శర్మ కాలక్షేపంకబుర్లు-పెళ్ళయి ఏభై ఏళ్ళు పూర్తయింది( 51 వ పెళ్ళి రోజు )

Posted on మే 25, 2012
51
పెళ్ళయి ఏభయి ఏళ్ళు పూర్తయింది.

సరిగా ఏభయి ఏళ్ళకితం ఈ రోజు నా భార్య, నా ఇల్లాలు, నా గృహలక్ష్మి, నా రామూకి మా, కాదండీ నా బహిః ప్రాణం నా జీవితంలో ప్రవేశించింది, నేనామెలో ఇమిడిపోయా.

ఒక్క సారి ఏభయి ఏళ్ళ వెనక్కి వెళదాం. పెళ్ళయిపోయింది, అప్పగింతలయిపోయాయి, ముక్కు చీదుళ్ళయ్యాయి, ఒడికట్టు కట్టేశారు, పల్లకీ ఎక్కించేశారు ఇద్దరినీ. ఎదురుగా ఉన్న శతావధాని శ్రీచెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి గారింటిలో విడిది గృహ ప్రవేశం చేశాము. అప్పటితో ఆవిడ పూర్తిగా నాది, నేను అమె వాడిని అయిపోయాం. దీక్ష పూర్తి అయింది కనక మధుపర్కాలు విడిచేద్దామనుకుంటూ ఉండగా, అమ్మ “ఉండండి, ఒక్క సారి ఆ బట్టలతో” అని “మీరిద్దరూ కలిసి వెళ్ళి ఆది దంపతుల దర్శనం చేసుకురమ్మ”ని చెప్పి నా చేతిలో డబ్బులు పెట్టింది. జనాంతికంగా “ఎవరేనా వీళ్ళని శివాలయానికి తీసుకెళ్ళండే” అని అంది. ఎవరూ కదలలేదు. “మనకేమీ కొత్తా, నడవవోయ్” అన్నట్లు చూశా. “పదండి” అన్నట్లు అడుగు ముందుకేసింది. కళ్ళద్వారా మనసులు మాటాడుకున్నాయి. ఇంకేమి కావాలి చెయ్యీ చెయ్యీ పట్టుకుని, అదేనండీ చిటికినవేళ్ళు లంకె వేసి బయలుదేరాం, మొదటి అడుగుపడింది, అలా మరో మాటలేకుండా, ఎర్రటి ఎండలో, రాబోయే జీవితాన్ని సూచిస్తూ, ఆది దంపతుల దర్శనం కోసం. వెనక్కి చూశాం ఎవరేనా వస్తున్నారేమోనని ఎవరూ రాలా. ముందుకే అడుగేశాం. నడిచి గుడి దగ్గరకి చేరాం. “అరటి పళ్ళు తీసుకుందా”మని ఇద్దరం ఒకసారి అన్నాం, నవ్వుకున్నాం. రెండత్తాలు అరటి పళ్ళు ఇవ్వమంది, ఇచ్చాడు, కిళ్ళీ కొట్టతను. డబ్బులు నాన్న గారి దగ్గర తీసుకుంటానన్నాడు. “డబ్బులివ్వండి” అని చెప్పింది. కొట్టతనికి డబ్బులిచ్చి లోపలికి ఒక సారి అడుగు పెట్టాము, గుడిలో. ముందు అయ్యవారి దర్శనం చేసుకున్నాం. ఆ తర్వాత అమ్మ దర్శనం చేసుకున్నాం. అమ్మ, అయ్య, ఇద్దరి దగ్గరా చెరొక చేతితో పట్టుకుని ఒకటిగా పళ్ళిచ్చాం. అలా పళ్ళు ఇవ్వడం చూసి పూజారి అదోలా చూశాడు, మాకేసి. దర్శనం తరవాత గుడిలో కూచోవాలి కాసేపు, అది ఇద్దరికీ తెలుసు కనక కాలక్షేప మండపం మీద కూచున్నాం. “ఏమని దణ్ణం పెట్టుకున్నా”రంది. “నువ్వేమని దణ్ణం పెట్టేవ”న్నా. “మేము దంపతులుగా మిమ్మల్ని సేవించి, దర్శించడానికి వచ్చాము. మీరు ఆది దంపతులు, మీలాగే మేము ఉండాలని అశీర్వదించమన్నా. మీరేమని పెట్టేరు దణ్ణం” అంది. “నువ్వు చెప్పిందే నేనూ మళ్ళీ చెప్పాలి, అంతే” అన్నా. “కిళ్ళీ కొట్టు వాడికి నన్ను డబ్బులిమ్మనావేం” అన్నా ఏం చెబుతుందోనని, “దేవుడిని దర్శించడానికి మనం వస్తే, డబ్బులాయనిస్తే ఫలితం ఆయనది కాని, మనది కాదుకదా” అంది. ఫరవాలేదు “ఈ పిల్లతో సంసారం నడిచిపోతుందనుకున్నా, మనసులో. ఆ తరవాత ఎప్పుడో చెప్పింది కిళ్ళీ కొట్టు వాడికి డబ్బులిమ్మనగానే ఇచ్చేస్తే “బాధలేదు చెప్పిన మాట వినేమొగుడే దొరికాడనుకున్నా” అంది, 🙂 . అంతకు కొన్ని గంటల ముందే ప్రేమకి దరఖాస్తు పెట్టేసేను కదా ( ముద్దు పెట్టేను కదా. ఇది వరలో చెప్పేను దీని గురించి అందుకు చెప్పటంలేదు ) స్వీట్ నతింగ్స్ చెప్పుకున్నాం, ఆ కాలంవి, ఇప్పుడు మీకు చెప్పకూడదుకదా 🙂 , సెన్సార్ కట్. ఈ లొగా ఎవరో వచ్చారు, మమ్మల్ని వెతుక్కుంటూ, మా కోసం. విడిదికి చేరేము, ఇంటికి చేరేము.

