శర్మ కాలక్షేపంకబుర్లు-ఉత్తరాలు

Posted on అక్టోబర్ 13, 2012
8
ఉత్తరాలు

మొదటి పుట్టిన రోజయిపోయిన తరవాత పదిహేను రోజులకి కాని బ్లాగు కేసి రాలేదు, మెయిళ్ళూ చూడలేదు. చాలా ఉన్నాయి. చూడగా అందులో ఒక తెంగ్లీష్ లో ఉన్న ఒక ఉత్తరం కనపడింది, అది ఇలా ఉంది, ఎవరబ్బా అని చూడబోతే

“డియర్ తాతగారు,

నేను ఎప్పుడు మీ బ్లోగ్ లో అన్ని పోస్ట్స్ చదివి ఆనందించటం తప్ప ఎప్పుడు కామెంట్ చేయలేదు..

నాకు తాతగారు లేని లోటు తీర్చారు మీరు..మా తాతయ్య ఉంటె ఇలాంటివే బోలెడు కబుర్లు చెప్పేవారు ఏమో..

తెల్లని పంచె కట్టుకుని… వాలు కుర్చీ లో కూర్చుని మీరు కబుర్లు చెప్తూంటే, నేను పక్కనే ఉన్న ఎత్తు గడప మీద కూర్చుని ఊ కొడుతున్నట్టు ఉంటుంది మీ పోస్ట్ చదివినప్పుడల్లా

కీప్ రైయిటింగ్ తాతగారు 🙂

హేపీ బర్త్ డే టు యువర్ బ్లోగ్ 🙂
బెస్ట్ విషెస్
సారీ తెలుగు లో రాయకుండా… మీకుచదవటానికి కష్టం కలిగించాను..”

తెంగ్లీష్ లో ఉన్న ఉత్తరాన్ని చదవటానికి వీలుగా మార్పు చేశాను. ప్రపంచంలో ఏదో మూలనుంచి నాకు ఉత్తరం రాసిన మనవరాలికి ఆశీర్వచనాలు చెబుతూ, పేరు కావాలని నేనే తీసేశాను, మనవరాలు ఏమీ అనుకోదనే ధైర్యంతో. ఈ ఉత్తరం ఏ సమయంలో వచ్చిందంటే, అంతకు ముందు మెయిళ్ళొక సారి చూసి, బ్లాగ్ లోకెళ్ళి పాస్ వర్డ్ మార్చేసి మళ్ళీ బ్లాగ్ తెరుచుకోకుండా చేద్దామని ఉద్దేశంతో బయలుదేరేను, అప్పుడు కనపడిందీ ఉత్తరం, “అమ్మయ్య! పది రోజులు దాటిందికదా మనల్ని మరిచిపోయారులే” అనుకున్న సమయమనమాట. ఉత్తరానికి జావాబివ్వాలి కదా! దురద ఊరుకోలేదు.

చిరంజీవి సౌభాగ్యవతి మనవరాలు…….ని దీర్ఘసుమంగళిగా అశీర్వదిస్తూ తాత రాసేది.
ఉభయకుశలోపరి.

