శర్మ కాలక్షేపంకబుర్లు-మండు వేసవిలో ప్రకృతి సిద్ధమయిన చల్లటి మంచినీళ్ళు.NATURAL FRIDGE.

Posted on మే 25, 2013
మండు వేసవిలో ప్రకృతి సిద్ధమయిన చల్లటి మంచినీళ్ళు. NATURAL FRIDGE

ఎండలు మండిపోతున్నా,చల్లటి మంచినీళ్ళు తాగితే ప్రాణం లేచొస్తుంది. ఎలా అంటే, ‘కుండలో నీళ్ళు తాగండి, లేదా ఫ్రిజ్ లో నీళ్ళు తాగండి’ అన్నారొకరు. కొత్తకుండలో నీరు తీయన కోరిన మగవాడే తీయన అన్నారు సినీ కవి. కొత్తకుండలో నీళ్ళు తియ్యగానూ, చల్లగానూ ఉంటాయి కాని గొతు రాస్తుంది. రాయడమంటే ఒరుస్తుంది. పాత కుండలో నీళ్ళు చల్లగా ఉండవు, కొత్త కుండ చెమర్చినట్లు పాత కుండ చెమర్చదు కనక, నీళ్ళు చల్లగా ఉండవు.చెమర్చకుండా ఉండే కుండని ‘పన్ను’ అయిన కుండ అంటారు. ఇదీ ఉపయోగమే. దీనిలో మామిడి కాయ ఊటలాటివి పోసేవారు లెండి. ఇక ఫ్రిజ్! అమ్మో ఇదంటేనే భయం నాకు. ఎందుకంటే, వేసవి రోగాలకు పుట్టినిల్లు ఫ్రిజ్ అని నా నమ్మకం. నా ఇల్లాలు, అందుకే వారం కి ఒక సారి దీనిని శుభ్రం చేస్తూనే ఉంటుంది. అన్నట్టు ఏమయినా కరంటు ఉండాలిగా 🙂 ఇందులో పెట్టుకున్న నీళ్ళు తాగితె నాకు మాత్రం జ్వరం ఖాయంగా వచ్చేస్తుంది. మరి నాలాటి వాళ్ళు వేసవిలో వేడి నీళ్ళు తాగిబతకాలిసిందేనా అంటే ఎన్నటికీ కాదని చెప్పేరు మన పూర్వులు. ప్రకృతికి దగ్గరగా చల్లటి మంచినీళ్ళు లభ్యం ఇలా.

ఒక ఇత్తడి/రాగి బిందె తీసుకుని నిండా నీరుపోయండి. ఒక తెల్లటి దుప్పటి/ పంచ బరువు ఆపేదాన్ని తీసుకుని తడిపి, బిందెపై వేయండిమూతి బిగించండి, తాడుతో. గుడ్డ తలం సమానంగా ఉండేందుకే,. బిందెను గచ్చుపై బోర్ల వేయండి, ఒక్క ఉదుటున. నీళ్ళెక్కడికీ పోవు,మూతికి బిగించిన తాడు విప్పేయండి.. ఇప్పుడు పంచె తాలూకు రెండు కొసలు ముడేయండి, దగ్గరగా. మిగిలిన కొసలు ముడెయ్యండి. దీనిని ఒక కొక్కేనికి తగిలించండి, బిందె కింద అంచు సమతలం లో ఉండేలా. వేడి గాలి వీస్తున్న చోట కూడా వేలాడతీయచ్చు. కాసేపుపోయాకా గ్లాసు పట్టుకెళ్ళి బిందె ఒకంచు లేపండి, రెండవ అంచున నీళ్ళు పట్టుకోండి. నీళ్ళు చల్లగా హాయిగా ఉంటాయ్. నీళ్ళు కారిపోవు. బిందెలో నీరు అయిపోయేదాకా వాడుకోవచ్చు. వేసవిలో ఇలా చల్లటినీళ్ళు రాత్రి పగలు వాడకానికి మా ఇంట్లో ఒక బిందె వేలాడ తీసి ఉంటుందిలా. ఎప్పుడు నీళ్ళయిపోతే అప్పుడు మళ్ళీ కట్టెయ్యడమే. ఇలా తిరగేసిన బిందెలో మంచినీళ్ళు వేసవిలో తాగటం మా ఇంట తరతరాలుగా వస్తున్నదే.ఉదయమే ఇలా కట్టేసుకుంటే మధ్యాహ్నానికి నీళ్ళు బలే చల్లగా ఉంటాయి.

