శర్మ కాలక్షేపంకబుర్లు-టపా రాయడం ఎలా?

Posted on జూన్ 9, 2012
10
టపా రాయడం ఎలా?

అగ్గిపుల్ల, ఆడపిల్ల, కుక్కపిల్ల, సబ్బుబిళ్ళ ఏది కవితకనర్హం అన్నారు శ్రీ శ్రీ. ఏది కాదూ అర్హం టపారాయడానికి,” వండు కున్నమ్మ కి ఒకటే కూర, దండుకున్నమ్మకి అన్నీ కూరలని” నానుడి. కదా. అంచేత ఏ విషయం మీదనయినా టపా రాసేయొచ్చు :). ఒకప్పుడు హరికధా పితామహుడు శ్రీ అజ్జాడ ఆదిభట్ల నారాయణ దాసు గారు హరి కధ చెప్పడానికో ఊరు వచ్చారు. కారణాంత రాల వల్ల కధ ప్రారంభించడం ఆలస్యమయింది. ఎదురు చూస్తున్న జనభా లో అసహనం పెరిగి, నాలాటి బుద్ధిమంతుడు, హరికధా లేదు గిరి కధా లేదు లేవండెహే! అంటూ ఉండగా దాసు గారు వచ్చారు. విషయం విని ఉన్నారు కనక స్టేజి ఎక్కి మీకు హరి కధ కావాలా? గిరి కధ కావాలా ? అని ప్రశ్నించారు. దానికీ బుద్ధిమంతుడు, మాకు గిరి కధ కావాలన్నాడు, అక్కడికేదో తెలివిగా అడిగేసి, దాసు గార్ని ఇరుకున పెట్టేసినట్లుగా ఆనందపడి, కూచున్నాడు. సరే అని దాసు గారు గిరిజా కళ్యాణం చెప్పేసేరు. బుద్ధిమంతుడు నోరెళ్ళబెట్టి బుద్ధిగా విని, వెళ్ళిపోయే ముందు, గిరి కధంటే గిరిజా కళ్యాణం చెప్పేరేమని అడిగితే ఓరి పిచ్చి వాడా, గిరి అంటే హిమవత్పర్వతం, గిరి పుత్రిక గిరిజ, పార్వతీదేవి, కనక గిరి కధంటే గిరిజా కళ్యాణమేనోయ్, అని చెబితే బుద్ధి కలిగి వచ్చేసేడు. సమయస్ఫూర్తి కావాలి. ఇది అందరికి రాదు కదా. మరి అందరూ మనుషులేగా సమానత్వం లేదూ? ఉండదోయ్ వెర్రి కుట్టీ. ఇది సృజన, దీనికి హద్దులుండవ్. నీలాంటి ఉప్పన్న మంద బుద్ధులుంటారు మరి. అది ఉప్పన్న మంద బుద్ధులు కాదనుకుంటా అది ఉత్పన్న మంద బుద్ధి. ఐతే వాడుకలో ఉప్పన్న మందబుద్ధి చేయబడిందోయ్ వెంగళ్రావ్. చెయ్యంటే గుర్తొచ్చింది, నీ చెయ్యెప్పుడేనా చూసుకున్నావా?” మామూలుగా ఉందే!” పిచ్చాడా నీ చేతి వేళ్ళన్నీ సమానంగా ఉన్నాయా లేవు కదా! అలా ఉంటే నీ చెయ్యి పనికిరాదురా ఎర్ర కుట్టీ!!! నీకిదీ తెలీదుగాని పెద్ద పోజ్ కొట్టడం తెలుసునేం. పొట్టపొడిస్తే అక్షరమ్ముక్క రాదు. అక్షరమంటే గుర్తొచ్చింది, తెనుగులో అక్షరాలెన్నిరా? 52,54,56..” ఆ! అదేంటీ” అంటావా. రెండక్షరాలు అసలు రాయడమే మరిచిపోయాం, ఉపయోగించటం లేదు. మరి రెండిటికి వాడుకే తెలియదు. ఋతువును రుతువు గా రాసేస్తున్నాం కదా మరి, ఏమంటావ్. అందరికీ అక్షరాలొచ్చు, పదాలూ వచ్చు, వాక్యాలంత కంటే వచ్చు. కవితలూ వచ్చు, కాని కొన్నిటికే స్పందనెందుకంటావ్. “మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగినకొద్దీ ఒదగమనీ అర్ధమందులో ఉంది, అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్ని రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది”.ఈ పదాలన్నీ నీకూ వచ్చుకదా, మరెందుకు కూర్చలేకపోయావ్. ఈ పాట విన్నావా. వింటే ఏం జరిగింది? అప్రయత్నంగా కళ్ళ నీళ్ళొచ్చాయా? ఏం అవే అక్షరాలు, పదాలు నువ్వు పేర్చలేకపోయావేం. అదే సృజనంటేరా వెర్రి సన్నాసి.

