విన్నపం

 

మిత్రులందరికి.

ఈ బ్లాగులో పునః ప్రచురణ మానివేశాను. నా ఇల్లాలు 06.09.2018 వ తేదీన స్వర్గస్థురాలయింది. ఆమె జ్ఞాపకార్ధం నా బ్లాగు టపాలను ఈ బుక్కులుగా ప్రచురిస్తున్నాను.

కష్టేఫలే బ్లాగులో రాస్తున్నాను.

https://kastephale.wordpress.com

అడబాల శ్రీనివాస్ గారు, మిమ్మల్ని మరచిపోలేదు.
దయ ఉంచండి
శర్మ

శర్మ కాలక్షేపంకబుర్లు-పాలకోసం రాళ్ళుమోయడం !

Posted on ఏప్రిల్ 30, 2013
24

పాలకోసం రాళ్ళు మోయడం.

“పాలకోసం రాళ్ళు మోయడం”అనే నానుడి తెనుగునాట విస్తృతంగా వాడతారు. దీని అర్థం విస్తృత ప్రయోజనం కోసం కష్టపడటమని చెప్పుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే ఉదాహరణ, ఒక సామాన్యుడు తన కొడుకు/కూతురు అభివృద్ధికోసం పగలు ఉద్యోగం చేస్తూ రాత్రి కూడా కష్టపడి సంపాదించి వారి చదువు కోసం కష్టించడం, ఇలా చెప్పుకోవచ్చు. మరి దీనికి పాల కోసం రాళ్ళు మోయడానికి సంబంధం ఏమని కదా మీ ప్రశ్న, అదుగో అక్కడికే వస్తున్నా.


పాడి పంట అన్నారు కదా! పల్లెలలో ఉదయమే పొలం వెళ్ళడం అలవాటు చేసుకోడం కోసమనీ, పాలు పితుక్కుని తెచ్చుకోడంకోసమనీ, పొలం చూసుకోడం కోసమనీ, బహుళ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని, పశువులను పొలంలో ఉంచేవారు, పశువులకు తగినంత మేత అక్కడే ఉంటుంది కనక, ఒక పాక వేసి పశువులను అందులో కట్టేవారు. పాడి పశువులను ఇతర పశువులనుంచి వేరుగా ఉంచేవారు కూడా. ఉదయమే పొలం వెళ్ళి, వస్తూ పాలు పితుక్కుని వచ్చేవారు. ఈ పాలు ఇంటికి తేవడమెలా? ’పాల తప్పేలా’ అని ఉండేవి, ఇవి బిందె ఆకారం లో చిన్నవిగా ఉంటాయి. ఈ పాల తప్పేలా తేవడానికి రెండు మార్గాలు. ఒకటి, తప్పేలా కి ’ఉగ్గిలి’ వేసి తేవడం, రెండు ఒక కావడిలో తేవడం. ఉగ్గిలి వేసి తెచ్చే సందర్భంలో పాలు తొణికే సావకాశం ఉండి నేల పాలయ్యే సావకాశం ఉంది.


“ఉగ్గిలి”

దానికి తోడు పాల తప్పేలాని చేతితో తాకే సావకాశం ఉంది. ఇక్కడ పాలతప్పేలా గురించి చెప్పాలి. దీనిని ఇత్తడితో తయారు చేస్తారు, ఈ తప్పేలాని రోజూ శుభ్రంగా చింతపండుతో ముందు తోమి తరవాత వెలిబూడిదతో తోమి, కడిగి ఎండలో బోర్లిస్తారు, తప్పేలా బంగారపు రంగులో మెరుస్తూ ఉంటుంది, ఎందుకూ, కారణం ఏ సందర్భంలో కూడా పాలు విరిగిపోకుండా ఉండటానికి, ఆరోగ్యంగా ఉండటానికీ. ఇదే పాలున్న తప్పేలాని కావడిలో తెస్తే పాలు తొణకవు, నేలపాలూ కావు. ఇక్కడ కావడి గురించీ చెప్పుకోవాలి. సాధారణంగా కావడి మట్లు( పక్కనుండే వాటిని మట్లు అంటారు) నేలకు ఒక అడుగు ఎత్తులో ఉంటాయి. అదే పాల కావిడికి అవి భూమికి బాగా ఎత్తులో ఉంటాయి. ఈ పాల తప్పేలాని ఒక పక్క మట్టు అనగా కావడి ఒకవైపు లో పెడితే రెండవ వైపు తేలిపోతుంది కదా! తేవడం కష్టం కదా అందుకు సరి సమానమయిన బరువున్న ఒక రాతిని కావడి రెండవ మట్టులో వేసుకుని తూకం సరి చూసుకుని పాలు ఇంటికి తెచ్చేవారు. ఇదిగో అలాగ రోజూ పాలు కోసం ఒక రాతిని ఇంటికీ పొలానికి మోసేవారు. అదిగో అలా పాలకోసం రాళ్ళు మోయడం వచ్చింది. దీని మూలంగా ఉపకారం ఉంది కూడా, పశువు ఇస్తున్న పాలు తగ్గినా రాయి మార్చవలసివస్తుంది, దానితో ఆ విషయం తెలుస్తుంది. మరి ఇంటినుంచి పొలం వెళ్ళేటప్పుడెలా? రాతిమోత, అనుమానం రావచ్చు, ఇంటినుంచి ఆ పాల తపేలాలో శుభ్రమైన నీళ్ళు పట్టుకెళ్ళేవారు, ఈ నీళ్ళు కావడి తూకానికి సరిపోవడమే కాక పశువు పొదుగును పాలుతీసేముందు కడగడానికి తన చేతులు కడుగుకోడానికీ ఉపయోగించేవారు. ఆ రోజులలో పొలాలలో శుభ్రమైన నీరు దొరికే సావకాశాలు తక్కువగా ఉండేవి. ఇప్పుడు చెప్పండి మన పూర్వులు తెలివి తక్కువవారా? ఊరికే మోశారా రాళ్ళు. పాలకోసం రాళ్ళూ మోయడం తెలిసిందికదా!

శర్మ కాలక్షేపంకబుర్లు-శివుడు శ్మశానంలో ఎందుకుంటాడు?

పనిలో ఉన్నారా? ఫరవాలేదు, మీ పని చేసుకుంటూ, ఒక చెవి ఇటు పడేసి మహన్యాసం వినండి.

శివుడు శ్మశానంలో ఎందుకుంటాడు?

ఈ ప్రశ్న నాది కాదు, ఈ అనుమానం సాక్షాత్తు అమ్మవారికే వచ్చి, అయ్యవారిని నిండుకొలువులో అడిగేసింది, (భారతం. అనుశా.ప. అశ్వాసం….4….418 నుండి443 వరకు స్వేఛ్ఛానువాదం.) ఆ కధాక్రమంబెట్టిదంటే………

శంకరుడు కైలాసంలో దేవతలు, సిద్ధులు, సాధ్యులు, విద్యాధరులు,మునులు,భూతగణాలు నిండిఉన్న కొలువులోఉన్న,ఆ సమయంలో గౌరీదేవి వెనుకనుంచి వచ్చి, శంకరుని రెండుకళ్ళూ తనచేతులతో మూసింది. లోకాలన్నీ చీకట్లుకమ్మేయి, జీవులన్నీ సంక్షోభం చెందాయి.. శంకరుడు మూడవనేత్రం తెరిచారు. హిమనగం మండిపోవడం మొదలయింది. అది చూసిన గౌరి ”స్వామీ మూడవకన్ను తెరిచారేమీ? దానివల్ల నా తండ్రి హిమవంతునికి బాధ కలిగిందని” వేడుకుంది, ”మూడవకన్ను తెరవడానికి కారణం రహస్యమైతే చెప్పద్ద”ని ముద్దుగా అలిగింది కూడా. అందుకు శంకరుడు కరుణగా చూడగా, హిమనగం మామూలయింది. ”గౌరీ, నీకు తెలుపకూడని రహస్యాలు నాకులేవని, నేను లోకాత్మకుడిని, సర్వలోకాలు నన్నుపట్టి ఉంటాయి. నువ్వు నా రెండుకళ్ళూ మూశావు, లోకాలు చీకటి, సంక్షోభం చెందాయి, అందుకు మూడవకన్ను తెరవాల్సివచ్చింద”న్నారు. ఆ! ఇది మంచి సమయం, ఉన్న అనుమానాలన్నీ తీర్చేసుకుంటాననుకుని ప్రశ్నల వర్షం కురిపించడం మొదలెట్టింది.

”మీకు నాలుగు ముఖాలెందుకున్నాయి?”

”ఒకప్పుడు సుందోపసుందులనేవారు ఉండేవారు.వాళ్ళులోకాలను బాధిస్తుండేవారు. మయుడు లోకంలోని అన్ని అందాలను పోతపోసి ఒక స్త్రీని సృస్టించి నా దగ్గరకు తెచ్చాడు. అది నాకు ప్రదక్షిణంగా నా చుట్టూ తిరిగింది. ఆమెను నాలుగు దిక్కులా నిశితంగా పరిశీలించడం కోసం నాలుగు ముఖాలు ధరించాను, అప్పటినుంచి చతుర్ముఖుడనయ్యాను.”

”మీకు కంఠం మీద నల్లమచ్చ ఏమి?”

”దేవతలు, దానవులు కలిసి పాలకడలి మధించినపుడు వచ్చిన హలాహలాన్ని మింగి అక్కడ ఉంచాను. అందుకు అక్కడ మచ్చ ఏర్పడింది. ఇంకా ఏమయినా ప్రశ్నలుంటే అడగ”మన్నారు, శంకరులు.

