శర్మ కాలక్షేపంకబుర్లు-శ్రమదానం.

Posted on ఆగస్ట్ 11, 2012
6

శ్రమదానం.

నిన్న మంచినీళ్ళుతెచ్చుకోవడానికి పడే కష్టాలు చెప్పుకున్నాం కదా. ఆ అత్యవసర పరిస్థితులలో మా పెదనాన్న గారు కావడితో నీళ్ళు తెచ్చినప్పటినుంచి ఆయనలో ఒక ఆలోచన బయలుదేరి ఉండచ్చు. మరునాడే గునపం పార పుచ్చుకుని వెళ్ళి మూడు వాలు తలాలలో మెట్లులా చేయడం మొదలు పెట్టేరట. ఇది చూసినవారు, “సూరన్నగారూ, మీకు పిచ్చా, ఇవి ఉంటాయా, నీటి ఉరవడికిపోతాయి, నీటి దగ్గరివి, మిగిలినవి వర్షానికి పోతాయి, మీ పిచ్చి కాని, ఎందుకీ పనికి రాని పని” అని గేలి చేశారట. ఎవరేమన్నా ఆయన లెక్క చేయక ఆ పని పూర్తి చేశారట, ఒక్కరూ. ఆ తరవాత వర్షానికి పోయినపుడు, మళ్ళీ మళ్ళీ సరిచేస్తూ వచ్చారట. భూమి కాస్త మెట్ల లా ఉండటం మూలంగా, కాలు పట్టు చిక్కడం బాగున్నందున మా అమ్మ, దొడ్డమ్మ కూడా ఈ పనిలో పాల్గొనేవారట. ఇది చూసిన వీధివారంతా, “వీళ్ళకి ఇదో పిచ్చి”అనుకునేవారట, మగవాళ్ళు, కాని ఆడవాళ్ళు మాత్రం బాగుందనేవారట.

