శర్మ కాలక్షేపంకబుర్లు-పొగడ్త.

Posted on అక్టోబర్ 28, 2012
పొగడ్త.

“నామ పారాయణప్రీతా”ఇది లలితాదేవికి సహస్రనామాల్లో ఒక పేరు. తన నామాని కంటే అయ్య నామాన్ని పారాయణ చేస్తే, అమ్మ సంతోషిస్తుంది, ప్రీతి చెందుతుంది.అమ్మ నామం పారాయణ చేసినా ప్రీతిపొందుతుంది. మరొక సంగతి ధర్మరాజు రాజసూయం చేశాడు, అగ్ర పూజ ఎవరికి చేయమంటావని తాత భీష్ముడిని అడిగితే,

రోదసీ కుహరంబు రుచిరాంశుతతి జేసి,యర్కుండు వెలిగించునట్టు లమృత
సందోహనిష్యంద చంద్రిక జేసి శీతాంశుడానందించునట్టు సకల
జనులకు తనదైన సదమలద్యుతి జేసి తనరంగ దేజంబు దనువు దాన
చేయుచు నున్నసత్సేవ్యుండు పుండరీకాక్షుండు గృష్ణు డనాదినిధను

అబ్జనాభు డుండ నర్ఘ్యంబునకు నిందు నర్హు లొరులు గలరె యజ్ఞపురుషు
నఖిలలోక పూజ్యు నచ్యుత బూజింపు, మధిప యదియ చూవె యజ్ఞఫలము…భారతం…సభా పర్వ….ఆశ్వా.2….6

మరెవరో ఎందుకు గొప్పవాడయిన కృష్ణునికి అగ్ర పూజ చేయమని, అదే యజ్ఞ ఫలమని చెప్పేడు. కృష్ణునికి అగ్ర పూజ జరుగుతూ ఉంటే సహించలేని శిశుపాలుడు, ముందుగా ధర్మరాజుని పట్టుకుని, గొప్ప రాజులుండగా, ధర్మం తెలియని వాడికి అగ్రపూజ తగదంటాడు. కావలసిన వాడయితే సొమ్ములిచ్చుకో, కావలసిన పని చేసిపెట్టుకో, అంతే తప్పించి ఇంతమంది రాజులు, భూసురులు ఉన్న సభలో ముసలాడయిన భీష్ముని మాటపట్టుకుని కృష్ణుడికి అగ్రపూజ తగదన్నాడు. పెద్దవాడని పూజిస్తావా? వసుదేవుడున్నాడుకదా!, ఋత్విజుడనుకుంటే? వ్యాసుడున్నాడు కదా!, ఆచార్యుడని పూజిద్దామనుకుంటే ద్రోణుడున్నాడే!,రాజని పూజించావనుకుంటే, యాదవులు రాజులు కాదుకదా! ఇలా ఇతను ఎందులోకీ చెందనివాడు, నువ్వు భీష్ముని పలుకులతో నవ్వులపాలయి పోయావన్నాడు. అంతెందుకు, నీకు తెలియక ఇస్తే దీనికి నేను అర్హుడను కానననక, కృష్ణుడు ఎలా పుచ్చుకున్నాడయ్యా.! అని తిడుతూ ఉంటే ధర్మరాజు అనునయించాడానికి ప్రయత్నిస్తూ ఉంటే, భీష్ముడు వీడు కుఱ్ఱాడు వదిలెయ్యమని చెప్పి, శిశుపాలుడితో భీష్ముడు,ఈ సభలో వారంతా ఆయన దయకు పాత్రులే, జ్ఞాని అయిన వాడు బాలుడయినా బ్రాహ్మణుడు పూజార్హుడు, క్షత్రియుడు, రాజులందరిలో గొప్పవాడయితే పూజనీయుడు, ఈయన జగదాధారుడు, మాకే కాదు, అందరికీ పూజనీయుడే అన్నాడు.

వృద్ధులొక లక్షయున్నను, బుద్ధియె యెవ్వరికి వారి బూజింపంగా
నిద్ధరణీశులలో గుణవృద్ధని పూజించితిమి త్రివిక్రము భక్తిన్…భార…సభా…ఆశ్వా..2….27

లక్షమంది వృద్ధులున్నా, బుద్ధిలో గొప్పవాడయిన కృష్ణుడిని పూజించామయ్యా అని చెప్పేడు, భీష్ముడు. చిరాకెత్తిన సహదేవుడు, కాదన్న వాడినెత్తి మీద కాలెట్టి తొక్కేస్తా అన్నాడు. ఈ మాటకి దేవతలు ఆనందించి పుష్ప వర్షం కురిపించేరు, నారదుడు ఆడేడు. ఆ తరవాత శిశుపాలుడు, మహాత్ముడయిన జరాసంధుడిని బ్రాహ్మణ రూపంలో భీముడు, అర్జనుడినితోడు తీసుకుని మరే చంపించాడు, అటువంటి వాడిని ఎందుకు తెగ పొగిడేస్తున్నావు, నీకంతగా పొగడాలని ఉంటే సుగుణ వంతులయిన కర్ణుడినో,శల్యుడినో పొగడచ్చుకదా, అంటూ ఉంటే పళ్ళు పటపటా కొరుకుతూ శిశుపాలుని మీద కోపంచూపిస్తున్న భీముని చూసి, భీష్ముడు, శిశుపాలుని జన్మ వృత్తాంతం చెబుతాడు. “వీడు పుట్టినపుడు వికృతంగా పుట్టేడు, ఆకాశవాణి వీడి అవకరాలు ఎవరి చేతిలో హరిస్తాయో, వారి చేతిలోనే వీడు హతుడవుతాడని చెప్పింది, మేనత్త సాత్వతి, తన ఇంటికి వచ్చిన మేనల్లుడు కృష్ణుని చేతికిచ్చింది, శిశుపాలుని, అవకరాలన్నీ పోయాయి, పుత్రుని మారకుడు కృష్ణుడేనని తెలుసుకున్న వీనితల్లి, కృష్ణుని వేడు కుంటుంది. వంద తప్పులు కాయమని కోరింది, మేనత్త కోరిక మన్నించాడు, కృష్ణుడు. అందుచేత, వీడు హరి చేత హతుడవటం ఖాయమని, శాంతం వహించమని చెబుతాడు. అప్పుడు కృష్ణుడు శిశుపాలుడు చేసిన తప్పులిలా చెప్పేడు.

ప్రాగ్జ్యోతిషంబున భగదత్తుపయి నేము వోయిన నిత డన్యాయవృత్తి
నిట బాలవృద్ధుల కెల్లభయంబుగా ద్వారకాపురి గాల్చె వీరులైన
భోజరాజన్యులు పొలతులతోడ రైవతకాద్రి గ్రీడాభిరతి బ్రమత్తు
లయి యున్నవారల నదయుడై వధించె దేవాభు డగువసుదేవు చేయు

నశ్వమేధమునకు నభ్యర్చితంబైన హయమునపహరించి యజ్ఞమునకు
విఘ్న మాచరించె వీ డతిపాపుడై బభ్రుభార్య దనకు భార్య జేసె…..భార……సభా.పర్వమ్….ఆశ్వా…2…..65

మఱియు వాగ్విషయంబు లయినయపకారంబు లనేకంబులు సేసె మా యత్త సాత్వతి నన్నుం బ్రార్ధించుటం జేసి యిద్దురాత్ముండు సేసినయపరాధశతంబు సహించితి నిప్పుడు మీరిందఱు నెఱుంగ నాయందకారణవ్యతిక్రమం బుపక్రమించి యత్యంత శత్రుండయ్యె…….భార..సభా.పర్వం…ఆశ్వా..2…..66

భగదత్తునిపైకి మేము యుద్ధానికి వెళితే ఇతడు బాలలు,వృద్ధులు,ఉన్న ద్వారకను కాల్చేశాడు, రైవతక పర్వతం మీద స్త్రీలతో క్రీడా వినోదంలో ఉండి, జాగరూకతలో లేని భోజుడు, మిగిలినవారలను చంపేశాడు, వసుదేవుడు అశ్వమేధం చేస్తుంటే, దానికోసం ఉంచిన గుఱ్ఱాన్ని దొంగిలించుకుపోయి యజ్ఞం పాడుచేసేడు, బభ్రువు భార్యను తనకు భార్యగా చేసుకున్నాడు, ఇవే కాక చాలా తప్పులు చేసేడు, మా అత్తకిచ్చిన మాట ప్రకారంగా ఇన్ని తప్పులూ సహించాను, ఇప్పుడు అకారణంగా నా మీద శత్రుత్వం వహిస్తున్నాడు అని చెబుతుండగా, శిశుపాలుడు, నీతో స్నేహం,విరోధం నాకెందుకోయ్, నాకిస్తానన్న అమ్మాయిని తీసుకుపోయి నువ్విలా మాట్లాడటానికి సిగ్గు లేదా అన్నాడు.

