస్తే మొత్తబుద్ధి” అని మనకో సామెత ఉంది, సామెత కాదనుకుంటా నానుడి. ఈ సంఘటన దగ్గరగా నలభై ఏళ్ళ కితం జరిగినది. ఆ రోజుల్లో నేనూ ఒక ట్రేడ్ యూనియన్ నాయకుణ్ణే. “ప్రపంచ కార్మికులారా ఏకంకండి” అని నినదించినవాడినే, పబ్లికుగా. ఆ తరవాతే ప్రైవేటుగా “ప్రపంచ కార్మికులారా ఏకంకండి, లోకల్ కార్మికులారా కొట్టుకు చావండి” అనుకునేవాళ్ళం సరదాగా. నా కయితే పదవులు తీసుకోడం ఇష్టం ఉండేదికాదుకాని వెనక ఉండి కధ నడిపించడం మాత్రం చాలా బాగుండేది. నన్ను ఆ పాత్రకే పరిమితం చేసేశారు కూడా, పదవులిస్తే ప్రమాదం తెచ్చిపెడతాడని. అబ్బో! ఎన్ని రాజకీయాలు అందులో. నాకు కింగ్ మేకర్ అని పేరుండేది. నేను లోకల్ గానే కాకుండా జిల్లా, రాష్ట్ర, దేశ నాయకులతో కూడా సన్నిహిత సంబంధాలు నెరిపేవాడిని. నేను పని చేసిన టెలికం డిపార్టుమెంటులో ప్రతి చిన్న తప్పుకీ ఛార్జి షీట్, మెమో ఇచ్చేసేవారు, ఆ రోజుల్లో. ఇది ఇరవైనాలుగు గంటలూ పని చేసే శాఖ కనక తప్పులు కూడా ఎక్కువగానే జరుగుతూ ఉండేవి.

అప్పుడు మాలాటి నోరున్న, అనగా కలంతో పొడవగలిగిన వాళ్ళ ఆవశ్యకత ఎక్కువ ఉండేది. వీళ్ళకి రూల్స్ తెలిసి ఉండటం, కొద్దిగా ఇంగ్లీష్ ముక్కలు వచ్చి ఉండటం, రాయగలగటం, నోరు పెట్టుకుని నెగ్గుకు రాగలగడం, భయపెట్టడం, ఒకటేంటి సర్వ విధాలా తోటి ఉద్యోగిని కాపాడాలనే తలపే ఉండేది. ఈ రాయడం అన్న దురద అప్పటిదే, కొత్తగా వచ్చినది కాదు, అప్పుడవసరం. ముఫై ఐదు సంవత్సరాల తరవాత ఆ రోగం తిరగపెట్టింది, :). ఛార్జి షీట్లు, మెమోలు ఇవే మా నిత్య కృత్యం, అప్పుడు. చిన్న సైజు చెట్టుకింద ప్లీడర్ ఉద్యోగమన్నమాట, అసలుద్యోగంతో పాటు.. సాధారణంగా ఒక ఆఫీసులో ఇటువంటివాళ్ళు ఒకరో ఇద్దరో ఉండేవారు. ఉద్యోగస్తులు మా మాట వినేవారు, మేము చెప్పిన వారికి ఓటేసి యూనియన్ ఎన్నికలలో గెలిపించేవారు. అందుకని మాకు ఇటు ఉద్యోగస్తులలో అటు నాయకులలో, ఆఫీసర్లలో కూడా మంచి పేరు ఉండేది. మేమూ తప్పులు చేసేవాళ్ళం కాని అవి పెద్ద తప్పులు కాక పోవడం మూలంగానూ, మమ్మల్ని ముట్టుకుంటే దూలగొండి/ దురద గొండి ముట్టుకున్నట్లే అనుకునేవారనుకుంటా ఆఫీసర్లు, మా జోలికి వచ్చేవారు కాదు. ఈ సేవ చేసినందుకు ప్రతిఫలం, ఎప్పుడూ, ఎవరిదగ్గరనుంచీ కూడా ఆశించకపోవడం మరొక ప్లస్ పాయింటు. అసలా ఆలోచనే ఉండేదికాదు. కొన్ని కొన్నిటికి మేము రాయడం మానేసి జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకుల దగ్గరికి పంపేవాళ్ళం. వాళ్ళు కూడా డబ్బులు తీసుకున్నట్లు ఉండేది కాదు కాని, వెళ్ళిన వాళ్ళు, యూనియన్ కి విరాళం ఇచ్చి రావడం జరిగేది. ఒక ఛార్జి షీట్ కి నేను రాసిన డిఫెన్స్ చదివిన ఒక ఆఫీసరు గారు కేకేసి బాగా రాశావు, ఇంత తెలివయినవాడివి 🙂 ఆఫీసర్ పరీక్షకి చదివి పాసవచ్చుకదా అనే అలోచన బుర్రలో పారేశారు. అది సఫలం కావడానికి కొంత సమయం, సందర్భం తరవాత కలసి వచ్చాయనుకోండి. ఆఫీసర్ అయిన తరవాత పరిస్థితి ఇబ్బందిగా ఉండేది, మనసుండటంతో. ఇటువంటి సందర్భంలో, ఆఫీస్ లో చెట్టుకింద ప్లీడర్ని పిలిచి “ఫలానా వారు ఈ తప్పు చేసేరు, ఏంచేయనూ” అని అడిగితే, “మొదటి తప్పు వదిలెయ్యండి సార్” అంటే “సరే” అంటూ మరి “తరవాత తప్పు చేస్తే ఛార్జి షీట్ ఇచ్చేస్తానని” బెదిరిస్తూ, తప్పులు దిద్దుకుందుకు సమయమిస్తూ, నా ఆఫీసర్ గిరీలో, ఇరవై సంవత్సరాలలో ఇచ్చిన ఛార్జి షీట్లు రెండు. ఎక్కడినుంచి ఎక్కడికోపోయాను కదా! వెనక్కొద్దాం.

