శర్మ కాలక్షేపంకబుర్లు-టపా ఎలా రాస్తానంటే……

Posted on జూలై 11, 2012
24
టపా ఎలా రాస్తానంటే….

మనసు సంకల్ప వికల్పాలలో నా దృష్టికి వచ్చిన మాట, పలుకు, చేష్ట, సంఘటనలను కూడతీసుకుని ఒక టపా రాయడానికి ఒక తలకట్టు ( హెడింగ్ ) పెడతాను. అస్తమానం తలకట్టు ముందు పెట్టను. సంఘటన అయితే రాసేసిన తరవాత తలకట్టు పెడతా. “అవునోయ్! జుట్టున్నమ్మ కొప్పెట్టుకున్నా అందమే సిగెట్టుకున్నా అందమేనని ఏదో ఒకటి పెట్టుకోవచ్చు” అంది మనసు.ఇలా సామెతలు వాడతా.ఈ తలకట్టు ఆకర్షణీయంగా ఉంటే బ్లాగు చూసేందుకు ఉత్సాహ పడతారు. మనం చెప్పేవి సొల్లు కబుర్లు కనక ఎవరు చదువుతారు?, చెప్పేది ఆకర్షణీయంగా లేకపోతే. అందుకు తలకట్టు బాగోవాలన్నమాట,అదీ ముందు సంగతి. ఆ తర్వాత చెప్ప దలుచు కున్నది సుత్తి లేకుండా, చెప్పేది రసవత్తరంగా,చదివే వారి మనసుకు హత్తుకునేలా, ఆహ్లాదపరచేదిలా, అవసరమైతే ఒక పంచదార పూసిన గుళికలా ఉండాలన్న మాట. చదివేవారి కళ్ళు అక్షరాల వెంట పరుగెట్టాలి, మనసు ఉరకలెయ్యాలి, అలా చెప్పాలి. ఎవరి శైలి వారిదే, ఒకరిని అనుకరిస్తే అది ఒకనాటిదే! స్వధర్మం ఎంత చెడ్డదయినా అనుసరణీయమని భగవానుని ఉవాచ నమ్ముతాను. భావగీతాలైతే విషయం సూచనగానైనా తెలియాలి, కవితలైతే సమస్యలేదు. పొరపాట్లుంటే పెద్దలు సరిదిద్దాలి. మా మిత్రులు శ్యామలరావు గారు బ్లాగు మొదలుపెట్టిన కొత్తలో భాషా ప్రయోగంలో, సంధి చేయడంలో సూచనలిచ్చారు. అవి పాటిస్తున్నాను.

ఎత్తుగడ నీరసంగా ఉంటే ముగింపులో మెరుపులుండాలి. ఎత్తుగడ సరదాగా మొదలయితే చివరిదాక దాన్ని కొనసాగించాలి. శృంగారమయితే మోతాదులో ఉండాలి. హాస్యమయితే రసగుళికలా సాగాలి. చెప్పేది ద్రాక్షా పాకంలో ఉంటే మంచిది, లేకపోతే కదళీపాకంలా ఉండాలి, కాని నారికేళపాకంలో ఉండ కూడదు. ఏమిటో ఉండగా ఉండగా మీకు మతిపోతోంది, ఏంటీ పాకాలంటారా? ద్రాక్షా పాకం అంటే ద్రాక్షపండు నోటిలో వేసుకోగానే ఎలా తియ్యగా ఉంటుందో అలాగ, ఇక కదళీ పాకం అంటే అరటి పండులా, అంటే కొద్దిగా కష్టపడాలి, తొక్క తీసుకు తిన్నట్లుగా, ఇక నారికేళ పాకమంటే, కొబ్బరి కాయ ఒలవాలి పీచు తీయాలి, బద్దలు కొట్టాలి, అప్పుడు తియ్యటి నీళ్ళు తాగాలి, తియ్యటి ముక్క తినాలి. మరి అందరికి అన్ని వేళలా సాధ్యమా? కుదురుతుందా? కనక నారికేళపాకంలో ఉండేదాన్ని, మనం ద్రాక్షాపాకంలో చెప్పగలిగితే గొప్పగా ఉండదూ? అదన్నమాట, కిటుకు. నారికేళపాకం పనికిరాదా అనకండి. ఒక్కొకపుడు అదే కావాలి. సమయం, సందర్భం చూసుకోవాలి. పిడుగుకూ, బియ్యానికీ ఒకటే మంత్రంమా అన్నటు ఉండ కూడదు.

