శర్మ కాలక్షేపంకబుర్లు-మంచి నీళ్ళు తెచ్చుకోవడం.

Posted on ఆగస్ట్ 10, 2012
9

మంచి నీళ్ళు తెచ్చుకోవడం.

నేను పుట్టిన ఊరు అఖండ గోదావరి ఒడ్డున ఉన్నది, గట్లు అప్పటికి, ఇప్పటికీ పోసిన మట్టి గట్లే. వాటి వాలుల్లో నది వైపు రెల్లు గడ్డి పెంచేవారు గట్టుకోసుకుపోకుండా, ఆ రోజుల్లో. మా ఊరికి మంచినీటి వసతి గోదావరే. తాగు నీటి నుంచి వాడకం నీటి దాకా అంతకీ గోదావరే ఆధారం, అక్కడక్కడ నూతులున్నాయి కాని అవి అన్నీ వ్యక్తుల అధీనంలో ఉండటం మూలంగా వారి ఇష్టా అయిష్టాలపై ఆధారపడిఉండేది. ఇటువంటి ఒక నుయ్యి సంగతి చెబుతా. మా తాతగారు పదహారు వందల చదరపుగజాల దక్షణం వైపు రోడ్డు ఉన్న స్థలంలో నైఋతివైపు నాలుగు వందల గజాల స్థలంలో ఆరడుగుల ఎత్తున రాతితో, కోటలాటి ఇల్లు కట్టేరు. ఇంటికి తూర్పువైపు, రోడ్డుకి ఆనుకుని చుట్టూ స్థలం ఉండేలా ఒక నుయ్యి తవ్వించారు. నీళ్ళు తాగడానికి పనికి రావుకాని వాడకానికి బాధలేదు, ఏ కాలంలోనూ నీళ్ళుండేవి. మిగిలిన ఎనిమిదివందల చదరపు గజాల ఉత్తరం వైపుదిస్థలం దొడ్డిగా వదిలేశారు. ఇంత ఎత్తున ఎందుకు కట్టి ఉంటారంటే, ఒక వేళ గోదావరి గట్టు తెగినా, ఈ ఇంటికి వరద ప్రమాదం లేకుండా. ఇల్లు ఎందుకమ్మేసేరో తెలియదు కాని నుయ్యి వదిలేసి మిగిలిన ఇల్లు స్థలం అమ్మేశారు. ఆ నుయ్యి ఊరివారికి వదిలేశారు. ఆయన ఉన్నంత కాలం ఊరివారు ఆ నూతి నీరు తోడుకుని వాడుకునేవారు. తరవాతి తరం లో ఆ నూతి చుట్టువార ఉన్న స్థలానికి గోడ పెట్టేసేడు, పక్కన ఇల్లు కొనుక్కున్న ఆసామీ, “ఏమయ్యా ఇది” అని అడిగితే, నుయ్యి పాడు చేసేస్తున్నారు, గోడపెట్టి గుమ్మం పెట్టేను, రక్షణ కోసమే అన్నాడు. కొంత కాలం గడిచిన తరవాత తలుపులేసెయ్యడం ప్రారంభించారు, మేము కూడా ఆ నూతి నీళ్ళు తెచ్చుకునే వాళ్ళం,మా కొత్తిల్లు దగ్గరలోనే ఉంది కనక. తలుపు తీయమంటే ఎప్పుడో వచ్చేవారు, లేకపోతే ఖాళీగా లేము మళ్ళీ రమ్మనేవారు. ఇది మాకూ జరిగింది. నుయ్యి ఆక్రమించేసుకున్నట్లు అర్ధమైపోయింది ఊరివారికి. మావాళ్ళు గొడవపడటం ఇష్టం లేక, రెండు కుండీలు కట్టించేసేరు, నీళ్ళకి. ఒకటి మాకు మరొకటి మా పెదనాన్న గారికి. ఒక మనిషి కావడితో రెండుపూటలా గోదావరి నుంచి నీళ్ళు మోసి తెచ్చేవాడు, సంవత్సరానికి పది కాటాల ధాన్యం ఇచ్చేవారు. తాగు నీళ్ళు మడిగా తెచ్చుకునేవారు. తరవాత రొజుల్లో మేము కొద్దిగా పెరిగిన తరవాత రోజూ ఉదయం సాయంత్రం, ఇద్దరం అన్నదమ్ములం, చెరి రెండు కావిళ్ళ నీళ్ళు తెచ్చేవాళ్ళం. పిల్ల మేక అందరూ గోదావరిలోనే స్నానం, అంచేత నీళ్ళ ఇబ్బంది తెలియలేదు..

ఇక్కడ కావడి గురించి చెప్పాలి, తెలియని వారికోసమే సుమా, తెలిసినవారు క్షమించండి. కావడి అనేది చివరలు చెక్కి తయారు చేసిన వెదురు బద్ద+ ఉట్టిలా ఉండేవి రెండు, రెండూ రెండు పక్కలా తగిలించాలి,ఆ వెదురు బద్దకి, వీటిని “మట్లు” అంటారు. అవి తగల్చడం కూడా ఒక ముడి వేయడం లాటిదే, అది అందరివల్లా కాదు. ఒకరు ఉపయోగించే కావడి మరొకరికి ఉపయోగపడదు, మనిషి పొడుగులు తేడా మూలంగా. నేలకి ఆరంగుళాల ఎత్తులో బరువుండేలా వాటిని తగిలించాలి. ఈ తగిలించడాన్ని “పన్నడం” అంటారు. ఈ ఉట్టికి ఉండే పొడుగాటి తాళ్ళని “చేర్లు” అంటారు. తులాదండ మొదటి సూత్రం కావడికి వర్తిస్తుంది.

