శర్మ కాలక్షేపంకబుర్లు-గాంధర్వ వివాహం.(ప్రేమపెళ్ళి)

గాంధర్వ వివాహం.

26
SAKUNTALA-1
దుష్యంతుడనే రాజు పరిపాలన చేస్తూ వేటకై పరివారాన్ని వెంట పెట్టుకుని బయలుదేరి, వేటాడి, దగ్గరలో ఉన్న కణ్వాశ్రమంలో, కణ్వుని దర్శించి, నమస్కరించి వస్తానని, మంత్రులు, సేన అంతనూ దూరంగా వదలి కాలి నడకను కణ్వాశ్రం చేరి, అక్కడ కణ్వుని ఆశ్రమంలో, అపురూప లావణ్యవతి అయిన శకుంతలను చూశాడు. అందంలో జయంతునిలా ఉన్న దుష్యంతుని రాజుగా తెలుసుకుని అర్ఘ్య పాద్యాలిచ్చి కుశలమడిగింది, శకుంతల. అప్పుడు దుష్యంతుడు “వేటకని బయలుదేరివచ్చాను, ఆశ్రమం దగ్గరలో ఉన్నది కనక మునిని దర్శించి పోదామని వచ్చాను, వారెక్కడికెళ్ళేరు, వారి దర్శనభాగ్యం కలగలేదు” అని అడిగాడు. అందుకు శకుంతల “వారు ఇప్పుడే, అడవిలోకి పండ్ల కోసం వెళ్ళేరు, మీరు వచ్చేరని తెలిస్తే వెంటనే వచ్చేస్తారు” అంది. “వారు వచ్చేదాక ఒక ముహూర్త కాలం ఉండమని” కోరింది. అప్పుడు దుష్యంతుడు ఆమెను కన్యగా ఎరిగి, ఆనందపడి, ఆమెను సర్వాంగ సుందరిగా చూసి, సంచలించిన మనసుతో, “నీవెవరి కుమార్తెవు, ఇక్కడికెందు కొచ్చావు, ఇక్కడ ఉండడానికి కారణం ఏమి” అని అడిగాడు. దానికి శకుంతల “నేను కణ్వ మహాముని కుమార్తెను” అని చెప్పింది. ఈమె ముని కన్య అయితే నా మనసెందుకు లగ్నమయిందని దుష్యంతుడు అలోచించి, ఈమె మాట నమ్మలేను, బ్రహ్మ చర్యవ్రతుడైన కణ్వుని కి కుమార్తె ఏమిటి అని ఆమె జన్మ వృత్తాంతం అడిగాడు. అప్పుడు శకుంతల తన జన్మ వృత్తాంతం చెప్పింది ( ఇది నిన్నటి టపాలో చెప్పుకున్నాం, కనక మళ్ళీ చెప్పటం లేదు.) ఈమె ముని కన్యేమోనని భయపడ్డాను, కాదని తెలిసింది, ఈమె కూడా నాయందనురాగయైయున్నదని, మదనాతురుడై, “ఈ నార చీరలు కట్టనేల, ఈ కుటీరాలలో నివాసమేల, ఈ మునిపల్లెలో ఉండనేల, నాకు భార్యవయి సౌఖ్యాలను పొందు, గొప్పవైన భవనాల్లో నివసించు” అన్నాడు. “వివాహాలు ఎనిమిది రకాలు,బ్రాహ్మ్యము,దైవము,ఆర్షము,ప్రాజాపత్యము,రాక్షసము, ఆసురము,,గాంధర్వము,పైశాచికము. రాచవారికి గాంధర్వము, రాక్షసము యోగ్యమైనవి. మనకిద్దరికి ఒకరి పట్ల ఒకరికి ప్రేమ ఉన్నది కనక గాంధర్వ వివాహము ఉచితము” అనగా, సిగ్గు పడుతూ శకుంతల ఇలా అన్నది. “మా తండ్రి ధర్మ స్వరూపుడు, మా నాన్నగారొస్తారు, వారు వచ్చి నన్ను నీకు ఇస్తే పెళ్ళి చేసుకో” అంది. అందుకు దుష్యంతుడు, “ఎవరికి వారే చుట్టాలు, గాంధర్వ వివాహం అంటేనే రహస్యం, మంత్రాలు లేనిది” అని ఆమెను ఒప్పించాడు. అప్పుడు శకుంతల, “నీ వల్ల నాకు కలిగే కుమారుడికి యువరాజ్య పట్టాబిషేకం చేస్తానంటే నీకూ నాకూ సంగమం అవుతుంది” అని చెప్పింది. అందుకు దుష్యంతుడు ఇష్టపడి గాంధర్వ వివాహం చేసుకుని ఆమెతో భోగాలనుభవించి, వెళ్ళిపోతూ, నిన్ను తీసుకు వెళ్ళడం కోసం మంత్రులు మొదలయిన వారిని కణ్వ మహాముని వద్దకు పంపుతానని చెప్పి తన పట్టణానికి వెళ్ళేడు.