”పినాకమనే విల్లు ధరిస్తారు కారణం చెప్ప”మంది గౌరి.

”కణ్వుడనే మహాముని ఆదియుగం లో తపస్సు చేశాడు. ఆయనపై పుట్టలు మొలిచాయి. ఆ పుట్టమీద ఒక వెదురుపొద మొలిచింది, అది చాలా అద్భుత పరిమాణంలో పెరిగింది. బ్రహ్మగారు ఆమునికి వరాలిచ్చి, ఆ వెదురునుంచి మూడు విల్లులు తయారు చేశారు. ఒకటి పినాకము,నా దగ్గర ఉన్నది. రెండవది శార్ జ్గము, ఇది విష్ణువు దగ్గర ఉన్నది. మూడవది తాను తీసుకున్నారు . అప్పటినుంచి పినాకం చేతిలో ఉండటం మూలంగా పినాకపాణి అని నాపేరు”.

”లోకంలో మరేదీ వాహనం లేనట్టు ఎద్దును వాహనం చేసుకున్నారేమీ?” గౌరి ప్రశ్న.

”హిమనగం దగ్గర తపస్సు చేసుకుంటున్నా. చుట్టూ గోవులు చేరిపోయాయి, చాలా బాధపెట్టేయి. కోపంగా చూడగా సంతాపం చెందేయి. అప్పుడు విష్ణుమూర్తి వృషభాన్ని నాకు కానుకగా ఇచ్చారు. నాకు ‘గోపతి’ అని పేరుకూడా పెట్టేరు. అప్పటినుంచి ఎద్దు నా వాహనమైనది.”

”మీరేమో పరమ శుచిమంతులు, మంచి ఇంట్లో వాసం చేయక శ్మశానం లో ఉన్నారేమి స్వామీ?”

”భయంకరమైన భూతాలు, ప్రజలను చంపుతూ బాధలు పెట్టేవి. అప్పుడు బ్రహ్మగారు నా దగ్గరకొచ్చి ’శివా! జీవులను కాపాడే మార్గం చూడవయ్యా’ అని అడిగితే భూతాల నివాసమైన శ్మశానం లో నివాసం ఏర్పాటు చేసుకున్నా, అవి నా కనుసన్నలలో ఉండటంతో లోకాలు రక్షింపబడ్డాయి. మోక్షపరులు ఇది శుచిస్థానం అంటారు, జనం తిరగరు, అందుకు ఇక్కడనుంచి లోకాలను రక్షించాలనుకున్నా”.

”ఈ బూడిద రాసుకోడం, పాములు ధరించడం, శూలం,పరశువులు ఆయుధాలు, భీకరమైన రూపం ఏమి స్వామీ?.”

”లోక స్వరూపం రెండు రకాలు. ఒకటి శీతం, రెండవది ఉష్ణం. ప్రపంచం ఈ రెంటితోనే ఉంది. సౌమ్యం విష్ణువు, ఆగ్నేయం నేను, విశ్వాన్ని భరిస్తాను, అందుచేత వేడి, భయంకరమైన రూపం ధరిస్తాను”

”మరి చంద్రవంకను నెత్తిన ఎందుకు ధరిస్తారు?”

”దక్షయజ్ఞ సమయంలో నేను దేవతలని బాధించాను, ఆ సమయంలో చంద్రుడిని కాలితో తొక్కేను, చంద్రుడు నన్ను శరణు వేడాడు, ’అయ్యో! పొరపాటు చేసేననుకుని చంద్రుడిని నెత్తి మీద పెట్టుకున్నాను”

అమ్మకి వచ్చిన అనుమానాలని శంకరులు తీరిస్తే వివరాలు అందరికి తెలిశాయి. అమ్మకివన్నీ తెలియవా? తెలుసు పిల్లలకి తెలియచేయాలని అమ్మ చేసిన చిన్న మాయ.

నమః శOభవేచ/ మయోభవేచ/ నమః శంకరాయచ/ మయస్కరాయచ/ నమః శ్శివాయచ/ శివతరయాచ/

ఈశాన సర్వ విద్యానాం/ ఈశ్వర సర్వభూతానాం/ బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా/ శివోమే అస్తు సదా శివోం/.

శర్మ కాలక్షేపంకబుర్లు-ఆత్మారాం.

Posted on నవంబర్ 19, 2012
8
ఆత్మారాం.

అత్మారాం గారికోటకి తొమ్మిది ద్వారాలు. కాని ఒక దావి ద్వారానే లోపలికి ప్రవేశం. మిగతావి నిషిద్ధం.

నిజానికి అది అత్మారాంగారి కోట, కాని అది నాదే అని చెప్పుకుంటాడు మనోసేన్ గారు. ఈ మనోసేన్ గారు అక్కడి అధికారి. అక్కడ శబ్దమిత్రాగారు మొదటి సేవకుడు. ఈయన ఆకాశ్ శుక్లా గారి ప్రతినిధి. ఈ రాజ్యానికి సంబంధించి అంతా నేనే వింటానని ఆయన గర్వం. విన్నది ప్రతీదీ మనోసేన్ గారికి మరుక్షణం విన్న వించుకుంటాడు. మనోసేన్ గారు శబ్దమిత్రా గారు ద్వారా వచ్చిన విషయం గ్రహించి, రసమిత్రా గారిద్వారా జవాబిప్పిస్తూ ఉంటాడు. ఇది శబ్దమిత్రా గారికి నచ్చదు. రెండవవాడు స్పర్శమిత్రా గారు. ఈ కోటకి సంబంధించిన ప్రతిది బాగుంది, బాగోలేదు, వేడిగావుంది, చల్లగా వుంది అన్నీ చూస్తూ వుంటాడు. ఈయన వాయుశుక్లాగారి ప్రతినిధి. ఇక మూడవవాడు రూపామిత్రా, ఈయన తక్కువ వాడు కాదండి, అగ్ని శుక్లాగారి ప్రతినిధి అయినా, ఈయన అన్నీ చూసేస్తూ ఉంటాడు, వెంట వెంటనే మనోసేన్ గారికి విషయం అందించేస్తూ ఉంటాడు. ఇది కావాలి, ఆది కావాలి, అదిబాగుంది, ఇది బాగోలేదు,ఇది అందంగా ఉంది వగైరా, అబ్బో! అసలు చిన్నెలన్నీ ఈయనవే. బాగుందనుకున్న వెనకే పోతూ ఉంటాడు. మనోసేన్ గారిని చెడకొట్టడం లో మొదటివాడు. మనోసేన్ గారు విభజించి పాలించడంలో దిట్ట. ఈయన రూపామిత్రా గారి దగ్గరనుంచి వచ్చిన విషయాన్ని చూసి, రసమిత్రాగారి ద్వారాగాని, స్పర్శమిత్రా గారి ద్వారాగాని పని చేయించుకుంటు వుంటాడు. నాలుగోవాడు రసమిత్రాగారు, ఈయన ఆపశ్శుక్లాగారి ప్రతినిధి. ఈయనకి నోరెక్కువ, టెక్కెక్కువ. అందరికి శక్తికి అవసరమైన ఇంధనం తన ద్వారా ఇస్తానని ఈయన టెక్కు. పేర్లు పద్దులూ పెట్టడానికి ఈయన తరవాతే మరెవరయినా. ఐదోవాడు కాని గట్టివాడు గంధమిత్రా గారు. ఈయన భూమీశుక్లాగారి ప్రతినిధి. మరో ముఖ్యమైన పని చేసే వాయుసేన్ గారు నిమిషానికి పద్నాల్గు సార్లు వచ్చి వెళుతూ ఉంటాడు, ఈ కోటలోకి, అదీ గంధమిత్రా గారి ద్వారా. ఈయనిలా వచ్చి వెళ్ళకపోతే కోట పని గోవిందా! ఈ మిత్రాలందరికీ ఒకరంటే ఒకరికి పడదు. నేను గొప్పంటే నేను గొప్పనుకుంటారు. బయటికి మాత్రం అందరూ భాయీ భాయీ. ఈ సంగతి మనోసేన్ గారికీ తెలుసు. వీరంతా మనోసేన్ గారి అదుపాజ్ఞలలో పని చేస్తారు. మనోసేన్ గారు చెప్పకపోతే ఎదురుగా వున్నది కూడా, చూడలేడు, రూపామిత్రా గారు. అలాగే మిగిలిన అందరూ. కాని వీరందరికి మనో సేన్ గారంటే మంటే. మన చేత పని చేయించుకుని గొప్పతనం ఆయన కొట్టేస్తున్నాడు, అత్మారాంగారి దగ్గరని వీరి మంట.

