శర్మ కాలక్షేపంకబుర్లు-శివుడు శ్మశానంలోనే ఎందుకుంటాడు?

Posted on ఫిబ్రవరి 27, 2014

పనిలో ఉన్నారా? ఫరవాలేదు, మీ పని చేసుకుంటూ, ఒక చెవి ఇటు పడేసి మహన్యాసం వినండి.

శివుడు శ్మశానంలో ఎందుకుంటాడు?

 ఈ ప్రశ్న నాది కాదు, ఈ అనుమానం సాక్షాత్తు అమ్మవారికే వచ్చి, అయ్యవారిని నిండుకొలువులో అడిగేసింది, (భారతం. అనుశా.ప. అశ్వాసం….4….418 నుండి443 వరకు స్వేఛ్ఛానువాదం.) ఆ కధాక్రమంబెట్టిదంటే………

శంకరుడు కైలాసంలో దేవతలు, సిద్ధులు, సాధ్యులు, విద్యాధరులు,మునులు,భూతగణాలు నిండిఉన్న కొలువులోఉన్న,ఆ సమయంలో గౌరీదేవి వెనుకనుంచి వచ్చి, శంకరుని రెండుకళ్ళూ తనచేతులతో మూసింది. లోకాలన్నీ చీకట్లుకమ్మేయి, జీవులన్నీ సంక్షోభం చెందాయి.. శంకరుడు మూడవనేత్రం తెరిచారు. హిమనగం మండిపోవడం మొదలయింది. అది చూసిన గౌరి ”స్వామీ మూడవకన్ను తెరిచారేమీ? దానివల్ల నా తండ్రి హిమవంతునికి బాధ కలిగిందని” వేడుకుంది, ”మూడవకన్ను తెరవడానికి కారణం రహస్యమైతే చెప్పద్ద”ని ముద్దుగా అలిగింది కూడా. అందుకు శంకరుడు కరుణగా చూడగా, హిమనగం మామూలయింది. ”గౌరీ, నీకు తెలుపకూడని రహస్యాలు నాకులేవని, నేను లోకాత్మకుడిని, సర్వలోకాలు నన్నుపట్టి ఉంటాయి. నువ్వు నా రెండుకళ్ళూ మూశావు, లోకాలు చీకటి, సంక్షోభం చెందాయి, అందుకు మూడవకన్ను తెరవాల్సివచ్చింద”న్నారు. ఆ! ఇది మంచి సమయం, ఉన్న అనుమానాలన్నీ తీర్చేసుకుంటాననుకుని ప్రశ్నల వర్షం కురిపించడం మొదలెట్టింది.

”మీకు నాలుగు ముఖాలెందుకున్నాయి?”

”ఒకప్పుడు సుందోపసుందులనేవారు ఉండేవారు.వాళ్ళులోకాలను బాధిస్తుండేవారు. మయుడు లోకంలోని అన్ని అందాలను పోతపోసి ఒక స్త్రీని సృస్టించి నా దగ్గరకు తెచ్చాడు. అది నాకు ప్రదక్షిణంగా నా చుట్టూ తిరిగింది. ఆమెను నాలుగు దిక్కులా నిశితంగా పరిశీలించడం కోసం నాలుగు ముఖాలు ధరించాను, అప్పటినుంచి చతుర్ముఖుడనయ్యాను.”

”మీకు కంఠం మీద నల్లమచ్చ ఏమి?”

”దేవతలు, దానవులు కలిసి పాలకడలి మధించినపుడు వచ్చిన హలాహలాన్ని మింగి అక్కడ ఉంచాను. అందుకు అక్కడ మచ్చ ఏర్పడింది. ఇంకా ఏమయినా ప్రశ్నలుంటే అడగ”మన్నారు, శంకరులు.

”పినాకమనే విల్లు ధరిస్తారు కారణం చెప్ప”మంది గౌరి.

”కణ్వుడనే మహాముని ఆదియుగం లో తపస్సు చేశాడు. ఆయనపై పుట్టలు మొలిచాయి. ఆ పుట్టమీద ఒక వెదురుపొద మొలిచింది, అది చాలా అద్భుత పరిమాణంలో పెరిగింది. బ్రహ్మగారు ఆమునికి వరాలిచ్చి, ఆ వెదురునుంచి మూడు విల్లులు తయారు చేశారు. ఒకటి పినాకము,నా దగ్గర ఉన్నది. రెండవది శార్ జ్గము, ఇది విష్ణువు దగ్గర ఉన్నది. మూడవది తాను తీసుకున్నారు . అప్పటినుంచి పినాకం చేతిలో ఉండటం మూలంగా పినాకపాణి అని నాపేరు”.

”లోకంలో మరేదీ వాహనం లేనట్టు ఎద్దును వాహనం చేసుకున్నారేమీ?” గౌరి ప్రశ్న.

”హిమనగం దగ్గర తపస్సు చేసుకుంటున్నా. చుట్టూ గోవులు చేరిపోయాయి, చాలా బాధపెట్టేయి. కోపంగా చూడగా సంతాపం చెందేయి. అప్పుడు విష్ణుమూర్తి వృషభాన్ని నాకు కానుకగా ఇచ్చారు. నాకు ‘గోపతి’ అని పేరుకూడా పెట్టేరు. అప్పటినుంచి ఎద్దు నా వాహనమైనది.”

”మీరేమో పరమ శుచిమంతులు, మంచి ఇంట్లో వాసం చేయక శ్మశానం లో ఉన్నారేమి స్వామీ?”