గుడ్డ మూతేసిన బిందె తిరగదీస్తే నీళ్ళెందుకు కారిపోలేదు? బిందె పక్కకి వంచితే ఎందుకు నీళ్ళు కారుతున్నాయి? అసలు నీళ్ళెందుకు చల్లబడుతున్నాయి? మీకు తెలుసా తెలిస్తే చెప్పరూ!

ఇందులో సయిన్స్ సూత్రాలున్నాయిట 🙂 పిల్లలనడగండి, పిల్లల చేత ఈ ప్రయోగం చేయించండి. సయిన్స్ సూత్రాలూ వాళ్ళు మరిచిపోతే ఒట్టు. చదువుకోని పల్లెటూరి వాళ్ళం కదండీ, మాకు సయిన్స్ తెలీదు, ప్రకృతికి దగ్గరగా బతకడమే తెలుసు……

ప్రయత్నించి సయిన్స్ సూత్రాలూ మాకు చెబుతారు కదూ చల్లటి మంచినీళ్ళు తాగి…

పైది ఐదేళ్ళకితం మాట. తాజా కలం,నేటి మాట.

వేసవి తీవ్రంగా ఉంది, పెద్దలు పిన్నలు అ ందరు జాగ్రత్తలు తీసుకోవలసిన కాలం.పిన్నలు, ముసలివాళ్ళకి వడకొడితే తేరుకోలేరు, వడకొట్టకుండా చూసుకోండి.

1.చిట్టుడుకునీళ్ళు తాగండి. ఉ.మ.సా (ఉదయం,మధ్యాహ్నం,సాయంత్రం) కొద్దిగా ఉప్పేసుకుని మరీ తాగండి, సబ్జాగింజలేసుకోండి.ఈ నీళ్ళు పిల్లలకి,ముసలాళ్ళకి శక్తిని కూడా ఇస్తాయి,వెంటనే
2.చిటికెడు ఉప్పు,చారెడు పంచదార నీళ్ళలో కలుపుకు తాగండి,గోరువెచ్చని నీళ్ళు మంచివి.
3.పచ్చి ఉల్లిపాయ తినండి, అన్నంలో, కొద్దిగా కొత్తావకాయ కలుపుకోండి.
4.పళ్ళు తినండి, ముఖ్యంగా మామిళ్ళు, పరిమితంగా.
5.ఎండలో తిరగద్దు,ముఖ్యంగా పది-నాలుగు మధ్య.
6.ఫ్రిజ్ లో చల్లని మంచినీళ్ళు తాగద్దు, మలబద్ధకమే కాక అనారోగ్యం కూడా చేస్తుంది. అత్యవసర సమయాల్లో తప్పించి,ఎక్కడపడితే అక్కడ నీళ్ళు తాగకండి.
7. చల్లని పానీయాలు బాటిళ్ళలోవాటిని అసలు తాగద్దు, ఇవే అనారోగ్య కారణాలు.
8.ఫ్రిజ్ సాధ్యమైనవరకు వేసవిలో వాడద్దు.

 

ప్రకటనలు

రచయిత: kastephale

A retired telecom engineer.

25 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-మండు వేసవిలో ప్రకృతి సిద్ధమయిన చల్లటి మంచినీళ్ళు.NATURAL FRIDGE.”

 1. హ! వాడిన్ మీరన్ మాచనవరులు హారమ్ము గా బాం
  డువన్నీటిన్ మూటై గనిరిగద! డూయున్నికన్నీ
  రు వేడిన్ వీడన్ సౌమ్యముగ యుసురుల్ చల్లగన్ గా
  వ! వాణీ వీరే సూవె గురువులు వంద్యుల్ జిలేబీ !

