శర్మ కాలక్షేపంకబుర్లు- రక్షక భటుడు ( పోలీస్ )

Posted on అక్టోబర్ 22, 2012
6
రక్షకభటుడు.( పోలీస్ )

నిన్న పోలీస్ అమరుల సంస్మరణ దినం జరిగింది. కాని ప్రజలంతగా స్పందించిన దాఖలా కనపడలేదు. కారణమేమయి ఉంటుందని అలోచిస్తే.

స్వాతంత్రం రాక ముందు ఈ వ్యవస్థ నాటి పాలకుల కొమ్ము కాయడానికి ఉపయోగపడిన మాట వాస్తవమే. కాని స్వతంత్రం వచ్చిన తరవాత కూడా ఈ వ్యవస్థ లో పెద్దగా మార్పులొచ్చినట్లు లేదు. ఈ రోజునాటికీ పోలీస్ ను చూస్తే అందరికి ఒక రకమైన, భయం, జుగుప్స,వ్యతిరేకత కనపడుతుంది, సామాన్య ప్రజలో. పోలీస్ స్టేషన్ కి వెళ్ళడానికే ఇష్ట పడని వారెందరో, వారికి నష్టం కలిగినా, నేటికీ. దీనికి కారణం ఆ వ్యవస్థ లో వేళ్ళూనుకుపోయిన లంచగొండితనం,రాజకీయ నాయకులకు తొత్తులుగా వ్యవహరించడం, పారదర్శకత లోపించడం, మర్యాదాలోపం, ఫిర్యాదు దారుని నీచంగా చూసి దొంగని అందలాలెక్కించడం, వగైరా వగైరా చాలా కారణాలున్నాయి. వీరు సమాజానికి దూరమయిపోతున్న మాట వాస్తవం. సమాజం లో ఉన్న దుర్గుణాలన్నీ పోలీస్ వ్యవస్థలో రాశీభూతమయి ఉన్నాయంటే అతిశయోక్తి కాదు.. రాజకీయ వ్యవస్థ కి అందునా పరిపాలన చేస్తున్న పార్టీ వారికి ఈ డిపార్టుమెంట్ ఒక అత్యవసర అవసరం గాను,కుడి చెయ్యిగానూ పని చేస్తోందంటే వింత కాదు.ఈ రోజుకు కూడా ఏదయినా నష్టం జరిగినపుడు పోలీస్ స్టేషన్ కు వెళ్ళి ఫిర్యాదిస్తే నమోదు చేసే నాధుడులేడు. ఆ ప్రాంతపు ఎమ్.ఎల్.ఎ లేదా మరొక రాజకీయ నాయకుడు చెప్పినపుడు మాత్రమే ఈ ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేస్తున్నారంటే రాజకీయ వ్యవస్థ పోలీస్ పై ఎంత అజమాయిషీ చేస్తున్నది తెలుస్తుంది. ఫిర్యాదిస్తే నమోదు చేస్తామని చెబుతారు, కాని చెయ్యరు. మరో చిత్రం స్టేషన్లో కావలసిన తెల్లకాగితాలు వగైరా ఖర్చులకు బడ్జట్ ఉండకపోవడంతో ఫిర్యాదీ దారులపై ఈ భారం మోపుతున్నారు. ప్రజలతో ముఖా ముఖి సంబంధాలున్నవి మూడు నాలుగు రేంకులకంటే ఉండవు. వీరిలో ముఖ్యులు కానిస్టేబుళ్ళు. నిన్నటి, నేటిదాకా కూడ వీరిలో అత్యధికులు నిరక్షరాస్యులు, లేదా కొద్దిగా చదువుకున్నవారు. వీరికి చట్టం మీద అవగాహన తక్కువే, కాదు లేదు. ఇప్పటీకీ పదవ తరగతి చదువుకున్న వారిని కానిస్టేబుల్ గా తీసుకుంటున్నారు,వీరి రిక్రూట్మెంట్లో కూడా రాజకీయం చేరుకుందంటే, వీరికి చట్టం మీద, చట్టం లో చెప్పిన అధికారాల మీద అవగాహన తక్కువే. మనం కనక ఇచ్చే ఫిర్యాదులో చట్టం గురించి కనక చెబితే వారికి కోపం కూడా వస్తుంది. ఇటువంటి ఒక సంఘటన నాకొకప్పుడు తారసపడింది. స్టేషన్ కి పదిమంది నుంచి కానిస్టేబుళ్ళుంటారు. ఒకరు నిత్యం కోర్టు పని మీద తిరుగుతుంటారు, ఇతనే రైటర్. ఆ స్టేషన్ లో కొద్దిగా చట్టం గురించి ఎరుక ఉన్నవాడయి ఉంటాడు.ఎస్.ఐ తో సహా మిగిలిన వారికి చట్టం గురించి తెలిసినది తక్కువే, కేసులు నీరుగారిపోవడానికి కారణం, చట్టం పై అవగాహనా లోపమే.. శాంతి భద్రతలనుంచి చాల విషయాలలో పోలీస్ వ్యవస్థ జోక్యం చేసుకోవాల్సి ఉంటుంది. దుర్లక్షణాలు పెరిగి జోక్యం చేసుకోకూడని చోట్ల జోక్యం చేసుకోడం ఎక్కువగా జరుగుతోంది, స్పందించవలసిన చోట మానెయ్యడం జరుగుతోంది . దీని మూలంగా పారదర్శకత లోపంతో అవినీతి పెరిగిపోయింది. నిజానికొస్తే కానిస్టేబుల్ ఈ వ్యవస్థలో ముఖ్యుడు, కాని ఇతని రక్షణ, ఉద్యోగ సమయాలు, ఆరోగ్యం మొదలయిన విషయాల మీద సరయిన చర్యలు తీసుకోకపోవడం మూలంగా ఒక రకమైన నిర్లిప్తత నెలకొని ఉంది. ఏ విషయం లో నైనా బలైపోయేవారు కానిస్టేబుళ్ళే అయిపోతున్నారు. కొంతమంది ఆఫీసర్లు కూడా రాజకీయ వత్తిడులకు లొంగి పని చేయని వారిని సుదూర ప్రాంతాలకు బదిలీ చెయ్యడం దగ్గరనుంచి ప్రాణ హాని కలగ చేసే శక్తులకు వారిని వదలివేసిన సంఘటనలు కూడా ఉన్నాయి.