ఇలా కింగ్ మేకర్ గా ఉంటూ ఉన్న సమయంలో ఒక సారి మా జిల్లా సభలు మా ఊళ్ళో పెట్టించేము. వేతన కమిషన్ రిపోర్ట్ వచ్చిన సందర్భం. ఆ వేతన కమిషన్లో అన్యాయం జరిగింది. ఆ సభలో ప్రభుత్వ పెట్టుబడిదారీ విధానాన్ని రాత్రంతా, ఖడించి, చర్చించి అలసిపోయి, మైక్ లు విరిగేలా ప్రసంగించి, చివరాఖరికి ఎన్నికలు జరిపించి, మేము కావాలనుకున్న వాళ్ళను నెగ్గించుకుని అలిసిపోయాము. ఆ సభకి జిల్లా, రాష్ట్ర, దేశనాయకులంతా రావడం జరిగింది. సభ పూర్తి అయిన తర్వాత మాట్లాడుకుంటు నలుగురమూ కాఫీకి బయలుదేరి హోటల్ కి చేరేము. మాకు ఒక టేబుల్ దగ్గర ఒక వైపు నాలుగు సీట్లు దొరికేయి. ప్రోటొకోల్ పాటిస్తూ దేశ నాయకుని పక్క రాష్ట్ర నాయకుడు ఆయనపక్క జిల్లా నాయకుడు, చివరగా నేనూ కూచున్నాము. సప్లైయర్ కుర్రాడు ప్లేట్లో మంచి నీళ్ళు తెచ్చి పొరపాటున ఒక గ్లాసు ఒంపేశాడు. ఆ నీళ్ళు ఎక్కువగా నామీద, మరికొద్ది తక్కువ నా పక్క వారిమీద ఆ తరవాత వారి మీద బహు తక్కువగా పడ్డాయి.మా రాష్ట్ర నాయకునికి కోపం వచ్చేసి కేకలేయడం మొదలెడితే, కుర్రాడు బిక్క చచ్చిపోయాడు. ఈ కేకలకి ఓనర్ పరుగెట్టుకొచ్చాడు. నన్ను చూసి ఏంటిసార్ అన్నాడు. ఈ లోగా మా నాయకుడు ఆ కుర్రాణ్ణి కొట్టినంతపని చేశాడు. ఓనర్ కూడా కుర్రాడిమీద కోపపడటం మొదలెడితే నేను సద్ది పంపేశాను. టిఫిన్ చేసి బయటికొచ్చిన తరవాత, ఒక్కడూ ఉండగా అడిగేశాను, ఉండబట్టలేక. మనమంతా కార్మిక పక్షపాతులం కదా. ఆ కుర్రాడు నీళ్ళు మన మీద కొద్దిగా, పొరపాటున చిందించినందుకంత కోప పడాలా అని. ఆ కుర్రాడు కూటికి లేక యీ ఉద్యోగం చేస్తున్నాడు, మనం సానుభూతి చూపవలసినదిపోయి వాడి మీద ఎగిరితే, ఓనర్ వాణ్ణి పనిలోంచి తీసేస్తే ఎవరు నష్టపోతారు? అన్నా. దానికతను కొద్దిగా కంగుతిని “అదివేరు ఇది వేరు” అన్నాడు. నాకయితే బలే కోపం వచ్చింది. తమాయించుకుని, వేసవికాలం, మీమీద కొద్దిగానే నీళ్ళు పడ్డాయి మాతో పోలిస్తే. ఇదేమీ క్షమార్హం కాని తప్పేమీకాదు.నన్నడిగితే అది పొరపాటేకాని తప్పుకాదు, అని చెప్పి… మరింకా చెబితే బాగోదని ముగించేశాను. ఆ తరవాత కొద్దికాలానికే ఆ అవతారం చాలించి ఆఫీసర్ అవతారమెత్తా.

