శర్మ కాలక్షేపంకబుర్లు-ధైర్యం

Posted on ఆగస్ట్ 1, 2012
10
ధైర్యం.

ధైర్యం ఒక మానసిక స్థితి. ఆహార,నిద్రా, భయ, మైధునాలు సర్వజీవులకు సమానం అన్నారు కాని, ధైర్యం అలా చెప్పలేదు. ఇది ఎవరిమటుకువారు సంగ్రహించుకోవలసినదే, సంతరించుకోవలసినదే.. ధైర్యం అంటే భారతంలో ఒక కష్ట సంఘటనల సమాహారం, దాన్ని పాండవులు, ప్రత్యేకంగా అర్జునుడు గడిచిన విధం చూద్దాం.

పది రోజుల యుద్ధం తరవాత భీష్ముడు పడిపోయాడు. ఆ తరవాత దుర్యోధనుడు ద్రోణాచార్యునికి సర్వసైన్యాద్యక్ష పదవి ఇచ్చాడు..ఈ సందర్భం లో ద్రోణుడు ఒక వరం కోరుకోమన్నాడు, దుర్యోధనుడుని. అందుకు దుర్యోధనుడు తన మంత్రాంగం తో ఆలోచించి ధర్మరాజుని సజీవంగా పట్టి అప్పగించమంటాడు. దానికి ద్రోణుడు సరేనంటాడు, కాని కారణం అడుగుతాడు.ఆ కారణం చెప్పాలంటే మరొక టపా తప్పదు మరొకసారి చెప్పుకుందాం. ఒక రోజు యుద్ధం జరుగుతుంది. ఆ రోజు రాత్రి ద్రోణుడు, అర్జునుడు రణరంగంలో ఉన్నంత కాలం ధర్మరాజును బంధించలేమని, అందుకుగాను అర్జునుని యుద్ధానికి సంశప్తకులచే పిలిపించి, అతనిని యుద్ధ రంగానికి దూరం చేస్తే, నేను మిగిలిన కార్యం పూర్తిచేస్తానని చెబుతాడు. అర్జునుని ప్రతిజ్ఞ ప్రకారం యుద్ధానికి పిలిచినవారితో యుద్ధం చేయడం వ్రతం, దానిని నిర్వహించడానికి వెళుతున్నానని ధర్మరాజుకు చెప్పి మరీ వెళతాడు. అప్పుడు ద్రోణాచార్యులవారు పద్మవ్యూహం పన్నుతారు. దీనిని ఛేదించగలవారెవరంటే, అర్జునుడు, అతను దగ్గరలో లేడు. అభిమన్యుడు, నేను పద్మవ్యూహం లో ప్రవేశించగలను కాని తిరిగిరాలేనంటే, నువ్వు ముందు చొచ్చుకుపోతే, వెనక మేము నలుగురమూ తోడు వస్తామని ధర్మరాజు చెప్పి ఒప్పించి, అభిమన్యుని యుద్ధానికి, పద్మ వ్యూహ ఛేదనకు పంపుతాడు. వెనక ధర్మరాజు, భీముడు, నకుల సహదేవులు వెళతారు. వీరిని ఒక రోజు నిలువరించగల వరమున్న సైంధవుడు వీరితో యుద్ధానికి దిగుతాడు. వ్యూహం లోపలికెళ్ళిన అభిమన్యునికి వీరి సహాయం అందదు. అయినా వీరోచితంగా పోరాడి, లక్ష్మణకుమారుణ్ణి చంపి, కౌరవుల వ్యూహానికి హతుడైపోతాడు. యుద్ధరంగంనుంచి తిరిగి వచ్చిన అర్జునునికి అభిమన్యుడు హతుడయ్యాడని తెలుస్తుంది, ధర్మరాజు ద్వారా. వీరిని నిలువరించిన సైంధవుడి తల రేపు సూర్యుడు అస్తమించే లోపు తరుగుతానని, లేకపోతే, గాండివ సహితంగా అగ్నిప్రవేశం చేస్తానని శపధం చేస్తాడు. కౌరవులు, ఒక రోజు సైంధవుడిని కాచుకుంటే యుద్ధమయిపోయినట్లేనని తలచి సైంధవుని వెనకపెట్టి యుద్ధం చేస్తారు. అర్జునుడు చాలా భాగం ఛేదించుకు వెళ్ళేడు కాని సైంధవుడు దొరికేలా లేడు, అప్పుడు సూర్యునికి కృష్ణుడు చక్రం అడ్డువేస్తాడు. సూర్యాస్తమయిందనుకుని, అర్జునుడు గాండివసహితంగా అగ్ని ప్రవేశానికి సిద్ధమవుతూ ఉండగా సైంధవుడు కనపడతాడు. కృష్ణుడు చక్రం అడ్డుతొలగించి, సూర్యుడిని, సైంధవుడిని చూపితే ఒక బాణంతో సైంధవుని తల తరుగుతాడు. అప్పుడు కృష్ణుడు, ఆ తలని కింద పడకుండా ఉంచి శ్యమంత పంచకంలో తపస్సు చేసుకుంటున్న సైంధవుని తండ్రి వృద్ధ శ్రవసుని చేతులలో ఈ తల పడేలా కొట్టించాడు, పాశుపతాస్త్రంతో . సైంధవుని తలను తండ్రి కింద పడవేయగా, తానిచ్చిన శాపం తనకే తగిలి తల వేయి చెక్కలై మరణిస్తాడు. అర్జునుని కష్టాలు తొలగుతాయి, కాని కొడుకు మరణం బాధిస్తుంది.కృష్ణుడు స్వప్నంలో స్వర్గానికి తీసుకెళ్ళి నిజం తెలియ చేస్తాడు.