మిత్రాలందరికీ మనోసేన్ గారంటే మంట. ఆయన గొప్పేంటీ? మనలాటి వాడేకదా, అంచేత ఈయనకి, మాతో నువ్వూ సమానమే, అని చెప్పాలని అనుకున్నారు మిత్రాలంతా. ఓ మీటింగేసి కలుసుకుని మాట్లాడుకున్నారు. మనోసేన్ గారూ! మీరూ మాతో సమానమే, మేము పని చేస్తూ ఉంటే మీరేదో సమన్వయం చేస్తున్నానని చెప్పి పోజు కొడుతున్నారు, ఇక ముందు కుదరదని చెప్పేసేరు. దానికి ఆయనకి కోపం వచ్చి, అదేమీ కుదరదు, మీరు నేను చెప్పినట్లు చెయ్యాలిసిందే, అన్నాడు. తగువు తేలలేదు. తగువు బ్రహ్మదేవ్ గారి దగ్గరకెళ్ళింది. ఆయనందరికి నచ్చచెప్పి, ఎవరు ఏపని చేసేటపుడు వారు గొప్ప సుమా. అందుకని మీరు గొడవపడి కోటని పాడు చేయకండి అని చెప్పేరు. అందరూ ఊకొట్టేరు కాని వాయుశుక్లాగారు కదలలేదు. నేను నిమిషానికి పద్నాలుగు సార్లు వచ్చి వెళ్ళకపోతే వీళ్ళంతా చేసేదేమీ ఉండదు కదా, ఈ రాజ్యం భూ స్థాపితం చెయ్యాలి కదా అని అన్నాడు. అప్పుడు బ్రహ్మదేవ్ గారు అది నీచేతిలో నా చేతిలో లేదు, కోటకి అసలు రాజు ఆత్మారాం గారు. ఆయన చేసుకున్న మంచి చెడ్డలను బట్టి నువ్వు వచ్చి వెళ్ళడం ఉంటుంది కనక మీరంతా నిజాయితీగా ఆత్మారాంగారి రాజ్యంలో పని చెయ్యండని పంపేసేరు. ఇంతకీ ఆత్మారాం గారు ఉలకడు పలకడు.

అర్ధం కాలేదా!
పంచేంద్రియాలు మేము గొప్పంటే మేముగొప్పని తగవులాడుకుని, బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళిన సందర్భం లో భారతం నుంచి ఒక కధకి చిన్న చిన్న మార్పులతో……
మిత్రాలంతా చెవి, చర్మం, కన్ను, నోరు,ముక్కు. పంచేంద్రియాలు.
శుక్లాలంతా పృధివి,ఆపస్, తేజో, వాయు,ఆకాశాత్. పంచ భూతాలు.
ఐదుగురు మిత్రాలపై స్వారీ చేసే మనోసేన్……..మనసు.
ఆత్మారాం…. మనిషి, ఇప్పుడు మరోసారి చదవండి 🙂

కరంట్ సరిలేక ఎప్పుడో రాసిన పాత టపాలు వెతికి వేస్తున్నా.

శర్మ కాలక్షేపంకబుర్లు-గురువు

Posted on డిసెంబర్ 5, 2012
7
గురువు

గు శబ్దం అంధకారశ్చ రు
శబ్దం తన్నిరోధకః
అంధకార నిరోధత్వాత్
గురురిత్యభిధీయతే.

గురువు అనేది మూడు లఘువుల మాటయినా బరువైనదే. గురువు అంటే బరువు అని కూడా అర్ధం ఉంది. గురువు అంటే అజ్ఞానమనే అంధకారాన్ని విజ్ఞాన మనే జ్యొతిని వెలిగించడం ద్వారా దారి చూపేవాడని అర్ధం. మన సంస్కృతిలో ఉన్నది ఇదీ..

సదాశివ సమారంభాం
శంకరాచార్య మధ్యమాం
అస్మదాచార్య పర్యంతం
వందే గురుపరంపరాం.

సదాశివుడు తో ప్రారంభమైన గురుపరంపరలో మధ్యవాడుగా శంకరాచార్యుడు చివరగా నా గురువు తో కలిపి గురుపరంపరకి నమస్కారం చేసే సంస్కృతి లో పుట్టి పెరిగినవాళ్ళం. రాముని అస్త్ర గురువు విశ్వామిత్రుడు, కృష్ణుని గురువు సాందీపని గణుతికెక్కిన వారు.ఆ తరవాత చాలా మంది గురువులు గణుతికెక్కేరు. ఆ కాలం లోనే అనుమానింప బడ్డ గురువులు చండామార్కులు,హిరణ్య కశిపుడు, హరిభక్తిని గురువులే నేర్పుతున్నారేమో ప్రహ్లాదునికి, అని అనుమానపడ్డాడు. పాపం ప్రహ్లాదుడు గురువుల పరువు కాపాడుతూ,

చదివించిరి నను గురువులు, సదివితి ధర్మార్ధముఖర శాస్త్రంబులు నే
జదివినవి గలవు పెక్కులు, చదువులలో మర్మమెల్ల జదివితి దండ్రీ!

నేను చదువులలో మర్మం చదువుకున్నా, గురువులు నాకన్నీ చెప్పేరన్నాడు.మరో అనుమానంతో చూడబడిన గురువు ద్రోణుడు. నీకు అర్జునుడంటే అభిమానం, సరిగా యుద్ధం చెయ్యటం లేదనే అనుమానం దుర్యోధనుడు, ద్రోణుని ఎదుటే వెలిబుచ్చాడు. పాపం! ఆ గురువు ఎంత ప్రయత్నించినా విధిని దాట లేడు కదా!

వీరిని కూడా గురువులుగా చెప్పేరు.
1. వాచక గురువు
2. భోధక గురువు.
3. కీచక గురువు.
4. నిషిద్ధ గురువు.
5. పరమ గురువు.

వీరిలో మొదటివారు సాధారణంగా తల్లి. ఆ తరవాత రెండవవారు అక్షరాలు నేర్పి దిద్దించిన గురువు. మూడవ వాడయిన కీచక గురువు దుర్భోధ చేసేవాడు, ఇతడూ గురువే. నాల్గవ వాడు నిషిద్ధ గురువు, తను తప్పు చేస్తూ మన చేత తప్పు చేయించేవాడు. ఐదవ వాడయిన పరమ గురువు ఇహపర సుఖాలలో పరం గురించి చెప్పేవాడు. మన వారు విద్యని రెండు భాగాలు చేసేరు. 1.పరా విద్య 2.అపరా విద్య. పరావిద్య భగవంతుని చేరుకునే విధానం, తత్సంబంధమైన విషయాలను చెప్పేది. రెండవది ఆపరా విద్య, పొట్టకూటి కోసం నేర్చుకునే విద్య. ఇప్పుడు మనం నేర్చుకుంటున్న విద్యలన్నీ అపరా విద్యలే.చాలా ముఖ్యులు, కీచక గురువు నిషిద్ధ గురువు. పైవారిద్దరినీ గుర్తించడం లో, వదిలించుకోడంలో మన విజ్ఞత ఉంటుంది. వీరే అంత తొందరగా వదలనివారు.

విద్య నేర్చే విధానాలూ చెప్పేరు, మనవారు చూడండి

గురు శుశ్రూషయావిద్యా, పుష్కలేన ధనేనవా
అధవా విద్యయావిద్యా కణశః క్షణశ్చైవ విద్యా మర్ధస్య సాధయేత్.

గురు శుశ్రూష చేసి విద్య నేర్చుకోవాలి, పుష్కలంగా సొమ్మిచ్చి నేర్చుకోవాలి, లేదా ఒక విద్య ఇతరులకి నేర్పి మరొక విద్య వారి దగ్గరనుంచి నేర్చుకోవాలి, ఏమయినా కొద్ది కొద్దిగానయినా ప్రతి క్షణం విద్య నేర్చుకోవాలి.

ఒకప్పుడు గురువు దగ్గర శుశ్రూష చేసి విద్య నేర్చుకోవలసివచ్చేది. గురువు అరమరికలు లేక అన్న వస్త్రాలిచ్చి విద్య నేర్పేవాడు. తరవాత కాలంలో గురువు విద్య నేర్పేవాడు, శిష్యుడు వారాలు చేసుకునేవాడు. వారాలు చేసుకోవడమంటే, కలిగిన గృహస్థు వారంలో ఒక రోజు విద్యార్ధికి రెండు పూటలా భోజనం పెట్టడం. ఆ రోజుల్లో ఇలా భోజనం పెట్టేవారు, చదువుకునేవారికి. పదివేల మంది శిష్యులకి అన్న వస్త్రాలిచ్చి విద్య నేర్పేవాడిని కులపతి అనేవారు. పశ్చిమ దేశాలలో చదువు గురించి తెలియని రోజులలో మన దేశంలో విశ్వవిద్యాలయాలున్నాయి! నలంద, తక్షశిల అటువంటి విశ్వవిద్యాలయాలే. మన దేశం మీద దండయాత్రలు సాగిన కాలం మొదలు మన సంస్కృతి మీద కూడా దాడి జరిగింది. అది గత మూడు వందల సంవత్సరాల కితం పూర్తిగా ప్రారంభమై ఇప్పటికీ కొన సాగుతోంది. ఏ విద్య అయినా విదేశీయులు చెప్పినదే తప్పించి, మన దేశం లో విద్య లేదనే వర్గం కూడా ఒకటి బయలుదేరిందీ మధ్య.

ప్రభుత్వాలు కూడా విదేశీయమైన విద్యే విద్య కాని, స్వదేశీయమైనది విద్య కాదన్న ధోరణిలో ఉన్న మూలాన కొద్దిగా మిణుకు మిణుకు మంటున్నవి కూడా మలిగిపోయాయి. ఒక చిన్న ఉదాహరణ, ఒకప్పుడు తమిళ్ నాడు లో ఒక రైలు ప్రమాదం జరిగి బోగీలు నీటిలో మునిగిపోతే పైకి తీసే విద్య లేకపోయిందనీ, ఇంజనీర్లవల్ల కాలేదనీ, ఆ బోగీలని మన చదువుకోనివారనుకున్న వారు చాలా సులభంగా బయటకు తీశారని చెబుతారు. ఇది విద్య కాదా? పుస్తకాలలో రాసిందే విద్యకాని మస్తకాలలో రాసింది కాదని, నేటి వారి ఉవాచ. పుస్తకాలలో రాసినది పూర్తివిద్య అయినపుడు, చూసి చదువుకోవచ్చుగా, మళ్ళీ గురువెందుకూ? పుస్తకంలో రాసినది పూర్తికాదనీ, మస్తకంలోది కూడా జత చేస్తేనే అది పూర్తి విద్య అనీ తెలుస్తోందిగా.

