శర్మ కాలక్షేపంకబుర్లు-రేపటిఅత్తలూ ఆలోచించండి

Posted on సెప్టెంబర్ 30, 2011
రేపటి అత్తలూ అలోచించండి.

ఈ మధ్య మాకు కావలసినవారొకరు కాలం చేసారు. వెంటనే బయలుదేరి సతీ సమేతంగా వేళ్ళేను. దగ్గరుండి అన్ని కార్యక్రమాలు పూర్తిచేయించిన తరువాత ఆరోజు సాయంత్రం తిరిగి వచ్చాము.

పదవరోజు, చనిపోయిన వారికి బంధువులు మిత్రులు నీళ్ళు వదలిపెట్టే కార్యక్రమం, ధర్మోదకాలకి వెళ్ళేము. పదకొండు పన్నెండు రోజులలో చనిపోయినవారు స్వర్గారోహణం చేయటం కోసం చేసే కార్యక్రమం మరియు వృషోత్సర్జన పిండ ప్రదాన కార్యక్రమాలు చేయడం హిందుధర్మం లో అలవాటు. ఇప్పటికాలంలో ఈకార్యక్రమాలు రెండూ ఒక రోజు చేయడం అలవాటు చేసుకున్నారు. రెండురోజుల కార్యక్రమాలు ఒకరోజే పెట్టడంచేత వుండి పోయాము. కార్యక్రమాలు పూర్తైన తరువాత నవవిధవను మొదటిసారి చూసే కార్యక్రమం వుంటుంది. అంతకు ముందురోజు ఎవరు ముందు చూడాలి మొదలైన కార్యక్రమాల గురించి అడిగితే బ్రహ్మగారు ( ఇంటి పురోహితులు ) ఆమె సంతానమంతా మొదటగా చూడాలన్నారు. బట్టలు పెట్టాలన్నారు. సరేనన్నారు. మరి మరుసటి రోజుకి ఏమి మార్పువచ్చిందో తెలియలేదు కాని పుట్టింటివారు బట్టలుపెట్టి మొదట చూడాలని కుటుంబ సభ్యులు తీర్మానంచేసి వారికిచెప్పేరు. ఏమయ్యా నిన్నసాయంత్రం బ్రహ్మగారు కొడుకులు కోడళ్ళు ముందు చూడాలని చెప్పేరుకదా ఇదేమిటన్నాను. అబ్బే ! ఇలాగే జరగాలి అని మొండిగా మాట్లాడితే పుట్టింటివారు బట్టలుపెట్టి మొదట చూసేరు. తరువాత అంతా చూసేరు. ఈమార్పుకి కారణం ఏమని ఆరాతీస్తే తేలిందేమంటె కోడళ్ళు అత్తగారిని మొదట చూస్తే తమకి కీడు కలుగుతుందని మొగుళ్ళకి చెప్పేరట. అది కొడుకులు అమలు చేసారు.

ఇంతకి కొడుకులు కోడళ్ళు మొదట చూటంలో విశేషం వుందా? వుంది.
పోయినది ఇంటి యజమాని. తరువాత స్థానం ఆయన భార్యది. నిన్నటివరకు ఆమె మహారాణి, రక్షకురాలు. ఆమె చెప్పినట్లుగా ఇంటివిషయాలు నడిచాయి. ఆమె ఈ పిల్లలు అందరిని కని,పెంచడానికి గడ్డి తిని వేణ్ణీళ్ళుతాగింది. పెద్దవాళ్ళను చేసింది. అందరికి పెళ్ళిళ్ళు పేరంటాలు జరిపింది. కష్టం వస్తే,భయమేస్తే ధైర్యం చెప్పింది.. ఆమెకి ఆలంబన ఇంటి యజమాని. అతను పోయాడు. ఆమె కష్టంలో వుంది, బాధలో నూవుంది. నలభై, ఏభై సంవత్సరాల ముఖ్య స్నేహితుడు, కష్ట సుఖాలు కలిసి పంచుకున్నవాడు, నేడు లేడు, ఈఆలోచనే ఆమెకు జీవితం మీద విరక్తి కలగచేస్తుంది. దీనికి విరుగుడు లేదా. ఆమె కూడా ఆయనతో పోవలసిందేనా? కాదు అమె జీవితం ఆమెది. అతనిజీవితం అతనిది. రెండు కట్టెలు ప్రవాహంలో కలసి కొద్దికాలం ప్రయాణంచేసి కాలంఅనే ప్రవహంలో మళ్ళీ వేరైపోతాయి. ఈ సందర్భంలో కొడుకులు,కోడళ్ళు మనుమలు మనుమరాళ్ళు అందరూ ఆమెకు ఓదార్పు ఇచ్చి ఇంటి పెద్దలేకపోయినా ఆమె కనుసన్నలలో ఉంటామని చెప్పే స్వాంతన సమయం. ఆమెకు ఇచ్చే ఒక గౌరవం. ఆమెను కుటుంబ పెద్దగా గుర్తించే విషయం. నీవు కూడా లేకపోతే మేము అనాధలమవుతామని చెప్పి ఆమెకు జీవితం మీద మమకారం పెంచే సందర్భం. ఇది మరచిపోయి మొదట చూసిన వారికి కీడు అనే దౌర్భాగ్యానికి దిగజారిపోడం మూఢ నమ్మకం. కాదు దౌర్భాగ్యం. ఆమె దిక్కులేనిదయిందా? ఆమెకు ఈ కుటుంబనికి అనుబంధం, సంబంధం లేదా?ఇన్నాళ్ళు ఆమె ఈ కుటుంబం కోసం చేసినదంతా బూడిదలో పోసిన పన్నీరేనా? ఇప్పుడున్నవాళ్ళంతా ఆమెకేమీ కారా? ఆమెకు పుట్టింటివారే దిక్కా ? మామగారు చనిపోయిన తరువాత అత్తను మొదటిసారి చూస్తే కీడు తగులుతుందనుకున్న కోడలు రేపు తనకొడుకుకి పెళ్ళిచేసినతరువాత అత్త అవుతుంది కదా. తనకూ ఈ కష్టం రాక తప్పదుకదా. అప్పుడు ఆమె కోడలూ ఇలాగే అనుకోవాలా?ఆలోచించాలా? ప్రస్తుత కోడళ్ళయిన రేపటి అత్తలూ అలోచించండి.ఇది ఎవరిని కించపరచాలని రాసినది కాదు.అందరూ అలా వున్నారనికాదు. కుటుంబ సంబంధాలను పటిష్టపరచాలనే కోరిక.

