శర్మ కాలక్షేపంకబుర్లు-ఎదురుచూపులు

Posted on మే 7, 2012
6
ఎదురు చూపులు.

నేటి కాలానికి ఎదురు చూపులు గురించి చెప్పుకోడానికి పెద్దగా కనపడటం లేదు. ఇదివరకు పెళ్ళి చూపులకొస్తే ఇంటికి వెళ్ళి కబురు చేస్తాం అనేవారు. ఇప్పుడు ముఖం మీదే అమ్మాయి, “ఈ పెళ్ళికొడుకు నాకు నచ్చలేదు, నా కంటే ఒక అంగుళం పొడుగున్నా”డనో, “అబ్బే కుదరదు, ఆమ్మాయి నాకు నచ్చలేద”నో అబ్బాయి అక్కడికక్కడే చెప్పేస్తున్నారు, మరి ఎదురు చూపెక్కడా? పరీక్షలు రాశాకా ఫలితాల కోసం మాత్రం ఎదురు చూస్తున్నాం.

“లచ్చమ్మా! మనవరాలు పురిటికొచ్చిందిట కదా! ఏదీ?” “పిన్నీ! నిన్ననే తీసుకొచ్చారు మీ అల్లుడెళ్ళి. నీకు కబురు చెప్పమని, చెప్పి పంపేను, చెప్పేరో లేదో, నువ్వే వచ్చావు వాన చినుకులా,” లచ్చమ్మ మెచ్చుకోలు. “అల్లుడు పొలమెళుతూ చెప్పేడే, అందుకే పరుగెట్టు కొచ్చా. అల్లుణ్ణి మరీ నోట్లో వేసుకుంటున్నావే నువ్వు, ఇంతకీ పిల్లేదీ?.” “అమ్మామ్మా ఇక్కడే ఉన్నా!.” “ఏంచేస్తున్నావే.” ఆరేసిన బట్టలు తీస్తున్నా అమ్మమ్మా.” “సరే ఇలారా! సరిగా నిలబడవే, వెనక్కి తిరుగు.” “లచ్చమ్మా! నీకు మనవరాలు పుడుతుందే! నెల పడుతుందే పురుడు రావడానికి. పురుడు సులభంగా వస్తుంది. కడుపుతూ వున్నమ్మ కనకా మానదు, వండుకున్నమ్మ తినకా మానదే పిచ్చిదానా, కంగారెందుకూ.” ఇల్లా చెప్పేసేవారు, కడుపుతున్నవారిని చూసి. అవి నిజమయ్యేవి కూడా. “ఆ ముంతెడు నీళ్ళు పోసేదాకా నీదే భారం పిన్నీ!” లచ్చమ్మ అర్ధింపు. “అదేంటే అంత చెప్పాలా, ఇది నా మనవరాలు కాదూ, అది బాధ పడితే నేను చూడగలనా? వస్తామరి, పనుంది. అవసరంబట్టి కబురు చెయ్యి.” తియ్యనైన ఎదురు చూపు, బిడ్డకోసం. ఇప్పుడేదీ ఆ ఆప్యాయత, అనుబంధం?.మగ పిల్లవాడా, ఆడపిల్లా, టెస్టులు చేసి చెప్పేస్తున్నారు. ఎదురు చూపులేదు. “డాక్టర్ గారు రేపు మధ్యాహ్నం పన్నెండు ఒంటి గంట మధ్య జాతక చక్రం బాగుంది, అమ్మాయి పురిటి నొప్పులు పడలేదు, ఆపరేషన్ చెయ్యండి.” ఇల్లా రావణుడు మేఘనాధుడిని జన్మింపచేసినట్లుగా ఉంటున్నాయి, నేడు. ఎదురు చూపేదీ? యాంత్రికమైపోయింది, అనుబంధాలూ చచ్చిపోతున్నాయి.