ఇంక కృష్ణుడు సహించలేక, చక్రాన్ని ప్రయోగిస్తే అది శిశుపాలుని తల తరిగితే, వానిలోనుంచి ఒక జ్యోతి వచ్చి కృష్ణుని చేరుతుంది, అందరూ ఆశ్చర్యపడగా.

కృష్ణునికి శిశుపాలుడొక మేనత్త కొడుకైతే, పాండవులు మరొక మేనత్త కొడుకులు. అర్హుడయిన కృష్ణుని పూజిస్తే, అసూయతో శిశుపాలుడు గొడవ చేసేడు, ఫలితం అనుభవించడు కూడా. అర్హులయిన వారిని పొగిడినపుడు, పూజించినపుడు తప్పు పడితే ఇలాగే జరుగుతుంది, సినిమా వారు దీన్నెలా తీశారో మరి.

టపాలు పెద్దవి రాయకూడదని నిర్ణయం తీసుకున్నా, ఐనా ఇది పెద్దదయిపోయింది. అందుకు మిగతా రేపు మీరు పొగిడినా తెగిడినా సరే! 🙂

శర్మ కాలక్షేపంకబుర్లు-మెచ్చుకోలు.

Posted on అక్టోబర్ 30, 2012
6
మెచ్చుకోలు

( నిన్నటి టపా తరవాయి )

ఈ సందర్భంగా ఒక కధ గుర్తుకొచ్చింది అవధరించండి. ఒక రాజ్యంలో ఒక ఊరు, ఆ వూళ్ళో ఒక యువకుడు కవనం బాగా చెబుతాడని పేరుపొందాడు. ప్రజలు అందరూ ఈయన మంచి కవి అని మెచ్చుకుంటున్నారు. ఆ యువకుడు ఆనందపడుతున్నాడు, ఉత్సాహంతో మంచి కవితలూ చెబుతున్నాడు, కాని ఒక చిన్న వెలితి ఉన్నట్లు బాధపడుతున్నాడు. ఇంటికి వచ్చి తల్లితో “అమ్మా! నేను మంచి కవిత్వం చెబుతున్నానని అందరూ మెచ్చుకుంటున్నారు, కాని నాన్న గారేమిటే, ఎప్పుడూ మెచ్చుకోలేదని” వాపోయాడు. పాపం పిచ్చి తల్లికేమితెలుసూ “ఏమో నాయనా! ఆయన తత్వమే అంతనుకుంటా” అంది. కాలం గడుస్తోంది తండ్రి అలాగే ఉన్నాడు, మార్పులేదు, ప్రజలు మాత్రం ఈ యువకుడిని గొప్ప కవిగా గుర్తించేసేరు. ఇదేగాక ఈ తండ్రిగారు ఎవరేనా బయటివారు “మీ అబ్బాయి మంచి కవిత్వం చెబుతున్నాడంటే” వాడి “మొహం వాడికేమి వచ్చని” చులకన చేస్తున్నట్లుకూడా ఈ యువకునికి తెలిసి ఎక్కువ బాధ పడుతుండేవాడు. ఒక రోజు ఈ విషయం తల్లికి చెప్పి వాపోయాడు. తండ్రికి అన్నం పెట్టి పక్కన కూచున్న తల్లి, నెమ్మదిగా కొడుకు విషయం కదిపి, భర్తను అడిగింది ” ఊరువారంతా గొప్పకవి అని మన వాడిని స్తుతిస్తూ ఉంటే మీరు పలకటం లేదు సరికదా, వాడికేమి వచ్చు అని చులకన చేసినట్లు మాట్లాడుతున్నారట, ఇదేమీ” అని అడిగింది. దానికి తండ్రి “ఓసి! పిచ్చిదానా నా కొడుకు గొప్పగా కవిత్వం చెబుతున్నాడనీ, గొప్ప పేరు తెచ్చుకున్నాడని, ముందు ముందు ఇంకా గొప్ప కవిత్వం చెప్పగలడనీ, ప్రజలు పొగుడుతున్నది చూసి, అందరూ మెచ్చుకోవడం చూసి నేనెంత మురిసిపోతున్నానో, నా మనసెంత ఆనందం పొందుతోందో తెలుసా” అన్నాడు. ఈ మాటలు విన్నవారు ఇద్దరూ, ఆశ్చర్యపోవడం వారి వంతయింది. ఒకరు కవి తల్లి, రెండవ వారు అటక మీద బండరాయి పుచ్చుకుని కూచుని తండ్రి చెప్పే జవాబుకు, అంటే తనకేమీ చేతకాదని తండ్రి తల్లితో చెప్పబోయేది విని, తండ్రి తలపై బండరాతితో మోది చంపాలనే ఉద్దేశంతో ఉన్న యువకుడు. తల్లి, “మరయితే మీరు ఎప్పుడూ కొడుకుని మెచ్చుకోలేదేమని” అడిగింది. దానికా తండ్రి “పిచ్చిదానా! నా కొడుకును నేను మెచ్చుకుంటే ఆయుక్షీణం, అందుకు ఎక్కడా మెచ్చుకోను, మన అబ్బాయి, ఆయువు క్షీణిస్తే నేను బాధ పడనా? మన అబ్బాయి చాల గొప్ప కవి, వాడు చెప్పే కవితలు చాలా బాగుంటాయి. ముందు ముందు ఇంకా చాలా పేరు ప్రఖ్యాతులున్నవాడవుతాడ”ని చెబుతాడు. ఇది విన్న కొడుకు బండ రాతితో కిందికి దిగివచ్చి, తండ్రి పాదాలకి నమస్కారం చేసి, తాను చేయబోయిన తప్పు చెప్పుకుని, దీనికి శిక్ష విధించమని అడుగుతాడు. దానికి ఆ తండ్రి నీవు “నీ భార్యను తీసుకుని, నీ అత్తవారింటికి వెళ్ళి ఆరు నెలలు ఉండి, రమ్మని” చెబుతాడు. కొడుకు మారు మాటాడకుండా తండ్రి అజ్ఞ పాలిస్తాడు.

తల్లి అడుగుతుంది,”అదేమీ, కొడుకు, చేసిన తప్పుకు శిక్ష విధించమని అడిగితే, అత్తవారింటి దగ్గర ఆరునెల్లలుండి రమ్మన్నారు, అత్తవారింటి దగ్గర ఆరు నెలలుండటం శిక్ష ఎలా అవుతుందని” అడిగింది. దానికి తండ్రి సమాధానం చెప్పలేదు. ఆరు నెలల తరవాత కొడుకు తిరిగివచ్చిన తరవాత తల్లి అడుగుతుంది “నాయనా! ఈ ఆరు నెలలు అత్తవారింటి దగ్గర బాగా జరిగింది కదా” అని దానికి అతను ఇలా చెప్పేడు.

“మొదటిరోజు అందరూ చాలా అగ్గగ్గలాడుతూ పలకరించేరు,అన్నీ సమకూర్చారు, మాకు ప్రత్యేకంగా గది ఏర్పాటు చేశారు. మరుసటి రోజు నాభార్యకి వదిలేశారు, అన్ని ఏర్పాట్లు చూడటానికి. మూడవరోజు దాటిన దగ్గరనుంచి నన్ను సామాన్యంగానే చూశారు. భోజనానికి ప్రత్యేక ఆహ్వానం లేదు. మొదటి వారం నడిచి పోయింది అటూ, ఇటూగా, మరుసటి వారం నుంచి మొదలయ్యాయి, నా తిప్పలు. పాలేరు ఆరోజు రాలేదు, పాలు తీయలేదు, అత్తగారు పాలు తీయడానికి వెళితే ఆవు తన్నింది, బావమరుదలు, మామగారు ఇంటిలో లేరు, నేను పాలు తీయాల్సి వచ్చింది,ఇలా ఒక్కొకటే పనులు అనుకోకుండానూ, కొన్ని భార్య పురమాయించడం, కొన్ని అత్తగారు పురమాయించడం, కొన్ని బావ మరదులు పురమాయించడంతో, పనులు చేయించడం మొదలెట్టేరు. భార్య “ఊరికే ఖాళీగా కూచుని ఏమి చేస్తారు చేలో పని జరుగుతోందిట, నాన్న పని మీద వెళ్ళేరు, అన్నయ్య మరొక పొలం వెళ్ళేడు, తమ్ముడు చదువుకుంటున్నాడు, మీరు పొలం వెళ్ళి రండి” అని పురమాయింపుతో ప్రారంభమయిన పాలేరు జీవితం ఆతరవాత నిజంగానే పాలేరు మానెయ్యడంతో ఆ పనులు నాకు నిశ్చయమయిపోయాయి, మామగారు, “పాలేరు మానేసేడు, కొద్దిగా ఉదయం సాయంత్రం దూడను విడిచిపెట్టి, వాటి ఆలనా పాలనా చూడు నాయనా!” చెప్పడంతో. ఇలాగ మర్యాద అడుగంటింది, మన్నన మొదలే పోయింది. నిజానికి నేను అత్తవారింటిలో సుఖం అనుభవించలేదు,నా భార్యతో ఒంటరిగా మాటాడుకునే సావకాశం కూడా లేకపోయింది. అందరూ పని చెప్పేవారే, అవమానమే ఎదుర్కున్నాను,” అని చెప్పేడు. అంతా విన్న తండ్రి “నాయనా! కొడుకు ఎంతటి గొప్ప వాడయినా, చేత కానివాడయినా తల్లి తండ్రులు భరిస్తారు. అందుచేత తల్లి తండ్రులు బిడ్డల పట్ల చేసే ప్రతి పనిలోనూ ఏదో పరమార్ధం ఇమిడి ఉంటుందన్నది మరిచిపోవద్దని” చెబుతాడు. ఆతరవాత ఆయువకుడే భారవి మహాకవి అవుతాడు.

