శర్మ కాలక్షేపంకబుర్లు-మౌనం.

Posted on సెప్టెంబర్ 17, 2012
6
మౌనం

కృషితో నాస్తి దుర్భిక్షం
జపతో నాస్తి పాతకం,
మౌనేన కలహో నాస్తి,
నాస్తి జాగరతో భయం.

వ్యవసాయం చేస్తే కరువుండదు, తపస్సు చేస్తే పాపముండదు, మౌనంగా ఉంటే దెబ్బలాట ఉండదు, జాగ్రత్తగా ఉంటే భయం లేదు.

పంచభూతాలలో రసనేంద్రియం చేసే మరోపని మాటలాడటం. దీనిని మానేయడమే మౌనం, దీనిని వాజ్మౌనం అని, ఇంద్రియాలను నిగ్రహించడం అక్షమౌనమని, కాష్ఠమౌనం అంటే మానసిక మౌనమని అర్ధమట.. నిజానికి మాటాడటం మానేయడం మౌనం కాదేమో! మానసిక మౌనమే మౌనం కావచ్చని నా ఊహ. మానసిక మౌనమంటే మనసు చేసే ఆలోచనని అరికట్టడం. ఇది చాలా కష్టమయిన సంగతే. మహాత్ముడు కూడా మౌనవ్రతం పాటించినట్లుంది. మౌనం మాట్లాడుతుందంటారు. నిజమా? “మౌనమె నీ భాష ఓ మూగమనసా!” మంచి పాట బాలమురళి గారి గొంతులో. “మనసు మూగదే కాని బాసుండది దానికి, చెవులుండే మనసుకే వినిపిస్తుందా అది.” సినీ కవి చెప్పినా ఎంత గొప్ప ఊహ. నేటిరోజులలోని పాటలలో ఇంతటి శక్తి, అతిశయోక్తి.

మౌనం ఏమయినా చేయగలదా? నిజం! చేయగలదు, నా అనుభవం చెబుతా వినండి. కాకినాడలో ఉంటున్న రోజులు, మెయిన్ రోడ్డు నుంచి దేవాలయం వీధిలోకి వస్తున్నా, జైన దేవాలయం ఉన్న వీధిలోనుంచి, సైకిల్ మీద. నేను మెయిన్ రోడ్ దగ్గర మలుపు తిరిగేటప్పటికి ఆ వీధిలో ఒక అమ్మాయి జైన దేవాలయం దరిదాపులలో ఉంది, దేవాలయం వీధికి వెళుతూ. ఎదురుగా ఒక అబ్బాయి వస్తున్నాడు. ఈ అమ్మాయి ఎటు వెళితే అటు అడ్డు వస్తున్నాడు, ఏదో పిచ్చి పని చెయ్యాలనే ప్రయత్నం లో ఉన్నట్లు అనిపించింది నాకు,వీధి మొత్తం నిర్మానుష్యంగా ఉన్నచేత. నేను వస్తున్న సంగతి అమ్మాయికి తెలియదు, వెనక ఉన్నాను కనక, అబ్బాయి చూసే స్థితిలో లేడు, తమకం మీద ఉన్నాడు కనక. నేను సైకిల్ మీద వారి దగ్గర కొచ్చేటప్పటికి వీరిద్దరూ ఒకరికొకరు ఎదురెదురుగా, జైన దేవాలయం ఎదురుగా ఉన్నారు.అబ్బాయి అమ్మాయి మీద పడేలా అనిపించింది నాకు, అంత దగ్గరకొచ్చేసేడు. అమ్మాయి నిస్సహాయంగా బిక్కముఖం వేసుకుని, వాడు చేయబోయే వెధవపని ఏదయినా ఎదుర్కోడానికి సిద్ధ పడినట్లుంది. నేను సైకిల్ మీద వస్తూ బ్రేక్ వేసి, ఎడమ కాలు నేల మీద ఆన్చి, సైకిల్ మీదే కూచుని ఉన్నా, మౌనంగా, వారికేసి చూస్తూ. నా రాక అమ్మాయిలో కొద్దిగా శక్తి చేకూర్చింది, సైకిల్ మీద వచ్చి ఆగి ,కూచుని ఉండటం తో బాగా పుంజుకుంది, ఆత్మ స్థైర్యం. అబ్బాయీ నన్ను చూశాడు, ఏమనుకున్నాడో తెలియదు కాని ఒక చూపు, కౌశికుడు కొంగను చూసినట్లు నా కేసి చూసి మౌనంగా వెళ్ళిపోయాడు. అమ్మాయి బుర్ర ఎత్తకుండా వెళ్ళిపోయింది, కనీసం నాకేసి చూడనుకూడా చూడక, సిగ్గు పడిందనుకున్నా . ఈ అమ్మాయీ, అబ్బాయీ, చాల సార్లు ఆ తరవాత కూడా కనపడ్డారు, వేరు వేరుగా. నేను చేసినదేమీ లేదు, మౌనంగా నిలబడ్డానంతే. అవి పాత రోజులు కనక మౌనం పని చేసిందేమోననిపించచ్చు కాని, ఇది కూడా ఆయుధమే,నేటికీ, అనుమానం లేదు. ఆ కుర్రవాడు మరే పిచ్చి పనీ చేయకుండా ఆపింది కదా.

మన సంప్రదాయం లో మూగ నోము కూడా ఉన్నది. దీని వల్ల ఆ రోజు వారు మౌనం అభ్యాసం చేసినట్లు, ఓర్పు, సహనం అలవడతాయనుకుంటా. ఒక్కొక సందర్భం లో ఇది ఆయుధాన్ని మించి పని చేస్తుంది. ఇల్లాలు కాఫీ తెచ్చి మౌనంగా కంప్యూటర్ దగ్గర పెట్టేసి వెళ్ళిపోయిందంటే, రోజూ మాటాడేవారు ముఖం చాటేశారంటే, కనపడీ మనతో మాటాడక వెళ్ళిపోయారంటే,మనతో మాటాడక పక్కవారితో మాటాడి ఎళ్ళిపోతే, ఎంత బాధ? కత్తి పుచ్చుకుని పొడిచేసినదానికంటే, నెమ్మదిగా చుర కత్తితో కోసినదాని కంటే ఎక్కువ బాధ.అనుభవిస్తే కాని తెలియదు. మరొక రకం కూడా ఉంది మౌనం లో, దీన్నే సాధింపు అనచ్చేమో కూడా. నా మనవరాలికి కోపం వస్తే మాట్లాడదు, “ఏరా! చిట్టితల్లీ కోపమా” అంటే, “నాకెందుకూ కోపం, నాకస్సలు కోపం రాదు తెలుసా” అంటుంది, కాని మాటాడదు, బతిమాలితే, కోపం పోయినతరవాత నోరు విప్పితే, వరద గోదారే :).

నేడు రాజకీయాలలో కూడా మౌనం బాగా పని చేస్తున్నట్లుంది. మౌన బాబా అని పి.వీ గారిని ఆ తరవాత “గూంగీ” అని మరొకరిని అనేవారు. ఆవిడిప్పుడు దెబ్బలాటకి పెద్ద కూతురులా ఉందిట. ఇప్పుడు పెద్దవారు మౌన బాబా అవతారమెత్తితే, మౌనేన కలహం నాస్తి అవుతుందనుకుంటే, బొగ్గు మసి ఎంత తుడిచినా పోటంలేదే!!

శర్మ కాలక్షేపంకబుర్లు-ములగ కూర పెసరపప్పు.

Posted on జూలై 12, 2014
ములగ కూర పెసరపప్పు.