ఎప్పుడయినా ఎక్కడయినా లోకువ వాణ్ణి చూస్తే మొత్తబుద్ధి, అదే మన పూర్వీకులు చెప్పిన నానుడి మెత్తని వాణ్ణి చూస్తే మొత్తబుద్ధి నిజమే కదా.

శర్మ కాలక్షేపంకబుర్లు-మండు వేసవిలో ప్రకృతి సిద్ధమయిన చల్లటి మంచినీళ్ళు.NATURAL FRIDGE.

Posted on మే 25, 2013
మండు వేసవిలో ప్రకృతి సిద్ధమయిన చల్లటి మంచినీళ్ళు. NATURAL FRIDGE

ఎండలు మండిపోతున్నా,చల్లటి మంచినీళ్ళు తాగితే ప్రాణం లేచొస్తుంది. ఎలా అంటే, ‘కుండలో నీళ్ళు తాగండి, లేదా ఫ్రిజ్ లో నీళ్ళు తాగండి’ అన్నారొకరు. కొత్తకుండలో నీరు తీయన కోరిన మగవాడే తీయన అన్నారు సినీ కవి. కొత్తకుండలో నీళ్ళు తియ్యగానూ, చల్లగానూ ఉంటాయి కాని గొతు రాస్తుంది. రాయడమంటే ఒరుస్తుంది. పాత కుండలో నీళ్ళు చల్లగా ఉండవు, కొత్త కుండ చెమర్చినట్లు పాత కుండ చెమర్చదు కనక, నీళ్ళు చల్లగా ఉండవు.చెమర్చకుండా ఉండే కుండని ‘పన్ను’ అయిన కుండ అంటారు. ఇదీ ఉపయోగమే. దీనిలో మామిడి కాయ ఊటలాటివి పోసేవారు లెండి. ఇక ఫ్రిజ్! అమ్మో ఇదంటేనే భయం నాకు. ఎందుకంటే, వేసవి రోగాలకు పుట్టినిల్లు ఫ్రిజ్ అని నా నమ్మకం. నా ఇల్లాలు, అందుకే వారం కి ఒక సారి దీనిని శుభ్రం చేస్తూనే ఉంటుంది. అన్నట్టు ఏమయినా కరంటు ఉండాలిగా 🙂 ఇందులో పెట్టుకున్న నీళ్ళు తాగితె నాకు మాత్రం జ్వరం ఖాయంగా వచ్చేస్తుంది. మరి నాలాటి వాళ్ళు వేసవిలో వేడి నీళ్ళు తాగిబతకాలిసిందేనా అంటే ఎన్నటికీ కాదని చెప్పేరు మన పూర్వులు. ప్రకృతికి దగ్గరగా చల్లటి మంచినీళ్ళు లభ్యం ఇలా.