నీ ఉత్తరం చూశాను. ఆనందాశ్చర్యాలలో ములిగి తేలేను, ఎందుకంటే ఇంకా నన్నెవరో గుర్తుపెట్టుకున్నందుకు, ఉన్న అభిమానాన్ని వ్యక్తం చేయాలి బుల్లి తల్లీ!. నీవు భూ గోళం మీద ఏ మూల ఉన్నా క్షేమ, స్థైర్య, విజయ, అభయ, ఆయు, ఆరోగ్య, ఐశ్వర్యాలతో పిల్లా పాపలతో వర్ధిల్లుతూ తెనుగు మరిచిపోకుండా, పిల్లా పాపలకి కూడా తెనుగు చెబుతూ, చదివిస్తూ ఉండాలని కోరుకుంటూ, అశీర్వచనాలు. తెల్లని పంచ కట్టుకుని వాలు కుర్చీలో కూచుని మీరు కబుర్లు చెప్తూంటే, నేను పక్కనే ఎత్తు గడప మీద కూర్చుని,కదా అన్నావు. చిట్టి తల్లీ! ఇలా అనుకుంటే ఎలా ఉంటుందో ఒక సారి ఊహించు. ” తెల్లని పంచ కట్టుకుని వాలు కుర్చీలో కూచుని మీరు కబుర్లు చెబుతూ ఉంటే, నేను పక్కనే ఉన్న ఎత్తు గడప దగ్గరున్న ముక్కాలిపీట మీద అప్పుడే కోసి తెచ్చుకున్న బొండు మల్లెలు వడిలో వేసుకుని కూచుని, దండ కట్టుకుంటూ, మీ కబుర్లు వింటూ, ఊ కొడుతూ, కళ్ళు వీధికేసి చూస్తూ ఉంటే మీరు “పిచ్చితల్లీ! ఎందుకే ఆ ఎదురు చూపు వాకిలిదాకా వచ్చిన నీ మగడు లోనికి రాడుటే?” అంటే, “తాతా! నువ్వెప్పుడూ ఇంతే! నేనేం ఆయన కోసం ఎదురు చూడటం లేదు తెలుసా, నన్నూరికే ఉడికిస్తావు.” అంటూ ఉండగా, మీ ఆయనొస్తే, సంభ్రమంగా నువ్వు ఒక్క ఉదుటున లేస్తే, నీ వడిలోని మల్లెలు అతనికి స్వాగతం చెబుతున్నట్లు ఎగిరి నెత్తిన పడితే,”రా బాబూ అంతా బాగున్నారా” అని నేను పలకరిస్తూ ఉంటే, నువ్వు లోపలికి తుర్రుమని పారిపోయి మంచినీళ్ళ గ్లాసుతో వస్తూ ఉంటే, “ఏంటే! ఆ కంగారూ? నెమ్మది” అని మీ అమ్మమ్మ అంటూ నీ వెనక వస్తే, నీ భర్తని చూసిన మీ అమ్మమ్మ “అంతా బాగున్నారా నాయనా” అని అడుగుతూ ఉంటే, “అంతా కులాసా అండి” అని నువ్వు ఖాళీ చేసిన ముక్కలి పీట మీద కూచుని, నువ్విచ్చిన మంచి నీళ్ళు తాగి నీకు కళ్ళ ద్వారా సంకేతం పంపుతూ ఉంటే, “లోపలికి తీసుకెళ్ళమ్మా” అని మేమిద్దరం అంటే మీరిద్దరూ లోపలికెళితే…” ఓహ్! ఆనందం, బ్రహ్మానందం, అనుభవించాలి.

మరొక మాట గడప మీద కూచోకూడదురా బంగారుతల్లీ! గడప లక్ష్మీదేవికదా, పసుపురాసి బొట్టుపెడతాం కదా, గడపకి కాలు కూడా తగలనివ్వం కదూ,మరిచిపోయావా, అదనమాట. జవాబు రాస్తావు కదూ! అందరినీ అడిగేనని చెప్పు.
తాత.”

బ్రహ్మశ్రీ వేదమూర్తులయిన తాత/నాన్న/పెదనాన్న/బాబయ్య/మామయ్య గారికి మనవడు/కుమారుడు.. నమస్కరిస్తూ వ్రాసేది. ఉభయకుశలోపరి….. ఆడవారికయితే మహలక్ష్మి సమానురాలయిన మామ్మ/అమ్మమ్మ/అమ్మ/అత్త/వదిన గారికి మనవరాలు/మనవడు/ …నమస్కరించి వ్రాసేది. పెద్ద వాళ్ళు పిల్లలికి రాసేటపుడు చిరంజీవి….ని చిరాయురస్తుగా అశీర్వదిస్తూతాత/మామ్మ/అమ్మమ్మ//……వ్రాసేది. పూర్వసువాసినులకయితే గంగాభగీరధీ సమానురాలయిన….గారికి నమస్కరిస్తూ……వ్రాసేది.ఆడవారికయితే చిరంజీవి సౌభాగ్యవతి…ని దీర్ఘసుమంగళిగా అశీర్వదిస్తూ….వ్రాసేది… ఇలా ఉండేవి పాతకాలం ఉత్తరాలు. “ఇప్పుడు ఉత్తరమే లేదూ అంటూ” ఉంటే నా ఇల్లాలు, “ఉత్తరాలెక్కడుంటాయ్! మీరు చేసిన నిరవాకానికి” అంది. “అదేంటోయ్! ఉరుము ఉరిమి మంగలం మీద పడిందని నా మీద పడ్డావ”న్నా. “అవును, మీరు పని కట్టుకుని ఫోన్ లో అని అంగడిలో పెట్టి ఇచ్చేసేరు, అప్పుడు సగం మంది ఉత్తరం రాయడం మరిచేరు. మీతరవాత వాళ్ళు సెల్ ఫోన్ లో అని జంగిడిలో పెట్టి సిమ్ము కార్డులమ్ముతున్నారు. ఇంక ఉత్తరం రాసేవాళ్ళెవరూ? ఉత్తరం రాయడం మరిచిపోయారు. ఎవరి దగ్గర చూసినా సెల్లు, అదేమో చెవిదగ్గరే. లేకపోతే అవ్వేవో ప్లగ్గులు. ఎవరి మాట వింటున్నారూ. తప్పు మీదే అంది”..నిజమేనేమో…..అపరాధిని నేనేనా?

