శర్మ కాలక్షేపంకబుర్లు-కాగల కార్యం గంధర్వులే చేశారు.

Posted on ఆగస్ట్ 26, 2012
8

Courtesy youtube

కాగల కార్యం గంధర్వులే చేశారు.…..

జరిగినది టూకీగా:- అరణ్యవాసానికి వెళ్ళిన పాండవులను గేలిచేయాలని దుర్యోధన, శకుని, కర్ణులు బయలుదేరి, ద్వైతవనం దగ్గరికి వేట మిషమీద వెళ్ళి చిత్రసేనుడనే గంధర్వరాజుతో తగువు తెచ్చుకున్నారు. ఆతరవాత…..

యుద్ధరంగం నుంచి వెళ్ళిన వారు తమ రాజు చిత్రసేనుడికి చెప్పుకోగా, గంధర్వరాజు వేల సంఖ్యలో సైనికులను పంపి కౌరవులను ఎదుర్కున్నాడు. అందరినీ చికాకు పరచేరు, ఒక్క కర్ణుడు మాత్రం నిలబడ్డాడు. ఎక్కడ చూచినా గంధర్వులే కనపడుతున్నారు. శకుని, సోదరులతో దుర్యోధనుడు గంధర్వులను ఎదుర్కోడంతో, వారు వెనకడుగేయాల్సి వచ్చి, చిత్రసేనుడికి చెప్పేరు. రాజు స్వయంగా వచ్చి కౌరవులను ఎదుర్కోగా, గంధర్వులు కొంతమంది కర్ణుడి రధ చక్రాలు, కొంతమంది గుఱ్ఱాలను పట్టుకున్నారు, కొంతమంది రధం ఇరుసు విరిచేశారు, దండి విరిచేశారు. అలా అందరూ కర్ణుడి రధం చుట్టుముట్టి కర్ణుడిని విరధుడిని చేయగా, వికర్ణుని రధమెక్కి యుద్ధ రంగానికి దూరంగా వెళ్ళిపోయాడు. చిత్ర సేనుడు యుద్ధం చేసి దుర్యోధనుడునికూడా కర్ణునిలా విరధుణ్ణి చేసి, పడకొట్టి, జుట్టుపట్టి ఈడ్చి, పెడ రెక్కలు కట్టేసి సింహనాదం చేశాడు. మిగిలిన గంధర్వులు దుర్యోధనుని తమ్ములను, మంత్రులను, స్త్రీ జనాలను,పట్టి బంధిస్తూ ఉండగా, చీకాకు పడిన కౌరవ సైన్యం ధర్మరాజు ఉన్న వైపుకు పారిపోయింది. మిగిలిన కౌరవులు ధర్మరాజు దగ్గరికి పోయి “సుయోధనుడిని బంధించి తీసుకుపోతున్నారు గంధర్వులు, కావవా!రక్షించవా!!” అని వేడుకున్నారు. ఇలా మొరపెట్టుకుంటున్న వారిని చూసి భీమసేనుడు నవ్వుతూ ఇలా అన్నాడు.

“మనకు జులుకనయ్యె మన చేయు పనియ గంధర్వవరులు గూడి తగ నొనర్చి
రింత లెస్స యగునె యేభారమును లేక యూరకుండ మనలనొందదే జయము.

మన పని తేలికయిపోయింది, మనం చేయాల్సిన పని గంధర్వులు బాగా చేసేరు, మనం ఊరుకుంటే జయం మనదేకదా” అని. అలా భీముడన్న మాట ’కాగలపని గంధర్వులే నిర్వహించారు’ అన్నది వాడుకలోకి వచ్చింది. మనకి ఇక్కడ దాకానే చాలు కాని మిగిలినది కూడా చెప్పేసుకుందాం, మంచి రసవత్తరంగా ఉంటుంది కనక.

