శర్మ కాలక్షేపంకబుర్లు-పోలిక.

Posted on అక్టోబర్ 14, 2012
8
పోలిక.

పోలిక చెప్పడం అన్నది పుట్టిన రోజునే ప్రారంభమవుతుందనుకుంటా. పుట్టిన బిడ్డ ఎర్రగా ఉందా, నల్లగా ఉందా దగ్గరనుంచి, కనుముక్కు తీరుని పోల్చేస్తారు, తల్లి, తండ్రి, అత్త, మామ, మామ్మ, తాత, అమ్మమ్మ, తాత వగైరాలతో. అదీగాక మనకో సామెత కూడా ఉంది “మేనమామ పోలిక మేనత్త చారిక” అని, ఒకరు తల్లి వైపువారు, మరొకరు తండ్రి వైపువారు. ఇంతే కాక దాని సమర్ధిస్తూ అమ్మాయికి మేనత్త పోలిక, అబ్బాయికి మేనమామ పోలిక, అమ్మాయికి తండ్రి పోలిక, అబ్బాయికి తల్లి పోలిక మంచిదంటారు. ఇదీగాక బుద్ధులలో, అలవాట్లలో పోలికలు చెబుతారు. మనకి ఈ సందర్భంగా రామాయణం లో ఒక సంగతి గుర్తొచ్చింది, చూడండి. కైక కోరిక ప్రకారం, దశరధుని ఆజ్ఞపై రాముడు అడవులకు వెళుతున్న సందర్భంలో దశరధుని రధసారధి సుమంత్రుడు కైకను నీకు తల్లిపోలిక వచ్చిందంటాడు. నీ తల్లి కూడా నీలాగే మీనాన్నని ఆపదలపాలు చేయబోయిందని దెప్పుతాడు.అదేమో చూద్దాం.

అభిజాతం హితే మన్యే యధా మాతు స్తధైవచ
న హి నింబాత్ స్రవేత్ క్షౌద్రం లోకే నిగదితం వచః….రామా.. అయోధ్య…సర్గ.35..శ్లో..17

వేపచెట్టునుంచి తేనె కారదు అట్లే నీ తల్లి స్వభావమే నీకునూ వచ్చింది అన్నాడు. మీ తల్లి మూర్ఖపు పట్టుదలగూర్చి మేము ఇదివరకే ఎరుగుదుము. ఒక యోగి మీతండ్రికి పశుపక్ష్యాది జంతువుల అరపులు, వాటి భావం తెలియగల వరం ప్రసాదించాడు. ఒకనాడు మీ తండ్రి తన పాన్పు దగ్గరలో ఒక జంట పక్షులు మాట్లాడుకునే సంభాషణ విని రెండు, మూడు సార్లు నవ్వేడు. తనను చూసి గేలి చేసి నవ్వుతున్నాడనుకుని మీ తల్లి బహు కోపించి, నవ్విన కారణం చెప్పమని కూచుంది. పక్షుల మాటలు విన్నాను, అది చెబితే నాకు మరణం సంభవిస్తుంది అని చెబుతాడు. అందుకు మీతల్లి నువ్వు బతికినా చచ్చినా సరే, నవ్విన కారణం చెప్పితీరాలని బలవంతం చేసింది, చెప్పకపోతే చస్తానని బెదిరించింది. అప్పుడు మీ తండ్రి, ఆ విద్య చెప్పిన యోగి వద్దకుపోయి విషయం చెబితే, సంభాషణ చెబితే నీకు మరణం తప్పదని చెప్పి, ఆమె బతికినా చచ్చినా, నీవు చెప్పవద్దని చెబుతాడు. నీ తండ్రి అలాగే చేశాడు. అందుకే అన్నారు,

సత్యశ్చాద్య ప్రవాదో యం లౌకికః ప్రతిభాతి మా
పితౄన్ సమనుజాయంతే నరా మాతరమంగనాః …రామా..అయో..సర్గ 35…శ్లో…36

తండ్రుల లక్షణములను కొడుకులు, తల్లి లక్షణములు కుమార్తెలు కలిగి ఉంటారనేలోకోక్తి నిజమవుతూ ఉంది నీ పట్ల, అన్నాడు. దీన్ని బట్టి మరొకటి కూడా తెలుస్తోంది కదా, ఏ విషయమైనా “అతి చేస్తే గతి చెడుతుందని” సామెత.

పోలిక కొస్తే పుట్టినప్పటినుంచి మొదలే కదా. ఆ తరవాత “వాళ్ళ బాబు ముందు ఆమ్ము తినేస్తున్నాడు నువ్వూ తినెయ్యాలి” తో మొదలు. “వారి అబ్బాయి/అమ్మాయి బళ్ళోకి ఏడవకుండా వెళ్తోంది నువ్వూ వెళ్ళాలి”. “పక్కింటి వారబ్బాయికి ఫస్టు మార్కొచ్చిందిట నువ్వేందుకూ పనికిరావు,” ఇక్కడినుంచి పోలికతో కించపరచడం ప్రారంభవుతూంది. “ఎదురింటివారమ్మాయి చూడు, ఏదడిగితే అది చెప్పేస్తుంది, గడగడా, వెనకింటి వారమ్మాయిని ఎవరో చూసి, వచ్చి పిల్ల తెలివి మెచ్చుకుని పెళ్ళి చేసుకుంటామన్నారట. వీళ్ళకీ నచ్చిందిట, పెళ్ళిట. మనతింగరిబుచ్చీ ఉంది, ఎందుకూ.” “వాళ్ళబ్బాయికి అమెరికా ఛాన్స్ వచ్చిందిట”. ఇలా పోలికలతో నిత్యం సతాయిస్తూ ఉంటే, ఇబ్బందులే కనపడుతున్నాయి.

