శర్మ కాలక్షేపంకబుర్లు-ఒక్కోసారంతే.

Posted on అక్టోబర్ 23, 2012
8

ఒక్కో సారంతే

ఎంత కాదనుకున్నా నేటి కాలం యంత్రాలపై ఆధారపడక తప్పదు. కాని అవి అవసరానికి పని చెయ్యనపుడే బాధ కలుగుతుంది.

టపా రాద్దామని కూచున్నా కంప్యూటర్ దగ్గర మొదలెట్టేను, టక్కున పోయింది కరంటు, ఉసూరు మంది ప్రాణం. బుర్రలోది కాస్తా ఆవిరయి పోయిందనుకోండీ 🙂 దానితో టపా మారిపోయింది, మళ్ళీ కరంట్ వచ్చేటప్పటికి. 🙂 ఏభయిఒకటో పెళ్ళి రోజు ఉదయమే ఆది దంపతుల దర్శనం చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. మే నెల 25 వ తేదీ రోహిణీ కార్తె మొదటి రోజు, ఇంక చెప్పేదేముందీ,నిప్పులు చెరుగుతున్నాడు సూర్యుడు, ఉదయం ఎనిమిదిన్నరకే. ఉదయ కార్యక్రమాలు ఎంత తొందరగా పూర్తి చేసుకోవాలన్నా ఆ సమయమైపోయింది. నడచి వెళ్ళాలని ముందన్నా. ఎందుకంటే పెళ్ళి అయిన మరునాడు, ఇద్దరం చెయ్యి చెయ్యి పుచ్చుకుని నడచి, ఎవరూ తోడు రాకపోయినా వెళ్ళి ఆది దంపతుల దర్శనం చేసుకొచ్చాం, మరప్పుడు ఎండ వెన్నెలలా కనపడింది, మరిప్పుడు ఎండ కాలుస్తోందేమో. 🙂 కాదు, అలాగే చెయ్యీ చెయ్యీ పుచ్చుకుని నడిచి వెళ్ళాలని ఒప్పించా, ఓపిక తగ్గిపోయినా :), కాని సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడే, ఓపిక తగ్గిందే, పోనీ బండి మీద వెళదామంది. కిలో మీటర్ దూరం లో ఉన్న గుడికి బండి మీద ఆవిణ్ణి వెనకాల కూచోబెట్టుకుని తీసుకెళ్ళి వచ్చేద్దామనుకుని బండి దింపేను. కిక్ కొట్టేను, సెల్ఫ్ కొట్టేను ఊహు, ఏం చేసినా అది కదల లేదు. ఒక పావు గంట దానితో కుస్తీ పట్టినా శ్రమ మిగిలింది తప్పించి ఉపయోగం లేకపోయింది. ఈ అవస్థ పడేకంటే నడిచి వెళ్ళి రావడం మేలు అంది నాటి యువరాణి. మనం అనుకున్నదే జరుగుతోందనుకుని నడచి వెళ్ళి దర్శనం చేసుకొచ్చేటప్పటికి ప్రాణం కడంటింది. తిరిగొచ్చిన తరవాత, ఏమయి ఉంటుంది దీనికి, సెల్ఫ్ అవలేదని, ఒక సెల్ఫ్ చేసి చూద్దామని నొక్కితే స్టార్ట్ అయింది, వెంఠనే. ఇదేమబ్బా ఉదయం అంత సేపు గుంజుకున్నా పని చేయనిది ఇప్పుడు వెంఠనే పని చేసిందని ఆశ్చర్య పోయా. ఆవిడమాత్రం ఏదో అనుమానంగా చూసింది, నాకేసి. సమాధానం చెప్పే స్థితి లేదు కనక బుర్రొంచుకున్నా. చెయ్యీ చెయ్యీ పట్టుకు నడిచి వెళ్ళి దర్శనం చేసుకు రావాలన్న కోరిక నెరవేరిందనుకోండి.:)