ఒక ఇత్తడి/రాగి బిందె తీసుకుని నిండా నీరుపోయండి. ఒక తెల్లటి దుప్పటి/ పంచ బరువు ఆపేదాన్ని తీసుకుని తడిపి, బిందెపై వేయండిమూతి బిగించండి, తాడుతో. గుడ్డ తలం సమానంగా ఉండేందుకే,. బిందెను గచ్చుపై బోర్ల వేయండి, ఒక్క ఉదుటున. నీళ్ళెక్కడికీ పోవు,మూతికి బిగించిన తాడు విప్పేయండి.. ఇప్పుడు పంచె తాలూకు రెండు కొసలు ముడేయండి, దగ్గరగా. మిగిలిన కొసలు ముడెయ్యండి. దీనిని ఒక కొక్కేనికి తగిలించండి, బిందె కింద అంచు సమతలం లో ఉండేలా. వేడి గాలి వీస్తున్న చోట కూడా వేలాడతీయచ్చు. కాసేపుపోయాకా గ్లాసు పట్టుకెళ్ళి బిందె ఒకంచు లేపండి, రెండవ అంచున నీళ్ళు పట్టుకోండి. నీళ్ళు చల్లగా హాయిగా ఉంటాయ్. నీళ్ళు కారిపోవు. బిందెలో నీరు అయిపోయేదాకా వాడుకోవచ్చు. వేసవిలో ఇలా చల్లటినీళ్ళు రాత్రి పగలు వాడకానికి మా ఇంట్లో ఒక బిందె వేలాడ తీసి ఉంటుందిలా. ఎప్పుడు నీళ్ళయిపోతే అప్పుడు మళ్ళీ కట్టెయ్యడమే. ఇలా తిరగేసిన బిందెలో మంచినీళ్ళు వేసవిలో తాగటం మా ఇంట తరతరాలుగా వస్తున్నదే.ఉదయమే ఇలా కట్టేసుకుంటే మధ్యాహ్నానికి నీళ్ళు బలే చల్లగా ఉంటాయి.

గుడ్డ మూతేసిన బిందె తిరగదీస్తే నీళ్ళెందుకు కారిపోలేదు? బిందె పక్కకి వంచితే ఎందుకు నీళ్ళు కారుతున్నాయి? అసలు నీళ్ళెందుకు చల్లబడుతున్నాయి? మీకు తెలుసా తెలిస్తే చెప్పరూ!

ఇందులో సయిన్స్ సూత్రాలున్నాయిట 🙂 పిల్లలనడగండి, పిల్లల చేత ఈ ప్రయోగం చేయించండి. సయిన్స్ సూత్రాలూ వాళ్ళు మరిచిపోతే ఒట్టు. చదువుకోని పల్లెటూరి వాళ్ళం కదండీ, మాకు సయిన్స్ తెలీదు, ప్రకృతికి దగ్గరగా బతకడమే తెలుసు……

ప్రయత్నించి సయిన్స్ సూత్రాలూ మాకు చెబుతారు కదూ చల్లటి మంచినీళ్ళు తాగి…

పైది ఐదేళ్ళకితం మాట. తాజా కలం,నేటి మాట.

వేసవి తీవ్రంగా ఉంది, పెద్దలు పిన్నలు అ ందరు జాగ్రత్తలు తీసుకోవలసిన కాలం.పిన్నలు, ముసలివాళ్ళకి వడకొడితే తేరుకోలేరు, వడకొట్టకుండా చూసుకోండి.

1.చిట్టుడుకునీళ్ళు తాగండి. ఉ.మ.సా (ఉదయం,మధ్యాహ్నం,సాయంత్రం) కొద్దిగా ఉప్పేసుకుని మరీ తాగండి, సబ్జాగింజలేసుకోండి.ఈ నీళ్ళు పిల్లలకి,ముసలాళ్ళకి శక్తిని కూడా ఇస్తాయి,వెంటనే
2.చిటికెడు ఉప్పు,చారెడు పంచదార నీళ్ళలో కలుపుకు తాగండి,గోరువెచ్చని నీళ్ళు మంచివి.
3.పచ్చి ఉల్లిపాయ తినండి, అన్నంలో, కొద్దిగా కొత్తావకాయ కలుపుకోండి.
4.పళ్ళు తినండి, ముఖ్యంగా మామిళ్ళు, పరిమితంగా.
5.ఎండలో తిరగద్దు,ముఖ్యంగా పది-నాలుగు మధ్య.
6.ఫ్రిజ్ లో చల్లని మంచినీళ్ళు తాగద్దు, మలబద్ధకమే కాక అనారోగ్యం కూడా చేస్తుంది. అత్యవసర సమయాల్లో తప్పించి,ఎక్కడపడితే అక్కడ నీళ్ళు తాగకండి.
7. చల్లని పానీయాలు బాటిళ్ళలోవాటిని అసలు తాగద్దు, ఇవే అనారోగ్య కారణాలు.
8.ఫ్రిజ్ సాధ్యమైనవరకు వేసవిలో వాడద్దు.

 

శర్మ కాలక్షేపంకబుర్లు-ఎదురుచూపులు

Posted on మే 7, 2012
6
ఎదురు చూపులు.