పొగడ్త వల్ల కలిగేది ఆనందం, ఇదీ మనసు చేసే చిత్రమే, ఆ అనుభవం కాలమెంత? క్షణం. ఆ క్షణకాల అనుభవానికి మనసు తహతహలాడుతుంది, చూశారా! ఒక మెచ్చుకోలు మాట చెప్పలేదని అంతటి మహాకవి, విచక్షణ కోల్పోయాడు, తండ్రిని హత్యచేయబోయాడు !! అంటే దీని మత్తు ప్రభావం ఎంతో!!! తస్మాత్……..

స్వస్తి

తాడిగడప శ్యామలరావు on 03:49 వద్ద అక్టోబర్ 30, 2012 said:
శర్మగారూ, మీరు వ్రాసినది భారవి మహాకవి గురించి. ఈ‌యన కిరాతార్జునీయం వ్రాసారు. భారవి మామగారు అన్నంభట్టు. భారవిని అత్తవారింట్లో ఒక సంవత్సరం‌ఉండి రమ్మని విధించారు తండ్రిగారు – ఆరు నెలలు కాదు. ఆ సంవత్సరంలో వచ్చిన వరలక్ష్మీవ్రతం నోచుకుందుకు గాను భార్యకు సొమ్ము సమకూర్చటం కోసం భారవి తాను వ్రాస్తున్న కిరాతార్జునీయంలోని ప్రథమశ్లోకాన్ని ఆ ఊళ్ళోని ఒక వ్యాపారికి తాకట్టు పెడతాడు. అనంతరం ఆ వ్యాపారికి ఆ శ్లోకం కుటుంబాన్ని,జీవితాన్ని నిలబెట్టిందని ఐతిహ్యం. ఆ శ్లోకం:
సాహసా విదథీత నక్రియాః
అవివేకః పరమాపదాపదం
వృణుతేహి విమృశ్యకారిణం
గుణలబ్ధాః స్వయమేవ సంపదాః

దీని భావం యేమిటంటే, కేవలం సాహసించి యే పనయినా చేయరాదు. అవివేకం వలన అతిప్రమాదకరమైన ఆపదలు కలుగుతాయి. బాగా మంచీ చేడు విచారించి పనిచేయటం ఉత్తమం. అటువంటి గుణవంతులను సంపదలు స్వయంగా వచ్చి చేరుతాయి.

నా చిన్నతనంలో, యేడవతరగతిలో ఉండగా అనుకుంటాను, ఒక పోటీలో ‘ఆదర్శకథావళి’ అన్న మంచి పుస్తకం బహుమతిగా వచ్చింది. దానిలో చదివాను భారవి కథ. ఆ పుస్తకంలో ఇంకా‌ భీష్ముడు, ధృవుడు, ప్రహ్లాదుడు వంటికథలు చాలా ఉన్నాయి.

మంచి కథను చెప్పారు. ధన్యవాదాలు.

శర్మ కాలక్షేపంకబుర్లు-నేటి పొగడ్తలు.

Posted on అక్టోబర్ 29, 2012
6
నేటి పొగడ్తలు

పొగడ్త ఒక అగడ్త లాటిది. “అగడ్తలో పడ్డ పిల్లికి అదే ప్రపంచం” సామెత. పొగడ్తల జడి వానలో తడిసేవారికి ఎప్పుడూ జలుబు చేయదు సరికదా ఆ జడివాన నుంచి బయటకొస్తే మాత్రం జలుబే కాదు జ్వరం కూడా వస్తుంది :). పూర్వకాలం, రాజులు మహరాజుల కొలువులో వందిమాగధులని, పొగడ్తలకి ప్రత్యేకంగా ఒక వ్యవస్థ ఉండేది, వీరు ఆ రాజు వంశం, చరిత్ర అన్నీ తెలిసిన వారయి ఉండేవారు. ఉదయమే మేలుకొలుపు, మెచ్చుకోలుతో చేసేవారు . రాజు నిరంకుశుడు, నీ తండ్రి ఇన్ని గొప్ప పనులు చేసేడు, నీ తాత, ముత్తాత ఇంత గొప్పవారు, నువ్వు ఇన్ని గొప్ప పనులు చేసేవు, ఇంత గొప్పవాడివి అని పొగిడేవారు, ఇది రాజ్య వ్యవస్థలో భాగంగా ఉండేది. తరవాతి కాలంలో భట్రాజులని, ఒక తెగవారు ఈ కార్యం నెరవేర్చేవారు. దానితో తప్పు చేయకూడదనే భావం ఏర్పడి, ప్రతి క్షణం మంచివాడనే పేరు నిలబెట్టుకోడానికే ప్రయత్నం చేసేవాడు. నేటి వ్యవస్థలో పార్టీపత్రికలు ఆ పని నిర్వహిస్తున్నట్లున్నాయి, డబ్బు తీసుకుని ప్రకటనల రూపంలో, వార్తల రూపంలో. ఈ ప్రకటనల రూపకర్తలు, శిల్పులు వేరుగా ఉంటారు. “అతి చేస్తే గతి చెడుతుంద”న్న సామెతలాగా ఒక్కొకప్పుడు ఈ పొగడ్తలు అతి అయి ఉన్న గోడు చెడిపోతుంది, “భారత్ వెలిగిపోతోంద”న్న దానిలా. ప్రభుత్వాలు కూడా ఈ పొగడ్తలు తమకు తామే చేసుకుంటున్నాయి, ప్రకటనల రూపంలో. పార్టీల వారికి కీర్తికండూతి, ధన కండూతి మెండుగా ఉంటుంది, ఎప్పుడూ ఎన్నికల మీదే దృష్టి ఉంటుంది.