పూర్వ కాలంలో విద్య రాజాశ్రయంతో వర్ధిల్లింది. రాజు గురుకులం నడవడానికి తగు ఆర్ధిక సాయం తప్పించి మిగిలినవాట్లో తలదూర్చేవాడు కాదు. నేడు ప్రభుత్వం ఆర్ధిక సాయంతో పాటు పెక్కు విషయాలలో తలదూరుస్తూ ఉంది. మరొక సంగతి, విద్య వ్యాపార వస్తువైపోయింది. సరియైన భవనాలు, విద్య నేర్పే వసతులు, గురువులు లేకుండానే విద్యా సంస్థలున్నాయి. వాటికి ప్రభుత్వం సాయం చేయడమేకాక యాజమాన్య సీట్లు ఇచ్చి ఇతోధికంగా తోడ్పడుతూ ఉంది. ఇటువంటి సమయం లో గురువెలా ఉన్నాడు? గురువుల మీద రాని నిందలేదు. అందరూ అలా ఉన్నారనను కాని తాచెడ్డకోతి వనమమంతా చెరిచిందన్న సామెతగా గురువులందరూ అటువంటి వారే అంటున్నారు. గురువులపై నిందలలో అమ్మాయిలను లైంగికంగా వేధించడం, వాతలు పెట్టినట్లు, కొట్టినట్లు, మొన్న నీ మధ్య మా ఊరిలో జరిగిన సంఘటనలో మూత్రం తాగించినట్లు ఆరోపణలొస్తున్నాయి. కొన్ని సాక్షాలతో ఋజువవుతున్నాయి. కొన్నిటికి ఆధారాలు లేకపోయినా మీడియా వారి అత్సుత్సాహంతో, పోటి సంస్థల జోక్యంతో విషయం పెడదారి పడుతోంది. ఆ గురువుకు నిజం చెప్పే సావకాశం కూడా ఉండటం లేదు. మీడియా న్యాయ నిర్ణేత పాత్ర వహిస్తూ ఉంది. ఈ సంప్రదాయం మంచిది కాదు. గురువులు కూడా పరిధి దాటిన సంఘటనలు, అక్కడక్కడ కనపడుతున్నాయి.

భారత ప్రభుత్వం వారు చెయ్యి చేసుకున్న గురువుకి మూడు సంవత్సరాలు కఠిన కారాగార శిక్షతో చట్టం తీసుకు రాబోతోందిట. దీని మూలంగా నలిగిపోయేవారెందరో చెప్పలేము. ఏపాటి చిన్న భేదాభిప్రాయానికి కూడా దీనిని ఉపయోగించే సావకాశం లేకపోలేదు. సెక్షన్ 498A కేసులు, ఎస్.సి,ఎస్.టీ అట్రాసిటీ కేసులలా ఈ చట్టం కూడా దుర్వినియోగం జరిగే సావకాశాలే ఎక్కువగా ఉన్నాయి. గురువిక మాట్లాడే పని, మందలించే పని, ఇతరత్రా బుద్ధి చెప్పే పని లేదు కనక భారత పౌరులు వెలిగిపోతారనుకోవచ్చు.

ఒక వార్త చూశా, నెదర్లేండ్ లో ఒక తెనుగు జంటని అరస్టు చేసేరట, ఇంతకీ వారు చేసిన పాపం, బిడ్డని మందలించారట, ఆ బిడ్డ వెళ్ళి బడిలో చెబితే, తల్లి తండ్రులను అరస్టు చేశారట, ఇప్పుడే తెలిసింది, 18 నెలలు జైలు శిక్ష కూడా వేసేరట, మరిక భవిష్యత్తులో పౌరులెలా ఉంటారో పరమాత్మకే ఎరుక.

శర్మ కాలక్షేపంకబుర్లు-సూర్య జయంతి

Published on 26.01.2015

కనిపించేవాడు దైవం కాదా?-సూర్య జయంతి

“పృధివ్యాపస్తేజోవాయురాకాశాత్” ఇవి పంచభూతాలు. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు తన్మాత్రలు. ఆకాశం నుంచి వాయువు, వాయువునుంచి అగ్ని, అగ్ని నుంచి జలం, జలంనుంచి భూమి పుట్టేయని శాస్త్రాలు చెబుతున్నాయి, నేటి సయిన్సూ చెబుతోంది. అకాశానికి ఒకటే గుణం శబ్దం, మానవ శరీరంలో ఇంద్రియం చెవి, వాయువుకు రెండు గుణాలు శబ్దం స్పర్శ, మానవ శరీరంలో ఇంద్రియం చర్మం. తేజస్సు, దీనికి ఖగోళం లో సూర్యుడూ, భూమి పై నిప్పు ప్రతీకలు,ఈ భూతానికి మూడు గుణాలు శబ్ద, స్పర్శ, రూపాలు. ఇంద్రియం కన్ను. నాల్గవది జలం దీనికి నాలుగు గుణాలు. శబ్ద,స్పర్శ,రూప, రసాలు, ఇంద్రియం నోరు. చివరిది భూమి దీనికి ఐదు గుణాలు శబ్ద,స్పర్శ, రూప,రస,గంధాలు. ఇంద్రియం ముక్కు. పంచ భూతాలకి మానవ శరీరం లొ ఉన్న ఇంద్రియాలు, వీటిని జ్ఞానేంద్రియాలంటాం.

తేజస్సు అంతరిక్షంలో సూర్యునిగాను, భూమి మీద అగ్నిగాను కనపడతాయి. సూర్యుడు మిగిలిన నాలుగు భూతాలతో సంపుటీ కరణం చెంది, ఈ సర్వ జగత్తుకూ కారణమవుతున్నాడు. అలా భూమిపై పుట్టిన జీవులలో మానవుడు సర్వ శ్రేష్ఠుడు అన్నారు, జంతూనాం నరజన్మ దుర్లభం, శంకరులన్నారు. ఇలా పుట్టిన జీవులు మరలా భూమినుంచి సూర్యుని ద్వారా తయారైన ఆహారం తీసుకుని పెరుగుతున్నాయి. పెరుగుతున్న జీవులు పెద్దవవుతున్నాయి. పెద్దవైన ప్రాణులు భూమినుంచి సూర్యుని ద్వారా ఇవ్వబడిన ఆహారం, పురుషులలో శుక్రంగాను, స్త్రీలలో శోణితంగానూ పరిణామం చెంది, వారి కలయిక ద్వారా మరలా జీవులు పుడుతున్నాయి. వయసు మళ్ళితే మరణిస్తున్నాయి. మరణిస్తే మరలా సూర్యుని దయవల్లే బూడిదవుతున్నాయి, మట్టిలో కలసిపోతున్నాయి. మట్టిలో పుట్టి, మట్టిలో పెరిగి, మట్టిలో కలియడానికి అన్నిటికి సూర్యుడే కారణం. ఇది కాలంలో జరుగుతోంది, ఈ కాలం కూడా సూర్యుని వలననే ఏర్పడుతోంది, పగలు, రాత్రుల రూపంలో. జీవుల ఆరోగ్యానికి కారకుడు,ఆలోచనలకు కారకుడు, అనారోగ్యానికి కారకుడు, మనుషులకు కావలసిన సర్వ వస్తువులూ భూమి ద్వారా సమకూర్చేవాడు సూర్యుడు. ఇంత చేస్తున్న సూర్యుడు దేవుడు కాదా? సూర్యుడు కనపడని రోజును దుర్దినం అంటారు, ఆ రోజు భోజనం చెయ్యనివారూ ఉంటారు, ఇదేమి మూఢనమ్మకమని కదా అధునికులవాదన, కాని ప్రకృతికి దగ్గరగా జీవించడమని ఆచరించేవారి వాదన.

Image courtesy: also see post.

http://navarasabharitham.blogspot.in/2014/03/blog-post.html

ఆరోగ్యం కోసం ఈ కింది శ్లోకం పారాయణ చెయ్యండి. ఉదయించే, అస్తమించే సూర్యుని చూడకండి. ఉదయించిన అస్తమయానికి ముందు సూర్యుని చూడండి. సూర్యుడికి మతాలు, కులాలూ లేవు, అందరిపట్లా ఒకలాగే ప్రవర్తిస్తాడు.

వికర్తనో వివశ్చాంచ్య మార్తాండో భాస్కరో రవిః

లోకప్రకాశకః శ్రీమాన్ లోకచక్షుర్గహేశ్వరః

లోక సాక్షీ త్రిలోకేశ కర్తా హర్తా తమిస్రహా

తపన స్తాపనశ్చైవ శుచి స్సప్తాశ్వవాహనః

గభస్తిహస్తో బ్రహ్మాచ సర్వ దేవ నమస్కృతః

ఏకవింశతి రిత్యేషస్తవ ఇష్టస్సదా మమః

శరీరారోగ్యద శ్చైవ ధన వృద్ధి యశస్కరః

స్తవరాజః ఇతి ఖ్యాతస్త్రిషులోకేషు విశ్రుతః

సూర్యుని జీవితకాలం తో పోలిస్తే మన జీవిత కాలం చాలా స్వల్పం, సముద్రంలో నీటి బిందువు. ఈ సూర్యుడు కూడా మహాలయ కాలంలో అంతరిస్తాడు. వేదం ఇలా చెబుతోంది ” సూర్యచంద్ర మసౌధాతా యథాపూర్వమకల్పయాత్, పృధివీంచాంతరిక్ష మధోస్వసః” సూర్యచంద్రులతో, భూమి మిగిలిన భూతాలను బ్రహ్మగారు మరల యధాప్రకారంగా పూర్వంవలె సృష్టి చేశారు. కారకులెవరు? శివ శక్తులన్నారు.