ధర్మరాజుతో మొరపెట్టుకుంటున్న కౌరవులను చూసి, ధర్మరాజుతో భీముడు ఇలా అన్నాడు. “మా బలేగా అయ్యింది, వీరి పట్ల దయ చూపద్దు” అన్నాడు. దానికి ధర్మరాజు “జ్ఞాతులలో అనేక విభేదాలుండచ్చు, పైవాళ్ళు మనవాళ్ళని బాధపెడుతూంటే, అర్ధించినపుడు కూడా చూసి ఊరుకోవడం మనకీ మంచిదికాదు, మనం చేయగల సాయం తప్పని సరిగా చేయాలి. నీవూ తమ్ములు పోయి మనవాళ్ళని విడిపించుకురండయ్యా” అన్నాడు. “మరో సంగతి, ఇది మనకి చాలా మంచి అవకాశం, నేను యజ్ఞదీక్షలో ఉన్నా, లేకుంటే నేనే వెళ్ళేవాడిని” అని కూడా అన్నాడు. అప్పుడు భీముడు తమ్ములతో బయలుదేరి వెళ్ళి గంధర్వులను ఎదుర్కున్నాడు. పెద్ద యుద్ధం జరిగింది, దుర్యోధనుడిని తీసుకుని ఆకాశ మార్గాన పోవాలని ప్రయత్నించిన గంధర్వులను అడ్డుకున్నాడు, అర్జునుడు. యుద్ధం జరుగుతుండగా గంధర్వరాజు రధం మీద కనపడ్డాడు, పాండవులు అతనిని అర్జునుని మిత్రునిగా గుర్తించారు. రధాల మీద నుంచే కుశల ప్రశ్నలు వేసుకున్నారు, ఇరు పక్షాలవారు. అప్పుడు చిత్రసేనుడుతో అర్జునుడు, “దుర్యోధనుడిని వదిలిపెట్ట”మన్నాడు. దానికి చిత్ర సేనుడు, “వీడు మిమ్మల్ని హింసించాడు, అన్ని విధాలా,భార్య, పిల్లలతో వచ్చి అపహాస్యం చేయదలిచాడు, వీణ్ణి ఇప్పుడు ఇంద్రుని దగ్గరకు తీసుకుపోతున్నా,” అన్నాడు. “నీవు నా మిత్రుడవు కనక నీకూ నాకూ తగువులేదు” అన్నాడు. అప్పుడు అర్జునుడు “సుయోధనుడు మా సహోదరుడు, అతనిని వదలిపెట్టు, ధర్మరాజుకి ఇది ఇష్టమైన పని” అని చెబుతాడు. “నువ్వు వచ్చి ధర్మరాజుకి కనపడి, ధర్మరాజు ఏమి చెబితే అది చెయ్య”మన్నాడు. అందుకు చిత్రసేనుడు ఇష్టపడి, ధర్మరాజు వద్దకు వచ్చి, ధర్మజునిచే పూజింపబడి అతను చెప్పినట్లు దుర్యోధనాదులను వదలి వెళ్ళేడు. అప్పుడు ధర్మరాజు దుర్యోధనుడితో ఇలా అన్నాడు.

“ఎన్నడునిట్టి సాహసములింకనొనర్పకుమయ్య దుర్జనుం
దన్నున సాహస క్రియలయందు గడంగి నశించు గావునం
గ్రన్నన తమ్ములన్ దొరలగైకొని ఇమ్ములబొమ్ము వీటికిన్
సన్నుత దీని కొండొక విషాదము బొందకుమీ మనంబునన్.

ఇలాంటి సాహసాలు ఇక ముందు చెయ్యకు, మంచిదికాదు, తమ్ముళ్ళని తీసుకుని తిన్నగా ఇంటికెళ్ళిపో, ఇక్కడ జరిగినదాని గురించి ఆలోచించి విషాదం పొందకు” అని చెప్పి దుర్యోధనుడిని పంపేసేడు.