రైలు కోసం వెళితే మాత్రం ఎదురు చూపు ఇప్పటికీ తప్పటం లేదు. పాపం వారు మాత్రం ఇంకా ఎదురు చూడమంటున్నారు, అన్ని విషయాలలో, రిజర్వేషన్ వైటింగు లిస్టు, కన్ఫం అవుతుందా, ఎదురు చూపు తప్పటంలేదు. విశాఖ- హైదరాబాద్ మధ్య ఎన్ని రెయిళ్ళేసినా, తత్ కాల్ కూడా వెయిటింగే, ఎప్పుడూ. ఘనతవహించిన రయిల్వే వారి ఘనతతో. టిక్కట్లు బ్లాకులో అమ్ముతున్నారు బాబోయ్! అని చెప్పినా చూస్తున్నాం, అంటున్నారు. పాపం విమానాల వారూ తక్కువ తిన లేదుట, నాకు పరిచయం లేదనుకోండి, చెప్పిన మాటలు వినడమే. మరొకటి మాత్రం ఖాయం, భారత దేశంలో రాష్ట్ర/ కేంద్ర ప్రభుత్వాలలో ఏ పనికైనా ఎదురు చూడవలసినదే, ఇది మాత్రం తప్పదు. నిత్యం గేస్ దగ్గరనుంచి అన్నిటికీ ఎదురు చూపే. కరంటు పోతే, ఎప్పుడొస్తుందో ఎదురు చూపే. పంచాయతీ వారు నీళ్ళెప్పుడిస్తారో, దానికీ ఎదురు చూపే. ఒకప్పుడు ఉత్తరం కోసం ఎదురు చూసేవాళ్ళం. ఉత్తరం రాసేవారే లేరు. మొన్నా మధ్య ఒక స్నేహితుడు ఫోన్ లో కబుర్లు చెప్పి మీ అడ్రస్ ఇవ్వండని రాసుకుని ఫోన్లో చెప్పుకున్నవే మళ్ళీ ఉత్తరం లో రాశాడు. ఏమంటే ఉత్తరం రాసే అలవాటు పోతుందని అన్నాడు. ఉత్తరమైతే మళ్ళీ మళ్ళీ చదువుకుని ఆనందించచ్చు. ఫోన్ లో చెప్పిన కబుర్లు గాల్లో కలిసిపోయాయ్ కదా. అదేంటీ అవి రికార్డ్ చేసుకొవచ్చంటారా. ఏమో అందరికి సాధ్యమా? ఏమయినా ఉత్తరంలో ఉన్న తీపి ఇందులో లేదేమో!

ముఖ్యమైన వారు రావాలి, వస్తారని తెలుసు, కాని మనసు ఆగదే, వీధిగుమ్మం దగ్గరే తచ్చాడుతూంటే అమ్మనేది, “నాన్నా! ఒరేయ్ నీపెళ్ళాం గుమ్మం దాకా వచ్చినది లోపలికి రాదురా, ఎందుకూ కాలు కాలిన పిల్లిలా తిరుగుతావ”నేది. ఆ ఎదురు చూపు మధురంగా ఉంటుంది. ఇప్పుడు రావలసినవారు దగ్గరా మన దగ్గరా సెల్ ఫోన్లు, “రైలెక్కేను, ఏదో స్టేషన్లో ఉన్నా, రైలు దిగేను, కారెక్కేను. కారు దిగేను, బయటికొచ్చి సామాన్లు తీయడానికిసాయం చెయ్యాలని కూడా చెప్పాలా, స్టేషనుకి ఎలాగా రాలేదు ఇంటికొచ్చాకైనా బయటికొచ్చి చూడచ్చుగా,” ఇదీ వరస నేడు. ఆ అనుభూతి ఏదీ? ఆ అనుబంధం ఇగిరిపోతూ ఉందా? బాంధవ్యం యాంత్రికమైపోతూ ఉందా? మనసులో అర్ద్రత పోతూ ఉందా? మనిషికి మనిషి పట్ల ప్రేమ, అభిమానం అన్నీ నేడు యాంత్రికమేనా? ఒకరిని ప్రేమించేటపుడు వారి బలహీనతలని కూడా ఒప్పుకోక తప్పదు కదా.

ప్రేయసి ప్రియులకు ఎదురు చూపు మధురమే.ఎదురు చూపు తరవాత ప్రణయ కలహం, అలక తీరి కలిసేదే అందమైన బంధం. ఎదురు చూసి ఎదురుచూసి కన్నుదోయి అలసిపోయె..నీవురావు నిదురరాదు అన్నారో సినీ కవి. విచిత్రం కన్నుదోయి అలసిపోవడం ఏంటీ, ఇది కవి సమయం. మనసు చేసే చిత్రం. మనసు అలసింది, కాని కన్నుదోయి అలసిందన్నారు కవి. కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూశా ఇది తెనుగు నుడికారం. కళ్ళు కాయలు కాస్తాయా? కావలసిన వారు కనపడినపుడు కాసిన కాయలు పళ్ళవుతాయి. అంటే మనసు సంతోషిస్తుంది.

ఇంతకీ ఎవరికోసం మీ ఎదురు చూపు?, అన్నారా, అడిగేశారా, అనుకుంటూనే ఉన్నా, మనవరాలు రావాలి… అదీ ఎదురు చూపు.

ఇది మనసు చేసే చిత్రం కాదూ…..

ప్రకటనలు

రచయిత: kastephale

A retired telecom engineer.

4 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-ఎదురుచూపులు”

  1. ఎదురుచూడడం గురించి (పాత) జయభేరి సినిమాలో “యమునాతీరమున, సంధ్యాసమయమున, వేయికనులతో రాధ వేచియున్నది కాదా” అని చక్కటి పాట ఉంది.

    మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s