ఈ పొగడ్తలలో రకాలున్నాయన్నారు, పాత కాలం వారు. వీటిని మూడు రకాలుగా కూడా విభజించేరు. అవి చెప్పడం కొద్దిగా అశ్లీలం అనిపించి తర్జుమా చెబుతున్నా. 1. స్వ.కు.మ. తనను తానుపొగుడుకోవడం 2.ప.కు.మ ఎదుటివారిని పొగడటం లేదా పొగిడించుకోవడం. 3.పరస్పర.కు.మ వీరు వారిని గొప్పవారని పొగిడితే, వారు వీరిని గొప్పవారని పొగుడుతారనమాట. మరొకటి ఉంది నిందాస్తుతి అని, ఇది తిడుతున్నట్టు ఉంటుంది, కాని నిజంగా, పక్కాగా పొగటటం, ఇది కవులసొత్తు. నేటి కాలానికి మా మిత్రుడు సిరివెన్నెల్ల, ఇందులో ఘనాపాటీ. “తనను తాను పొగుడుకుంటే తన్నుకున్నట్లుంటుందని” సామెత. పొగిడేవారు లేనపుడు తనను తానుపొగుడుకోక తప్పని పరిస్థితి కదా, అందుకే రెండవ, మూడవ రకాన్ని ఆశ్రయిస్తారు. ఈ పొగడ్తల బాధంతా చదువుకున్న వారు, గొప్పవారికే. సామన్యుడిని ఎవరేనా పొగిడేరంటే ముందు భయపడతారు, ఎందుకంటే, ఏగోతిలో తోసేయడానికి ఇది ప్రాతి పదికోనని. ఐదు సంవత్సరాలకొక సారి సామాన్యుడు గుర్తొస్తాడు, పార్టీల వారికి. అప్పుడు నువ్వు ఇంద్రుడివి, చంద్రుడివి అని పొగుడుతారు. నిజంగా ప్రజాస్వామ్యం నీవల్లే బతుకుతోందంటారు, అప్పటిదాకా కనపడని వారు, వేడుకున్నా దర్శనమివ్వని వారు తన గుమ్మంలో కొచ్చేటప్పటికి పొంగిపోతాడు, పిచ్చివాడు, మోసపోతాడు. కాని పూరేడు పిట్టలా, ప్రతిసారి ఉండేలు దెబ్బ తింటున్నా, పక్కకి తప్పుకుంటాడు తప్పించి,కొత్తవారిని చూసుకోడు.. మళ్ళీ మళ్ళీ వారినే ఎన్నుకుంటూ ఉంటాడు, దెబ్బలు తింటూ ఉంటాడు . పాపం చదువుకున్న వారిది మరొక తరహా, వీరికి కీర్తి కండూతి ఎక్కువ, ధన కండూతి లేదనికాదు. తమని గొప్పవారిగా గుర్తించాలని తెగ బాధపడిపోతారు. ఒక గుంపును తయారు చేసుకుంటారు. ఈ గుంపూ ఊరికే చేరదు, దగ్గరికి, వారికీ అటువంటిదేదో కావాలి, లేదా సొమ్ము సంపాదించుకునే మార్గం కావాలి. ఇది నిజంగా మూడవకోవకు చెందినదే, అటువంటి ఉపకారమేదీ లేనిరోజున వీరు తుపాకీ దెబ్బకి కూడా కనపడరు.. ఐతే చూడటానికి అలా కనపడదు. ఒక్కొకప్పుడు ఈ పొగడ్తలు చూస్తే వెగటు కలుగుతుంది కూడా. ముక్కు కోస్తే రక్తం తాగేవారిలా ఉంటాయి, ఇవి. పేర్లొద్దు కాని ఒక రాజకీయ పార్టీ కార్యకర్తలు, వారికి జీతాలిచ్చేవారులెండి, పార్టీ తరఫున, వారు ముక్కుకోస్తే రక్తం తాగేవారిలా ఆ పార్టీని పొగిడేవారు, పాపం కనుమరుగైపోయారనుకోండి. నిజమైన విషయం ఉన్నపుడు, విషయాన్ని పొగడటం, చెప్పిన వారి కౌశల్యాని కొద్దిగా హెచ్చించడం తప్పుకాదు కాని, వారు చెప్పిన ప్రతి విషయం గొప్పగా ఉందని పొగడటం అందంగా ఉండదేమో! అదే వెగటును కలిగిస్తుంది, దీనినే నేడు భట్రాజు పొగడ్త అంటున్నాం. దాని మూలంగా వారి అసలైన స్వరూపం మరుగున పడే అవకాశం ఉందికదా! అదివారికి కీడు చేస్తుంది తప్పించి మేలు చేయదు. పొగడ్త ఒక ఔషధం లాటిది, తగుపరిమాణంలో ఉన్నపుడు మంచి పని చేస్తుంది. ఇది పెరిగితే వారిలో ఆత్మ విశ్వాసం బదులు అతివిశ్వాసం బయలుదేరి తలపొగరు వచ్చే సావకాశం ఉందికదా

శర్మ కాలక్షేపంకబుర్లు-దీపావళి యుద్ధం

Posted on నవంబర్ 13, 2012
దీపావళి శుభకామనలు.

దీపావళి యుద్ధం

కావలసిన వారు మెయిలిస్తూ దీపావళి హడావుడిలో ఉన్నా అన్నారు, నేటి రోజుల్లో దీపావళికి హడవుడి ఏమా? అని ఆలోచిస్తూ జ్ఞాపకాల్లోకి జారిపోతే ఏబదిఏళ్ళనాటి పల్లెలో దీపావళి యుద్ధం గుర్తుకొచ్చింది. అదేమిటంటే

ఆ రోజులలో దీపావళి అంటే మాకు రెండు నెలల ముందు మొదలయ్యే పండగ. ఇప్పటిలాగా అ వేళ ఉదయం కొనితెచ్చుకుని, రాత్రి కాల్చేసి పడుకోడం కాదు. ఊళ్ళో పెద్దవాళ్ళయిన యువకులు రెండు నెలల ముందు బొగ్గు కోసం జిల్లేడు మొక్కలు కొట్టించటం తో ప్రారంభమయ్యేది, దీపావళి . ఆ తరవాత మందు గుండు సామగ్రి తయారు చేయటానికి కావలసిన సూరేకారం, గంధకం, బీడు, ఆముదం, పటాసు కొని తెచ్చుకోడం. ఈ చివర చెప్పిన పటాసు ఇప్పుడు దొరకడం కష్టమే. పటాసు జాగ్రత్తగ నూరించేవారు, లేకపోతే పేలి అంటుకునేది. సూరేకారం వంట చేసేవారు, అంటే నీళ్ళు ఎసరుపెట్టి అందులో పోసి ఉడికించి, నీరు ఇగిరిపోయిన తర్వాత ఆరబోసి ఎండబెట్టేవారు. గంధకం కడ్డీలలా దొరికేది, తరవాత బూందీ పూసలలా వచ్చేది. కడ్డీలలా ఉన్నపుడు కష్టం ఎక్కువుండేది. చివరిగా బొగ్గు కోసం కొట్టించిన జిల్లేడు కంప ఎండిన తరవాత కాల్చి బొగ్గు చేసి నూరుకోవాల్సివచ్చేది. వీటన్నిటిని, చాలా మెత్తగా ఉండటం కోసం వస్త్రకాళితం చేయాల్సి వచ్చేది. ఆ తరవాత తయారు చేయవలసిన వాటిని నిర్ణయించుకోవడం. జువ్వ, చిచ్చుబుడ్లు, తాటాకు టపాకాయలు,మతాబులు,సిసింద్రీలు, ఇలా, ఇవి కాక కొన్ని కొనేవి ఉండేవి, అవి విమానాల లాటివి. మతాబా గుల్లలు, తాటాకులు తయారు చేయడం,టపాకాయలకోసం, పేకతో జువ్వ గుల్లలు, వెదురుబద్దలు తయారు చేయడం, జువ్వ తూకం చూడటం, ఒక ఎత్తు, ఇవన్నీ వీటిని కూరడం ఒకెత్తు. నమూనా చూడటం, బాగోకపోతే పాళ్ళు కొద్దిగా మార్చటం, ఇదంతా రహస్యంగా జరగాలి. రెండు వర్గాలుండేవి. ఇద్దరు నాయకులు, వీరికి సహాయకులు, సామాను, ఆహారపదార్ధాలు పట్టుకుని యుద్ధ రంగంలోకి వెళ్ళేవాళ్ళు, ఆయుధాలు ప్రయోగించే సైనికులు, ఇదో పెద్ద పటాలం. ఈ పటాలానికి గూఢచార వ్యవస్థ. ఎదుటివారు ఎంత మందుగుండు కొన్నారు, ఏమేమి తయారు చేస్తున్నారు, ఎవరెవరు అటువైపు ఉన్నారు వగైరా వివరాలు సేకరణ, అవతలి వారు అనుసరించబోయే వ్యూహాలు, ఇవన్నీసేకరించుకొచ్చేవారు, కొందరు. ఇలా ఈ సంవిధానం రెండు నెలలు నడిచి దీపావళి రోజు వచ్చేది.

చిన్న వాళ్ళు ఉప్పుపొట్లాలని కట్టుకునేవాళ్ళు. ఇదీ పెద్దపనే, గుడ్డని పేడనీళ్ళలో ముంచి, బాగా పట్టిన తరవాత ఆరబెట్టేవాళ్ళం. అందులో సూరేకారం, గంధకం, బొగ్గుపొడి,కొద్దిగా బాగా ఎండిన ఉప్పు, పాళ్ళలో కలిపి దానిని గుడ్డమీద పోసి, రెండంచులూ మడిచి సమానంగా పొట్లంలాగా కొద్ది లావు పొడుగులతో తయారు చేసుకుని, దానిని పురికొసతో గట్టిగ కట్టి ఎండలో బాగా ఆరపెట్టి, ఈపొట్లాన్ని, చిన్న లేత తాటిఆకులను కోసి, మట్టలను వేరుచేసి, మట్టల చివర గుంతలు చేసుకుని, మూడు కాని నాలుగు కాని మట్టలు దగ్గరగా చేర్చి గట్టిగా కట్టుకుని వాటి మధ్యలో ఈ పొట్లం పెట్టి అపైన మట్టల పై భాగాల్ని కూడా దగ్గరకు చేర్చి గట్టిగా కట్టుకుని, ఈ సరంజామాకి ఒక పొడుగాటి నారతాడు కట్టి సిద్ధం చేసుకుని, దీపావళిరోజు సాయంత్రం భోజనం ముందు దానిపై కొద్దిగా నిప్పు వేసి భోజనమైన తరవాత మిగిలివారితో మందు కాల్చి, అప్పుడు, ఈ ఉప్పుపొట్లం పుచ్చుకుని గోదావరి లంకలో కాని ఇసుక తిప్పలో కాని తిప్పడం మొదలెడితే చుట్టూ విష్ణు చక్రంలా ఉండేది, రవ్వలతో, చిటపటలతో, తిప్పడం చేతకాకపోతే, ఆపుకోవడం చేతకాకపోతే, ఒంటికి తగిలి ఒళ్ళు కాలిన సందర్భాలుండేవి.