 

ప్రకటనలు

శర్మ కాలక్షేపం కబుర్లు-నూకలు చెల్లిపోయాయ్

Posted on సెప్టెంబర్ 29, 2011
నూకలు చెల్లిపోయాయ్

ఇప్పటికి పల్లెలలో ఎవరేనా చనిపోతే నూకలు చెల్లి పోయాయని అంటారు. అంటే తినవలసిన ఆహారం లేదని అందుకే మరణించాడని అర్ధం. అంటే ఆహార లభ్యతలోపం వల్లననికాదు. ఇప్పటి శాస్త్రకారులు తక్కువ తినండి ఎక్కువ కాలం జీవించండి అంటున్నారు. శాకాహారం తీసుకోండిఈ ఆరోగ్యంగా ఉండండి అంటున్నారు. రెండింటికి లింకు వుందా అంటే వుందే అనిపిస్తూవుంది.

ఆదెలా. బతికిన రోజుల్ని తిన్న ఆహారంతో హెచ్చవేస్తే ఆహార పరిమాణం స్థిరం. అంటే స్థిరమైన ఆహారంలో తక్కువ ఆహారం రోజూ తింటె ఎక్కువ రోజులువస్తుంది. ఎక్కువ అహారంతింటే తక్కువ రోజులు వస్తుంది. ఆహారం ఎక్కువైతే..రోజులుతగ్గుతాయి…..inverse proportion………

సాత్వికాహారంతింటే ఎక్కువకాలంజీవిస్తారని మనపెద్దల ఉవాచ. అది నిజమని మనకు తెలుసు. శాకాహారంతినే ఏనుగుకంటే మాంసాహారం తినే సింహం తక్కువ కాలం జీవిస్తుంది. సమశీతోష్ణ మండలములల్లో నివసించే జనులు ఎక్కువ. వీరిలో ఎక్కువకాలం జీవించేవారెవరని జర్మనీయో మరో పాశ్చాత్యదేశమో సర్వేచేస్తే గోదావరి జిల్లాలలోనివసించే ప్రజలలో బ్రాహ్మణ స్త్రీలు ఎక్కువ కాలం జీవిస్తున్నట్లు తేలింది. కారణాలు విశ్లేషిస్తే వారు సాత్వికాహారం అనగా కూరలు కాయలు పళ్ళు తినటం మరియు ఉపవాసాలమూలంగా ఎక్కువ కాలం జీవిస్తున్నట్లు తేల్చారు. ఇప్పుడుపడమటిదేశాలవారు సాత్వికాహారం తింటున్నారు. మాంసాహారుల సంఖ్య తగ్గినట్లు చెబుతున్నారు. శాకాహారులకు తెలివికూడా ఎక్కువేనని తేల్చారు.

అంటే మనవాళ్ళు పిచ్చివాళ్ళుకాదు. ఏకాదశి ఉపవాసం. వారంలో ఒక రోజు ఒంటిపూట భోజనం. ఆహార విహారాలు కట్టుబాట్లలో ఉండాలనంటారు.పరిస్తితికి తగిన ఆహారం తీసుకోమని చెప్పేరు. కాయ కష్టం చేసేవారికి ఒక లాగ, బుద్ది జీవులకు ఒక లాగా ఆహారం తీసుకోవలని ఆయుర్వేదం చెబుతోంది.బాగున్నది ఎక్కువ తినడం బాగోలేదని మానెయ్యడము కూడదు. ఇప్పుడు శాస్త్రకారులు కొత్తగా కనుక్కున్నదేమీ లేదు. ఐతే ఇది మనం వప్పుకోము. ఏదయిన పడమటి వారు చెప్పాలి మనం నమ్మాలి, అంతేగాని మనవాళ్ళు చెపితే మనం చచ్చినా నమ్మం. అదంతే. దానేదానే పర్ లిఖాహై ఖానేవాలేకా నామ్.