ఎన్ని వరుస కష్టాలు, పద్మవ్యూహంలో కొడుకు మరణం, తరవాత శపధం. ఇన్ని వరుస కష్టాలయితే, మరొకరయితే కూలబడేవారే కాని, అన్నిటిని అర్జునుడు పరమాత్మ ఉన్నాడన్న ధైర్యంతో ఎదుర్కున్నాడు, నమ్మకంతో,తనపని తను చేశాడు,పరమాత్మ తోడయ్యారు, అంతెందుకు యుద్ధానికి ముందు అర్జునుడు, ఇంతమంది చుట్టాలు, స్నేహితులను చంపి రాజ్యం అనే నెత్తుటికూడు తినలేనని, ధైర్యం కోల్పోతాడు. పరమాత్మ దానికి సమాధానంగా గీతోపదేశం చేశారు.

నేటి కాలానికి “ధైర్యే సాహసే లక్ష్మీ” అని ఉవాచ. ధైర్యాన్ని కూడా అష్ట లక్ష్ములలో ఒకరుగా చెప్పేరు. “ఆపదలందు ధైర్యగుణమంచిత సంపదలందు తాల్మియున్…….సజ్జనాళికిన్” అన్నారు భర్తృహరి. ఏమో! సంపదలైతే లేవుగాని ధైర్యానికి,ఆపదలకీ కొదువలేదు. వెధవ పనులు చేయడానికి ధైర్యం అక్కరలేదు, మూర్ఖత్వం ఉంటే చాలు,పిచ్చి పనులు చేయడం ధైర్యం కాదు. వివేకంతో కూడిన చొరవను ధైర్యం అంటాం. “రజ్జు సర్ప భ్రాంతి” అని మనకి సామెత ఉంది. చీకటిలో తాడును చూసి పామనుకుని భయపడతాం. దానినే వెలుగులో తాడుగా గుర్తించి ధైర్యం పొందుతాం. అంటే అజ్ఞానం పోతే మిగిలేది జ్ఞానమనే వెలుగు, అదే ధైర్యం. కావలసినవారు హాస్పిటల్ లో ఉన్నారు, చూడటానికి వెళ్ళేము, “అబ్బే! మీకొచ్చిన వ్యాధి చిన్నది, తొందరగా మీరు బాగుంటారనాలి కాని అబ్బే! ఇలాగే ఒకరికి ఈ వ్యాధివచ్చి పోయారని చెప్పకూడదు” కదా. అమ్మాయి విదేశాలలో చదువుకోడానికి సీటొచ్చింది. కావలసినవారని చెబితే “ఆడపిల్ల ఒకతీ అంత దూరం వెళ్ళగలదా? అక్కడ నాలుగేళ్ళుండి చదువుకోగలదా? రోజూ వింటున్న,చూస్తున్న, సంగతులు చూసి, ఆడపిల్లకంత చదువెందుకండీ!” అంటే వీరిని అపశకున పక్షులుగా గుర్తించాలి, అసూయ కూడా వీరిచేత ఇటువంటి పలుకులు పలికిస్తుంది. “నాకేం భయం లేదు, జాగ్రత్తగా చదువుకోగలను”అన్న చిన్న పిల్లకు అధైర్యం నూరిపోయడాన్ని ఏమంటారు? వీరి నోటి వెంటెపుడూ మంచి మాట రాదు. ఒంటి ఊపిరి పిల్ల కనక, జాగ్రత్త చెప్పడం వేరు. బిడ్డను క్షేమంగా ప్రసవిస్తాననే ధైర్యం లేకపోతే, స్త్రీ తన జీవితాన్ని పణంగా పెట్టి గర్భం ధరించగలదా? నడవగలమన్న ధైర్యం లేకపోతే ఒక అడుగు కూడా పడదు. నడవలేననుకుంటే మరి లేవలేనుకదా! ధైర్యం అవసరం, ప్రతి పనికి ఇంతే, చేయగలమా! అనే అధైర్యం, భయం ముందు వస్తాయి,వాటిని అధిగమించాలి, అప్పుడే విజయం మనది.

మొన్నను హేమగారు,మా అమ్మాయి జ్యోతిర్మయి మీతో మాటాడితేనే ధైర్యం వచ్చేస్తుంది, మీటపా చదివితే మరి చెప్పాలా అన్నారు, మరి ఆధైర్యంతోనే రాసేస్తున్నా. 🙂

రచయిత: kastephale

A retired telecom engineer.