శర్మ కాలక్షేపంకబుర్లు-సిగరెట్టు పురాణం.

Posted on నవంబర్ 30, 2012
7
సిగరెట్టు పురాణం.

సూతోవాచ:-సూతుడు నైమిశారణ్యంలో….అని మన పురాణ కధలు మొదలవుతాయి. అలాగ నా సిగరట్టు పురాణం మొదలయిన రోజును స్మరించుకుంటా. ఏభయి నాలుగేళ్ళ మాట, ఆ రోజు ఎస్.ఎస్.ఎల్.సి పరీక్షా ఫలితాలొచ్చేరోజు. ఇప్పటిలాగా సెల్ ఫోన్ లో ఫలితం చెప్పే రోజులు కావు, కనీసం పేపరు వచ్చే ఊరూ కాదు. ఆ రోజుల్లో విశాలాంధ్ర పత్రిక ఒకటే ఇలా ఫలితాలు ముందుగా ప్రకటించి పేపరు రూపాయికి అమ్మేది. మరెవరూ వేసేవారు కాదు. అసలున్న పత్రికలెన్ని, అయ్యా ముగ్గురు తొమ్మండుగురని, తెనుగులో, ఆంధ్ర ప్రభ, ఆంధ్ర పత్రిక, విశాలాంధ్ర ఇంతే. సంగతి పక్కదారి పట్టేసినట్లుంది కదూ! , సిగరెట్లనుంచి :). గోదావరి గట్టు మా ఊరి సెంటరు, మిరప పంట బాగా పండి, ఆ రోజుల్లో శ్రీ లంకకి ఎగుమతి చేయడానికి రెట్టింపు పై ధరతో అమ్మకాలుంటే, లాభాలొస్తే, మా ఊళ్ళో, ఆ రోజుల్లో సైకిళ్ళు కొన్నారు, కొత్తగా. కొత్త సైకిల్ మీద తిరగడమొక ఆనందం, ఆ రోజుల్లో, అందులోనూ గ్రీన్ హంబర్ సైకిల్ మీద, అప్పటికి సైకిళ్ళూ లేవు మా ఊళ్ళో ఎక్కువగా. బలే అందంగా ఉండేది సైకిలు, అలాగే నడిచేది. ఏ రోజు ఫలితాలొస్తాయో తెలీదు, ఈ వేళొస్తాయి, రేపొస్తాయని చెప్పుకోడమే. ఒక రోజు ఈ వేళ ఫలితాలొస్తాయని, రూఢిగా చెప్పుకోడంతో గట్టు మీద కాశాం. ఈ సైకిల్ పిచ్చాడెవరేనా తాళ్ళపూడి వెళ్ళకపోతాడా? వెళితే పేపర్ తేకపోతాడా అని ఆశ.

నాకయితే భయం లేదు, పాస్ అవుతానని నమ్మకమే, కాని మాకు సీనియర్, రెండు డింకీలు కొట్టి మాతో కలిసిన స్నేహితునిదే అనుమానం. నేను చెప్పేను, నువ్వూ పాస్ అవుతావురా అని, అబ్బే వాడికి నమ్మకం లేదు, నా మాట మీద, నా పేపర్లో చూసి రాసుకున్నా . వాడికి ఈ సిగరెట్లు కాల్చే అలవాటుంది, ఆ రోజు వాడు కాలుస్తూ, నన్నూ కాల్చమని ప్రోద్బలం చేసేడు. వద్దన్నా, ఒకటే, ఫరవాలేదు, ఒక్క దానికి అలవాటయిపోదని బలవంతంగా, ఒక్కటంటే ఒక్కటి అంటింపచేసేడు, సూతోవాచా అని. అది మొదలండి, ఆ వేళ ఫలితాలొచ్చాయి, ముందు వాడి నెంబర్ చూసి పాస్ అయ్యాడంటే అప్పుడు నా నెంబర్ చూసుకున్నా, నాకేం అనుమానం లేదుగా : ) ఈ ఆనందంలో మరొకటి ముట్టించి, ముట్టింప చేశాడీ నిషిద్ధ గురువు. ఇంకక్కడి నుంచి అలవాటు మొదలండీ!,మొదటి సారి ఉక్కిరిబిక్కిరయి కళ్ళనీళ్ళొచ్చి, నానా హైరానా పడ్డా, ఎప్పుడూ ఇక కాల్చకూడదనుకుంటూ, నోట్లో పిప్పర్మెంటు బిళ్ళ వేసుకుని చప్పరిస్తూ.