ఎప్పుడైనా తిన్న ఆహారం లెక్కేశారా? నాకు ౭౦ సం.రం.లు అనగా 25550 రోజులు. రోజుకి ఈ కింద విధంగా తింటే అయిన సరుకుల వివరం.
Item per day for 25550 days
బియ్యం. 100 gm 2555 kg
పాలు 500 ml 12775 L
నూనెలు 15 gm 383 kg
పప్పులు 50 gm 1277 kg
ఉప్పు 5 gm 127 kg
పళ్ళు కూరలు 150 gm 3832 kg
తాగడానికి ఇతరావసరాలకి వాడిన నీళ్ళు 140 లీ 3577 కి.లీ. నా ఆహారపు గిడ్డంగి తాళం నా దగ్గరే వుంది. కాని అందులో నిలవ ఎంత వుందో తెయదు. తాళం తీసి ఆహారపదార్ధాలు కొద్దిగా కావలసినవి తీసుకుంటాను.చిన్నప్పుడు అమ్మ ఏమైనా పెడితే కొద్ది కొద్దిగా దాచుకుని తినడం అలవాటైనమూలంగా కొద్ది కొద్దిగా తినడం అలవాటయిందేమో. ఏదో ఒక రోజు తాళం పనిచేయదు అదే ఆరోగ్యం…. …అంతే… ఆఖరు. … అదే! అదేరోజో తెలియదుమరి.ఇంకా నూకలుంటె రేపు కలుస్తాను. శలవు.

శర్మ కాలక్షేపం కబుర్లు పెళ్ళిలో ఆట-personality development

Posted on సెప్టెంబర్ 28, 2011
పెళ్ళిలో ఆట

మన వివాహ వ్యవస్థ చాల గొప్పది. పెళ్ళి లోని కొన్ని ముచ్చటలు ఎలా జీవించాలో నేర్పుతాయి. చాల మంచివి. ఐతే వాటిగురించి, వాటి అర్ధం పరమార్ధం గురించి మనం పిల్లలకు చెప్పటంలేదు. ఒక ముచ్చట చెబుతాను వినండి.దీనికి ప్రేరణ ఈమధ్య సోనిటీ.వి లోని ఒక అధ్యాయం.అందులో నేను ఈ కింద చెప్పిన విషయం డైరక్టరు చాలాబాగా తీసాడు. అప్పుడు మాబావ మరది కొడుకు పెళ్ళిలోను మా పెళ్ళిలొ జరిగిన పాత సంఘటన గుర్తుకొచ్చింది.

మా బావమరిది కొడుకు పెళ్ళికి వెళ్ళేము

పెళ్ళిలో ఒక ఆట ఆడిస్తారు నూతన దంపతుల చేత. బిందిలో చుట్లు ఉంగరం పడేసి పెళ్ళివారంతా చుట్టూ చేరినాక, పెళ్ళికొడుకు పెళ్ళికూతురి చేత సాధారణంగా ఆడపడుచు ఆడించే ఆట ఇది.
బిందిలో మెట్టెలు ఉంగరం కలిపి పడేసి పెళ్ళికూతురు పెళ్ళికొడుకులలో ఎవరినో ఒకరిని ఎవరికి చెప్పిన వస్తువు వారిని తీయమంటారు.. బిందిలో ఇద్దరు చేతులు ఒక సారే పెట్టాలి. ఇంతదాక అందరికీ ఆట తెలుసు. నేను పెళ్ళికూతురు తరఫున మా అవిడ మేనల్లుని తరఫున చేరేము.
ఆట మొదలయింది.బిందిలో చేతులు పేట్టె ముందు మా శ్రీమతి మేనల్లుని చెవిలో ఏదో చెప్పింది.

ఆడపడుచు బిందిలో వస్తువులు వేసి పెళ్ళికొడుకుని రెండు వస్తువులూ తీయమంది, పెళ్ళికూతురు రెండు వస్తువులూ బయటకు తీసింది. అంతా ఒక్క సారి గొల్లున నవ్వేరు. రెండవ సారి మళ్ళీ వస్తువులు బిందిలో వేసి పెళ్ళికూతురుని తీయమంది. పెళ్ళికూతురు రెండు వస్తువులూ బయటకు తీసింది. ఇంకాతరవాత ఎవరిని ఏ వస్తువు తీయమంటె వారు ఆ వస్తువుని తీసి బయట పెట్టేరు. ఎన్నిసారులయినా అలాగేజరుగుతోవుంది. ఆడించే వాళ్ళకి విసుగొచ్చింది. ఒకరన్నారు ఒరేయ్ వాళ్ళు బిందిలో లాలూచీ పడిపోతోంటే మీరు ఎన్నిసార్లు తీయమన్నా వాళ్ళు అవే తీస్తారు. వాళ్ళు ఒకటైపోయర్రా అన్నారు. మరి అందుకేగా మనం ఈ ఆట అడించినది అన్నాను.