ఆషాఢ మాసం వచ్చేసి అప్పుడే పదిరోజులు దాటిపోయింది. నిన్ననే శ్రీశయనైకాదశి అదే తొలేకాశి కూడా వెళిపోయింది. మాకు చినుకు లేదనుకోండి ఇప్పటిదాకాను, పుణ్యాత్ములంకదా! ఎక్కడో మొదలెట్టి ఎక్కడికో పోతున్నానా. వస్తున్నా! ఈ ఆషాఢమాసం లో ములగ కూర తిని తీరాలన్నారు. ములగ కూరా పెసరపప్పూ వేసింది ఇల్లాలు ద్వాదశిరోజు. దాని వంటక విశేషంబెట్టి దంటేని…..

కావలసినవి

1.ములగకూర లేతది చిగుళ్ళు.
2.పెసరపప్పు.
3.పోపుకి
మినపపప్పు.
పచ్చి మిర్చి.
ఆవాలు
మెంతులు చిటికెడు
జీలకర్ర.
చిన్న అల్లం ముక్క సన్నగా తరిగి ఉంచుకోండి.
ఇంగువ ముక్క.
నూనె.
4.మిరియాలు కొద్దిగా.
5.కూర వడియాలు కాని గుమ్మడి వడియాలు.
6.పచ్చి శనగలు.
7.పసుపు చిటికెడు.
8.ఉప్పు

ములగ కూర శుభ్రంగా కడగండి, పురుగు లేకుండా చూసుకోండి. కూరని ఉప్పు నీళ్ళలో పడెయ్యడం, కొద్ది సేపు, మంచిది. గుమ్మడి వడియాలు కాని కూర వడియాలు కాని వేయించుకుని ఉంచుకోండి
పెసరపప్పు ఉడికించండి, నీళ్ళు పోయాలండోయ్. ములగకూరని కూడా అందులో వేసెయ్యచ్చు, అందులోనే పచ్చి శనగలు కూడా వేయండి, చిటికెడు పసుపేయండి. ఉడికిన తరవాత ఉప్పేయండి, నీరులేకుండేలా చూడండి, కొద్దిగా నీరున్నా కంగారు పడకండి,

మూకుడు వేడెక్కిన తరవాత కొద్దిగా నూని వేసి ఆ తరవాత మినపపప్పు వేయించండి దోరగా, దానిలో
ఆవాలు, మెంతులు, జీలకర్ర వేయండి, ఆవాలు వేగేటపుడు జాగ్రత పేలతాయి, కళ్ళలో పడితే ప్రమాదం, ఆ తరవాత పచ్చిమిర్చి, సన్నగా తరిగి ఉంచుకున్న అల్లం , చివరగా ఇష్టాన్ని పట్టి ఇంగువ ముక్క వేయండి. పోపు కమ్మటి వాసనొచ్చాకా దింపండి.

ఇప్పుడు పోపులోకి పప్పుని చేర్చండి. వేయించి పెట్టుకున్న వడియాలు, నేతితో వేయించుకున్న మిరియాలు కూడా కలపండి.కొద్ది సేపు స్టవ్ మీదుంచండి, నీరుంటే ఇగిరిపోతుంది.

ములగ కూర పెసరపప్పు ఇదేంటి పిచ్చి తిండి అనుకుంటున్నారా? ఇది ఒక కమ్మనైన రుచికరమైన మందు. ములగ కూరలో ఇనుముంది, పెసరపప్పులో మాంసకృత్తులున్నాయి.ఇక పోపులో వేసినవన్నీ మందులే, మిరియాలతో, వడియాలతో. ఇది వర్షాకాలనికి కావలసిన మందు, అందుకే ఈ నెలలో తినమన్నారు. ములగాకు వేడి చేస్తుంది అందుకుగాను పెసరపప్పు చలవ చేస్తుంది. చేసుకుని చూడండి, బలే రుచిగా ఉంటుంది.

నేడు చేర్చినది:-

తెలగపిండి మునగాకు కలిపి వండుకోవచ్చు. రెండూ అతి వేడి చేసేవే!

తెలగపిండి ఉడికించండి నీరు లేకుండా చూడండి, మునగాకును నీరుపోసి ఉడికించండి. రెండిటిని కలపండి. చిటికెడు పసుపు,తగిన ఉప్పు, పోపు చేర్చండి. ఇష్టమైనవారు వెల్లుల్లి వేసుకోవచ్చు, దారుణంగా వేడి చేస్తుంది సుమా!

శర్మ కాలక్షేపంకబుర్లు-కాగల కార్యం గంధర్వులే చేశారు.

Posted on ఆగస్ట్ 26, 2012
8

Courtesy youtube

కాగల కార్యం గంధర్వులే చేశారు.…..

జరిగినది టూకీగా:- అరణ్యవాసానికి వెళ్ళిన పాండవులను గేలిచేయాలని దుర్యోధన, శకుని, కర్ణులు బయలుదేరి, ద్వైతవనం దగ్గరికి వేట మిషమీద వెళ్ళి చిత్రసేనుడనే గంధర్వరాజుతో తగువు తెచ్చుకున్నారు. ఆతరవాత…..

యుద్ధరంగం నుంచి వెళ్ళిన వారు తమ రాజు చిత్రసేనుడికి చెప్పుకోగా, గంధర్వరాజు వేల సంఖ్యలో సైనికులను పంపి కౌరవులను ఎదుర్కున్నాడు. అందరినీ చికాకు పరచేరు, ఒక్క కర్ణుడు మాత్రం నిలబడ్డాడు. ఎక్కడ చూచినా గంధర్వులే కనపడుతున్నారు. శకుని, సోదరులతో దుర్యోధనుడు గంధర్వులను ఎదుర్కోడంతో, వారు వెనకడుగేయాల్సి వచ్చి, చిత్రసేనుడికి చెప్పేరు. రాజు స్వయంగా వచ్చి కౌరవులను ఎదుర్కోగా, గంధర్వులు కొంతమంది కర్ణుడి రధ చక్రాలు, కొంతమంది గుఱ్ఱాలను పట్టుకున్నారు, కొంతమంది రధం ఇరుసు విరిచేశారు, దండి విరిచేశారు. అలా అందరూ కర్ణుడి రధం చుట్టుముట్టి కర్ణుడిని విరధుడిని చేయగా, వికర్ణుని రధమెక్కి యుద్ధ రంగానికి దూరంగా వెళ్ళిపోయాడు. చిత్ర సేనుడు యుద్ధం చేసి దుర్యోధనుడునికూడా కర్ణునిలా విరధుణ్ణి చేసి, పడకొట్టి, జుట్టుపట్టి ఈడ్చి, పెడ రెక్కలు కట్టేసి సింహనాదం చేశాడు. మిగిలిన గంధర్వులు దుర్యోధనుని తమ్ములను, మంత్రులను, స్త్రీ జనాలను,పట్టి బంధిస్తూ ఉండగా, చీకాకు పడిన కౌరవ సైన్యం ధర్మరాజు ఉన్న వైపుకు పారిపోయింది. మిగిలిన కౌరవులు ధర్మరాజు దగ్గరికి పోయి “సుయోధనుడిని బంధించి తీసుకుపోతున్నారు గంధర్వులు, కావవా!రక్షించవా!!” అని వేడుకున్నారు. ఇలా మొరపెట్టుకుంటున్న వారిని చూసి భీమసేనుడు నవ్వుతూ ఇలా అన్నాడు.

“మనకు జులుకనయ్యె మన చేయు పనియ గంధర్వవరులు గూడి తగ నొనర్చి
రింత లెస్స యగునె యేభారమును లేక యూరకుండ మనలనొందదే జయము.