ఇలా ప్రారంభమయిన సంసార జీవితపు వయసు ఏబది సంవత్సరాలు. “ఎప్పుడూ ఇలాగే ఉన్నారా?” ఆగండి మరి. పెళ్ళయిన కొత్తలో దెబ్బలాడుకున్నాం, చాలా సార్లు, కలిసిపోయాం, దెబ్బలాట కూడా మా గురించి కాదు, “మీ అక్కయ్య ఇలాగంటే, మీ అన్నయ్య ఇలాగ”. ఇదీ తగువు. ఒక సారి తీరుబడిగా తగువు తీరి కలసినపుడు ఆలోచించాం. తగవు తీరిన తరవాత కలయిక అనుభవించాలి,మనసు పొందే హాయి చెప్పనలవి కాదు. మనగురించి మనం దెబ్బలాడుకోటం లేదు, వేరెవరిగురించో అని గుర్తించాము, మర్నాటినుంచి దెబ్బలాటలు గాయబ్. పెళ్ళినాటికి, ఆమె వయసు పదహారు/ పదిహేడు, నాది ఇరవై ఒకటి/ ఇరవైరెండు. వయసు ఆకర్షణ తో కొంత కాలం నడిచింది. ఆ తరవాత ఆమె చేసే పనులు, నేను చేసే పనులు, ప్రతిస్పందనలు వీటిద్వారా, వయసు ఆకర్షణ స్థాయి నుంచి ఆరాధన స్థాయికి ఎదిగాము. కష్టాలు, సుఖాలు కలసి పంచుకున్నాం. కష్టాలు జీవితం లో భాగమనే అనుకున్నాం. కష్టాలలో ముఖ్యమైనవి, ఆర్ధికం, ముఖ్యమైన వారిని కోల్పోవడం, సుఖాలలో నలుగురు సంతానం కలగటం, వారందరినీ అమ్మ చూడకలగటం, పెద్ద ఊరట. అమ్మ ఆశయం నిలబెట్టినందుకు ఆనందం. :), ఆమె కోరినది వంశాభివృద్ధి కదా. ఎప్పుడు మొదలయిందో చెప్పలేము కాని, మధ్యనుంచి,కష్టాలలో, ఆరాధన నుంచి ప్రేమ మొదలయి, ఒకరిని ఒకరు విడిచి ఉండలేని స్థితికి చేరుకున్నాం, ఇది వయసు ఆకర్షణ, ఆరాధన కాదు, ప్రేమ.