వారికి ఒకరిమీద ఒకరికి ప్రేమ, అభిమానం, అనుకూలత, ఓర్పు, ఒకరికి ఒకరు సాయపడాలనే తలపు, వారిద్దరికీ భేదాభిప్రాయాలున్నా బయటవారికి తెలియకుండా గుట్టుగా ఉండటం నేర్పుతుంది ఇది. బిందిలో చేతులుపెడితే ఎవరికి ఏవస్తువు దొరికినా ఎవరిని తీయమని చెప్పినది వారు బయటకు తీసి చూపించే సద్దుబాటు బిందెలో చేతుల ద్వారా జరిగితే నిజంగా ఎవరికి ఏది దొరికింది పైవాళ్ళకి తెలియదు. ఎక్కడయినా ఆట ఆడితే ఇద్దరిలో ఒకరే నెగ్గుతారు. కాని ఈ ఆటలో ఇద్దరూ నెగ్గుతారు.ఓడి గెలుస్తారు.

ఆ తర్వాత పెళ్ళికొడుకుని ఏరా మీ అత్త చెప్పినతరవాత కూడా మొదటిసారి అలా చేసేవు అన్నాను. మామయ్యా నిజంగా మొదటిసారి అవి నాకేదొరికేయి కాని దాని చేతిలో పెట్టాను. అదితీసి బయటకు చూపించింది.అందరు నవ్వేరు. తరవాత ఎవరికి ఏది దొరికినా ఎవరిని తీయమన్నది వాళ్ళకి దొరకకపోతే మార్చుకున్నాము. అంతే బయటవాళ్ళకి మేము లాలూచి పడినట్లుగా కనపడకుండా చేసేము అన్నాడు.ఒరేయి మీమామయ్య మా పెళ్ళిలో ఇలాగే చేసేరురా అంది. అంతా ఒక్కసారి గొల్లున నవ్వేరు. ఓరి పిడుగా! మీరు మమ్మల్ని మించిపోయారన్నాము,. నవ్వులతో సభ ముగిసింది. నిజంగా ఇలా మా పెళ్ళిలో జరిగింది.

ఒకప్పుడు పెళ్ళి ఐదు రోజులు జరిగేది, తర్వాత మూడు రోజులయింది, తరవాత ఒక రోజయింది. ఇప్పుడు ఒక గంట లో అయిపోతూ వుంది.

ఇప్పుడు చెబుతున్న Personality development, Compatibility, Management, Acclimatization, Adoration ఇందులో లేవూ ?

 

