Posted on సెప్టెంబర్ 26, 2011
పాఠకులకు మనవి:–సీత కష్టాలు సీతవైతే పీత కష్టాలు పీతవి. నావి బ్లాగు కష్టాలు. నేను రాసిన వాటిపై మీరు అభిమానంతో రాసే కామెంట్లుకి జవాబు రాయలేని దుస్థితి. మాది పెద్ద పల్లెటూరు. ఇక్కడ నాకు బ్లాగు గురించి సహకారం దొరకదు.నేను మొదటకొన్నింటికి జవాబులు రాసాను. వాటి మూలంగా మరొక చిక్కు వచ్చింది. దానిని పరిష్కరించుకుని మీకు జవాబులు రాస్తాను.నేను ఇదివరలో ఇచ్చిన జవాబులుగాని కనపడకపోతే కూడా అపార్ధంచేసుకోవద్దు. నా కష్టాలు కొన్ని బులుసువారికి తెలుసు.
ప్రస్తుతానికి వస్తే. భమిడిపాటి వారు వారి బ్లాగుద్వారా పరిచయం. కొద్దిరోజుల తరువాత వారు నన్ను బ్లాగు మొదలుపెట్టమని సలహా ఇచ్చారు. నేను నాలుగు తెలుగు అక్షరాలు తప్పులేకుండా రాయగలిగితే బ్లాగు రాయడం కుదరదేమోననీ ఒక పోస్టురాసి పంపుతున్నాను అది చూసి ప్రచురణకి అర్హమైనదే అని మీరంటే బ్లాగు రాస్తానని కండిషను పెట్టేను. వారు కేంద్ర ప్రభుత్వంవారు తెలంగాణా గురించి నానపెట్టినట్లు వారు దాన్ని నానపెట్టేరు. వారి పనులు వారికి వుంటాయి కదా. అది పులిసిపోయింది. నాకు దురద, కాంక్ష,పెరిగిపోయింది.అది బలిసి22 తేది మధ్యాహ్నము రెండు క్లిక్కులు, నాలుగు టిక్కులతో బ్లాగు మొదలై పోయింది. ఏమిరాయాలి? రాసినవేవో వున్నాయిగాని అవిమొదటగా ప్రచురించటం ఇష్టం లేకపోయింది.నమస్కారాలతో మొదలెడితే మంచిదనుకుని మొదలెట్టేను. రాయడం. గురువు దైవం అన్నారుకదా అందుకు గురువందనం పూర్తిచేసేను. ఇక దైవ వందనం రాయబోతే అమ్మమీద రాద్దామనుకున్నాను. ఓరిని! ఇప్పటిదాకా నేను గుర్తులేను ఇప్పుడేమిరా అంటుందేమోనని అనిపించి మార్గం అలోచిస్తే దారిదొరికింది. అమ్మగారి కొడుకుని ప్రసన్నం చేసుకుంటే అమ్మా ప్రసన్నురాలేకదా. బొజ్జ గణపయ్యని మొక్కేను, విఘ్నాలులేకుండా చూడమని. తరువాత అమ్మకి మొక్కేను. నడిచిపోయింది. కుక్కవంటి మనసు కూర్చుండనీయదని వంకరదణ్ణాలమీద పడ్డాను. బుద్ధిచెప్పింది ఒరేయ్ పైన అందరికీ దణ్ణాలెట్టేవు కింద ఇది రాస్తే అదికూడా ఇదే అనుకుంటారు అని. ముగించేను.
ఇక ప్రచురించాలి ఎలా తెలియదు. గారెలెయ్యడానికి కోడలా ఏముందిఅంటే వేలు చూపినట్లు అయ్యింది నాపని. ప్రయత్నం చేస్తూ వుండగా పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చినట్లు,కరంటు లటుక్కున పోయింది. బతుకు జీవుడా అంటూ లేచాను. మరునాడు.ప్రయత్నం మళ్ళీ మొదలు. కష్టపడి మొత్తానికి ప్రచురించేను. గొప్ప పనిచేసి నట్లు భమిడిపాటి వారికి మెయిలు ఇచ్చేసాను. అయిపోయిందనుకున్నాను. కానీ అప్పుడే కష్టాలు మొదలని తెలియదు.మీరు రాసారు సరే అది ఎవరేనా చదవాలికదా అంచేత కూడలి, హారంలతో లింకు వేయమన్నారు. ఆయన చెప్పేరుకాని మట్టిబుర్రకి అర్ధంకాలేదు. నా కన్న తల్లి అనేది. ఒరేయ్ నీబొమ్మ బ్రహ్మగారు భోజనం తరవాత చేసేడురా. నిద్ర తూగులో నీ బుర్రలో కొద్దిగా మట్టి తక్కువ పేట్టేడుఅనేది.మరి ఎలగమ్మా అంటే. నాయనా నీకేమి భయం లేదు. భయంఅంతా నీ ఎదుటివారికే అనేది.తల్లి దీవన ఇప్పటికీ ఇదినిజమే. ఎక్కడికో పోయాను. ప్రయత్నం మొదలు పెట్టేను. ఒక పరిస్తితులలో,రాసింది పోయింది,చిరాకు వచ్చింది. బ్లాగు మూసెఅయ్యడం ఎలా అనేది కూడా చూసేను. మళ్ళీ తమాయించుకుని ఆరంభింపరు నీచ మానవులు చదువుకుని మళ్ళీ మొదలెట్టేను. ఈలోగా మిత్రులు బులుసువారు పలకరించేరు. వారికి పొడి పొడిగా సమాధానమిచ్చి, ఈ సమస్య తీర్చుకోడం ఎలాగో చెప్పరాదా అని అడిగేను. అది మొదలు అయన అదే పని మీద వుండి సాయంత్రంకి నాకు మళ్ళి కబురు చేప్పేటప్పటికి హారంవారు లంకె వేసినట్లు వార్త పెట్టేరు. బతుకు జీవుడా అనుకోగా కరంటు పోయింది.
మర్నాడు ఆదివారం ఎందుకో కరంటు తీయలేదు.శనివారం ఆదివారం కూడా పోస్టులు వేసాను.నిన్న సాయంత్రంకి కొంత మందికి జవాబిస్తూవుండగా మరొక కొత్త బాధ కలిగింది. రాత్రి పన్నెండు గంటలకి మరొక పోస్టు వేసాను. ఇలా వుండగా నా ఇంటావిడ పొరపాటు, నాశ్రీమతి, ఇదీ తప్పే, మరో ముద్దుపేరు ఇదీకాదు, నా రామూకిమా, భోజనంచేస్తూ వుండగా ఏమిటి మూడు నాలుగు రోజులనుంచి దానికి అతుక్కుపోతున్నారు. కొద్దిగా వివరించేను అక్కడికి నాకేదో పెద్ద తెలిసినట్లు. ఏమో ఏం చేస్తున్నారో ఆరోగ్యం జాగర్త అని చిన్న సలహా లాంటి వార్నింగు. ఇచ్చింది………
మిగతా రేపుమరి