శర్మ కాలక్షేపంకబుర్లు-నేటి పొగడ్తలు.

Posted on అక్టోబర్ 29, 2012
6
నేటి పొగడ్తలు

పొగడ్త ఒక అగడ్త లాటిది. “అగడ్తలో పడ్డ పిల్లికి అదే ప్రపంచం” సామెత. పొగడ్తల జడి వానలో తడిసేవారికి ఎప్పుడూ జలుబు చేయదు సరికదా ఆ జడివాన నుంచి బయటకొస్తే మాత్రం జలుబే కాదు జ్వరం కూడా వస్తుంది :). పూర్వకాలం, రాజులు మహరాజుల కొలువులో వందిమాగధులని, పొగడ్తలకి ప్రత్యేకంగా ఒక వ్యవస్థ ఉండేది, వీరు ఆ రాజు వంశం, చరిత్ర అన్నీ తెలిసిన వారయి ఉండేవారు. ఉదయమే మేలుకొలుపు, మెచ్చుకోలుతో చేసేవారు . రాజు నిరంకుశుడు, నీ తండ్రి ఇన్ని గొప్ప పనులు చేసేడు, నీ తాత, ముత్తాత ఇంత గొప్పవారు, నువ్వు ఇన్ని గొప్ప పనులు చేసేవు, ఇంత గొప్పవాడివి అని పొగిడేవారు, ఇది రాజ్య వ్యవస్థలో భాగంగా ఉండేది. తరవాతి కాలంలో భట్రాజులని, ఒక తెగవారు ఈ కార్యం నెరవేర్చేవారు. దానితో తప్పు చేయకూడదనే భావం ఏర్పడి, ప్రతి క్షణం మంచివాడనే పేరు నిలబెట్టుకోడానికే ప్రయత్నం చేసేవాడు. నేటి వ్యవస్థలో పార్టీపత్రికలు ఆ పని నిర్వహిస్తున్నట్లున్నాయి, డబ్బు తీసుకుని ప్రకటనల రూపంలో, వార్తల రూపంలో. ఈ ప్రకటనల రూపకర్తలు, శిల్పులు వేరుగా ఉంటారు. “అతి చేస్తే గతి చెడుతుంద”న్న సామెతలాగా ఒక్కొకప్పుడు ఈ పొగడ్తలు అతి అయి ఉన్న గోడు చెడిపోతుంది, “భారత్ వెలిగిపోతోంద”న్న దానిలా. ప్రభుత్వాలు కూడా ఈ పొగడ్తలు తమకు తామే చేసుకుంటున్నాయి, ప్రకటనల రూపంలో. పార్టీల వారికి కీర్తికండూతి, ధన కండూతి మెండుగా ఉంటుంది, ఎప్పుడూ ఎన్నికల మీదే దృష్టి ఉంటుంది.