పాత రొజుల్లో భార్యాభర్తలు ఉత్తరాలు రాసుకునేవారు, వాట్ని తరవాత రోజులలో చదువుకుని ఆనందించేవారు కూడా, ఇప్పుడు ఉత్తరం రాసే ఓపికేదీ? మెయిల్లో ఎస్.ఎమ్.ఎస్ భాషలో ఉత్తరాలు నడుస్తున్నట్లుంది, వారి మధ్య.

ప్రకటనలు

రచయిత: kastephale

A retired telecom engineer.

7 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-ఉత్తరాలు”

 1. ఆ కాలంలో మనకు తెలిసున్న ఉత్తరాల పద్ధతి ఇప్పుడెక్కడుంది శర్మ గారూ! టెలెగ్రాములకి స్వస్తి పాడేసారు. మెల్లిగా కార్డులు, ఇన్లాండ్ కవర్లు, కవర్ల అమ్మకం కూడా ఆపేస్తారని నాకైతే అనుమానంగానే ఉంది. ఉత్తరం వ్రాయాలనుకుంటే బయట దుకాణంలో కవరు కొనుక్కుని, పోస్టాఫీసులో స్టాంపులు కొనుక్కుని, కవరు మీద అతికించి పోస్టుడబ్బాలో వెయ్యాల్సి వస్తుందేమో? 🙁

  మెచ్చుకోండి

  1. విన్నకోట నరసింహారావుగారు,

   ఇప్పటికే కొరియర్లు పని చేస్తున్నాయి కదండి, ఇక ముందు కార్డ్లు కవర్లు, స్టాంపులు వగైరాలు అమ్మకం, బట్వాడా ఉండకపోవచ్చు. పోస్టాఫీస్ అంటే పేమెంట్ బేంక్ లా పని చేసే కాలం దూరంలో లేదు. ( Receipts and payments of Govt. i.e all taxers etc.) Majority of work being carried out by the SBI will be diverted, it appears, we may see it soon 🙂

   దయుంచండి.

   మెచ్చుకోండి

 2. ఉత్తరముల కాలపు జను
  డత్తరి బిత్తరు జిలేబి డంగగు చుండెన్
  త్విత్తరు వాత్సా పుల సరి
  కొత్తగ ఫాస్ట్రా మెసేజి కొంకిరములగున్ !

  జిలేబి

  మెచ్చుకోండి

 3. ఎస్.ఎమ్.ఎస్ భాష కూడా చివరికొచ్చేసినట్టే గురువుగారు🙏. సమాచార ప్రసారం అంతా మెసొపొటేమియా భాష, అంటే Hieroglyphics / ఆకృతిలిపిలోనే.

  మెచ్చుకోండి

  1. YVR’s అం’తరంగం’గారు,

   నేను అందామనుకున్న మాట విన్నకోటవారనేశారు. చిత్ర లిపిలో ఉండే భాషలున్నాయిగా, (జపాన్)
   తెనుగు భాష లిపి పూర్ణానుస్వారం నుంచి పుట్టింది.
   చెవిటి మూగవారికి, అంధులకు భాషలున్నాయిగా, ‘అలాగే కనులుండి చూడలేను,మనసుండి పాడలేను’ అన్నవారికి కొత్త భాషలు పుట్టుకొస్తాయి. దేనికైనా అవసరం మాతృక కదా 🙂

   దయుంచండి.

   మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s