శర్మ కాలక్షేపంకబుర్లు-మూఢ నమ్మకం.

Posted on నవంబర్ 8, 2012
21
మూఢ నమ్మకం.

నవంబర్ 20 ఉదయమే పూజ, టిఫిన్ తరవాత కంప్యూటర్ దగ్గర కూచున్నా, దగ్గరే ఉన్న ఫోన్ మోగింది, ఎత్తిమాట్లాడితే, “తాతా! ఎలావున్నావ”ంది మనవరాలు, “బాగున్నా! మీరంతా ఎలావున్నారం”టే, ఒక నిమిషం మాటాడలేదు, నోరు పెగల్చుకుని “తాతగారు ఉదయం కాలం చేసేర”ంది. ఉరుములేని పిడుగులాటి వార్త. ఒక్క సారిగా మెదడు మొద్దుబారి పని చెయ్యడం మానేసింది. “ఏమన్నావ”న్నా, మళ్ళీ చెప్పింది “ఉదయమే బాగోలేదంటే హస్పిటల్ కి తీసుకెళ్ళేరు మళ్ళీ, ఉదయం ఆరుకి తాతగారు….”అని భోరుమంది. ఏమనాలో ఎలా ఓదార్చాలో కూడా తెలియని స్థితిలో ఉన్నా,నేను. కొద్దిగా సద్దుకుని “భాధ పడకూడదు, ఇది సహజం, సృష్ఠి క్రమం” అని చెప్పేను. నామనసు మనసులో లేదు, ఇల్లాలి దగ్గరకెళ్ళి సంగతి చెప్పాను. ఆవిడ ఒక్క సారి నిర్ఘాంతపోయింది. ఇంతకీ వారెవరో చెప్పలేదు కదూ! వారు మా పెద్దమ్మాయి ( చెవిటి,మూగ అమ్మాయి )మామగారు, 91 సంవత్సరాల నిండు జీవితం గడిపి,70 సంవత్సరాల వైవాహిక జీవితం గడిపి, జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్న ధీశాలి. నెమ్మదిగా ఆ భావోద్రేకం నుంచి బయటపడి, వెళ్ళడానికి తగు ఏర్పాట్లకోసం చూసి, టిక్కట్లు రిజర్వు చేయించుకోడానికి ప్రయత్నం చేస్తే, ఎక్కడా ఏ రయిలుకూ దొరక్కపోతే, పగలు వెళ్ళే జన్మభూమికి రిజర్వు చేయబోతే, అవి బేంకు దగ్గర పని చెయ్యక రెండు సార్లు డబ్బులు తీసుకోడం జరిగింది కాని, రిజర్వ్ కాలేదు. నిజానికి ఆయన వియ్యంకుడే కాని, బాంధవ్యం తోటి స్నేహం కలసి అది మరింత గట్టిపడిపోయింది. మా మొదటి కలయిక, ఒక వేసవిరోజు మిట్ట మధ్యాహ్నం, ఆక్షణం మొదలు మేము ఇద్దరం బంధువులమో, స్నేహితులమో, మాకే తెలియలేదు. ఆయన ఒక గురువు,స్నేహితుడు, బంధువు,మార్గదర్శి, మా పరిచయమైన మొదలు ఏరోజూ మేము భేదాభిప్రాయం వెలిబుచ్చుకునే సావకాశమే రాలేదు. ఎప్పుడేనా సమస్యవచ్చినా దానిని ఇద్దరం చర్చించుకుని పరిష్కారం కనుగొనేవాళ్ళం. అటువంటివారు లేరన్నమాట నన్ను నివ్వెరపాటుకు గురిచేసింది. మనిషిని ఇక్కడవున్నానుకాని మనసిక్కడలేదు. ఎంత తొందరగా వెళ్ళగలనా అక్కడికి అన్నదే నా అలోచన. అబ్బాయిని రిజర్వేషన్ కి వెళ్ళమని చెబుతుండగా ఒక స్నేహితుడు వస్తూ, “ఏంటి రిజర్వేషన్ అంటున్నారు, ప్రయాణమా” అన్నారు. సంగతి చెప్పేము, “మీరు వెళుతున్నారా” అన్నారు. “అవున”న్నా. “మీరెలా వెళతారు? మన సంప్రదాయం ప్రకారం వియ్యంకుడుపోతే సంవత్సరం పూర్తి అయ్యేదాకా, వియ్యంకుడు వెళ్ళకూడదు,వియ్యపురాలు పోతే వియ్యపురాలు కూడా సంవత్సరం దాకా వారింటికి వెళ్ళకూడదు కదా” అన్నారు. “ఎందుకు వెళ్ళకూడదన్నా, ఏదో వియ్యంకుడి జీడి,వియ్యపురాలి జీడి అంటారు, వెళితే, ఈ వెళ్ళినవారు కూడా గతిస్తారంటారు,” అన్నాడు. సందేహం వెలిబుచ్చారు, అప్పటికి రిజర్వేషన్ వాయిదా వేశాం, ఆయన తృప్తి కోసం. వారు వెళ్ళిన తరవాత మరల విషయం చర్చకు వచ్చింది. సంప్రదాయంగా వియ్యంకుడు పోతే, వియ్యంకుడు సంవత్సరంపాటు వెళ్ళనిమాట నిజమని నాకూ తెలుసు, కాని అది మూఢ నమ్మకమనుకుంటా. “ఏమయినా, ఈ విషయం మీద నీ అభిప్రాయం చెబితే అలాచేస్తాన”న్నా. అందుకు నా ఇల్లాలు, “గత ఏబది సంవత్సరాలుగా నా మనసు మీకు, మీ మనసు నాకు తెలుసు, నేనేమనుకుంటానో మీరే చెప్పండి” అంది. “బలే ధర్మ సంకటంలో పడేసేవని, ఐతే చెబుతున్నా విను,” అని మొదలెట్టా.

“ఇది నిజంగా మూఢ నమ్మకం. మనకు కావలసినవారు కష్టంలో ఉన్నపుడు, అదీ అమ్మాయిని ఇచ్చినచోట కాని, అమ్మాయిని తెచ్చుకున్న చోట కాని ఇటువంటి కష్టం కలిగితే, వెళ్ళి ఓదార్చి రావడం కనీస ధర్మం. అందుచేత వెళ్ళి వద్దాం” “ఇదీ నీమాట” అన్నా. “నా మనసులో మాట సరిగా చెప్పేరు, నిజంగా ఏమయినా అభ్యంతరం ఉంటే అది నాకుండాలి, నాకా భయం లేదు. అదీగాక 70 సంవత్సరాల వైవాహిక జీవితం గడిపి, 86 సంవత్సరాల వయసులో సహచరుణ్ణి కోల్పోయిన వదిన గారిని పలకరించి రావడం మన ధర్మం. అబ్బాయిని పిలిచి రిజర్వేషన్ చెయ్యమనండి ఇద్దరమూ వెళుతున్నాం” అంది. అదండి, అలా నవంబర్ రెండవతేదీని జన్మభూమి కి హైదరబాద్ వెళ్ళి, చిన్నమ్మాయిని చూసి, ఆరోజు రాత్రికి మనవరాళ్ళ కబుర్లతో కాలక్షేపం చేసి, మరురోజు వియ్యాలవారి కుటుంబాన్ని ఓదార్చి, మరునాడు బయలుదేరబోయి, నీలం తుఫానుకు చిక్కిపోయాం.

శర్మ కాలక్షేపంకబుర్లు-ఒక్కోసారంతే.

Posted on అక్టోబర్ 23, 2012
8

ఒక్కో సారంతే

ఎంత కాదనుకున్నా నేటి కాలం యంత్రాలపై ఆధారపడక తప్పదు. కాని అవి అవసరానికి పని చెయ్యనపుడే బాధ కలుగుతుంది.

టపా రాద్దామని కూచున్నా కంప్యూటర్ దగ్గర మొదలెట్టేను, టక్కున పోయింది కరంటు, ఉసూరు మంది ప్రాణం. బుర్రలోది కాస్తా ఆవిరయి పోయిందనుకోండీ 🙂 దానితో టపా మారిపోయింది, మళ్ళీ కరంట్ వచ్చేటప్పటికి. 🙂 ఏభయిఒకటో పెళ్ళి రోజు ఉదయమే ఆది దంపతుల దర్శనం చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. మే నెల 25 వ తేదీ రోహిణీ కార్తె మొదటి రోజు, ఇంక చెప్పేదేముందీ,నిప్పులు చెరుగుతున్నాడు సూర్యుడు, ఉదయం ఎనిమిదిన్నరకే. ఉదయ కార్యక్రమాలు ఎంత తొందరగా పూర్తి చేసుకోవాలన్నా ఆ సమయమైపోయింది. నడచి వెళ్ళాలని ముందన్నా. ఎందుకంటే పెళ్ళి అయిన మరునాడు, ఇద్దరం చెయ్యి చెయ్యి పుచ్చుకుని నడచి, ఎవరూ తోడు రాకపోయినా వెళ్ళి ఆది దంపతుల దర్శనం చేసుకొచ్చాం, మరప్పుడు ఎండ వెన్నెలలా కనపడింది, మరిప్పుడు ఎండ కాలుస్తోందేమో. 🙂 కాదు, అలాగే చెయ్యీ చెయ్యీ పుచ్చుకుని నడిచి వెళ్ళాలని ఒప్పించా, ఓపిక తగ్గిపోయినా :), కాని సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడే, ఓపిక తగ్గిందే, పోనీ బండి మీద వెళదామంది. కిలో మీటర్ దూరం లో ఉన్న గుడికి బండి మీద ఆవిణ్ణి వెనకాల కూచోబెట్టుకుని తీసుకెళ్ళి వచ్చేద్దామనుకుని బండి దింపేను. కిక్ కొట్టేను, సెల్ఫ్ కొట్టేను ఊహు, ఏం చేసినా అది కదల లేదు. ఒక పావు గంట దానితో కుస్తీ పట్టినా శ్రమ మిగిలింది తప్పించి ఉపయోగం లేకపోయింది. ఈ అవస్థ పడేకంటే నడిచి వెళ్ళి రావడం మేలు అంది నాటి యువరాణి. మనం అనుకున్నదే జరుగుతోందనుకుని నడచి వెళ్ళి దర్శనం చేసుకొచ్చేటప్పటికి ప్రాణం కడంటింది. తిరిగొచ్చిన తరవాత, ఏమయి ఉంటుంది దీనికి, సెల్ఫ్ అవలేదని, ఒక సెల్ఫ్ చేసి చూద్దామని నొక్కితే స్టార్ట్ అయింది, వెంఠనే. ఇదేమబ్బా ఉదయం అంత సేపు గుంజుకున్నా పని చేయనిది ఇప్పుడు వెంఠనే పని చేసిందని ఆశ్చర్య పోయా. ఆవిడమాత్రం ఏదో అనుమానంగా చూసింది, నాకేసి. సమాధానం చెప్పే స్థితి లేదు కనక బుర్రొంచుకున్నా. చెయ్యీ చెయ్యీ పట్టుకు నడిచి వెళ్ళి దర్శనం చేసుకు రావాలన్న కోరిక నెరవేరిందనుకోండి.:)

ఈ మధ్య రాజమంద్రి రెండు మూడు సార్లు వెళ్ళాల్సి వచ్చింది, ఒక సారి బలే అనుభవమే అయింది. ఉదయం 8.15 కి బండి, చాదస్తుడిని కదా ఒక అరగంట ముందే అక్కడున్నా. టిక్కట్టు కోసం లైన్ లో ఉన్నా. నేను రెండవ వాడిని. టిక్కట్టు ఖరీదు నాలుగు రూపాయలు, చేత్తో పట్టుకు నుంచున్నా. ఎంత సేపటికీ ముందతను కదలడు, కౌంటర్ క్లార్క్ టిక్కట్టివ్వటం లేదు. కారణమేమంటే మాట్లాడడు. మరి కొద్ది సేపటికి చెప్పేడు, కంప్యూటర్ పని చెయ్యటం లేదని. బండి వచ్చేస్తోందని ప్రకటనిచ్చేసేడు, ఇతను టిక్కట్లు ఇచ్చేలా లేడు, ఎలా? ఏం చెయ్యాలి. నాయనా టిక్కట్టు ఇవ్వడానికి యంత్రం సహకరించకపోతే ప్రత్యామ్నాయ మార్గం ఉండాలి కదా అంటే పలకడు. అలా నిలబడి ఉండగా గజేంద్రుడిని రక్షించేందుకు వచ్చిన విష్ణు మూర్తిలా మరొక క్లార్క్ వచ్చేడు, ఇతను కుస్తీ పట్టడం చూసి, పాస్ వర్డ్ సరి చూసినట్లు లేదని చెప్పి అతనేదో చేసి రెడీ చేసి కంప్యూటర్ ఇస్తే అప్పుడిచ్చాడు టిక్కట్ట్లు. బండి ప్లాట్ ఫారం మీదకొచ్చేసింది. గబగబా పరుగెట్టేం. నా వెనక పది మంది, ఎలాగో అందరం బండిలో పడ్డాం, అది వేరు సంగతి. ఒక వేళ నేను వెళ్ళడం ఆఖరు నిమిషం లో అయితే ఎలా ఉండేది? పరుగెట్టగలిగేవాడినా? యంత్రాన్ని పని చేయించుకోలేని లోపం కదా? ఎవరిననుకోవాలి? యంత్రాన్నా? యంత్రం వెనక మనిషినా?