ఎక్కువగా ఈ వ్యవస్థ రాజకీయనాయకులకు రక్షణ కల్పించేందుకు, మంత్రులు మొదలయిన వారి రక్షణకు ఇతర సంగతులు, రాస్తారోకోలు, రాజకీయ ఆందోళనలకే పరిమితమయిపోతూ ఉంది. కొంత మంది రహదారి వ్యవస్థను వాహనాల రాకపోకలని నియంత్రించే పనిలో ఉండిపోతున్నారు. అసలు పనికి, పరిశోధనకి సమయమే సరిపోటం లేదంటే అతిశయోక్తి కాదు. అసాంఘిక శక్తులు కొత్తరకం వాహనాలమీద తిరుగుతూ నేరాలు చేస్తూ ఉంటే, వీరు కాలం చెల్లిన జీపుల్లో, పరిమితి కలిగిన పెట్రోల్ వాడకంతో, తిరిగి ఎంత కాలానికి వారిని పట్టుకోగలరు. ప్రతి స్టేషన్లులోనూ ఉండవలసిన స్థాయిలో సిబ్బంది లేకపోవడం మూలంగా ఉన్న వారిపై పని భారం పెరిగి అవ్యవస్తకి కూడా కారణమవుతూంది. నిజానికి ఒక కానిస్టేబుల్ ఉదయమే స్టేషన్ కు వస్తే మళ్ళీ ఇంటికెపుడెళతాడో తెలియదు. వేళా పాళా లేని పని, తిండి తిప్పలు చూసే నాధుడు ఉండడు. ఆర్డర్ లు ఇచ్చేవారే తప్పించి కష్టం గురించి పట్టించుకున్న నాధుడు లేడు, పని గంటలు లేవు.. ఆర్డర్లీ వ్యవస్థ దుర్వినియోగమైనంతగా మరే వ్యవస్థా దుర్వినియోగం కాలేదేమో. నేను పని చేసిన టెలికం లో కూడా ఆర్డర్లీ వ్యవస్థ ఉండేది.తరవాతి కాలంలో దీనిని రద్దు చేసేరు. ఇప్పటికీ పోలీస్ లో ఇది ఉన్నట్లుగానే ఉంది. చాలా కమిషన్లు వేసేరు, ఈ వ్యవస్థను మెరుగు పరచడానికి, కాని ఏ కమిషన్ వారు చెప్పినదీ అమలు చేయలేదు. రాజకీయ శక్తుల చేతులనుంచి వీరికి ముక్తి కలిగించినపుడే, ఈ వ్యవస్థ ప్రత్యేకంగా నిష్పక్షపాతంగా పని చేయగలదు. అందుకు పాలక వర్గాలు సిద్ధంగా లేవని ప్రతి సారి డి.జి.పి నియామకం లో జరుగుతున్న సంగతి తెలియ చేస్తూనే ఉంది.ఇంకా చాలా విషయాలు, పోలీసుల పట్ల జరుగుతున్న అన్యాయాలు సరిగా చెప్పలేకపోయానేమో!

అసాంఘిక శక్తుల చేతిలో బలయిపోయిన నిజయితీ పోలీస్ ఆఫీసర్లు, కానిస్టేబుళ్ళ కుటుంబాలను, అనారోగ్యం తో కునారిల్లుతున్నవారిని, వారి కుటుంబాలను ఆదుకోవాలని, ప్రాణాలు కోల్పోయిన వారికి అంజలిఘటిస్తూ,చాలా అవసరంగా తొందరలో ఈ వ్యవస్థను పునరుద్ధరించుకుని, పోలీస్ ప్రజలకు స్నేహితులుగా ఉండే రోజు రావాలని, అమరవీరుల కుటుంబాలను ఆదుకోవాలని కోరుకుంటూ
స్వస్తి.