నేటి కాలానికి ఎదురు చూపులు గురించి చెప్పుకోడానికి పెద్దగా కనపడటం లేదు. ఇదివరకు పెళ్ళి చూపులకొస్తే ఇంటికి వెళ్ళి కబురు చేస్తాం అనేవారు. ఇప్పుడు ముఖం మీదే అమ్మాయి, “ఈ పెళ్ళికొడుకు నాకు నచ్చలేదు, నా కంటే ఒక అంగుళం పొడుగున్నా”డనో, “అబ్బే కుదరదు, ఆమ్మాయి నాకు నచ్చలేద”నో అబ్బాయి అక్కడికక్కడే చెప్పేస్తున్నారు, మరి ఎదురు చూపెక్కడా? పరీక్షలు రాశాకా ఫలితాల కోసం మాత్రం ఎదురు చూస్తున్నాం.

“లచ్చమ్మా! మనవరాలు పురిటికొచ్చిందిట కదా! ఏదీ?” “పిన్నీ! నిన్ననే తీసుకొచ్చారు మీ అల్లుడెళ్ళి. నీకు కబురు చెప్పమని, చెప్పి పంపేను, చెప్పేరో లేదో, నువ్వే వచ్చావు వాన చినుకులా,” లచ్చమ్మ మెచ్చుకోలు. “అల్లుడు పొలమెళుతూ చెప్పేడే, అందుకే పరుగెట్టు కొచ్చా. అల్లుణ్ణి మరీ నోట్లో వేసుకుంటున్నావే నువ్వు, ఇంతకీ పిల్లేదీ?.” “అమ్మామ్మా ఇక్కడే ఉన్నా!.” “ఏంచేస్తున్నావే.” ఆరేసిన బట్టలు తీస్తున్నా అమ్మమ్మా.” “సరే ఇలారా! సరిగా నిలబడవే, వెనక్కి తిరుగు.” “లచ్చమ్మా! నీకు మనవరాలు పుడుతుందే! నెల పడుతుందే పురుడు రావడానికి. పురుడు సులభంగా వస్తుంది. కడుపుతూ వున్నమ్మ కనకా మానదు, వండుకున్నమ్మ తినకా మానదే పిచ్చిదానా, కంగారెందుకూ.” ఇల్లా చెప్పేసేవారు, కడుపుతున్నవారిని చూసి. అవి నిజమయ్యేవి కూడా. “ఆ ముంతెడు నీళ్ళు పోసేదాకా నీదే భారం పిన్నీ!” లచ్చమ్మ అర్ధింపు. “అదేంటే అంత చెప్పాలా, ఇది నా మనవరాలు కాదూ, అది బాధ పడితే నేను చూడగలనా? వస్తామరి, పనుంది. అవసరంబట్టి కబురు చెయ్యి.” తియ్యనైన ఎదురు చూపు, బిడ్డకోసం. ఇప్పుడేదీ ఆ ఆప్యాయత, అనుబంధం?.మగ పిల్లవాడా, ఆడపిల్లా, టెస్టులు చేసి చెప్పేస్తున్నారు. ఎదురు చూపులేదు. “డాక్టర్ గారు రేపు మధ్యాహ్నం పన్నెండు ఒంటి గంట మధ్య జాతక చక్రం బాగుంది, అమ్మాయి పురిటి నొప్పులు పడలేదు, ఆపరేషన్ చెయ్యండి.” ఇల్లా రావణుడు మేఘనాధుడిని జన్మింపచేసినట్లుగా ఉంటున్నాయి, నేడు. ఎదురు చూపేదీ? యాంత్రికమైపోయింది, అనుబంధాలూ చచ్చిపోతున్నాయి.