ఎప్పుడూ తీపేనా? ఎప్పుడూ తీపే తింటూ ఉంటే జబ్బూ చేస్తుంది, చేదయి పోతుంది. మధ్య మధ్య కారం చుర్రు మంటే తీపి మరింత బాగుంటుంది కదా. అదే మేమూ చేసింది, చాలా సీరియస్ గా దెబ్బలాడుకునే వాళ్ళం,దెబ్బలాడుకుంటున్నాం, ఈ దెబ్బలాట పైవారికి తెలియదు, అదొక విచిత్రం, తెలియనిచ్చేవాళ్ళం కాదు, ఇప్పటికీ అంతే. కోపం వస్తే చేసే పని మాట్లాడకపోవటం. ఇది చాలా పెద్ద శిక్ష. ఈ శిక్ష భరించడం ఇద్దరికీ దుర్భరమే! ఇద్దరికీ ఇదే అలవాటు. నోటితో కంటే మనసుతో మాటాడుకోడం ఎక్కువ, కోపం వస్తే మనసు మూసుకుంటే, మనసుతో మాటాడకపోతే… చాలా కష్టం,కాదు బాధ. దీర్ఘకోపం పనికిరాదు కదా, అందుకే మళ్ళీ కారణం వెతుక్కుంటాం, మాట్లాడుకోడానికి, మళ్ళీ కలిసిపోతాం. ఈ మనసుతో కలయిక, విడిపోడం అనుభవించాలి తప్పించి మాటతో చెప్పడం కష్టం. ఇద్దరం చదువు రాని వాళ్ళమే. ఈ పాసిటివ్ తింకింగులు వగైరా మాకు తెలియవు. మాకు తెలిసినదొకటే, ఇద్దరం ఒకరికొరకు ఒకరు బతకాలి, కలిసిబతకాలి, కలిసి అనుభవించాలి ఏదయినా. కష్టమూ నిలవదు సుఖమూ నిలవదు,కష్టం జీవితం లో ఒక భాగం,దానినుంచి గట్టెక్కే మార్గం చూడటమే ఇద్దరి విధి. ఇది తెలుసుకున్నాం. డబ్బు గురించిన దెబ్బలాట ఎప్పుడూ లేదు.డబ్బు మీద ఇద్దరికీ వ్యామోహం లేదు, బంగారం మీదా లేదు, ఆడంబరాల మీదా లేదు. నా పేర కొన్ని ఆస్థులు, ఆమె పేరున ఉన్నాయి. ఇది నీది, ఇది నాది అనుకోలేదెప్పుడూ. ఒకరు మాకు పెట్టడం గురించిన అలోచన ఎప్పుడూ లేదు. ఎవరికైనా పెట్టలేక పోయామని బాధ పడతాం. కట్నానికి వ్యతిరేకులం, మేము ఇవ్వలేదు, తీసుకోలేదు. మూఢ నమ్మకాలకి చాలా దూరంగా ఉంటాం, ఇద్దరం పిచ్చివాళ్ళం కదా. పాతిక ఏళ్ళ కితం స్థిరాస్థులు పిల్లల కిచ్చేశాం. చరాస్థులు కొద్దిగా మా కోసం ఉంచుకున్నాం. లేదని కుంగిపోలేదు, ఉందని పొంగిపోలేదు. ఉన్నంతలో తృప్తిగా బతికాం,బతుకుతున్నాం.

ఎక్కడికెళ్ళినా పదేళ్ళనుంచి ఇద్దరం కలిసి వెళ్తాం, లేదూ మానేస్తాం, ఒకరు రాలేకపోతే, ఒకరూ వెళ్ళే ప్రశ్న, ప్రసక్తి లేదు. ఇన్ని మాటలెందుకు ఆమె లేని నేను లేను, నేను లేని అమె లేదు. శంకరుని అద్వైతం, ఒకటే ఐన రెండు. రెండుగా కనపడే ఒకటి. ఏవిషయం గురించి అడిగినా ఇద్దరి స్పందన ఒకటే, వేరు, వేరుగా అడిగినా, ఇద్దరి మనసు ఒకటే కదా. ఆ రోజు అమ్మ చెప్పినట్లు, ఈ రోజు ఈ టపా వేసిన తరవాత చిటికినవేళ్ళు పట్టుకుని మళ్ళీ ఆది దంపతుల దర్శనానికి వెళతాము. పెద్దలికి నమస్కారం, పిన్నలికి దీవెనలు.

శలవు

ప్రకటనలు

రచయిత: kastephale

A retired telecom engineer.

37 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-పెళ్ళయి ఏభై ఏళ్ళు పూర్తయింది( 51 వ పెళ్ళి రోజు )”

  1. లలితమ్మాయ్!
   అప్పటికి ఏభయ్ మరిప్పటికి మరో ఐదు వెరసి ఏభైఐదు పూర్తయ్యాయి.
   మిథునమంఛావా! ఇదే ఇదే జీవితం తల్లీ 🙂 దీర్ఘసుమంగళీభవ
   ధన్యవాదాలు.