మన పని తేలికయిపోయింది, మనం చేయాల్సిన పని గంధర్వులు బాగా చేసేరు, మనం ఊరుకుంటే జయం మనదేకదా” అని. అలా భీముడన్న మాట ’కాగలపని గంధర్వులే నిర్వహించారు’ అన్నది వాడుకలోకి వచ్చింది. మనకి ఇక్కడ దాకానే చాలు కాని మిగిలినది కూడా చెప్పేసుకుందాం, మంచి రసవత్తరంగా ఉంటుంది కనక.

ధర్మరాజుతో మొరపెట్టుకుంటున్న కౌరవులను చూసి, ధర్మరాజుతో భీముడు ఇలా అన్నాడు. “మా బలేగా అయ్యింది, వీరి పట్ల దయ చూపద్దు” అన్నాడు. దానికి ధర్మరాజు “జ్ఞాతులలో అనేక విభేదాలుండచ్చు, పైవాళ్ళు మనవాళ్ళని బాధపెడుతూంటే, అర్ధించినపుడు కూడా చూసి ఊరుకోవడం మనకీ మంచిదికాదు, మనం చేయగల సాయం తప్పని సరిగా చేయాలి. నీవూ తమ్ములు పోయి మనవాళ్ళని విడిపించుకురండయ్యా” అన్నాడు. “మరో సంగతి, ఇది మనకి చాలా మంచి అవకాశం, నేను యజ్ఞదీక్షలో ఉన్నా, లేకుంటే నేనే వెళ్ళేవాడిని” అని కూడా అన్నాడు. అప్పుడు భీముడు తమ్ములతో బయలుదేరి వెళ్ళి గంధర్వులను ఎదుర్కున్నాడు. పెద్ద యుద్ధం జరిగింది, దుర్యోధనుడిని తీసుకుని ఆకాశ మార్గాన పోవాలని ప్రయత్నించిన గంధర్వులను అడ్డుకున్నాడు, అర్జునుడు. యుద్ధం జరుగుతుండగా గంధర్వరాజు రధం మీద కనపడ్డాడు, పాండవులు అతనిని అర్జునుని మిత్రునిగా గుర్తించారు. రధాల మీద నుంచే కుశల ప్రశ్నలు వేసుకున్నారు, ఇరు పక్షాలవారు. అప్పుడు చిత్రసేనుడుతో అర్జునుడు, “దుర్యోధనుడిని వదిలిపెట్ట”మన్నాడు. దానికి చిత్ర సేనుడు, “వీడు మిమ్మల్ని హింసించాడు, అన్ని విధాలా,భార్య, పిల్లలతో వచ్చి అపహాస్యం చేయదలిచాడు, వీణ్ణి ఇప్పుడు ఇంద్రుని దగ్గరకు తీసుకుపోతున్నా,” అన్నాడు. “నీవు నా మిత్రుడవు కనక నీకూ నాకూ తగువులేదు” అన్నాడు. అప్పుడు అర్జునుడు “సుయోధనుడు మా సహోదరుడు, అతనిని వదలిపెట్టు, ధర్మరాజుకి ఇది ఇష్టమైన పని” అని చెబుతాడు. “నువ్వు వచ్చి ధర్మరాజుకి కనపడి, ధర్మరాజు ఏమి చెబితే అది చెయ్య”మన్నాడు. అందుకు చిత్రసేనుడు ఇష్టపడి, ధర్మరాజు వద్దకు వచ్చి, ధర్మజునిచే పూజింపబడి అతను చెప్పినట్లు దుర్యోధనాదులను వదలి వెళ్ళేడు. అప్పుడు ధర్మరాజు దుర్యోధనుడితో ఇలా అన్నాడు.

“ఎన్నడునిట్టి సాహసములింకనొనర్పకుమయ్య దుర్జనుం
దన్నున సాహస క్రియలయందు గడంగి నశించు గావునం
గ్రన్నన తమ్ములన్ దొరలగైకొని ఇమ్ములబొమ్ము వీటికిన్
సన్నుత దీని కొండొక విషాదము బొందకుమీ మనంబునన్.

ఇలాంటి సాహసాలు ఇక ముందు చెయ్యకు, మంచిదికాదు, తమ్ముళ్ళని తీసుకుని తిన్నగా ఇంటికెళ్ళిపో, ఇక్కడ జరిగినదాని గురించి ఆలోచించి విషాదం పొందకు” అని చెప్పి దుర్యోధనుడిని పంపేసేడు.

ఒక్కసారి అవలోకిద్దాం. వనవాసంలో ఉన్న వారు కష్టాలు పడుతున్నారంటే చూసి సంతోషించి, గేలిచేసి వద్దామని బయలుదేరేరు, దుష్ట చతుష్టయం, వేట వంకతో. వచ్చిన వారు అది సవ్యంగా చేయగలిగారా? గంధర్వరాజుతో యుద్ధం కోరితెచ్చుకుని తన్నులు తిన్నారు, పెడ రెక్కలు విరిచి కట్టేసి జుట్టు పట్టుకుని ఈడ్చుకుపోయాడు గంధర్వుడు, ఎనిమిది వేల రధాలు, ముఫైవేల గజాలు, లక్ష కాల్బలం, కర్ణుడు, శకుని, తమ్ములు ఇంతమంది ఉండి కూడా దుర్యోధనుడు గంధర్వుల చేతిలో ఓడిపోయాడు, పరాభవం పొందేడు. అసలే ఓటమి కష్టం అనే పుండు మీద కారం చల్లినట్లుగా, గంధర్వులను ఓడించిన అర్జునుడు మాట మీద, ధర్మరాజు మాట మీద వదలిపెట్టిపోయాడు,చిత్రసేనుడు, దుర్యోధనుడిని,. ధర్మరాజు ఏమన్నాడు, “ఒరేయ్! ఇకముందెప్పుడూ ఇటువంటి సాహసలు చెయ్యకు తిన్నగా ఇంటికిపో” అని చెప్పి పంపేసేడు. దుర్యోధనుడు దురాలోచన చేసి పాండవులను గేలి చేద్దామనుకుంటే, ధర్మరాజు దూరాలోచన చేసి శత్రువుని కాళ్ళ దగ్గరికి రప్పించుకుని, రక్షించి, జాగ్రత్తగా బతుకు అని చెప్పి వదిలేశాడు. ఇంతకు మించి గంధర్వుల చేతిలో ఓడిపోయినదే బాగుందేమో దుర్యోధనుడికి. ఇప్పుడు వేమన తాత పద్యం గుర్తురాలా

చంపదగినయట్టి శత్రువు తనచేత
జిక్కెనేని కీడు సేయరాదు
పొసగమేలు చేసి పొమ్మనుటే చాలు
విశ్వదాభిరామ వినుర వేమ.