రైలు కోసం వెళితే మాత్రం ఎదురు చూపు ఇప్పటికీ తప్పటం లేదు. పాపం వారు మాత్రం ఇంకా ఎదురు చూడమంటున్నారు, అన్ని విషయాలలో, రిజర్వేషన్ వైటింగు లిస్టు, కన్ఫం అవుతుందా, ఎదురు చూపు తప్పటంలేదు. విశాఖ- హైదరాబాద్ మధ్య ఎన్ని రెయిళ్ళేసినా, తత్ కాల్ కూడా వెయిటింగే, ఎప్పుడూ. ఘనతవహించిన రయిల్వే వారి ఘనతతో. టిక్కట్లు బ్లాకులో అమ్ముతున్నారు బాబోయ్! అని చెప్పినా చూస్తున్నాం, అంటున్నారు. పాపం విమానాల వారూ తక్కువ తిన లేదుట, నాకు పరిచయం లేదనుకోండి, చెప్పిన మాటలు వినడమే. మరొకటి మాత్రం ఖాయం, భారత దేశంలో రాష్ట్ర/ కేంద్ర ప్రభుత్వాలలో ఏ పనికైనా ఎదురు చూడవలసినదే, ఇది మాత్రం తప్పదు. నిత్యం గేస్ దగ్గరనుంచి అన్నిటికీ ఎదురు చూపే. కరంటు పోతే, ఎప్పుడొస్తుందో ఎదురు చూపే. పంచాయతీ వారు నీళ్ళెప్పుడిస్తారో, దానికీ ఎదురు చూపే. ఒకప్పుడు ఉత్తరం కోసం ఎదురు చూసేవాళ్ళం. ఉత్తరం రాసేవారే లేరు. మొన్నా మధ్య ఒక స్నేహితుడు ఫోన్ లో కబుర్లు చెప్పి మీ అడ్రస్ ఇవ్వండని రాసుకుని ఫోన్లో చెప్పుకున్నవే మళ్ళీ ఉత్తరం లో రాశాడు. ఏమంటే ఉత్తరం రాసే అలవాటు పోతుందని అన్నాడు. ఉత్తరమైతే మళ్ళీ మళ్ళీ చదువుకుని ఆనందించచ్చు. ఫోన్ లో చెప్పిన కబుర్లు గాల్లో కలిసిపోయాయ్ కదా. అదేంటీ అవి రికార్డ్ చేసుకొవచ్చంటారా. ఏమో అందరికి సాధ్యమా? ఏమయినా ఉత్తరంలో ఉన్న తీపి ఇందులో లేదేమో!

ముఖ్యమైన వారు రావాలి, వస్తారని తెలుసు, కాని మనసు ఆగదే, వీధిగుమ్మం దగ్గరే తచ్చాడుతూంటే అమ్మనేది, “నాన్నా! ఒరేయ్ నీపెళ్ళాం గుమ్మం దాకా వచ్చినది లోపలికి రాదురా, ఎందుకూ కాలు కాలిన పిల్లిలా తిరుగుతావ”నేది. ఆ ఎదురు చూపు మధురంగా ఉంటుంది. ఇప్పుడు రావలసినవారు దగ్గరా మన దగ్గరా సెల్ ఫోన్లు, “రైలెక్కేను, ఏదో స్టేషన్లో ఉన్నా, రైలు దిగేను, కారెక్కేను. కారు దిగేను, బయటికొచ్చి సామాన్లు తీయడానికిసాయం చెయ్యాలని కూడా చెప్పాలా, స్టేషనుకి ఎలాగా రాలేదు ఇంటికొచ్చాకైనా బయటికొచ్చి చూడచ్చుగా,” ఇదీ వరస నేడు. ఆ అనుభూతి ఏదీ? ఆ అనుబంధం ఇగిరిపోతూ ఉందా? బాంధవ్యం యాంత్రికమైపోతూ ఉందా? మనసులో అర్ద్రత పోతూ ఉందా? మనిషికి మనిషి పట్ల ప్రేమ, అభిమానం అన్నీ నేడు యాంత్రికమేనా? ఒకరిని ప్రేమించేటపుడు వారి బలహీనతలని కూడా ఒప్పుకోక తప్పదు కదా.

ప్రేయసి ప్రియులకు ఎదురు చూపు మధురమే.ఎదురు చూపు తరవాత ప్రణయ కలహం, అలక తీరి కలిసేదే అందమైన బంధం. ఎదురు చూసి ఎదురుచూసి కన్నుదోయి అలసిపోయె..నీవురావు నిదురరాదు అన్నారో సినీ కవి. విచిత్రం కన్నుదోయి అలసిపోవడం ఏంటీ, ఇది కవి సమయం. మనసు చేసే చిత్రం. మనసు అలసింది, కాని కన్నుదోయి అలసిందన్నారు కవి. కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూశా ఇది తెనుగు నుడికారం. కళ్ళు కాయలు కాస్తాయా? కావలసిన వారు కనపడినపుడు కాసిన కాయలు పళ్ళవుతాయి. అంటే మనసు సంతోషిస్తుంది.

ఇంతకీ ఎవరికోసం మీ ఎదురు చూపు?, అన్నారా, అడిగేశారా, అనుకుంటూనే ఉన్నా, మనవరాలు రావాలి… అదీ ఎదురు చూపు.

ఇది మనసు చేసే చిత్రం కాదూ…..