శర్మ-కాలక్షేపం కబుర్లు-బ్లాగు కష్టాలు2

Posted on సెప్టెంబర్ 27, 2011
ఇలా వుండగా నా ఇంటావిడ పొరపాటు, నాశ్రీమతి, ఇదీ తప్పే, మరో ముద్దుపేరు ఇదీకాదు, నా రామూకిమా,మధ్యాహ్న భోజనంచేస్తూ వుండగా ఏమిటి మూడు నాలుగు రోజులనుంచి దానికి అతుక్కుపోతున్నారు. కొద్దిగా వివరించేను అక్కడికి నాకేదో పెద్ద తెలిసినట్లు. ఏమో ఏం చేస్తున్నారో ఆరోగ్యం జాగర్త అని చిన్న సలహా లాంటి వార్నింగు. ఇచ్చింది………
మా పెళ్ళినాటికి నాకు 21, ఆవిడకి 16 వయసు. కేసెట్టకండి మైనరుని పెళ్ళిచేసుకున్నావని. ఆవిడ ఇప్పుడు మేజరుగా.మా పెళ్ళికి ప్రభుత్వం వారొకరోజు శలవిచ్చారు.ఒక రోజు రాత్రి డ్యూటీ చేసి పెళ్ళికెళ్ళి, చేసుకుని మరునాడు వ్రతం చేసుకుని మూడవనాడు ఉదయం డ్యూటీ చేసి రాత్రి పునఃస్సంధానమైన తరువాత నా చిటికినవేలు పట్టుకుని వచ్చేసింది నాతో.మా కోడళ్ళు ఏబదియవ పెళ్ళి రోజు మళ్ళీ సంవత్సరం చేస్తామంటున్నారు. అప్పటినుంచి నేను రెండు కంటే ఎక్కువసార్లు తుమ్మినా దగ్గినా కంగారు పడిపోతుంది. ఏమిటొ మనం ప్రేమించే వారి దగ్గరకంటే, మనల్ని ప్రేమించే వారి దగ్గరే మనకి సుఖం. గందరగోళం. చెప్పడం రాలేదనుకుంటా. కవి హృదయం అర్ధం చేసుకోగల విఙ్ఞులు మీరు. పరవాలేదు.
ఒక నెల క్రితం అనుకుంటాను, ఒక రోజు పాలవాడు అదేపనిగా అరుస్తూవున్నాడు. ఎవరూ వెళ్ళివాడికి సమాధానం చెప్పలేదు. ఇక నేను బయలుదేరాను. వాడు పొద్దుటి పాలు సాయంత్రం, సాయంత్రం పాలు పొద్దుట పోస్తానని కాబోలు చెబుతున్నాడు. నాకర్ధం కాలేదు. సరే ఏ విషయం ఇంటావిడతో చెప్పి నీకుచెపుతానన్నాను.వాడు నన్ను చూసి నవ్వుతున్నాడు. ఏమిరా అంటే మేడంగారు మీ వెనకాలే వునారన్నాడు. వెనక్కి తిరిగి నెమ్మదిగా జారుకున్నాను.నాదగ్గరికి ఆవిడ వచ్చి ఇంటావిడ ఏంటి వంటావిడ లాగా అని సాగ తీసింది.తప్పుజరిగినట్లుందని మర్నాటి నుంచి శ్రీమతీ అని పిలవడం మొదలు పెట్టేను. ముదివయసులో ముచ్చట్లులావని కుర్రవేషాలు అంది. అసాధ్యం కూలా! ఏమిటి ఇలాజరుగుతోంది అని అలోచించి పేరుతో పిలిస్తే పోలా అనుకున్నాను. అమ్మో భయమేసింది. కారణం, వాళ్ళ నాన్న నామేనమామే లెండి, నామకరణంనాడు పెద్దపళ్ళెంలో బియ్యంపోసి తెలుగులో వున్న అక్షరాలన్నిటినీ పోగుచేసి పళ్ళెం నిండా రాసి నాప్రాణంమీదకి తెచ్చేడు. ఆపేరు కొండవీటి చాంతాడంత వుంటుంది. ఇప్పుడు పేరులో ఏ భాగంతో పిలిస్తే ఏమి తంటాయో తెలియదు. కష్టాలలో పడ్డావురాజీవా! అనుకుని ఆలోచిస్తే చిన్నప్పటినుంచి అందరం ముద్దుగా పిలుచుకునేపేరు పెట్టి పిలవనారంభం చేసాను. దీనికీ తగువొచ్చింది. మా మనుమరాలు ఐదేళ్ళది తనూ అదే పేరుతో మామ్మను పిలుస్తూ వుంటే అందరూ నవ్వేరు. నేనూ నవ్వేను. తగువొచ్చేసింది.చిన్న పిల్ల ముందు అలా పిలిస్తే అదీ అలా పిలవదా. ఆయ్ అంటె, ఇదేమిరా భగవంతుడా ఈ మధ్య సంకురుమయ్య పేర్లు పిలుపుల మీద నడుస్తున్నాడు అని అలోచనకి పడ్డాను.. కోడలుకనపడితే మీ అత్తను పిలమ్మా అని,అబ్బాయితో మీ అమ్మని పిలు, మామ్మని పిలు అంటున్నాను. బాగానే వుంది కాని అస్తమానం ఎవరు దొరుకుతారు. వాళ్ళ పనులు వాళ్ళకి వుండవా. తరవాత నన్ను చూసి పారిపోవడం మొదలెట్టేరు. ఇంక ఇది పని కాదని చూస్తూ వుండగా టీ. వీలో హిందీ చానల్లో రాముకీ మా, రామూ కి మా అనివినపడింది. ఇదేదో మనకి పనికొస్తుందనుకుని అలా పిలవడం మొదలు పెట్టేను. ఏమనుకుందో గాని మరి మాట్లాడ లేదు. ప్రస్తుతం రామూ కి మా నడుస్తూ వుంది. మా అబ్బాయి పేరు రామమోహన్ లెండి. సరే ఈ ఉప్పెననుంచి బయట పడ్డాను…..ఇంతకీ బ్లాగుకి దీనికి సంబంధం ఏంటండీ అంటే చివరి ఘట్టాలు బ్లాగు కష్టాలతో కలిసిపోయాయి మరి…..

ఉప్పెనంటె గుర్తుకొచ్చింది
నవంబరు పతొమ్మిదవ తేది సంవత్సరం గుర్తులేదు 77,78,79 మూడిటిలో వొకటి, దివిసీమకు ఉప్పెన వచ్చింది.
ఆ ముచ్చట మరోసారి……. ఇలా లింకులేసుకుంటూ పోతే కష్టం కదా…… గురువుగారు చెప్పేరు …. తిరు మంత్రం…..

 