ఈ మధ్య రాజమంద్రి రెండు మూడు సార్లు వెళ్ళాల్సి వచ్చింది, ఒక సారి బలే అనుభవమే అయింది. ఉదయం 8.15 కి బండి, చాదస్తుడిని కదా ఒక అరగంట ముందే అక్కడున్నా. టిక్కట్టు కోసం లైన్ లో ఉన్నా. నేను రెండవ వాడిని. టిక్కట్టు ఖరీదు నాలుగు రూపాయలు, చేత్తో పట్టుకు నుంచున్నా. ఎంత సేపటికీ ముందతను కదలడు, కౌంటర్ క్లార్క్ టిక్కట్టివ్వటం లేదు. కారణమేమంటే మాట్లాడడు. మరి కొద్ది సేపటికి చెప్పేడు, కంప్యూటర్ పని చెయ్యటం లేదని. బండి వచ్చేస్తోందని ప్రకటనిచ్చేసేడు, ఇతను టిక్కట్లు ఇచ్చేలా లేడు, ఎలా? ఏం చెయ్యాలి. నాయనా టిక్కట్టు ఇవ్వడానికి యంత్రం సహకరించకపోతే ప్రత్యామ్నాయ మార్గం ఉండాలి కదా అంటే పలకడు. అలా నిలబడి ఉండగా గజేంద్రుడిని రక్షించేందుకు వచ్చిన విష్ణు మూర్తిలా మరొక క్లార్క్ వచ్చేడు, ఇతను కుస్తీ పట్టడం చూసి, పాస్ వర్డ్ సరి చూసినట్లు లేదని చెప్పి అతనేదో చేసి రెడీ చేసి కంప్యూటర్ ఇస్తే అప్పుడిచ్చాడు టిక్కట్ట్లు. బండి ప్లాట్ ఫారం మీదకొచ్చేసింది. గబగబా పరుగెట్టేం. నా వెనక పది మంది, ఎలాగో అందరం బండిలో పడ్డాం, అది వేరు సంగతి. ఒక వేళ నేను వెళ్ళడం ఆఖరు నిమిషం లో అయితే ఎలా ఉండేది? పరుగెట్టగలిగేవాడినా? యంత్రాన్ని పని చేయించుకోలేని లోపం కదా? ఎవరిననుకోవాలి? యంత్రాన్నా? యంత్రం వెనక మనిషినా?

అత్యవసరమైన పనిబడి ఊరుకెళ్ళడం కోసం రిజర్వేషన్ కోసం వెళ్ళమన్నా, అబ్బాయిని. ఎందుకునాన్నా! ఇక్కడే చేసేస్తా అని కంప్యూటర్ తీసుకుని మొదలెట్టేడు. వెతికితే కావలసిన రోజుకి కాని పక్క ముందురోజుకాని ఏ ఒఖ్ఖ బండీ ఖాళీ లేదు, పండగ హడావుడి కదండీ.డబ్బులు సంపాదించుకునేవాళ్ళకీ పండగే కదండీ. కొన్ని రిగ్రెట్లు, కొన్ని వైట్ లిస్ట్లు, సంఖ్య చూస్తే కళ్ళు తిరిగేలాగా ౭౫౦,౯౪౦ అలా ఉన్నాయి, హనుమంతుని తోకలా. టిక్కట్లు ఉన్న రోజు చూసుకుని టిక్కట్టు తీసుకోమన్నా. ఎదో చేసేడు. అన్నీ బాగానే అయ్యాయి కాని డబ్బులు చెల్లించే చోట ఎంత సేపటికీ అది పూర్తి చెయ్యటంలేదు. ఏ బటన్ నొక్కొద్దని ఒక సూచన మాత్రం కనపడుతూంది. ఇక్కడనొక్కండి, అక్కడనొక్కండి, ఎక్కడనొక్కినా, పీక నొక్కుకున్నా, ఇక్కట్లేగాని టిక్కట్లు రాలేదు, సొమ్ములు పోయాయి తప్పించి. విసిగి వేసారి, రెఫ్రెష్ చేస్తే ఊహు! కాలేదు మళ్ళీ చేసినా, కాని బేంకు అక్కౌంటులో మాత్రం డబ్బులు తీసేసుకున్నట్లు చూపుతోంది. ఇలా రెండు సార్లయ్యింది. టిక్కట్టు రాలేదు. గంట గడిచింది. డబ్బులు తీసుకున్నారు కదయ్యా, టిక్కట్టు రాలేదంటే, ఒక్కో సారి ఇలాగే జరుగుతాయి ఏం చేయలేము, ఇప్పుడు రెండు సార్లు తీసుకున్న డబ్బులు వారం రోజులలో మళ్ళీ మన అక్కౌంటుకు వస్తాయని చెప్పేడు, అబ్బాయి. మనకి అవసరానికి ఇది పని చెయ్యటం లేదు అంటే స్టేషన్ కెళ్ళి రిజర్వేషన్ చేయించుకొస్తానని వెళ్ళి చేయించుకొచ్చేడు. ఈ రిజర్వేషన్ల కోసం ఒక పూట గడచిపోయింది. డబ్బులు తిరిగి రావాలి. ఏం చేస్తాం. ఎవరిది పొరపాటు, మనది గ్రహచారం, వారఫలాలలో రాశాడు లెండి, ఇబ్బందులు పడతారని, అనవసర ఖర్చులని