శర్మ కాలక్షేపంకబుర్లు-ఎదురుచూపు

Posted on మే 6, 2012
6
ఎదురు చూపు.

సర్వేంద్రియాణాం నయనం ప్రధానం, అని ఒకప్పుడు చూపుల గురించి అనుకున్నాం. ఇప్పుడు ఎదురుచూపు గురించి చూద్దాం. ఎదురు చూపు అన్నది జీవితంలో అందరికి అనుభవంలోకి వచ్చేదే, ఏదో ఒక సందర్భంలో. మన అలవాటు ప్రకారంగా కొన్ని ఎదురు చూపులు చూద్దాం. మొదటగా రుక్మిణీ దేవి కృష్ణునికి రాయబారం పంపి ఎదురు చూసిన సందర్భం చాలా గొప్పది, అది చెప్పుకుందాం. తరవాత సీతా దేవి ఎదురు చూపు చెప్పుకుందాం. మూడవది ఎదురు చూపు అనక్కర లేదు, ఎందు కంటే, రాయబారం వెళ్ళిన కృష్ణునికి తెలుసు, పాండవులకూ తెలుసు చూచాయగా, సంధి కుదరదని. అది ఎదురు చూపేకాదని నా భావం.

“అన్నతలంపు తానెఱిగి యన్నవనీరజగంధి లోన నా
పన్నత నొంది యాప్తుడగు బ్రాహ్మణునొక్కని జీరి గర్వసం
ఛన్నుడు రుక్మి నేడు నను చైద్యున కిచ్చెదనంచు నున్నవా
డెన్ని విధంబులం జని బుధేశ్వర! చక్రికి విన్నవింపవే!
అన్నగారి తలపు తెలిసిన రుక్మిణి ఆప్తుడైన బ్రాహ్మణుని పిలిచి, నన్ను చైద్యునకిచ్చి వివాహం చేస్తానంటున్నాడు రుక్మి అని కృష్ణునికి చెప్పమని ఇంకా…..

అంకిలి సెప్పలేదు చతురంగ………….కృష్ణ పురుషోత్తమ! చేకొని పొమ్ము వచ్చెదన్!
చతురంగ బలాలతో వచ్చి శిశుపాల, జరాసంధులను నిర్జించి నన్ను రాక్షస వివాహము కొరకు తీసుకుని వెళ్ళు, వస్తాను. నా కోసం వచ్చి నపుడు, మావారు అడ్డుకుంటారు కనక, వారిని బాధ పెట్టకుండా వుండాలనుకుంటే, నేను మా కులాచారం ప్రకారం పార్వతీ దేవిని పూజించడానికి వస్తాను, ఆ సమయంలో తీసుకెళ్ళిపో అని కబురు చేసింది…..వివిధ దేశాల రాజపుత్రులొస్తున్నారు, పెళ్ళి ప్రయత్నాలు జరిగిపోతున్నాయి.

లగ్నంబెల్లి వివాహముం గదిసె నేలా రాడు గొవిందుడు
ద్విగ్నం బయ్యెడి మానసంబు వినెనో వృత్తాంతమున్ బ్రాహ్మణుం
డగ్నిద్యోతను డేటికిన్ దడసె నా యత్నంబు సిద్ధించునో
భగ్నంబై చనునో విరించి కృత మెభ్భంగి బ్రవర్తించునో!

ఘనుడా భూసురుడేగెనో నడుమ మార్గ శ్రాంతుడై చిక్కెనో
విని కృష్ణుండిది తప్పుగా దలచెనో విచ్చేసెనో యీశ్వరుం
డనుకూలింప దలంచునో తలపడో యార్యామహాదేవియున్
నను రక్షింప నెఱుంగునో యెఱుగదో నా భాగ్యమెట్లున్నదో!