శర్మకాలక్షేపంకబుర్లు-బ్లాగుకష్టాలు-1

Posted on సెప్టెంబర్ 26, 2011
పాఠకులకు మనవి:–సీత కష్టాలు సీతవైతే పీత కష్టాలు పీతవి. నావి బ్లాగు కష్టాలు. నేను రాసిన వాటిపై మీరు అభిమానంతో రాసే కామెంట్లుకి జవాబు రాయలేని దుస్థితి. మాది పెద్ద పల్లెటూరు. ఇక్కడ నాకు బ్లాగు గురించి సహకారం దొరకదు.నేను మొదటకొన్నింటికి జవాబులు రాసాను. వాటి మూలంగా మరొక చిక్కు వచ్చింది. దానిని పరిష్కరించుకుని మీకు జవాబులు రాస్తాను.నేను ఇదివరలో ఇచ్చిన జవాబులుగాని కనపడకపోతే కూడా అపార్ధంచేసుకోవద్దు. నా కష్టాలు కొన్ని బులుసువారికి తెలుసు.
ప్రస్తుతానికి వస్తే. భమిడిపాటి వారు వారి బ్లాగుద్వారా పరిచయం. కొద్దిరోజుల తరువాత వారు నన్ను బ్లాగు మొదలుపెట్టమని సలహా ఇచ్చారు. నేను నాలుగు తెలుగు అక్షరాలు తప్పులేకుండా రాయగలిగితే బ్లాగు రాయడం కుదరదేమోననీ ఒక పోస్టురాసి పంపుతున్నాను అది చూసి ప్రచురణకి అర్హమైనదే అని మీరంటే బ్లాగు రాస్తానని కండిషను పెట్టేను. వారు కేంద్ర ప్రభుత్వంవారు తెలంగాణా గురించి నానపెట్టినట్లు వారు దాన్ని నానపెట్టేరు. వారి పనులు వారికి వుంటాయి కదా. అది పులిసిపోయింది. నాకు దురద, కాంక్ష,పెరిగిపోయింది.అది బలిసి22 తేది మధ్యాహ్నము రెండు క్లిక్కులు, నాలుగు టిక్కులతో బ్లాగు మొదలై పోయింది. ఏమిరాయాలి? రాసినవేవో వున్నాయిగాని అవిమొదటగా ప్రచురించటం ఇష్టం లేకపోయింది.నమస్కారాలతో మొదలెడితే మంచిదనుకుని మొదలెట్టేను. రాయడం. గురువు దైవం అన్నారుకదా అందుకు గురువందనం పూర్తిచేసేను. ఇక దైవ వందనం రాయబోతే అమ్మమీద రాద్దామనుకున్నాను. ఓరిని! ఇప్పటిదాకా నేను గుర్తులేను ఇప్పుడేమిరా అంటుందేమోనని అనిపించి మార్గం అలోచిస్తే దారిదొరికింది. అమ్మగారి కొడుకుని ప్రసన్నం చేసుకుంటే అమ్మా ప్రసన్నురాలేకదా. బొజ్జ గణపయ్యని మొక్కేను, విఘ్నాలులేకుండా చూడమని. తరువాత అమ్మకి మొక్కేను. నడిచిపోయింది. కుక్కవంటి మనసు కూర్చుండనీయదని వంకరదణ్ణాలమీద పడ్డాను. బుద్ధిచెప్పింది ఒరేయ్ పైన అందరికీ దణ్ణాలెట్టేవు కింద ఇది రాస్తే అదికూడా ఇదే అనుకుంటారు అని. ముగించేను.
ఇక ప్రచురించాలి ఎలా తెలియదు. గారెలెయ్యడానికి కోడలా ఏముందిఅంటే వేలు చూపినట్లు అయ్యింది నాపని. ప్రయత్నం చేస్తూ వుండగా పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చినట్లు,కరంటు లటుక్కున పోయింది. బతుకు జీవుడా అంటూ లేచాను. మరునాడు.ప్రయత్నం మళ్ళీ మొదలు. కష్టపడి మొత్తానికి ప్రచురించేను. గొప్ప పనిచేసి నట్లు భమిడిపాటి వారికి మెయిలు ఇచ్చేసాను. అయిపోయిందనుకున్నాను. కానీ అప్పుడే కష్టాలు మొదలని తెలియదు.మీరు రాసారు సరే అది ఎవరేనా చదవాలికదా అంచేత కూడలి, హారంలతో లింకు వేయమన్నారు. ఆయన చెప్పేరుకాని మట్టిబుర్రకి అర్ధంకాలేదు. నా కన్న తల్లి అనేది. ఒరేయ్ నీబొమ్మ బ్రహ్మగారు భోజనం తరవాత చేసేడురా. నిద్ర తూగులో నీ బుర్రలో కొద్దిగా మట్టి తక్కువ పేట్టేడుఅనేది.మరి ఎలగమ్మా అంటే. నాయనా నీకేమి భయం లేదు. భయంఅంతా నీ ఎదుటివారికే అనేది.తల్లి దీవన ఇప్పటికీ ఇదినిజమే. ఎక్కడికో పోయాను. ప్రయత్నం మొదలు పెట్టేను. ఒక పరిస్తితులలో,రాసింది పోయింది,చిరాకు వచ్చింది. బ్లాగు మూసెఅయ్యడం ఎలా అనేది కూడా చూసేను. మళ్ళీ తమాయించుకుని ఆరంభింపరు నీచ మానవులు చదువుకుని మళ్ళీ మొదలెట్టేను. ఈలోగా మిత్రులు బులుసువారు పలకరించేరు. వారికి పొడి పొడిగా సమాధానమిచ్చి, ఈ సమస్య తీర్చుకోడం ఎలాగో చెప్పరాదా అని అడిగేను. అది మొదలు అయన అదే పని మీద వుండి సాయంత్రంకి నాకు మళ్ళి కబురు చేప్పేటప్పటికి హారంవారు లంకె వేసినట్లు వార్త పెట్టేరు. బతుకు జీవుడా అనుకోగా కరంటు పోయింది.
మర్నాడు ఆదివారం ఎందుకో కరంటు తీయలేదు.శనివారం ఆదివారం కూడా పోస్టులు వేసాను.నిన్న సాయంత్రంకి కొంత మందికి జవాబిస్తూవుండగా మరొక కొత్త బాధ కలిగింది. రాత్రి పన్నెండు గంటలకి మరొక పోస్టు వేసాను. ఇలా వుండగా నా ఇంటావిడ పొరపాటు, నాశ్రీమతి, ఇదీ తప్పే, మరో ముద్దుపేరు ఇదీకాదు, నా రామూకిమా, భోజనంచేస్తూ వుండగా ఏమిటి మూడు నాలుగు రోజులనుంచి దానికి అతుక్కుపోతున్నారు. కొద్దిగా వివరించేను అక్కడికి నాకేదో పెద్ద తెలిసినట్లు. ఏమో ఏం చేస్తున్నారో ఆరోగ్యం జాగర్త అని చిన్న సలహా లాంటి వార్నింగు. ఇచ్చింది………
మిగతా రేపుమరి