దీనితో భీముడు చెప్పిన సామెత కాగలకార్యం గంధర్వులే చేశారనేదే కాకుండా చెరపకురా చెడేవు అన్నది కూడా ఉన్నట్లుంది కదూ…

దుర్యోధనుడిని రక్షించడం అనే ఒక పని ద్వారా ధర్మరాజు సాధించిన సత్ఫలితాలు చూద్దాం.
1. దుర్యోధనుడు శత్రువులా వ్యవహరించినా, తాను భ్రాతృ ధర్మాన్ని విస్మరించలేదని పెద తండ్రి, పెదతల్లికి తెలియచేశాడు. పాండవులపట్ల, పెదతండ్రి పుత్ర ధర్మాన్ని విస్మరించినది ఎత్తి చూపాడు.ఇదే సంగతి ప్రజలు అనుకునేలా చేసేడు.
2. దుర్యోధనుడు ధర్మం తప్పినా, తాను తప్పలేదని లోకానికి చాటి చెప్పేడు, లోకపు మన్నన పొందేడు.
3. దుర్యోధనుడు గేలి చేద్దామని వచ్చినవాడు, బంధింపబడి, జుట్టు పట్టి ఈడ్వబడి, పెడరెక్కలు కట్టేయగా గేలి చేయబడి, శత్రువు (ధర్మరాజు) దయా దాక్షిణ్యాల వల్ల విడుదల చేయబడ్డాడు. అందుకు సిగ్గు పడక తప్పని పరిస్థితి కల్పింప చేశాడు, ధర్మరాజు.
4. పెద్దదయిన సేన, రక్షణ, విజయం కలిగించదని ఒక హెచ్చరిక కూడా దుర్యోధనునికి ఇచ్చినట్లయింది.
5. ఇటువంటి సాహసాలు చెయ్యకు ఇంటికి తిన్నగా వెళ్ళు అని చెప్పి, దీన్ని మనసులో పెట్టుకోకు అని చెప్పడంలో అసలు రాజనీతి ఉంది. దుర్యోధనుడులాటి అహంభావికి ఇది మరణం కంటే కష్టమైన సమయం. అది కల్పించడం ధర్మరాజు చతురత, రాజనీతి.
6. యుద్ధం చేసి కూడా చిత్రసేనుని మిత్రత్వం పోగొట్టుకోకుండా, మిత్రుడు తన మాట వినేలా చేయడంలో సఫలమయ్యాడు.
భారతం విమర్శ చేసుకుని చదువుకుంటే ఇలాటి సంఘటనలు, సందర్భాలు చాలా కనపడతాయి.

శర్మ కాలక్షేపంకబుర్లు-కాగల కార్యం గంధర్వులే….

Posted on ఆగస్ట్ 25, 2012
6

కాగల కార్యం గంధర్వులే….

కాగలకార్యం గంధర్వులే చేసేరన్నది తెనుగునాట సామెత. దీనికి వెనుక గాధ మాత్రం భారతం లోదే.ఆ ఘట్టం చెప్పుకుందాం.

అనుద్యూతం అయిపోయింది.పందెం ప్రకారం వనవాసానికి వెళ్ళిపోయారు, పాండవులు. పాండవులు కామ్యక వనానికి వెళ్ళిపోయారు, అక్కడ కొన్నాళ్ళున్న తరవాత కృష్ణుడు కలిశారు. పాండవులు కామ్యక వనం నుంచి ద్వైతవనానికి బయలుదేరి వెళ్ళేరు. ఈ సందర్భం లో ఒక బ్రాహ్మణుడు ధృతరాష్ట్రుని వద్దకు వచ్చినపుడు, “పాండవులెలా ఉన్నారు అరణ్యంలో” అంటే, “చాలా బాధలు పడుతున్నార”ని చెబుతాడు. అందుకు ధృతరాష్ట్రుడు వగచి, వారి గొప్పదనం, వీరత్వం పొగుడుతే, విన్న దుర్యోధనుడు, శకుని, కర్ణులతో “మా తండ్రికి ఎందుకింత భయం వాళ్ళంటే,” అనగా కర్ణుడు, “మన గొప్పతనం వారికి చాటడానికి మంచి సావకాశం, మనసుకి సంతోషం పగవాడు కష్టపడుతున్నప్పుడు చూస్తే కలిగేదే, అసలైన ఆనందం, నార చీరలు కట్టుకుని అడవులలో తిరుగుతున్న వారికి రాజ్య వైభవం చూపినపుడు, వాళ్ళు బాధపడుతుండగా చూడటం, మనకు బాగుంటుంది కదా, మనం కనక ద్వైతవనానికి వెళితే” అంటాడు. “నా ఉద్దేశం కూడా అదే, నీవూ అదే చెప్పేవు, “అని దుర్యోధనుడంటాడు, కాని తండ్రి ద్వైతవనానికి వెళ్ళడానికి ఒప్పుకోడని సందేహిస్తాడు.” విదురుడు మొదలయిన వారు మహరాజుని ఒప్పుకోనివ్వరు”, అని అంటాడు. మహరాజును ఒప్పించేదెలా అని చింతిస్తారు. ఆ రోజుకు ఆలోచన తెగలేదు. మరునాడు ఉదయమే కర్ణుడు, దుర్యోధనుని దగ్గరకెళ్ళి “నాకో ఉపాయం తట్టింది, ద్వైతవనం దగ్గరలో మన గో సంపద ఉంది, దానిని చూసివస్తామంటే మహరాజు మనం వెళ్ళడానికి ఒప్పుకోవచ్చు” అంటాడు. అందుకు శకుని కూడా సమ్మతిస్తాడు. మంచి పధకం కుదిరినందుకు సంతసిస్తారు. గోగణం నుంచి ఒక నమ్మకమైన వాడిని రప్పించి, మహారాజు ముందు ప్రవేశపెడతారు. వచ్చిన వాడిని ధృత రాష్ట్రుడు “గోవులెల్లా ఉన్నాయ”ని అడుగుతాడు. అప్పుడావచ్చిన వాడు, “కౄరమృగాలు గోవులను హింసిస్తున్నాయి దేవరా!” అని చెబుతాడు, దానికి కర్ణుడు,శకుని,ఒకే మాటగా “దుర్యోధనుడిని వేట చేసి ఆ మృగాలను సంహరించమని ఆజ్ఞ ఇవ్వండి మహారాజా” అనిచెబుతారు. దానికి ధృతరాష్ర్ట్రుడు, “వేట అంటే మీరంతా వెళతారు, అక్కడికి దగ్గరలోనే పాండవులుంటున్నారు. మీరు తిన్నగా ఉంటారని అనుకోను, మరొకరిని ఏర్పాటు చేద్దామ”ని అంటాడు. “అక్కడికెళ్ళి వాళ్ళకి మీరు కీడు చేయటం, వాళ్ళు మీకు హాని తలపెట్టడం, రెండూ వద్దం”టాడు. అక్కడికి వెళ్ళి గోవులను రక్షించేందుకు, వేట మాత్రం చేసి వస్తాము కాని, పాండవులను పట్టించుకోమని చెప్పి ఒప్పించి స్త్రీజనాలతో బయలుదేరుతారు. వేటకి, ఎనిమిది వేల రధాలు, ముఫై వేల ఏనుగులు, తొంభై వేల గుర్రాలు, లక్ష మంది కాల్బలంతో, స్త్రీ గణంతో,ఇతర నట, విట గాయక జనంతో బయలుదేరుతారు. గోగణాలను చూస్తారు, వేట చేస్తూ ముందుకు వెళతారు. ముందుకు వెళ్ళగా ద్వైతవనం దగ్గరలో ఒక మంచి సరోవరం కనపడింది. దాని దగ్గరలోనే ధర్మరాజు ’సద్యస్కందం’ అనే యజ్ఞం చేస్తున్నాడు. ఆ సరోవరం దగ్గర చిత్ర గృహాలు నిర్మించడం మొదలు పెడతారు, దుర్యోధనుని ఆజ్ఞ మేరకు. అక్కడ ఉన్న సరోవరపు కావలివారు, “ఇది చిత్ర రధుడు అనే గంధర్వ రాజు విలాసహ్రదం, ఇక్కడినుండి తొలగిపొమ్మ”ని చెబుతారు. దానికి దుర్యోధనుని అనుచరులు, “మా దుర్యోధన మహారాజు ఇక్కడకి వస్తున్నారు, మీరే ఇక్కడినుంచి వెళ్ళిపోండ”ని చెబుతారు. అందుకు గంధర్వులు నవ్వి “మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిద”ని చెబుతారు. ఈ విషయాన్ని భటులు దుర్యోధనుడికి చేరవేస్తారు. సంగతి విన్న దుర్యోధనుడు తమ్ములను, మిగతా వారికి సరోవరాన్ని ఆక్రమించుకోమని ఆజ్ఞ ఇస్తాడు. అందరు బయలుదేరి వెళతారు, అక్కడ గంధర్వులు, ప్రయత్న పూర్వకంగా, “మీకూ మాకూ తగవు వద్దు, ఇక్కడి నుంచి వెళ్ళిపో”మని చెబుతారు. దానికి యుద్ధానికి వెళ్ళిన వారు ఒప్పుకోక గంధర్వుల మీద అస్త్ర శస్త్రాలు ప్రయోగిస్తే, వారుపోయి చిత్ర సేనునికి నివేదించుకుంటారు. ఇంకా ఉంది… మిగతా రేపు….