అత్యవసరమైన పనిబడి ఊరుకెళ్ళడం కోసం రిజర్వేషన్ కోసం వెళ్ళమన్నా, అబ్బాయిని. ఎందుకునాన్నా! ఇక్కడే చేసేస్తా అని కంప్యూటర్ తీసుకుని మొదలెట్టేడు. వెతికితే కావలసిన రోజుకి కాని పక్క ముందురోజుకాని ఏ ఒఖ్ఖ బండీ ఖాళీ లేదు, పండగ హడావుడి కదండీ.డబ్బులు సంపాదించుకునేవాళ్ళకీ పండగే కదండీ. కొన్ని రిగ్రెట్లు, కొన్ని వైట్ లిస్ట్లు, సంఖ్య చూస్తే కళ్ళు తిరిగేలాగా ౭౫౦,౯౪౦ అలా ఉన్నాయి, హనుమంతుని తోకలా. టిక్కట్లు ఉన్న రోజు చూసుకుని టిక్కట్టు తీసుకోమన్నా. ఎదో చేసేడు. అన్నీ బాగానే అయ్యాయి కాని డబ్బులు చెల్లించే చోట ఎంత సేపటికీ అది పూర్తి చెయ్యటంలేదు. ఏ బటన్ నొక్కొద్దని ఒక సూచన మాత్రం కనపడుతూంది. ఇక్కడనొక్కండి, అక్కడనొక్కండి, ఎక్కడనొక్కినా, పీక నొక్కుకున్నా, ఇక్కట్లేగాని టిక్కట్లు రాలేదు, సొమ్ములు పోయాయి తప్పించి. విసిగి వేసారి, రెఫ్రెష్ చేస్తే ఊహు! కాలేదు మళ్ళీ చేసినా, కాని బేంకు అక్కౌంటులో మాత్రం డబ్బులు తీసేసుకున్నట్లు చూపుతోంది. ఇలా రెండు సార్లయ్యింది. టిక్కట్టు రాలేదు. గంట గడిచింది. డబ్బులు తీసుకున్నారు కదయ్యా, టిక్కట్టు రాలేదంటే, ఒక్కో సారి ఇలాగే జరుగుతాయి ఏం చేయలేము, ఇప్పుడు రెండు సార్లు తీసుకున్న డబ్బులు వారం రోజులలో మళ్ళీ మన అక్కౌంటుకు వస్తాయని చెప్పేడు, అబ్బాయి. మనకి అవసరానికి ఇది పని చెయ్యటం లేదు అంటే స్టేషన్ కెళ్ళి రిజర్వేషన్ చేయించుకొస్తానని వెళ్ళి చేయించుకొచ్చేడు. ఈ రిజర్వేషన్ల కోసం ఒక పూట గడచిపోయింది. డబ్బులు తిరిగి రావాలి. ఏం చేస్తాం. ఎవరిది పొరపాటు, మనది గ్రహచారం, వారఫలాలలో రాశాడు లెండి, ఇబ్బందులు పడతారని, అనవసర ఖర్చులని

శర్మ కాలక్షేపంకబుర్లు-సిగరెట్టు పురాణం-నేను సిగరట్లు మానేశానోచ్!

Posted on డిసెంబర్ 1, 2012
సిగరెట్టు పురాణం-నేను సిగరెట్లు మానేశాను.

ఇతి ద్వితీయాధ్యాయ ప్రారంభః.

సిగరట్టు కాలుస్తూ కాని, మరేదేనా చెడ్డపని చేస్తూ కాని నాన్నగారి కంట పడలేదు 🙂 ఆయన ఒక ఋషి, ఏమీ పట్టించుకునేవారు కాదు అనవసరంగా, కనపడ్డామో తప్పు చేస్తూ, కావిడి బద్దతో పెళ్ళి చేసేరనమాటే. మళ్ళీ జన్మలో ఆ తప్పు ఛస్తే చెయ్యలేం, అందుకు బహు జాగ్రత్తలు తీసుకునేవాడిని, పెళ్ళి జరగకుండా 🙂 చిన్నప్పుడొక సారి చేసేరు పెళ్ళి, అప్పటినుంచే ఈ జాగ్రత్తలు.

ముక్కుపొడి పీల్చేవాడికి చుట్ట దమ్ము సరిపడదు, అది ఆనదు కూడా, చుట్టతో వచ్చే నికోటిన్ పరిమాణం చాలదు, ముక్కుపొడితో వచ్చేదానితో బేరీజువేస్తే. అలాగే మిగిలిన సిగరట్లు కూడా. వాటిలో డెక్కన్, చార్మినార్ లాటి వాటిలో పుగాకులోని కాడలలాటి వాటిని ఉపయోగించి తయారు చేస్తారు. వీటికి ఘాటెక్కువ. ఇక బర్కిలీ,సిజర్స్, వగైరా లాటి వాటిలో వాడే పొగాకు రెండవ రకం కావచ్చు. ఇక గోల్డ్ ఫ్లేక్ వగైరా లాటి వాటిలో వాడేది నాణ్యమైన పొగాకు. అన్నీ నికోటిన్ సరఫరా చేసేవే కాని కొద్ది హెచ్చు తగ్గులలో ఘాటు తేడా, వాసనలో కూడా. నేను సిగరట్టు కాల్చడం కూడా విలక్షణంగా ఉండేది. చూపుడు వేలు మధ్య వేలు మధ్య వెలుగుతున్న సిగరట్టు ఉంచి, గుప్పిడి మూసి గుప్పిడి నోటి దగ్గర పెట్టుకుని దమ్ము లాగితే, చూసే వాళ్ళకి బహు భయంగా ఉండేది, దీన్ని గంజాయి దమ్ము అంటారు. చిన్న చిటకా ఏమంటే, ఇలా దమ్ము లాగిన పొగని ఊపిరి తిత్తులలోకి కొద్దిగా మాత్రమే వెళ్ళనిచ్చి నోటిలో పొగ ఎక్కువగా ఆపి, నోటి దవడల ద్వారా నికోటిన్ ప్రవేశ పెట్టేవాడిని శరీరంలోకి. ఇలా సిగరట్టు కాల్చడం ఒక ధ్రిల్, మామూలుగా కాలిస్తే కాల్చినట్లు ఉండేది కాదు..

అమ్మ కంటే ఇల్లాలే ఈ విషయంలో ఎక్కువ సహనం వహించింది. ఈ అలవాటు మానుకోక పోడానికి కొత్త కారణాలు దొరికేయి. అది రాత్రి పగలు అని తేడా లేని ఉద్యోగం. అర్ధ రాత్రి ప్రారంభమయ్యే ఉద్యోగానికి, రాత్రి మేలుకు ఉండటానికి సిగరట్టు కాల్పు ఒక వంక, బాగానే పని చేసింది. ఆ తరవాత ప్రమోషన్ వచ్చినా, అదీ రాత్రి పగలు ఉద్యోగమవడం తో సాకు కొనసాగింది. ఆ తరవాత జె.యి ఐన తరవాత టెన్షన్ కి ఇది టానిక్ లా పని చేసింది. ఈ మధ్యలో ఒక సారి మానేయాలనే తీర్మానం గట్టిగా చేసుకుని బండెక్కా, జబల్పూర్ కి. ప్రతి సారి మానెయ్యాలని తీర్మానించుకోడం మళ్ళీ ఏదో సాకుతో మొదలెట్టేయడం జరిగిపోయింది. జబల్పూర్లో ఉన్న కాలంలో ట్రయినింగు సమయం, దానికితోడు అది నేను బాగా చేసిన పని, తెలిసిన విద్య కనక పెద్ద బాధ పడలేదు, మిగిలిన వారు శీర్షాసనాలేస్తోంటే, నేను విలాసంగా కాలక్షేపం చేసేవాడిని. హాయ్! హాయ్! అందుకు మానేసేను,సిగరట్టు రెండేళ్ళు, అమ్మయ్య బతికిపోయాననుకున్నా, టెన్షన్ లేక. ఆ తరవాత వస్తూ విజయవాడ స్టేషన్ లోనే సిగరట్టు అంటించా, కారణం పోస్టింగ్ దగ్గరేదో కిరికిరి జరుగుతోందన్న గాలి వార్త చెవిని పారేసేడో మిత్రుడు రయిల్లోనే, ఇంకేమిటి మళ్ళీ మొదలు. ఉద్యోగం పెరిగింది, హోదా పెరిగింది, ఆహ్వానాలు అందుతున్నాయి, కొంచెం జాగ్రత్త పడ్డా, సున్నితంగా తిరస్కరిస్తూ వచ్చా, కాని ఒక చోట ఇబ్బందిలో చిక్కుకుపోయా, అది మొదలు మరొక దురలవాటు. ఆ తరవాత ఆహ్వానాలు తిరస్కరిస్తూ, ఒకచోటే కానిస్తూ కాలం గడిపేసేను.

ఐదారేళ్ళు ఆ అలవాటు, సిగరట్టు జమిలిగా స్వారీ చేసేయి, నా మీద. ఒక రోజు ఇల్లాలు నిలదీసింది, “ఏం చేస్తున్నారు, ఇది బాగుందా, పిల్లలు పెరుగుతున్నారు, ఆలోచించుకోనక్కరలేదా? పిల్లలు మిమ్మల్ని చూసి నేర్చుకోరా? మీరే అందరికి చెబుతారు కదా! శకునం చెప్పే బల్లి కుడితిలో పడ్డట్టు లేదా మీ పరిస్థితి, నేను ఉన్న సంగతి చెప్పా, ఈ అలవాట్లు మంచివా? మీ ఇష్టం ఎలా ఉంటే అలా చెయ్యండి” అంది.( ఇది చాలా మంది ఇల్లాళ్ళ ఆలోచనే )”మరొక మాట మీరు ఇంటిదగ్గరుంటే సిగరెట్టు కాల్చరు, ఎన్నిరోజులు ఇంటి దగ్గరున్నా, బయటికెళితే కాలుస్తారు, ఇదేమి వింత కదా, ఇంటి దగ్గరే ఉన్నాననుకుని మానెయ్యచ్చు కదా” లా పాయింటు లాగింది. “మానేయాలని అనుకోవచ్చుగానీ…” సాగదీస్తే “సింగినాదం ఊరికే సాకు చెబుతారు” అంది, కరణేషు మంత్రి కదండీ 🙂 నిజంగా కూడా నా తల్లిగాని, ఇల్లాలు కాని, పిల్లలు కాని నేను సిగరెట్టు కాలుస్తుండగా చూడలేదు, ఎప్పుడూ, ఇదీ ఒక విచిత్రమే, మనసు చేసే చిత్రమే.