”భయంకరమైన భూతాలు, ప్రజలను చంపుతూ బాధలు పెట్టేవి. అప్పుడు బ్రహ్మగారు నా దగ్గరకొచ్చి ’శివా! జీవులను కాపాడే మార్గం చూడవయ్యా’ అని అడిగితే భూతాల నివాసమైన శ్మశానం లో నివాసం ఏర్పాటు చేసుకున్నా, అవి నా కనుసన్నలలో ఉండటంతో లోకాలు రక్షింపబడ్డాయి. మోక్షపరులు ఇది శుచిస్థానం అంటారు, జనం తిరగరు, అందుకు ఇక్కడనుంచి లోకాలను రక్షించాలనుకున్నా”.

”ఈ బూడిద రాసుకోడం, పాములు ధరించడం, శూలం,పరశువులు ఆయుధాలు, భీకరమైన రూపం ఏమి స్వామీ?.”

”లోక స్వరూపం రెండు రకాలు. ఒకటి శీతం, రెండవది ఉష్ణం. ప్రపంచం ఈ రెంటితోనే ఉంది. సౌమ్యం విష్ణువు, ఆగ్నేయం నేను, విశ్వాన్ని భరిస్తాను, అందుచేత వేడి, భయంకరమైన రూపం ధరిస్తాను”

”మరి చంద్రవంకను నెత్తిన ఎందుకు ధరిస్తారు?”

”దక్షయజ్ఞ సమయంలో నేను దేవతలని బాధించాను, ఆ సమయంలో చంద్రుడిని కాలితో తొక్కేను, చంద్రుడు నన్ను శరణు వేడాడు, ’అయ్యో! పొరపాటు చేసేననుకుని చంద్రుడిని నెత్తి మీద పెట్టుకున్నాను”

అమ్మకి వచ్చిన అనుమానాలని శంకరులు తీరిస్తే వివరాలు అందరికి తెలిశాయి. అమ్మకివన్నీ తెలియవా? తెలుసు పిల్లలకి తెలియచేయాలని అమ్మ చేసిన చిన్న మాయ.

నమః శOభవేచ/ మయోభవేచ/ నమః శంకరాయచ/ మయస్కరాయచ/ నమః శ్శివాయచ/ శివతరయాచ/

ఈశాన సర్వ విద్యానాం/ ఈశ్వర సర్వభూతానాం/ బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా/ శివోమే అస్తు సదా శివోం/.

రచయిత: kastephale

A retired telecom engineer.

12 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-శివుడు శ్మశానంలోనే ఎందుకుంటాడు?”

  1. శివుడు శ్మశానం లోనే ఎందుకు ఉంటాడు ?

    జనాలు యాడ తిరిగినా తిరగండ్రోయ్ ఫైనల్ గా అక్కడికే కదా వస్తారు ఓ పట్టి పట్ట చూస్తా అని … 🙂

    హరహర శంభో శంకర !

    జిలేబి

    మెచ్చుకోండి

    1. జిలేబి గారు,
      మీరంతా ఎక్కడెక్కడ తిరిగినా నాద్దగరకి రాక తప్పదని సంవత్సరానికి ఒకరోజేనా గుర్తు చేసుకునైనా బతకమన్నాడేమో శివుడు 🙂
      హరహర శంభో శంకర !
      భక్త వశంకర!!

      నమః పార్వతీ పతే!
      హరహర మహాదేవ

      ధన్యవాదాలు.

      మెచ్చుకోండి

      1. సంవత్సరాని కో రోజు కి సుల్తానాయన 🙂
        రాత్రంతా జాగారం చేసి జనావళి జోగుతోంది,
        భాస్కరుడేమో యథావిధి గా తన విశ్వ సంచాలనం లో ఉన్నాడు

        చీర్స్
        జిలేబి

        మెచ్చుకోండి

      2. జిలేబి గారు,
        ఎప్పటికి ఆయనే మహరాజు, మరచిపోతున్నాం. భాస్కరుడు, నిన్నంతా ఉపవాసం, రాత్రి ఫలహారం, శుభ్రంగా నిద్దరోయి ఉదయమే తనపనిలోకి తనొచ్చేశాడు. జాగరణ ఎప్పుడూ కావాలి,అదే ఎరుక, ఉన్నాడన్నదే అది.. 🙂
        ధన్యవాదాలు.

        మెచ్చుకోండి

  2. గురువు గారు, మూడోదైనా బ్రహ్మగారి విల్లుకి ఏదైనా పేరుందా అండీ? అందరికి శివరాత్రి శుభాకాంక్షలు.

    మెచ్చుకోండి

    1. అన్యగామి గారు,
      రూఢిగా చెప్పలేను గాని అది గాండీవం. బ్రహ్మగారి నుంచి అగ్నికి ఆయన నుంచి అర్జునునికి చేరింది.
      ధన్యవాదాలు.

      మెచ్చుకోండి

    1. లలితమ్మ తల్లీ!
      ఈ బ్లాగులోవన్నీ ఒకప్పటి టపాలే, నిరుడు కురిసిన హిమ సుమాలే! మూడేళ్ళ కితం టపా ఇది, ప్రతి టపా పైన నాటి తారీకుంటుంది. 🙂
      ముందుకాలంలో ఓపిక తగ్గితే వ్రాయడం కుదరకపోవచ్చని నాటిరోజుల్లో రోజూ వ్రాసేశా! 🙂 అంతే
      ధన్యవాదాలు.

      మెచ్చుకోండి

      1. పరుగున వచ్చెడు భాస్కరు
        ని రసమయ పదముల నియమ నిష్టల రీతిన్
        నిరుడు కురిసిన హిమసమూ
        హ రుక్కులివి, లలితమైన హర్మ్యంబనగన్ 🙂

        జిలేబి

        మెచ్చుకోండి

వ్యాఖ్యలను మూసివేసారు.