  జిలేబి

  మెచ్చుకోండి

 2. థాంక్స్ గురువుగారు. ఒక మంచి అనుభవాన్ని జ్ఞాపకం చేసినందుకు.
  దాదాపు 1983, 84 ప్రాంతాల వరకూ ప్రతి వేసవికి ‘తిరగేసిన బిందె’లే మమ్మల్ని చల్లగా చూసేవి. ’90 వరకూ కుండ / కూజా నీళ్ళు తాగేవాళ్ళం, ఫ్రిజ్ వున్నాకూడా. ఆ తరవాతే వాటికి, దేశానికీ దూరమయ్యాం, మొన్న డిసెంబర్లో మళ్ళీ కూజా కొనుక్కునే వరకూ.
  ( //..అనుభవాన్ని జ్ఞాపకం..// శ్రీపాద శాస్త్రిగారి పుస్తకం ప్రభావం అనుకుంటా😊)

  మెచ్చుకోండి

   1. విన్నకోట నరసింహారావుగారు,
    ఘర్ వాపసీ అప్పుడే కాదండి. 🙂 శృంగారపురంలో కూడా కూజాలు గట్రా దొరుకుతాయనమాట 🙂
    ధన్యవాదాలు.

    మెచ్చుకోండి

 3. శర్మ గారు మరీ చతురులు. ఫిజిక్స్ లొంగదీసుకుని పోటీపరీక్షలో 95 శాతం తెచ్చుకున్న మీరు (మే 4, 2017 నాటి మీ టపా) “మాకు సయిన్స్ తెలియదు” అంటే ఎలా?
  అయిననూ మీరిచ్చిన క్విజ్ కొంచెం ప్రయత్నిద్దాం. (1). తిరగేసిన బిందెలోని నీళ్ళ ఒత్తిడి కంటే బయటనుంచి ఒత్తుతున్న atmospheric pressure ఎక్కువగా ఉండడం మూలాన బిందెలో నీళ్ళు కింద కారిపోవు. (2). బిందె పక్కకు వంచినప్పుడు బిందె లోపలకు కొంచెం గాలి ప్రవేశిస్తుంది కాబట్టి స్థానభ్రంశం (displacement) మూలాన ఆ మేర నీళ్ళు కిందకి కారుతాయి. (3). అసలెలా చల్లబడుతున్నాయంటే బాష్పీకరణం జరిగి. Evaporation causes cooling అనే సూత్రం ప్రకారం.
  కరక్టేనా 🤔? పాస్ మార్కులొస్తాయా 🙁?

  మెచ్చుకోండి

  1. విన్నకోట వారు, 2 / 3 సమాధానాలు బావున్నాయి. మొదటిది నాకు సరైనదిగా అనిపించలేదు. ఎవరైనా సైన్స్ విజ్ఞులు వివరిస్తే బావుండు?

   మెచ్చుకోండి

   1. అన్యగామి గారు,
    ఇది చాలా చిన్న ప్రక్రియ! మిత్రులు ఐదేళ్ళకితమిచ్చిన వివరణ చూడండి

    ”తాడిగడప శ్యామలరావు on 05:30 వద్ద మే 25, 2013 said: మార్చు
    2 0 Rate This
    శర్మగారూ, నాకు చేతయినంత వరకు దీనిలోని విజ్ఞానశాస్త్రవిషయాలను గురించి చెబుతాను.

    తలక్రిందులుగా వ్రేలాడదీసిన బిందెలో నీరుంది. కాని ఆ నీరు క్రిందికి జరిపోకుండా బిందెకు వాసెన గట్టిన పంచె ఆపుతోంది. చిత్రంగా ఉంది కదా? కాని దీనికి ఒక కారణం ఉంది. అదే గాలికి గల ఊర్ద్వపీడనం. భూమ్యాకర్షణవల్ల నీరు క్రిందికి పడటానికి గాను పంచె మీద అధఃపీడనం కలిగిస్తున్నా దానికి విరుగుడుగా గాలి ఆ పంచె గుడ్దమీద కలిగించిన ఊర్ద్వపీడనం కారణంగా నీరు క్రిందికి పడదు. అయితే దీనికీ‌పరిమితి ఉంది. ఒక పెద్ద డేగిశాతో ప్రయత్నిస్తే గాలి నీటిని పడకుండా ఆపలేదు.