ఒక సారి సింహావలోకనం చేదాం. శకుంతల తండ్రి లేనపుడొచ్చిన అతిధికి చేయగల సత్కారం చేసింది. అందరు మాట్లాడినట్లే మాట్లాడింది. దుష్యంతుని వైపు ఆకర్షితురాలయింది. పరస్పరం మోహానికిలోనయ్యారు. “నాన్నగారేరీ” అని అడిగినపుడు “ఇప్పుడే వచ్చేస్తార”ని దుష్యంతుని ఉంచే ప్రయత్నం, సంభాషణ కొన సాగించే ప్రయత్నం చేసింది. వివాహ ప్రసక్తి తెస్తే, ఒక సారి మాత్రం “నా తండ్రికి ఇష్టమయి నీకిస్తేతే వివాహం చేసుకో”మన్నది, రాజు గాంధర్వ వివాహం చేసుకోడం ధర్మమేనన్న మాటకూ, తనకూ అతనియందున్న కామోపభోగ లాలసకు లొంగి వివాహానికి ఒప్పుకుని, ఒక షరతు మాత్రం పెట్టింది, పుట్టబోయే పుత్రునికి యువరాజ పట్టాభిషేకం కావాలని. దీనికి దుష్యంతుడు ఒప్పుకుని సంగమించారు, గాంధర్వ వివాహం చేసుకుని. అప్పటికీ, ఇప్పటికీ అమ్మాయిల, అబ్బాయిల మనస్తత్వం మారలేదన్నదే నా ఉద్దేశం. తండ్రి వచ్చిన తరవాత వివాహం చేసుకుందామన్న మాటమీద నిలబడలేకపోయింది, ఇంద్రియ నిగ్రహం లేక. ఇప్పటి అబ్బాయిల లాగే దుష్యంతుడూ ప్రవర్తించాడు. గాంధర్వ వివాహం అనగా పరస్పర ప్రేమతో అంగికారంతో జరిగే వివాహం, అప్పటికి, ఇప్పటికి, సమ్మతమే, కాదనడానికి లేదు కాని భద్రత దృష్ట్యా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవలసి వచ్చినపుడు చిక్కులు కలుగుతాయి, అదే శకుంతల కూడా పడింది తరవాత, ఇప్పటివారు కూడా అటువంటి చిక్కులు ఎదుర్కుంటున్నారు…. శకుంతల చిక్కులు ఎలా పరిష్కారం చేసుకున్నదీ తర్వాత చూదాం.

శాకుంతలం అంటే శృంగారమే చూస్తున్నారు, ఈ తరవాత జరిగినదాన్ని పెద్దగా పట్టించుకోటం లేదు. మను చరిత్రలో మాయా ప్రవరునితో వరూధిని సంగమం తరవాత చదవక్కరలేదంటున్నారు, అలాగే శాకుంతలంలో కూడా, నిజంగా నేటి కాలానికి ఈ తరవాత జరిగినదే చాలా అవసరం.