వివాహ సమయం దగ్గరపడిపోతూ ఉంది. గోవిందుడు రాలేదు, మనసు ఆతృత పడుతోంది, నా ప్రయత్నం ఫలిస్తుందా? ఫలించదా?, బ్రహ్మదేవుడు ఏం చేయదలుచుకున్నాడో! అగ్ని ద్యోతనుడు ఎందుకు ఆలస్యం చేసేడో,భగవంతుడి నిర్ణయం ఎలావుందో!అనుకుంటూ, అసలు భూసురుడు అక్కడికి చేరుకున్నాడా, మధ్యలోనే మార్గాయాసంతో ఉండిపోయాడా? ఇది విన్న కృష్ణుడు తప్పని అనుకున్నాడా, భగవంతుడు అనుకూలిస్తాడా, అమ్మలగన్నయమ్మ నన్ను రక్షించాలనుకుందో లేదో అని ఎదురు చూస్తూ పరి పరి విధాలుగా అలోచిస్తూ, రుక్మిణి తన మనసులో మాట తల్లికి చెప్పుకోలేదు, మొహం మీద చిరు నవ్వు లేదు, నిద్రపోదు, అలంకరణ చేసుకోదు,కృష్ణునికోసం ఎదురుచూపు మాత్రం మానలేదు. కన్నుల్లో వస్తున్న కన్నీటిని తుడుచుకోటంలేదు, పువ్వులు ముడువదు,మంచినీళ్ళుకూడా తాగడం మానేసింది. ఇక అన్ని విధాలయిన అలంకారాలు మానేసి కృష్ణుని కోసం ఎదురు చూస్తూ ఉంది.” ఇట్లు హరి రాక కెదురు చూచుచు, సకల……బ్రాహ్మణుండు సను దెంచిన….” అలా ఎదురు చూస్తుండగా శుభ శకునంగా ఎడమ భుజము,కన్ను అదిరాయి. అంతలో వెళ్ళిన బ్రాహ్మణుడు రాగా, ముఖ లక్షణాలు చూసి చిరునవ్వుతో ఎదురు వెళితే ఆయన “నీ సందేశం ఆయన మెచ్చేడు, నాకు ధన రాసులిచ్చేడు, ఎవరడ్డమొచ్చినా సరే నిర్జించి తీసుకెళ్తానని చెప్పేడు,” అని చెబుతాడు, అప్పుడు ” మహానుభవా! నా సందేశం చెప్పి కృష్ణుడు వస్తున్నాడనే వార్త చెప్పి నన్ను బతికించావు, నీ లాంటి పుణ్యాత్మకులు ఎవరున్నారు, నీకు ప్రత్యుపకారం చేయలేను, నమస్కరిస్తున్నాను”అంది.

మరి రెండవది సుందరకాండలో ముఫై ఎనిమిదో సర్గలో

జీవితం ధారయిష్యామి మాసం దశరధాత్మజ,
ఊర్ధ్వం మాసా న్న జీవేయం సత్యే నాహం బ్రవీమి తే.

ఒక నెల రోజులు జీవిస్తాను అనగా ఎదురు చూస్తాను రాముని కొరకు, ఆ పైన ఎదురు చూడను, జీవింపను అని చెప్పు అని హనుమతో చెబుతుంది సీతమ్మ తల్లి.

పై రెండు సంధర్భాలలో ఎదురు చూపు చాలా బాధాకరంగానే ఉంది.మొదటి సందర్భంలో రుక్మిణి పడిన బాధను, మనసు ఆమెతో చేసిన చేసిన చిత్రాన్ని లైవ్ టెలికాస్ట్ ఇచ్చారు పోతనగారు. పద్యాలన్నీ పెడితే కష్టమని కొద్దిగానే పెట్టేను.ఆమె కూడా నేడు మనం అనుభవిస్తున్న బాధ, పంపిన వాడు వెళ్ళేడా? లేదా? అక్కడేమి జరిగింది, ఆయన తప్పనుకున్నాడా, ఇలా రాయబారం పంపడం? తీసుకుపొమ్మని కబురు పెట్టినది, తీసుకెళ్ళడానికి వస్తాడా? రాడా?అని మానసికంగా అనుకుంటూ దాని పర్యవసానంగా, శారీరికంగా అనేక అనుభవాలు పొందింది. అగ్ని శుభసూచనలతో కనపడి ఆయన నీ ఆలోచన మెచ్చేడు అని చెప్పేదాకా ఉద్విగ్న మనస్కయై ఉన్నది కదా. ఇక సీతాదేవి రావణుడు ఎత్తుకు వచ్చినది మొదలు దుఃఖం తోనే ఎదురు చూస్తూ ఉంది రాముని కొరకు. ఆ ఎదురు చూపు ఫలించి హనుమ రాయబారిగా వచ్చి, చల్లని వార్త తెచ్చేడు. అప్పుడు తన నిశ్చయం చెప్పింది, ఒక నెల గడువు, ఆపైన ఎదురు చూడను, జీవించను అని.

మరి నేటి కాలానికొస్తే….
టపా చాలా పెద్దదయిపోతుంది కనక రేపటి దాకా ఎదురుచూద్దాం