ప్రకటనలు

రచయిత: kastephale

A retired telecom engineer.

27 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-ఒక్కోసారంతే.”

 1. హ్హ హ్హ “ఒక్కోసారంతే” శర్మ గారూ 😀.

  //“ఆవిడమాత్రం ఏదో అనుమానంగా చూసింది, నాకేసి.”// బాగా చెప్పారు 😀.

  ఆంగ్లంలో Murphy’s law అని ఒకటుంది, మీకు తెలిసే వుంటుంది. ఆ సూత్రం ప్రకారం “Anything that can go wrong will go wrong”. నిత్యజీవితంలో చాలా సందర్భాల్లో ఈ సూత్రం మనల్ని పరీక్షిస్తుంటుంది కదా 😀.

  మెచ్చుకోండి

  1. విన్నకోట నరసింహారావు గారు,
   అంతకి ముందు ఎంత గుంజుకున్నా స్టార్ట్ కానిది అప్పుడు వెంటనే అవడం అనుమానానికి తావిచ్చింది 🙂
   మర్ఫీ లా తెలియదండి ఇప్పుడు తెలుసుకోవడమే 🙂
   ధన్యవాదాలు.

   మెచ్చుకోండి

   1. ఈవార మనామకముల
    తో వాయింపులటవే యతోధికముగనన్ !
    కావాలని యెవరి టపా
    లో వెళ్ళకుమా జిలేబి లొడలొడ యనుచున్‌:)

    మెచ్చుకోండి

 2. ఒక్కోసారంతేగా ! ?
  అక్కజ మేముంది సారు ! అనుకున్నట్లే
  చక్కగ జరిగేను పనులు !
  ‘ ప్రక్కన ప్రక్కనె నడిచెడు ‘ భాగ్యము దొరుకున్ .

  మెచ్చుకోండి

   1. అంతా కుదురుకుంటుందని ఆశిస్తాను. మీరు నింపాదిగా ఉండండి.
    మీ కుశలం అడగడానికై మీకు ఫోన్ చేద్దామనుకున్నాను. కానీ ప్రస్తుతం ఖండాతరం వచ్చి, పగలు రేయి గానూ రేయి పగలు గానూ …… తూగుతూ జోగుతూ ఉండడం వల్ల కుదరలేదు.

    మెచ్చుకోండి

  1. విన్నకోట సారు ! విచ్చేసిరా యేమి
   మాతృదేశమునకు మంచిదార్య !
   సకల హితుల తరఫు సాదరస్వాగత
   మయ్య ! నరసరాయ ! మాన్యచరిత !

   మెచ్చుకోండి

   1. అవును మాష్టారు, ఆ శీతలం నుండి ఈ ఉష్ణానికి . అయినా …. జననీ జన్మభూమిశ్చ …. కదా. మీ అభిమానానికీ ధన్యవాదాలు.

    మెచ్చుకోండి

  2. విన్నకోట నరసింహారావుగారు,

   క్షేమంగా స్వదేశాగమనానికి శుభకామనలు.
   రెండు రోజులుగా కనపడలేదంటే వచ్చేస్తున్నారనే అనుకున్నా 🙂 వివరం తెలిపినందుకు
   ధన్యవాదాలు.