 

కష్టేఫలే-శర్మ కాలక్షేపం కబుర్లు-మహాలయ అమావాస్య

Posted on సెప్టెంబర్ 25, 2011
రేపు సెప్టెంబరు ఇరువదిఏడవతేది మహాలయ అమావాస్య.
ప్రతీ సంసృతిలోను కాలంచేసినవారిని తలుచుకోవడం సహజం. దీనినే మనవాళ్ళు పెద్దలకి పెట్టుకోవడం అంటారు. అలాగే కాలంచేసినవారిని తలుచుకోవడం కోసం ప్రత్యేకంగా ఒక పదిహేను రోజులని కేటాయించారు.అవి భాద్రపద బహుళ పాడ్యమి మొదలు భాద్రపద బహుళ అమావాస్య వరకు. ఈ రోజులలో పెద్దలు కాలం చేసిన తిధినాడుగాని అప్పుడూ కుదరకపోతే అమావాస్య నాడుగాని పెద్దలను తలుచుకొని తర్పణంచేసి సాత్వికులైన వారికి అన్నపానీయలిచ్చి గౌరవం చేయడం మన ఆచారం. ఈరోజు కనీసంగా పిత్రు తర్పణం అనగా గతించిన తండ్రి, తాత, ముత్తాతలని తల్లి, మామ్మ, తాతమ్మలకు ఋషి సహిత గోత్రనామాలతో నీళ్ళు వదిలిపెడతారు.తన వంశంలో పిల్లలు లేకుండాగతించినవారికి, అకాలమరణం పొందినవారికి తర్పణం ఇస్తారు. గతించిన గురువుకి,తరువాత తనకు ముఖ్యులై గతించినవారికి, గతించిన రాజుకు,చివరగా ఈ భూమండలంమీద అనాధగా చనిపోయినవారందరికి తర్పణం ఇస్తారు. తర్పణం అంటే మంత్ర సహితంగ నీళ్ళువదలి పెట్టడమే. మంత్రం చెప్పుకోలేనివారు తర్పణం చేయలేరా. శ్రద్ధ ముఖ్యంకాని మంత్రం కాదు. మంత్రంతో చేయగలిగితే మంచిదే. లేకపోయినా ఆయా పెద్దలను తలుచుకొని నీళ్ళువదలచ్చు. విశేషం ఏమంటే గంగా నది ఒడ్డున ఈరోజు మధ్యహ్నం పన్నెండు గంటలు దాటిన తరువాత ఈ కార్యక్రమం జరుపేవారు ఎక్కువ. మనమూ ఈ కార్యక్రమాన్ని అవుసరం ఉన్నవారు మధ్యాహ్నం పన్నెండు దాటిన తరువాత ఆచరించ వచ్చును. పెద్దలను గౌరవించడం తలవడం మన సంసృతి. అంతేకాదు మనకు ఏ సంబంధమూ లేని భూగోళం మీద గతించిన అనాధలందరూ కూడా శాశ్వత పుణ్యలోకాలలో మనవారితో సహా వుండాలని మన భారతీయ సంస్కృతి చెబుతోవుంది. ఇది చాదస్తంగా కనపడవచ్చు కాని
మనంఆచరించవలసినదే.

పెళ్ళికిముందుగా గతించిన పెద్దలను ఆహ్వానించి అర్చన చేసి, వంశములో జీవించియున్నవారిలో పెద్దలిని పిలిచి వారికి సత్కారం చేసి అప్పుడు చేయబోయే శుభకార్యంకి కంకణం కట్టుకుంటాము. గతించిన పెద్దలను తలుచుకొని చేసే కార్యక్రమమే సంకల్పం.

 

కష్టేఫలే-శర్మ కాలక్షేపం కబుర్లు- స్నేహితునివిలువ

Posted on సెప్టెంబర్ 25, 2011
మాలాకారుడు శ్రీకృష్ణుని కోరిన కోరిక

బలరామకృష్ణులు మధురకు మొదటిసారి వచ్చిన సందర్భముగా మాలాకారుడు సుదాముని గృహానికి వెళతారు.