ఇలా పోలికలేకాక, తిట్టడానికి కూడా పోలిక చెబుతారు మనవాళ్ళు. “నీ దంతా మీ తాత పోలికే వెధవా! వెధవ బుద్ధులూ నువ్వూను” అని కొడుకును తిడుతుంది కోడలు, మామగారిని తిన్నగా తిట్టలేక. అలాగే ఆడపిల్లను, “అంతా మేనత్తపోలికే వెధవ బుద్ధులెక్కడికిపోతాయి, వెధవ సామాచికం” అంటూ, కూతుర్ని తిడుతున్నట్లు, ఆడపడుచును తిడుతుంది.. ఇది భార్య భర్తలలో ఒకరిని ఒకరు సాధించుకోడానికి కూడా ఆయుధంలా పనికొస్తుందనమాట. ఆవిడ అమ్మాయిని మేనత్త పోలికని, కూతుర్ని తిడుతుంది, ఆయనని సాధించాలని, ఆయన “అన్నీ మేనమామ పోలికలే వెధవా, ఎందుకూ పనికిరావు” అని తిడతాడు, ఆమెను కవ్వించడానికి. ఇలా తిట్లు తినేవారు కూడా పైవారయి ఉండరు, మేనమామో, మేనత్తో, తాతో, అమ్మమ్మో, మామ్మో అయివుంటారు.

సంసారంలో భార్య భర్తలు ఇతరులతో పోలిక సంభాషణ అసలు పనికిరాదని నా అభిప్రాయం. “పక్కింటాయన చూడండి వాళ్ళ వైభోగం చూడండి, మీరిద్దరూ ఒకే ఆఫీసులో ఒకే ఉద్యోగం చేస్తున్నారు ఎందుకూ”, అందనుకోండి భార్య, పాపం ఆమె ఆ పక్కింటాయన ఏదో రోజు ఉదయమే శ్రీ కృష్ణజన్మస్థానానికి కూడా అంత దర్జాగానే తీసుకెళ్ళబడతాడన్నది విస్మరిస్తుంది. “ఎదురింటావిడ చూడు, ఎంత అందంగా అలంకరించుకుంటుందో, ఎంత సోషల్ గా ఉంటుందో, నువ్వూ ఉన్నావు పేడ తట్టలాగ” అని భార్యను ఈసడించేవారు చాలా విషయాలను విస్మరిస్తున్నట్లే, పై చూపు చూస్తున్నట్లే.. ఎవరి అందం, తెలివి, వైభవం, ధనం, అనుభవం, కర్మ వారిదే. మరొకరితో పోలిక కుదరనే కుదరదు, అనవసరం కూడా..

ఈ మధ్య ఆఫీసుల్లో కూడా ఇలా పోలికలు చెబుతున్నట్లుంది, పని దగ్గర. తస్మాత్ జాగ్రత, ఇది ఎదుటివారిని కించపరచడమే అవుతుంది..

చిన్నపిల్లలను మరొకరితో పోల్చవద్దంటున్నారు, తెలిసినవారు, మనస్తత్వ వేత్తలు . ఇది పిల్లలలో అనేక రకాలైన మానసిక ఇబ్బందులకు దారితీస్తోందట. పెద్దవారిలోనైనా ఈ పోలిక చెప్పటం మూలంగా కించపరచే పరిస్థితులను తేవడం మంచిదే కాదు. భార్యా భర్తలు మరెవరితోనూ పోల్చుకోవద్దు, మీరెవరికీ పోలికకాదు. ఎవరితో పోల్చినా బాధపడనివారున్నారు మనదేశంలో,వారెవరో మీకూ తెలిసిపోయిందీపాటికి :). మన నాయకులు విదేశాలతో పోల్చి ముక్కుపిండి పన్నులు మాత్రం వసూలు చేస్తున్నారు, సౌకర్యాలకల్పన మాత్రం పోల్చరు, అది దేవుడెరుగు.

ప్రకటనలు

రచయిత: kastephale

A retired telecom engineer.

12 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-పోలిక.”

 1. శర్మగారూ ! జిలేబి ‘వాక్చతుర ప్రౌఢి
  మలు ‘ మనకు వచ్చునేమి యే మాత్రమేని ,
  మనము మనమె , వారును వారె , మారము గద !
  పోలికల్ జెప్ప జూచిన ‘ పోటు ‘ వచ్చు .

  మెచ్చుకోండి

  1. వాక్చతురతల్ జిలేబీ
   ఫ్యాక్చరు జేయును సుమ మన బంతిని గురువా !
   మిక్చరు పొట్లము తానౌ
   స్ట్రక్చరు గుండ్రము గబగబ సరిసరి కోయున్ 🙂

   జిలేబి

   మెచ్చుకోండి

 2. సమజవలే మిక్చరు పొ
  ట్లము కత , బంతాటనంగ , రాజన్న నమో
  నమములు జిలేబి సారూ !
  సుమనో నేత్రములు విచ్చి చూడు మహాత్మా !

  మెచ్చుకోండి

 3. రూపురేఖల పోలికలంటే, కొందరు తల్లిదండ్రులు ఉంటారండి మహా అదృష్టజాతకులు – వాళ్ళ కొడుకు పిల్లలకి కోడలి వైపు పోలికలు వస్తాయి; వాళ్ళ కూతురి పిల్లలకి అల్లుడి వైపు పోలికలు వస్తాయి 😀😀😀.

  మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s