    పంచె అన్నది ఒక రేకు లాంటి వస్తువు కాదుకదా? అది భూతద్దంలో‌చూస్తే ఒక వలలాగా కనిపిస్తుంది దారాల అల్లికతో. మరి దాని ఖాళీల్లోంచి నీరు క్రిందికి పడిపోవాలి కదా? కాని యెందుకు పడదు? దీనికి కారణం తలతన్యత. దారపుపోగులమధ్య ఉన్న చిన్న చిన్న రంద్రాల్లో చిక్కిన నీటిబిందువులను చుట్టూ ఉన్న దారపు పోగులు యీ తలతన్యత అనే‌ శక్తి కారణంగా బంధించి ఉంచుతాయి. పోగులమధ్య మరీ‌ హెచ్చు యెడం ఉండి రంద్రాలు పెద్దపెద్దవిగా ఉంటే ఇది సాధ్యపడదు.

    ఇదంతా సరే కానీ నీరెలా చల్లబడుతోందీ‌ అని సందేహం. మట్టి కుండలోని నీరెలా చల్లబడుతుందో‌ అలాగే. పంచెలోని దారపు పోగుల మధ్య రంద్రాలలో చిక్కిన నీటి బిందువులు మెల్లగా ఆవిరవుతూ గాలిలో‌ కలుస్తాయి. అలా నీరు ఆవిరవ్వలంటే ఆ ప్రక్రియకు కొంత శక్తి అవుసరం. నీటిని మరగిస్తే ఆవిరవుతోందంటే దానికి మనం ఇంధనం మండించి ఉష్ణశక్తిని అందిస్తున్నాం కాబట్టి ఆవిరవటం జరుగుతుంది. కాని ఇక్కడ మనం బయటినుండి శక్తిని అందించటం లేదు కదా ఆవిరవటానికి. కాబట్టి నీటిబిందువులు తమలో అంతర్గతంగా ఉన్న ఉష్ణశక్తినే (దీన్నే latenet heat అంటాం) వాడుకుని ఆవిరవుతాయి. కొంత ఉష్ణశక్తి కోల్పోవటం వలన నీటి బిందువులు చల్లబడతాయి. అప్పుడు చుట్టుపక్కల ఉండే నీటిబిందువులూ చల్లబడతాయి వీటితో ఉష్ణశక్తిని పంచుకోవటం వలన. ఇలా క్రమంగా నీరంతా చల్లబడుతుంది.

    ఈ‌ పైన వ్రాసిన శాస్త్రీయవివరణలో యేమన్నా దిద్దుబాట్లు అవసరమైతే విజ్ఞులు సూచించగలరు.

    కొన్నేళ్ళ క్రిందట గట్టి కాన్వాసుగుడ్డతో చేసిన నీటి సంచులు అమ్మే వారు. వాటిలో నీరుపోసి బాగా గాలి తగిలే‌టట్లు చేస్తే నీరు బ్రహ్మాండంగా చల్లబడిపోయేది. ఇప్పుడెందుకో అవి యెక్కడా కనబడటం లేదు.

    Reply ↓

    kastephale
    on 00:33 వద్ద మే 26, 2013 said: మార్చు
    0 0 Rate This
    @మిత్రులు శ్యామలరావు గారు,
    మిమ్మల్ని చాలా కష్టపెట్టేసేను, క్షంతవ్యుడను.నాకు తెలిసి మీరుఅ చెప్పినది నూటికి నూరు పాళ్ళు నిజం. సయిన్స్ ను మనవారు జీవితానికి ఉపయోగించుకున్నారు. కాన్వాస్ గుడ్డ సంచులు మరి కొన్ని అటువంటి వాటిని ఫ్రిజ్ లు వచ్చి పీకనొక్కేశాయి.మళ్ళీ ప్రకృతికి దగ్గరగా బతికే రోజొస్తుందని ఆశ
    నెనరుంచాలి.
    ధన్యవాదాలు.”
    ధన్యవాదాలు.

