Posted on జూలై 27, 2012
24
బతుకు తీపి.
నిన్న సాయంత్రం నడకకి వెళ్ళొచ్చిన తరవాత స్నానం చేసేను కాని నలతగా అనిపించింది, రెండు రోజులనుంచి నడక కొత్తగా మొదలెట్టేను కదా అందుకు, నీరసంగా ఉయ్యాలలో కూచున్నా. కోడలు సెల్ ఫోన్ పట్టుకొచ్చి “మామయ్యగారు! మీకు ఫోన్” అంది. “ఎవరన్నా?” “మీ కోడలినని అంటోంది ఎవరో!” అంది.
ఎవరైఉంటారబ్బా అనుకుంటూ మాట్లాడితే “మామయ్యగారు! బాగున్నారా! ఏంటో నలతగా ఉన్నట్లున్నారు!” అంది. ఎవరో తెలియకచస్తుంటే, ఇదొకటా అనుకుంటూ “గుర్తుపట్టలేకపోయా సుమా” అన్నా. అప్పుడు నేను ఫలానా అని చెప్పింది. “బాగున్నావా? ఆరోగ్యం ఎలా ఉంద”ని ప్రశ్నించా. “మీ దయవల్ల కులాసాగా ఉన్నాను. ఆరోగ్యంగా ఉన్నాను, సుఖంగా కూడా ఉన్నా” అంది. “సంతోషం ఏమిటి విశేషం” అన్నా. “నాకు ప్రమోషన్ వచ్చింది, మొదటగా మీకే చెప్పాలని పిలిచా” అంది. బాగుందని చెప్పి “డబ్బులు జాగ్రత్త పెట్టుకో” అని ఒక ఉచిత సలహా పారేశాను. ఫోన్ పెట్టేసి గతం లోకి జారుకుంటే……
“చచ్చిపోతాను మామయ్య గారు మొగుడెలాగా రోగంతోనే పోయాడు,” అంటూ ఏడుస్తున్న ఇరవైనాలుగేళ్ళ, కంపలా ఎండిపోయి, కళ్ళలో ప్రాణాలు పెట్టుకుని బతుకుతున్న, చిన్న వయసులో భర్తని పోగొట్టుకున్న, అభాగ్యురాలిని, ఆ పరిస్థితులలో చూసినపుడు నా కడుపు తరుక్కుపోయింది.
ఇక్కడ కొద్దిగా నేపధ్యం చెప్పాలి. ఈ భర్తపోయిన అమ్మాయి నాకు కావలసిన,బతకలేని బడిపంతులుగారి, మూడవ ఆమ్మాయి, తండ్రి ఇద్దరు ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేసేటప్పటికి కాళ్ళులాగి, ఒక సామాన్యుడి చేతిలో పెట్టేడు, ఈ బంగారు బొమ్మని. వాడిదేమి ఖర్మమో తెలియదు కాని తిరుగులేని రోగం తగుల్చుకుని, ఒక సంవత్సరం హాస్పిటళ్ళ వెంట తిరిగి కాలం చేసేడు, పిల్లా, పాపా కలగలేదు. ఆ సందర్భంగా ఊరడింపుకు వెళ్ళేము.