రచయిత: kastephale

A retired telecom engineer.

16 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-గాంధర్వ వివాహం.(ప్రేమపెళ్ళి)”

  1. శకుంతల కధ చాలాసార్లు విన్నా, ఎందుకో ఆ రెండు పాత్రల మీద సింపతీ కలగదు(నాకు). కానీ మీరు చెప్పిన కోణంలో ఆలోచిస్తే ఈ కాలపు శకుంతల-దుష్యంతులపై కొంత వరకు కలుగుతోంది.

    మెచ్చుకోండి

    1. YVR’s అం’తరంగం’గారు,
      నాకైతే రెండు జంటలమీదా ’సింపతీ’ లేదండి.మొదటి జంట బిడ్డని కని వదిలేసిపోయారు. రెండవ జంట అచ్చు నేటి కాలం పిల్లల లాగే ప్రవర్తించారు, ముందు చూపు లేనందుకే నా ఇబ్బంది. 🙂 చెయ్యికాలిన తరవాత ఆకులు పట్టుకునే సంగతి.
      ధన్యవాదాలు.

      మెచ్చుకోండి

      1. గురువుగారు, నాకనిపించినది ఏంటంటే ఒక మునికి కూతురుగా పెరిగిన శకుంతల, గొప్పరాజుగా చెప్పబడిన దుష్యంతుడు – ఆలోచనాశక్తీ, నిగ్రహశక్తీ వున్నవాళ్ళే అలా ప్రవర్తించారే, వాళ్ళతో పోలిస్తే గుడ్డిచదువులు, అడ్డంగా సంపాదించడం, ‘ఎంజాయ్’ చెయ్యడం కాక జీవితానికి ఇంకేవో లక్ష్యాలు, విలువలు, పరమార్ధాలు వంటివి ఊహకైనా వచ్చే అవకాశంలేని / దొరకని ఇప్పటి ‘శకుంతల’లు, ‘దుష్యంతు’లపై కొంత సింపతీ అంతే. అవకాశంలేని / దొరకని అనడంలో నా ఉద్దేశం వాళ్ళు పుట్టిపెరిగిన/ పెరుగుతున్న వాతావరణం పూర్తిగా మారిపోయిందని. విలువలు నేర్పించాలనుకునేవారి పిల్లలకి ఇంట్లోవుండే వాతావరణానికీ, బయట ప్రపంచంలో కనబడే వ్యవహారాలకి పొంతన కనిపించట్లేదు. నీతినిజాయితీల అర్ధం, అవసరం వాళ్లకి అవగాహన ఉండట్లేదు.

        మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

      2. YVR’s అం’తరంగం’గారు,
        విషయాన్ని సమర్ధించిన తీరు నచ్చింది.
        అంతటివారే పొరబడ్డారు మనమెంత అని తప్పు చేయడం కాదు. అంతవారూ తప్పుకు లోనయ్యారు కనక మనం మరీ జాగ్రత్తగా ఉండాలనుకోవడమే కావలసింది. నీతి,నిజాయితీ అన్నీ కాకమ్మ కబుర్లనుకుంటే సమస్యే లేదు 🙂
        పుట్టిన చోటు వ్యకిగత విలువలు పెంచలేదండి, వాటిని పెంచుకోడానికి దోహదం చెయ్యచ్చు.
        ధన్యవాదాలు.