ఒక్కసారి అవలోకిద్దాం. వనవాసంలో ఉన్న వారు కష్టాలు పడుతున్నారంటే చూసి సంతోషించి, గేలిచేసి వద్దామని బయలుదేరేరు, దుష్ట చతుష్టయం, వేట వంకతో. వచ్చిన వారు అది సవ్యంగా చేయగలిగారా? గంధర్వరాజుతో యుద్ధం కోరితెచ్చుకుని తన్నులు తిన్నారు, పెడ రెక్కలు విరిచి కట్టేసి జుట్టు పట్టుకుని ఈడ్చుకుపోయాడు గంధర్వుడు, ఎనిమిది వేల రధాలు, ముఫైవేల గజాలు, లక్ష కాల్బలం, కర్ణుడు, శకుని, తమ్ములు ఇంతమంది ఉండి కూడా దుర్యోధనుడు గంధర్వుల చేతిలో ఓడిపోయాడు, పరాభవం పొందేడు. అసలే ఓటమి కష్టం అనే పుండు మీద కారం చల్లినట్లుగా, గంధర్వులను ఓడించిన అర్జునుడు మాట మీద, ధర్మరాజు మాట మీద వదలిపెట్టిపోయాడు,చిత్రసేనుడు, దుర్యోధనుడిని,. ధర్మరాజు ఏమన్నాడు, “ఒరేయ్! ఇకముందెప్పుడూ ఇటువంటి సాహసలు చెయ్యకు తిన్నగా ఇంటికిపో” అని చెప్పి పంపేసేడు. దుర్యోధనుడు దురాలోచన చేసి పాండవులను గేలి చేద్దామనుకుంటే, ధర్మరాజు దూరాలోచన చేసి శత్రువుని కాళ్ళ దగ్గరికి రప్పించుకుని, రక్షించి, జాగ్రత్తగా బతుకు అని చెప్పి వదిలేశాడు. ఇంతకు మించి గంధర్వుల చేతిలో ఓడిపోయినదే బాగుందేమో దుర్యోధనుడికి. ఇప్పుడు వేమన తాత పద్యం గుర్తురాలా

చంపదగినయట్టి శత్రువు తనచేత
జిక్కెనేని కీడు సేయరాదు
పొసగమేలు చేసి పొమ్మనుటే చాలు
విశ్వదాభిరామ వినుర వేమ.

దీనితో భీముడు చెప్పిన సామెత కాగలకార్యం గంధర్వులే చేశారనేదే కాకుండా చెరపకురా చెడేవు అన్నది కూడా ఉన్నట్లుంది కదూ…

దుర్యోధనుడిని రక్షించడం అనే ఒక పని ద్వారా ధర్మరాజు సాధించిన సత్ఫలితాలు చూద్దాం.
1. దుర్యోధనుడు శత్రువులా వ్యవహరించినా, తాను భ్రాతృ ధర్మాన్ని విస్మరించలేదని పెద తండ్రి, పెదతల్లికి తెలియచేశాడు. పాండవులపట్ల, పెదతండ్రి పుత్ర ధర్మాన్ని విస్మరించినది ఎత్తి చూపాడు.ఇదే సంగతి ప్రజలు అనుకునేలా చేసేడు.
2. దుర్యోధనుడు ధర్మం తప్పినా, తాను తప్పలేదని లోకానికి చాటి చెప్పేడు, లోకపు మన్నన పొందేడు.
3. దుర్యోధనుడు గేలి చేద్దామని వచ్చినవాడు, బంధింపబడి, జుట్టు పట్టి ఈడ్వబడి, పెడరెక్కలు కట్టేయగా గేలి చేయబడి, శత్రువు (ధర్మరాజు) దయా దాక్షిణ్యాల వల్ల విడుదల చేయబడ్డాడు. అందుకు సిగ్గు పడక తప్పని పరిస్థితి కల్పింప చేశాడు, ధర్మరాజు.
4. పెద్దదయిన సేన, రక్షణ, విజయం కలిగించదని ఒక హెచ్చరిక కూడా దుర్యోధనునికి ఇచ్చినట్లయింది.
5. ఇటువంటి సాహసాలు చెయ్యకు ఇంటికి తిన్నగా వెళ్ళు అని చెప్పి, దీన్ని మనసులో పెట్టుకోకు అని చెప్పడంలో అసలు రాజనీతి ఉంది. దుర్యోధనుడులాటి అహంభావికి ఇది మరణం కంటే కష్టమైన సమయం. అది కల్పించడం ధర్మరాజు చతురత, రాజనీతి.
6. యుద్ధం చేసి కూడా చిత్రసేనుని మిత్రత్వం పోగొట్టుకోకుండా, మిత్రుడు తన మాట వినేలా చేయడంలో సఫలమయ్యాడు.
భారతం విమర్శ చేసుకుని చదువుకుంటే ఇలాటి సంఘటనలు, సందర్భాలు చాలా కనపడతాయి.