   మెచ్చుకోండి

 3. ఆహా! ఆ మెరకను విడి
  నే హాయిగ వచ్చినాడనే ! మన దేశ
  మ్మే హర్మ్యమయా మాచన !
  బాహాటమ్ముగ చెబితిని భాగ్యంబిదియే 🙂

  చీర్సు సహిత
  ఫారెను రిటర్ను నారసింహులకు 🙂

  జిలేబి

  మెచ్చుకోండి

  1. అంతే కదా “జిలేబి” గారు – ఎంతైనా మనదేశం మనదేశమే, కర్మభూమి.
   మీ అభిమానానికి ధన్యవాదాలు. సరళమైన పద్యం వ్రాసినందుకు మరింత సంతోషం ☺.

   మెచ్చుకోండి

   1. విన్నకోట నరసింహారావుగారు,

    పట్టాలిచ్చేస్తున్నారా? హృదయ కాష్ట ( హృదయశల్యం అనే ప్రయోగం విన్నాం) పదప్రయోగం చూళ్ళేదూ 🙂
    ధన్యవాదాలు.

    మెచ్చుకోండి

 4. “జిలేబి” గారి సరిగలవాడినా పట్టాలివ్వబోవన్, శర్మ గారూ? నా స్వదేశాగమనాన్ని స్వాగతిస్తూ వారు ప్రసాదించిన పద్యం ఆశ్చర్యంగా కాస్త సరళమైన పదాలు కలిగుండి నాకు కొంచెం అర్ధమయింది – అని మాత్రమే నా వ్యాఖ్య భావం అంతే 🙏 .

  “హృదయ కాలేయం” అనే పేరుతో ఆ మధ్యొక సినిమా వచ్చింది. ఆ పేరు విన్నప్పుడల్లా నాకు “జిలేబి” గారి పదప్రయోగాలు గుర్తొస్తాయి 🙂.

  మెచ్చుకోండి

  1. హృత్కాష్ఠంబను పదమున్
   తత్కా లమ్మున జిలేబి తరుణియు వేయన్
   గత్కా బట్టగ గురువుల్
   సత్కర్మంబాయె పద్య ఛందము గూర్చన్ 🙂

   జిలేబి

   మెచ్చుకోండి

   1. Zilebiగారు,

    ఎవరూ పుట్టించకపోతే మాటలెలా పుడతాయిట, కొత్తకొత్తవి పిచ్చపిచ్చవి పుట్టించెయ్యండి 🙂

    అరవపాటి నోట తెనుక్కి పట్టిన దశ

    ధన్యవాదాలు.

    మెచ్చుకోండి

   2. పాటినోటన తెల్గునీల్గెను పారుడచ్చట చెప్పెనే !
    మాటకైనను తెల్గుబల్కక ఆంధ్రులిచ్చట జోగగన్
    కోటగట్టెను పద్యమాలల గోకిచూడగ పూజ్యమే
    పాటగా అరవంపు మామియు పద్యమొక్కటి జేర్చెనే 🙂

    జిలేబి

    మెచ్చుకోండి

  2. విన్నకోట నరసింహారావుగారు,
   మరోరు పట్టాలివ్వక్కరలేదండి,స్వయంగా వీరతాళ్ళు వేసుకోగల సమర్ధులుకదా, జిలేబి అంటే 🙂

   కొన్ని ఇటుకలు బెందడి తక్కువయిందిట కట్టుబడికి. అబ్బో! ఇటువంటి మాటలు కోకొల్లలు లెండి 🙂
   ఏమని చెప్పుదు గురునాథా!
   ధన్యవాదాలు.

   మెచ్చుకోండి

   1. ఇటుకలు బెందడి తక్కువ
    గ టుకుటుకు మనుచు జిలేబి కందము జేర్చ
    న్నటువచ్చిన గురువు రమణి
    మటమట లను జూచి పద్య మా యిది యనిరే 🙂

    మెచ్చుకోండి

  1. టిమటిమల కొచ్చెను జిలే
   బి మస్తుగన్ తిప్పలేను; వివిధము సుమ్మీ
   గమకంబు జూడ తెలిసెన్
   సుముఖము గానట్టి లేమ సూక్షియె సుమ్మీ 🙂

   జిలేబి

   మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s