టపా రాయాలి, ఈ బుద్ధి ముందు రావాలి కదా? సరే వచ్చింది దేనిమీద రాయాలి? రాయడానికి నీకు తెలిసినదేమి? ఇవి ప్రశ్నలు. సమాధానాలు దొరకవ్. రాయాలి కదా, ఇదేమి బలవంతపు బ్రాహ్మణార్దమండి బాబు. సరే రాయడనికి మొదలు పెడతాం, ఈ లోగా మా చిత్రగుప్తుడికి ఎక్కువ యములాడికి తక్కువ అయిన కరంటు వాడు లటుక్కున పీకేస్తాడు. ఈ ఉత్సాహం కాస్తా చల్లరిపోయి, ఉయ్యాలలో కూచుంటే, మళ్ళీ ఆశ, పావు గంట తరవాత కరంటిస్తాడు. ఈలోగా బుర్రలోంచి కొంత ఆవిరైపోతుంది. మళ్ళీ మొదలెడతాం. ఇలా మొదలెట్టేమో లేదో మళ్ళీ పీకేస్తాడు. ఛ! ఇది బాగోలేదనుకుని బయటికి పోతే మళ్ళీ అరగంటలో కరంటిచ్చేస్తాడు. ఇలా ఆశ నిరాశల మధ్య ఉయ్యాలఊగుతూ ఈ టపా మొదలు పెట్టబడుతుంది.సాయంత్రం మొదలుపెడితే టపా రాయడమ్ ఎన్ని సార్లు కరంటు పోయిందీ. నిజం చెప్పాలంటె టపా రాయడానికి పట్టే సమయం పదిహేను నిమిషాలు నుంచి అరగంట, అన్ని బాగుంటే. మరి ఇది కూడా బిడ్డను కనే తల్లి ప్రసవ వేదన లాటిదే. మరి రోజూ ఈ ప్రసవ వేదన అనుభవించడ మెందుకూ? అదంతే, ప్రసూతి వైరాగ్యం, ఇది వరలో ఒక సారి చెప్పేను లెండి. బిడ్డ పుట్టేదాకనే. బిడ్డను చూసిన తరవాత, ఈ వేదన తల్లి ఎలా మరిచి, మరొక బిడ్డను కనడానికి సిద్ధమవుతుందో, నేనూ అంతే రోజూ. అన్ని కలిసొస్తే ఎంత? రావు కదా! అన్నీ బాగున్నా ఒకప్పుడు పని జరగదు కారణం, ఇదే విధి వైపరీత్యమంటే. “విధి వైపరీత్యమంటే ఏమిటీ?”

“ఏం ఆగిపోయావేం! ప్రశ్నకి సమాధానం లేదా?” పిచ్చి నాగన్నా, ప్రశ్నకి సమాధానం ఉంది, నీ పీత బుర్రకి అర్ధమయ్యేలా చెప్పడమెలా అని అలోచిస్తున్నానంతే. విను. ఒక భార్య భర్త అన్యోన్య దాంపత్యం. దేనికీ లోటు లేదు. ఆరోగ్యానికీ లోటు లేదు, అనురాగానికీ లోటు లేదు. ఒకటే లోటు సంతానం లేదు. అదేం. అదే తెలియదు, మొక్కని దేవుడూ లేడు, చూడని డాక్టరూ లేడు. ఎక్కడుంది తేడా. ఏ డాక్టర్ ని అడిగినా చెప్పేదొకటే మాట, అన్నీ బాగున్నాయి, కలయికలో కూడా తేడా లేదు, మరి సంతానం ఎందుకు కలగటంలేదో తెలియదు. వేచి చూడటం తప్పించి చెయ్యగలది లేదు. దీన్నేమంటారు వెంగళప్పా? ఇదే విధి వైపరీత్యమంటే. తెలిసిందా? అంతా నాకే తెలుసనుకోకు. నీకూ నాకూ కూడా తెలియనిది ఉంది. ఆ తెలియనిది తెలిసినవాడో/ తెసినదో/ తెలియ చెప్పేదో ఉందిరా నాయనా. కొట్టుకు చచ్చినా నీకర్ధం కాదు అదంతే మరి.

సాయంత్రం అన్నగారు మాట్లాడుతూ, నీ బ్లాగు చూశానయ్యా, అబ్బాయి ఇంటి దగ్గర, బాగుంది, బాగా రాస్తున్నావు,అన్నారు. అన్నయ్యా! ఏదో తెలిసీ తెలియక పిచ్చి రాతలు రాస్తున్నా, చదువుకోలేదు కదా, తప్పులుంటాయన్నా. ఒరేయ్! నేను డబల్ ఎం.ఎ ఎం.ఇడి, అవునా, ఒక్క ముక్క నువ్వు రాసినట్లు రాయలేను, అదంతే! ఇంకొక్క మాట చెబుతా విను, షేక్స్ పియర్ కి డిగ్రీలు లేవయ్యా!!! ఇంతకు మించి నేను నిన్ను పొగడకూడదు. ఈ లోగా ఏనుగులొచ్చాయి. రాండోళ్ళొచ్చాయి. మెరుపుతీగలొచ్చాయి. సమీరుడు చల్లగా వచ్చాడు. పెళ్ళివారొస్తున్నారు. ఆనందమానందమాయె, సరిగా శుక్రవారం సాయంత్రం ఏడు గంటలికి వాన పెళ్ళి కొడుకు దిగాడు. పావు గంట హడావుడి చేసి వచ్చినంత తొందరగా తన వారితో మాయమయ్యాడు. మళ్ళీ మా కరంటు కోతలు, ఉక్కపోతలూ మామూలే.

Good news:- showered during night

ప్రకటనలు

రచయిత: kastephale

A retired telecom engineer.

2 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-టపా రాయడం ఎలా?”

  1. వాన పెళ్లికొడుకుని ఎంత చక్కగా పందిట్లోకి తీసుకువచ్చారో! “ఏనుగులొచ్చాయి. రాండోళ్ళొచ్చాయి. మెరుపుతీగలొచ్చాయి. సమీరుడు చల్లగా వచ్చాడు. పెళ్ళివారొస్తున్నారు. ఆనందమానందమాయె, సరిగా శుక్రవారం సాయంత్రం ఏడు గంటలికి వాన పెళ్ళి కొడుకు దిగాడు.”

    మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s