కొద్దిగా కదలిక వచ్చింది,నాలో, అది పూర్తి అవడానికి మరొక అవాంతరం సాయపడింది. ఒక మిత్రుడు చనువు తీసుకుని ఒక విషయం పీక మీదికి తీసుకొచ్చాడు, అప్పుడు కళ్ళు తెరుచుకున్నాయి, గీతా సారం అర్ధమయ్యింది, పెద్ద అలవాటు, మందు అలవాటు వదిలిపోయింది, మొదటిది నిలిచిపోయింది :).జీవితంలో ఎదురు దెబ్బ తగిలింది, నెమ్మదిగా కోలుకున్నా. అప్పుడు మూడు పెట్టెలు కాల్చడం నుంచి ,ఈ సిగరట్టు అలవాటు కనీస స్థాయికి అనగా రోజుకి ఐదు సిగరట్లు కాల్చే స్థాయికి పడిపోయింది. ఇలా నడుస్తుండగా కాలం కదలిపోయి నువ్వు బయటికెళ్ళిపోవచ్చన్నప్పుడు కూడా సిగరట్టు వదల లేదు, కాని బాగా తగ్గిపోయింది. రోజుకి అరపెట్టి కాల్చేవాడిని. రిటయిర్ అయిన తరవాత ఒక మిత్రుడు పిలిచి వ్యాపారం చేదామన్నాడు,చేసేం, లాభాలూ వచ్చాయి. అప్పుడు కూడా ఐదు సిగరట్ల తోనే సరిపెట్టేను.

ఒక రోజొక చిత్రం జరిగింది. అక్కడ ఉన్న ఒక తోటి వారితో మాట్లాడుతుండగా” బాబాయ్! ఏం మందు కొట్టేవు, అంత ఘాటు వాసనొస్తోంది” అన్నాడు. “లేదబ్బాయ్! మందు మానేసి చాలా ఏళ్ళయయింది, ఇప్పుడు మందు కొట్టటమేంటి, సిగరట్టు కాల్చాను” అన్నా. “ఏం బ్రాండు బాబాయ్ అంతలా ఉంది” అన్నాడు. “నేను మామూలుగా కాల్చేదే గోల్డ్ ఫ్లేక్ ఫిల్టర్” అన్నా. ఈ సంభాషణ తరవాత నాలో ఒక రకమైన భావన బయలుదేరింది. మనం చేస్తున్న పని బాగో లేదని అంటున్నారు, పదిమంది వద్దన్న పని చెయ్యడం మంచిదా? దానికి తోడు ఇది ఆరోగ్యాన్ని కూడా ఇబ్బంది పెడుతుంది కదా అనుకుని ఎవరికీ చెప్పకుండా నా మటుకు నేను నిర్ణయం తీసుకుని, మానేశాను. దగ్గరగా ఏభయి సంవత్సరాల అలవాటుకు స్వస్తి చెప్పేను, ఇదివరకే చెయ్యచ్చుగా అనచ్చు, సమయం కలసిరావాలి, మనసుకు పట్టాలి. చాలా కాలం ఎవరూ గుర్తించనూ లేదు. ఇల్లాలు గుర్తించింది, కాని మాటాడలేదు, ఇటువంటి ప్రతిజ్ఞలు చాలా సార్లయ్యాయి కనక. కాని అభినందన చూపులోనే చెప్పేది, మనసెరిగిన నెలత అభినందన మంచి నిషా ఇచ్చింది, వాటికంటే. ఆ గుర్తింపు చాలనిపించింది. 🙂 ఒక సారి ఒక రాత్రి మేలుకుని ఉండాల్సి వచ్చింది. అప్పుడు ఆ స్నేహితుడే తన కోసం సిగరెట్లకి పంపుతూ “నీకూ కావాలా బాబాయ్” అన్నాడు. అప్పుడు చెప్పేను, “సిగరట్లు మానేసేను, ఒక సంవత్సరమయిందని,” ఒక్క సారిగా అందరూ ఆశ్చర్య పోయారు. “నువ్వనబట్టే మానేశాన”న్నా. “నువు మానేశావుగాని నన్నొదలలేదు,” అన్నాడు. అంతే మళ్ళీ సిగరెట్టు ముట్టలేదు. దగ్గరగా ఎనిమిదేళ్ళు పై మాట, మానేసి. ఇది దుర్గుణం, మానేస్తే ఏమీ కాదు, మనసు ను నిగ్రహించుకుంటే సాధించలేనిది లేదని నా మటుకు నేను నిరూపించుకున్నా.

శ్రీ శర్మ విరచిత సిగరట్టు పురాణే ద్వితీయాధ్యాయః సంపూర్ణం.

ఫలశృతి:- ఈ అలవాట్లున్న వారు ఇది చదివిన, ఆచరించిన ఇష్టసఖీ పొందు, పొగడ్త దక్కునని, అది ఈ అలవాటులిచ్చే కిక్ కంటే, ఎక్కువ కిక్ ఇస్తుందనీ అనుభవపూర్వక ఉవాచ.
స్వస్తి

శర్మ కాలక్షేపంకబుర్లు-సిగరెట్టు పురాణం.

Posted on నవంబర్ 30, 2012
7
సిగరెట్టు పురాణం.

సూతోవాచ:-సూతుడు నైమిశారణ్యంలో….అని మన పురాణ కధలు మొదలవుతాయి. అలాగ నా సిగరట్టు పురాణం మొదలయిన రోజును స్మరించుకుంటా. ఏభయి నాలుగేళ్ళ మాట, ఆ రోజు ఎస్.ఎస్.ఎల్.సి పరీక్షా ఫలితాలొచ్చేరోజు. ఇప్పటిలాగా సెల్ ఫోన్ లో ఫలితం చెప్పే రోజులు కావు, కనీసం పేపరు వచ్చే ఊరూ కాదు. ఆ రోజుల్లో విశాలాంధ్ర పత్రిక ఒకటే ఇలా ఫలితాలు ముందుగా ప్రకటించి పేపరు రూపాయికి అమ్మేది. మరెవరూ వేసేవారు కాదు. అసలున్న పత్రికలెన్ని, అయ్యా ముగ్గురు తొమ్మండుగురని, తెనుగులో, ఆంధ్ర ప్రభ, ఆంధ్ర పత్రిక, విశాలాంధ్ర ఇంతే. సంగతి పక్కదారి పట్టేసినట్లుంది కదూ! , సిగరెట్లనుంచి :). గోదావరి గట్టు మా ఊరి సెంటరు, మిరప పంట బాగా పండి, ఆ రోజుల్లో శ్రీ లంకకి ఎగుమతి చేయడానికి రెట్టింపు పై ధరతో అమ్మకాలుంటే, లాభాలొస్తే, మా ఊళ్ళో, ఆ రోజుల్లో సైకిళ్ళు కొన్నారు, కొత్తగా. కొత్త సైకిల్ మీద తిరగడమొక ఆనందం, ఆ రోజుల్లో, అందులోనూ గ్రీన్ హంబర్ సైకిల్ మీద, అప్పటికి సైకిళ్ళూ లేవు మా ఊళ్ళో ఎక్కువగా. బలే అందంగా ఉండేది సైకిలు, అలాగే నడిచేది. ఏ రోజు ఫలితాలొస్తాయో తెలీదు, ఈ వేళొస్తాయి, రేపొస్తాయని చెప్పుకోడమే. ఒక రోజు ఈ వేళ ఫలితాలొస్తాయని, రూఢిగా చెప్పుకోడంతో గట్టు మీద కాశాం. ఈ సైకిల్ పిచ్చాడెవరేనా తాళ్ళపూడి వెళ్ళకపోతాడా? వెళితే పేపర్ తేకపోతాడా అని ఆశ.

నాకయితే భయం లేదు, పాస్ అవుతానని నమ్మకమే, కాని మాకు సీనియర్, రెండు డింకీలు కొట్టి మాతో కలిసిన స్నేహితునిదే అనుమానం. నేను చెప్పేను, నువ్వూ పాస్ అవుతావురా అని, అబ్బే వాడికి నమ్మకం లేదు, నా మాట మీద, నా పేపర్లో చూసి రాసుకున్నా . వాడికి ఈ సిగరెట్లు కాల్చే అలవాటుంది, ఆ రోజు వాడు కాలుస్తూ, నన్నూ కాల్చమని ప్రోద్బలం చేసేడు. వద్దన్నా, ఒకటే, ఫరవాలేదు, ఒక్క దానికి అలవాటయిపోదని బలవంతంగా, ఒక్కటంటే ఒక్కటి అంటింపచేసేడు, సూతోవాచా అని. అది మొదలండి, ఆ వేళ ఫలితాలొచ్చాయి, ముందు వాడి నెంబర్ చూసి పాస్ అయ్యాడంటే అప్పుడు నా నెంబర్ చూసుకున్నా, నాకేం అనుమానం లేదుగా : ) ఈ ఆనందంలో మరొకటి ముట్టించి, ముట్టింప చేశాడీ నిషిద్ధ గురువు. ఇంకక్కడి నుంచి అలవాటు మొదలండీ!,మొదటి సారి ఉక్కిరిబిక్కిరయి కళ్ళనీళ్ళొచ్చి, నానా హైరానా పడ్డా, ఎప్పుడూ ఇక కాల్చకూడదనుకుంటూ, నోట్లో పిప్పర్మెంటు బిళ్ళ వేసుకుని చప్పరిస్తూ.

బర్కిలీ సిగరెట్లు కాల్చడం, ఆ రోజులలో బేడ, ఆ పెట్టి సిగరెట్ల ఖరీదు. పెట్టి సిగరట్లు కొంటే దాచేదెలా? ఎవరేనా చూస్తే? అందుకు కొట్టువాడి దగ్గర రెండు, మూడు సిగరట్లు తీసుకోడం, ఒక సారి. పది అయిన తరవాత, డబ్బులివ్వడం, సిగరట్ల కాతా కుదిరిపోయింది 🙂 కొట్టు దగ్గర సిగరట్టు అంటించుకుని కాలుస్తూ, కొండొకచో ఎవరేనా ఎదురుపడితే సిగరట్టు అరచేతిలో దాచేసి పెద్ద పనున్నట్లు గోదారి లంకలో కి పోయి అక్కడ ఊదేసి రావడం. ఆలా అది పెరుగుతూ వచ్చింది, ధరా, దాంతో పాటు నా కాల్చడమూ. ఎక్కువగా కాల్చిన రోజులలో మూడు పెట్టిల సిగరెట్లు తగలేసేవాడిని, రోజుకి. బర్కిలీ తప్పించి మరొకటి కాల్చ బుద్ది అయ్యేదికాదు. ఇంకా ఆ రోజులలో ఉన్న సిగరట్ల పేర్లు, డెక్కన్,చార్మినార్, ఇది మా ప్రాంతంలో దొరికేది కాదు. పని వాళ్ళు,టీ డెక్కన్ సిగరట్టు ఉంటే చాలనుకునే రోజులు.సిజర్స్,కాప్ స్టైన్, గోల్డ్ ఫ్లేక్ ఇవే ఆరోజులలో ఆ పల్లెలో దొరికే సిగరట్లు. ఆ తరవాత కూడా నాకు మరే కొత్తవీ కనపడాలేదు :)నేను ప్రయత్నించా లేదు. విదేశీ సిగరట్లని, మార్ల్ బరో చుట్టలని చాలా సార్లు కాల్చడానికి ప్రయత్నం చేసేనుకాని, దేశీయాభిమానం అడ్డొచ్చి 🙂 వాటిని తగలబెట్ట లేదు. ఎంటోగాని అవి బాగానూ ఉండేవి కావు, రుచిగా. సిగరట్టుకి రుచేంటీ అనద్దు, కాల్చినవారికి కాని తెలీదు, ఆ అనుభవం :). పొగ వాసన బట్టి కాల్చే సిగరట్టు ఏదో చెప్పగలిగినంత ప్రజ్ఞ వచ్చేసింది, ఇందులో పి.హెచ్.డి ఉంది నాకు. 🙂 సిగరట్టు కాల్చిన ప్రతిసారి నోరు శుభ్రం చేసుకోడం, వాసన రాకుండా పిప్పరమెంటు బిళ్ళలు చప్పరించడం,కొత్తలవాటు.