ఊళ్ళోవాళ్ళంతా మందుకాల్చుకోడం అయి లోపలికి వెళ్ళిన తరవాత సమరం మొదలయ్యేది, రెండు జట్లనాయకులు వారి శిబిరాలనుంచి మధ్యకువచ్చి చేతులుకలిపి, ఒక జువ్వను ఒకరు అంటిస్తే ఒకరు ఆకాశంలోకి వేసి విడిపోయేవారు. అంతతో యుద్ధం మొదలు. శిబిరాల దగ్గర కాపలా, వెనకనుంచి దాడికి సావకాశం లేకుండా మందుగుండు సామాగ్రితో కాపలా, ముందునుంచి జువ్వలు, విమానాలు, చిచ్చు బుడ్లు, టపాకాయలు, సిసింద్రీలు వేసుకుంటూ, ప్రత్యర్ధి శిబిరం మీద వేస్తూ, ముందుకు వెళ్ళి ప్రత్యర్ధి శిబిరాన్ని స్వాధీనం చేసుకోవాలి. అందులో మొండి జువ్వలని వేసేవారు, తోక విరిచిన జువ్వ తిన్నగా కాక దానిష్టమయిన దారిలో వెళ్ళి ఎదుటివారిని కల్లోల పరిచేది. చిచ్చుబుడ్లు వెలిగించి రెండు చేతులతో రెండూ పట్టుకుని ముందుకు చొచ్చుకుపోయేవారు. వారిని ఆపడానికి ఎదుటివారు, జువ్వలు, విమానాలు,టపాకాయలు వేసేవారు. విమానం శబ్దం చేస్తూ వచ్చి తగిలితే కాలేది,దెబ్బకూడా తగిలేది. ఇదీ యుద్ధం. చాలా హోరాహోరీగా యుద్ధం జరిగేది, నేలబారున జువ్వలు, విమానాలు దూసుకొచ్చేవి. నిలబడటమే కష్టంగా ఉండేది. రక్షణ ఎర్పాట్లు చూసుకుంటూ దాడి చెయ్యాలి. ఇలా సమరం జరుగుతున్నపుడు, ఎవరికేనా, ఏపక్కవారికేనా తీవ్రంగా కాలడం, దెబ్బలు తగలడం జరిగితే, ఏ ఇంటికేనా అగ్ని ప్రమాదం జరిగితే, సమరం ఆపేవారు. సాధారణంగా ఇటువంటి పరిస్థితి ఉండేది కాదు. అప్పుడందరూ కలసి ఆపదను ఎదుర్కొనేవారు. నిప్పు ఆర్పేవారు. ఒక్కొక్కపుడు జయాపజయాలు తేలేవి కావు. మరునాడు కూడా యుద్ధం కొన సాగేది. యుద్ధానికి, సంధికి, లొంగిపోవడానికి, వెనక్కు తగ్గడానికి నియమాలుండేవి. ఒక్కొకపుడు, ఒకరి మందుగుండు సరిగా కాలక సంధికి వచ్చేవారు. అటువంటి సమయంలో సంధి కోరుకునే నాయకుని సిపాయి, మూడు జువ్వలు తీసుకుని రంగం మధ్యకు వచ్చి మూడిటినీ సమయంలో ఎడం లేకుండా ఆకాశం లోకి కాలిస్తే, అదిసంధి సూచన. ఇవతలివారు, కాల్పులు ఆపేవారు. ఒక సైనికుడు వెళ్ళి జువ్వలేసిన వ్యక్తిని నాయకుని దగ్గర ప్రవేశపెడితే, వచ్చిన రాయబారి విషయం చెబితే, సంధి షరతులు చెప్పి పంపేవారు. వాటిని ఒప్పుకుంటే మరల రాయబారి వచ్చి చెప్పేవాడు. సంధి షరతులు అమలు పరచబడేవి.లేకపోతే యుద్ధం కొన సాగి లొంగదీసుకునేవారు. ఒక్కొకపుడు మందుగుండు అయిపోతే, తెచ్చుకోడానికి సమయం కోసం కూడా ఇటువంటి ఎత్తులు పన్నేవారు. నిజానికి నేటి యుద్ధంలో జరిగే ప్రతి చర్య అక్కడ అమలు పరచబడేది. ఇల్లా యుద్ధ విద్య, దౌత్య కార్యం నేర్చుకునేవారనుకుంటా. అది నెమ్మది నెమ్మదిగా అడుగంటిపోయింది. ఇప్పుడు నిప్పు అంటే భయం అంటున్నారు, మరి మా చిన్నప్పుడు దానితోనే ఆడుకున్నాం 🙂

శర్మ కాలక్షేపంకబుర్లు- రక్షక భటుడు ( పోలీస్ )

Posted on అక్టోబర్ 22, 2012
6
రక్షకభటుడు.( పోలీస్ )

నిన్న పోలీస్ అమరుల సంస్మరణ దినం జరిగింది. కాని ప్రజలంతగా స్పందించిన దాఖలా కనపడలేదు. కారణమేమయి ఉంటుందని అలోచిస్తే.