కొంతకాలమయేసరికి మేము పెరిగేము, మేము నలుగురు అన్నదమ్ములం. మేమిద్దరం, మా పెదన్నాన్నగారబ్బాయిలు ఇద్దరు. మేమూ మెట్లు చేయడం లో పాల్గొనేవాళ్ళం. ఇలా మట్టిలో మెట్లు చేసేకంటే రాళ్ళు పేరిస్తే మెట్లలాగ అనే ఆలోచన వచ్చింది. ఎలా?, లంకలో చెల్లా చెదురుగా పడి ఉంటున్న రాళ్ళను, సమతలాలుగా ఉన్నవాటిని ఒక చోటకి పోగేయడం, వాటిని పని ప్రదేశానికి కావడి ద్వారా చేర్చడం. ఆ తరవాత మెట్లు కట్టడం ఇదీ ప్రణాళిక. ఇద్దరు,చెల్లా చెదురుగా పడిఉంటున్న రాళ్ళలో నాలుగుపక్కలా బాగున్న వాటిని పోగెయ్యడం. ఇందుకు ఇద్దరం పని చేసేవాళ్ళం. అక్కడనుంచి పనికి కావలసిన చోటికి తేవడానికి ఇద్దరు, కావడి వేసుకుని రెండు రాళ్ళు ఒక్కొకసారి చొప్పున తెచ్చి, గుట్ట పోయడం ప్రారంభించాము. మా పెదనాన్న గారు పని పర్యవేక్షణ చేసేవారు. మా అన్నదమ్ములం నలుగురం పని చేసేవాళ్ళం. రాళ్ళుపోగుచేసి ఒకచోటికి చేర్చే పనికి ఒక నాలుగైదురోజులు పట్టింది, మొదటిసారి. ఉదయం కొంతసేపు సాయంత్రం కొంత సేపు పని చేసేవాళ్ళం. ఆ తరవాత గునపాలు పారలూ పుచ్చుకుని బయలుదేరి మెట్లు తవ్వేం. ఆ తరవాత ఎగుడు దిగుడూలేకుండా రాళ్ళు పేర్చుకుంటూ వెళ్ళేం. మొదట నాలుగడుగుల పొడుగుతో మెట్లు కట్టేము. మొదటిలో మెట్లు సరిగా కట్టలేకపోయాం, అనుభవం లేక, ఇలా మెట్లు కట్టినందుకు చాలా రకాల ఎగతాళీ మాటలు విన్నాం. బాధ పడద్దని చెప్పేవారు, మా పెదనాన్నగారు. వాటిని నెమ్మదిగా సరిచేశాం. ఆ తరవాత సంవత్సరాలలో నెమ్మదిగా ఎనిమిదడుగుల పొడుగుకు పెంచేం, మెట్లు. కొత్తలో కొద్దిగా ఇబ్బంది కలిగినా, పని చేస్తుండగా సులువు దొరికి మెట్లు చక్కగా వచ్చేవి. వీధిలో ఉన్న ఆడవారంతా చాలా సంతోషించేవారు. గట్టు ఎక్కడానికి దిగడానికి, ఆ తరవాత నీళ్ళ దగ్గరకి, మూడు మెట్ల వరసలు కట్టేవాళ్ళం. మొదట ఈ రాళ్ళు తెచ్చి మెట్లు కడుతున్నప్పుడు కూడా, “సూరన్నగారు! ఏమిచేసినా ఇవన్నీ ఉండవండి, పోతాయి” అంటూనే ఉండేవారు. వాటిని ఉపయోగించుకుంటూనూ ఉండేవారు. పెదనాన్నగారేమీ సమాధానం చెప్పేవారుకాదు. ప్రతి ఆరునెలలకి ఒక సారి,మెట్లు సరిచేసేవాళ్ళం. కొన్నాళ్ళ తర్వాత, వీటిని సరిచెయ్యడం ఎప్పుడేనా ఆలస్యమయితే మాకు వచ్చి చెప్పేవారు, అక్కడికి అది మా పని లాగా. ఒక సారి మెట్లు కడుతుండగా ఒకతను ఏదో మాట్లాడుతున్నాడు,ఈ మెట్ల గురించి అసందర్భంగా, మా అన్నదమ్ములలో ఒకరికి కోపంవచ్చి సమాధానం చెప్పడానికి మొదలుపెట్టేరు, ఇంతలో మా పెదనాన్నగారు గొంతు సవరించారు. అంటే ఆయన మాట్లాడతారని తెలిసి వీరు ఊరుకున్నారు. అప్పుడాయన, “మాట్లాడేటపుడు ఆలోచించి మాట్లాడాలి, దానినే నోరు సంబాళించుకోడం అంటారు. నోరు పారేసుకోకూడదు. కాలు జారితే తీసుకోగలం, నోరుజారితే తీసుకోలేము” అన్నారు. ఇది అవతలి అతనికి తెలిసిందో లేదో కాని అక్కడే ఉన్న ఒకామె ఈ అసందర్భంగా మాట్లాడుతున్నతనిని “దున్నపోతులా నిలబడి మాట్లాడుతున్నావు, వాళ్ళు చేసేపనికి సాయంచెయ్యచ్చుగా, సొల్లు కబుర్లు చెప్పేకంటే” అంది. మరుక్షణం అతనక్కడనుంచి మాయమైపోయాడు. ఆ వీధిలో ఆడవాళ్ళంతా మేము చేస్తున్న పనికి సంబరపడేవారు, మాకు వత్తాసు పలికేవారు. ఇతర వీధులలోంచి కూడా స్త్రీలు ఈ వీధికి వచ్చి, రేవులో నీళ్ళు పట్టుకెళ్ళేవారు. ఇలా ప్రతిసారి కష్టపడేకంటే సిమెంటు చేస్తే మంచిదనే ఆలోచన ఉండేదికాని, తాహతు సరిపోయేదికాదు. తాహతు సరిపోయినవారు ముందుకు వచ్చేవారుకాదు, వారు మాత్రం ఈ మెట్లు ఉపయోగించుకునేవారు. శ్రమకదా చేద్దాం, పదిమందికి ఉపయోగపడేపనికదా, అని చేస్తూనే ఉండేవారం.