ఈ పొగడ్తలలో రకాలున్నాయన్నారు, పాత కాలం వారు. వీటిని మూడు రకాలుగా కూడా విభజించేరు. అవి చెప్పడం కొద్దిగా అశ్లీలం అనిపించి తర్జుమా చెబుతున్నా. 1. స్వ.కు.మ. తనను తానుపొగుడుకోవడం 2.ప.కు.మ ఎదుటివారిని పొగడటం లేదా పొగిడించుకోవడం. 3.పరస్పర.కు.మ వీరు వారిని గొప్పవారని పొగిడితే, వారు వీరిని గొప్పవారని పొగుడుతారనమాట. మరొకటి ఉంది నిందాస్తుతి అని, ఇది తిడుతున్నట్టు ఉంటుంది, కాని నిజంగా, పక్కాగా పొగటటం, ఇది కవులసొత్తు. నేటి కాలానికి మా మిత్రుడు సిరివెన్నెల్ల, ఇందులో ఘనాపాటీ. “తనను తాను పొగుడుకుంటే తన్నుకున్నట్లుంటుందని” సామెత. పొగిడేవారు లేనపుడు తనను తానుపొగుడుకోక తప్పని పరిస్థితి కదా, అందుకే రెండవ, మూడవ రకాన్ని ఆశ్రయిస్తారు. ఈ పొగడ్తల బాధంతా చదువుకున్న వారు, గొప్పవారికే. సామన్యుడిని ఎవరేనా పొగిడేరంటే ముందు భయపడతారు, ఎందుకంటే, ఏగోతిలో తోసేయడానికి ఇది ప్రాతి పదికోనని. ఐదు సంవత్సరాలకొక సారి సామాన్యుడు గుర్తొస్తాడు, పార్టీల వారికి. అప్పుడు నువ్వు ఇంద్రుడివి, చంద్రుడివి అని పొగుడుతారు. నిజంగా ప్రజాస్వామ్యం నీవల్లే బతుకుతోందంటారు, అప్పటిదాకా కనపడని వారు, వేడుకున్నా దర్శనమివ్వని వారు తన గుమ్మంలో కొచ్చేటప్పటికి పొంగిపోతాడు, పిచ్చివాడు, మోసపోతాడు. కాని పూరేడు పిట్టలా, ప్రతిసారి ఉండేలు దెబ్బ తింటున్నా, పక్కకి తప్పుకుంటాడు తప్పించి,కొత్తవారిని చూసుకోడు.. మళ్ళీ మళ్ళీ వారినే ఎన్నుకుంటూ ఉంటాడు, దెబ్బలు తింటూ ఉంటాడు . పాపం చదువుకున్న వారిది మరొక తరహా, వీరికి కీర్తి కండూతి ఎక్కువ, ధన కండూతి లేదనికాదు. తమని గొప్పవారిగా గుర్తించాలని తెగ బాధపడిపోతారు. ఒక గుంపును తయారు చేసుకుంటారు. ఈ గుంపూ ఊరికే చేరదు, దగ్గరికి, వారికీ అటువంటిదేదో కావాలి, లేదా సొమ్ము సంపాదించుకునే మార్గం కావాలి. ఇది నిజంగా మూడవకోవకు చెందినదే, అటువంటి ఉపకారమేదీ లేనిరోజున వీరు తుపాకీ దెబ్బకి కూడా కనపడరు.. ఐతే చూడటానికి అలా కనపడదు. ఒక్కొకప్పుడు ఈ పొగడ్తలు చూస్తే వెగటు కలుగుతుంది కూడా. ముక్కు కోస్తే రక్తం తాగేవారిలా ఉంటాయి, ఇవి. పేర్లొద్దు కాని ఒక రాజకీయ పార్టీ కార్యకర్తలు, వారికి జీతాలిచ్చేవారులెండి, పార్టీ తరఫున, వారు ముక్కుకోస్తే రక్తం తాగేవారిలా ఆ పార్టీని పొగిడేవారు, పాపం కనుమరుగైపోయారనుకోండి. నిజమైన విషయం ఉన్నపుడు, విషయాన్ని పొగడటం, చెప్పిన వారి కౌశల్యాని కొద్దిగా హెచ్చించడం తప్పుకాదు కాని, వారు చెప్పిన ప్రతి విషయం గొప్పగా ఉందని పొగడటం అందంగా ఉండదేమో! అదే వెగటును కలిగిస్తుంది, దీనినే నేడు భట్రాజు పొగడ్త అంటున్నాం. దాని మూలంగా వారి అసలైన స్వరూపం మరుగున పడే అవకాశం ఉందికదా! అదివారికి కీడు చేస్తుంది తప్పించి మేలు చేయదు. పొగడ్త ఒక ఔషధం లాటిది, తగుపరిమాణంలో ఉన్నపుడు మంచి పని చేస్తుంది. ఇది పెరిగితే వారిలో ఆత్మ విశ్వాసం బదులు అతివిశ్వాసం బయలుదేరి తలపొగరు వచ్చే సావకాశం ఉందికదా

ప్రకటనలు

రచయిత: kastephale

A retired telecom engineer.

4 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-నేటి పొగడ్తలు.”

 1. “రాజు వెడల రవితేజములలరగ, …..” కాలం నుండి “ఏం చెప్పినవ్ అన్నా, అన్న మస్తు చెప్పిండులే, హే మా అన్న నంటవా” వరకూ వచ్చాం. ఆధునిక పరోక్ష రౌడీ / రాజకీయ గుడ్డి పొగడ్తలే ఏలుతున్నాయి ఈ ట్రెండ్ బాగా ఎక్కువైపోతోంది కూడా. రాచరికాలు పోయినాయి అన్నదెవరు? వేషం మార్చుకున్నాయంతే.

  మెచ్చుకోండి

  1. విన్నకోట నరసింహారావుగారు,

   మోతాదులో ఇవెలాగూ తప్పనివేననుకోండీ 🙂 అతిగా ఉంటున్నాయి, అసహ్యంగానూ ఉంటున్నాయి! అంతేనండి 🙂

   ధన్యవాదాలు.

   మెచ్చుకోండి

 2. మీరు చెప్పిన మూడు రకాలకూ… “సాహిత్య హింసావలోకనమ్” అనే రచనలో నం(డూరి) పా(ర్థ) సా(రథి) గారు స్వడబ్బా, పర డబ్బా, పరస్పర డబ్బా… అని పేర్లు పెట్టారు.

  మెచ్చుకోండి

  1. ఫణీన్ద్ర పురాణపణ్డగారు,

   ఈ టపా రాసే రోజులనాటికి వారలా అన్నది తెలియదండి 🙂
   పాతకాలంలో పెద్దలు ఇవే చెప్పేరండి అవే గుర్తుండిపోయాయండీ 🙂
   ధన్యవాదాలు.

   మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s