శర్మ కాలక్షేపంకబుర్లు-తొంగి చూడటం.

Posted on ఆగస్ట్ 28, 2012
10

Courtesy youtube

తొంగి చూడటం.

మొన్ననొక రోజు టపా రాస్తున్నా, మా మిత్రుడొకరు వచ్చేరు, నేను కంప్యూటర్ మీద రాస్తుండటం చూసి వెనక నిలబడ్డారు. నేను రాయడం ఆపేసి ఆయనకేసి తిరిగి మాట్లాడుతూంటే, “మధ్యలో ఆపద్దు, బాగుంది, దాన్ని పూర్తి చేసేయండి” అన్నారు. “ఇప్పుడు వద్దు లెండి తరవాత పూర్తి చేస్తా” అన్నా. “అదే”మన్నారు. “నాకో బలహీనత ఉంది, నేను రాసేటపుడు వెనకనుంచి ఎవరయినా చూస్తూ ఉంటే, చదువుతూ ఉంటే రాయలేను, ముందుకు సాగదు” అన్నా. ఆయనతో కబుర్లు చెప్పి వీడ్కోలిచ్చిన తరవాత నాకు చిన్నప్పుడు పరిక్షలలో కలిగిన అనుభవం గుర్తుకొచ్చింది.

ఎస్.ఎస్.ల్.సి ప్రి పబ్లిక్ పరీక్షలు పెట్టేరు స్కూల్ లో. ఆ రోజులలో పబ్లిక్ పరీక్షలకి ముందు ప్రి పబ్లిక్ అని స్కూల్ లో పరీక్షలు పెట్టి, విద్యార్ధిని మానసికంగా కూడా పబ్లిక్ పరీక్షకి సిద్ధం చేసేవారు. పరీక్షలయ్యాయి పేపర్లు దిద్దేసి మరునాడే ఇచ్చేశారు. నాకు ఇంగ్లీష్ లో 62 మార్కులు, లెక్కలలో 84 మార్కులు వచ్చాయి. ఇంగ్లీషు, హెడ్ మాస్టారు చెప్పేవారు. అయన దగ్గరికి దిద్దిన పేపర్ పట్టుకెళ్ళి “నాకు మరొక మూడు మార్కులు కలవాలండి” అన్నా. దానికి వారు, “ఒరేయ్! నేను నీకు ఇప్పుడు ఎన్ని మార్కులేసేనన్నది కాదు, నీకు రేపు ఎన్ని వస్తాయన్నది, నేను చెప్పిన సంగతి” అన్నారు. “అంటే నాకు ఇంగ్లీషులో 62 వస్తాయంటారా పబ్లికు పరీక్ష లో” అన్నా. “చూద్దాం కదా, అంతకంటే ఎక్కువ తెచ్చుకోడానికి ప్రయత్నించు” అన్నారు. అలాగే లెక్కల మాస్టర్ దగ్గరకెళితే “నీకు అన్నే మార్కులొస్తాయిరా పబ్లిక్ లో” అన్నారు. నాకేమో అయోమయం అనిపించింది. ఆ సంగతి మరిచిపోయి పరీక్షలకి తయారయిపోయాము. రోజూ సైకిలేసుకుని ఎనిమిది కిలో మీటర్ల దూరం పోలవరం వెళ్ళి హైస్కూల్లో పరీక్షలు రాయడం మొదలుపెట్టేము. మా స్కూల్ నుంచి ఎవరో ఒకరే వచ్చారు, వాచరుగా. వారిని మాత్రం మాకు వాచరుగా వేయలేదు, ఏరోజూ. రోజుకో పరీక్ష జరిగేది. ఇంగ్లీషు పరీక్ష రాశాను, బాగానే రాశానని నా ఊహ. మార్కులు లెక్కేసుకుంటే 65 వస్తాయేమోనని అనుకున్నా. మాస్టారు చెప్పింది నిజమో మన ఊహ నిజమో చూద్దామనుకున్నా. లెక్కల పేపర్ రోజున ఒక సంగతి జరిగింది. నా సీటు వాచర్ ఎదురుగా పడింది. వాచర్ ముందు ఆన్సర్ షీట్ ఇచ్చారు. రోల్ నెంబర్ వగైరా అన్నీ పూర్తి చేసుకుని జింక మీకి దూకే పులిలా లెక్కల పేపర్ కోసం చూస్తున్నా. నాది స్పెషల్ లెక్కలు. మా రూం లో ఇద్దరమే ఉన్నాం. మిగతా వాళ్ళకి కొశ్చన్ పేపర్లిచ్చేశారు, మాకు ఇవ్వలేదు, మా పేపర్ వేరు కనక. ఆ తరవాత తెచ్చేరు, మాకూ ఇచ్చారు. కొశ్చన్ పేపర్ పుచ్చుకున్న తరవాత దానిని మొదటినుంచి చివరిదాక చదివేయడం నా అలవాటు, అలాగే పేపర్ చదివేశా. ఇంక లెక్కలు చెయ్యాలి. ఒక సారి పేపర్ టేబుల్ మీద పెట్టేసి ఖాళీగా కూచున్నా. మిగతా వాళ్ళంతా కిందా మీదా పడుతుండగా, నేను అలా ఖాళీగా కూచోడం చూసిన వాచర్ కి ఏదో అనుమానం వచ్చి నట్లుంది. నా ముందు నుంచి వెనక్కి వెళ్ళేరు, ఇలా తిరుగుతున్నాడాయన. ఐదు నిమిషాల తరవాత లెక్కలు చేయడం ప్రారంభించా. వంచిన బుర్ర ఎత్తకుండా చేసుకుపోతున్నా. ఆరు లెక్కలు చేయాలి మూడు సెక్షన్లనుంచి, ఒక్కో సెక్షన్ కి రెండు చొప్పున. నాలుగు లెక్కలు చేసేశాను, అప్పటికి ఒక గంట అయింది. ఐదవ లెక్క మొదలు పెట్టబోతూ, కొత్త ఆన్సర్ షీట్ అడిగాను, ఇచ్చారు. కొత్త లెక్క మొదలెట్టా సగం చేసేటప్పటికి వాచర్ వచ్చి వెనకాల నిలబడ్డారు. నాకు లెక్క నడవటం కష్టమయిపోతూ ఉంది. ఆయనక్కడినుంచి వెళ్ళలేదు, నా పెన్ నడవలేదు. ఐదు నిమిషాల తరవాత ఇంక కుదరదని, “మాస్టారు మీరు నా వెనక నుంచుంటే నేను పేపర్ రాయలేను”అన్నా. “అదే”మన్నారు. “అది నా బలహీనత, మీరు నా ముందు కుర్చీలో కూచోండి, నా మీద అనుమానం ఉంటే కాని వెనక నుంచో వద్దు”అని చెప్పేసేను. ఆయనే మనుకున్నారో కాని నేనిదివరలో చేసిన లెక్కల ఆన్సర్ షీట్ పట్టుకుని ముందుకెళ్ళి కుర్చీలో కూచుని చూడటం ప్రారంభించారు. ఐదవ లెక్క చేసేను. ఆరవ లెక్క మొదలు పెట్టి చేసేను, ఆయనతో జరిగిన సంభాషణ మూలంగా ఏకాగ్రత దెబ్బతింది. మొత్తానికి ఆ పేపర్ అయిపోయింది.అప్పటి రోజుల్లో రెండు పేపర్లుండేవి, లెక్కలికి. రెండవ పేపరిచ్చారు. రెండవ పేపర్ అరగంటలో చెయ్యాలి. ఇరవై ఐదు నిమిషాల్లో చేసి చూసుకుని ఇచ్చేశాను. పేపర్ పుచ్చుకుంటూ వాచర్ గారు “నీకు తొంభై మార్కులలోపు వస్తాయి” అన్నారు. అది పట్టించుకోలేదు.