కన్నమ్మకి తెలిసింది సిగరట్లు అలవాటయ్యాయని. ఒక సారి చెప్పింది చెడు అలవాటు చేసుకోకూ అని. అలాగేనమ్మా అన్నా, అక్కడినుంచి వెళ్ళిపోయాగా, అమ్మ మాట మరిచిపోయా!. పెంచుకున్నమ్మకి తెలిసిపోయింది, సిగరట్లు కాలుస్తున్నానని, కాని ఎప్పుడూ నన్ను అడగలేదు, కారణం, నేనంటే పిచ్చి ప్రేమ, నాకే తెలుసుననీ, మానేస్తాననీ నమ్మకం. విచిత్రం ఏమంటే తరవాత కాలంలో అమ్మ సిగరట్టు పెట్టి చూసేది కాని, నేను సిగరట్టు కాలుస్తుండగా ఎప్పుడు చూడలేదు. అమ్మ ఎదురుగా ఎప్పుడూ కాల్చలేదు. ఆ తరవాత నా జీవితం లో ప్రవేసించిన నా బంగారం, అదేనండీ నా ఇల్లాలు, కొత్తలో గునిసేది కాని తరవాత, తరవాత మానేసింది. ఇంటి కొచ్చేటప్పటికి నోరు శుభ్రం చేసుకురావడం కావచ్చేమో, లేదా చెప్పిన కొద్దీ ఎదురు తిరుగుతాడు,ఎందుకు చెప్పడం, ఊరుకుంటే మానేస్తాడేమో ననే ఆశ కావచ్చు. ఇలా నా సిగరట్ల కత్తికి జీవితంలో ఎదురు లేకపోయింది.

సిగరెట్లు ఎందుకు మానేశారు, ఎలామానేశారని Snkr గారు ప్రశ్నిస్తే జవాబుగా టపా రాస్తానన్నా. అదే ఈ టపా. సిగరెట్లు ఎలా మానేసేనో చెప్పేముందు ఎలా మొదలెట్టేనో చెప్పుకోవాలి కదా. 🙂

శ్రీ శర్మ విరచిత సిగరట్టు పురాణే ప్రధమోధ్యాయః సమాప్తః

శర్మ కాలక్షేపంకబుర్లు-పొగడ్త.

Posted on అక్టోబర్ 28, 2012
పొగడ్త.

“నామ పారాయణప్రీతా”ఇది లలితాదేవికి సహస్రనామాల్లో ఒక పేరు. తన నామాని కంటే అయ్య నామాన్ని పారాయణ చేస్తే, అమ్మ సంతోషిస్తుంది, ప్రీతి చెందుతుంది.అమ్మ నామం పారాయణ చేసినా ప్రీతిపొందుతుంది. మరొక సంగతి ధర్మరాజు రాజసూయం చేశాడు, అగ్ర పూజ ఎవరికి చేయమంటావని తాత భీష్ముడిని అడిగితే,

రోదసీ కుహరంబు రుచిరాంశుతతి జేసి,యర్కుండు వెలిగించునట్టు లమృత
సందోహనిష్యంద చంద్రిక జేసి శీతాంశుడానందించునట్టు సకల
జనులకు తనదైన సదమలద్యుతి జేసి తనరంగ దేజంబు దనువు దాన
చేయుచు నున్నసత్సేవ్యుండు పుండరీకాక్షుండు గృష్ణు డనాదినిధను

అబ్జనాభు డుండ నర్ఘ్యంబునకు నిందు నర్హు లొరులు గలరె యజ్ఞపురుషు
నఖిలలోక పూజ్యు నచ్యుత బూజింపు, మధిప యదియ చూవె యజ్ఞఫలము…భారతం…సభా పర్వ….ఆశ్వా.2….6

మరెవరో ఎందుకు గొప్పవాడయిన కృష్ణునికి అగ్ర పూజ చేయమని, అదే యజ్ఞ ఫలమని చెప్పేడు. కృష్ణునికి అగ్ర పూజ జరుగుతూ ఉంటే సహించలేని శిశుపాలుడు, ముందుగా ధర్మరాజుని పట్టుకుని, గొప్ప రాజులుండగా, ధర్మం తెలియని వాడికి అగ్రపూజ తగదంటాడు. కావలసిన వాడయితే సొమ్ములిచ్చుకో, కావలసిన పని చేసిపెట్టుకో, అంతే తప్పించి ఇంతమంది రాజులు, భూసురులు ఉన్న సభలో ముసలాడయిన భీష్ముని మాటపట్టుకుని కృష్ణుడికి అగ్రపూజ తగదన్నాడు. పెద్దవాడని పూజిస్తావా? వసుదేవుడున్నాడుకదా!, ఋత్విజుడనుకుంటే? వ్యాసుడున్నాడు కదా!, ఆచార్యుడని పూజిద్దామనుకుంటే ద్రోణుడున్నాడే!,రాజని పూజించావనుకుంటే, యాదవులు రాజులు కాదుకదా! ఇలా ఇతను ఎందులోకీ చెందనివాడు, నువ్వు భీష్ముని పలుకులతో నవ్వులపాలయి పోయావన్నాడు. అంతెందుకు, నీకు తెలియక ఇస్తే దీనికి నేను అర్హుడను కానననక, కృష్ణుడు ఎలా పుచ్చుకున్నాడయ్యా.! అని తిడుతూ ఉంటే ధర్మరాజు అనునయించాడానికి ప్రయత్నిస్తూ ఉంటే, భీష్ముడు వీడు కుఱ్ఱాడు వదిలెయ్యమని చెప్పి, శిశుపాలుడితో భీష్ముడు,ఈ సభలో వారంతా ఆయన దయకు పాత్రులే, జ్ఞాని అయిన వాడు బాలుడయినా బ్రాహ్మణుడు పూజార్హుడు, క్షత్రియుడు, రాజులందరిలో గొప్పవాడయితే పూజనీయుడు, ఈయన జగదాధారుడు, మాకే కాదు, అందరికీ పూజనీయుడే అన్నాడు.

వృద్ధులొక లక్షయున్నను, బుద్ధియె యెవ్వరికి వారి బూజింపంగా
నిద్ధరణీశులలో గుణవృద్ధని పూజించితిమి త్రివిక్రము భక్తిన్…భార…సభా…ఆశ్వా..2….27

లక్షమంది వృద్ధులున్నా, బుద్ధిలో గొప్పవాడయిన కృష్ణుడిని పూజించామయ్యా అని చెప్పేడు, భీష్ముడు. చిరాకెత్తిన సహదేవుడు, కాదన్న వాడినెత్తి మీద కాలెట్టి తొక్కేస్తా అన్నాడు. ఈ మాటకి దేవతలు ఆనందించి పుష్ప వర్షం కురిపించేరు, నారదుడు ఆడేడు. ఆ తరవాత శిశుపాలుడు, మహాత్ముడయిన జరాసంధుడిని బ్రాహ్మణ రూపంలో భీముడు, అర్జనుడినితోడు తీసుకుని మరే చంపించాడు, అటువంటి వాడిని ఎందుకు తెగ పొగిడేస్తున్నావు, నీకంతగా పొగడాలని ఉంటే సుగుణ వంతులయిన కర్ణుడినో,శల్యుడినో పొగడచ్చుకదా, అంటూ ఉంటే పళ్ళు పటపటా కొరుకుతూ శిశుపాలుని మీద కోపంచూపిస్తున్న భీముని చూసి, భీష్ముడు, శిశుపాలుని జన్మ వృత్తాంతం చెబుతాడు. “వీడు పుట్టినపుడు వికృతంగా పుట్టేడు, ఆకాశవాణి వీడి అవకరాలు ఎవరి చేతిలో హరిస్తాయో, వారి చేతిలోనే వీడు హతుడవుతాడని చెప్పింది, మేనత్త సాత్వతి, తన ఇంటికి వచ్చిన మేనల్లుడు కృష్ణుని చేతికిచ్చింది, శిశుపాలుని, అవకరాలన్నీ పోయాయి, పుత్రుని మారకుడు కృష్ణుడేనని తెలుసుకున్న వీనితల్లి, కృష్ణుని వేడు కుంటుంది. వంద తప్పులు కాయమని కోరింది, మేనత్త కోరిక మన్నించాడు, కృష్ణుడు. అందుచేత, వీడు హరి చేత హతుడవటం ఖాయమని, శాంతం వహించమని చెబుతాడు. అప్పుడు కృష్ణుడు శిశుపాలుడు చేసిన తప్పులిలా చెప్పేడు.

ప్రాగ్జ్యోతిషంబున భగదత్తుపయి నేము వోయిన నిత డన్యాయవృత్తి
నిట బాలవృద్ధుల కెల్లభయంబుగా ద్వారకాపురి గాల్చె వీరులైన
భోజరాజన్యులు పొలతులతోడ రైవతకాద్రి గ్రీడాభిరతి బ్రమత్తు
లయి యున్నవారల నదయుడై వధించె దేవాభు డగువసుదేవు చేయు

నశ్వమేధమునకు నభ్యర్చితంబైన హయమునపహరించి యజ్ఞమునకు
విఘ్న మాచరించె వీ డతిపాపుడై బభ్రుభార్య దనకు భార్య జేసె…..భార……సభా.పర్వమ్….ఆశ్వా…2…..65

మఱియు వాగ్విషయంబు లయినయపకారంబు లనేకంబులు సేసె మా యత్త సాత్వతి నన్నుం బ్రార్ధించుటం జేసి యిద్దురాత్ముండు సేసినయపరాధశతంబు సహించితి నిప్పుడు మీరిందఱు నెఱుంగ నాయందకారణవ్యతిక్రమం బుపక్రమించి యత్యంత శత్రుండయ్యె…….భార..సభా.పర్వం…ఆశ్వా..2…..66

భగదత్తునిపైకి మేము యుద్ధానికి వెళితే ఇతడు బాలలు,వృద్ధులు,ఉన్న ద్వారకను కాల్చేశాడు, రైవతక పర్వతం మీద స్త్రీలతో క్రీడా వినోదంలో ఉండి, జాగరూకతలో లేని భోజుడు, మిగిలినవారలను చంపేశాడు, వసుదేవుడు అశ్వమేధం చేస్తుంటే, దానికోసం ఉంచిన గుఱ్ఱాన్ని దొంగిలించుకుపోయి యజ్ఞం పాడుచేసేడు, బభ్రువు భార్యను తనకు భార్యగా చేసుకున్నాడు, ఇవే కాక చాలా తప్పులు చేసేడు, మా అత్తకిచ్చిన మాట ప్రకారంగా ఇన్ని తప్పులూ సహించాను, ఇప్పుడు అకారణంగా నా మీద శత్రుత్వం వహిస్తున్నాడు అని చెబుతుండగా, శిశుపాలుడు, నీతో స్నేహం,విరోధం నాకెందుకోయ్, నాకిస్తానన్న అమ్మాయిని తీసుకుపోయి నువ్విలా మాట్లాడటానికి సిగ్గు లేదా అన్నాడు.

ఇంక కృష్ణుడు సహించలేక, చక్రాన్ని ప్రయోగిస్తే అది శిశుపాలుని తల తరిగితే, వానిలోనుంచి ఒక జ్యోతి వచ్చి కృష్ణుని చేరుతుంది, అందరూ ఆశ్చర్యపడగా.

కృష్ణునికి శిశుపాలుడొక మేనత్త కొడుకైతే, పాండవులు మరొక మేనత్త కొడుకులు. అర్హుడయిన కృష్ణుని పూజిస్తే, అసూయతో శిశుపాలుడు గొడవ చేసేడు, ఫలితం అనుభవించడు కూడా. అర్హులయిన వారిని పొగిడినపుడు, పూజించినపుడు తప్పు పడితే ఇలాగే జరుగుతుంది, సినిమా వారు దీన్నెలా తీశారో మరి.

టపాలు పెద్దవి రాయకూడదని నిర్ణయం తీసుకున్నా, ఐనా ఇది పెద్దదయిపోయింది. అందుకు మిగతా రేపు మీరు పొగిడినా తెగిడినా సరే! 🙂

శర్మ కాలక్షేపంకబుర్లు-మెచ్చుకోలు.