ప్రకటనలు

రచయిత: kastephale

A retired telecom engineer.

9 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు- రక్షక భటుడు ( పోలీస్ )”

 1. >> ఆర్డర్ లు ఇచ్చేవారే తప్పించి కష్టం గురించి పట్టించుకున్న నాధుడు లేడు, పని గంటలు లేవు

  చాలా కాలం క్రితం ఒక పోలీస్ సబ్ ఇనిస్పెక్టర్ గారు మాకు తెలుసు. కానిస్టేబుళ్ల చేత ఇంట్లో, వంట ఇంట్లో బాత్రూములో పనులు చేయించుకునేవాడు. ఆఖరికి బట్టలు ఉతికించుకోవడం కూడాను అనేవారు. ఈ కానిస్టేబుళ్లని అలా వాడుకోవడం వల్ల వాళ్ళూ పగ పెంచుకుంటూ పైకి వస్తారు ఏదో ఒకరోజున సబ్ ఇనిస్పెక్టర్ అయ్యి మిగతావాళ్ళని ఏడిపించుకు తింటారు. ఇదో పెద్ద పునరపి జననం పునరపి మరణం లాంటిది. ఎప్పటికీ తేలవు.

  >> ఈ వ్యవస్థను పునరుద్ధరించుకుని, పోలీస్ ప్రజలకు స్నేహితులుగా ఉండే రోజు రావాలని …

  అయినా తాతగారూ, ఇదేనండి మన భారతీయులకున్న పెద్ద సమస్య. మీకు మార్పు కోసం అంత కంగారు అయితే ఎలా? కలియుగం తర్వాత ఇంకెంత కొన్ని లక్షల సంవత్సరాలలో సత్యయుగం వస్తోంది కదా? అప్పుడు అన్నీ బాగుంటాయి. ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తుంది. ఆ మాత్రం ఆగలేరూ? 🙂

  మెచ్చుకోండి

  1. okaDuగారు,

   కాగితాల మీద ఈ వ్యవస్థ లేనట్టుందిగాని ఇంకా నడుస్తున్నట్టే ఉందండి. స్వాతంత్ర్యం వచ్చినా బుద్ధులు మారలేదు. రైల్వేలో అరవై వేల మంది ఉన్నారంటే…..

   వీరి బాధలు చెప్పుకుంటే చాలా బాధగానే ఉంటుంది. ఆఖరు మాట ఉన్న బాధ చెప్పుకోడానికి కూడా లేని వ్యవస్థ నడుస్తోందండి

   మార్పురావాలని కోరిక..అప్పటిదాకా ఆగమంటారా? 🙂 నిజమే తప్పదు లెండి 🙂

   ధన్యవాదాలు.

   మెచ్చుకోండి

 2. తిరిగి స్వాగతం శర్మ గారూ. ఇందాకనే అనుకున్నాను మీ కుశలం అడుగుతూ వ్యాఖ్య పెడదామనుకుని. సరే, “వేడితే” “నీరు” ఇస్తే పుచ్చుకుని వ్రాద్దాలేం అనుకున్నాను. ఇంతలోనే జిలేబి గారి బ్లాగ్ లో మీ వ్యాఖ్య, వారి (వచన 🙂) జవాబు కనిపించాయి.
  ఈ నెల 12 తరవాత మీ వైపు నుండి నిశ్శబ్దం. ఎల్లరున్ సుఖులే కదా?
  మీకు, మీ కుటుంబానికి దీపావళి శుభాకాంక్షలు (ఒక రోజు ఆలస్యంగా).

  మెచ్చుకోండి

  1. విన్నకోట నరసింహారావుగారు,

   ’వేడితే’ ’నీరు’ మీరూ మరో జిలేబీలా ఉన్నారే! లేక జిలేబీయే మీరా? 🙂

   కొంచం బిసీ, ఇక ముందంతే కుదిరితే బ్లాగ్ లోకి రావడం, లేదంటే డుమా కొట్టెయ్యడమేనండి. కొంత అశ్రద్ధ, వద్దామనుకుంటూనే కాలం గడిచిపోయిందండి 🙂

   బండి నడుస్తోంది కదండీ 🙂 మీకు మీకుటుంబానికి దీపావళి శుభకామనలు ( ఆలస్యంగానే) ఐపోయిన పెళ్ళికి బాజాలు (సామెత)అనుకోకండి

   ధన్యవాదాలు.

   మెచ్చుకోండి

   1. పోలిక అన్యాయం శర్మ గారూ, నేనొప్పను 😡. “వేడితే-నీరు” పదప్రయోగం జిలేబి గారు పద్యరచనలోకి దూకకముందునుండే ఉండేది కదండీ ☝️.
    సామెత చెప్పినప్పుడు ‘సామెత’ అని బ్రాకెట్లో సూచించడమనే మీ ఐడియా బ్రహ్మాండం సుమండీ 👌. అనవసరంగా గొడవలైపోకుండా ముందే చెప్పుకుంటే శ్రేయస్కరం 🙂.

    మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s