పరీక్షలయిపోయాయి. రిసల్ట్ వచ్చింది. పాస్ అయ్యా. ఆ రోజుల్లో మార్కులు రావాలంటే మరొక పదిహేను రోజులు పట్టేది. ఒక రోజు మార్కులొచ్చాయి. కుర్రాళ్ళందరం హెడ్ మాస్టారింటికెళితే ఆయన ఒక్కొక్కరి పుస్తకం తీసి ఎన్ని మార్కులొచ్చింది చెప్పేరు. నాది చివరికి పెట్టేరు. నాకు ఆతృత పెరిగిపోయింది. మొత్తానికి చివరగా నా బుక్ తీసి మొదటిగా ఇంగ్లీష్ 62 అన్నారు, అని నాకేసి చూసి “ఏరా ఎన్నొచ్చేయి” అన్నారు. నాకు నిజంగానే మతిపోయింది, “పేపరు మీరేదిద్దినట్లుంది మాస్టారూ” అన్నా. ఆయన నవ్వేశారు. మాస్టారి వెనక్కి వెళ్ళి పుస్తకం లో చూస్తే ఇంగ్లీష్ 62 లెక్కలు 84 వచ్చి ఉన్నాయి.లెక్కల మాస్టారు పక్కనే ఉన్నారు. ఆయన కూడా సాలోచనగా చూసి “ఏరా మార్కులు సరిపోయాయా అన్నారు” నేను స్కూల్ ఫస్ట్. దురదృష్టవశాత్తూ నాకంటే రెండు మార్కులు టోటల్ ఫస్ట్ వచ్చిన నా స్నేహితుడు కామెర్లతో చనిపోయాడు, రిసల్ట్ రాకుండానే, బాధ కలిగింది, అతను లేనందుకు. అలాగ ఆనాడు మాస్టార్లు ఎన్ని మార్కులొస్తాయని చెప్పేరో అన్ని మార్కులే వచ్చాయి. ఆరోజులలో విద్యార్ధుల మీద ఉపాధ్యాయులకు అంత అవగాహన ఉండేదేమో!

ఇటువంటి మరొక సంఘటనలో, ఒకసారి పోటీ పరీక్ష పోగొట్టుకున్నా.

అందరికి నేడు, ఇతరుల జీవితాల్లోకి తొంగిచూడటం అలవాటయినట్లుంది ముఖ పుస్తకం ద్వారా. ఉపకారమంటే ఊళ్ళోంచి లేచిపోతున్నారు, తొంగి చూడటం లేదు. 🙂

శర్మ కాలక్షేపంకబుర్లు-అత్తింటి కాపరం….

Posted on ఆగస్ట్ 20, 2012
10

Courtesy you tube

అత్తింటి కాపురం.…..

అనానగా ఒక పల్లె అందులో ఒక పేద దంపతులు, వారికి నల్గురు సంతానం. మొదటగా లక్ష్మీ దేవిలా ఆడపిల్ల పుట్టింది. సంతోషించారు దంపతులు, సంపదకిలోటుగాని సంతానానికి కాదు. అమ్మాయికి పెళ్ళి వయసొచ్చింది. సంబంధం చూశారు, కట్న కానుకలు మాట్లాడుకున్నారు. పాపం పేద తండ్రి ముద్దు ముచ్చట చ్చేద్దామనుకునాడు కాని కాలం కలిసి రాలేదు. అనుకున్న కట్న కానుకలన్నీ ఇవ్వలేకపోయాడు. అమ్మాయిని అత్తింటి వారు కాపరానికి తీసుకెళ్ళేరు. కలిగిన చీర సారె పెట్టి పంపేరు దంపతులు.

అమ్మాయి అత్తవారింటి కెళ్ళాలంటే ఒక నది దాటి వెళ్ళాలి. అమ్మాయి అత్తవారింటి కెళ్ళి చాలా కాలమయింది కనక, చూసి వద్దామని బయలు దేరేడు, తండ్రి. నది దాటి అమ్మాయి అత్తవారింటి కెళ్ళేడు. వియ్యాలవారు గౌరవం చేశారు, కట్న కానుకల గురించి కూడా ఏమీ అనలేదు. వారి గౌరవానికి మురిసిపోయాడు, తండ్రి. ఒక రోజుండి బయలు దేరుతూ, వియ్యాలవారి దగ్గర శలవు తీసుకుని వెళుతూ అమ్మాయిని అడిగేడు, అమ్మా! “అత్తింటి కాపురం ఎలా ఉంది?” అని, నెమ్మదిగా. దానికా పడుచు “నాన్నా! అత్తింటి కాపురం మోచేతికి దెబ్బ తగిలినంత సుఖంగా ఉంది“అంది. పిచ్చి తండ్రి దెబ్బ తగిలితే కొద్ది బాధ ఉండటం సహజం కదా, అలాగే అత్తిల్లన్న తరవాత ఆ మాత్రం బాధ ఉండటం సహజమని సరి పెట్టుకుని బయలుదేరేడు. నది ఒడ్డుకు వచ్చాడు, పడవలో ఒక కాలు పెట్టి మరొక కాలు తీస్తుండగా పడవ కదిలి, మోకాలికి దెబ్బ తగిలింది. నెప్పికి బాధ పడ్డాడు. ఓర్చుకుని పడవ ఎక్కేశాడు. పడవ బయలుదేరింది. కొద్ది దూరం వెళ్ళిన తరవాత సరంగు తెరచాప ఎత్తటం ప్రారంభించాడు. అప్పుడు తెర చాపకొయ్య మోచేతికి తగిలింది, పైకి దెబ్బ కనపడలేదు కాని, ప్రాణం జిల్లార్చుకుపోయింది. కాసేపటికి తెప్పరిల్లి, కూతురు అన్న మాటలు గుర్తుకు తెచ్చు కున్నాడు. అత్తింటి కాపురం మోచేతికి దెబ్బ తగిలినంత సుఖంగా ఉందంటే, కాపురం పోలీసు దెబ్బ లాగ పైకి కనపడకుండా ప్రాణం జిల్లార్చుకుపోయేలా ఉన్నదని అర్ధం చేసుకుని ఇంటికి వెళ్ళి అప్పో సప్పో చేసి అమ్మాయికిస్తానన్న కట్నకానుకలు తీసుకు వెళ్ళి వియ్యాల వారికిచ్చి,తిరిగి వచ్చేడట.మోచేతికి దెబ్బ తగిలితే ఎంత బాధగా ఉంటుందో అప్పుడు తెలిసిందా పిచ్చి తండ్రికి.