“అంతనా రామకృష్ణులు, సుదాముండను మాలాకారు గృహంబునకుం జనిననతండు అని లేచి గ్రక్కున మ్రొక్కి, చక్కననర్ఘ్యయపాద్యదికంబు లాచరించి, సానుచరులైన వారలకు దాంబూల కుసుమ గంధంబులొసంగి, యిట్లనియె.
పావనమయ్యె నా కులము పండెదపంబు గృహంబు లక్ష్మికిన్
సేవితమయ్యె నిష్టములుసేకుఱె విశ్వనిదానమూర్తులై
భూవలయంబుగావ నిటు పుట్టిన మీరలు రాక చేసి నే
నేవిధ మాచరింతు బను లెయ్యవి బంట నెరుంగ జెప్పరే.”…….. భాగవతం

సుదాముడు అనే మాలాకారుడు వెంటనే లేచి, నమస్కరించి,రామకృష్ణులకుకాళ్ళు కడిగి, తాగడానికి పానీయం ఇచ్చి, కూడా వచ్చిన వారికి తాంబూలము,గంధము,పువ్వులు ఇచ్చి సత్కరించేడు. నా ఇంటికి రావడం మూలంగా నాకులమంతా తరించింది,ఇల్లు లక్ష్మితో నిండిపోయింది,నాకు కావలసిన కోరికలన్నీ తీరేయి. ఈ భూమినంతనూ రక్షింపగల మీకు నేను చేయగల పనులు ఆనతి ఇమ్మని కోరుతూ చక్కటి, పెద్దవైన పువ్వుల మాలలు తెచ్చి ఇచ్చాడు. అప్పుడు శ్రీ కృష్ణుడు నీవుకోరిన వరం ఇస్తానంటే,

“నీ పాద కమల సేవయు, నీపదార్చకుల నెయ్యమును,నితాం
తాపార భూతదయయును, దాపసమందార! నాకు దయసేయగదే.”…..భాగవతం

సుదాముడు అనగా మంచి పువ్వులవాడు, కృష్ణుని అడిగిన కోరిక, “ఎప్పుడూ నీపాదాలసేవ, నీపాదాల్ని అర్చనచేసేవారి స్నేహము, ఎడతెగని భూత దయ నాకు ఇప్పించ మని” కోరేడు. సుదాముడికి తెలుసు. తనకి కైవల్యం రావాలంటే చేసినకర్మ ఫలం పూర్తి కావాలి. దానికి మార్గం శ్రీహరి పాద సేవ, నవవిధ భక్తి మార్గాలలో ఒకటి. నవవిధ భక్తి మార్గాలు శ్రవణం,కీర్తనం,స్మరణం,పాద సేవనం,అర్చనం,వందనం,దాస్యం,సఖ్యం,ఆత్మ నివేదనం. వైరభక్తి అనేది శ్రీహరి జయవిజయులకు మాత్రమే అనుగ్రహించినదికాని ఇది భక్తి మార్గంకాదు. పాలు తాగించే నెపంతో విషం ఇవ్వడానికి ప్రయత్నం చేసిన పూతనకు కూడా కైవల్యం ఇచ్చారు స్వామి. పాదార్చకుల స్నేహం అపార భూత దయ కావాలన్నాడు, ఎందుకంటే శ్రీహరి పాద సేవకుల స్నేహం లేక పోతే శ్రీహరి పదసేవ మరచే సావకాశంఉంది. అలాగే అపారమైన భూత దయ లేకపోతే హింసలోకి జారిపోయి మళ్ళీ తప్పు దారిపడే సావకాశం ఉంది. అలా తప్పు దారిపడకుండా ఉండేందుకు, కైవల్యానికి తోవకోసం. లేకపోతే ఈజనన మరణ చక్రంనుంచి బయటపడే మార్గం దొరకదు. మనం తప్పుదారి పట్టినా మంచి దారి పట్టినా మన మీద స్నేహితుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది.మంచి స్నేహితుడు కైవల్య మార్గంకి తోడవుతాడు.

vivekananda GN on 03:34 వద్ద జూలై 31, 2013 said: మార్చు
0 0 Rate This
adbutam

Reply ↓

kastephale
on 23:22 వద్ద జూలై 31, 2013 said: మార్చు

@vivekananda GN గారు,
స్వాగతం, నా బ్లాగుకు.
ఇది బ్లాగు మొదలుపెట్టిన మూడవనాటి టపా. ఇంత పాత టపా చదివి వ్యాఖ్య పెట్టిన మీకు
ధన్యవాదాలు.

Reply ↓
kastephale on 11:08 వద్ద సెప్టెంబర్ 27, 2011 said: మార్చు

బులుసు సుబ్రహ్మణ్యం గారు
మీలాంటి,భమిడిపాటి ఫణిబాబుగారి లాంటి మిత్రులు దొరకడం అదృష్టం కాదా.భమిడిపాటి వారామాట అనకపోతే బ్లాగు మొదలు పెడుదునా

Reply ↓
బులుసు సుబ్రహ్మణ్యం on 17:04 వద్ద సెప్టెంబర్ 25, 2011 said: మార్చు

>>> మనం తప్పుదారి పట్టినా మంచి దారి పట్టినా మన మీద స్నేహితుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

మార్గ నిర్దేశం చేసే స్నేహితులు దొరకడం అదృష్టం. సుదాముడి కధలో ఈ అంశాన్ని బాగా చెప్పారు.

Reply ↓