శివశ్శక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుమ్

న చే దేవం దేవో న ఖలు కుశలః స్పన్దితుమపి I

అతస్త్వామారాధ్యాం హరి హర విరిఞ్చాదిభిరపి

ప్రణన్తుం స్తోతుం వా కథమకృతపుణ్యః ప్రభవతి

Cortesy:-http://shaktiputram.blogspot.in/2014/12/ii-ii.html

శివుడు లేని శక్తిలేదు, శక్తిలేని శివుడు లేడు. ఈ ఇద్దరూ కలసిన ఏక స్వరూపమే దేవుడు, నేటి ప్రోటాన్, న్యూట్రాన్ లనుకోవచ్చు, ఈ రెండూ కలసిన ఆటం అనుకోనూవచ్చు. ఈ అణువులతో ఉన్న ఈ సర్వ ప్రపంచమే విశ్వం,విష్ణుః…అదే పరమాత్మ…కనపడుతున్నవాడు దేవుడు కాదా?

నేడు సూర్య జయంతి.

శర్మ కాలక్షేపంకబుర్లు-అందితే జుట్టు లేకపోతే కాళ్ళు.(దుర్యోధనుని కూతురు కృష్ణుని కోడలు.)

Posted on నవంబర్ 22, 2012
7
అందితే జుట్టు లేకపోతే కాళ్ళు (దుర్యోధనుని కూతురు కృష్ణుని కోడలు.)

చాలా కాలం తరవాతొచ్చాడు మా సత్తిబాబు. వస్తూనే “ఏంటి పంతులుగారు చదువుతున్నారు, ఏంటి విశేషాల”న్నాడు, చేతిలో పుస్తకం చూసి. “ఏముంది, ఇది భాగవతం, సంగతేమంటే దుర్యోధనుని కూతురు శ్రీకృష్ణుని కోడలు”అన్నా. దానికి అతను “పంతులుగారు మరీ చెవులో పువ్వులెట్టేస్తున్నార”న్నాడు. “కాదయ్యా! నిజమే చెబుతున్నా” అన్నా. “అలాగయితే వియ్యంకుడికి సాయం చేయాలి కాని మేనత్త కొడుకులికి సాయం చేసేడేమండి” అంటూ “మరిచిపోయాను, చెల్లెలు సుభద్రని అర్జునుడు పెళ్ళి చేసుకున్నాడు కదండి, అందుకు వాళ్ళకి సాయం చేసేడంటారా” అన్నాడు. “సత్తిబాబూ! ఇటువంటి ఆలోచనలు ఈ మధ్య చాలా మందికి చాలా విషయాలమీద వస్తున్నాయి కాని, పరమాత్మకి మేనత్త కొడుకు ఎక్కువ, కోడలు, వియ్యంకుడు తక్కువ ఉండదయ్యా! ఆయనకి అందరూ సమానమే, ఆయన ధర్మ పక్షపాతి, బంధుత్వ పక్షపాతి కాద”న్నా. “నిజమేనండి, కాని మీరు చెప్పిన దుర్యోధనుడి కూతురు శ్రీకృష్ణుని కోడలన్న సంగతి నాకు తెలియదు కనక, వినలేదు కనక, చెప్పండి” అన్నాడు. మీరూ వినండి.

“కోరి సుయోధను కూతురి సర్వలక్షణములు గల్గి లక్షణ యనంగ
మహినొప్పు కన్యకామణి వివాహంబున జక్రహస్తుని తనూజాతు డైన
సాంబుడు బలసాహసమున నెత్తుకపోవ గౌరవు లీక్షించి కడగి క్రొవ్వి
పడుచువాడొక డదె బాలిక గొనిపోవుచున్నాడు గైకొన కుక్కు మిగిలి

ఇట్టి దుర్మదు గయిముట్టి పట్టి తెచ్చి
జనులు వెఱగంద జెఱబెట్టి యుంతుమేని
యదువులు మనల నేమి సేయంగ గలరొ
యనుచు గురు వృద్దజనముల యనుమతమున….భాగవతం….స్కం. ౧౦ ఉత్తర భా….౫౫౬

దుర్యోధనుడి కూతురు లక్షణ అనే పేరుగల కన్యను శ్రీ కృష్ణుని కొడుకైన సాంబుడు వివాహం చేసుకోడానికి తీసుకొస్తూ ఉంటే, కౌరవులు చూసి, కుఱ్ఱాడొకడు పిల్లని తీసుకుపోతున్నాడు, ఇటువంటి వాణ్ణి పట్టుకుని, పెద్దల అనుమతితో, బంధిస్తే యాదవులేమి చెయగలరో చూద్దామనుకున్నారు.”

ఇలా అనుకుని “దుర్యోధనుడు, కర్ణుడు,శల్యుడు, భూరిశ్రవ, యజ్ఞకేతులు బయలుదేరి సాంబుడిని అడ్డుకున్నారు. సాంబుడు వీరత్వంతో యుద్ధం చేసేడు అందరితో, వీణ్ణి ఇలా గెలవలేమని అందరూ కలిసి ఒక్క సారిగా దాడి చేసి లక్షణతో సహా పట్టుకున్నారు.” “ఈ సంగతి నారదుని ద్వారా యాదవులకి తెలిసింది.రాజు ఉగ్రసేనుని అనుజ్ఞతో యుద్ధాని బయలుదేరుదామన్నారు యాదవులు. అంతలో బలరాముడు అడ్డుపడి కౌరవులు మనకు బంధువులు వాళ్ళతో గొడవ వద్దు అని ఆపేడు. అప్పుడు యుద్ధం చేద్దామన్నావాళ్ళతో కూడా కలిసి కరిపురం చేరి, కోట బయట విడిసి ఉద్ధవుడిని దూతగా పంపేడు, బలరాముడే వచ్చేడని కౌరవులు బయలుదేరి వెళ్ళి అర్ఘ్య, పాద్యాలిచ్చి గౌరవించారు. ఆప్పుడు బలరాముడు దుర్యోధనుని చూసి, మా రాజు ఆజ్ఞ ప్రకారం వచ్చేం, మీరందరూ కలిసి, ఒక్కణ్ణి చేసి సాంబుడిని బంధించడం తప్పు, ఐనా సరే మా రాజు బంధుత్వం తలచి ఆ తప్పు సైరించేడని చెప్పేడు. అందుకు సుయోధనుడు,

అనుమాటలు విని కౌరవ జననాయకుడాత్మ గలగి చాలు బురే! యే
మనగలదు కాలగతి చక్కన గాలం దొడుగు పాదుకలు దలకెక్కెన్…..భాగ…దశ స్కం.ఉత్తర…౫౭౨

ఆ మాటలకి సుయోధనుడు కోపించి కాళ్ళకి తొడుక్కునే చెప్పులు తలమీదపెట్టుకున్నట్లుంది, కాలం, ఏం చెప్పను, యాదవులతో సంబంధం సఖ్యం చాలు,భీష్ముడు, ద్రోణుడు,కర్ణుని లాటి వీరులకు దొరికినవాణ్ణి, దేవేంద్రుడయినా విడిపించగలడా, వృధా మాటలెందుకు అంటూ దుర్భాషలాడుతూ దిగ్గునలేచి మందిరానికి వెళ్ళిపోయాడు.”

ఇప్పుడు బలరాముడికి కోపం వచ్చి “రాజ్యవైభవ మధాంధుల మాటలు విన్నారు కదా అని కూడా వచ్చిన వారితో అని” ఇంకా ఇలా అన్నాడు.

“శ్రీ మధాందులు సామముచేత జక్క
బడుదురే యెందు బోయడు పసుల దోలు
పగిది నుగ్ర భుజావిజృంభణ సమగ్ర
సుమహితాటోప మనిలోన జూపకున్న….భాగ…..దశ.స్కం.ఉత్తర.భా….౫౭౬

డబ్బు మదంతో కొట్టుకుంటున్నవాళ్ళకి మంచిమాటలు పనికిరావు, బోయవాడు పసువుల్ని తోలినట్లు, యుద్ధంలో బుద్ధి చెప్పాలిసిందే, అని, కృష్ణుడు, మిగిలినవారిని రావద్దని వారించి వచ్చాను,దేవ దేవుడయిన కృష్ణుని కాదంటారా” అంటూ,ఇంకా

“తామట తలపగ దలలట యేమట పాదుకలమట గణింప రాజ్య
శ్రీ ముదమున నిట్లాడిన, యీ మనుజాధముల మాటలేమనవచ్చున్….భాగ…దశ.స్కం. ఉత్తర….౫౮౧

తమరేమో తలలా మేమేమో చెప్పులమా! రాజ్యమదం తో మాట్లాడే వాళ్ళని ఏమనగలమని, భూమి మీద కౌరవులను లేకుండా చేస్తానని, చేతిలో నాగలి హస్తినాపురానికి సంధించి గంగలో కలిపేసే ప్రయత్నం చేస్తూంటే నగరం అతలాకుతలమై పోయింది.” అప్పుడు …” దానికి ప్రతీకారంబు లేమిని గలవళంబున భయాకుల మానసులయి, పుత్ర మిత్ర కళత్ర, బంధు, భృత్య, పౌరజన సమేతంబుగా భీష్మ సుయోధనాది కౌరవ్యులు, వేగంబున నతని చరణంబులు శరణంబుగా దలంచి, సాంబునిం గన్యకాయుక్తంబుగా ననేక మణిమయ భూషణాంబర జాలంబులతో దోడుకవచ్చి దండప్రణామంబులాచరించి, కరకమలంబులు మోడ్చి, యిట్లనిరి…..”..భాగ..దశ.స్కం.ఉత్తర….౫౮౪

బంధు,మిత్ర, భార్యలతో సహా అందరూ చీని చీనాంబరాలూ పట్టుకుని సాంబుని లక్షణను తీసుకువచ్చి బలరాముని కాళ్ళు పట్టుకుని రక్షించమని వేడుకుని, సాంబుని, లక్షణ సహితంగా లక్షణంగా అప్పజెప్పి శరణు వేడేరు. బలరాముడు కొడుకుని, కోడలిని తీసుకుని తమ రాజ్యం చేరుకుని, అక్కడి వారికి జరిగిన కధ చెప్పేడు”. అందుకే ఇప్పటికీ హస్తినాపురం దక్షణం వైపు కొద్ది ఎత్తుగా ఉంటుంది, బలరాముడు నాగలితో పెళ్ళగించడానికి ప్రయత్నించడం చేత.