మరొకనానుడి .
సారెపెట్టకుండా పంపేను కూతురా నోరుపెట్టుకు బతకమందిట.

సామాన్య దంపతులు, పెళ్ళి చేసి కూతుర్ని అత్తవారింటికి పంపుతున్నారు. మొదటగా కాపరానికి పంపేటపుడు సారె చీరె పెట్టిపండం మన ఆచారం, లేకపోతే తరవాత కూడా పెట్టచ్చు. సారె అంటే మంచం, కంచం నుంచి వారి తాహతుకు తగిన, అమ్మాయి కాపురానికి అవసరమైన వస్తువులన్నీ పెడతారు. మొన్నీ మధ్య ఒకమ్మాయిని అత్తవారింటికి పంపుతూ, అమ్మాయి తల్లి తండ్రులు, డబల్ కాట్ మంచం, బెడ్ లు, వెండి కంచాలు,టి.వి, వి.సి.ఆర్,గేస్ స్టవు, కుక్కర్, ఇతర వంట సామాను, చెంచాలతో సహా, రెండు గాడ్రెజ్ బీరువాలు,ఒక కారు, ఇంకా ఏవేవో పెట్టేరట, నాకు చెప్పేరు గాని గుర్తులేదు. మొత్తం వీటికి గాను పది లక్షలు ఖర్చుపెట్టేరట. అందుకే అన్నారు, జుట్టున్నమ్మ కొప్పెట్టుకున్నా బాగానే ఉంటుంది, సిగ పెట్టుకున్నా బాగానే ఉంటుందని. కాని సామాన్యులు వారిని పోలిక తీసుకుని కష్టాలలో పడకూడదు కదా. కాని సాగుబడిలేక ఇక్కడ ఈ తల్లి తండ్రులు సారె పెట్టలేదు, అమ్మాయి అత్తవారింటికి వెళ్ళేటపుడు. అప్పుడు తల్లి చెబుతుంది తన తెలివయిన కూతురికి, సారె పెట్టకుండా పంపుతున్నా కూతురా నోరెట్టుకు బతుకు అంటే సారె పెట్టలేదని అత్తవారంటారు, వీలును బట్టి సమాధానం చెప్పి తప్పించుకు బతకమని, లేకపోతే ఎదురు తిరగమని, తల్లి సలహా. .ఇప్పుడు రోజుల్లో, కోడలు కాపరం చేస్తే అంతేచాలు అనుకుంటున్నారు, అత్త మామలు

శర్మ కాలక్షేపంకబుర్లు-తిలా పాపం తలా పిడికెడు

Posted on ఆగస్ట్ 24, 2012
5

తిలాపాపం తలాపిడికెడు.

ఒక గద్ద ఒక పామును తన్నుకుని పోతూంది, ఆహారంగా. చావుకి దగ్గరగా ఉన్న పాము తనలో విషాన్ని వదలిపెడుతుంది. ఆ విషం కిందనే పాలూ, పెరుగు అమ్మకానికి పట్టుకెడుతున్న గొల్లభామ తలమీది గంపలోని ఒక పెరుగు ముంతలో పడుతుంది. అదే సమయానికి, గాలి వీచి ముంతపై కప్పిన గుడ్డ తొలగిపోవడం మూలంగా. ఈ పెరుగు ముంతని ఒక బ్రాహ్మణునికి అమ్ముతుంది, గొల్ల భామ. ఆ పెరుగును ఆ బ్రాహ్మణుడు, తన తండ్రి ఆబ్దీకానికి భోక్తగా వచ్చిన మరొక బ్రాహ్మణుడికి భోజనం లో వడ్డించగా, ఆ బ్రాహ్మణుడు విషపూరితమైన పెరుగు తిని కాలం చేసేడు. పితృ శేషం తిన్న బ్రాహ్మణుడూ మరణించాడు. పాము ముందే మరణించింది, గొల్లభామ, గద్ద కూడా మరణించారు.

ఇప్పుడు యమధర్మరాజు దగ్గర విచారణ ప్రారంభమయింది,ఈ బ్రహ్మ హత్యాపాతకాన్ని ఆబ్దీకం పెట్టిన బ్రాహ్మణుని కాతాలో రాసేడు, చిత్రగుప్తుడు. బ్రాహ్మణుని పాపాల చిట్టా చదువుతున్నాడు, చిత్రగుప్తుడు. అప్పుడు బ్రాహ్మణుడు, ధర్మ ప్రభో! ఇది అన్యాయం,ఈ బ్రహ్మహత్యా పాతకం నాది కాదు, నేను పితృకార్యం కోసం పిలిచి ఆయనకు భోజనం పెట్టేను తప్పించి, ఆ పెరుగులో విషం ఉందని నాకు తెలియదు, అందుకు తప్పు నాది కాదు కనక పాపం నాది కాదన్నాడు.పెరుగులో విషం ఉందన్న సంగతి నాకు తెలియదు, గొల్ల భామను విచారించాలి ప్రభో, అన్నాడు. గొల్ల భామను పిలిచి ఈ పాపం నీ కాతా లో రాస్తాము, విషమున్న పెరుగు అమ్మేవు కనక, అదీ కాక సరిగా మూత వేయక అశ్రద్ధ చేసేవు కనక అంటే, బాబోయ్! నాది తప్పు కాదండి, నేను పాలు పెరుగు అమ్ముకుంటాను, నాకు ఆ ముంతలో విషం పడిందని తెలియదు, తెలిస్తే అది బ్రాహ్మణునికి అమ్మను కదా, నేను జాగ్రత్తగానే ముంత మీద గుడ్డ కప్పేను. గాలికి ఎగిరిపోతే తప్పునాది కాదు, అందుకు నాది తప్పు కాదు, కనక పాపం నాకు సంబంధం లేదంది. గుడ్డ తొలగిపోయేలా వీచిన గాలిదా తప్పని, గాలిని పిలిచారు. గాలి వచ్చి దేవా! వీచడం నా లక్షణం, నా ధర్మం, నేను స్థంభిస్తే ప్రాణికోటి జీవించదు ప్రభూ, అని మొరపెట్టుకున్నాడు. సరే అయితే విషం వదిలిపెట్టిన పాముదా పాపం? అని పిలిచారు, పాముని. పాము, ధర్మ ప్రభూ! నా ప్రాణం పోతున్న సమయం, గద్ద కాళ్ళలో ఉన్నాను, ఏమి జరుగుతున్నది నాకేతెలియని స్థితి, ఎక్కడ విషం వదలిపెడుతున్నదీ కూడా చూడగల సమయం కాదు కనక, తప్పు నాది కాదు, ఈ బ్రహ్మ హత్యా పాతకం నాది కాదని మొర పెట్టుకుంది. అప్పుడు, ఇక మిగిలింది గద్ద కనక,గద్దను పిలిచారు, ఈ పాపం నీదేనా? అన్నారు. మహాప్రభో! పాము నా అహారం, గగన విహారం నా లక్షణం, పాము విషం వదులుతోందో లేదో నేను చూడలేదు, అందు చేత పాపం నాది కాదు అంది. మరి ఇంతకీ ఈ బ్రహ్మ హత్యా పాతకం ఎవరి కాతాలో రాయాలో యమధర్మ రాజుకు కూడా బోధ పడలేదు, సమవర్తి అయివుండి కూడా.