“ధైర్యంగా ఉండు. బతికియుండిన సుఖములబడయవచ్చు అన్నారు పెద్దలు. ఎంతకాలం చీకటే ఉండదు. వెలుగు కనపడుతుంద”ని చెప్పేను తప్పించి, ఆ వెలుగెలా వస్తుందో తెలియలేదు, ఎలా తేవాలో తెలియదు. ఆ అమ్మాయిని చూస్తే, ఈ అమ్మాయికీ ఆ జబ్బు సోకిందేమో అనే అనుమానం వచ్చింది. మనిషి ఎండిపోయింది, ఆకలి లేదంటుంది, నిద్ర పోదు, కంపలా అయిపోయింది. కళ్ళలో ఉన్నాయి ప్రాణాలు.”ఈ అమ్మాయిని డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళండి, అశ్రద్ధ చెయ్యద్దు, దానికి తోడు అతనికి సేవలలో ఉండిపోవడం మూలంగా ఈ అమ్మాయి ఆరోగ్యం అశ్రద్ధ చేసేసింది, డాక్టర్ ని కలవండి ముందు అన్నా. కొద్దికాలం లో డాక్టర్ దగ్గరికి తీసుకెళితే అదేదో కౌంట్ తగ్గింది తప్పించి, ఇది అది పూర్తిగా కాదని డాక్టర్ చెప్పేడన్నారు. అమ్మయ్య కొంత ఊరట చిక్కింది. ఆ తరవాత డాక్టర్ ఆ కౌంట్ పెరుగుతుందనీ మందు వాడమనీ, పూర్తి ఆరోగ్యవంతురాలవుతుందనీ, చెప్పేరని చెప్పేరు. మందులు వాడుతున్నారు. నెమ్మదిగా అమ్మాయికి కొంత స్వస్థత చిక్కింది. ఇప్పుడేమి కర్తవ్యం, అంటే. ఇది వరకు ఇంటర్ చదివింది కనక, ఏమి చేయాలనుకుంటున్నావంటే కంప్యూటర్ నేర్చుకుంటా నంది. సరే ఆ ఏర్పాట్లు చేసి.ఆ అమ్మాయికి ఒక వ్యాపకం ఏర్పాటు చేస్తే, తెలివయిన పిల్ల కనక, గబగబా నేర్చేసుకుని నాలుగు నెలల్లో మంచి కంప్యూటర్ ఆపరేటరయిపోయింది. ఇది చూసిన ఒక కంపెనీ ఈ అమ్మాయికి పిలిచి ఉద్యోగం ఇచ్చింది,అదే ఊళ్ళో. ఆనందం, ఒక దారి కనపడింది.
తల్లి తండ్రులదగ్గర ఉంటూ, ఒక వ్యాపకం కలిగి, ఆలోచన ఎల్లవేళలా ఆరోగ్యం మీదా, గతించిన భర్తమీదనుంచి మరలడంతో,మందులు వాడటంతో, ఆరోగ్యం మరింత బాగుపడింది. అప్పుడపుడు తన సంగతులు చెబుతూ వస్తూ ఉంది. కొంత కాలానికి ఆరోగ్యం పూర్తిగా సరిఅయినట్లూ, ఇప్పుడు ఇష్టపడితే వివాహం కూడా చేసుకోవచ్చని కూడా డాక్టర్ చెప్పేరని అమ్మాయి తండ్రి చెప్పేరు. ఈలోగా ఒకరు అమ్మాయిని చూసి పరిస్థితులన్నీ తెలుసుకుని, వివాహానికి సిద్ధపడ్డారు. ఆయనకు ద్వితీయ వివాహం. పెద్ద వయసుకాదు, జోడీ బాగానే ఉంటుంది. ఆయన కబురు చేశారు, వచ్చి అడిగారు,అమ్మాయిని పువ్వులలో పెట్టుకుని చూసినట్లు చూసుకుంటాను, నా మొదటి భార్య అనారోగ్యంతో గతించిందని చెప్పేరు. ఏమమ్మా! మళ్ళీ పెళ్ళి చేసుకుంటావా, తప్పేమీ కాదు, చేసుకోడానికి డాక్టర్ అనుమతి ఉంది, ఆరోగ్యరీత్యా, అని అడిగితే నాకిక పెళ్ళి చేసుకుని సంసార జీవితం గడపాలనే కోరిక పూర్తిగా చచ్చిపోయింది. ఈ జన్మకింతే, అంది. ఎంత చెప్పినా వినలేదు.
“ఏమో రేపేమి జరుగుతుందో ఎవరికెరుక? నందో రాజా భవిష్యతి.” ఇంతకీ నేను చేసిన సాయమంటారా! ఏమీ లేదు, చిన్న ఓదార్పు, ఇలా చేసుకోమని ఒక సూచన అంతే. అంతకి ఇంత గొప్ప గౌరవం ఇవ్వడం వారి గొప్పతనం. ఏమయితేనేమి ఎయిడ్స్ భూతం నోటి కోరలదా వెళ్ళి మృత్యువును చూసి వచ్చిన చిరంజీవిని ఆశీర్వదించుదాం.