        మెచ్చుకోండి

  2. శకుంతల దుష్యంతుల గురించి YVR గారితో ఏకీభవిస్తాను. కానీ కొంతమంది ఈ తరం వారి మీద మాత్రం నాకు సానుభూతి కలగదు.
    అవగాహన లేమి (పెంచుకోవడానికి గట్టి ప్రయత్నం కూడా చెయ్యకపోవడం), అపరిపక్వత. దానికి తోడు సోషల్ మీడియా ప్రభావం. సినిమాలలో చూపించే అర్థంపర్థంలేని, వెర్రిమొర్రి, ప్రాక్టికల్ గా అసాధ్యపు, ప్రేమకథల మాయాజాలంలో చిక్కుకుపోతున్నారు. వెరసి తొందరపాటు పనులు, తరవాత తీరికగా పోలీసు స్టేషన్ లు కోర్టుల చుట్టూ తిరగడం. మీడియా వారి కెమేరాలకు ఆహారం కావడం, వీళ్ళ కుటుంబ వ్యవహారాలు రాష్ట్రం మొత్తానికీ వినోదం అవడం. ఎటు పోతున్నామో? ప్రేమ పెళ్ళిళ్ళు మన రోజులలోనూ అక్కడక్కడ ఉండేవి. కానీ ఈ కాలంలో జరుగుతున్నంత అధ్వాన్నం కాదేమో అనిపిస్తుంది.

    మెచ్చుకోండి

    1. విన్నకోట నరసింహారావు గారు,
      మోహానికి ప్రేమకి మధ్య తేడా తెలియకపోవడమే :)నాటి కాలంలోనే నేనూ ప్రేమ అన్నవాడినే 🙂 ఇప్పటికీ ప్రేమ అంటే వ్యతిరేకత లేదు,ఆ రోజుల్లో కొన్ని హద్దులుండేవేమో అనిపిస్తుంది. నేటి కాలంలో ఆలోచన తక్కువ ఆవేశం ఎక్కువ కనపడుతున్నాయి కదండీ!
      ధన్యవాదాలు.

      మెచ్చుకోండి

  3. హరిబాబు గారి బ్లాగ్ లో “జిలేబి” గారి గురించి సోషల్ మీడియా వార్త అంటూ వచ్చిన ఒక వ్యాఖ్య, ఈ మాట అనడం తగదు అన్న మీ మందలింపు వ్యాఖ్య చూశాను. సోషల్ మీడియా శర్మ గారు, సోషల్ మీడియా. ఏది ఊహాగానమో, ఏది నిజమో అనే అయోమయం మనలాంటి వారికి. ఏది వైరల్, ఏది రియల్ అంటూ ఓ అరగంట కార్యక్రమం ఓ టీవీ ఛానెల్ వారికి.
    ఒకప్పుడు స్కూళ్ళలోను, ఇతర ప్రముఖ స్ధలాల్లోనూ “పుకార్లను (వదంతులను) నమ్మవద్దు, ప్రచారం చెయ్యవద్దు” అని బోర్డులు తగిలించుండేవి గుర్తుందిగా (సినిమా హాళ్లల్లో స్లైడ్లు కూడా వేసేవారనుకుంటాను). ఇప్పుడు చెప్పినా వినిపించుకునేవారెవరు?!
    మీలాంటి సీనియర్ బ్లాగర్ల దగ్గర “జిలేబి” గారి నెంబరో, ఇ-మెయిల్ అడ్రసో ఉండుండచ్చు గతంలో ఏదో ఒక సందర్భంలో తీసుకున్నది. “మాలిక” వారి దగ్గర తప్పకుండా ఉండుంటుంది. “జిలేబి” గారు తరచు “మా లక్కు పేట రౌడీ” అంటుంటారు, అంటే “మాలిక” యజమాని గారే కదా? వారి ద్వారా పరిస్ధితేమిటో కనుక్కోవచ్చేమో? మీలాంటి సీనియర్లే పూనుకోవాలి.