బడిలో ఒక రోజు, ఆ పీరియడ్ మా క్లాసుకు రావలసిన మాస్టారు శలవు పెట్టేరు. డ్రిల్లు మాస్టారికి ఎక్ స్ట్రా క్లాసు, అది చెప్పివద్దామని వెళుతూ ఉంటే, తాపీమేస్త్రి, పని దగ్గర ఇటుకలు లేవని చిరాకు పడుతూ కనిపించాడు. ఒక మాట చెప్పాలి, మా స్కూల్ ఒక్క సారిగా తయారు కాలేదు ఒక్కొక్కగది కట్టుకుంటూ వచ్చారు. అలా పని జరుగుతున్న సందర్భమది. మా డ్రిల్లు మాస్టారు కనపడ్డారు, ఎక్ స్ట్రా క్లాస్ గురించి చెప్పేను. “వస్తా నడు” అన్నారు. నేను కదలలేదు. “ఏం” అన్నారు. “మేస్త్రీ ఇటుకలు లేక కట్టుబడి ఆగిపోయిందనుకుంటున్నా”డన్నా. మేస్టారు సాలోచనగా చూశారు. “ఈ క్లాస్ టైం లో మేమంతా ఇటుకలు చేర్చేస్తే పని ఆగదు కదు మాస్టారూ” అన్నా. “ఒరే! బాగా చెప్పేవురా. నువ్వు క్లాస్ కెళ్ళి అందరినీ వరుసగా వచ్చెయ్యమని చెప్ప”మన్నారు. క్లాస్ కెళ్ళి చెప్పేను, అందరూ వచ్చేశారు. వరసగా నిలబెట్టేరు, ఎదురెదురుగా పక్క పక్కల, ఒక్కొక ఇటుకే గుట్ట దగ్గరనుంచి పని ప్రదేశానికొచ్చేసింది, ఒకరి నుంచి ఒకరు ఇటుక అందుకుంటూ ఉండగా. మనుషులు కదలకుండా, పెద్ద శ్రమలేకుండా. పీరియడ్ అయ్యేటప్పటికి, మొత్తం ఇటుకలన్నీ పని ప్రదేశానికి వచ్చేశాయి. ఆ తరవాతనుంచి, ఎక్ స్ట్రా క్లాసులు, క్రాఫ్ట్, డ్రాయింగ్ పీరియడ్లు శ్రమదాన పీరియడ్లు గా మారిపోయాయి, కట్టుబడి ఉన్నంత కాలం.

ఏంటో! ఎవరిపిచ్చి వారికి ఆనందం కదండీ! ఇటువంటి పిచ్చి పనులే చేసేవాళ్ళం. 🙂 ఆ తరవాత

ప్రకటనలు

రచయిత: kastephale

A retired telecom engineer.

11 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-శ్రమదానం.”

 1. ఊరికి ఉపయోగపడే ఆలోచనకు కార్యరూపం ఇచ్చిన మీ పెదనాన్నగారికి 🙏. వారు తలపెట్టిన పనికి శ్రమదానం చేసిన మీకందరికీ 👏.
  అలాగే మీ డ్రిల్ మాస్టార్ కి మీరు సూచించిన శ్రమదానం ఆలోచన చాలా బాగుంది. ఎక్సట్రా క్లాస్ తీసుకోవడానికి డ్రిల్ మాస్టారిని పురమాయిస్తే ఆయన క్లాస్ రూంలో సరదా కబుర్లు చెప్పి ఆ గంటా గడుపుతాడు సాధారణంగా (మా స్కూలులో కూడా అప్పుడప్పుడు ఎక్సట్రా క్లాస్ తీసుకోవడానికి డ్రిల్ మాస్టార్ ని పంపించేవారు. ఆయన NCC ఆఫీసర్ కూడా. దాంతో ఆయన ఎక్సట్రా క్లాస్ కి వస్తే మిలటరీ కబుర్లు చెబుతుండేవారు 🙂).
  మా చిన్నప్పటి రోజులలో (1950, 1960 ల్లో) ఆ ప్రాంతపు బి.డి.వో గారు (Block Development Officer) ఊరి పెద్దలతో మాట్లాడడమే కాక, మీటింగు పెట్టి ఊరి ప్రజలకు వివరించి చెప్పి, శ్రమదానంతో ఊరికి ఉపయోగపడే పనులు చేయించేవారు. ఇప్పుడు శ్రమదానం లాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయా – తెలియదు.

  మెచ్చుకోండి

  1. అవును నిజమే “జిలేబి” గారు 🙂, చాలా “శ్రమ” దానం జరుగుతోంది (“అనామకం” అని వ్యాఖ్య పెట్టినా అది మీరే అని గ్రహించేసాను చూసారా! “ఝాసూసీ సింగమ్” అని నిన్న మీరే అన్నారుగా 🙂).

   మెచ్చుకోండి

 2. గత కొన్ని రోజులుగా శర్మ గారి మాట వినబడడం లేదు (టపాలు ముందే షెడ్యూల్ చేసుంటారు కాబట్టి దాని ప్రకారం పోస్టయిపోతుంటాయి, అది వేరే సంగతి). ఎల్లరున్ సుఖులే కదా?

  మెచ్చుకోండి

   1. పెద్ద వయసు ముచ్చట్లన
    ముద్దుగ ఒద్దుగ జిలేబి మురిసితిమి సుమా !
    హద్దులు లేవు గదా మా
    సుద్దుల రాతల కును, శుభ సూక్తులకున్నూ

    జిలేబి

    మెచ్చుకోండి

 3. ఓయమ్మ జిలేబీ! మా
  ప్రాయపు ముచ్చట్ల నరయ వయసే రా లే
  దాయె సుమా నీకున్, రమ
  ణీ యామపు కబురులమ్మి ణిసిధాత్వర్థం 🙂

  జిలేబి పరార్ 🙂

  మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s