మా తాత గారు మన దేశానికి స్వతంత్రం వచ్చేసిందనో, వచ్చేస్తోందనో ఆనందంలో కాలం చేసేరు, అదీ శ్రావణమాసంలో. ఆయన కాలం చేసిన సందర్భంలో గోదావరికి వెళ్ళి, మడికి, వాడకానికి నీళ్ళు తేవలసిన బాధ్యత ఐదుగురి తోడి కోడళ్ళలో ఆఖరుదైన మా అమ్మగారు, అలాగే అదే ఊళ్ళో ఇంట్లో మొదటినుంచి ఉండిపోయిన మా మూడవ దొడ్డమ్మ మీద పడేసేరు, మిగిలినవారు ఆ ఊరిలో ఉండని వారు కనక, ఇలా గోదావరికి వెళ్ళి నీరు తెచ్చేఅలవాటులేదు కనక. ఇక్కడ గోదావరి గట్టులు ఎలా ఉంటాయో, ఉండేవో చెప్పాలి.

గట్టు కి ఒక వైపు గ్రామం మరో వైపు గోదావరి. గట్టు ఎక్కాలంటే ఒక మట్టిపోసిన మట్టి కట్ట ఎక్కాలి, గొదావరి వైపు దిగాలంటే మరొక మట్టికట్ట దిగాలి. ఆ తరవాత కొంత దూరం, దీన్ని లంక అంటాం, నడిచి మళ్ళీ ఒక మట్టి వాలుతలం దిగితే కాని నీరు దొరకదు. మామూలు రోజుల్లో అయితే అంత కష్టం లేదుకాని శ్రావణ, భాద్రపద మాసాలలో వర్షాలు పడుతూంటే ఈ వాలు తలాలు ఒండ్రు మట్టి మూలంగా జారిపోతూ ఉండేవి. ఈ వాలు తలాలలో నడవడం ఒక గొప్ప అనుభవం. అడుగు వేసి బొటన వేళ్ళు, మిగతా వేళ్ళు, భూమిలో గుచ్చాలి, లేకపోతే జారిపోతాం. మామూలుగా నడవటమే కష్టమయితే నీళ్ళ బిందెతో ఆ వాలు తలాలు ఎక్కి దిగడం ఎంత కష్టం, అందులోనూ ఒకటి రెండు బిందెల నీటితో సరిపోని సమయం. నీళ్ళు తేవాలి, ఇండుపుకాయ అరగదీసి కలిపి నీరు తేర్చాలి. మనుమలమంతా చిన్న వాళ్ళం. మా తల్లులకు సహాయం చేసే వయసుకాదు. మగవాళ్ళకి ఈ విషయం పట్టలేదు. ఇలా వర్షంలో నీళ్ళు తెస్తున్న సమయంలో మా అమ్మ, దొడ్డమ్మో, లేక ఇద్దరూనో కాని గట్టు జారిపోవడం మూలంగా నీటి బిందెతో మట్టిలో పడిపోయి, పడటం మూలగా, నీటి బిందె మీద పడి, చట్టలు నెప్పి పెట్టటం మూలంగా ఇబ్బంది పడిన విషయం మా మూడవ పెదనాన్నగారి దృష్టిలో పడింది. వెంటనే ఆయన కావిడి వేసుకుని కావలసిన మడి నీళ్ళు తెచ్చి ఆ రోజుల్లో కష్టము గడిపేరు. కాని మామూలు రోజులలో ఎలా? ఇదేకాక,శీతాకాలం వేసవి కాలాల్లో మరో బాధ ఉండేది. గట్టు జారడం కాదు కాని, ఇసుక తిప్ప వేస్తే ఆ ఇసుకలో నీటి బిందెతో నడవటం ఎంత కష్టం. మరో బాధ ఇసుక వేడెక్కిపోయిన మధ్యాహ్నం సమయమైతే మరీ దారుణం. కాళ్ళు కాలిపోతూ ఉంటే భుజంమీద నీళ్ళ బిందె బరువుతో బాధ మరింత ఎక్కువయ్యేది. దీనికి ఒక విరుగుడు కనిపెట్టేరు వాళ్ళు, తడి చీర నీళ్ళోడుతూ ఉండగా బయలుదేరడం, నీళ్ళనుంచి, అదీగాక కొన్ని బట్టలు పట్టుకెళ్ళి, వాటిని ఉతుక్కుని వాటిని పిండకుండా నీళ్ళతోనే మరొకభుజం మీద వేసుకుని వచ్చేవారు, ఈ నీళ్ళు కాళ్ళనుంచి కారుతూ ఉంటే వేడి తెలియదు, ఇదీ కాళ్ళు కాలకుండా ఉండటానికి చేసుకున్న ఏర్పాటు. చెప్పులేసుకుని వెళ్ళచ్చుగా అని అడగచ్చు, నేటి వారు, చెప్పులతో ఇసుకలో నడవటం కష్టమనీ, మడికి చెప్పులేసుకోడం కుదరదనీ సమాధానం, చెప్పేవారు, ఈ ప్రశ్న మేము అప్పుడు వేసినపుడే.

ఇలా మంచి నీళ్ళ వాడకంలో పొదుపు అన్ని విషయాలకీ వర్తించిందేమో..ఆ తరవాత…

ప్రకటనలు

రచయిత: kastephale

A retired telecom engineer.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s