Posted on అక్టోబర్ 30, 2012
6
మెచ్చుకోలు

( నిన్నటి టపా తరవాయి )

ఈ సందర్భంగా ఒక కధ గుర్తుకొచ్చింది అవధరించండి. ఒక రాజ్యంలో ఒక ఊరు, ఆ వూళ్ళో ఒక యువకుడు కవనం బాగా చెబుతాడని పేరుపొందాడు. ప్రజలు అందరూ ఈయన మంచి కవి అని మెచ్చుకుంటున్నారు. ఆ యువకుడు ఆనందపడుతున్నాడు, ఉత్సాహంతో మంచి కవితలూ చెబుతున్నాడు, కాని ఒక చిన్న వెలితి ఉన్నట్లు బాధపడుతున్నాడు. ఇంటికి వచ్చి తల్లితో “అమ్మా! నేను మంచి కవిత్వం చెబుతున్నానని అందరూ మెచ్చుకుంటున్నారు, కాని నాన్న గారేమిటే, ఎప్పుడూ మెచ్చుకోలేదని” వాపోయాడు. పాపం పిచ్చి తల్లికేమితెలుసూ “ఏమో నాయనా! ఆయన తత్వమే అంతనుకుంటా” అంది. కాలం గడుస్తోంది తండ్రి అలాగే ఉన్నాడు, మార్పులేదు, ప్రజలు మాత్రం ఈ యువకుడిని గొప్ప కవిగా గుర్తించేసేరు. ఇదేగాక ఈ తండ్రిగారు ఎవరేనా బయటివారు “మీ అబ్బాయి మంచి కవిత్వం చెబుతున్నాడంటే” వాడి “మొహం వాడికేమి వచ్చని” చులకన చేస్తున్నట్లుకూడా ఈ యువకునికి తెలిసి ఎక్కువ బాధ పడుతుండేవాడు. ఒక రోజు ఈ విషయం తల్లికి చెప్పి వాపోయాడు. తండ్రికి అన్నం పెట్టి పక్కన కూచున్న తల్లి, నెమ్మదిగా కొడుకు విషయం కదిపి, భర్తను అడిగింది ” ఊరువారంతా గొప్పకవి అని మన వాడిని స్తుతిస్తూ ఉంటే మీరు పలకటం లేదు సరికదా, వాడికేమి వచ్చు అని చులకన చేసినట్లు మాట్లాడుతున్నారట, ఇదేమీ” అని అడిగింది. దానికి తండ్రి “ఓసి! పిచ్చిదానా నా కొడుకు గొప్పగా కవిత్వం చెబుతున్నాడనీ, గొప్ప పేరు తెచ్చుకున్నాడని, ముందు ముందు ఇంకా గొప్ప కవిత్వం చెప్పగలడనీ, ప్రజలు పొగుడుతున్నది చూసి, అందరూ మెచ్చుకోవడం చూసి నేనెంత మురిసిపోతున్నానో, నా మనసెంత ఆనందం పొందుతోందో తెలుసా” అన్నాడు. ఈ మాటలు విన్నవారు ఇద్దరూ, ఆశ్చర్యపోవడం వారి వంతయింది. ఒకరు కవి తల్లి, రెండవ వారు అటక మీద బండరాయి పుచ్చుకుని కూచుని తండ్రి చెప్పే జవాబుకు, అంటే తనకేమీ చేతకాదని తండ్రి తల్లితో చెప్పబోయేది విని, తండ్రి తలపై బండరాతితో మోది చంపాలనే ఉద్దేశంతో ఉన్న యువకుడు. తల్లి, “మరయితే మీరు ఎప్పుడూ కొడుకుని మెచ్చుకోలేదేమని” అడిగింది. దానికా తండ్రి “పిచ్చిదానా! నా కొడుకును నేను మెచ్చుకుంటే ఆయుక్షీణం, అందుకు ఎక్కడా మెచ్చుకోను, మన అబ్బాయి, ఆయువు క్షీణిస్తే నేను బాధ పడనా? మన అబ్బాయి చాల గొప్ప కవి, వాడు చెప్పే కవితలు చాలా బాగుంటాయి. ముందు ముందు ఇంకా చాలా పేరు ప్రఖ్యాతులున్నవాడవుతాడ”ని చెబుతాడు. ఇది విన్న కొడుకు బండ రాతితో కిందికి దిగివచ్చి, తండ్రి పాదాలకి నమస్కారం చేసి, తాను చేయబోయిన తప్పు చెప్పుకుని, దీనికి శిక్ష విధించమని అడుగుతాడు. దానికి ఆ తండ్రి నీవు “నీ భార్యను తీసుకుని, నీ అత్తవారింటికి వెళ్ళి ఆరు నెలలు ఉండి, రమ్మని” చెబుతాడు. కొడుకు మారు మాటాడకుండా తండ్రి అజ్ఞ పాలిస్తాడు.

తల్లి అడుగుతుంది,”అదేమీ, కొడుకు, చేసిన తప్పుకు శిక్ష విధించమని అడిగితే, అత్తవారింటి దగ్గర ఆరునెల్లలుండి రమ్మన్నారు, అత్తవారింటి దగ్గర ఆరు నెలలుండటం శిక్ష ఎలా అవుతుందని” అడిగింది. దానికి తండ్రి సమాధానం చెప్పలేదు. ఆరు నెలల తరవాత కొడుకు తిరిగివచ్చిన తరవాత తల్లి అడుగుతుంది “నాయనా! ఈ ఆరు నెలలు అత్తవారింటి దగ్గర బాగా జరిగింది కదా” అని దానికి అతను ఇలా చెప్పేడు.

“మొదటిరోజు అందరూ చాలా అగ్గగ్గలాడుతూ పలకరించేరు,అన్నీ సమకూర్చారు, మాకు ప్రత్యేకంగా గది ఏర్పాటు చేశారు. మరుసటి రోజు నాభార్యకి వదిలేశారు, అన్ని ఏర్పాట్లు చూడటానికి. మూడవరోజు దాటిన దగ్గరనుంచి నన్ను సామాన్యంగానే చూశారు. భోజనానికి ప్రత్యేక ఆహ్వానం లేదు. మొదటి వారం నడిచి పోయింది అటూ, ఇటూగా, మరుసటి వారం నుంచి మొదలయ్యాయి, నా తిప్పలు. పాలేరు ఆరోజు రాలేదు, పాలు తీయలేదు, అత్తగారు పాలు తీయడానికి వెళితే ఆవు తన్నింది, బావమరుదలు, మామగారు ఇంటిలో లేరు, నేను పాలు తీయాల్సి వచ్చింది,ఇలా ఒక్కొకటే పనులు అనుకోకుండానూ, కొన్ని భార్య పురమాయించడం, కొన్ని అత్తగారు పురమాయించడం, కొన్ని బావ మరదులు పురమాయించడంతో, పనులు చేయించడం మొదలెట్టేరు. భార్య “ఊరికే ఖాళీగా కూచుని ఏమి చేస్తారు చేలో పని జరుగుతోందిట, నాన్న పని మీద వెళ్ళేరు, అన్నయ్య మరొక పొలం వెళ్ళేడు, తమ్ముడు చదువుకుంటున్నాడు, మీరు పొలం వెళ్ళి రండి” అని పురమాయింపుతో ప్రారంభమయిన పాలేరు జీవితం ఆతరవాత నిజంగానే పాలేరు మానెయ్యడంతో ఆ పనులు నాకు నిశ్చయమయిపోయాయి, మామగారు, “పాలేరు మానేసేడు, కొద్దిగా ఉదయం సాయంత్రం దూడను విడిచిపెట్టి, వాటి ఆలనా పాలనా చూడు నాయనా!” చెప్పడంతో. ఇలాగ మర్యాద అడుగంటింది, మన్నన మొదలే పోయింది. నిజానికి నేను అత్తవారింటిలో సుఖం అనుభవించలేదు,నా భార్యతో ఒంటరిగా మాటాడుకునే సావకాశం కూడా లేకపోయింది. అందరూ పని చెప్పేవారే, అవమానమే ఎదుర్కున్నాను,” అని చెప్పేడు. అంతా విన్న తండ్రి “నాయనా! కొడుకు ఎంతటి గొప్ప వాడయినా, చేత కానివాడయినా తల్లి తండ్రులు భరిస్తారు. అందుచేత తల్లి తండ్రులు బిడ్డల పట్ల చేసే ప్రతి పనిలోనూ ఏదో పరమార్ధం ఇమిడి ఉంటుందన్నది మరిచిపోవద్దని” చెబుతాడు. ఆతరవాత ఆయువకుడే భారవి మహాకవి అవుతాడు.

పొగడ్త వల్ల కలిగేది ఆనందం, ఇదీ మనసు చేసే చిత్రమే, ఆ అనుభవం కాలమెంత? క్షణం. ఆ క్షణకాల అనుభవానికి మనసు తహతహలాడుతుంది, చూశారా! ఒక మెచ్చుకోలు మాట చెప్పలేదని అంతటి మహాకవి, విచక్షణ కోల్పోయాడు, తండ్రిని హత్యచేయబోయాడు !! అంటే దీని మత్తు ప్రభావం ఎంతో!!! తస్మాత్……..

స్వస్తి

తాడిగడప శ్యామలరావు on 03:49 వద్ద అక్టోబర్ 30, 2012 said:
శర్మగారూ, మీరు వ్రాసినది భారవి మహాకవి గురించి. ఈ‌యన కిరాతార్జునీయం వ్రాసారు. భారవి మామగారు అన్నంభట్టు. భారవిని అత్తవారింట్లో ఒక సంవత్సరం‌ఉండి రమ్మని విధించారు తండ్రిగారు – ఆరు నెలలు కాదు. ఆ సంవత్సరంలో వచ్చిన వరలక్ష్మీవ్రతం నోచుకుందుకు గాను భార్యకు సొమ్ము సమకూర్చటం కోసం భారవి తాను వ్రాస్తున్న కిరాతార్జునీయంలోని ప్రథమశ్లోకాన్ని ఆ ఊళ్ళోని ఒక వ్యాపారికి తాకట్టు పెడతాడు. అనంతరం ఆ వ్యాపారికి ఆ శ్లోకం కుటుంబాన్ని,జీవితాన్ని నిలబెట్టిందని ఐతిహ్యం. ఆ శ్లోకం:
సాహసా విదథీత నక్రియాః
అవివేకః పరమాపదాపదం
వృణుతేహి విమృశ్యకారిణం
గుణలబ్ధాః స్వయమేవ సంపదాః

దీని భావం యేమిటంటే, కేవలం సాహసించి యే పనయినా చేయరాదు. అవివేకం వలన అతిప్రమాదకరమైన ఆపదలు కలుగుతాయి. బాగా మంచీ చేడు విచారించి పనిచేయటం ఉత్తమం. అటువంటి గుణవంతులను సంపదలు స్వయంగా వచ్చి చేరుతాయి.

నా చిన్నతనంలో, యేడవతరగతిలో ఉండగా అనుకుంటాను, ఒక పోటీలో ‘ఆదర్శకథావళి’ అన్న మంచి పుస్తకం బహుమతిగా వచ్చింది. దానిలో చదివాను భారవి కథ. ఆ పుస్తకంలో ఇంకా‌ భీష్ముడు, ధృవుడు, ప్రహ్లాదుడు వంటికథలు చాలా ఉన్నాయి.

మంచి కథను చెప్పారు. ధన్యవాదాలు.

శర్మ కాలక్షేపంకబుర్లు-నేటి పొగడ్తలు.