అప్పుడు సమవర్తి, చిత్రగుప్తుడిని, ఈ విషయం మీద గూఢచారులు ఇచ్చిన సమాచారం చెప్పమన్నారు. చిత్రగుప్తుడు ఆ నివేదిక చూసి, ప్రభూ! భూలోకంలో ప్రజలు ఈ విషయంమీద భిన్నాభిప్రాయాలు వెలిబుచ్చారు. ఒకరు, గద్దది తప్పన్నారు, మరొకరు పాముది తప్పన్నారు, కొందరు గాలిది తప్పన్నారు, మరికొందరు గొల్ల భామ తప్పన్నారు, బుద్ధిమంతులు భోజనం పెట్టిన బ్రాహ్మణునిది తప్పన్నారు. అందరూ సమానంగా స్పందించారు ప్రభూ! అని నివేదికలో సంగతి చెప్పేడు. మరికొంత అయోమయంలో పడ్డాడు యమధర్మరాజు. ఈ పాపాన్ని ఎవరో ఒకరి కాతాలో రాయాలి కనక, తప్పు ఎవరిదో ఇదమిద్ధంగా తేలలేదు కనక ఈ విషయం గురించి పూర్తిగా తెలిసీ, తెలియక తీర్పులిచ్చినట్లుగా వ్యాఖ్యలు చేసిన వారందరికీ సమానంగా పంచిపెట్టమన్నాడు. అలా ఆ బ్రహ్మహత్యా పాతకం అందరికీ సమానంగా పంచబడింది. దీనినే తిలా పాపం తలా పిడికెడు అని అంటారు. అందుకే ఏ సంగతయినా పూర్తిగా తెలియనిదే తీర్పులిచ్చినట్లు మాట్లాడకూడదు. అయితే ఈ సామెతను మరొక రకంగా కూడా వాడుతున్నారు. పాపం సొమ్మును పంచుకోడానికి వాడుతున్నారు, ఏదయినా పాపం పంచుకోవడమే.

కధ చదివిన తరవాత మీకేమయినా గుర్తొస్తోందా,!!!

శర్మ కాలక్షేపంకబుర్లు-మనం మరచిన కూరలు.

Posted on ఆగస్ట్ 21, 2012
15

Courtesy you tube

మనం మరచిన కూరలు.

మనం మరచిన కూరలా? కాదు, నిజంగా ఇప్పుడు మనకు దొరకని కూరలు.మనం అడవులను నిర్లక్ష్యం చేయడం మూలంగా, నరికేస్తున్నందు మూలంగా అంతరించిపోతున్న కూరలు. నిజం చెప్పాలంటే పల్లెలలో కూడా ఇవి దొరకటం లేదంటే పరిస్థితి ఎలా ఉన్నది తెలుస్తుంది. ఈ నెల 7 వ తారీకు టపాలో సునీత గారు వ్యాఖ్య రాస్తూ, వాక్కాయలు,షీకాయి ఆకు, నల్లేరు ఎలా ఉంటాయో చిత్రాలు పెట్టమన్నారు. అంటే వారికి పేర్లూ తెలియవు, అదేగాక వాటిని చూడను కూడా లేదని తెలుస్తూ ఉంది కదా. ఇటువంటి వారు ఎంత మంది ఉన్నారో చెప్పడం కష్టం కనక ఈ టపా లో వాటిని పెడుతున్నా. నాకూ గలిజేరు దొరక లేదు. దాని లింక్ ఇస్తున్నా చూడండి.https://kastephale.files.wordpress.com/2012/08/photo220007.jpg గలిజేరుని సంస్కృతం లో భృంగామలక, పునర్నవ అంటారు. ఇందులోని నల్లేరు సంపాదించడానికి నాకు పదిరోజులు, పది మందితో చెబితే, దొరికిందంటే పరిస్థితి ఊహించవచ్చును. పల్లెటూరి వారు తెలిసి ఉపేక్ష చేస్తున్నారు. పట్నవాసం వారు తెలియక మానేస్తున్నారు. పల్లెనుంచి తెస్తే కదా తెలిసేది, పట్నంలో. షీకాయాకు కొద్దిగా పుల్లగా ఉంటుంది,చిన్న చిన్న ముళ్ళు కూడా ఉంటాయి, కొద్దిగా వేడి చేస్తుంది.

లింకిస్తున్నా చూడండి మనం మరిచిన కూరలెన్నో, దగ్గరగా ఏభయి ఉన్నాయి. బొమ్మలు వాటి పేర్లు, వాటి శాస్త్రీయ నామాలిచ్చారు.

Click to access kondreddy_receipes.pdf

కొండ మామిడి, అడవి మామిడి అసలు తెలియవు. వెదురు చిగుళ్ళు కూర వండుకుంటారు. వెదురు బియ్యం మంచి శక్తి నిస్తాయి,అన్నంలా వండుకోవచ్చు, వ్యాము దుంప గర్భ నిరోధాని మందుట, మాకూ తెలియదు. అడవి పెండలం విని ఉండరు, మగసిరిగడ్డ పేరే చెబుతోంది చూడండి. గొడ్డు కూర నేనూ వినలేదు, చామ కూర వాడుతాము, పులుసు పెట్టుకుంటే బాగుంటుంది. గురుగు కూర నేత్రాలికి మంచిదిట. సప్పి కూర పుల్లగా ఉండి దీర్ఘరోగాలికి మంచిదిట. చికిలింత కూర నేను ఎరుగుదును, నేత్రాలు, ఊపిరి తిత్తులకు మంచిదిట. పొన్నగంటి కూర బలుసు కూర ఇవి దొరికే సావకాశాలున్నాయి. పొన్నగంటి కూర మూత్ర రోగాలకి, బలుసు కూర ఇనుముకి ప్రసిద్ధి. గాజు కూర డయాబెటిస్ కి మందు. తిప్ప తీగ, దీనిని సంస్కృతంలో అమృత అంటారు, డయాబెటిస్ కి మరి చాలా వ్యాధులకి మందు, ఆకు హృదయాకారంలో ఉంటుంది. ముళ్ళ వంగ, అడవి కాకర రెండూ మందులలా కూడా ఉపయోగిస్తారు. కారు నిమ్మ చూశారా ఎలా వుందో. ఎర్ర చిత్రమూలం చికెన్ తో తింటే బాగుంటుందిట. ఉత్తరేణి, ఇది చాలా గొప్ప మందు, ఇది ఉన్న చోటికిపోతే ముళ్ళలా ఉన్నవి పట్టుకుంటాయి, వీటిని ఉత్తరేణి బియ్యం అంటారు,ఎండిన వాటిని బాగుచేసుకుని, పరమాన్నం వండుకు తింటే, బాగుంటుంది. తెలగ పిండి కూర దొరుకుతుంది, ఇది తింటే మూత్రపిండాల రాళ్ళు కరుగుతాయి. మన దగ్గర దొరికేది, నిర్లక్ష్యం చేసేవి, అరటి పువ్వు, అరటి దూట. దూట రసం తాగితే మూత్రపిండాల రాళ్ళు కరుగుతాయి. లైన్ తోటకూర మంచి ఆకు కూర తెలుసా?. గోగుపువ్వు డిప్పలు పచ్చడి బాగుంటుంది. మెక్సికో లో పండుతుందిట, రకరకాల రంగులలో మొక్క జొన్న వింత కదా, ఈ వేళ చూశా పేపర్లో. చూడండి మీకు దొరికేవాటిని ప్రయత్నం చేయండి, లేదా మొక్కలు దొరికితే పెరట్లో వేసుకోవచ్చు, వీలున్నవారు..