స్వాతంత్రం రాక ముందు ఈ వ్యవస్థ నాటి పాలకుల కొమ్ము కాయడానికి ఉపయోగపడిన మాట వాస్తవమే. కాని స్వతంత్రం వచ్చిన తరవాత కూడా ఈ వ్యవస్థ లో పెద్దగా మార్పులొచ్చినట్లు లేదు. ఈ రోజునాటికీ పోలీస్ ను చూస్తే అందరికి ఒక రకమైన, భయం, జుగుప్స,వ్యతిరేకత కనపడుతుంది, సామాన్య ప్రజలో. పోలీస్ స్టేషన్ కి వెళ్ళడానికే ఇష్ట పడని వారెందరో, వారికి నష్టం కలిగినా, నేటికీ. దీనికి కారణం ఆ వ్యవస్థ లో వేళ్ళూనుకుపోయిన లంచగొండితనం,రాజకీయ నాయకులకు తొత్తులుగా వ్యవహరించడం, పారదర్శకత లోపించడం, మర్యాదాలోపం, ఫిర్యాదు దారుని నీచంగా చూసి దొంగని అందలాలెక్కించడం, వగైరా వగైరా చాలా కారణాలున్నాయి. వీరు సమాజానికి దూరమయిపోతున్న మాట వాస్తవం. సమాజం లో ఉన్న దుర్గుణాలన్నీ పోలీస్ వ్యవస్థలో రాశీభూతమయి ఉన్నాయంటే అతిశయోక్తి కాదు.. రాజకీయ వ్యవస్థ కి అందునా పరిపాలన చేస్తున్న పార్టీ వారికి ఈ డిపార్టుమెంట్ ఒక అత్యవసర అవసరం గాను,కుడి చెయ్యిగానూ పని చేస్తోందంటే వింత కాదు.ఈ రోజుకు కూడా ఏదయినా నష్టం జరిగినపుడు పోలీస్ స్టేషన్ కు వెళ్ళి ఫిర్యాదిస్తే నమోదు చేసే నాధుడులేడు. ఆ ప్రాంతపు ఎమ్.ఎల్.ఎ లేదా మరొక రాజకీయ నాయకుడు చెప్పినపుడు మాత్రమే ఈ ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేస్తున్నారంటే రాజకీయ వ్యవస్థ పోలీస్ పై ఎంత అజమాయిషీ చేస్తున్నది తెలుస్తుంది. ఫిర్యాదిస్తే నమోదు చేస్తామని చెబుతారు, కాని చెయ్యరు. మరో చిత్రం స్టేషన్లో కావలసిన తెల్లకాగితాలు వగైరా ఖర్చులకు బడ్జట్ ఉండకపోవడంతో ఫిర్యాదీ దారులపై ఈ భారం మోపుతున్నారు. ప్రజలతో ముఖా ముఖి సంబంధాలున్నవి మూడు నాలుగు రేంకులకంటే ఉండవు. వీరిలో ముఖ్యులు కానిస్టేబుళ్ళు. నిన్నటి, నేటిదాకా కూడ వీరిలో అత్యధికులు నిరక్షరాస్యులు, లేదా కొద్దిగా చదువుకున్నవారు. వీరికి చట్టం మీద అవగాహన తక్కువే, కాదు లేదు. ఇప్పటీకీ పదవ తరగతి చదువుకున్న వారిని కానిస్టేబుల్ గా తీసుకుంటున్నారు,వీరి రిక్రూట్మెంట్లో కూడా రాజకీయం చేరుకుందంటే, వీరికి చట్టం మీద, చట్టం లో చెప్పిన అధికారాల మీద అవగాహన తక్కువే. మనం కనక ఇచ్చే ఫిర్యాదులో చట్టం గురించి కనక చెబితే వారికి కోపం కూడా వస్తుంది. ఇటువంటి ఒక సంఘటన నాకొకప్పుడు తారసపడింది. స్టేషన్ కి పదిమంది నుంచి కానిస్టేబుళ్ళుంటారు. ఒకరు నిత్యం కోర్టు పని మీద తిరుగుతుంటారు, ఇతనే రైటర్. ఆ స్టేషన్ లో కొద్దిగా చట్టం గురించి ఎరుక ఉన్నవాడయి ఉంటాడు.ఎస్.ఐ తో సహా మిగిలిన వారికి చట్టం గురించి తెలిసినది తక్కువే, కేసులు నీరుగారిపోవడానికి కారణం, చట్టం పై అవగాహనా లోపమే.. శాంతి భద్రతలనుంచి చాల విషయాలలో పోలీస్ వ్యవస్థ జోక్యం చేసుకోవాల్సి ఉంటుంది. దుర్లక్షణాలు పెరిగి జోక్యం చేసుకోకూడని చోట్ల జోక్యం చేసుకోడం ఎక్కువగా జరుగుతోంది, స్పందించవలసిన చోట మానెయ్యడం జరుగుతోంది . దీని మూలంగా పారదర్శకత లోపంతో అవినీతి పెరిగిపోయింది. నిజానికొస్తే కానిస్టేబుల్ ఈ వ్యవస్థలో ముఖ్యుడు, కాని ఇతని రక్షణ, ఉద్యోగ సమయాలు, ఆరోగ్యం మొదలయిన విషయాల మీద సరయిన చర్యలు తీసుకోకపోవడం మూలంగా ఒక రకమైన నిర్లిప్తత నెలకొని ఉంది. ఏ విషయం లో నైనా బలైపోయేవారు కానిస్టేబుళ్ళే అయిపోతున్నారు. కొంతమంది ఆఫీసర్లు కూడా రాజకీయ వత్తిడులకు లొంగి పని చేయని వారిని సుదూర ప్రాంతాలకు బదిలీ చెయ్యడం దగ్గరనుంచి ప్రాణ హాని కలగ చేసే శక్తులకు వారిని వదలివేసిన సంఘటనలు కూడా ఉన్నాయి.

ఎక్కువగా ఈ వ్యవస్థ రాజకీయనాయకులకు రక్షణ కల్పించేందుకు, మంత్రులు మొదలయిన వారి రక్షణకు ఇతర సంగతులు, రాస్తారోకోలు, రాజకీయ ఆందోళనలకే పరిమితమయిపోతూ ఉంది. కొంత మంది రహదారి వ్యవస్థను వాహనాల రాకపోకలని నియంత్రించే పనిలో ఉండిపోతున్నారు. అసలు పనికి, పరిశోధనకి సమయమే సరిపోటం లేదంటే అతిశయోక్తి కాదు. అసాంఘిక శక్తులు కొత్తరకం వాహనాలమీద తిరుగుతూ నేరాలు చేస్తూ ఉంటే, వీరు కాలం చెల్లిన జీపుల్లో, పరిమితి కలిగిన పెట్రోల్ వాడకంతో, తిరిగి ఎంత కాలానికి వారిని పట్టుకోగలరు. ప్రతి స్టేషన్లులోనూ ఉండవలసిన స్థాయిలో సిబ్బంది లేకపోవడం మూలంగా ఉన్న వారిపై పని భారం పెరిగి అవ్యవస్తకి కూడా కారణమవుతూంది. నిజానికి ఒక కానిస్టేబుల్ ఉదయమే స్టేషన్ కు వస్తే మళ్ళీ ఇంటికెపుడెళతాడో తెలియదు. వేళా పాళా లేని పని, తిండి తిప్పలు చూసే నాధుడు ఉండడు. ఆర్డర్ లు ఇచ్చేవారే తప్పించి కష్టం గురించి పట్టించుకున్న నాధుడు లేడు, పని గంటలు లేవు.. ఆర్డర్లీ వ్యవస్థ దుర్వినియోగమైనంతగా మరే వ్యవస్థా దుర్వినియోగం కాలేదేమో. నేను పని చేసిన టెలికం లో కూడా ఆర్డర్లీ వ్యవస్థ ఉండేది.తరవాతి కాలంలో దీనిని రద్దు చేసేరు. ఇప్పటికీ పోలీస్ లో ఇది ఉన్నట్లుగానే ఉంది. చాలా కమిషన్లు వేసేరు, ఈ వ్యవస్థను మెరుగు పరచడానికి, కాని ఏ కమిషన్ వారు చెప్పినదీ అమలు చేయలేదు. రాజకీయ శక్తుల చేతులనుంచి వీరికి ముక్తి కలిగించినపుడే, ఈ వ్యవస్థ ప్రత్యేకంగా నిష్పక్షపాతంగా పని చేయగలదు. అందుకు పాలక వర్గాలు సిద్ధంగా లేవని ప్రతి సారి డి.జి.పి నియామకం లో జరుగుతున్న సంగతి తెలియ చేస్తూనే ఉంది.ఇంకా చాలా విషయాలు, పోలీసుల పట్ల జరుగుతున్న అన్యాయాలు సరిగా చెప్పలేకపోయానేమో!

అసాంఘిక శక్తుల చేతిలో బలయిపోయిన నిజయితీ పోలీస్ ఆఫీసర్లు, కానిస్టేబుళ్ళ కుటుంబాలను, అనారోగ్యం తో కునారిల్లుతున్నవారిని, వారి కుటుంబాలను ఆదుకోవాలని, ప్రాణాలు కోల్పోయిన వారికి అంజలిఘటిస్తూ,చాలా అవసరంగా తొందరలో ఈ వ్యవస్థను పునరుద్ధరించుకుని, పోలీస్ ప్రజలకు స్నేహితులుగా ఉండే రోజు రావాలని, అమరవీరుల కుటుంబాలను ఆదుకోవాలని కోరుకుంటూ
స్వస్తి.

శర్మ కాలక్షేపంకబుర్లు-పోలిక.

Posted on అక్టోబర్ 14, 2012
8
పోలిక.

పోలిక చెప్పడం అన్నది పుట్టిన రోజునే ప్రారంభమవుతుందనుకుంటా. పుట్టిన బిడ్డ ఎర్రగా ఉందా, నల్లగా ఉందా దగ్గరనుంచి, కనుముక్కు తీరుని పోల్చేస్తారు, తల్లి, తండ్రి, అత్త, మామ, మామ్మ, తాత, అమ్మమ్మ, తాత వగైరాలతో. అదీగాక మనకో సామెత కూడా ఉంది “మేనమామ పోలిక మేనత్త చారిక” అని, ఒకరు తల్లి వైపువారు, మరొకరు తండ్రి వైపువారు. ఇంతే కాక దాని సమర్ధిస్తూ అమ్మాయికి మేనత్త పోలిక, అబ్బాయికి మేనమామ పోలిక, అమ్మాయికి తండ్రి పోలిక, అబ్బాయికి తల్లి పోలిక మంచిదంటారు. ఇదీగాక బుద్ధులలో, అలవాట్లలో పోలికలు చెబుతారు. మనకి ఈ సందర్భంగా రామాయణం లో ఒక సంగతి గుర్తొచ్చింది, చూడండి. కైక కోరిక ప్రకారం, దశరధుని ఆజ్ఞపై రాముడు అడవులకు వెళుతున్న సందర్భంలో దశరధుని రధసారధి సుమంత్రుడు కైకను నీకు తల్లిపోలిక వచ్చిందంటాడు. నీ తల్లి కూడా నీలాగే మీనాన్నని ఆపదలపాలు చేయబోయిందని దెప్పుతాడు.అదేమో చూద్దాం.