   మెచ్చుకోండి

 1. శుభాకాంక్షల తో

  మమతలబడి కష్టేఫలి !
  సుమములమరు యొడయురాలు, శుభముల్ బడయన్
  నమనము లివియే దంపతు
  లమనమున నిలువ జిలేబి లబ్జుగ జేసెన్!

  జిలేబి

  మెచ్చుకోండి

  1. జిలేబిగారు,
   పృథివి ఆకాశం కలిసినట్టు రెండు పెదవులు కలిస్తే మాట ’అమ్మ’

   మీ అభిమానాన్ని మాటలలో చెప్పలేను. మమతలబడి మతలబే వేరండి 🙂
   ధన్యవాదాలు.

   మెచ్చుకోండి

  1. చి.సౌ చిత్ర
   భార్య/భర్త ఒకరిమాట మరొకరు వినేస్తే సమస్యలే లేవు కదమ్మాయ్
   కాని ఎదుటివారు వినేటట్టుగా చెప్పడంలోనే ఉందికదా అసలు తిరకాసు 🙂
   దీర్ఘసుమంగళీభవ
   ధన్యవాదాలు.

   మెచ్చుకోండి

  1. విన్నకోటవారు,
   అరవైలవైపు వడివడిగా అడుగులేసున్నాం.
   గత రెండేళ్ళు వేసవిలో నరకం చూశాం, ఇల్లాలి అనారోగ్యంతో, ఈ సంవత్సరం అమ్మ కరుణించింది, కొద్దిలో తేలిపోయాం,చల్లగానే ఉన్నాం.

   సమానుల్లో కొంచం ఎక్కువ సమానం అనుకుంటా! ఎందుకంటే..

   దువ్వూరి సుబ్బమ్మగారు, స్వాతంత్ర్య సేనాని గుర్తున్నారు కదా! వారికి మా శ్రీమతివారు శిష్యులు. సుబ్బమ్మగారిది కడియం.

   ఇక చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి గారి రెండవకుమారుడు దుర్గేశ్వర శాస్త్రి,సీతాలక్ష్మి దంపతులకు ఇల్లాలు అభిమానపుత్రిక. మరేం చెప్పగలను 🙂
   మీ అభిమానానికి
   ధన్యవాదాలు.

   మెచ్చుకోండి

 2. కంగ్రాట్స్ శర్మ గారూ. మరిన్నిపెళ్లి రోజులు జరుపుకుంటూ ఇలాగే రాస్తూ ఉండండి నా కోసం (నా స్వార్థం నా ది, ఎన్నో నేర్చుకుంటున్నాను మీ బ్లాగ్ నుంచి )

  మెచ్చుకోండి

  1. చి.challa.jayadev vara
   మీరు,మీ కుటుంబ సభ్యులు ఆయురారోగ్య ఐశ్వర్య సుఖ శాంతులతో, విద్యా,బుద్ధులతో కొనలు సాగాలని ఆశీర్వచనం
   మాకు పెద్దరికమిచ్చి, ఈ సావకాశం కలగజేసినందుకు
   ధన్యవాదాలు.

   మెచ్చుకోండి

  1. Suryanarayana MV (suryamahavrata)గారు,
   ఆనందం పంచుకుంటే పెరుగుతుంది!
   యువజంటకు ఆశీర్వచనం, దీర్ఘాయుష్మాన్భవ,దీర్ఘ సుమంగళీభవ
   మీ అభినందనలకు,అభిమానానికి
   ధన్యవాదాలు.

   మెచ్చుకోండి

 3. 🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹
  వాగర్ధామివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే
  జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ
  🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹

  మెచ్చుకోండి

  1. YVR’s అం’తరంగం’
   వివాహం ఐన వెంటనే ఆది దంపతుల దర్శనం చేయిస్తారెందుకో తెలుసా! వారిలా వాక్కు,అర్ధమూ, వెలుగు,కాంతి లను విడ తీయలేనట్టూ, ఆది దంపతులలా అర్ధనారీశ్వరులుగా బతుకుతామని ప్రతిజ్ఞ చేయించడానికే!
   మీ అభినందనకు,అభిమానానికి
   ధన్యవాదాలు.

   మెచ్చుకోండి

 4. గురువు గారు, మీ దంపతులిద్దరికీ శుభాకాంక్షలు. మీరు మరెన్నో సంవత్సరాలు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని భవుఁణ్ణి ప్రార్థిస్తూ…

  మెచ్చుకోండి

  1. అన్యగామి గారు,
   కనిపెట్టేశా! అనామకంగా రాసినా!!
   అమ్మ దయతో అరవైలవైపు నడుస్తున్నాం. గత రెండేళ్ళూ ఇల్లాలి అనారోగ్యంతో వేసవి భయపెట్టింది, ఈ వేసవి కొద్ది పాటి ఇబ్బందితో దాటుతున్నట్టే! 🙂
   మీ అభిమానానికి,ఆకాంక్ష కు
   ధన్యవాదాలు.