    మెచ్చుకోండి

    1. విన్నకోట నరసింహారావుగారు,

      సోషల్ మీడియాలో అంటే జిలేబిగారు బ్లాగ్ తప్పించి మరో దానిలో లేరని ఖచ్చితంగా చెప్పగలను,నాకు తెలిసినవరకు.
      ఇటువంటి పుకార్లు పుట్టించడం,ప్రచారం చేయడాన్ని ఏమంటారో చెప్పలేను. ఇది మంచి అలవాటుకాదు. వీటిని చెప్పడం వెనకేసుకురావడమనేది వారి వారి సంస్కృతిని బట్టి ఉంటుంది. విభేదం ఉండచ్చు! అంతలో ఎదుటివారిని శత్రువుల్లా చూడడం, వారు మరణించారనీ,ఎప్పుడు ఛస్తారనీ, ఇలా మాటాడేవారు…….మీరన్నట్టు ”సోష”ల్ మీడియా కదండీ

      జిలేబిగారు కనపడి నేటికి నెల రోజులయింది, నేను రోజులు లెక్కపెడుతున్నా!
      బ్లాగర్లకి ఒకప్పుడు చికాకు కలిగి కొంతకాలం బ్లాగును వదిలేసిపోతారు, ఇదందరికి అనుభవమే! జిలేబి గారు ఆదశలో ఉన్నారనుకుని మీరు అడిగితే ”ఏంటి వారి గొప్పా” అని అన్నా. ఇది వారిని కదిలించడానికే!

      వారిగురించిన వివరాలు నాకూ తెలియవు. మెయిల్ అడ్రస్ ఉంది ఉపయోగంలేదు. వారెప్పుడు అందులో రాసిన జాబులకు జవాబివ్వలేదు. మీరు కావాలంటే మెయిల్ అడ్రస్ ఇస్తా. మాలక్కుపేట రౌడీ వగైరాలన్నీ సరదా కబుర్లే! అవి నిజమనుకుని ఇబ్బందుల్లో పడ్డాను కూడా ఒకప్పుడు.

      జిలేబిగారు క్షేమంగా ఉన్నారని నా మనసు చెబుతోంది, వారే మళ్ళి దర్శనం ఇవ్వాలి.వారి గురించి మరెవరికైనా తెలిస్తే చెప్పగలరు, నేనూ ఆతృతతో ఎదురు చూస్తున్నా!
      ధన్యవాదాలు.

      మెచ్చుకోండి

  4. ఈమధ్యకాలంలో నేను కూడా అంత చురుగ్గా బ్లాగులో వ్రాయటమూ లేదు, బ్లాగుల్ని చూస్తున్నదీ లేదు. జిలేబీగారు నెలరోజులుగా మౌనవ్రతంలో ఉండటం ఆశ్చర్యకరమైన వార్త. శర్మగారూ, మీ రన్నట్లుగా బ్లాగర్లు యేవేవో కారణాలవలన మధ్యమధ్యలో కొంతవిరామం తీసుకోవటం అసాధారణం కాదు. జిలేబీగారి పునర్ధర్శనానికి ఎదురుచూస్తున్న వాళ్ళలో నేనూ ఉన్నాను.

    మెచ్చుకోండి

    1. తాడిగడప శ్యామలరావుగారు,
      నాటి రోజుల్లో కార్డు కానీ! అదే ఉండేది కాదు! కార్డ్ దొరికితే క్షేమ సమాచారాలు చీమ తలకాయలంత అక్షరాలతో రాసి పడేసేవారు, కావలసినవారి దగ్గరనుంచి కబురు లేకపోతే ”వార్త తెలియలేదంటే అంతాక్షేమం అనుకోవాలయ్యా” అనేది అమ్మ. నేటి కాలంలో మెరుపు వేగంతో సమాచార వ్యవస్థ ఉన్నా, కబురు చెప్పే మనసుకావాలిగా!!!

      ఆపదవేళల అలపైనవేళల ఓపినంత హరినామమేదిక్కు మరి లేదన్నారు కదా! వేచి చూదాం
      ధన్యవాదాలు.

      మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

  5. గురువుగారు, మీరన్నది అక్షరసత్యం. 🙏
    మీకు చెప్పే సాహసం
    కాదు కానీ నా తృప్తికోసం నా వ్యాఖ్యపై ఇంకొంచెం వివరణ ఇచ్చే ప్రయత్నం ఇది. విషయాన్ని సమర్ధించడానికి కాదు, విషయంపై ఆలోచించాల్సిన అవసరం, తప్పు ఒప్పుల విచక్షణా జ్ఞానం కలిగే ప్రాసెస్ ఇవాళ్టి సొసైటీలో లేని పరిస్థితి గురించి చెప్దామని. ఇంచుమించు ఒక ఇరవైయ్యేళ్ల క్రితం వరకూ ఏది తప్పు, ఏది ఒప్పు అనే అండర్ స్టాండింగ్ ఆటోమేటిగ్గా అలవాటయ్యేది. చుట్టూ వున్న సమాజంలోనూ, ఇంట్లోనూ కూడా విలువల విషయంలో పెద్ద అంతరం కనపడేది కాదు. దాంతో పిల్లలకి విలువలు కొంత తేలిగ్గా, పెద్ద ఎఫర్ట్ లేకుండానే అలవాటయ్యేవి .అర్ధమయ్యేవి. ఇప్పటి వాళ్లకి ఆ అడ్వాంటేజి లేదని నాకనిపిస్తుంది. ఎందుకంటే నా జెనరేషన్ లో ఎక్కువ భాగం విలువలని నేర్చుకోవడం అనేది పైతరాన్ని ప్రశ్నించకుండా ఫాలో అవడం ద్వారానే కానీ అర్ధం తెలుసుకుని కాదు. (దీనికి exceptions ఎప్పుడూ ఉంటాయనుకోండి.) చాలామంది పైతరాల వారికీ విలువలనేవి unconciousగా పాటించిన సాంప్రదాయాలు మాత్రమే. అందుకే గ్లోబలైజేషన్ వెల్లువలో వచ్చిన అనారోగ్యకర మార్పులు వేటినీ తెలివిగా ఎదుర్కోలేకపోయా(రు)ము.
    ఇప్పుడైనా వాటిని సరిగ్గా హ్యాండిల్
    చేస్తున్నారనే విశ్వాసం పూర్తిగా కలగట్లేదు. నమ్మకాలపై వుండే emphasis, తత్వ విచారణ, సోషల్ డిబేట్స్ పై ఉండడం లేదు. అందుకే పిల్లలకి మనం కోరుకునే విలువలకి, బాహ్యప్రపంచపు ‘వాస్తవాల’కు మధ్య పెద్ద gap కనిపిస్తోంది, కన్ఫ్యూజన్ కి దారి తీస్తోంది. ఆనాటి శకుంతలా దుశ్యంతులు అన్నీ తెలిసీ నిగ్రహించుకోలేకపోయారు. ఈనాటి శకుంతలా దుశ్యంతులకి ఏం తెలుసుకోవాలో తెలియదు. నిగ్రహం అనే కాన్సెప్టే లేదు, అర్ధమే
    కాదు. కన్జ్యూమరిస్ట్ మెంటాలిటీతో పెరగడం వల్ల. ఈ స్థితిలో మార్పు ఎలా వస్తుందో, ఎలాంటి మార్పు వస్తుందో ఊహించలేని దశ ఇది అనిపిస్తోంది నాకైతే.

    మెచ్చుకోండి

    1. YVR’s అం’తరంగం గారు,
      ”ఆనాటి శకుంతలా దుశ్యంతులు అన్నీ తెలిసీ నిగ్రహించుకోలేకపోయారు. ఈనాటి శకుంతలా దుశ్యంతులకి ఏం తెలుసుకోవాలో తెలియదు. నిగ్రహం అనే కాన్సెప్టే లేదు, అర్ధమే
      కాదు. ”
      నిజం
      ధన్యవాదాలు.

      మెచ్చుకోండి

వ్యాఖ్యలను మూసివేసారు.