బాజాభజంత్రీలతో పెళ్ళికి విందుభోజనానికి పిలిస్తే, కాదని, మూకుడు పట్టుకుని పెళ్ళివారింటికి పులుసుకి వెళ్ళిందని సామెత.బలరాముడు సౌమ్యంగా సాంబుని, లక్షణను వదిలిపెట్టమంటే కాదని టెక్కుపోయి, చెప్పులలాటివారని హేళనచేసిన నోటితోనే, కొద్ది సేపటిలోనే, రక్షించమని కాళ్ళు పట్టుకోవడం ఏమంటారు? దీన్ని అందితే జుట్టు లేకపోతే కాళ్ళు పట్టుకోడమే అంటారుగా, నిజంగా జరిగింది కూడా ఆదే కదా. ఇటువంటి పాలకులున్న రాజ్యాలవారికి సౌమ్యంగా చెబితే కుదరదు,బలరాముడు చేసిన పని చేయాలి, ఇటువంటిది నేటికీ నిజమే కదా! పూర్వ కధలు నేటికీ అన్వయిస్తాయి కదూ!

శర్మ కాలక్షేపంకబుర్లు-అంతకి ఇంతయితే ఇంతకి ఎంతవుతుంది.

Posted on నవంబర్ 24, 2012
10
అంతకి ఇంతయితే ఇంతకి ఎంతవుతుంది.

       అనగనగా ఒక రాజ్యం, “ఏంటి కధ చెబుతున్నారా? కబుర్లొదిలేసి కధల్లోకి దిగేరా” అన్నాడు, మా సత్తిబాబు. “కాదోయ్! కబుర్లలో కధలు కూడా భాగమేకదా అని.” “మీరు దేన్నయినా సమర్ధించెయ్య గలర”న్నాడు. “తప్పుని ఎప్పుడూ సమర్ధించలేము, ఒక వేళ సమర్ధించడానికి ప్రయత్నం చేసినా అది కొద్ది కాలమే తప్పించి, ఎప్పటికీ నిత్యం కాదు, సత్యమూ కాదు కదా, అది ధర్మం కూడా కాదు” అన్నా. “ధర్మం అంటే ఏమండి” అన్నాడు, “నిఘంటువు ఏం చెబుతోందంటే, పుణ్యము,న్యాయము, సామ్యము,స్వభావము,ఆచారము,అహింస,వేదోక్తవిధి,ఉపనిషత్తు,యజ్ఞము,విధి,” అన్నా. “అమ్మబాబోయ్! ఒక మాటకి ఇన్ని అర్ధాలా” అన్నాడు. “అవును మనం అర్ధాలు,పుణ్యం, న్యాయం గురించి చెప్పుకుందాం.”

పరోపకార పుణ్యాయ పాపాయ పర పీడనం,అన్నారు పెద్దలు. పరులకు ఉపకారం చేయడం పుణ్యం, పరులను శారీరకంగా కాని, మానసికంగా కాని హింసించడం పాపం అన్నారు. ఇది పుణ్య పాపాలకి చెప్పిన నిర్వచనం.

ఒరులేవి యొనరించిన
నరవరయప్రియంబు తనమనంబునకగుదా
నొరులకు యవి సేయకునికి
పరాయణము పరమధర్మపధములకెల్లన్…..భారతం.

ఇది న్యాయానికి చెప్పిన నిర్వచనం. ఇదివరలో చాలా సార్లు చెప్పుకున్నాం ఈ పద్యం అర్ధం, మళ్ళీ చెప్పుకుందాం, రోజూ తినే అన్నం మళ్ళీ మళ్ళీ తినటంలా. ఇతరులు ఏమిచేస్తే నీ మనసుకి బాగుండదో అవి నీవు ఇతరులకు చేయకుండా ఉండటమే ధర్మం అంది భారతం,అదే న్యాయం.

అన్నిదానములకన్న అన్నదానమె మిన్న
కన్న తల్లికంటె ఘనములేదు
ఎన్న గురునికన్న నెక్కుడు లేదయా
విశ్వదాభిరామ వినుర వేమ………..అన్నాడు వేమన తాత దానం గురించి, ఇది దానం గురించిన నిర్వచనం,అన్నా

ఇందాక కధ చెబుతానన్నారు, ఇప్పుడు మరేదో చెబుతున్నారు, మీకీ మధ్య జ్ఞాపకం తగ్గి ఏదో చెప్పేస్తున్నారు, అన్నాడు. కధే చెబుతున్నా విను, మీరూ అవధరించండి.

ఒక మహారాజు, రోజూ తోటకూర దానం చేస్తున్నాడు,వేల ఎకరాలలో తోట కూర పండించి పంచిపెడుతున్నాడు, స్వయంగా. స్వయంగా తోటకూర కట్ట చేతికిస్తూ, అంతకి ఇంతయితే ఇంతకి ఎంతవుతుంది అని ప్రశ్న వేసేవాడు. ఎవరూ సమాధానం చెప్పేవారు కాదు. ఇలా సంవత్సరాలు గడిచిపోయాయి. ఎవరూ సమాధానం చెప్పక పోయేటప్పటికి రాజు దిగులుపడ్డాడు. రాజ కార్యాలలో కూడా ఆసక్తి తగ్గింది, కాని ఈ తోటకూర దానం మాత్రం మానలేదు. రాజు అదృష్టం కొద్దీ ఒక బ్రాహ్మడు వచ్చాడు. అతనికీ తోటకూర కట్టిస్తూ ప్రశ్న వేశాడు. దానికాయన, రాజా నీకు ఈ విషయం మీద సమాధానం చెబుతానన్నాడు.

రాజుకి సంబరమయిపోయింది. ఆ రోజు కార్యక్రమం అయిపోయిన తరవాత, సభలో బ్రాహ్మణుని ప్రవేశపెడితే, సమాధానం చెప్పేడు, ఇలా. రాజా అంతకు ఇంతయితే, ఇంతకు ఇంతే అన్నాడు. దానికి రాజు నిరుత్సాహ పడ్డాడు. అదెలా చెప్పగలిగేరని ప్రశ్నించాడు. దానికి బ్రాహ్మణుడు ఇలా చెప్పేడు. రాజా నీవు పూర్వ జన్మలో ఒక పేద బ్రాహ్మణుడివిగా పుట్టేవు. నీకు ఆ జన్మలో, కొద్దిగా పెరడున్న ఇల్లు ఉండేది, యాయవారంతో బతికేవాడివి, ఉన్న పెరడులో తోటకూర సాగుచేసి అడిగినవారికి అడగనివారికి కూడా దానం చేసేవాడివి. ఆ పుణ్యం మూలంగా నువ్వీ జన్మలో మహారాజుగా పుట్టేవు. నీకు పూర్వజన్మ జ్ఞానం ఉండిపోవటం చేత, ఈ జన్మలో కూడా తోటకూర దానం చేయడం మొదలు పెట్టేవు, అప్పుడు తోటకూర దానంచేస్తే రాజునయిపుట్టేనుకదా! ఇప్పుడు కూడా తోటకూర దానంచేస్తే ఇంతకంతే మంచి జన్మ లభిస్తుందనుకున్నావు. నిజమేనా చెప్పమన్నాడు. అందుకు రాజు ఆశ్చర్యపోయి, అప్పుడు తోటకూర దానం చేస్తే రాజునయిపుట్టేను కదా, మరి ఈ జన్మలో ఇతోధికంగా తోటకూర దానం చేస్తే ఇంత కంటే మంచి జన్మ ఎందుకు రాదనుకుని తోటకూర దానం మొదలెట్టేను అన్నాడు. రాజా అప్పుడు నీవొక యాయవారం బ్రాహ్మడివి, నీతాహతుకు తగిన దానం చేసేవు, మంచి మనసుతో మరొకరికి సాయపడాలనుకున్నావు తప్పించి గొప్ప జన్మ రావాలని కోరుకోలేదు. కాని ఈ జన్మలో మహారాజువై ఉండి నీ తాహతుకు తగిన దానాలు చేసి ప్రజల మంచి చెడ్డలు చూడలేదు, ఇంతకంటె మంచి జన్మ కావాలని కోరికతో దానం చేస్తున్నావు, అందుచేత ఇంతకి ఇంతే అని జవాబు చెప్పేడు. దానికి రాజు ఆశ్చర్యపోయి, ఆయన కాళ్ళు పట్టుకుని స్వామీ! నాకు తరుణోపాయం చెప్పమన్నాడు.