అభిజాతం హితే మన్యే యధా మాతు స్తధైవచ
న హి నింబాత్ స్రవేత్ క్షౌద్రం లోకే నిగదితం వచః….రామా.. అయోధ్య…సర్గ.35..శ్లో..17

వేపచెట్టునుంచి తేనె కారదు అట్లే నీ తల్లి స్వభావమే నీకునూ వచ్చింది అన్నాడు. మీ తల్లి మూర్ఖపు పట్టుదలగూర్చి మేము ఇదివరకే ఎరుగుదుము. ఒక యోగి మీతండ్రికి పశుపక్ష్యాది జంతువుల అరపులు, వాటి భావం తెలియగల వరం ప్రసాదించాడు. ఒకనాడు మీ తండ్రి తన పాన్పు దగ్గరలో ఒక జంట పక్షులు మాట్లాడుకునే సంభాషణ విని రెండు, మూడు సార్లు నవ్వేడు. తనను చూసి గేలి చేసి నవ్వుతున్నాడనుకుని మీ తల్లి బహు కోపించి, నవ్విన కారణం చెప్పమని కూచుంది. పక్షుల మాటలు విన్నాను, అది చెబితే నాకు మరణం సంభవిస్తుంది అని చెబుతాడు. అందుకు మీతల్లి నువ్వు బతికినా చచ్చినా సరే, నవ్విన కారణం చెప్పితీరాలని బలవంతం చేసింది, చెప్పకపోతే చస్తానని బెదిరించింది. అప్పుడు మీ తండ్రి, ఆ విద్య చెప్పిన యోగి వద్దకుపోయి విషయం చెబితే, సంభాషణ చెబితే నీకు మరణం తప్పదని చెప్పి, ఆమె బతికినా చచ్చినా, నీవు చెప్పవద్దని చెబుతాడు. నీ తండ్రి అలాగే చేశాడు. అందుకే అన్నారు,

సత్యశ్చాద్య ప్రవాదో యం లౌకికః ప్రతిభాతి మా
పితౄన్ సమనుజాయంతే నరా మాతరమంగనాః …రామా..అయో..సర్గ 35…శ్లో…36

తండ్రుల లక్షణములను కొడుకులు, తల్లి లక్షణములు కుమార్తెలు కలిగి ఉంటారనేలోకోక్తి నిజమవుతూ ఉంది నీ పట్ల, అన్నాడు. దీన్ని బట్టి మరొకటి కూడా తెలుస్తోంది కదా, ఏ విషయమైనా “అతి చేస్తే గతి చెడుతుందని” సామెత.

పోలిక కొస్తే పుట్టినప్పటినుంచి మొదలే కదా. ఆ తరవాత “వాళ్ళ బాబు ముందు ఆమ్ము తినేస్తున్నాడు నువ్వూ తినెయ్యాలి” తో మొదలు. “వారి అబ్బాయి/అమ్మాయి బళ్ళోకి ఏడవకుండా వెళ్తోంది నువ్వూ వెళ్ళాలి”. “పక్కింటి వారబ్బాయికి ఫస్టు మార్కొచ్చిందిట నువ్వేందుకూ పనికిరావు,” ఇక్కడినుంచి పోలికతో కించపరచడం ప్రారంభవుతూంది. “ఎదురింటివారమ్మాయి చూడు, ఏదడిగితే అది చెప్పేస్తుంది, గడగడా, వెనకింటి వారమ్మాయిని ఎవరో చూసి, వచ్చి పిల్ల తెలివి మెచ్చుకుని పెళ్ళి చేసుకుంటామన్నారట. వీళ్ళకీ నచ్చిందిట, పెళ్ళిట. మనతింగరిబుచ్చీ ఉంది, ఎందుకూ.” “వాళ్ళబ్బాయికి అమెరికా ఛాన్స్ వచ్చిందిట”. ఇలా పోలికలతో నిత్యం సతాయిస్తూ ఉంటే, ఇబ్బందులే కనపడుతున్నాయి.

ఇలా పోలికలేకాక, తిట్టడానికి కూడా పోలిక చెబుతారు మనవాళ్ళు. “నీ దంతా మీ తాత పోలికే వెధవా! వెధవ బుద్ధులూ నువ్వూను” అని కొడుకును తిడుతుంది కోడలు, మామగారిని తిన్నగా తిట్టలేక. అలాగే ఆడపిల్లను, “అంతా మేనత్తపోలికే వెధవ బుద్ధులెక్కడికిపోతాయి, వెధవ సామాచికం” అంటూ, కూతుర్ని తిడుతున్నట్లు, ఆడపడుచును తిడుతుంది.. ఇది భార్య భర్తలలో ఒకరిని ఒకరు సాధించుకోడానికి కూడా ఆయుధంలా పనికొస్తుందనమాట. ఆవిడ అమ్మాయిని మేనత్త పోలికని, కూతుర్ని తిడుతుంది, ఆయనని సాధించాలని, ఆయన “అన్నీ మేనమామ పోలికలే వెధవా, ఎందుకూ పనికిరావు” అని తిడతాడు, ఆమెను కవ్వించడానికి. ఇలా తిట్లు తినేవారు కూడా పైవారయి ఉండరు, మేనమామో, మేనత్తో, తాతో, అమ్మమ్మో, మామ్మో అయివుంటారు.

సంసారంలో భార్య భర్తలు ఇతరులతో పోలిక సంభాషణ అసలు పనికిరాదని నా అభిప్రాయం. “పక్కింటాయన చూడండి వాళ్ళ వైభోగం చూడండి, మీరిద్దరూ ఒకే ఆఫీసులో ఒకే ఉద్యోగం చేస్తున్నారు ఎందుకూ”, అందనుకోండి భార్య, పాపం ఆమె ఆ పక్కింటాయన ఏదో రోజు ఉదయమే శ్రీ కృష్ణజన్మస్థానానికి కూడా అంత దర్జాగానే తీసుకెళ్ళబడతాడన్నది విస్మరిస్తుంది. “ఎదురింటావిడ చూడు, ఎంత అందంగా అలంకరించుకుంటుందో, ఎంత సోషల్ గా ఉంటుందో, నువ్వూ ఉన్నావు పేడ తట్టలాగ” అని భార్యను ఈసడించేవారు చాలా విషయాలను విస్మరిస్తున్నట్లే, పై చూపు చూస్తున్నట్లే.. ఎవరి అందం, తెలివి, వైభవం, ధనం, అనుభవం, కర్మ వారిదే. మరొకరితో పోలిక కుదరనే కుదరదు, అనవసరం కూడా..

ఈ మధ్య ఆఫీసుల్లో కూడా ఇలా పోలికలు చెబుతున్నట్లుంది, పని దగ్గర. తస్మాత్ జాగ్రత, ఇది ఎదుటివారిని కించపరచడమే అవుతుంది..

చిన్నపిల్లలను మరొకరితో పోల్చవద్దంటున్నారు, తెలిసినవారు, మనస్తత్వ వేత్తలు . ఇది పిల్లలలో అనేక రకాలైన మానసిక ఇబ్బందులకు దారితీస్తోందట. పెద్దవారిలోనైనా ఈ పోలిక చెప్పటం మూలంగా కించపరచే పరిస్థితులను తేవడం మంచిదే కాదు. భార్యా భర్తలు మరెవరితోనూ పోల్చుకోవద్దు, మీరెవరికీ పోలికకాదు. ఎవరితో పోల్చినా బాధపడనివారున్నారు మనదేశంలో,వారెవరో మీకూ తెలిసిపోయిందీపాటికి :). మన నాయకులు విదేశాలతో పోల్చి ముక్కుపిండి పన్నులు మాత్రం వసూలు చేస్తున్నారు, సౌకర్యాలకల్పన మాత్రం పోల్చరు, అది దేవుడెరుగు.

శర్మ కాలక్షేపంకబుర్లు-ఉత్తరాలు

Posted on అక్టోబర్ 13, 2012
8
ఉత్తరాలు

మొదటి పుట్టిన రోజయిపోయిన తరవాత పదిహేను రోజులకి కాని బ్లాగు కేసి రాలేదు, మెయిళ్ళూ చూడలేదు. చాలా ఉన్నాయి. చూడగా అందులో ఒక తెంగ్లీష్ లో ఉన్న ఒక ఉత్తరం కనపడింది, అది ఇలా ఉంది, ఎవరబ్బా అని చూడబోతే

“డియర్ తాతగారు,

నేను ఎప్పుడు మీ బ్లోగ్ లో అన్ని పోస్ట్స్ చదివి ఆనందించటం తప్ప ఎప్పుడు కామెంట్ చేయలేదు..

నాకు తాతగారు లేని లోటు తీర్చారు మీరు..మా తాతయ్య ఉంటె ఇలాంటివే బోలెడు కబుర్లు చెప్పేవారు ఏమో..