నీ సంగతి చెప్పవయ్యా! అవన్నీ మాకూ తెలుసంటారా, అవధరించండి. ఒక సంఘటన, మాట, పలుకుబడి, విన్నది, చూచినది, గుర్తుకొచ్చినది, వెంటనే కంప్యూటర్ ఫైల్ లో పెట్టేస్తా. వీలు కుదిరితే టపాయే రాసేస్తా. ఒక్కొక్కపుడు టపా బలేగా సాగిపోతుంది, నల్లేరు మీద బండిలా. ఒక్కొకప్పుడు మంచి రసపట్టు మీద రాయడానికి కూచుంటే పుటుక్కున కరంటు తీసేస్తే రసభంగమయిపోయి, ఆలోచనంతా ఆవిరైపోతుంది. అటువంటపుడు పిచ్చి కోపం వచ్చేస్తుంది, కాని పేదవాని కోపము పెదవికి చేటని సామెత కదా. నోరు మూసుకుని కూచోడమే. సగం టపా రాసిన తరవాత, తరవాత రాద్దాంలే అని అనిపిస్తుంది, అటువంటి టపాలు చాలానే ఉంటాయి, అసంపూర్తిగా, ఇవి పూర్తి అవుతాయా, చెప్పలేను. మళ్ళీ ఆ స్థాయీభావం ( మూడ్ )ఏర్పడాలి, ఆ విషయంలో. కొన్ని కొన్ని టపాలు మొదలు పెట్టిన వేళా విశేషం చెప్పలేను కాని ఎన్నాళ్ళకీ పూర్తికావు. రాసిన టపా లుంటాయి రెండో, మూడో ఒక్కోసారి, అవి వేయ బుద్ధి కాదు. కారణం చెప్పలేను. అటువంటి నచ్చుబాటు కాక వదిలేసినవి, చాలా కాలం తరవాత ఎప్పుడో ఏమీ రాయలేనపుడు, అది వేస్తే, దానికి గొప్ప స్పందన వచ్చేసి ఆనందమయిపోతుంది. సగం రాసి వదిలేసిన టపాలు తరవాత పూర్తి చేసి వేస్తే, ఒక్కోసారి అది అతుకుల బొంతలా ఉంటుంది, మరి మీకెలా అనిపిస్తుందో తెలీదు కాని. ఇప్పుడీ ఈ టపా తో కలిపి పూర్తిగా రాసిన టపాలు నాలుగు, సగం రాసినవి తొమ్మిది, తలకట్టు పెట్టినవి మూడు ఉన్నాయి. తలకట్లు చెప్పమంటారా? అది చీక్రెట్ రహస్యం కదా మరి. తల కట్లెలా ఉంటాయంటే ఇల్లు ఇరకాటం లాగ. విచిత్రమేమంటే భారతం లో ఉన్నది అంతా ప్రపంచంలో ఉంది, భారతం లో లేనిది ప్రపంచంలో లేదు. ఐతే ఆ సందర్భానికి తగినది భారతం లో వెతుక్కోగలిగితే, దీనికి దానికి లింక్ పెట్టుకోగలిగితే టపా ఆటం బాంబులా పేలుతుంది. ఓపికగ కూచుని రాసిన టపాల కంటే అప్పటికప్పుడు రాసి వేసిన టపాలు బాగుంటాయి, వేడి వేడి అల్లం జీలకర్ర పెసరట్లలాగా. రాసిన టపా ఓపికగా ఎన్ని సార్లు చదువుతానో చెప్పలేను. ఒక సారి అక్షరదోషాలకోసం, ఒక సారి భాషా ప్రయోగాల కోసం, ఒక సారి చెప్పినదానిని వెనకముందులు చేయడం విభజన చేయడం కోసం. ఇలా చదివితే ఆ టపా వేసేలోగా అది కంఠస్థం అయిపోతుందన్న మాట. మరొకటేమంటే తెనుగు బ్లాగు కదండీ అందుకు అన్యభాషాపదాలు వాడను, వాడకం తక్కువ. మా మిత్రుడేదో అంటున్నాడు “ఏంటయ్యా?” “ఏంలేదండీ ఈయనకి మరో భాష రాదులెండి అందుకే ఈ పోజు.” సాధారణంగా ఎప్పుడూ వ్యక్తులను, సమాజాలను కించ పరచేవి జాతీయాల్లో ఉన్నా చెప్పను. మనల్ని ఒకరు చిన్నపుచ్చినపుడు ఎంత బాధ పడతామో అలాగే అవతలివారు కూడా అనుకోవాలి కదా. చివరగా టపా వేసేటపుడు కూడా ఒక సారి చదివి మునుచూసి అప్పుడు వేస్తా. తెల్లవారు ఝామున మూడున్నరకు లేస్తా. ఐదున్నర దాటిన తరవాత టపా వేస్తా.ఈ లోగా కామెంట్లు చూస్తా. సమాధానాలిస్తా. కొన్ని బ్లాగులు చదువుతా. అత్యవసరమయితే వేసే టపా ఆపు చేసి అప్పటి కప్పుడు టపా రాసేస్తా, అదే వేస్తా, తరవాత దీని పరిస్థితి చెప్పలేను, అలా మూల ఉంటుంది. నాకు నచ్చని టపా, ఈ మొత్తం వ్యవహారం పూర్తికాని టపా బయటకు రాదు. మనసు బాగోనపుడు ఈ రాసిన టపాలో లోటు పాట్లు సరిదిద్దుకోవడం జరగదు, అందుకు టపా వేయనన్నమాట. మరో ముఖ్యమైన సంగతి టపా మరీ పెద్దది, మరీ చిన్నది కాకుండా ఉండాలి, ఒక్కొక్కప్పుడు ఇది కుదరదు, అప్పుడు సాధ్యమైనవరకు విషయం చెప్పి కుదిస్తాను. మరొక సంగతి, నేను ఎవరినీ అనుకరించను. ఎంత చెడ్డదయినా స్వధర్మం మంచిదికదా! గీతలో చెప్పినదిదే. ఎదుటివారు చెప్పేది అందంగా ఉండచ్చు. ఒక వేళ అనుకరిస్తే అది అప్పటికే కాని కొనసాగింపు కూడదు.ఒక టపా రాయడానికే ఇంత కష్టముంటే, కాలక్షేపం కబుర్లు రోజూ రాయాలంటే ఎంత కష్టం ఆలోచించండి. ఎన్ని గంటలు కూచోవాలి కంప్యూటర్ ముందు?