రాజా! ఇప్పటికైనా మించిపోయింది లేదు, నీవు నీ తాహతుకు తగిన దానం చెయ్యి. అన్ని దానాలకంటే ఆన్నదానం మంచిదే, అది ఒక పూటతో సరిపోతుంది, తృప్తినీ ఇస్తుంది, కాని రాజుగా నీవు ప్రజలు వారిమటుకు వారు సంపాదించుకునే ఏర్పాటు చూడాలి, అందుకు విద్యాదానం చేయాలి, ప్రజలకు సత్వర వైద్య సదుపాయం, సత్వర న్యాయం అందేలా చూడు. అదే నీవు చేయగల దానం, చేయవలసిన దానం అని చెప్పేడు. రాజు అప్పటినుంచి తోటకూర దానం మానేసి ప్రజల్ని బాగా పరిపాలించాడు.

పై కధని బట్టి మనకు తెలిసేది, తాహతుకు తగిన దానం చేయకపోవడం తప్పు, తాహతుకు మించిన దానం చేయడమూ తప్పే. ప్రాణం నిలబెట్టడానికి అన్నదానం అవసరమే కాని విద్యాదానం గొప్పది. తద్వారా మనుష్యులు వారి ఆత్మాభిమానాన్ని కోల్పోని పౌరులవుతారు, అప్పుడు వారు వారి కుటుంబానికి సమాజానికి ఉపయోగపడతారు. అప్రస్తుతమైనా ఇక్కడొక సంగతి. మా చుట్టు పక్కల ఉన్న ఒక పల్లెలో ఒక రైతు రోజూ అరుగు మీద కూరలు పోస్తాడు,తన పొలంలో పండించినవి. ఆ ఊరిలో కావలసిన వారు పట్టుకు వెళతారు. కేజీ వంద అమ్ముతున్న రోజులలో కూడా అతను ఈ పని చేస్తున్నాడట, వివరాలు తెలియవు, తెలిస్తే ఒక టపా రాసేస్తా. 🙂

శర్మ కాలక్షేపంకబుర్లు-ఎవరు వృద్ధులు?

మకర సంక్రాంతి శుభకామనలు

Posted on జనవరి 29, 2015

ఎవరు వృద్ధులు?

చిత్రగ్రీవుడు అనే పావురాల రాజు, ఒక రోజు తన పరివారంతో ఆహారం కోసం బయలుదేరాడు. ఒక అడవి మీదుగా వెళుతుండగా ఒక చోట నూకలు కనిపించాయి. కిందకివాలి నూకలు తిందామనే మాట పుట్టింది ఒకరినుంచి. అలాగే అన్నారు మరికొందరూ అంతలో ఒక వృద్ధుడు ఇది అడవి, ఇక్కడ మానవ సంచారం తక్కువ కనక నూకలు ఉండేందుకు కారణం కనపడదు, కనక దిగవద్దు, ప్రమాదం పొంచి ఉండచ్చు, అనుమానించ తగినదే, అని హెచ్చరిస్తాడు. దీనికి ఒక యువకుడు, ఇలా చెప్పేవన్నీ అనుమానం కబుర్లు, నిరుత్సాహాన్ని కల్పించేవి. ఎదురుగా ఆహారం కనపడుతోంటే మీనమేషాలు లెక్కిస్తూ, ఇది అడవి, ఇది గ్రామం అని ఆలోచించడం తెలివి తక్కువ అని ప్రతివాదం చేస్తాడు. అప్పుడు మరొకరు పెద్దల మాట వినడం మంచిది కదా అంటే ఎవరు వృద్ధులు? ఏండ్లు మీరినవాడా వృద్ధుడు, జ్ఞానం కలిగినవాడే వృద్ధుడని ప్రతివాదం చేసి, మొత్తానికి నూకలకోసం కిందికి దిగుతాయి.

దిగిన వెంటనే నూకలమాట దేవుడెరుగుకాని వల మీద పడి అందులో చిక్కుకుపోయారు. సమస్యలో చిక్కుకున్నారు,ప్రాణాల మీదకే వచ్చింది. ఏం చెయ్యాలనే మాట ముందుకొచ్చింది. వృద్ధుడు సమయం దొరికింది కదా అని పాత విషయం ప్రస్తావించలేదు. పాలుపోని పరిస్థితులలో మరలా వృద్ధుణ్ణే సలహా కోరితే అందరం ఒక్క సారిగా ఎగిరి వలనే ఎత్తుకుపోదామని చెబితే అందరూ కలసి ఒక్క సారి ఎగిరి వలను ఎత్తుకుపోయారు. ఇది చూచిన వేటగాడు నిర్ఘాంతపోయాడు. ఎగిరిన తర్వాత ఏం చెయ్యాలంటే, రాజు తన స్నేహితుడైన ఎలక దగ్గర దిగాలని చెబితే అక్కడకు చేరతారు. మిత్రుణ్ణి బంధనాల్లో చూచిన ఎలుకరాజు వగచి అతని బంధనాలు కొరకడానికి సిద్ధమైతే కపోత రాజు ముందుగా తన పరివారాన్ని బంధాలనుంచి తప్పించి ఆ తరవాత తనను రక్షించమంటాడు. దానికి ఎలక రాజు నువ్వు స్నేహితుడవు కనక నీ బంధనాలు కొరుకుతా తప్పించి మిగిలినవారి సంగతి తరవాత ఆలోచిస్తానంటాడు. దానికి కపోత
రాజు ఒప్పుకోక పోతే ఎలుకరాజు అతని సత్యనిష్టకి మెచ్చుకుని,తన పరివారం పట్ల అతనికున్న ప్రేమను కొనియాడి, తన పరివారంతో అందరిని బంధ విముక్తుల్ని చేస్తాడు. ఇది స్థూలంగా మిత్రలాభం లోని కథ, నా స్వంతం మాత్రం కాదు. పొరపాటుగా కొన్ని కల్పించానేమో కూడా , తప్పులు మన్నిమచండి. ఇక ఈ కథని విశ్లేషిస్తే

1.ఏంత రాజయినా పని చేయాల్సిందే. అంటే ఎంత ఆఫీస్ కి బాస్ అయినా తనపని తను చెయ్యాలి, మరొకరి మీద రుద్దెయ్యకూడాదు.

2. ఒక పని చేద్దామనుకున్నపుడు దాని మంచి చెడ్డలు వృద్ధులు సకారణంగా చెప్పినపుడు వినాలి. యువత ఎదిరించడానికే ఎదిరింపులా ఉంటే నష్టపోతారని చెప్పడం.

3.వృద్ధులు ఆపదలో చిక్కుకున్నపుడు ఆలోచన చేసి ఈ కథలో వృద్ధుడు చేసినట్లు అపాయం లేని ఉపాయం చెప్పి ఆదుకోవాలి కాని పాత విషయాలను తవ్విపోయడం మూలంగా నష్టమే ఉంటుందనేది సూచన.

4. ఆపదలో చిక్కుకున్నపుడు చర్చలు కాదని, చెప్పిన పని చేయడమే లక్ష్యంగా ఉండాలని అందరికి సూచన,ప్రత్యేకంగా యువతకి సూచన.. ఇక్కడ ఐకమత్యంతో ఒక్క సారిగా ఎగిరి వలనే ఎత్తుకుపోయే ఆలోచన బ్రహ్మాండమైనదే కదా! యువతే బలం, అలాగే ఐకమత్యమే బలం అని గుర్తించాలి.

5.ఆపద నుంచి గట్టెక్కిన తరవాత బంధనాలు ఛేదించుకోడానికి తగిన వారిని ఎన్నుకోవడం లో కపోతరాజు చూపిన ముందు ఆలోచన మెచ్చదగినదే, రాజయినవాడి ఆలోచన అలా ఉండాలి.

6.కపోతరాజు బంధనాలు మొదటగా తప్పిస్తానన్నపుడు ముందుగా తన పరివారాన్ని బంధముక్తుల్ని చేయమనడం రాజు చేయాల్సిన పని అని చెప్పడమే. ఎలుకరాజు అలా చెప్పడం కూడా కపోత రాజు యొక్క గుణాన్ని పరికించడమే, అతని గొప్పనూ ప్రకటించడమే.

7.కథలో యువకుడు ఎవరు వృద్ధులు? ఏండ్లు మీరినవారా వృద్ధులు? అని ప్రశ్నిస్తాడు. సమాధానం తెలుసుకోవలసిన ప్రశ్న ఇది. జ్ఞాన వృద్దులు, వయోవృద్దులు, తపో వృద్ధులని వృద్ధులు మూడు రకాలు. ఇందులో వయో వృద్ధులు ఎక్కువగానూ, జ్ఞానవృద్దులు తక్కువగానూ, తపోవృద్ధులు అరుదుగానూ కనపడతారు.

వయోవృద్ధులు తమ అనుభవాలని కథలుగా చెబుతారు, హెచ్చరికలూ ఇస్తారు, కాని మనమే వినేలా ఉండం, సొల్లు కబుర్లు చెబుతున్నారని ఈసడిస్తాం కూడా. వారుపోయిన తరవాత చేతులు కాలిన తరవాత ఆకులు పట్టుకున్నట్టు అయ్యో! ఈ సమయంలో ముసలాయనుండి ఉంటే మంచి సలహా చెప్పేవాడు కదూ అనిపిస్తుంది.

జ్ఞానవృద్ధులు కొద్దిమందే ఉంటారు.సాధారణంగా మనం అడిగితే కాని ఏదీ చెప్పరు. కొంతమంది చెప్పడానికి సాహసించినా వినేలా లేదు లోకం, వీరికి వయసుతో సంబంధం లేదు, ఇది వీరికి పెద్ద ఇబ్బంది, ఇతరులు గుర్తించలేకపోవడానికి కారణం. వీరిని గుర్తిస్తే నిజంగా అద్భుతాలు సాధించవచ్చు, కాని గుర్తించలేము.