    మెచ్చుకోండి

   2. సమాజంలో భాగమ్ము గద నరసన్నా జిలేబీ
    యమై మీరూ మేమూ వెరసి మన యావత్తు లోక
    మ్ము! మాటామం తీ గూడగ మన సమూహమ్మహో, హె
    చ్చుమేల్మిన్గానున్! చేసెదమిచట జుమ్మంచు నాదం !

    జిలేబి

    మెచ్చుకోండి

   3. జిలేబి గారు,
    ”ప్రాసకోసం ఏడ్చానే కూసు ముండా” అన్నాట్ట కొత్తగా పజ్యాలు రాయడం మొదలెట్టిన ఒకడు మీలాగే 🙂 చివరిపాదంలో ఝుమ్మంటు నాదమేంటో 🙂
    ధన్యవాదాలు.

    మెచ్చుకోండి

   4. ఓయమ్మా! ప్రాసలకై
    న్యాయమ్మా యిటుల మమ్ము నాదమ్ములతో
    వేయించడము జిలేబీ !
    సోయగముల నోలలాడు సొగసరి యొగ్గేయ్ 🙂

    జిలేబి

    మెచ్చుకోండి

  2. విన్నకోట నరసింహారావుగారు,
   ఏక సంతాగ్రాహులు 🙂 photographic memory 🙂
   పాస్ మార్కులేమండీ ఫుల్ మార్కులే. 🙂
   ఇది తరతరాలుగా వస్తున్న ఆచారం. జీవితాలని సుఖమయం చేసుకోడానికి, సైన్స్ ను ఆచారంగా వాడుకున్నారు, నేడు సైన్స్ తెలుసు, వాడుకోవడం చాత గాదు! అంతే తేడా
   ధన్యవాదాలు.

   మెచ్చుకోండి

   1. ఆహా, నేను పాస్ 🤣. థాంక్సండి.
    👏👏 (తమ విజయానికి వినమ్రతకు బదులు తమకు తామే చప్పట్లు కొట్టుకోవడం టీవీ షో లలో బాగా ఎక్కువైపోయింది కదా. వాటిల్లోకొచ్చే పిల్లలు కూడా అదే నేర్చుకుంటున్నట్లున్నారు. సరే అయితే అదే కరక్టేమోనని నేను కూడా అలాగే చప్పట్లు కొట్టుకుంటున్నానన్నమాట 😉 😀😀. చూసారా, టీవీల సినిమాల – విజువల్ మీడియా – ప్రభావం బయట మనుషుల మీద ఎలా పడుతోందో మరి ☝️😥)

    మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

   2. విన్నకోట నరసింహారావుగారు,
    మనమూ సమాజంలో భాగమే కదండీ! వేరుగా ఎలా ఉండగలం 🙂 ప్రభావాలు తప్పవు 🙂
    ధన్యవాదాలు.

    మెచ్చుకోండి

 4. ఇవి కాలక్షేపం కబుర్లు అని మీరు అనుకుంటున్నారు. ఏ చిన్న విషయమైనా ఎంత బాగా చెప్తారో. విన్నకోట వారు, ఇంతలా ఆలోచించనే లేదండీ.

  మెచ్చుకోండి

 5. వారాంతంలో బ్లాగుల జోలికి రాక చూడలేదు. మీరు పొందుపరచిన శ్యామలరావుగారి వివరణ బావుంది. అలాగే మీరు surface tension గురించి విడమర్చక పోతే నాకు పూర్తిగా అర్థమయ్యేది కాదు. ఓపిగ్గా అన్ని చెప్పిన పెద్దలందరికి నమస్కారం.

  మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s