Posted on అక్టోబర్ 29, 2012
6
నేటి పొగడ్తలు

పొగడ్త ఒక అగడ్త లాటిది. “అగడ్తలో పడ్డ పిల్లికి అదే ప్రపంచం” సామెత. పొగడ్తల జడి వానలో తడిసేవారికి ఎప్పుడూ జలుబు చేయదు సరికదా ఆ జడివాన నుంచి బయటకొస్తే మాత్రం జలుబే కాదు జ్వరం కూడా వస్తుంది :). పూర్వకాలం, రాజులు మహరాజుల కొలువులో వందిమాగధులని, పొగడ్తలకి ప్రత్యేకంగా ఒక వ్యవస్థ ఉండేది, వీరు ఆ రాజు వంశం, చరిత్ర అన్నీ తెలిసిన వారయి ఉండేవారు. ఉదయమే మేలుకొలుపు, మెచ్చుకోలుతో చేసేవారు . రాజు నిరంకుశుడు, నీ తండ్రి ఇన్ని గొప్ప పనులు చేసేడు, నీ తాత, ముత్తాత ఇంత గొప్పవారు, నువ్వు ఇన్ని గొప్ప పనులు చేసేవు, ఇంత గొప్పవాడివి అని పొగిడేవారు, ఇది రాజ్య వ్యవస్థలో భాగంగా ఉండేది. తరవాతి కాలంలో భట్రాజులని, ఒక తెగవారు ఈ కార్యం నెరవేర్చేవారు. దానితో తప్పు చేయకూడదనే భావం ఏర్పడి, ప్రతి క్షణం మంచివాడనే పేరు నిలబెట్టుకోడానికే ప్రయత్నం చేసేవాడు. నేటి వ్యవస్థలో పార్టీపత్రికలు ఆ పని నిర్వహిస్తున్నట్లున్నాయి, డబ్బు తీసుకుని ప్రకటనల రూపంలో, వార్తల రూపంలో. ఈ ప్రకటనల రూపకర్తలు, శిల్పులు వేరుగా ఉంటారు. “అతి చేస్తే గతి చెడుతుంద”న్న సామెతలాగా ఒక్కొకప్పుడు ఈ పొగడ్తలు అతి అయి ఉన్న గోడు చెడిపోతుంది, “భారత్ వెలిగిపోతోంద”న్న దానిలా. ప్రభుత్వాలు కూడా ఈ పొగడ్తలు తమకు తామే చేసుకుంటున్నాయి, ప్రకటనల రూపంలో. పార్టీల వారికి కీర్తికండూతి, ధన కండూతి మెండుగా ఉంటుంది, ఎప్పుడూ ఎన్నికల మీదే దృష్టి ఉంటుంది.

ఈ పొగడ్తలలో రకాలున్నాయన్నారు, పాత కాలం వారు. వీటిని మూడు రకాలుగా కూడా విభజించేరు. అవి చెప్పడం కొద్దిగా అశ్లీలం అనిపించి తర్జుమా చెబుతున్నా. 1. స్వ.కు.మ. తనను తానుపొగుడుకోవడం 2.ప.కు.మ ఎదుటివారిని పొగడటం లేదా పొగిడించుకోవడం. 3.పరస్పర.కు.మ వీరు వారిని గొప్పవారని పొగిడితే, వారు వీరిని గొప్పవారని పొగుడుతారనమాట. మరొకటి ఉంది నిందాస్తుతి అని, ఇది తిడుతున్నట్టు ఉంటుంది, కాని నిజంగా, పక్కాగా పొగటటం, ఇది కవులసొత్తు. నేటి కాలానికి మా మిత్రుడు సిరివెన్నెల్ల, ఇందులో ఘనాపాటీ. “తనను తాను పొగుడుకుంటే తన్నుకున్నట్లుంటుందని” సామెత. పొగిడేవారు లేనపుడు తనను తానుపొగుడుకోక తప్పని పరిస్థితి కదా, అందుకే రెండవ, మూడవ రకాన్ని ఆశ్రయిస్తారు. ఈ పొగడ్తల బాధంతా చదువుకున్న వారు, గొప్పవారికే. సామన్యుడిని ఎవరేనా పొగిడేరంటే ముందు భయపడతారు, ఎందుకంటే, ఏగోతిలో తోసేయడానికి ఇది ప్రాతి పదికోనని. ఐదు సంవత్సరాలకొక సారి సామాన్యుడు గుర్తొస్తాడు, పార్టీల వారికి. అప్పుడు నువ్వు ఇంద్రుడివి, చంద్రుడివి అని పొగుడుతారు. నిజంగా ప్రజాస్వామ్యం నీవల్లే బతుకుతోందంటారు, అప్పటిదాకా కనపడని వారు, వేడుకున్నా దర్శనమివ్వని వారు తన గుమ్మంలో కొచ్చేటప్పటికి పొంగిపోతాడు, పిచ్చివాడు, మోసపోతాడు. కాని పూరేడు పిట్టలా, ప్రతిసారి ఉండేలు దెబ్బ తింటున్నా, పక్కకి తప్పుకుంటాడు తప్పించి,కొత్తవారిని చూసుకోడు.. మళ్ళీ మళ్ళీ వారినే ఎన్నుకుంటూ ఉంటాడు, దెబ్బలు తింటూ ఉంటాడు . పాపం చదువుకున్న వారిది మరొక తరహా, వీరికి కీర్తి కండూతి ఎక్కువ, ధన కండూతి లేదనికాదు. తమని గొప్పవారిగా గుర్తించాలని తెగ బాధపడిపోతారు. ఒక గుంపును తయారు చేసుకుంటారు. ఈ గుంపూ ఊరికే చేరదు, దగ్గరికి, వారికీ అటువంటిదేదో కావాలి, లేదా సొమ్ము సంపాదించుకునే మార్గం కావాలి. ఇది నిజంగా మూడవకోవకు చెందినదే, అటువంటి ఉపకారమేదీ లేనిరోజున వీరు తుపాకీ దెబ్బకి కూడా కనపడరు.. ఐతే చూడటానికి అలా కనపడదు. ఒక్కొకప్పుడు ఈ పొగడ్తలు చూస్తే వెగటు కలుగుతుంది కూడా. ముక్కు కోస్తే రక్తం తాగేవారిలా ఉంటాయి, ఇవి. పేర్లొద్దు కాని ఒక రాజకీయ పార్టీ కార్యకర్తలు, వారికి జీతాలిచ్చేవారులెండి, పార్టీ తరఫున, వారు ముక్కుకోస్తే రక్తం తాగేవారిలా ఆ పార్టీని పొగిడేవారు, పాపం కనుమరుగైపోయారనుకోండి. నిజమైన విషయం ఉన్నపుడు, విషయాన్ని పొగడటం, చెప్పిన వారి కౌశల్యాని కొద్దిగా హెచ్చించడం తప్పుకాదు కాని, వారు చెప్పిన ప్రతి విషయం గొప్పగా ఉందని పొగడటం అందంగా ఉండదేమో! అదే వెగటును కలిగిస్తుంది, దీనినే నేడు భట్రాజు పొగడ్త అంటున్నాం. దాని మూలంగా వారి అసలైన స్వరూపం మరుగున పడే అవకాశం ఉందికదా! అదివారికి కీడు చేస్తుంది తప్పించి మేలు చేయదు. పొగడ్త ఒక ఔషధం లాటిది, తగుపరిమాణంలో ఉన్నపుడు మంచి పని చేస్తుంది. ఇది పెరిగితే వారిలో ఆత్మ విశ్వాసం బదులు అతివిశ్వాసం బయలుదేరి తలపొగరు వచ్చే సావకాశం ఉందికదా

శర్మ కాలక్షేపంకబుర్లు-దీపావళి యుద్ధం

Posted on నవంబర్ 13, 2012
దీపావళి శుభకామనలు.

దీపావళి యుద్ధం

కావలసిన వారు మెయిలిస్తూ దీపావళి హడావుడిలో ఉన్నా అన్నారు, నేటి రోజుల్లో దీపావళికి హడవుడి ఏమా? అని ఆలోచిస్తూ జ్ఞాపకాల్లోకి జారిపోతే ఏబదిఏళ్ళనాటి పల్లెలో దీపావళి యుద్ధం గుర్తుకొచ్చింది. అదేమిటంటే

ఆ రోజులలో దీపావళి అంటే మాకు రెండు నెలల ముందు మొదలయ్యే పండగ. ఇప్పటిలాగా అ వేళ ఉదయం కొనితెచ్చుకుని, రాత్రి కాల్చేసి పడుకోడం కాదు. ఊళ్ళో పెద్దవాళ్ళయిన యువకులు రెండు నెలల ముందు బొగ్గు కోసం జిల్లేడు మొక్కలు కొట్టించటం తో ప్రారంభమయ్యేది, దీపావళి . ఆ తరవాత మందు గుండు సామగ్రి తయారు చేయటానికి కావలసిన సూరేకారం, గంధకం, బీడు, ఆముదం, పటాసు కొని తెచ్చుకోడం. ఈ చివర చెప్పిన పటాసు ఇప్పుడు దొరకడం కష్టమే. పటాసు జాగ్రత్తగ నూరించేవారు, లేకపోతే పేలి అంటుకునేది. సూరేకారం వంట చేసేవారు, అంటే నీళ్ళు ఎసరుపెట్టి అందులో పోసి ఉడికించి, నీరు ఇగిరిపోయిన తర్వాత ఆరబోసి ఎండబెట్టేవారు. గంధకం కడ్డీలలా దొరికేది, తరవాత బూందీ పూసలలా వచ్చేది. కడ్డీలలా ఉన్నపుడు కష్టం ఎక్కువుండేది. చివరిగా బొగ్గు కోసం కొట్టించిన జిల్లేడు కంప ఎండిన తరవాత కాల్చి బొగ్గు చేసి నూరుకోవాల్సివచ్చేది. వీటన్నిటిని, చాలా మెత్తగా ఉండటం కోసం వస్త్రకాళితం చేయాల్సి వచ్చేది. ఆ తరవాత తయారు చేయవలసిన వాటిని నిర్ణయించుకోవడం. జువ్వ, చిచ్చుబుడ్లు, తాటాకు టపాకాయలు,మతాబులు,సిసింద్రీలు, ఇలా, ఇవి కాక కొన్ని కొనేవి ఉండేవి, అవి విమానాల లాటివి. మతాబా గుల్లలు, తాటాకులు తయారు చేయడం,టపాకాయలకోసం, పేకతో జువ్వ గుల్లలు, వెదురుబద్దలు తయారు చేయడం, జువ్వ తూకం చూడటం, ఒక ఎత్తు, ఇవన్నీ వీటిని కూరడం ఒకెత్తు. నమూనా చూడటం, బాగోకపోతే పాళ్ళు కొద్దిగా మార్చటం, ఇదంతా రహస్యంగా జరగాలి. రెండు వర్గాలుండేవి. ఇద్దరు నాయకులు, వీరికి సహాయకులు, సామాను, ఆహారపదార్ధాలు పట్టుకుని యుద్ధ రంగంలోకి వెళ్ళేవాళ్ళు, ఆయుధాలు ప్రయోగించే సైనికులు, ఇదో పెద్ద పటాలం. ఈ పటాలానికి గూఢచార వ్యవస్థ. ఎదుటివారు ఎంత మందుగుండు కొన్నారు, ఏమేమి తయారు చేస్తున్నారు, ఎవరెవరు అటువైపు ఉన్నారు వగైరా వివరాలు సేకరణ, అవతలి వారు అనుసరించబోయే వ్యూహాలు, ఇవన్నీసేకరించుకొచ్చేవారు, కొందరు. ఇలా ఈ సంవిధానం రెండు నెలలు నడిచి దీపావళి రోజు వచ్చేది.

చిన్న వాళ్ళు ఉప్పుపొట్లాలని కట్టుకునేవాళ్ళు. ఇదీ పెద్దపనే, గుడ్డని పేడనీళ్ళలో ముంచి, బాగా పట్టిన తరవాత ఆరబెట్టేవాళ్ళం. అందులో సూరేకారం, గంధకం, బొగ్గుపొడి,కొద్దిగా బాగా ఎండిన ఉప్పు, పాళ్ళలో కలిపి దానిని గుడ్డమీద పోసి, రెండంచులూ మడిచి సమానంగా పొట్లంలాగా కొద్ది లావు పొడుగులతో తయారు చేసుకుని, దానిని పురికొసతో గట్టిగ కట్టి ఎండలో బాగా ఆరపెట్టి, ఈపొట్లాన్ని, చిన్న లేత తాటిఆకులను కోసి, మట్టలను వేరుచేసి, మట్టల చివర గుంతలు చేసుకుని, మూడు కాని నాలుగు కాని మట్టలు దగ్గరగా చేర్చి గట్టిగా కట్టుకుని వాటి మధ్యలో ఈ పొట్లం పెట్టి అపైన మట్టల పై భాగాల్ని కూడా దగ్గరకు చేర్చి గట్టిగా కట్టుకుని, ఈ సరంజామాకి ఒక పొడుగాటి నారతాడు కట్టి సిద్ధం చేసుకుని, దీపావళిరోజు సాయంత్రం భోజనం ముందు దానిపై కొద్దిగా నిప్పు వేసి భోజనమైన తరవాత మిగిలివారితో మందు కాల్చి, అప్పుడు, ఈ ఉప్పుపొట్లం పుచ్చుకుని గోదావరి లంకలో కాని ఇసుక తిప్పలో కాని తిప్పడం మొదలెడితే చుట్టూ విష్ణు చక్రంలా ఉండేది, రవ్వలతో, చిటపటలతో, తిప్పడం చేతకాకపోతే, ఆపుకోవడం చేతకాకపోతే, ఒంటికి తగిలి ఒళ్ళు కాలిన సందర్భాలుండేవి.