చివరగానే కాని ముఖ్యమైనదే! వంట లొట్టలేసుకుని తినడమే కాదు బాగుంటే బాగుందని చెప్పాలి, బాగోకపోతే ఆ విషయం సున్నితంగా చెప్పాలి. సావకాశం దొరికింది కదా అని తిట్లకి దిగితే అది ఇరువురికీ అందంగా ఉండదు కదా.!అలాగే టపా చదివినవారు ఒక మాట చెప్పిపోతే ఆనందం. ఒక్కో రోజు చదివిన వారు వందల సంఖ్యలో ఉంటారు, మాట కలిపినవారుండరు, అటువంటపుడు నీరసం, నిరాశ పొందడం మానవ సహజం, గుర్తించండి. యువత ఎక్కువగానే చదువుతున్నారు, కాని వ్యాఖ్య పెట్టటం లేదు, ఏదో పెద్దాయన రాసేడు, మనం ఏమనకూడదు అనుకోడం, ప్రేమ, విరహం, పెళ్ళి, సంపాదన ఇవేనా జీవితం లో ఉన్నవి. ఇంకా చాలా ఉన్నాయి అది కూడా గుర్తించమని మనవి. గరికపాటి వారీ విషయంలో “ఆటా” మీటింగులో చెప్పేరు, రచయితని కొత్తగా ఏమిరాసేరని అడగద్దు, మీరు రాసినది ఫలానా నచ్చిందని చెప్పండి అన్నారు, మరి పెద్ద వాళ్ళలా చెప్పినపుడు మరి నేనూ అంతే కదండీ…….Snkr.గారు. ఆయ్! ఉంటానండి.

ప్రకటనలు

రచయిత: kastephale

A retired telecom engineer.

12 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-టపా ఎలా రాస్తానంటే……”

 1. ఇంత చేయి తిరిగిన మీరు, ప్రతిసారి ఇంత కష్టపడి వ్రాస్తారంటే ప్రోత్సాహకరంగాను, ఉత్సాహంగాను ఉంది. అందునా మీరు మూడ్ కి తలొగ్గి వ్రాస్తారు అంటే కొంత ఆశ్ఛర్యం కలిగించినా, అది కూడా మాలాంటి వాళ్లకి ఉపయోగకరమే.

  మెచ్చుకోండి

  1. అన్యగామి గారు,
   ఈ టపా రాసేనాటికి చెయ్యి తి(వి)రగలేదండి, ఇది రెండు వందల మూడువందల టపాల మధ్యదై ఉంటుంది. బ్లాగు మొదలుపెట్టి అప్పటికి తొమ్మిది నెలలు 🙂 స్థాయీ భావం (మూడ్) ఉంటే టపా ఎంతండి? ఇరవై నిమిషాలు అంతే. నేటికి అంతేనండి 🙂 ఇది రోజూ అంటేనే కొంచం చిక్కండి 🙂
   ధన్యవాదాలు.

   మెచ్చుకోండి

   1. శివరామప్రసాద్ కప్పగంతు / SIVARAMAPRASAD KAPPAGANTU గారు,
    మూడ్ అదేనండి స్థాయీభావం ఏర్పడితే ఎంతండి పావుగంట.అప్పుడు టపా సోడా లోంచి గేస్ తన్నుకొచ్చినట్టు వచ్చెయ్యదూ బయటికి 🙂

    ఇది ప్రతిరోజూ అంటేనే కష్టమండి 🙂
    ధన్యవాదాలు.

    మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

 2. గురువుగారు, ఇది టపా కాదు, పాటలా వుంది. అద్భుతః.
  ఇంక నాకనిపించినవన్నీ పైన పెద్దలు చెప్పారు.
  చివర్లో ఆయ్! అన్నారంటే టపాకి ప్రేరణ ఇచ్చిన నేపధ్యం ఏదో ఉందనిపిస్తోంది.

  మెచ్చుకోండి

  1. YVR’s అం’తరంగం’ గారు,
   ఆయ్! బాగా కనిపెట్టేరే 🙂 ఈ SNKR అన్నవారు టపాలు రాసినవి ఉంటే గబగబా వేసెయ్యలని అంటే, అదండి సంగతి. ఆయ్!
   ధన్యవాదాలండి.

   మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s