ఇహపోతే తపోవృద్ధులు అరుదుగాఉంటారు. వీరిని గుర్తించడం చాలా కష్టం, వీరికీ వయసుతో సంబంధంలేదు. వీరిని గుర్తించి అనుసరించగలిగితే అదో బ్రహ్మానందం. వీరికి ప్రచారాలు గిట్టవు కనక గుర్తింపూ ఉండదు.

అందుచేత ముందుగా వయో వృద్ధుల అనుభవాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తే, చరిత్ర చదువుకుంటే యువ సుఖపడుతుంది. ప్రతి విషయానికి వాదనకు దిగితే, కయ్యానికి దిగితే జీవితం కుక్కలు చింపిన విస్తరేనన్నది యువత గుర్తించాలి.

కథ చిన్నదే కాని ఎన్ని విషయాలు దాగున్నాయో చూడండి.

శర్మ కాలక్షేపంకబుర్లు-త్రికరణ శుద్ధి లోపం అనే ఆత్మ వంచన

Posted on నవంబర్ 10, 2012
8
త్రికరణ శుద్ధి లోపం అనే ఆత్మ వంచన

త్రికరణాలంటే? మనోవాక్కాయ కర్మలు, వీటినే త్రికరణాలంటాం. మనసుతో ఆలోచించేది, నోటితో చెప్పేది, చేసే పని మూడూ ఏకోన్ముఖంగా ఉన్నపుడు మాత్రమే ఏదయినా పని చేసిన దానికి సత్ఫలితం ఉంటుంది. ఒకటి చెబుతూ, మరొకటి చేస్తూ, మరొకటి ఆలో చించడమే త్రికరణ శుద్ధిలోపం, అదే అత్మ వంచన, దూరంగా ఉన్న కొండలు చూడటానికి నున్నగానే కనపడతాయి, పచ్చగా తివాసీలా ఉంటుంది, కాని అది నిజమా? కాదు, అలాగే మానవ మనస్తత్వం కూడా. నోరు మాట్లాడుతూ ఉంటుంది నొసలు వెక్కిరిస్తూ ఉంటుంది, ఇది సామెత కూడా.

సుబ్రహ్మణ్యస్వామి గుడికెళతాం, పాము కనపడితే చంపేదాకానిద్రపోం. గోవు అని పూజిస్తాం, పాలిచ్చినన్నాళ్ళూ ఉంచుకుని ముసలిదయితే కటికవానికి అమ్మేస్తాం, మేత దండగని. గురువని నమస్కారాలు చేస్తాం, వెనక ఎగతాళి చేస్తాం. బ్ర.శ్రీ. చాగంటి కోటేశ్వరరావుగారి ప్రసంగం విని జీవితం బుద్బుద ప్రాయం, దానం చేసి పుణ్యం మూట కట్టుకోవాలనుకుంటాం, బయట కొచ్చిన తరవాత అవసరంలో ఉన్న వాడికి రూపాయి విదల్చం, ఎంగిలి చేత్తో కాకిని కూడా తోలం, రెండు మెతుకులు రాలితే కాకి తింటుందేమో, మనకి తగ్గిపోతాయఏమోననే భయంతో, దాహం తీర్చడానికి మంచినీళ్ళు కూడా ఇవ్వం. వరకట్నం దురాచరమంటాం, లాంఛనాలు సరిపోతాయంటాం, ఆ ముసుగులో కట్నం కంటే ఎక్కువ గుంజుతాం. ఇప్పుడు ఎదురు కట్నాలిచ్చినా ఆడపిల్లలు దొరక్క ముదిరిపోయిన బెండకాయల్లా ఉన్నారులెండి. నీటిని దుర్వినియోగం చేయద్దంటాం, గెడ్డం గీసినంతసేపు, దంతధావనం చేసినంత సేపు కుళాయి లో నీళ్ళు పోతూనే ఉంటాయి, కట్టెయ్యం.

ఆవిడ పతియే ప్రత్యక్ష దైవం అంటుంది, మహిళా సంఘాలలో లెక్చర్లిస్తుంది, చప్పట్లు కొట్టించుకుంటుంది, ఇంటికొస్తే మొగుడు ముఖం కూడా చూడదు. అదేదో సినిమాలో అన్నపూర్ణ చిరు వాల్ పోస్టర్ మీద పడి విరహం ప్రదర్శించినట్లు ఉంటుంది ప్రవర్తన. మరొక మహానుభావుడు తల్లి తండ్రులే ఇలలో దైవాలంటాడు. రోజూ దేవాలయాల చుట్టూ తిరుగుతాడు, బాబాల చుట్టూ తిరుగుతాడు, దణ్ణాలు పెడతాడు, మొక్కులు కడతాడు, యాత్రలు చేస్తాడు, ఇంటి దగ్గర తల్లి తండ్రులు కాపలా దారుల కంటే హీనంగా బతుకుతూ ఉంటారు. మరొక అమ్మాయి బాగా కబుర్లు చెబుతుంది, అంతా అధునికతే చూడ్డానికి, కాని పెద్ద దైవ భక్తురాలు, పైకి చెప్పడం ఇప్పటికీ గురువూ నై, దేవుడూ నై, ఏం లేదనే అంటుంది, అదేమంటే స్నేహితురాళ్ళు ఏడిపిస్తారని భయం. ఆయనో సంఘ సంస్కర్త, ఆడపిల్ల పుట్టిందని భార్యని వదిలేశాడు. మాటాడితే స్త్రీ జనోద్ధరణ లెక్చర్లు మాత్రం దంచుతాడు. ఒక్కతే అమ్మాయి/అబ్బాయి విదేశాల్లో చదువుకొంటున్నారు, తాతా అమ్మమ్మా, ఏలా ఉన్నావన్న ప్రశ్నకి సమాధానం చెప్పరు, వారానికి ఒకసారి కూడా మాటాడరు, బిసీ, బిసీ ఊపిరి పీల్చుకోడానికి సమయం లేదంటారు, కాని ఫేస్ బుక్ లో బ్లాగుల్లో ట్విట్టర్ లో కబుర్లు చెప్పడానికి సమయం మాత్రం దొరుకుతుంది. ఏమంటే మెయిళ్ళు చూడలేదంటుంటారు.ఆయనో వీర సామ్యవాది, చేలో పని చేసిన వాడికి డబ్బులివ్వడు, కనబడడు, కనబడితే రేపురా అంటాడు, మర్నాడు మనిషి దొరకడు.

ప్రభుత్వాలు పొగపీల్చడం హానికరం అంటాయి, సిగరెట్ ఫేక్టరీలకి లైసెన్స్ లిస్తాయి. ప్రభుత్వాలది మరీ చిత్రం, తాగుడు మానిపించడానికి ఒక పధకం, తాగుడు నేర్పించడానికొక పధకం అమలులో ఉంటుంది. అలాగే పొగపీల్చడం హానికరమని ప్రకటనలిస్తారు, ఆ పక్కనే సిగరట్టు కంపెనీల ప్రకటనలుంటాయి, ప్రభుత్వం పొగాకు కు సంబంధించిన లైసెన్స్ లు ఇస్తూ ఉంటుంది.తెనుగు భాషాభివృద్ధికి సంఘాలేస్తారు, ప్రభుత్వం సామాన్యునితో ఇంగ్లీషులో ఉత్తర ప్రత్యుత్తరాలు చేస్తుంది. మేనిఫెస్టో లో ఫలానా పని చేస్తామన్నారు చెయ్యలేదేమంటే “చెప్పినయ్యన్నీ చేసేత్తారేటి?” అని ప్రశ్నిస్తున్నారు. ఠాగూర్ వి చౌకబారు రచనలని గిరీష్ కర్నాడ్ అన్నా, రాముడు మంచి భర్తకాదు, లక్ష్మణుడు చూస్తుండగా రావణుడు సీతనెత్తుకుపోయాడని రాం జెఠ్మలాని వాగినా, విదేశాలలో నల్లడబ్బు దాచుకున్న వారి ఏడు వందల పేర్లు కేజ్రివాల్ క్రేజీగా బయట పెట్టినా, ఏం లేదు అని పెదవి విరిచారే తప్పించి నీమీద కేస్ పెడతామని అల్లుడుగారిదగ్గరనుంచి, నేటి అంబానీ దాకా ఎవరూ అనలేదు, అనలేకపోయారు. చిత్రం. మాకక్కడ డబ్బులేదన్నారు, సరిపోయింది, ప్రభుత్వం వారూ మాట్లాడరు, మరీ చిత్రం, వారూ వారూ ఒకటే కదా. రాముడు మంచి భర్త కాదన్నవాడు రాముడి పేరెందుకుపెట్టుకున్నట్లో, తనకి తెలియదు తల్లితండ్రులు ఇంత బుద్ధిమంతుడవుతాడనుకోలేదు, ఆ పేరు పెట్టేరు, ఇప్పుడు రావణ జఠ్మలానీ అని మార్చుకోవచ్చుగా. మరొకరు రావణుడే దేవుడంటున్నారు, వెధవ పనులు పుట్టినప్పటినుంచి చేసిన వాడు దేవుడెలా అయ్యాడో…….ఏంటో అంతా ఆత్మవంచన.

ఇలా చెప్పేదొకటి చేసేదొకటిగా మనుషులు ఎందుకుంటున్నారో తెలియదు. మనోవాక్కాయ కర్మలకి పొంతన ఉండటం లేదు. ఎందుచేతా?……