తెల్లని పంచె కట్టుకుని… వాలు కుర్చీ లో కూర్చుని మీరు కబుర్లు చెప్తూంటే, నేను పక్కనే ఉన్న ఎత్తు గడప మీద కూర్చుని ఊ కొడుతున్నట్టు ఉంటుంది మీ పోస్ట్ చదివినప్పుడల్లా

కీప్ రైయిటింగ్ తాతగారు 🙂

హేపీ బర్త్ డే టు యువర్ బ్లోగ్ 🙂
బెస్ట్ విషెస్
సారీ తెలుగు లో రాయకుండా… మీకుచదవటానికి కష్టం కలిగించాను..”

తెంగ్లీష్ లో ఉన్న ఉత్తరాన్ని చదవటానికి వీలుగా మార్పు చేశాను. ప్రపంచంలో ఏదో మూలనుంచి నాకు ఉత్తరం రాసిన మనవరాలికి ఆశీర్వచనాలు చెబుతూ, పేరు కావాలని నేనే తీసేశాను, మనవరాలు ఏమీ అనుకోదనే ధైర్యంతో. ఈ ఉత్తరం ఏ సమయంలో వచ్చిందంటే, అంతకు ముందు మెయిళ్ళొక సారి చూసి, బ్లాగ్ లోకెళ్ళి పాస్ వర్డ్ మార్చేసి మళ్ళీ బ్లాగ్ తెరుచుకోకుండా చేద్దామని ఉద్దేశంతో బయలుదేరేను, అప్పుడు కనపడిందీ ఉత్తరం, “అమ్మయ్య! పది రోజులు దాటిందికదా మనల్ని మరిచిపోయారులే” అనుకున్న సమయమనమాట. ఉత్తరానికి జావాబివ్వాలి కదా! దురద ఊరుకోలేదు.

చిరంజీవి సౌభాగ్యవతి మనవరాలు…….ని దీర్ఘసుమంగళిగా అశీర్వదిస్తూ తాత రాసేది.
ఉభయకుశలోపరి.

నీ ఉత్తరం చూశాను. ఆనందాశ్చర్యాలలో ములిగి తేలేను, ఎందుకంటే ఇంకా నన్నెవరో గుర్తుపెట్టుకున్నందుకు, ఉన్న అభిమానాన్ని వ్యక్తం చేయాలి బుల్లి తల్లీ!. నీవు భూ గోళం మీద ఏ మూల ఉన్నా క్షేమ, స్థైర్య, విజయ, అభయ, ఆయు, ఆరోగ్య, ఐశ్వర్యాలతో పిల్లా పాపలతో వర్ధిల్లుతూ తెనుగు మరిచిపోకుండా, పిల్లా పాపలకి కూడా తెనుగు చెబుతూ, చదివిస్తూ ఉండాలని కోరుకుంటూ, అశీర్వచనాలు. తెల్లని పంచ కట్టుకుని వాలు కుర్చీలో కూచుని మీరు కబుర్లు చెప్తూంటే, నేను పక్కనే ఎత్తు గడప మీద కూర్చుని,కదా అన్నావు. చిట్టి తల్లీ! ఇలా అనుకుంటే ఎలా ఉంటుందో ఒక సారి ఊహించు. ” తెల్లని పంచ కట్టుకుని వాలు కుర్చీలో కూచుని మీరు కబుర్లు చెబుతూ ఉంటే, నేను పక్కనే ఉన్న ఎత్తు గడప దగ్గరున్న ముక్కాలిపీట మీద అప్పుడే కోసి తెచ్చుకున్న బొండు మల్లెలు వడిలో వేసుకుని కూచుని, దండ కట్టుకుంటూ, మీ కబుర్లు వింటూ, ఊ కొడుతూ, కళ్ళు వీధికేసి చూస్తూ ఉంటే మీరు “పిచ్చితల్లీ! ఎందుకే ఆ ఎదురు చూపు వాకిలిదాకా వచ్చిన నీ మగడు లోనికి రాడుటే?” అంటే, “తాతా! నువ్వెప్పుడూ ఇంతే! నేనేం ఆయన కోసం ఎదురు చూడటం లేదు తెలుసా, నన్నూరికే ఉడికిస్తావు.” అంటూ ఉండగా, మీ ఆయనొస్తే, సంభ్రమంగా నువ్వు ఒక్క ఉదుటున లేస్తే, నీ వడిలోని మల్లెలు అతనికి స్వాగతం చెబుతున్నట్లు ఎగిరి నెత్తిన పడితే,”రా బాబూ అంతా బాగున్నారా” అని నేను పలకరిస్తూ ఉంటే, నువ్వు లోపలికి తుర్రుమని పారిపోయి మంచినీళ్ళ గ్లాసుతో వస్తూ ఉంటే, “ఏంటే! ఆ కంగారూ? నెమ్మది” అని మీ అమ్మమ్మ అంటూ నీ వెనక వస్తే, నీ భర్తని చూసిన మీ అమ్మమ్మ “అంతా బాగున్నారా నాయనా” అని అడుగుతూ ఉంటే, “అంతా కులాసా అండి” అని నువ్వు ఖాళీ చేసిన ముక్కలి పీట మీద కూచుని, నువ్విచ్చిన మంచి నీళ్ళు తాగి నీకు కళ్ళ ద్వారా సంకేతం పంపుతూ ఉంటే, “లోపలికి తీసుకెళ్ళమ్మా” అని మేమిద్దరం అంటే మీరిద్దరూ లోపలికెళితే…” ఓహ్! ఆనందం, బ్రహ్మానందం, అనుభవించాలి.

మరొక మాట గడప మీద కూచోకూడదురా బంగారుతల్లీ! గడప లక్ష్మీదేవికదా, పసుపురాసి బొట్టుపెడతాం కదా, గడపకి కాలు కూడా తగలనివ్వం కదూ,మరిచిపోయావా, అదనమాట. జవాబు రాస్తావు కదూ! అందరినీ అడిగేనని చెప్పు.
తాత.”

బ్రహ్మశ్రీ వేదమూర్తులయిన తాత/నాన్న/పెదనాన్న/బాబయ్య/మామయ్య గారికి మనవడు/కుమారుడు.. నమస్కరిస్తూ వ్రాసేది. ఉభయకుశలోపరి….. ఆడవారికయితే మహలక్ష్మి సమానురాలయిన మామ్మ/అమ్మమ్మ/అమ్మ/అత్త/వదిన గారికి మనవరాలు/మనవడు/ …నమస్కరించి వ్రాసేది. పెద్ద వాళ్ళు పిల్లలికి రాసేటపుడు చిరంజీవి….ని చిరాయురస్తుగా అశీర్వదిస్తూతాత/మామ్మ/అమ్మమ్మ//……వ్రాసేది. పూర్వసువాసినులకయితే గంగాభగీరధీ సమానురాలయిన….గారికి నమస్కరిస్తూ……వ్రాసేది.ఆడవారికయితే చిరంజీవి సౌభాగ్యవతి…ని దీర్ఘసుమంగళిగా అశీర్వదిస్తూ….వ్రాసేది… ఇలా ఉండేవి పాతకాలం ఉత్తరాలు. “ఇప్పుడు ఉత్తరమే లేదూ అంటూ” ఉంటే నా ఇల్లాలు, “ఉత్తరాలెక్కడుంటాయ్! మీరు చేసిన నిరవాకానికి” అంది. “అదేంటోయ్! ఉరుము ఉరిమి మంగలం మీద పడిందని నా మీద పడ్డావ”న్నా. “అవును, మీరు పని కట్టుకుని ఫోన్ లో అని అంగడిలో పెట్టి ఇచ్చేసేరు, అప్పుడు సగం మంది ఉత్తరం రాయడం మరిచేరు. మీతరవాత వాళ్ళు సెల్ ఫోన్ లో అని జంగిడిలో పెట్టి సిమ్ము కార్డులమ్ముతున్నారు. ఇంక ఉత్తరం రాసేవాళ్ళెవరూ? ఉత్తరం రాయడం మరిచిపోయారు. ఎవరి దగ్గర చూసినా సెల్లు, అదేమో చెవిదగ్గరే. లేకపోతే అవ్వేవో ప్లగ్గులు. ఎవరి మాట వింటున్నారూ. తప్పు మీదే అంది”..నిజమేనేమో…..అపరాధిని నేనేనా?

పాత రొజుల్లో భార్యాభర్తలు ఉత్తరాలు రాసుకునేవారు, వాట్ని తరవాత రోజులలో చదువుకుని ఆనందించేవారు కూడా, ఇప్పుడు ఉత్తరం రాసే ఓపికేదీ? మెయిల్లో ఎస్.ఎమ్.ఎస్ భాషలో ఉత్తరాలు నడుస్తున్నట్లుంది, వారి మధ్య.