ఊళ్ళోవాళ్ళంతా మందుకాల్చుకోడం అయి లోపలికి వెళ్ళిన తరవాత సమరం మొదలయ్యేది, రెండు జట్లనాయకులు వారి శిబిరాలనుంచి మధ్యకువచ్చి చేతులుకలిపి, ఒక జువ్వను ఒకరు అంటిస్తే ఒకరు ఆకాశంలోకి వేసి విడిపోయేవారు. అంతతో యుద్ధం మొదలు. శిబిరాల దగ్గర కాపలా, వెనకనుంచి దాడికి సావకాశం లేకుండా మందుగుండు సామాగ్రితో కాపలా, ముందునుంచి జువ్వలు, విమానాలు, చిచ్చు బుడ్లు, టపాకాయలు, సిసింద్రీలు వేసుకుంటూ, ప్రత్యర్ధి శిబిరం మీద వేస్తూ, ముందుకు వెళ్ళి ప్రత్యర్ధి శిబిరాన్ని స్వాధీనం చేసుకోవాలి. అందులో మొండి జువ్వలని వేసేవారు, తోక విరిచిన జువ్వ తిన్నగా కాక దానిష్టమయిన దారిలో వెళ్ళి ఎదుటివారిని కల్లోల పరిచేది. చిచ్చుబుడ్లు వెలిగించి రెండు చేతులతో రెండూ పట్టుకుని ముందుకు చొచ్చుకుపోయేవారు. వారిని ఆపడానికి ఎదుటివారు, జువ్వలు, విమానాలు,టపాకాయలు వేసేవారు. విమానం శబ్దం చేస్తూ వచ్చి తగిలితే కాలేది,దెబ్బకూడా తగిలేది. ఇదీ యుద్ధం. చాలా హోరాహోరీగా యుద్ధం జరిగేది, నేలబారున జువ్వలు, విమానాలు దూసుకొచ్చేవి. నిలబడటమే కష్టంగా ఉండేది. రక్షణ ఎర్పాట్లు చూసుకుంటూ దాడి చెయ్యాలి. ఇలా సమరం జరుగుతున్నపుడు, ఎవరికేనా, ఏపక్కవారికేనా తీవ్రంగా కాలడం, దెబ్బలు తగలడం జరిగితే, ఏ ఇంటికేనా అగ్ని ప్రమాదం జరిగితే, సమరం ఆపేవారు. సాధారణంగా ఇటువంటి పరిస్థితి ఉండేది కాదు. అప్పుడందరూ కలసి ఆపదను ఎదుర్కొనేవారు. నిప్పు ఆర్పేవారు. ఒక్కొక్కపుడు జయాపజయాలు తేలేవి కావు. మరునాడు కూడా యుద్ధం కొన సాగేది. యుద్ధానికి, సంధికి, లొంగిపోవడానికి, వెనక్కు తగ్గడానికి నియమాలుండేవి. ఒక్కొకపుడు, ఒకరి మందుగుండు సరిగా కాలక సంధికి వచ్చేవారు. అటువంటి సమయంలో సంధి కోరుకునే నాయకుని సిపాయి, మూడు జువ్వలు తీసుకుని రంగం మధ్యకు వచ్చి మూడిటినీ సమయంలో ఎడం లేకుండా ఆకాశం లోకి కాలిస్తే, అదిసంధి సూచన. ఇవతలివారు, కాల్పులు ఆపేవారు. ఒక సైనికుడు వెళ్ళి జువ్వలేసిన వ్యక్తిని నాయకుని దగ్గర ప్రవేశపెడితే, వచ్చిన రాయబారి విషయం చెబితే, సంధి షరతులు చెప్పి పంపేవారు. వాటిని ఒప్పుకుంటే మరల రాయబారి వచ్చి చెప్పేవాడు. సంధి షరతులు అమలు పరచబడేవి.లేకపోతే యుద్ధం కొన సాగి లొంగదీసుకునేవారు. ఒక్కొకపుడు మందుగుండు అయిపోతే, తెచ్చుకోడానికి సమయం కోసం కూడా ఇటువంటి ఎత్తులు పన్నేవారు. నిజానికి నేటి యుద్ధంలో జరిగే ప్రతి చర్య అక్కడ అమలు పరచబడేది. ఇల్లా యుద్ధ విద్య, దౌత్య కార్యం నేర్చుకునేవారనుకుంటా. అది నెమ్మది నెమ్మదిగా అడుగంటిపోయింది. ఇప్పుడు నిప్పు అంటే భయం అంటున్నారు, మరి మా చిన్నప్పుడు దానితోనే ఆడుకున్నాం 🙂

శర్మ కాలక్షేపంకబుర్లు- రక్షక భటుడు ( పోలీస్ )

Posted on అక్టోబర్ 22, 2012
6
రక్షకభటుడు.( పోలీస్ )

నిన్న పోలీస్ అమరుల సంస్మరణ దినం జరిగింది. కాని ప్రజలంతగా స్పందించిన దాఖలా కనపడలేదు. కారణమేమయి ఉంటుందని అలోచిస్తే.

స్వాతంత్రం రాక ముందు ఈ వ్యవస్థ నాటి పాలకుల కొమ్ము కాయడానికి ఉపయోగపడిన మాట వాస్తవమే. కాని స్వతంత్రం వచ్చిన తరవాత కూడా ఈ వ్యవస్థ లో పెద్దగా మార్పులొచ్చినట్లు లేదు. ఈ రోజునాటికీ పోలీస్ ను చూస్తే అందరికి ఒక రకమైన, భయం, జుగుప్స,వ్యతిరేకత కనపడుతుంది, సామాన్య ప్రజలో. పోలీస్ స్టేషన్ కి వెళ్ళడానికే ఇష్ట పడని వారెందరో, వారికి నష్టం కలిగినా, నేటికీ. దీనికి కారణం ఆ వ్యవస్థ లో వేళ్ళూనుకుపోయిన లంచగొండితనం,రాజకీయ నాయకులకు తొత్తులుగా వ్యవహరించడం, పారదర్శకత లోపించడం, మర్యాదాలోపం, ఫిర్యాదు దారుని నీచంగా చూసి దొంగని అందలాలెక్కించడం, వగైరా వగైరా చాలా కారణాలున్నాయి. వీరు సమాజానికి దూరమయిపోతున్న మాట వాస్తవం. సమాజం లో ఉన్న దుర్గుణాలన్నీ పోలీస్ వ్యవస్థలో రాశీభూతమయి ఉన్నాయంటే అతిశయోక్తి కాదు.. రాజకీయ వ్యవస్థ కి అందునా పరిపాలన చేస్తున్న పార్టీ వారికి ఈ డిపార్టుమెంట్ ఒక అత్యవసర అవసరం గాను,కుడి చెయ్యిగానూ పని చేస్తోందంటే వింత కాదు.ఈ రోజుకు కూడా ఏదయినా నష్టం జరిగినపుడు పోలీస్ స్టేషన్ కు వెళ్ళి ఫిర్యాదిస్తే నమోదు చేసే నాధుడులేడు. ఆ ప్రాంతపు ఎమ్.ఎల్.ఎ లేదా మరొక రాజకీయ నాయకుడు చెప్పినపుడు మాత్రమే ఈ ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేస్తున్నారంటే రాజకీయ వ్యవస్థ పోలీస్ పై ఎంత అజమాయిషీ చేస్తున్నది తెలుస్తుంది. ఫిర్యాదిస్తే నమోదు చేస్తామని చెబుతారు, కాని చెయ్యరు. మరో చిత్రం స్టేషన్లో కావలసిన తెల్లకాగితాలు వగైరా ఖర్చులకు బడ్జట్ ఉండకపోవడంతో ఫిర్యాదీ దారులపై ఈ భారం మోపుతున్నారు. ప్రజలతో ముఖా ముఖి సంబంధాలున్నవి మూడు నాలుగు రేంకులకంటే ఉండవు. వీరిలో ముఖ్యులు కానిస్టేబుళ్ళు. నిన్నటి, నేటిదాకా కూడ వీరిలో అత్యధికులు నిరక్షరాస్యులు, లేదా కొద్దిగా చదువుకున్నవారు. వీరికి చట్టం మీద అవగాహన తక్కువే, కాదు లేదు. ఇప్పటీకీ పదవ తరగతి చదువుకున్న వారిని కానిస్టేబుల్ గా తీసుకుంటున్నారు,వీరి రిక్రూట్మెంట్లో కూడా రాజకీయం చేరుకుందంటే, వీరికి చట్టం మీద, చట్టం లో చెప్పిన అధికారాల మీద అవగాహన తక్కువే. మనం కనక ఇచ్చే ఫిర్యాదులో చట్టం గురించి కనక చెబితే వారికి కోపం కూడా వస్తుంది. ఇటువంటి ఒక సంఘటన నాకొకప్పుడు తారసపడింది. స్టేషన్ కి పదిమంది నుంచి కానిస్టేబుళ్ళుంటారు. ఒకరు నిత్యం కోర్టు పని మీద తిరుగుతుంటారు, ఇతనే రైటర్. ఆ స్టేషన్ లో కొద్దిగా చట్టం గురించి ఎరుక ఉన్నవాడయి ఉంటాడు.ఎస్.ఐ తో సహా మిగిలిన వారికి చట్టం గురించి తెలిసినది తక్కువే, కేసులు నీరుగారిపోవడానికి కారణం, చట్టం పై అవగాహనా లోపమే.. శాంతి భద్రతలనుంచి చాల విషయాలలో పోలీస్ వ్యవస్థ జోక్యం చేసుకోవాల్సి ఉంటుంది. దుర్లక్షణాలు పెరిగి జోక్యం చేసుకోకూడని చోట్ల జోక్యం చేసుకోడం ఎక్కువగా జరుగుతోంది, స్పందించవలసిన చోట మానెయ్యడం జరుగుతోంది . దీని మూలంగా పారదర్శకత లోపంతో అవినీతి పెరిగిపోయింది. నిజానికొస్తే కానిస్టేబుల్ ఈ వ్యవస్థలో ముఖ్యుడు, కాని ఇతని రక్షణ, ఉద్యోగ సమయాలు, ఆరోగ్యం మొదలయిన విషయాల మీద సరయిన చర్యలు తీసుకోకపోవడం మూలంగా ఒక రకమైన నిర్లిప్తత నెలకొని ఉంది. ఏ విషయం లో నైనా బలైపోయేవారు కానిస్టేబుళ్ళే అయిపోతున్నారు. కొంతమంది ఆఫీసర్లు కూడా రాజకీయ వత్తిడులకు లొంగి పని చేయని వారిని సుదూర ప్రాంతాలకు బదిలీ చెయ్యడం దగ్గరనుంచి ప్రాణ హాని కలగ చేసే శక్తులకు వారిని వదలివేసిన సంఘటనలు కూడా ఉన్నాయి.