   మెచ్చుకోండి

   1. తాతయైనను జేమ్సుబాండును తావుచెప్పెదనానిమ
    స్సౌత గానను యన్యగామిగ సాముజేసిన గూడనౌ
    పాతకాలపు తెక్నికుల్గల పట్టుగాంచిన పారుడన్
    కూతకొచ్చినకోడివోలెను కొత్తవాడిని సుమ్మనౌ 🙂

    మెచ్చుకోండి

   2. జిలేబి గారు,

    మానవుడు మనసు పెడితే చేయలేని పని లేదు. వయసు లెక్కలోది కానే కాదు! మానవ మేధస్సును దాటిపోయినదీ లేదు, ఒక్క పరమాత్మ తప్పించి 🙂

    అవసరం నేర్పుతుంది 🙂
    ధన్యవాదాలు.

    మెచ్చుకోండి

   3. విన్నకోట నరసింహారావుగారు,
    మీరు చెప్పినవాటితో సహా చాలా విషయాలు తోడ్పడతాయి,గుర్తించడానికి. ప్రఛ్ఛన్నంగా ఉండే చాలామందిని గుర్తిస్తాను,గుర్తించాను కూడా! కాని వారెవరో చెప్పను! అదంతే! నా జోలికొస్తే ఊరుకోను, కొత్త సర్జికల్ స్ట్రైక్ పాలసీ
    ధన్యవాదాలు.

    మెచ్చుకోండి

   4. బ్రహ్మం తాత చెప్పింది నిత్యం జరిగే సత్యమిది

    తుచ తప్పక ఇప్పుడు జరిగే నవీన కాలజ్ఞానమిది

    మెచ్చుకోండి

   5. మానవుడు మనసు పెట్టిన
    కాని పని యని యిల నేది గలదు జిలేబీ
    ఆ నింగి నీది యత్నము
    పూనించగ నీవు సృష్టి పుట్టించెదవోయ్ !

    జిలేబి

    మెచ్చుకోండి

 5. క్షమించండి. మీకు పరీక్ష పెట్టడం గురించి అలా చెయ్యలేదు. కొత్త కంప్యూటర్ మీద నుంచి తొందరగా కామెంట్ పెట్టడంలో జరిగిన పొరబాటు.

  మెచ్చుకోండి

  1. అన్యగామిగారు,
   ఇందులో పొరబాటూ లేదు, మన్నింపుకోరవలసినదీ లేదు. మీరు మన్నింపుకోరడమనేది ఎదిగినకొద్దీ ఒదగమనేదానికి గుర్తు! అంతే.

   గుర్తు పట్టేను, మీరు చెప్పినట్టే జరిగుంటుందనీ ఊహించా! సరదాగా అన్నానంతే!

   ఇలా అనామకంగా రాసేవాళ్ళు చాలామందినే గుర్తిస్తుంటా కాని చెప్పను. 🙂
   కొత్త కంప్యూటర్ వాడకంలో కొచ్చినందుకు ఆనందం 🙂
   ధన్యవాదాలు.

   మెచ్చుకోండి

  1. తాడిగడప శ్యామలరావుగారు,
   వయసులో చిన్నవారైన మీ దంపతులకు
   ఆశీస్సులు
   దీర్ఘాయుష్మాన్భవ
   దీర్ఘ సుమంగళీ భవ
   మీ విద్వత్తుకు
   నమస్కారం
   మీ అభిమానానికి
   ధన్యవాదాలు.

   మెచ్చుకోండి

 6. Sarma Garu,

  Wish you a happy and prosperous Marriage day (55 years) and hope you will also complete 60 years of marriage.
  Our Pedanana and his wife will complete 60 years marriage on 6th June 2017.
  Unfortunately my mother is no more and of course they just crossed 53 years of marriage.

  Nowadays it is very rare.

  మెచ్చుకోండి

  1. Venkatram Rao Kalagaగారు,
   పెద్దలకు మా నమస్కారాలు అందజేయగోర్తాము.
   అమ్మ దయుంటే ఏదైనా సాధ్యమే కదండీ
   మీ అభినందనకు,అభిమానానికి
   ధన్యవాదాలు.

   మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s