బర్కిలీ సిగరెట్లు కాల్చడం, ఆ రోజులలో బేడ, ఆ పెట్టి సిగరెట్ల ఖరీదు. పెట్టి సిగరట్లు కొంటే దాచేదెలా? ఎవరేనా చూస్తే? అందుకు కొట్టువాడి దగ్గర రెండు, మూడు సిగరట్లు తీసుకోడం, ఒక సారి. పది అయిన తరవాత, డబ్బులివ్వడం, సిగరట్ల కాతా కుదిరిపోయింది 🙂 కొట్టు దగ్గర సిగరట్టు అంటించుకుని కాలుస్తూ, కొండొకచో ఎవరేనా ఎదురుపడితే సిగరట్టు అరచేతిలో దాచేసి పెద్ద పనున్నట్లు గోదారి లంకలో కి పోయి అక్కడ ఊదేసి రావడం. ఆలా అది పెరుగుతూ వచ్చింది, ధరా, దాంతో పాటు నా కాల్చడమూ. ఎక్కువగా కాల్చిన రోజులలో మూడు పెట్టిల సిగరెట్లు తగలేసేవాడిని, రోజుకి. బర్కిలీ తప్పించి మరొకటి కాల్చ బుద్ది అయ్యేదికాదు. ఇంకా ఆ రోజులలో ఉన్న సిగరట్ల పేర్లు, డెక్కన్,చార్మినార్, ఇది మా ప్రాంతంలో దొరికేది కాదు. పని వాళ్ళు,టీ డెక్కన్ సిగరట్టు ఉంటే చాలనుకునే రోజులు.సిజర్స్,కాప్ స్టైన్, గోల్డ్ ఫ్లేక్ ఇవే ఆరోజులలో ఆ పల్లెలో దొరికే సిగరట్లు. ఆ తరవాత కూడా నాకు మరే కొత్తవీ కనపడాలేదు :)నేను ప్రయత్నించా లేదు. విదేశీ సిగరట్లని, మార్ల్ బరో చుట్టలని చాలా సార్లు కాల్చడానికి ప్రయత్నం చేసేనుకాని, దేశీయాభిమానం అడ్డొచ్చి 🙂 వాటిని తగలబెట్ట లేదు. ఎంటోగాని అవి బాగానూ ఉండేవి కావు, రుచిగా. సిగరట్టుకి రుచేంటీ అనద్దు, కాల్చినవారికి కాని తెలీదు, ఆ అనుభవం :). పొగ వాసన బట్టి కాల్చే సిగరట్టు ఏదో చెప్పగలిగినంత ప్రజ్ఞ వచ్చేసింది, ఇందులో పి.హెచ్.డి ఉంది నాకు. 🙂 సిగరట్టు కాల్చిన ప్రతిసారి నోరు శుభ్రం చేసుకోడం, వాసన రాకుండా పిప్పరమెంటు బిళ్ళలు చప్పరించడం,కొత్తలవాటు.

కన్నమ్మకి తెలిసింది సిగరట్లు అలవాటయ్యాయని. ఒక సారి చెప్పింది చెడు అలవాటు చేసుకోకూ అని. అలాగేనమ్మా అన్నా, అక్కడినుంచి వెళ్ళిపోయాగా, అమ్మ మాట మరిచిపోయా!. పెంచుకున్నమ్మకి తెలిసిపోయింది, సిగరట్లు కాలుస్తున్నానని, కాని ఎప్పుడూ నన్ను అడగలేదు, కారణం, నేనంటే పిచ్చి ప్రేమ, నాకే తెలుసుననీ, మానేస్తాననీ నమ్మకం. విచిత్రం ఏమంటే తరవాత కాలంలో అమ్మ సిగరట్టు పెట్టి చూసేది కాని, నేను సిగరట్టు కాలుస్తుండగా ఎప్పుడు చూడలేదు. అమ్మ ఎదురుగా ఎప్పుడూ కాల్చలేదు. ఆ తరవాత నా జీవితం లో ప్రవేసించిన నా బంగారం, అదేనండీ నా ఇల్లాలు, కొత్తలో గునిసేది కాని తరవాత, తరవాత మానేసింది. ఇంటి కొచ్చేటప్పటికి నోరు శుభ్రం చేసుకురావడం కావచ్చేమో, లేదా చెప్పిన కొద్దీ ఎదురు తిరుగుతాడు,ఎందుకు చెప్పడం, ఊరుకుంటే మానేస్తాడేమో ననే ఆశ కావచ్చు. ఇలా నా సిగరట్ల కత్తికి జీవితంలో ఎదురు లేకపోయింది.

సిగరెట్లు ఎందుకు మానేశారు, ఎలామానేశారని Snkr గారు ప్రశ్నిస్తే జవాబుగా టపా రాస్తానన్నా. అదే ఈ టపా. సిగరెట్లు ఎలా మానేసేనో చెప్పేముందు ఎలా మొదలెట్టేనో చెప్పుకోవాలి కదా. 🙂

శ్రీ శర్మ విరచిత సిగరట్టు పురాణే ప్రధమోధ్యాయః సమాప్తః

ప్రకటనలు

రచయిత: kastephale

A retired telecom engineer.

3 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-సిగరెట్టు పురాణం.”

 1. భుగభుగమని పొగవదిలెను
  ఖగరాజై బ్లాగులోన కష్టే ఫలియై
  బిగువగు టపాల బేర్చెని
  ట గురువుగా మాచనార్యు డందంబుగనన్ !

  జిలేబి

  మెచ్చుకోండి

 2. నమస్కారం గురువుగారు.
  స్వదేశీ వస్తుదహనం అనే కాన్సెప్ట్ కూడా వుందనమాట 😊😊. కొందరేమో స్ట్రైకులప్పుడు కాల్చే స్వదేశీ వస్తువులు బస్సులు, ఆఫీసులు. అన్ని సమయాల్లోనూ కాల్చే స్వదేశీ వస్తువులు సిగరెట్లు.

  మెచ్చుకోండి

  1. YVR’s అం’తరంగం’గారు,

   విదేశీ వస్తు దహనం పైనే అసలు మోజు 🙂 ఏదీ పల్లెటూళ్ళో విదేశీ శ్వేత కాష్టాలు దొరకలేదు. దానికి ప్రతిగా స్వదేశీ పరిశ్రమ ప్రోత్సాహం కోసం ఇలా శ్వేతకాష్ట దహనం నిరంతంగా దీక్షతో కొనసాగించిందండి. మరే ఇతర దురుద్దేశాలూ లేవండి 🙂
   ధన్యవాదాలు.

   మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s