ఎక్కువగా ఈ వ్యవస్థ రాజకీయనాయకులకు రక్షణ కల్పించేందుకు, మంత్రులు మొదలయిన వారి రక్షణకు ఇతర సంగతులు, రాస్తారోకోలు, రాజకీయ ఆందోళనలకే పరిమితమయిపోతూ ఉంది. కొంత మంది రహదారి వ్యవస్థను వాహనాల రాకపోకలని నియంత్రించే పనిలో ఉండిపోతున్నారు. అసలు పనికి, పరిశోధనకి సమయమే సరిపోటం లేదంటే అతిశయోక్తి కాదు. అసాంఘిక శక్తులు కొత్తరకం వాహనాలమీద తిరుగుతూ నేరాలు చేస్తూ ఉంటే, వీరు కాలం చెల్లిన జీపుల్లో, పరిమితి కలిగిన పెట్రోల్ వాడకంతో, తిరిగి ఎంత కాలానికి వారిని పట్టుకోగలరు. ప్రతి స్టేషన్లులోనూ ఉండవలసిన స్థాయిలో సిబ్బంది లేకపోవడం మూలంగా ఉన్న వారిపై పని భారం పెరిగి అవ్యవస్తకి కూడా కారణమవుతూంది. నిజానికి ఒక కానిస్టేబుల్ ఉదయమే స్టేషన్ కు వస్తే మళ్ళీ ఇంటికెపుడెళతాడో తెలియదు. వేళా పాళా లేని పని, తిండి తిప్పలు చూసే నాధుడు ఉండడు. ఆర్డర్ లు ఇచ్చేవారే తప్పించి కష్టం గురించి పట్టించుకున్న నాధుడు లేడు, పని గంటలు లేవు.. ఆర్డర్లీ వ్యవస్థ దుర్వినియోగమైనంతగా మరే వ్యవస్థా దుర్వినియోగం కాలేదేమో. నేను పని చేసిన టెలికం లో కూడా ఆర్డర్లీ వ్యవస్థ ఉండేది.తరవాతి కాలంలో దీనిని రద్దు చేసేరు. ఇప్పటికీ పోలీస్ లో ఇది ఉన్నట్లుగానే ఉంది. చాలా కమిషన్లు వేసేరు, ఈ వ్యవస్థను మెరుగు పరచడానికి, కాని ఏ కమిషన్ వారు చెప్పినదీ అమలు చేయలేదు. రాజకీయ శక్తుల చేతులనుంచి వీరికి ముక్తి కలిగించినపుడే, ఈ వ్యవస్థ ప్రత్యేకంగా నిష్పక్షపాతంగా పని చేయగలదు. అందుకు పాలక వర్గాలు సిద్ధంగా లేవని ప్రతి సారి డి.జి.పి నియామకం లో జరుగుతున్న సంగతి తెలియ చేస్తూనే ఉంది.ఇంకా చాలా విషయాలు, పోలీసుల పట్ల జరుగుతున్న అన్యాయాలు సరిగా చెప్పలేకపోయానేమో!

అసాంఘిక శక్తుల చేతిలో బలయిపోయిన నిజయితీ పోలీస్ ఆఫీసర్లు, కానిస్టేబుళ్ళ కుటుంబాలను, అనారోగ్యం తో కునారిల్లుతున్నవారిని, వారి కుటుంబాలను ఆదుకోవాలని, ప్రాణాలు కోల్పోయిన వారికి అంజలిఘటిస్తూ,చాలా అవసరంగా తొందరలో ఈ వ్యవస్థను పునరుద్ధరించుకుని, పోలీస్ ప్రజలకు స్నేహితులుగా ఉండే రోజు రావాలని, అమరవీరుల కుటుంబాలను ఆదుకోవాలని కోరుకుంటూ
స్వస్తి.

శర్మ కాలక్షేపంకబుర్లు-పోలిక.

Posted on అక్టోబర్ 14, 2012
8
పోలిక.

పోలిక చెప్పడం అన్నది పుట్టిన రోజునే ప్రారంభమవుతుందనుకుంటా. పుట్టిన బిడ్డ ఎర్రగా ఉందా, నల్లగా ఉందా దగ్గరనుంచి, కనుముక్కు తీరుని పోల్చేస్తారు, తల్లి, తండ్రి, అత్త, మామ, మామ్మ, తాత, అమ్మమ్మ, తాత వగైరాలతో. అదీగాక మనకో సామెత కూడా ఉంది “మేనమామ పోలిక మేనత్త చారిక” అని, ఒకరు తల్లి వైపువారు, మరొకరు తండ్రి వైపువారు. ఇంతే కాక దాని సమర్ధిస్తూ అమ్మాయికి మేనత్త పోలిక, అబ్బాయికి మేనమామ పోలిక, అమ్మాయికి తండ్రి పోలిక, అబ్బాయికి తల్లి పోలిక మంచిదంటారు. ఇదీగాక బుద్ధులలో, అలవాట్లలో పోలికలు చెబుతారు. మనకి ఈ సందర్భంగా రామాయణం లో ఒక సంగతి గుర్తొచ్చింది, చూడండి. కైక కోరిక ప్రకారం, దశరధుని ఆజ్ఞపై రాముడు అడవులకు వెళుతున్న సందర్భంలో దశరధుని రధసారధి సుమంత్రుడు కైకను నీకు తల్లిపోలిక వచ్చిందంటాడు. నీ తల్లి కూడా నీలాగే మీనాన్నని ఆపదలపాలు చేయబోయిందని దెప్పుతాడు.అదేమో చూద్దాం.

అభిజాతం హితే మన్యే యధా మాతు స్తధైవచ
న హి నింబాత్ స్రవేత్ క్షౌద్రం లోకే నిగదితం వచః….రామా.. అయోధ్య…సర్గ.35..శ్లో..17

వేపచెట్టునుంచి తేనె కారదు అట్లే నీ తల్లి స్వభావమే నీకునూ వచ్చింది అన్నాడు. మీ తల్లి మూర్ఖపు పట్టుదలగూర్చి మేము ఇదివరకే ఎరుగుదుము. ఒక యోగి మీతండ్రికి పశుపక్ష్యాది జంతువుల అరపులు, వాటి భావం తెలియగల వరం ప్రసాదించాడు. ఒకనాడు మీ తండ్రి తన పాన్పు దగ్గరలో ఒక జంట పక్షులు మాట్లాడుకునే సంభాషణ విని రెండు, మూడు సార్లు నవ్వేడు. తనను చూసి గేలి చేసి నవ్వుతున్నాడనుకుని మీ తల్లి బహు కోపించి, నవ్విన కారణం చెప్పమని కూచుంది. పక్షుల మాటలు విన్నాను, అది చెబితే నాకు మరణం సంభవిస్తుంది అని చెబుతాడు. అందుకు మీతల్లి నువ్వు బతికినా చచ్చినా సరే, నవ్విన కారణం చెప్పితీరాలని బలవంతం చేసింది, చెప్పకపోతే చస్తానని బెదిరించింది. అప్పుడు మీ తండ్రి, ఆ విద్య చెప్పిన యోగి వద్దకుపోయి విషయం చెబితే, సంభాషణ చెబితే నీకు మరణం తప్పదని చెప్పి, ఆమె బతికినా చచ్చినా, నీవు చెప్పవద్దని చెబుతాడు. నీ తండ్రి అలాగే చేశాడు. అందుకే అన్నారు,

సత్యశ్చాద్య ప్రవాదో యం లౌకికః ప్రతిభాతి మా
పితౄన్ సమనుజాయంతే నరా మాతరమంగనాః …రామా..అయో..సర్గ 35…శ్లో…36

తండ్రుల లక్షణములను కొడుకులు, తల్లి లక్షణములు కుమార్తెలు కలిగి ఉంటారనేలోకోక్తి నిజమవుతూ ఉంది నీ పట్ల, అన్నాడు. దీన్ని బట్టి మరొకటి కూడా తెలుస్తోంది కదా, ఏ విషయమైనా “అతి చేస్తే గతి చెడుతుందని” సామెత.

పోలిక కొస్తే పుట్టినప్పటినుంచి మొదలే కదా. ఆ తరవాత “వాళ్ళ బాబు ముందు ఆమ్ము తినేస్తున్నాడు నువ్వూ తినెయ్యాలి” తో మొదలు. “వారి అబ్బాయి/అమ్మాయి బళ్ళోకి ఏడవకుండా వెళ్తోంది నువ్వూ వెళ్ళాలి”. “పక్కింటి వారబ్బాయికి ఫస్టు మార్కొచ్చిందిట నువ్వేందుకూ పనికిరావు,” ఇక్కడినుంచి పోలికతో కించపరచడం ప్రారంభవుతూంది. “ఎదురింటివారమ్మాయి చూడు, ఏదడిగితే అది చెప్పేస్తుంది, గడగడా, వెనకింటి వారమ్మాయిని ఎవరో చూసి, వచ్చి పిల్ల తెలివి మెచ్చుకుని పెళ్ళి చేసుకుంటామన్నారట. వీళ్ళకీ నచ్చిందిట, పెళ్ళిట. మనతింగరిబుచ్చీ ఉంది, ఎందుకూ.” “వాళ్ళబ్బాయికి అమెరికా ఛాన్స్ వచ్చిందిట”. ఇలా పోలికలతో నిత్యం సతాయిస్తూ ఉంటే, ఇబ్బందులే కనపడుతున్నాయి.

ఇలా పోలికలేకాక, తిట్టడానికి కూడా పోలిక చెబుతారు మనవాళ్ళు. “నీ దంతా మీ తాత పోలికే వెధవా! వెధవ బుద్ధులూ నువ్వూను” అని కొడుకును తిడుతుంది కోడలు, మామగారిని తిన్నగా తిట్టలేక. అలాగే ఆడపిల్లను, “అంతా మేనత్తపోలికే వెధవ బుద్ధులెక్కడికిపోతాయి, వెధవ సామాచికం” అంటూ, కూతుర్ని తిడుతున్నట్లు, ఆడపడుచును తిడుతుంది.. ఇది భార్య భర్తలలో ఒకరిని ఒకరు సాధించుకోడానికి కూడా ఆయుధంలా పనికొస్తుందనమాట. ఆవిడ అమ్మాయిని మేనత్త పోలికని, కూతుర్ని తిడుతుంది, ఆయనని సాధించాలని, ఆయన “అన్నీ మేనమామ పోలికలే వెధవా, ఎందుకూ పనికిరావు” అని తిడతాడు, ఆమెను కవ్వించడానికి. ఇలా తిట్లు తినేవారు కూడా పైవారయి ఉండరు, మేనమామో, మేనత్తో, తాతో, అమ్మమ్మో, మామ్మో అయివుంటారు.

సంసారంలో భార్య భర్తలు ఇతరులతో పోలిక సంభాషణ అసలు పనికిరాదని నా అభిప్రాయం. “పక్కింటాయన చూడండి వాళ్ళ వైభోగం చూడండి, మీరిద్దరూ ఒకే ఆఫీసులో ఒకే ఉద్యోగం చేస్తున్నారు ఎందుకూ”, అందనుకోండి భార్య, పాపం ఆమె ఆ పక్కింటాయన ఏదో రోజు ఉదయమే శ్రీ కృష్ణజన్మస్థానానికి కూడా అంత దర్జాగానే తీసుకెళ్ళబడతాడన్నది విస్మరిస్తుంది. “ఎదురింటావిడ చూడు, ఎంత అందంగా అలంకరించుకుంటుందో, ఎంత సోషల్ గా ఉంటుందో, నువ్వూ ఉన్నావు పేడ తట్టలాగ” అని భార్యను ఈసడించేవారు చాలా విషయాలను విస్మరిస్తున్నట్లే, పై చూపు చూస్తున్నట్లే.. ఎవరి అందం, తెలివి, వైభవం, ధనం, అనుభవం, కర్మ వారిదే. మరొకరితో పోలిక కుదరనే కుదరదు, అనవసరం కూడా..

ఈ మధ్య ఆఫీసుల్లో కూడా ఇలా పోలికలు చెబుతున్నట్లుంది, పని దగ్గర. తస్మాత్ జాగ్రత, ఇది ఎదుటివారిని కించపరచడమే అవుతుంది..

చిన్నపిల్లలను మరొకరితో పోల్చవద్దంటున్నారు, తెలిసినవారు, మనస్తత్వ వేత్తలు . ఇది పిల్లలలో అనేక రకాలైన మానసిక ఇబ్బందులకు దారితీస్తోందట. పెద్దవారిలోనైనా ఈ పోలిక చెప్పటం మూలంగా కించపరచే పరిస్థితులను తేవడం మంచిదే కాదు. భార్యా భర్తలు మరెవరితోనూ పోల్చుకోవద్దు, మీరెవరికీ పోలికకాదు. ఎవరితో పోల్చినా బాధపడనివారున్నారు మనదేశంలో,వారెవరో మీకూ తెలిసిపోయిందీపాటికి :). మన నాయకులు విదేశాలతో పోల్చి ముక్కుపిండి పన్నులు మాత్రం వసూలు చేస్తున్నారు, సౌకర్యాలకల్పన మాత్రం పోల్చరు, అది దేవుడెరుగు.